Kala Venkata Rao
-
ఆయనను కలవాలంటే ముందు ఆరుగురిని కలవాలట!
చీపురుపల్లి: వాస్తవంగా ఆయన వలస నేత. ఆయన ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా సొంత ఇల్లు ఉండదు. ఆఫీసు ఉండదు. ఆయనను అనుచరులూ నమ్మరు. ఎన్నికల వేళ ఉపయోగించుకోవడమే తప్ప... ఆపద వేళ ఆదుకోవడం ఆయనకు తెలియదు. ఆర్థికంగా కుంగిపోయినా రూపాయి సాయం చేసే గుణం లేదు. నాలుగు దశాబ్దాల సీనియారిటీ ఉందని చెప్పుకునే ఆయనకు ఆ నియోజకవర్గంలో కనీసం అద్దెకు ఇల్లు కూడా తీసుకోరు. ఎన్నికల ప్రచారంలో తిరగడం, తీరా గెలిచినా, ఓడినా సరే విశాఖ, విజయవాడ, హైదరాబాద్‌లలో గడపడం ఆయనకు అలవాటు. ఓటమి చెందితే ఎలాగూ కనిపించని ఆ సీనియర్ నేత గెలిచినా సరే ప్రజలు ఎలా ఉన్నారో, నియోజకవర్గం అభివృద్ధి ఏమిటో కనీసం పట్టించుకోరంటూ ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన టీడీపీ శ్రేణులు చెప్పేమాటలతో చీపురుపల్లిలోని పార్టీ శ్రేణుల్లో గుబులు రేగుతోంది. పార్టీ శ్రేణుల్లో ‘కళ’ తప్పింది. ఓటమి ఖాయమని తెలిసినా కొద్దిమంది నాయకులు ఆయన వెంట నడుస్తున్నారు. ఆయన తీరు తెలిసి నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. 2014లో ఎచ్చెర్లలో గెలుపొంది, మంత్రి పదవి అలంకరించి ఆ నియోజకవర్గానికి ఏమైనా చేశారా అంటే అక్కడి ప్రజలు సున్నా సింబల్ చూపిస్తున్న దుస్థితి. దీంతో ఆయన నాయకత్వాన్ని 2019లో అక్కడి ప్రజలు తిరస్కరించారు. ఓటమి చెందాక ఐదేళ్లు ఆ నియోజకవర్గ ప్రజలకు కనీసం ముఖం కూడా చూపించలేదట. ఆ వలసనేత తీరు ఇప్పుడు చీపురుపల్లి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. సొంత కుటుంబ సభ్యులకే వెన్నుపోటు పొడిచే నైజం ఉన్న నాయకుడు ఇప్పుడు ప్రజలను ఏం ఉద్దరిస్తాడన్న చర్చ రచ్చబండలపై సాగుతోంది.అంతా పీఏ కన్నుసన్నల్లోనే...నలభై ఏళ్లు సీనియారిటీ ఉన్న ఆయన ప్రజలకు ఎలాగూ ముఖం చూపించరు సరికదా.. గ్రామ, మండల స్థాయిలో పార్టీ క్యాడర్‌నూ కలవరట. ఏదైనా కష్ట, సుఖాలు చెప్పుకోవాలన్నా, అభివృద్ధి కోసం మాట్లాడాలన్నా సరే ఆయన అపాయింట్మెంట్ ఉండదట. పార్టీ క్యాడరైనా, నాయకులైనా ఎవరైనా సరే పీఏగా ఉన్న వెంకటేశ్వరస్వామిని కలుసుకుని తమ గోడు వెల్లబోసుకుని అక్కడ నుంచి వెళ్లిపోవాల్సిందే. ప్రస్తుతం కొత్త నియోజకవర్గమైన చీపురుపల్లిలో కూడా అదే పరిస్థితి క్యాడర్‌కు ఎదురవుతోందనే చర్చ ఆ పార్టీ సోషల్ మీడియా గ్రూపుల్లోనే సాగుతుండం గమనార్హం. ఇంకా ఎన్నికలు జరగలేదు, గెలుపు, ఓటములు సంగతి పక్కన పెడితే ప్రస్తుతం కూడా క్యాడర్‌తో ఆయన మాట్లాడే పరిస్థితి లేదని, పీఏతోనే ప్రతీ విషయం చెప్పుకోవాల్సి వస్తోందని నాయకులు తలలు పట్టుకుంటున్నారు. అందుకనే ఆ సీనియర్ ఏ నియోజకవర్గం వదిలి వెళ్లిపోయినా అక్కడ క్యాడర్ అంతా పండగ చేసుకుంటారని టీడీపీ వర్గీయుల్లోనే చర్చ జరుగుతోంది. -
ఆకట్టుకోని పురాణం అతకని అబద్ధం
చీపురుపల్లి: అబద్ధం ఆడితే అతికినట్లు..పురాణం చెప్తే ఆకట్టుకునేలా ఉండాలంటారు. ఇదే తరహాలో ఎన్నికల ప్రచారంలో శతవిధాలా ప్రయత్నిస్తున్న చీపురుపల్లి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీకి చెందిన కళా వెంకటరావు తీరును చూస్తూ ఆయన చెబుతున్న అబద్ధాలు వింటూ సొంత పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు నవ్వుకుంటున్నారు. నోటికొచ్చిన అబద్ధం చెప్పడం ప్రజలను మోసం చేసి మభ్యపెట్టడం టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య అనుకుంటారు అంతా. ఎందుకంటే సాక్షాత్తు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడే పూటకో అబద్ధం, రోజుకో మోసం అనే చందాన తొలి నుంచి రాజకీయాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన్నే ఆదర్శంగా తీసుకుంటున్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ఉన్న ఆ పార్టీ నేతలు మన బాస్ ఇష్టారాజ్యం అబద్ధాలు చెబుతున్నప్పుడు మనం చెప్తే ఏముందిలే అనుకుంటున్నారేమో గాని చంద్రబాబునే డిటోగా ఫాలో అయిపోతున్నారు. అందులో భాగంగానే చీపురుపల్లి కూటమి అభ్యర్థిగా కొత్తగా నియోజకవర్గానికి వచ్చిన కిమిడి కళా వెంకటరావు కూడా మద్యపాన నిషేధం, డ్వాక్రా రుణమాఫీ, తోటపల్లి సాగునీటి కాలువ కోసం అబద్ధాలే ప్రచార అస్త్రాలుగా ప్రతి రోజూ ప్రజలను మభ్యపెట్టే ప్రక్రియ ప్రారంభించారని స్థానికంగా చర్చ జరుగుతోంది. అసలు ఇక్కడి ప్రజలకు ఏమీ తెలియదన్నట్లు, రెండు దశాబ్దాల క్రితంలో మాదిరిగా ఏం చెప్పినా పర్లేదునుకుంటున్నారేమో గానీ మరీ అబద్ధాలు చెప్పేస్తున్నారని సొంత పార్టీ కార్యకర్తలే చెవులు కొరుక్కుంటున్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా ఎంతో విజ్ఞత కలిగిన ఓటర్లు ఉన్న చీపురుపల్లిలో ఇలాంటి పుక్కిటి పురాణాలు ఎవరూ నమ్మరని టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నట్లు సమాచారం. మద్యపాన నిషేధం ఎత్తేసి, మంచి లిక్కర్ ఇస్తామంటూ.. పేదలకు మద్యం దూరం చేయాలన్న లక్ష్యంతో టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం విధించారు. ఆ తరువాత ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కుని ము ఖ్యమంత్రి అయిన చంద్రబాబు మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసిన సంగతి అందరికీ గుర్తుంది. మూడుశాబ్దాల క్రితం నుంచి మద్యం తాగించి పేదల ప్రాణాలు తోడేస్తున్నది చంద్రబాబేనని మద్యపాన నిషేదం కోసం మాట్లాడే అర్హత బాబుకు ఎక్కడుందంటూ చర్చ జరుగుతోంది. అంతేకాకుండా మరొకడుగు ముందుకేసి గత కొంతకాలంగా నాణ్యమైన లిక్కర్ ఇస్తానని చంద్రబాబు బహిరంగ సభల్లో ప్రకటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మద్యంలో కూడా మంచి, చెడు రకాలు ఉన్నాయా అంటూ కొత్త అర్థాన్ని తీసుకొచ్చిన చంద్రబాబు మరోవైపు మద్యపాన నిషేధం కోసం మాట్లాడుతుండడం, ఆ విషయాన్ని ఇక్కడ కళా వెంకటరావు ప్రజలపై రుద్దేందుకు చేస్తున్న కృషి చూస్తుంటే విడ్డూరంగా ఉందని అంతా అనుకుంటున్నారు. వైఎస్సార్ హయాంలోనే తోటపల్లి సాకారం.. తోటపల్లి కోసం టీడీపీ నేతలు చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. తోటపల్లి ప్రాజెక్టు కోసం కేటాయించిన నిధులను చంద్రబాబు పక్కదోవ పట్టించి ప్రాజెక్టు పనులు నిలిపివేశారు. అదే 2004లో అధికారంలోకి వచ్చిన దివంగత మహానేత వైఎస్సార్ రూ.400 కోట్లు నిధులు కేటాయించి పనులు ప్రారంభించిన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేసుకోవాలని రైతులు అంటున్నారు. 2009లో మహానేత మరణ సమయానికి 90 శాతం పనులు కూడా పూర్తయిన సంగతి అందరికీ తెలిసిందే. మహిళలను మోసం చేసింది చంద్రబాబు.. మహిళలను జగన్మోహన్రెడ్డి మోసం చేశాడని టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న నేపథ్యంలో మహిళలను మోసం చేసింది చంద్రబాబు కదా అంటూ నవ్వుకుంటున్నారు. 2014 ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, అప్పులు తీర్చొద్దని మహిళలకు మాట ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక రుణమాఫీ ఊసెత్తని చంద్రబాబు మహిళలను మోసం చేశాడు. అదే 2019 ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగు విడతల్లో మహిళల రుణాలను పూర్తిస్థాయిలో వారి ఖాతాల్లోనే జమ చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. -
‘నా టికెట్‌ను తన్నుకుపోయారు’.. కిమిడి నాగార్జున కన్నీళ్లు
సాక్షి, విజయనగరం: చీపురుపల్లి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. చీపురుపల్లి టికెట్ ఆశించి కిమిడి నాగార్జున భంగపడ్డారు. పెద్దనాన్న కళా వెంకట్రావుకు చాలా అవకాశాలు ఉన్నాయని.. అయిన సరే తన టికెట్‌ను తన్నుకుపోయారంటూ చీపురుపల్లి క్యాడర్ వద్ద కన్నీటి పర్యంతం అయ్యారు. తన జీవితం చెడిందని.. యువత ఎవరూ రాజకీయాల్లోకి రావద్దంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు మాటలు నమ్మి విదేశాల్లో ఉద్యోగం వదులుకొని వచ్చేసి 2019 ఎన్నికల్లో పోటీచేసిన కళా వెంకటరావు సోదరుడి కుమారుడు నాగార్జునకు ఓటమి తప్పలేదు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఉమ్మడి విజయనగరం జిల్లాలో తుడిచిపెట్టుకుపోయింది. అలాంటి పరిస్థితుల్లో జిల్లాలో పార్టీ బాధ్యతలు తీసుకోవడానికి సీనియర్ నాయకుడు అశోక్ గజపతిరాజు సహా ఎవ్వరూ ముందుకురాన్నప్పుడు నాగార్జున భుజానికెత్తుకున్నారు. ఐదేళ్లూ అడపాదడపా కార్యక్రమాలతో టీడీపీ ఉనికి చాటుతూ వచ్చారు. ఈసారి చీపురుపల్లి నుంచి పోటీచేయాలని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ చంద్రబాబు ఆయన్ను కరివేపాకులా తీసిపడేశారు. తనను నమ్మించి గొంతు కోశారని, నిలువునా మోసం చేశారని నాగార్జున లబోదిబోమంటున్నారు. -
పాపం.. కళావెంకటరావు!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీలో సీనియర్ నాయకుడు కిమిడి కళావెంకటరావు పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో మంత్రిగా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒకప్పుడు చక్రం తిప్పింది ఆయనేనా? అనే సందేహం కళా అనుచరులను వెంటాడుతోంది ఇప్పుడు! గ్రామస్థాయి నాయకుడైన నడికుదిటి ఈశ్వరరావు (ఎన్ఈఆర్) టీడీపీ నుంచి బీజేపీలోకి ఫిరాయించి మరీ ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి టికెట్‌ను తన్నుకుపోయారు. అతనికి ఇప్పించేందుకు చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆడిన రాజకీయ వైకుంఠపాళిలో కళా పావుగా మారిపోయారని ‘సాక్షి’ ఇప్పటికే వెలుగులోకి తెచ్చింది. ఆఖరి నిమిషంలో కళా తేరుకొని హైదరాబాద్, విజయవాడ మధ్య చక్కర్లు కొట్టినా వ్యయప్రయాసలు మాత్రమే మిగిలాయి. ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా ఈశ్వరరావు పేరును బీజేపీ బుధవారం ప్రకటించింది. తూర్పు కాపు (బీసీ) సామాజికవర్గ ప్రాబల్యం ఉన్న నియోజకవర్గంలో ‘కమ్మ’ని వ్యూహం ఫలించింది. టీడీపీలో మరో సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావు వద్దు వద్దంటున్న చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఒక్కటే కళావెంకటరావు ముందు కనిపిస్తోంది. కుటుంబ హెచ్చరికలను బేఖాతరు చేసి అక్కడికి వెళ్తారా అనేదీ సందేహమే. ఇక మిగిలిన మరో దారి విజయనగరం లోక్‌సభ టిక్కెట్ మాత్రమే. తీరా అక్కడ ఐవీఆర్ఎస్ సర్వేల్లోనూ కళావెంకటరావు వినిపించట్లేదు. దీన్నిబట్టి అక్కడా టికెట్ వచ్చేట్లు కనిపించట్లేదు. పాపం... కళావెంకటరావు! ఆయన పరిస్థితి కరివేపాకు కన్నా అధ్వానంగా అయిపోయిందని ఆయన అనుచరులు చంద్రబాబుపై లోలోనే రగిలిపోతున్నారు. -
వచ్చే ఎన్నికల్లో తేడా వచ్చినా... తట్టుకోలేం
నర్సీపట్నం/మాకవరపాలెం: వచ్చే ఎన్నికల్లో ఏమాత్రం తేడా జరిగిన పులి పంజాను ఏమాత్రం తట్టుకోలేమని సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి టీడీపీ మాజీ మంత్రి కళావెంకటరావు అన్నారు. టీడీపీ భవిష్యత్తు గ్యారంటీ చైతన్య యాత్రలో భాగంగా నర్సీపట్నంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రభుత్వంలో ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి గొంతు నొక్కుతున్నారన్నారు. ఇప్పటి నుంచే పార్టీ విజయానికి శ్రమించాలని, ఏమాత్రం తేడా వచ్చినా పులి పంజాకు తట్టుకోలేమన్నారు. మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు ఉపన్యాసంలో ఎప్పుడు చెప్పే విషయాలే తప్ప కొత్తదనం లేదు. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి, బండారు సత్యనారాయణమూర్తి ఊకదంపుడు ఉన్యాసం చేశారు. టీడీపీ నేతలు బస్సు యాత్ర పేరుతో నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. సభ నిండుగా కనిపించేందుకు ప్రైవేట్ స్థలంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. జనాలను నింపేందుకు టీడీపీ నేతలు నానాతంటాలు పడ్డారు. సమయానికి గ్యాలరీ నిండకపోవడంతో మీటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. వచ్చిన జనాలు సైతం సభ జరుగుతుండగానే జారుకున్నారు. అంతకు ముందు మాకవరపాలెం మండలంలోని శెట్టిపాలె, రాచపల్లి జంక్షన్ వద్ద బస్సు యాత్రజరిగింది. -
పెళ్లిలో కూడానా.. ఇదేమి ఖర్మరా బాబు..!
సాక్షి, శ్రీకాకుళం: ‘ఎన్నిసార్లు పార్టీ పరువు తీస్తారు కళా వెంకట్రావు? మీరు ఇంకా ఇన్చార్జిగా ఉండడం మా ఖర్మ! పెళ్లికి వెళ్లి పార్టీ ప్రోగ్రాం చేసే ఖర్మ తెలుగుదేశం ఇన్చార్జికి పట్టిందా? ఎచ్చెర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్నే వైఎస్సార్సీపీ కార్యకర్తలుగా చిత్రీకరించి పార్టీలో చేర్చుకునే ఖర్మ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జికి పట్టిందా? 10 మందితో పేరుకి ప్రోగ్రామ్ చేస్తారా? కారులో నుంచి దిగి 5 నిమిషాలు స్టేజీ మీద ఉండి నాలుగు మాటలు మాట్లాడితే అదే ప్రోగ్రామా? కేశవరాయునిపాలెం గ్రామంలో మీరు ఇవాళ ఏం పని మీద వచ్చారు? ఏమి చేశారు? పెళ్లికి వచ్చిన బంధువులు, కార్యకర్తలతో కలిసి ఇదేమి ఖర్మ బ్యానర్ పెట్టి నాలుగు ఫోటోలు దిగితే ప్రోగ్రామ్ ఐపోయినట్టేనా? పార్టీ పరువు ఎన్ని విధాలుగా.. ఎన్ని సార్లు తీస్తారు?’ అంటూ సాక్షాత్తు టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ నాయకులు చేస్తే ఆరోపణలు, విమర్శలవుతాయి. అదే సొంత పార్టీ కార్యకర్తలు.. అదీ పార్టీ కార్యక్రమంపైన ధ్వజమెత్తితే ఏమనుకోవాలో టీడీపీ మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకటరావే చెప్పాలి. టీడీపీ సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకటరావును సొంత పార్టీ కార్యకర్తలే ఏకిపారేస్తున్నారు. ఆయన చేస్తున్న కార్యక్రమాలతో ఏకంగా పార్టీ అప్రతిష్ట పాలవుతుందని తెలుగు తమ్ముళ్లు మండి పడుతున్నారు. ఎంతో సీనియరై ఉండి జూనియర్ కంటే దారుణమైన రీతిలో పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారని ధ్వజమెత్తుతున్నారు. అక్కడా ఇక్కడా అని కాకుండా సోషల్ మీడియాలో, పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో కడిగి పారేస్తున్నారు. పెళ్లి వేడుకకు వచ్చిన నాయకులతో ‘ఇదేమి ఖర్మ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ.. లావేరు మండలం కేశవరాయునిపాలెంలో పార్టీ నాయకుడు నాయన శంకర్‌రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు కళా వెంకటరావు శుక్రవారం హాజరయ్యారు. మండల పార్టీ నాయకులతో కలిసి వధూవరులను ఆశీర్వదించారు. అయితే, అధినేత చంద్రబాబు పిలుపు మేరకు ‘ఇదేమి ఖర్మ’ కార్యక్రమాన్ని అక్కడికక్కడే నిర్వహించారు. మరోసారి పిలుపిస్తే వచ్చే కొద్ది పాటి కార్యకర్తలు, నాయకులు హాజరవరనో.. పార్టీ కార్యక్రమాన్ని ప్రజలు విశ్వసించరనో గానీ అప్పటికప్పుడే బ్యానర్ పెట్టి కార్యక్రమాన్ని కానిచ్చేశారు. ఇప్పుడిదే టీడీపీలో చర్చనీయాంశమైంది. ప్రత్యర్థి పార్టీ విమర్శలు చేస్తే వేరు.. సాక్షాత్తు తోటి టీడీపీ కార్యకర్తలు, నాయకులు కళా వెంకటరావుపై భగ్గుమంటున్నారు. పాలఖండ్యాంలో పార్టీలో చేరికల పేరుతో టీడీపీ కార్యకర్తల్నే చేర్పించి సాధించిందేంటి? ఎచ్చెర్ల పార్టీ కార్యాలయంలో చేరికలు పేరుతో మీరు చేసిందేంటి? ఎన్నిసార్లు మీ తప్పులు మీకు ఎత్తి చూపించినా మారకపోతే ఏమనాలి? అని గట్టిగా నిలదీస్తున్నారు. మీ లాంటి వారిని మోయాల్సి రావడం నిజంగా మా ఖర్మ.. అంటూ సోషల్ మీడియా, పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో కళా తీరును కడిగిపారేస్తున్నారు. వాస్తవంగా టీడీపీకి, ఆయనకు జనాదరణ లేకపోవడంతో పెళ్లికొచ్చిన జనాలతో కార్యక్రమాన్ని చేసేద్దామనుకోవడం బూమ్రాంగైంది. -
పాతవారికే ‘కొత్త’ కలరింగ్!.. కళా వారి రాజకీయ మాయా కళ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పైఫొటోలో రౌండప్ చేసిన వ్యక్తి పేరు కూనబిల్లి దామోదరరావు. ఈయన లావేరు మండలం కొత్త కుంకాం మాజీ సర్పంచ్. టీడీపీ నాయకుడిగా కొనసాగుతున్నారు. ఆరు నెలల కిందట టీడీపీ నాయకుడు కలిశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో కొత్త కుంకాంలో నిర్వహించిన ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమంలో ఊరంతా తిరిగారు. టీడీపీ కరపత్రాలు కూడా గ్రామస్తులకు పంచిపెట్టారు. ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వేదికపైన కూర్చొన్నారు. ఆయన పక్కనే నిల్చొని కలిశెట్టి అప్పలనాయుడు ప్రసంగం కూడా చేశారు. ఇప్పుడు అదే వ్యక్తికి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకటరావు సోమవారం సాయంత్రం టీడీపీ కండువా వేసి ఆయనతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరారని ప్రచారం చేశారు. ఆ ఫొటోను మీడియాకు, సామాజిక మాధ్యమాలకు వదిలారు. దీంతో చూసిన వారంతా అవాక్కయ్యారు. టీడీపీ నాయకుడు వైఎస్సార్సీపీ నుంచి చేరడమేంటని అంతా ఆశ్చర్యపోయారు. మిగతా రాజకీయ పక్షాలకు చెందిన వారిని పక్కన పెడితే సాక్షాత్తు టీడీపీకి చెందిన వారే తప్పు పడుతున్నారు. మన పార్టీ నాయకుడికి కండువా వేసి, మన పారీ్టలోకి చేరడమేంటని కళా వెంకటరావు తీరుపై పెదవి విరుస్తున్నారు. టీడీపీ కార్యకర్తలకు కండువాలు వేసి, వారంతా వైఎస్సార్సీపీ వారని చెప్పడం సిగ్గుగా లేదా అని ఆక్షేపిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులున్న వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్లో ఓ రేంజ్లో కళాను కడిగేస్తున్నారు. ... ఇలా చేయడం కళా వెంకటరావుకు కొత్తేమీ కాదు. అధిష్టానం వద్ద తన బలం పెరిగిందని చెప్పుకోవడానికి రకరకాల జిమ్మిక్కులు ప్రదర్శిస్తున్నారు. ఏప్రిల్‌లో లావేరు మండలం పట్నాయునిపేటకు చెందిన టీడీపీ కార్యకర్తలను రణస్థలం మండలం వీఎన్‌పురానికి తీసుకొచ్చి టీడీపీ కండువాలు చేసి, వారంతా వైఎస్సార్సీపీకి చెందిన వారని ఫొటోలు తీసి మీడియాకు వదిలారు. టీడీపీ కార్యకర్తలకు పార్టీ కండువాలు వేసి చేరికలేమిటని సాక్షాత్తూ తెలుగు తమ్ముళ్లే నివ్వెరపోయారు. సెప్టెంబర్‌లో కూడా ఇదే తరహా డ్రామా వేశా రు. పాలఖండ్యాం పంచాయతీ సీతారాంపురం గ్రామానికి చెందిన 25 వైఎస్సార్సీపీ కుటుంబాలు టీడీపీలో చేరినట్టుగా, వారందరికీ కండువాలు వేసి ఫొటోకు ఫోజులిచ్చి మీడియాకు ఇచ్చారు. కానీ, వాస్తవానికి వారంతా మెట్టవలస గ్రామానికి చెందిన టీడీపీ సానుభూతి పరులు. వాస్తవం తెలుసుకున్న జనం ఛీకొట్టారు. ఇదే విషయమై వైఎస్సార్సీపీ నాయకులు ప్రెస్‌మీట్ పెట్టి.. చేరారని చూపించిన వారిలో ఒక్కరైనా వైఎస్సార్సీపీ కార్యకర్త ఉన్నారని నిరూపించాలంటూ సవాల్ విసిరారు. దానికి కళా వెంకటరావు తోక ముడిచి సైలెంట్ అయిపోయారు. చీప్ పాలిట్రిక్స్.. కళా వెంకటరావు ఇలా వింత పోకడకు దిగుతున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో తనకు బలం లేకపోయినప్పటికీ, ఉన్న కేడర్‌ను తనను పట్టించుకోన ప్పటికీ తనకు పట్టు ఉందని, తన వెంట కేడర్ ఉందని చెప్పుకోవడానికి చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు. కళా వైభవం పోయిందని, ఆయనకంత సీన్ లేదని కార్యకర్తలు సైతం తేలికగా తీసుకుని పట్టించుకోవడం మానేశారు. ఆయనకు ప్రత్యామ్నాయమైన కలిశెట్టి అప్పలనాయుడును తమ నాయకుడిగా గుర్తిస్తున్నారే తప్ప కళా వెంకటరావును ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. పెళ్లి ఇతరత్రా శుభ కార్యక్రమాల ఆహా్వనం కోసం వచ్చిన వారితో ఫొటోలు తీసుకుని, వారు కూడా తన బలగమని చెప్పుకునే స్థాయికి కళా దిగజారిపోయారు. చావు పరామర్శకు వెళ్లి, అక్కడ టీడీపీ వాళ్లకే కండువాలు వేసి వైఎస్సార్సీపీ నుంచి చేరినట్టుగా చిత్రీకరించిన సందర్భం కూడా ఉంది. దీనిపై అప్పట్లో సోషల్ మీడియాలో కూడా వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ట్రోల్ అయింది కూడా. చదవండి: భావనపాడు కలపై.. అచ్చెన్న కుయుక్తులు! -
వలస వచ్చి మామీద పెత్తనమా.. ఎచ్చర్లలో ఎల్లో ఫైట్!
ఆయనో సీనియర్ నేత. మాజీ మంత్రి.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగాను పనిచేశారు. ఇదంతా గతం. ఇప్పుడు సీన్ మారింది. మీరొద్దు, మీ పెత్తనం వద్దంటూ అంతా సైడ్ అయిపోతున్నారు. అయినా ఆయన మాత్రం మళ్లీ తనకే టికెట్ కావాలంటూ తనదైన శైలిలో పావులు కదుపుతుండడం పచ్చ పార్టీలో చిచ్చు రేపుతోంది. కిమిడి కళా వెంకటరావు వ్యవహారశైలి ఎప్పుడూ వివాదస్పదమే. సూపర్ సీనియర్ జాబితాలో నెట్టుకొస్తున్నారు తప్పితే క్షేత్ర స్థాయిలో కేడర్‌తో నిత్యం వివాదాలే. 2009లో రాజాం నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కావడంతో ఎచ్చర్ల నియోజకవర్గానికి కళా వెంకటరావు వలస వెళ్లారు. ఆ ఎన్నికలో పీఆర్పీ తరఫున పోటీచేసి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత టీడీపీలో చేరి 2014లో మరోసారి పోటీచేసి విజయం సాధించారు. అయితే వలస నేత కావడంతో.. ఆయనకు, స్థానిక నేతలకు ఏ దశలో పొసగలేదు. ఫలితంగా 2019లో ఘోర ఓటమి చవిచూశారు. 2024లో ముచ్చటగా మూడోసారి ఎచ్చర్ల నుంచి పోటీకి తహతహలాడుతున్నా.. చెప్పుకోదగ్గ నేతలెవరూ ఆయన వెంట లేకపోవడం చర్చనీయాంశమైంది. ఎచ్చర్ల మండలంలో జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చౌదరి ధనలక్ష్మి, జి.సిగడాం మాజీ ఎంపీపీ బొమ్మన వెంకటేశ్వరరావు, లావేరు మండంలో అలపాన సూర్యనారాయణ, రణస్థలం మండలంలో కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు కళాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పైగా ఆయన్ను పార్టీ కార్యక్రమాలకు కూడా ఆహ్వానించకపోవడం విభేదాలను తేటతెల్లం చేస్తోంది. దాంతో కొత్త టీమ్‌ను తయారు చేసుకునేందుకు కళా వెంకటరావు శ్రమిస్తున్నా ఓ స్థాయి నేతలు వెంట రావడానికి ఆసక్తి చూపడం లేదట. దాంతో ఎవరికి తెలియని నేతలు ఇప్పుడు ఆయన వెంట దర్శనమిస్తున్నారు. ఈసారి ఎలాగైనా టికెట్ సాధించాలనే పట్టుదలతో కళా ఉన్నా.. వ్యతిరేక వర్గీయులు ఆయన్ను లైట్ తీసుకుటుండడం కొత్త సమీకరణాలకు తెరలేపుతోంది. కళాను వ్యతిరేకిస్తున్న నేతలంతా ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎక్కడి నుంచో వలస వచ్చి పెత్తనం చేయాలనుకుంటే కుదరదని, వలస నేత పెత్తనం ఇంకా ఎంత కాలమని కొందరు నేతలు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. మరికొందరు కళా వెంకటరావు పనైపోయింది.. ఆయనకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని బహిరంగానే ప్రకటిస్తున్నారు. అయినా అవేమీ పట్టించుకోకుండా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. మాజీ మంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన తనను కాదని, వేరే వారికి చంద్రబాబు టికెట్ ఇచ్చే అవకాశమే లేదని ఆయన అంటున్నారట. అయితే క్యాడర్ మాత్రం ఈసారి కళాను పక్కన పెట్టాల్సిందేనని డిమాండ్ చేస్తుండడం స్థానిక టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో.. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. -
TDP: రోడ్డెక్కి రచ్చ చేస్తామని హెచ్చరిక.. ఉలిక్కిపడ్డ కళా..
తెలుగుదేశం జమానాలో జన్మభూమి కమిటీల పెత్తనాలు.. ఆ ముసుగులో వారి ఆగడాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేల బంధువులు సైతం జన్మభూమి కమిటీ నేతలమంటూ జనంపై స్వారీ చేసేవారు. పథకాలు కావాలంటే ముడుపులు కట్టాల్సిందేనంటూ విచ్చలవిడిగా వసూళ్లకు తెగబడేవారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో మాజీమంత్రి కళా వెంకటరావు బంధువు ఒకాయన కూడా రాబంధువులా మారి జనాలను పీక్కు తిన్నాడు. ప్రభుత్వ పథకాల ద్వారా ఆవులు, గేదెలు, ఇళ్లు ఇప్పిస్తామంటూ వేలకు వేలు వసూలు చేశాడు. అలాగని పథకాలు మంజూరు చేయించలేదు.. దండుకున్న డబ్బులూ తిరిగి ఇవ్వలేదు. దీనిపై అప్పట్లోనే బాధితులు నిలదీసినా అధికార మదంతో అణచి వేశారు. మూడేళ్ల తర్వాత కూడా తమ డబ్బులు రాకపోవడంతో బాధితులంతా మూకుమ్మడిగా కళా వారి నివాసానికి వెళ్లి నిలదీశారు. రోడ్డెక్కి రచ్చ చేస్తామని హెచ్చరించారు. దాంతో ఉలిక్కిపడిన కళా కుటుంబీకులు కొందరికి చెల్లింపులు జరిపారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎచ్చెర్ల నియోజకవర్గంలో టీడీపీ నేతల వ్యవహారాలు రోజుకొకటిగా బయటపడుతున్నాయి. మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు బంధువు పంచాయితీ ఇప్పటికీ పరిష్కారం కాలేదు. అధికారంలో ఉన్నప్పుడు అందరి వద్ద డబ్బులు తీసుకుని, ఆ తర్వాత ముఖం చాటేయడం పంచాయితీ కళా వద్దకు చేరడంతో కొన్ని రోజులుగా నియోజకవర్గంలో ఇదే చర్చ నడుస్తోంది. తెలిసిన బాగోతమే టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పెత్తనం అంతా ఇంతా కాదు. కమిటీ సభ్యుల ముసుగులో టీడీపీ నేతలు చెలరేగిపోయారు. ప్రజలకు ఏం కావాలన్నా ముడుపులు ముట్టజెప్పాల్సిన పరిస్థితులు ఉండేవి. సంక్షేమ పథకాలు అందాలంటే చేతులు తడపాల్సి వచ్చేది. ప్రతి పథకానికి ఒక రేటు పెట్టి వసూళ్ల దందా చేశారు. ఇక, నాడు మంత్రులు, ఎమ్మెల్యేలుగా పదవులు చేపట్టిన నాయకుల బంధువులు, అనుచరులైతే మరింత రెచ్చిపోయారు. అయిన దానికి కాని దానికి ప్రజలను పీడించేశారు. కొన్ని పథకాలు మంజూరు చేస్తామంటూ డబ్బులు తీసుకుని చేతులేత్తేసిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి ఘటనలు ఇప్పుడు టీడీపీలో రచ్చ చేస్తున్నాయి. ఆ పార్టీలో గొడవకు దారితీస్తున్నాయి. పథకాల కోసం వసూళ్లు జి.సిగడాం మండలం నిద్దాం, అద్వానంపేట గ్రామాల్లో తెలుగు దేశం ప్రభుత్వం హయంలో ఆవులు, గేదెలు రాయితీపై మంజూరు చేస్తామని 40 మంది లబ్ధిదారుల నుంచి మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు బంధువు అధిక మొత్తంలో వసూళ్లు చేశారు. ఆ గ్రామంలో జన్మభూమి కమిటీ నాయకుడిగా పెత్తనం చెలాయిస్తూ పథకాల పేరుతో భారీ మొత్తంలో లబ్ధిదారుల నుంచి తీసుకున్నారు. ఇళ్లు కూడా మంజూరు చేస్తామని చెప్పి వసూళ్లకు తెగబడ్డారు. ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ.20వేలు వరకు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ, వారికి న్యాయం చేయలేదు. చెప్పినట్టుగా ఆవులు, గేదెలు, ఇళ్లు మంజూరు చేయించలేదు. అలాగని తీసుకున్న డబ్బులు వెనక్కి ఇవ్వలేదు. ఇదే విషయమై టీడీపీ హయాంలో జరిగిన జన్మభూమి–మా ఊరు గ్రామసభలో కూడా అప్పట్లో కొందరు నిలదీశారు. ఇదిగో అదిగో అంటూ తాత్సారం చేస్తూ వచ్చారే తప్ప టీడీపీ ప్రభుత్వం దిగిపోయేవరకు వాపసు చేయలేదు. కళా వద్దకు చేరిన పంచాయితీ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చినా కూడా వారిలో స్పందన లేదు. దీంతో బాధితులంతా ఏకమై మాజీ మంత్రి కళా వెంకటరావు నివాసం ఉంటున్న రాజాం వెళ్లి గట్టిగా నిలదీశారు. పథకాల కోసం తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించకపోతే రోడ్డెక్కుతామని, అవసరమైతే మీడియాకు తెలియపరుస్తామని కళా ముందే హెచ్చరించారు. దీంతో కళాతో పాటు ఆయన బంధువు ఉలిక్కి పడ్డారు. ఇది కాస్త వివాదంగా మారింది. మీడియా ప్రతినిధులకు, నియోజకవర్గ టీడీపీ కేడర్‌కు ఇదంతా తెలిసింది. చెప్పాలంటే దావానంలా వ్యాపించింది. దీంతో గుట్టుగా యుద్ధ ప్రాతిపదికన ఒక్కొక్కరికీ వెయ్యి రూపాయలు తగ్గేంచేసి కొంతమందికి చెల్లింపులు చేశారు. మరికొంతమందికి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ తంతు ఇప్పుడు జి.సిగడాం మండలంలోనే కాకుండా ఎచ్చెర్ల నియోజకవర్గంలోనే హాట్ టాపిక్ అయింది. -
టీడీపీకి అసమ్మతి సెగ: ఎన్నారై సంధ్య ఎంట్రీతో కళా వెంకట్రావు దెబ్బేనా?
గత సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి ఎచ్చెర్ల తేదేపా శ్రేణుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్న ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకట్రావు తీరు మరోమారు స్థానిక నేతల ఆగ్రహానికి గురౌతోంది. ఇప్పటికే కళాను ఎరువు నేతగా భావించి దూరం పెడుతున్న సొంత పార్టీ నేతలు ఆయన తాజా చిన్నెలతో అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. తమను కాదని గతంలో వివాదాస్పదమైన ఎన్నారై మహిళను పార్టీ అధినేత వద్దకు స్వయంగా తీసుకెళ్లి విజయనగరం జిల్లా కమిటీలో స్థానం కలి్పంచడం ఎచ్చెర్ల టీడీపీలో అసమ్మతి జ్వాలను ఎగదోసింది. కళాను వచ్చే ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతీసి సత్తా చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీలో మరో రచ్చ మొదలైంది. కొత్తగా పార్టీలో చేరిన ఎన్ఆర్ఐ సంధ్య గజపతిరావు చౌదరి వ్యవహారం చిచ్చురేపింది. ఇంతవరకు నియోజకవర్గ టీడీపీ నేతలను నేరుగా చంద్రబాబును కలిపించే అవకాశం ఇవ్వని కిమిడి కళా వెంకటరావు ఇప్పుడుఏకంగా నిన్నగాక మొన్న పారీ్టలోకి వచ్చిన ఎన్ఆర్ఐతో మాట్లాడించడం ఆ పార్టీలో కొత్త వివాదానికి దారితీసింది. వివాదాస్పదమైన ఎన్ఆర్ఐను పార్టీలోకి తీసుకోవడమే తప్పని వ్యతిరేకించగా, ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ఆమెను మరింత ప్రొత్సహించడం సుదీర్ఘకాలంగా టీడీపీలో పనిచేస్తున్న శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. దూరమవుతున్న కేడర్.. 2019 ఎన్నికల తర్వాత కిమిడి కళా వెంకటరావు పరిస్థితి దారుణంగా తయారైంది. ఒకప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా, మంత్రిగా పనిచేసిన కళాను ఇప్పుడు గ్రామాల్లో పట్టించుకునే నాయకులే లేరు. పెద్దగా ప్రాధాన్యం లేని వ్యక్తులను వెంటబెట్టుకుని పార్టీ కార్యక్రమాలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. దీనికంతటికీ కళా అనుసరిస్తున్న తీరే కారణం. అధికారంలో ఉన్నంతసేపూ కేడర్‌ను పట్టించుకోలేదని, అధికారం పోయాక తన కొడుకు రామ్ మల్లిక్నాయుడిని తమపై రుద్దుతున్నారని నాయకులంతా తీవ్ర ఆవేదనతో ఉన్నారు. దీంతో నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోనూ కీలక నాయకులు కళాకు దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గంలో తనే మళ్లీ పోటీ చేస్తానని చెబుతూ, అధిష్టానం వద్ద తన కుమారుడికి సీటు ఇవ్వాలని కోరుతూ.. తనదైన రాజకీయం చేస్తున్నాడని టీడీపీ శ్రేణులు వాపోతున్నారు. ఎన్నాళ్లీ కళా పెత్తనమని గుర్రుగా ఉన్నారు. రణస్థలం మండలంలో మాజీ ఏఎంసీ చైర్మన్ కలిశెట్టి అప్పలనాయుడు, జి.సిగడాం మాజీ ఎంపీపీ బాల బొమ్మన వెంకటేశ్వరరావు, ఎచ్చెర్లలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ చౌదరి ధనలక్షి్మ, జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ, లావేరు మండలంలో అలపాన సూర్యనారాయణ, దామోదరావు తదితర కీలకనేతలంతా కళా వెంకటరావును బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. కళా పేరెత్తితేనే మండిపడుతున్నారు. ఎన్నికలొచ్చినప్పుడు తమ సత్తా ఏంటో చూపిస్తామని బాహాటంగానే చెబుతున్నారు. కొత్త గ్రూపుతో వివాదం.. ఎచ్చెర్ల మండలం టీడీపీ పెద్ద దిక్కు చౌదరి బాబ్జీ అని ఆ పార్టీ నేతలు చెబుతుంటారు. ఇప్పుడు ఆయనకే చెక్ పెట్టేలా ఆ గ్రామంలో ఉన్న ఎన్ఆర్ఐ సంధ్య గజపతిరావు చౌదరిని పార్టీలోకి తీసుకొచ్చి మరో గ్రూపును తయారు చేశారు. ఇదే ఎన్ఆర్ఐ.. గతంలో చౌదరి బాబ్జీ కొడుకు ఆత్మహత్యాయత్నానికి ప్రధాన కారకురాలని అప్పట్లో పెద్ద వివాదమే నడిచింది. గ్రామంలో తాము నిర్మించిన ఆలయాన్ని ప్రారంభోత్సవం కానివ్వకుండా సంధ్య గజపతిరావు చౌదరి అడ్డుకుంటున్నారని, మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని చౌదరీ బాబ్జీ కొడుకు చౌదరి అవినాష్ పోలీసు స్టేషన్‌పై నుంచి దూకేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అప్పట్లో సంధ్య గజపతిరావు చౌదరిపై చంద్రబాబు సీరియస్‌గా స్పందించారు. ఇప్పుడు ఆమెను పార్టీలోకి తీసుకోవడమే కాకుండా విజయనగరం జిల్లా తెలుగు మహిళ కమిటీలో చోటు కలి్పంచారు. ఎప్పటి నుంచో పనిచేస్తున్న నాయకులను నేరుగా కలిసే అవకాశమివ్వని కళా వెంకటరావును ఈమెను నేరుగా చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి మాట్లాడించారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలోకి వదిలారు. దీంతో పుండుపై కారం జల్లినట్టు... ఎన్ఆర్ఐ సంధ్య చంద్రబాబును కలవడాన్ని నియోజకవర్గ టీడీపీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిని వదిలేసి గ్రామంలో ఏ మాత్రం పట్టులేని సంధ్యను ప్రోత్సహించడమేంటని ప్రశ్నిస్తున్నారు. చౌదరి బాబ్జీకి పోటీగా గ్రామంలో రాజకీయం చేయించడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నారు. దీనంతటికీ కారణమైన కళాను 2019 కన్నా దారుణంగా ఓడించేందుకు ఆ పార్టీ శ్రేణులు కంకణం కట్టుకుంటున్నారు. -
ఎచ్చెర్ల టీడీపీ ‘కళా’విహీనం..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎచ్చెర్ల టీడీపీ ‘కళా’ విహీనమవుతోంది. ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షు డు కళా వెంకటరావు నాయకత్వాన్ని అక్కడి టీడీ పీ శ్రేణులు బహిరంగంగా వ్యతిరేకిస్తున్నాయి. తన మాట మాత్రమే వినాలనే కళా వైఖరిని ఎండగడుతున్నాయి. తనతో కలిసి పనిచేయకపోతే లోకేష్‌ను తీసుకువచ్చి పోటీ చేయిస్తానని కళా బెదిరిస్తుంటే.. మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయిన నాయకుడు ఇక్కడేం చేయగలరని బాహాటంగానే బదులిస్తున్నాయి. దీంతో కళా వెంకటరావు పరిస్థితి దిక్కుతోచని విధంగా మారింది. ఇప్పటికే ఆయనను కాదని బయటకు వచ్చిన కలిశెట్టి అప్పలనాయుడు స్వతంత్రంగా పనులు చేయడం మొదలుపెట్టారు. ఆ నియోజకవర్గంలో కళాకు ప్రత్యామ్నాయంగా మారుతున్నారు. అసంతృప్త నేతలు, కార్యకర్తలంతా ఇప్పుడు కలిశెట్టితో కలుస్తున్నారు. కలిశెట్టి నాయకత్వ పటిమను పక్కన పెడితే.. కళా కంటే మేలేనని కా ర్యకర్తలు భావిస్తున్నారు. కలిశెట్టిని పార్టీ నుంచి రెండుసార్లు సస్పెండ్ చేయిస్తే డోంట్‌కేర్ అంటూ పార్టీ జెండాతోనే కార్యక్రమాలు చేపడుతున్నారు. బుజ్జగింపు.. బెదిరింపు పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతుండడంతో కళా అండ్‌కో పార్టీ శ్రేణులను దారికి తెచ్చుకు నే ప్రయత్నం చేస్తోంది. కలిశెట్టి వెనుక తిరుగుతున్న వారిని బుజ్జగించే పనిలో ఉంది. కలిశెట్టికి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ రాదని తమతోనే పనిచేయాలని కళా కోరుతున్నారు. అయితే ఈ రా య‘బేరాలకు’ ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ శ్రేణు లు తలొగ్గడం లేదు. కళా నాయకత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఫోన్ లోనే నేరుగా చెప్పేస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి వస్తున్న స్పందనతో అవాక్కవుతు న్న కళా అండ్‌కో చివరికి బెదిరింపులకు దిగుతున్నారు. కళా పోటీలో లేకుంటే ఆయన కుమారు డు పోటీ చేస్తాడని, కాదూ కూడదంటే లోకేష్‌ను తీసుకువచ్చి పోటీ చేయిస్తారని కేడర్‌కు బెదిరింపుల సంకేతాలు పంపిస్తున్నారు. కానీ ఆ బెదిరింపులకు కూడా ఎవరూ లొంగడం లేదు. లోకేష్ ఇ క్కడికొస్తే అవమానం తప్ప ఏమీ ఉండదని, స్థా నికుడే నాయకుడిగా ఉండాలని «ధీటుగా జవాబు ఇచ్చేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే ఎచ్చెర్లలో బయట నుంచి ఏ నాయకుడొచ్చి నాయకత్వం వహించినా టీడీపీ శ్రేణులు తరిమికొట్టేలా ఉన్నాయి. ఇవీ చదవండి: ‘రోడ్డు’ మ్యాప్ రెడీ కోటి రూపాయలను తలదన్నే కథ -
కళా వెంకటరావు చీప్ పాలిట్రిక్స్ ..
డ్రామా పేరు ధర్నా. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం కళా వెంకటరావు. విడుదల ఈ నెల 28. ఉనికి చాటుకునే ప్రయత్నంలో కళా వెంకటరావు నానాటికీ దిగజారిపోతున్నారు. 30వ తేదీకి తోటపల్లి నీరు శివారుకు అందుతుందని అధికారులు చెబుతుంటే.. 28వ తేదీకే నీటి కోసం ధర్నాకు దిగుతున్నారు! ఈ డ్రామా కోసం మళ్లీ జనాలకు పిలుపు కూడా ఇచ్చారు. కేవలం తన రాజకీయ స్వార్థం కోసం కళా ఇచ్చిన పిలుపుపై జనం నవ్వుతున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కళా వెంకటరావు టీడీపీ లో తానొకడిని ఉన్నానని చెప్పుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అందులో భాగంగా తోటపల్లి నీటి విషయమై కొత్త ఎత్తుగడ వేశారు. అంతరార్థం జనాలకు తెలిసిపోవడంతో ఆయన ప్రయత్నాలు చూసి తోటి టీడీపీ శ్రేణులే జాలి పడుతున్నాయి కళా రాజకీయమిది.. అధికారులు తీసుకున్న చర్యలు, చెప్పిన విష యాన్ని పక్కన పెట్టి కిమిడి కళా వెంకటరావు జల రాజకీయం చేసేందుకు పూనుకున్నారు. మిగిలిన(జాతీయ రహదారి దాటాక ఉన్న) కాలువలకు ఈనెల 30న నీరు విడుదల చేస్తా మని ఇరిగేషన్ అధికారులు స్వయంగా చెప్పినప్పటికీ 28న రణస్థలంలో ధర్నాకు పిలుపునిచ్చారు. అయిపోయిన పెళ్లికి బాజాలు వాయించినట్టు ఇప్పటికే నీరు విడుదల చేసి, 30వ తేదీన శివారు భూములకు నీరిచ్చేందుకు షెడ్యూల్ ప్రకటించాక కళా వెంకటరావు ఆందోళన దిగుతుండడం హాస్యాస్పదంగా మారింది. వాస్తవమిది.. తోటపల్లి ప్రాజెక్టు నుంచి ఈ నెల 21న శ్రీకాకుళం బ్రాంచి కాలువకు 35 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. 20 కిలోమీటర్ల పొడవు గల కాలువలో 17వ కిలోమీటర్ కమ్మ సిగడాం వద్దకి ప్రస్తుతం నీరు చేరింది. జాతీయ రహదారి దాటాక ఉన్న మిగతా 3 కిలోమీటర్ల కాలువలో కమాండ్ డెవలప్మెంట్ ఏరియా కింద వచ్చిన నిధులతో అభివృద్ధి పనులు చేపడుతుండటంతో నీరు విడిచి పెట్టలేదు. 32ఎల్ (ఎడమ కాలువ) వెళ్లే కోష్ట, పైడిభీమవరం వైపు, 33ఆర్(కుడికాలువ)వెళ్లే రావాడ, రణస్థలం వైపు నీరు ప్రస్తుతం వెళ్లడం లేదు. పనులు చేపట్టిన చోట నీరు విడుదల చేస్తే వృధా తప్ప ప్రయోజనం ఉండదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెలాఖరు(30వ తేదీకి)కు నీరు విడిచి పెట్టాలని అధికారులు నిర్ణయించారు.ఈ లోగా పనులు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పటికే పనులు చివరి దశకు వచ్చాయి. ఇదే విషయాన్ని సాగునీటి కోసం నాలుగు రోజుల కిందట వారికి ఫోన్ చేసిన టీడీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు, టీడీపీ నేత కలిశెట్టి అప్పలనాయుడుకు ఇరిగేషన్ అధికారులు స్పష్టం చేశారు. కలిశెట్టి ఆనందమిది.. రణస్థలం మండలంలోకి తోటపల్లి ప్రాజెక్టు నీరు విడుదల చేయడంపై టీడీపీ నేత కలిశెట్టి అప్పలనాయుడు రైతులతో కలిసి దేవరాపల్లి గ్రామ సరిహద్దులో ఉన్న తోటపల్లి కాలువను సందర్శించి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకా రం అధికారులు తోటపల్లి నీరు విడుదల చేశారని హర్షం వ్యక్తం చేశారు. అయినా కళా వెంకటరావు మాత్రం తన ఉనికి చాటుకునేందుకు అర్థం లేని ఆందోళనలకు దిగుతున్నారు. నీటి విడుదల షెడ్యూల్ జనాలకు తెలిశాక కూడా ఆందోళనకు దిగుతున్నారు. తన ఖాతాలో వేసుకునేందుకు.. ఎలాగూ రెండు రోజుల్లో నీరు విడుదలవుతుంది. అదంతా తన గొప్పతనమే అని చెప్పుకునేందుకు ఆయన పడుతున్న తాపత్రయాన్ని చూసి ఆ పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు. రణస్థలం మండలానికి ఇప్పటికే నీరు విడుదల చేయడంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ తోటి టీడీపీ నేత కలిశెట్టి అప్పలనాయుడు కాలువ వద్దకు వెళ్లి హర్షం వ్యక్తం చేస్తుంటే కళా వెంకటరావు ఇప్పుడు సాగునీటి కోసమని ధర్నా చేయడమేంటని ఆ పార్టీ శ్రేణులు పెదవి విరుస్తున్నాయి. నియోజకవర్గంలో ప్రస్తుతం కళా పరిస్థితి కళావిహీనంగా మారింది. తన కొడుకును ఎంత ప్రమోట్ చేసినా లాభం లేకపోయింది. కార్యకర్తలు ఆశించిన స్థాయిలో దగ్గరకు చేరడం లేదు. దీంతో ఈ కొత్త ఎత్తుగడకు తెరతీశారు. -
టీడీపీ నేత కళా వెంకట్రావు అరెస్ట్
సాక్షి, రాజాం/నెల్లిమర్ల: వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై దాడి ఘటనకు సంబం ధించి టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావును బుధవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం స్టేషన్ బెయిల్‌పై ఆయన్ను విడుదల చేశారు. విజయనగరం జిల్లా రామతీర్థంలోని బోడికొండపై శ్రీరాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడం తెలిసిందే. దీనిపై విజయసాయిరెడ్డి రామతీర్థాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన వాహనంపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగి చెప్పులు, రాళ్లు విసిరారు. ఈ దాడిపై నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసిన టీడీపీ కార్యకర్తలు.. కళా వెంకట్రావు ప్రేరేపించడంతోనే తాము విజయసాయిరెడ్డి వాహనంపై దాడికి పాల్పడినట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అన్ని పరిశీలనల అనంతరం పోలీసులు బుధవారం రాత్రి రాజాంలోని కళా నివాసానికి వెళ్లి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ను చీపురుపల్లికి తరలించారు. తర్వాత చీపురుపల్లి పోలీస్‌స్టేషన్‌లో స్టేషన్ బెయిల్ లభించడంతో ఆయన విడుదలయ్యారు. ఇదిలా ఉండగా, ఇదే కేసులో 8 మంది టీడీపీ నేతలను నెల్లిమర్ల పోలీసులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల విజయనగరంలో పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడిన టీడీపీ జిల్లా నేత కూడా ఇందులో ఉన్నారు. గొర్లిపేటకు చెందిన టీడీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్‌తోపాటు మరో ఇద్దరు నేతలు, అలాగే దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న సీతారామునిపేటకు చెందిన ఇద్దరు టీడీపీ నేతలు, పూతికపేటకు చెందిన మరొకరు, నెల్లిమర్లకు చెందిన ఓ టీడీపీ నేత కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఉన్నారు. -
టీడీపీకి ప్రశ్నించే అర్హత లేదు:ఎమ్మెల్యే కోలగట్ల
సాక్షి, విజయనగరం: టీడీపీని ప్రజలు ఎందుకు పక్కన పెట్టారో ఆ పార్టీ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. సోమవారం విజయనగరంలో మీడియా సమావేశంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అధికార పార్టీపై ఆరోపణలు చేయడం ద్వారా తన ఉనికి చాటుకొనే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సిగ్గుపడాల్సింది పోయి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఇసుకను సాకుగా చూపి టీడీపీ లబ్ధి పొందాలని చూస్తోందని మండిపడ్డారు. ‘ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని టీడీపీ ఆరోపిస్తుందని.. కానీ టీడీపీకికి ప్రశ్నించే అర్హత లేదని’ దుయ్యబట్టారు. విజయనగరం జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించిందని.. జిల్లాలో టీడీపీకి పాలించే అర్హత లేదని ప్రజలు స్పష్టంగా చెప్పారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. -
తొలి గెలుపు అదుర్స్
సాక్షి, శ్రీకాకుళం: ఫ్యాన్ గెలుపు సునామీలో సైకిల్ కొట్టుకుపోయింది. తలపండిన టీడీపీ నేతలకు దిమ్మతిరిగేలా ఓటర్లు షాక్ ఇచ్చారు. అవినీతిపరుల పాలనను మూకుమ్మడిగా తిరస్కరించారు. రాజకీయ ఓనమాలు నేర్చుకుంటున్న నవ నాయకత్వానికి పట్టం కట్టారు. జిల్లాలో ఎచ్చెర్ల, పాతపట్నం, పలాస నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు తొలిసారి గెలుపు రుచేంటో చూపించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో తొలిసారి అడుగిడునున్న రెడ్డి శాంతి, గొర్లె కిరణ్‌కుమార్, సీదిరి అప్పలరాజుల గెలుపునకు దోహదపడిన కొన్ని అంశాలు చదివిద్దేమిలా.. డాక్టర్ దెబ్బకు టీడీపీ కోట బద్దలు మందస: ఓ వైపు సుదీర్ఘ రాజకీయ అనుభవం.. సామ, దాన, భేద, దండోపాయాలు తెలిసిన నాయకత్వం గౌతు శ్యామసుందర శివాజీ సొంతం. మరోవైపు పిన్న వయస్కుడు, అతిసామాన్య కుటుంబం నుంచి వచ్చిన యువ నాయకుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు భారతంలోని అభిమన్యుడు లాంటి వాడే. ఈయన కురువృద్ధుడు లాంటి శివాజీ రాజకీయ బాణాలను, పాశుపతాస్త్ర, బ్రహ్మాస్త్రాలతో ఎదుర్కొని జయకేతనం ఎగురవేశారు. వజ్రపుకొత్తూరు మండలంలోని ఓమారుమూల గ్రామమైన దేవునల్తాడలో ఓ సామాన్య మత్స్యకార కుటుంబానికి చెందిన సీదిరి దాలయ్య, నీలమ్మ దంపతులకు అప్పలరాజు జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న సామెతను రుజువు చేస్తూ, విద్యలో మంచి ప్రతిభ చూపారు. ఎంబీబీఎస్ చదివి పలాస–కాశీబుగ్గలో ప్రాక్టీసు చేస్తూ ఎంతో మంచి వైద్యునిగా పేరు తెచ్చుకున్నారు. రెండేళ్ల క్రితం వైఎస్సార్సీపీ అప్పలరాజు ప్రతిభ, నిపుణత చూసి, పలాస నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. ఏమాత్రం రాజకీయ అనుభవం లేకున్నా రాజకీయాల్లో దూసుకుపోయారు. ప్రజల మనసులో మంచిస్థానం సంపాదించగలిగారు. ఈయన్ను ఎదుర్కొనలేక టీడీపీ కుటిల యత్నాలకు దిగింది. ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యే గౌతు శివాజీ, అభ్యర్థిగా శిరీష, ఆమె భర్త వెంకన్నచౌదరి, గౌతు విజయలక్ష్మి, జీకే నాయుడు, పీరికట్ల విఠల్‌రావు, వజ్జ బాబురావు ఇలా ఒకరేమిటి ఎంతోమంది రాజకీయ అనుభవం గల నాయకులు ఒక వైపు.. తానొక్కడే ఒంటిచేత్తో మరో వైపు పోరాడిన అప్పలరాజు సునాయాస విజయాన్ని చేజిక్కించుకున్నారు. అత్యధికంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన శివాజీ కుమార్తె శిరీషను ఓడించి, పలాసలో వైఎస్సార్సీపీకి స్థానం కల్పించిన డాక్టర్ సీదిరి అప్పలరాజు రాజకీయ వ్యూహానికి రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. రెడ్డి శాంతి ప్రభంజనం ఎల్.ఎన్.పేట: పాతపట్నం నియోజకవర్గంలో రెడ్డి శాంతి గెలుపు జన ప్రభంజనంగా నిలిచింది. ఈమెను ఓడించాలని అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు పన్నిన కుయుక్తులు ఓటర్ల సునామీలో కొట్టుకుపోయాయి. స్థానికేతరాలని, ఈమెను కలవాలంటే ఢిల్లీ వెళ్లాలా అంటూ ప్రత్యర్థి పార్టీ నాయకులు చేసిన ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారు. వంశధార నిర్వాసితులను బలవంతంగా గ్రామాల నుంచి బయటకు పంపించిన తెలుగుదేశం పార్టీకి వారి ఉసురే తగిలిందని నిర్వాసిత గ్రామాల్లో చర్చించుకుంటున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు నిర్వాసితుల అండగా నిలుస్తారని భావించినప్పటికీ గట్టి గుణపాఠమే చెప్పారు. మెళియాపుట్టి మండలంలో ఆఫ్‌షోర్ రిజర్వాయర్‌లో నష్టపోయిన బాధితుల సమస్యలతోపాటు వంశధార నిర్వాసితుల సమస్యలపైన పోరాటం చేస్తూ అండగా నిలిచిన ఈమె తన విజయానికి బాటలు వేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లు చేసిన అక్రమాలు ప్రజలకు వివరించడంతోపాటు ప్రజలకు అండగా ఉంటానని నియోజకవర్గం మొత్తంగా పర్యటించినందుకు ప్రజలంతా అక్కున చేర్చుకున్నారు. కిరణ్‌కే పట్టం ఎచ్చెర్ల క్యాంపస్: రాజకీయ కురువృద్ధుడు, మంత్రి కళా వెంకటరావును ఎచ్చెర్ల నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మట్టి కరిపించారు. టీడీపీ పాలనలో ప్రతిపక్ష పార్టీ ఉనికి లేకుండా చేసిన కళాకు ఓటర్లు సైతం గట్టి సమాధానమిచ్చారు. ఈ మేరకు స్థానిక నేత గొర్లె కిరణ్‌కుమార్‌కు బ్రహ్మరథం కట్టారు. 2014 ఎన్నికల్లో కళా వెంకటరావు చేతిలో కిరణ్ ఓటమి చవిచూశారు. అయినప్పటికీ నిరాశ చెందకుండానే వైఎస్సార్సీపీ శ్రేణులతో కలసి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యలపై పోరాడుతూ వచ్చారు. ఈ దఫా ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్టు కోసం మీసాల నీలకంఠంనాయుడు కూడా పోటీపడినప్పటికీ కొన్ని నెలల క్రితం ఈయన మంత్రి కళా లాబీయింగ్‌తో టీడీపీలో చేరిపోయారు. దీంతో కిరణ్‌కుమార్‌కు టిక్కెట్టు ఖాయమైంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఆర్థికంగా బలమైన అభ్యర్థి కావటంవ వల్ల కళా విజయం తథ్యంగా టీడీపీ వర్గాలు భావించాయి. అయితే కిరణ్‌కుమార్ స్థానికుడు కావటం, ఎన్నికల్లో ఓడినా నిరంతరం ప్రజల్లో ఉండటంలో అన్ని వర్గాల ప్రజలు మద్దతుగా నిలిచారు. -
అమాత్యా.. పరాభవం తప్పదా..?
బలవంతుడను నాకేమని విర్రవీగిన వారికి పరాభవం తప్పనట్టు ఇన్నాళ్లూ అరాచకాలు, అణచివేతలతో జిల్లాను పాలించిన ఇద్దరు మంత్రులకూ ఓటమి భయం వెంటాడుతోంది. నీరు– చెట్టు పనులు, ఉచిత ఇసుక పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దిగమింగి.. తనతోపాటు అనుచరగణం కోసం బరితెగించిన అచ్చెన్నాయుడికి ఈసారి గుణపాఠం చెప్పడానికి ప్రజానీకం ఎదురుచూస్తోంది. మరోపక్క తన ఎదుగుదల కోసం ఎదుటివారిని అణగదొక్కి పబ్బం గడుపుకునే కళా వెంకటరావుకు బుద్ధి చెప్పడానికి వ్యతిరేక వర్గం కంకణం కట్టుకుంది. ఈ దఫా ఎన్నికల్లో తమకు ఓటమి తప్పదన్న భయంతో ఇద్దరు మంత్రులకు నిద్ర కరువైంది. సాక్షి, టెక్కలి (శ్రీకాకుళం): సుమారు పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉంటూ ఒక్కసారిగా అధికారం రాగానే మంత్రి అచ్చెన్నాయుడు కక్షసాధింపు చర్యల్లో రేషన్ డీలర్లు బలైపోయారు. 22 మంది రేషన్ డీలర్లను అకారణంగా తొలగించి, పందికొక్కుల్లా రేషన్ సరుకులు తింటున్నారు. స్వయం శక్తి సంఘాల ముసుగులో టీడీపీ కార్యకర్తలకు రేషన్ డీలర్ బాధ్యతలు అప్పగించి ఇష్టారాజ్యంగా పేదల సరుకులను బొక్కేస్తున్నారు. కొంత మంది హైకోర్టు ఉత్తుర్వులు తెచ్చుకున్నా మంత్రి పెత్తనం ముందు దిగదుడుపుగా మారాయి. ఈ నేపథ్యంలో ఈ నెల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామం టూ బాధిత డీలర్లు బాహాటంగానే హెచ్చరిస్తున్నారు. మంత్రి కక్షసాధింపునకు బలి టెక్కలి నియోజకవర్గంలో టెక్కలి, నందిగాం, కోటబొమ్మాళి మండలాల్లో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన కక్షసాధింపు చర్యలకు మొత్తం 22 మంది రేషన్ డీలర్లు బలైపోయారు. టెక్కలి మండలంలో సీతాపురం, తిర్లంగి, బొరిగిపేట, పోలవరం, భగవాన్‌పురం, బన్నువాడ, బూరగాం, పాతనౌపడ, నందిగాం మండలంలో నందిగాం, హరిదాసుపురం, నౌగాం, దేవుపురం, రాంపురం, దిమిలాడ, నరేంద్రపురం, పెద్దతామరాపల్లి, కోటబొమ్మాళి మండలంలో సరియాపల్లి, కొత్తపల్లి, చీపుర్లపాడు, కోటబొమ్మాళి, కురుడు, దంత తదితర గ్రామాల్లో రేషన్ డీలర్లపై అడ్డగోలుగా దాడులు చేయించి వారిని విధుల నుంచి తప్పించారు. అనంతరం ఆయా గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలకు ఆ బాధ్యతలు అప్పగిస్తూ ఇష్టారాజ్యంగా దోపిడీ పర్వానికి తెర తీశారు. ఎచ్చెర్ల క్యాంపస్: రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కళా వెంకటరావుకు అసమ్మతి సెగ వెంటాడుతోంది. టీడీపీలో కీలక నాయకులు ఏకమైన వ్యూహాత్మకంగా ఈయన్ను ఓడించే ప్రయత్నం చేస్తున్నారు. తాను తీసుకున్న నిర్ణయాలు, పార్టీ అంతర్గత విభేదాలు ప్రస్తుతం కళాకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. రాష్ట్రంలో కీలక నాయకుడు కావటం వల్ల ఎన్నికల్లో విజయావకాశాలు ప్రభావం చూపుతాయని అనుకున్నారు. అయితే పరిస్థితులు ఒక్కసారిగా ప్రతికూలంగా మారాయి. వ్యతిరేక వర్గమంతా ఏకమై... సుదీర్ఘకాలం టీడీపీలో పనిచేస్తున్న మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతికి ఎమ్మెల్యే టిక్కెట్టు దక్కకుండా చేశారు. అవకాశవాది, తన రాజకీయ ప్రత్యర్థి కోండ్రు మురళీ మోహన్‌కు టీడీపీ రాజాం టిక్కెట్ ఇవ్వటం ఈమె జీర్ణించుకోలేకపోతున్నారు. 1983 నుంచి 1999 వరకు సుదీర్ఘకాలం ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో రాజాంలో తన ఓటమికి కళా కారణం అన్న అంశం సైతం ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రధాన కారణంగా మారుతోంది. మరోవైపు కళా వెంకటరావు తనకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, పట్టుబట్టి మరీ మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడుని పార్టీలో చేర్చుకున్నారు. దీంతో జి.సిగడాం మండలంలో ఆ పార్టీ నాయకులు లోలోన రగిలిపోతున్నారు. ఇదే కారణంతో ఓట్లు ప్రభావితం చేయగల టీడీపీ నాయకులు వాండ్రంగి మాజీ సర్పంచి బూరాడ వెంకటరమణ, జాడ మాజీ సర్పంచి కోరాడ అచ్చారావు, కొప్పరాం మాజీ సర్పంచ్ ఎర్రబోలు సింహాచలం, ఏవీఆర్పురం నాయకుడు మీసాల గోవిందరావు పార్టీ వీడి వైఎస్సార్సీపీలో చేరారు. జెడ్పీ చైర్పర్సన్ వర్గం కూడా మరోవైపు జెడ్పీ చైర్పర్సన్ చౌదిరి ధనలక్ష్మి వర్గానికి కళాకు ఎప్పట్నుంచో శత్రుత్వం ఉంది. వీరిని పార్టీలో ఎదగకుండా కళా అణిచివేతకు ప్రయత్నించారు. మరోవైపు ఆర్థిక ప్రగతిని దెబ్బతీసేలా వీరికి కాంట్రాక్టు వచ్చిన ఇసుక రీచ్ రద్దు చేశారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు మద్దతుతో వీరు నెగ్గుకు వస్తున్నారు. వీరి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్న కళా వ్యతిరేక పోస్టర్లు ప్రదర్శన సైతం ఏడాది క్రితం కలకలం రేపింది. కళా ప్రోత్సాహంతో ఒక పోలీస్ అధికారి దర్యాప్తు చేయగా టీడీపీ నాయకుల ప్రమేయంతో పోస్టర్లు అతికించినట్లు బయటపడింది. పోస్టర్లు అంటించిన వారిని పోలీస్ స్టేషన్ల చుట్టూ వారం రోజులపాటు తిప్పి చివరకు విడిచి పెట్టారు. అదేవిధంగా 2009 టీడీపీ ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థి నాయని సూర్యనారాయణరెడ్డి వైఎస్సార్సీపీలో చేరి కళా ఓటమి కోసం అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం కళా అసమ్మతి పద్మవ్యూహంలో చిక్కుకున్నారన్నది రాజకీయ విశ్లేషకులి మాట! మా కుటుంబాన్ని రోడ్డున పడేశారు మా గ్రామంలో టీడీపీ కార్యకర్తలకు రేషన్ డీలర్షిప్ ఇవ్వడానికి అన్యాయంగా నన్ను తొలగించారు. బలవంతంగా సెలవు పెట్టించారు. పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ మంత్రి అచ్చెన్నాయుడుకు భయపడి నాకు డీలర్ షిప్ ఇవ్వలేదు. ఐదేళ్లుగా మా కుటుంబం నడిరోడ్డున పడింది. – రేగు గాసయ్య, బాధిత రేషన్ డీలర్, బూరగాం, టెక్కలి మండలం రాజకీయ కక్షతో తొలగించారు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు రాజకీయకక్షతో నా డీలర్‌షిప్‌ను తొలగించారు. నేను 1991 నుంచి దేవుపురంలో డీలర్‌గా పనిచేస్తున్నాను. నాపై ఎలాంటి ఆరోపణలు లేకపోయినా తొలగించడం మంత్రి అధికార దుర్వినియోగానికి నిదర్శనం. – కంచరాన కృష్ణమూర్తి, దేవుపురం, నందిగాం మండలం అన్యాయంగా డీలర్షిప్ తొలగించారు టీడీపీ అధికారంలోకి రాగానే అన్యాయంగా నా రేషన్ దుకాణంపై దాడులు చేయించి డీలర్ షిప్‌ను తొలగించారు. దీనిపై హైకోర్టు మాకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ డీలర్ షిప్ ఇవ్వలేదు. ఆ తర్వాత జేసీ కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చిన మంత్రి అడ్డుకుంటున్నారు. – నడుపూరు అమ్మాలు, బాధిత డీలర్, తిర్లంగి, టెక్కలి మండలం -
తుఫాన్ మృతులకు రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియా
శ్రీకాకుళం పాతబస్టాండ్: తిత్లీ తుఫాన్ ప్రభావంతో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని రాష్ట్ర విద్యుత్‌శాఖా మంత్రి కళావెంకట్రావు ప్రకటించారు. గురువారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 12 మండలాలు, 196 గ్రామాలపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉందన్నారు. 1.39 లక్షల హెక్టార్లలో వ్యవసాయ భూమి దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారని పేర్కొన్నారు. 300 కిలోమీటర్ల పైనే రహదారులు దెబ్బతిన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. హుదూద్ తర్వాత ఎక్కువగా ఈసారి తుఫాను ప్రభావం జిల్లాపై పడిందని చెప్పారు. ఇప్పటికే పునరావాస చర్యలు ప్రారంభించామన్నారు. టెక్కలి డివిజన్‌కు పూర్తిగా కమ్యూనికేషన్ దెబ్బతిందన్నారు. పలాస, ఉద్దానం ప్రాంతంలో నష్టం ఎక్కువగా సంభవించిందన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఇతర అధికారులు పూర్తి స్థాయిలో ప్రజలకు సహాయం చేస్తున్నాయని చెప్పారు. అధికారులతో పాటు రాజకీయ పార్టీలు కూడా పునరావాస చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తాగునీరు, నిత్యావసర సరుకులు ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. సివిల్‌సప్లయ్ విభాగం ద్వారా ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని తెలిపారు. జిల్లా అంతటా రెండురోజుల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని చెప్పారు. శ్రీకాకుళం నగరంలో గురువారం రాత్రికే పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు. ఏపీఈపీడీసీఎల్ సీఎండీ దొర, సలహాదారు రంగనాథం జిల్లాలో ఉండి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చర్యలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. స్థానికులతో పాటు పక్క జిల్లాల నుంచి రెండు వేల మంది సిబ్బందిని తీసుకువచ్చామన్నారు. ఈయనతోపాటు జాయింట్ కలెక్టర్ కేవీఎన్ చక్రధరబాబు తదితరులు ఉన్నారు. -
కళా దూకుడుకు కళ్లెం!
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: ఒక దెబ్బకు రెండు పిట్టలు... అన్నట్లు ఒకేసారి రెండు ప్రయోజనాలు ఆశించి టీడీపీలో ఒక వర్గం చేసిన ‘పోస్టర్లు’ యుద్ధం కథ ఇప్పుడు అడ్డం తిరిగింది. ‘స్థానిక నాయకత్వం ముద్దు... వలస నాయకత్వం వద్దు’ అనే నినాదంతో ఎచ్చెర్ల నియోజకవర్గంలో మంత్రి కళావెంకటరావు దూకుడుకు అడ్డుకట్ట వేయడం ఒక ఎత్తు అయితే, ఈ నెపాన్ని ప్రత్యర్థి పార్టీ నాయకులపై నెట్టేసి టీడీపీ పట్ల సానుకూల వైఖరి కలిగించాలనేదీ మరో ఎత్తు! ఈ పోస్టర్లు అంటించినవారెవ్వరైనా సరే చర్యలు తీసుకోవాలంటూ పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులిచ్చి హడావుడి చేసిందీ టీడీపీ నాయకులే! సీసీ కెమెరాల ఫుటేజీ పుణ్యమాని అసలు విషయం బట్టబయలైంది! అనుమానితులను అదుపులోకి తీసుకున్నా కేసు నమోదుకు తర్జనభర్జన పడటం ఇప్పుడు పోలీసుల వంతు అయ్యింది! ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి వలసలను ప్రోత్సహిస్తూ ఇటీవల కాలంలో మంత్రి కిమిడి కళావెంకటరావు కాస్త దూకుడుగానే వెళ్తున్నారు. తద్వారా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఎచ్చెర్ల నియోజకవర్గంలోనూ, తన సొంతూరున్న రాజాం నియోజకవర్గంలోనూ పట్టు సాధించాలనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇది సహజంగానే సొంతపార్టీలోని ప్రత్యర్థులకు గుబులురేపింది. ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ను పార్టీలోకి తీసుకురావడమే గాక ఏకంగా రాజాం నియోజకవర్గ ఇన్చార్జిగా చేయడంలో కళా పాత్ర ఉందని ప్రతిభాభారతి లోలోన రగిలిపోతున్నారు. అమరావతిలో అధినేత చంద్రబాబు ముందు మాత్రం ‘తమ్ముడు (కొండ్రు)తో కలిసి పనిచేసుకుంటాం’ అని ఆమె చెప్పినప్పటికీ నియోజకవర్గంలో ఆమె పట్టు పూర్తిగా తగ్గిపోతోంది. ఇప్పటికే రాజాంలో కళా వర్గం ఆధిపత్యాన్ని తట్టుకోలేకపోతున్న ఆమె మంత్రి అచ్చెన్న గ్రూపులోకి చేరిపోయారు. కింజరాపు కుటుంబంతో కళా వైరం సుదీర్ఘకాలంగా ఉన్నదే. జడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, ఆమె భర్త టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ వర్గం ఎచ్చెర్ల నియోజకవర్గంలో మంత్రి కళాకు వ్యతిరేకంగా పనిచేస్తుందనే విషయంలో గతంలో పలుమార్లు రుజువైంది. ఇటీవల పొన్నాడ పంచాయతీ పరిధిలోని ముద్దాడపేట ఇసుక ర్యాంపు రద్దు అవడానికీ కళాయే కారణమని బాబ్జీ వర్గం గట్టిగా నమ్ముతోంది. మంత్రి అచ్చెన్న మద్దతుతో ర్యాంపు అనుమతులు తెచ్చుకుంటే జిల్లా అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి రద్దు చేయించారనే మిసతో అప్పటి నుంచీ కళాపై కారాలుమిరియాలు నూరుతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపైనే పోరు... కళావెంకటరావు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో నూ ఉన్నారు. ఆయనే లక్ష్యంగా పోస్టర్లు వెలవడం, వాటి వెనుక సొంత పార్టీలోనే కొంతమంది ప్రోత్సాహం ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ‘స్థానిక నాయకత్వం ముద్దు... వలస నాయకత్వం వద్దు’ అనే నినాదాలతో ముద్రించిన పోస్టర్లు ఈనెల 6వ తేదీ అర్ధరాత్రి ఎచ్చెర్ల నియోజకవర్గంలో వెలిశాయి. ముఖ్యంగా జాతీయ రహదారి వెంబడి రణస్థలం మండలంలోని కోష్ట, పతివాడిపాలెం, పైడిభీమవరంతో పాటు లావేరు మండలంలోనూ ఇవి గోడలపై కనిపించాయి. వాటితో నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణుల్లో కలకలం రేగింది. దీంతో ఆ పోస్టర్లు అంటించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎచ్చెర్ల, రణస్థలం పోలీసు స్టేషన్లలో ఎచ్చెర్ల ఎంపీపీ బీవీ రమణారెడ్డి, రణస్థలం ఎంపీపీ గొర్లె విజయ్‌కుమార్ ఫిర్యాదు చేశారు. అసలు ఈ పోస్టర్ల వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవ్వరో తెలుసుకోవడానికి కళా వర్గం కూడా క్షేత్రస్థాయిలో ఆరాతీసింది. ఈ వ్యవహారంలో చౌదరి బాబ్జీ అనుచరుల పాత్ర ఉండే ఉంటుందనే సందేహాలు వచ్చాయి. అయితే ఈ నెపాన్ని ప్రత్యర్థి పార్టీలోని నాయకులపై నెట్టేసేందుకు టీడీపీ నేతలే తప్పుడు ప్రచారాన్నీ ప్రారంభించారు. కానీ ఆ పప్పులు ఉడకలేదు. తమ్మినేని సంతోష్ పాత్ర... ఆమదాలవలస ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌కు బంధువునంటూ తమ్మినేని సంతోష్ అనే వ్యక్తి జిల్లాలోని పలు ఇసుక ర్యాంపులను కొల్లగొడుతున్న సంగతి బహిరంగ రహస్యమే. గుంటూరు మాఫియాతో కలిసి దూసి ర్యాంపులో సుదీర్ఘకాలం ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో ఇతనిదే కీలక పాత్ర! ఇటీవల వంశధార నదిలో ఇసుక అక్రమ రవాణాకు సంబంధించిన 25 లారీలు, నాలుగు జేసీబీలు అడ్డంగా దొరికిపోయిన వ్యవహారంలోనూ ఇతని పేరు ప్రముఖంగా వినిపించింది. నిఘా వర్గాల విచారణలోనూ ఇది రుజువైనట్లు తెలిసింది. అయితే 6వ తేదీన పోస్టర్లు అంటింపు బాధ్యతను సంతోషే తన భుజాలపై వేసుకున్నారనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. చిలకపాలెం టోల్గేట్తో పాటు జాతీయ రహదారిపైనున్న సీసీ కెమెరాలలో రికార్డయిన ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. దాని ఆధారంగా శ్రీకాకుళానికి చెందిన కొంతమంది యువకులను ఎచ్చెర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం వారిని విచారిస్తే సంతోష్ పేరు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. అవినాష్‌తో స్నేహసంబంధాలు చౌదరి బాబ్జీ కుమారుడు అవినాష్, తోటపాలెం ఎంపీటీసీ సభ్యుడు గురు జగపతిబాబులకు తమ్మినేని సంతోష్ స్నేహితుడు. ఈ స్నేహంతోనే అవినాష్, సంతోష్ ఇద్దరూ కలిసి గతంలో దూసి ఆర్ఎస్ వద్ద ర్యాంపు నిర్వహణకు ఏర్పాట్లు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ‘సాక్షి’ కథనాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తమ్మినేని సీతారాం నిరసనలతో అధికారులు ఆఖరి నిమిషంలో ఆ ర్యాంపును అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ స్నేహంతోనే సంతోష్ ఈ పోస్టర్ల అంటింపు బాధ్యత అప్పగించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం సంతోష్ పరారీలోనే ఉన్నాడు. కేవలం పోస్టర్లు అతికించిన కుర్రాళ్లను మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అవినాష్, సంతోష్ పేర్లను ఏవిధంగా ఇరికిస్తారంటూ బాబ్జీ వర్గీయుల నుంచి పోలీసులపై ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై జేఆర్ పురం (రణస్థలం) సీఐ వి.రామకృష్ణను సంప్రదించగా... ఇంకా ఈ కేసులో విచారణ కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇంతవరకూ నిందితులు ఎవ్వరనేదీ నిర్ధారించలేదన్నారు. ఏదిఏమైనా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో నున్న కళావెంకటరావుకు వ్యతిరేకంగా పోస్టర్లు అంటించడం, దీనివెనుక సొంత పార్టీ వారి హస్తం ఉండటం చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ - కళావెంకట రావు
-
రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై టీడీపీలో ఉత్కంఠ
-
రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై టీడీపీలో ఉత్కంఠ
సాక్షి, అమరావతి: రాజ్యసభ నామినేషన్ల చివరితేదీ సోమవారంతో ముగియనుండటంతో అమరావతి రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై టీడీపీలో ఉత్కంఠ నెలకొంది. మరో రెండు రోజుల్లో గడువు ముగియనున్నా అభ్యర్థుల ఎంపికకు టీడీపీ కసరత్తు కొలిక్కిరాలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావుతో నేడు భేటీ కానున్నారు. రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికపై వీరితో చర్చించనున్నట్లు సమాచారం. ప్రస్తుత రాజకీయ అవసరాలు, సామాజిక సమీకరణాల్ని బేరీజు వేసుకుని అభ్యర్ధుల కసరత్తు ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. కేవలం రెండు సీట్లకే పోటీచేయాలని టీడీపీ భావిస్తోంది. రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికలో తమ సామాజిక వర్గానికే పెద్ద పీట వేస్తారని ఎస్సీ, బీసీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు తమకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని మాదిగ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దేశ రాజధానిలో టీడీపీకి పూర్వ వైభవం తెచ్చేలా రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిక ఉండాలని పార్టీ వర్గాలు కోరుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపికతోపాటు టీటీడీ బోర్డు చైర్మన్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. -
'కళా వెంకట్రావు లేఖలో బాష సరిగ్గా లేదు'
-
టీడీపీలో ‘కళా’కలం!
-
టీడీపీలో ‘కళా’కలం!
► కళాకు మంత్రి పదవిపై రేగిన అసంతృప్తి ► అలకబూనిన సీనియర్ నాయకుడు శివాజీ ► గౌతు కుటుంబం రాజీనామాపై వదంతులు ► ‘కాళింగు’లకు ప్రాధాన్యలోపంపైనా చర్చలు సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: టీడీపీలో వర్గపోరు మొదలైంది. కింజరాపు కుటుంబానికి బద్ధ వ్యతిరేకిగా ముద్ర పడిన కిమిడి కళావెంకటరావుకు మంత్రి పదవి రావడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. జిల్లాలో ఇద్ద రు మంత్రులు అచ్చెన్నాయుడు, కళావెంకటరా వుల మధ్య వైరం చూస్తే ఒక ఒరలో రెండు కత్తులు ఇమడలేవనే వాదనలు వినిపిస్తున్నాయి. మరో వైపు ‘ఒక్క చాన్స్’ అంటూ మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న సీనియర్ నాయకుడు గౌతు శ్యామసుందర శివాజీకి భంగపాటు కలగడంతో ఆయన అలక పాన్పు ఎక్కారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, గతంలో ఒక్కసారి మంత్రిగా పనిచేసినా కనీసం ఆయన పేరును కూడా అధిష్టానం పరిశీలనలోకే తీసుకోకపోవడం గమనార్హం. అలాగే తమకు సరైన గుర్తింపు ఇవ్వలేదంటూ జిల్లాలో బలమైన సామాజిక వర్గాల్లో ఒకటైన కాళింగులు కూడా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీ కోసం దీర్ఘకాలంగా పనిచేస్తున్నవారిని పక్కనబెట్టి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, మరో పార్టీలోకి వెళ్లి తర్వాత సొంతగూటికి చేరినవారికే అధిష్టానం గుర్తింపు ఇస్తోందంటూ టీడీపీ వర్గాలు రగిలిపోతున్నాయి. కింజరాపు కుటుంబంతో దీర్ఘకాల వైరం ఉన్న కిమిడి కళావెంకటరావుకు మంత్రి పదవి ఇవ్వడంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటివరకూ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్‌తో సాన్నిహిత్యం పెంచుకోవడంతో కళా సఫలమయ్యారు. దీంతో జిల్లాలో ఎంతమంది వ్యతిరేకించినా కళాకు మంత్రి పదవి ఖాయమైంది. అంతవరకూ బాగానే ఉన్నా పోర్టుపోలియో ఏమి దక్కుతుందనేదీ చర్చనీయాంశమైంది. గతంలో ఎన్టీ రామారావు కేబినెట్లో హోమ్ మంత్రిగా పనిచేసిన కళాకు మళ్లీ హోంశాఖ ఇస్తారనే ధీమాలో ఆయన అనుచరులు ఉన్నారు. అయితే ప్రతిపక్ష నాయకులపై దాడి చేయడమే ప్రాతిపదికగా మార్కులు ఇస్తున్న అధిష్టానం... ఆ కోణంలో చూస్తే అచ్చెన్నాయుడికి హోంశాఖ కట్టబెట్టి అధిక ప్రాధాన్యం ఇస్తారని ఆయన అనుచర వర్గం గట్టిగా నమ్ముతోంది. పాత తగదాలు తెరపైకి... దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడికి సొంతపార్టీలోనే కళా వెంకటరావు నుంచి తీవ్ర వ్యతిరేకత ఉండేది. వాస్తవానికి ఎచ్చెర్ల నుంచి గెలిచిన కళాకు ప్రారంభంలోనే మంత్రి పదవి దక్కుతుందని అంతా ఆశించారు. కానీ ఎర్రన్నాయుడు ఆకస్మిక మరణం నేపథ్యంలో ఆయన సోదరుడు అచ్చెన్నాయుడికి చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు. ఇది సీనియర్ నాయకుడు శివాజీ వర్గానికి అశనిపాతమైంది. అప్పుడే ఆయన అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయబోనని, ఈ ఒక్కసారి మంత్రి పదవి ఇవ్వాలని 2014 ఎన్నికల సమయంలోనే శివాజీ షరతు పెట్టినా అధిష్టానం పట్టించుకోకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆయన కుమార్తె శిరీషకు పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టి తాత్కాలికంగా శాంతింపజేశారు. కానీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో నూ శివాజీకి మొండిచేయి చూపడాన్ని గౌతు కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. అధిష్టానం వైఖరికి నిరసనగా పార్టీ పదవికి రాజీ నామా చేయడానికి సైతం శిరీష సిద్ధమయ్యారంటూ వదంతులు వచ్చాయి. తనకు కాకుండా కళా వెంకటరావుకు మంత్రి పదవి ఇవ్వడంతో శివాజీ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆయన అనుచర వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా జిల్లాలో బలమైన సామాజికవర్గాల్లో ఒకటైన కాళింగులకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం కూడా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ విప్‌కు కూన రవికుమార్‌కు మంత్రి పదవి లేదా ప్రభుత్వ చీఫ్ విప్ పదవి అయినా ఇస్తారని ఆ శించినా అవేవీ నెరవేరలేదు. ఇక హోంశాఖ కోసం కళా వెంకట రావు, అచ్చెన్నాయుడి మధ్య తీవ్ర పోటీ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం కళా వెంకటరావు ప్రమాణస్వీకారం చేసినా రాత్రి వరకూ పోర్టుపోలియో ప్రకటించకపోవడంతో ఎవ్వరికి హోం దక్కుతుందనే విషయంలో జిల్లాలో ఆసక్తిగా మారింది. ఒకవేళ కళా కే హోంశాఖ ఇస్తే కింజరాపు కుటుంబంపై ఆయన ఆధిపత్యానికి గండి పడుతుందనే చర్చ నడుస్తోంది. అలాగే ప్రతిపక్షంపై విరుచుకుపడటంలో చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టేసిన అచ్చెన్నాయుడికే హోంశాఖతో ప్రమోషన్ ఇస్తారని ఆయన అనుచర గణం గట్టిగా చెబుతోంది. ఎవ్వరికి ప్రాధాన్యం లభిస్తుందో చూడాలి మరి. -
బంగ్లా టు కోట..!
⇔ టీడీపీలో మరో వపర్ సెంటర్ ⇔ బంగ్లా రాజకీయాలకు బ్రేక్ ⇔ బొబ్బిలి రాజులకు ప్రాధాన్యం ⇔ తగ్గుతున్న అశోక్ ప్రాబల్యం ⇔ శత్రుచర్ల రాకతో మొదలు ⇔ సుజయకృష్ణ మంత్రి పదవితో పతాక స్థాయికి చేరిన వైనం ⇔ కళా వెంకటరావు డైరెక్షన్లో వ్యూహాత్మక అడుగులు ⇔ అశోక్ అనుచరులల్లో కలవరం సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీలో మరో ‘పవర్’ సెంటర్ తయారైంది. వర్గ పోరు తారాస్థాయికి చేరింది. బంగ్లా రాజకీయా లకు బ్రేక్ పడింది. బొబ్బిలి రాజులకోట మరో రాజకీయ వేదిక కాబోతోంది. ఇన్నాళ్లు జిల్లాలో పార్టీ పెద్ద దిక్కుగా నిలిచిన అశోక్ గజపతిరాజుకు ప్రాధాన్యం మసకబారుతోంది. అధిష్టానం వద్ద పట్టు సడలుతోంది. ఆయనకు తెలియకుండా పార్టీలో వ్యవహారాలు సాగిపోతుండడమే దీనికి నిదర్శనం. అశోక్‌ను సంప్రదించకుండా బొబ్బిలి ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చారనే వాదన బలం గా విన్పిస్తోంది. బంగ్లా ఆధిపత్య రాజకీయాలకు బ్రేక్ పడినట్టు ప్రచారం జోరందుకుంది. జిల్లాలో ని రాజకీయ పరిణామాలు అశోక్ అనుచరులను కలవరపెడుతున్నాయి. ఆలోచనలో పడేశాయి. తగ్గిన ప్రాధాన్యం.. పూసపాటి అశోక్ గజపతిరాజు జిల్లా టీడీపీలో తిరుగులేని నేత. కేంద్రమంత్రిగా ఉన్నప్పటికీ మొన్నటివరకు తనే టీడీపీ రాజకీయాలను శాసించారు. ఏ విషయంలోనైనా తనదే పైచేయి. పార్టీ, అధికారిక నిర్ణయాలన్నీ తన కనుసన్నల్లోనే నడిచాయి. రాష్ట్ర మంత్రిగా కిమిడి మృణాళిని ఉనప్పటికీ బంగ్లా వేదికగానే రాజకీయాలు కొనసాగాయి. మిగతా నేతల మాదిరిగానే అశోక్ గజపతిరాజుతో కలిసి మృణాళిని నడిచారు. ఇప్పుడా ఆధిపత్యానికి బ్రేక్ పడింది. తనకు తెలియకుండానే అధిష్టానం మరో పవర్సెంటర్ను తెరచింది. కళా వెంకటరావు డైరెక్షన్లో.. అశోక్ గజపతిరాజుపై నమ్మకం సడలిందో...ఈయనతో భవిష్యత్ రాజకీయాలు చేయలేమనో... అశోక్‌కు మరో ప్రత్యామ్నాయంగా మరో కోటరీ ఉండాలనో తెలియదు గాని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు చెప్పినట్టుగా అధిష్టానం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. జిల్లాలో కళా వెంకటరావు ప్రాబల్యాన్ని దశలవారీగా పెంచి తద్వారా అశోక్ ఆధిపత్యానికి గండి కొడుతూ వస్తోంది. అశోక్‌కు నచ్చని నిర్ణయాలు తీసుకుని మానసికంగా బలహీనం చేస్తోంది. కాంగ్రెస్‌లో అనేక పర్యాయాలు మంత్రిగా పనిచేసిన శత్రుచర్ల విజయరామరాజును పార్టీలోకి తీసుకొచ్చి అశోక్ ప్రాబల్యాన్ని తగ్గించే భీజం వేసింది. విజయనగరం రాజులు వ్యతిరేకించినా ఫలితం లేకపోయింది. అశోక్ ఆలోచనలకు భిన్నంగా కురుపాం ఇన్చార్జి బాధ్యతలను సైతం శత్రుచర్ల మేనల్లుడికి అప్పగించారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన సుజయకృష్ణ రంగారావును పార్టీలోకి తీసుకు వచ్చారు. సుజయ రాకను అశోక్ తొలుత వ్యతిరేకిం చారని, చంద్రబాబు ఒప్పించడంతో వెనక్కి తగ్గారనే వాదనలు ఉన్నాయి. ఇవన్నీ చాలవన్నట్టు ఇటీవల తన అభిప్రాయానికి భిన్నంగా శత్రుచర్ల విజయరామరాజుకు ఏకంగా శ్రీకా కుళం స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ చేశారు. ఈ నేపథ్యంలో అశోక్‌కు ధీటుగా మరో వర్గానికి ఆజ్యం పోసినట్టు అయ్యింది. అశోక్‌ను పట్టించుకోకుండా... సుజయ్‌కు మంత్రి పదవి ఇవ్వడంలో అశోక్ గజపతిరాజు మాటను పట్టించుకోలేదన్నది సమాచారం. జిల్లాలో మారుతున్న సమీకరణాలను ముందుగానే పసిగట్టిన అశోక్ గజపతిరాజు వ్యూహాత్మకంగా అడుగులు వేయడం ప్రారంభించారు. సుజయకృష్ణ రంగారావుకు మంత్రి పదవి ఇస్తున్నారనే ప్రచారం జోరందుకోగానే తెరవెనుకుండి మంత్రాంగం నడిపించారు.ద్వారపురెడ్డి జగదీష్, కోళ్ల లలితకుమారి, మీసాల గీత, కొండపల్లి అప్పలనాయుడు, గుమ్మడి సంధ్యారాణి తదితరులను తెరపైకి తెచ్చి, సుజయకు వ్యతిరేకంగా స్వరం విన్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు బోగట్టా. ఆయనిచ్చిన భరో సాతోనే సదరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేరుగా సీఎం వద్దకు వెళ్లి సుజయకృష్ణకు మంత్రి పదవి ఇవ్వొద్దని, బీసీలకు ఇవ్వాలని, తమలో ఏ ఒక్కరికిచ్చినా ఫర్వాలేద ని, ఓసీకిస్తే పార్టీకి నష్టం అన్న వాదన వినిపించారు. పక్కా వ్యూహంతోనే సుజయకృష్ణకు వ్యతిరేకంగా పావులు కదిపారు. అయితే, సీఎం చంద్రబాబు ఇవేవీ పట్టిం చుకోలేదు. పార్టీలో లోకేష్ డామినేషన్ పెరిగిందో... అశోక్‌ను నమ్ముకుంటే కష్టమని చంద్రబాబు భావించారో తెలియదు గాని అసమ్మతి నేతల వాదన వినిపించుకోలేదు. అశోక్ సైతం జోక్యం చేసుకుని మనసులో మాట చెప్పినా అధిష్టానం పట్టించుకోలేదని తెలుస్తోంది. మరో రాజకీయ కేంద్రం.. వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మరో రాజకీయ అధికార కేంద్రం ఏర్పాటు చేసేందుకు అధిష్టానం మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. శత్రుచర్లకు ఎమ్మెల్సీ ఇవ్వడం, ఇటీవల జరిగిన సమీక్షలో కళా వెంకటరావు డైరెక్షన్ ప్రకారం సమీక్షలు జరగడం, శత్రుచర్లపై అశోక్ ఫిర్యాదు చేయడం, ఫిర్యాదు చేసినా శత్రుచర్లకే చంద్రబాబు పెద్ద పీట వేయడం, కాదన్నా సుజయకృష్ణకు మంత్రి పదవి ఇవ్వడం వంటివన్ని చూస్తుంటే జిల్లాలో మరో నాయకత్వాన్ని తయారు చేసేందుకు టీడీపీ అధిష్టానం అడుగులు వేసినట్టు స్పష్టమవుతోంది. ఇవన్నీ గమనిస్తున్న అశోక్ అనుచరులు తట్టుకోలేకపోతున్నారు. పార్టీలో ఏం జరుగుతుందోనని కలవరపడుతున్నారు. చెప్పాలంటే బంగ్లా నేతలకు భయం పట్టుకుంది. కొందరు ‘ప్రత్యామ్నా య’ ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం. -
జిల్లా టీడీపీలో ‘కళ’కలం
-
జిల్లా టీడీపీలో ‘కళ’కలం
►సమీక్షల నుంచి పదవుల పందేరం వెనుకా ఆయన ప్రభావమే ►సీనియర్లను పక్కన పెట్టేస్తున్న పరిస్థితి ► అశోక్‌కు పోటీగా వర్గం తయారు ► జిల్లా టీడీపీలో విస్తృత చర్చ జిల్లా టీడీపీలో మరోవర్గం బలపడుతోందా... పార్టీకి పెద్ద దిక్కుగా ఇన్నాళ్లు నిలిచిన అశోక్‌గజపతిరాజుకు ప్రాధాన్యం తగ్గుతోందా... ఆయనకు తెలియకుండానే పార్టీలో కొన్ని వ్యవహారాలు నడుస్తున్నాయా... రాష్ట్ర పార్టీ అధ్యక్షుడైన కళావెంకటరావు ప్రభావం జిల్లాలో పెరుగుతోందా... సమీక్షల నుంచి... పదవుల కేటాయింపు వరకూ ఆయన సూచనల మేరకే సాగుతోందా... జిల్లాలో ఇప్పుడు మరో పవర్‌సెంటర్ తయారవుతోందా... దీని వెనుక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి చిన్నబాబు కోటరీని బలోపేతం చేస్తున్నారా... ఇప్పుడు జిల్లా పార్టీలో ప్రధానంగా జరుగుతున్న చర్చ ఇదే. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే... అక్షరాలా అది నిజమేనేమోనని అనిపిస్తోంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లా తెలుగుదేశం పార్టీలో సమీకరణాలు మారుతున్నాయి. కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుపై నమ్మకం సడలిందో, ఈయనతో భవిష్యత్ రాజకీయాలు చేయలేమనో, లోకేష్ తనకంటూ కోటరీని తయారు చేసుకుంటున్నారో తెలియదు గాని జిల్లా పార్టీలో కళా వెంకటరావు ప్రభావం ఎక్కువవుతోంది. పార్టీ పదవుల్లో కీలకంగా వ్యవహరిస్తున్న లోకేష్, కళా వెంకటరావుల మధ్య బంధం పెరగడంతో ఒకప్పుడు రాష్ట్ర పార్టీలోనే నంబర్ టూగా భావించే అశోక్ గజపతిరాజు ప్రాధాన్యం తగ్గుతూ వస్తున్నట్టు స్పష్టమవుతోంది. కళౠ చెప్పినట్టే అదిష్టానం నడుచుకుంటున్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సుజయకృష్ణరంగారావును పార్టీలో చేర్చుకోవడం, ఆయనకు మంత్రి పదవి భరోసా లభించడం, శత్రుచర్లకు ఎమ్మెల్సీ ఇవ్వడం వంటివి అందులో భాగమని విశ్లేషించుకుంటున్నాయి. పవర్‌సెంటర్ మార్చడమే లక్ష్యంగా... ఎన్నికలకు ముందు శత్రుచర్ల విజయరామరాజును పార్టీలోకి తీసుకొచ్చిందే కళా వెంకటరావు అని అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పుడే అశోక్ ప్రాబల్యాన్ని తగ్గించే బీజం పడ్డట్టు వాదనలు విన్పించాయి. ఇక, లోకేష్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కళా వెంకటరావు నియమితులయ్యాక వ్యూహా లు ఊపందుకున్నాయి. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగరావును చేర్చుకోవడం అశోక్‌కు ఇష్టం లేకపోయినా కళా వెంకటరావు పావులు కదపడంవల్లే మార్గం సుగుమం అయ్యిందనే వాదనలు ఉన్నాయి. అంతేనా... ఆయనకు మంత్రి పదవి ఇప్పించడానికి లోకేష్ నుంచి హామీ కూడా ఇప్పించినట్టు ప్రచారం నడిచింది. అశోక్ బంగ్లా నుంచి పవర్ సెంటర్‌ను మార్చడమే దీని వెనుకున్న లక్ష్యమని తెలిసింది. సమీక్షల వెనుకా... ఆయనే! మూడు రోజుల క్రితం ఉండవల్లిలో జరిగిన పార్టీ సమీక్ష కూడా కళా వెంకటరావు సూచన మేరకే జరిగినట్టు తెలుస్తోంది. ఆయనేదైతే బ్రీఫింగ్ ఇచ్చారో దాని ప్రకారం చర్చించినట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కళా ఇచ్చిన స్క్రిప్టును చంద్రబాబు చదివి విన్పించారని కూడా తెలుస్తోంది. ఎవరెవరిని మందలించాలో, ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలో, ఎవరికి సుతిమెత్తని చురకలంటించాలో కళా వెంకటరావు చేసిన సలహాలు బాగా పనిచేశాయని పార్టీలో చర్చ నడుస్తోంది. చివరికి, ఎమ్మెల్సీ కేటాయింపుల్లో కూడా ఆయన మార్కే కన్పించిందంటున్నారు. జిల్లాలో శోభా హైమావతి, గద్దే బాబూరావు, ఐ.వి.పి.రాజు, త్రిమూర్తుల రాజు తదితరుల సీనియర్లు ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ పదవి విషయంలో వారినెవ్వరినీ పరిగణనలోకి తీసుకోలేదు. ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన శత్రుచర్లతో సరిపెట్టేశారు. ఈ విషయంలో సీనియర్లకు మొండి చేయి ఎదురైందనే చెప్పుకోవాలి. శత్రుచర్లకు ఎమ్మెల్సీ పదవి వెనుక కళా... కళా పదును పెట్టిన వ్యూహంలో భాగంగానే శత్రుచర్ల విజయరామరాజుకు ఎమ్మెల్సీ సీటు కేటాయించినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయినా, పార్టీలో సీనియారిటీ లేకపోయినా తనకంటూ వర్గాన్ని తయారు చేసుకోవాలన్న ఆలోచనలో భాగంగా సమీకరణలు పక్కన పెట్టి శత్రుచర్లకు ఎమ్మెల్సీ ఇప్పించినట్టు వాదనలు ఉన్నాయి. ఉండవల్లి సమీక్షలో శత్రుచర్లపై అధినేతకు అశోక్ చేసిన ఫిర్యాదు వెనుక ఈ అక్కసు ఉందనే గుసగుసలు విన్పించాయి. ఫిర్యాదు చేసినా చంద్రబాబు పట్టించుకోకుండా శత్రుచర్లకు కురుపాం పగ్గాలు అప్పగించడం వెనక కళా డైరెక్షన్ కారణమనే వాదనలు కొనసాగుతున్నాయి. భవిష్యత్‌లో సుజయకృష్ణ రంగారావుకు మంత్రి పదవి ఇప్పించే విషయంలోనూ కళా పావులు కదుపుతున్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
కళా x చౌదరి!
ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమైంది. ఈ నియోజకవర్గం పరిధిలో ముఖ్యమంత్రి పర్యటనకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. అధికారికంగా ఖరారు కానప్పటికీ.. జనవరి మెుదటి వారంలో పర్యటన ఉండే అవకాశం ఉంది. ఎస్ఎంపురం పరిధిలో ట్రిఫుల్ ఐటీ భవనాలకు శంకుస్థాపన, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో రూ.18 కోట్లుతో నిర్మించిన అకడిమిక్ బ్లాక్ ప్రారంభోత్సవం, ఎస్.ఎం.పురం గ్రామంలో జన్మభూమి గ్రామ సభ నిర్వహించేలా కార్యక్రమాలను అధికారులు రూపొందించారు. ఈ మేరకు ఇప్పటికే జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం స్థలాల పరిశీలన, అధికారులకు పలు సూచనలు సైతం చేశారు. అయితే జెడ్పీ చైర్‌పర్సన చౌదరి ధనలక్ష్మి సొంతఊరు, దత్తత గ్రామమైన ఎస్.ఎం.పురంలో జన్మభూమి–మన ఊరు కార్యక్రమాన్ని రద్దు చేయాలని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనరసింహానికి ఫోన్ చేసి కోరడంతోపాటు.. తన నియోజక వర్గంలో తనకు తెలియకుండా గ్రామ సభ ఎలా నిర్వహిస్తారని నిలదీయడంతో రద్దు చేసినట్టు తెలిసింది. దీంతో ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా తమ సొంత గ్రామంలో జన్మభూమి–మన ఊరు గ్రామ సభ రాజకీయంగా బలపడాలని, తమవర్గాన్ని బలోపేతం చేసుకోవాలన్న జెడ్పీ చైర్పర్సన్ వ్యూహం బెడిసి కొట్టింది. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దృష్టికి సైతం ఈ విషయాన్ని చైర్పర్సన్ భర్త, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు నారాయణమూర్తి (బాబ్జీ) తీసుకెళ్లారు. అయితే ప్రస్తుతానికి ఈ విషయంలో మంత్రి జోక్యం చేసుకోలేదని సమాచారం. మరోపక్క జెడ్పీ చైర్పర్సన్ వర్గాన్ని నిర్వీర్యం చేసేందుకు ఎమ్మెల్యే కళావెంకటరావు కసరత్తులు ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది. ఎస్ఎంపురంలో గ్రామ సభను పెట్టకుండా అడ్డుకోవటం ఎంత వరకు న్యాయమనే అంశంపై చైర్పర్సన్ భర్త బాబ్జీ ఎచ్చెర్ల మండల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన కొంతమంది వాట్సాఫ్‌లో సమాచారాన్ని ఎమ్మెల్యే కళావెంకటరావుకు చేరవేశారు. కళా, చౌదరి వర్గాల మధ్య వర్గపోరుకు ఈ సంఘటన ఉదాహరణగా ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. సొంత సామాజిక వర్గం దూరం! సొంత సామాజిక వర్గానికి చెందిన నాయకులే చౌదరి దంపతులకు దూరమవుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొయ్యాం గ్రామానికి చెందిన ఓ నాయకుడుని జెడ్పీచైర్‌పర్సన్ వర్గం పార్టీలో చేర్చుకోవడానికి అనుమతులు ఇవ్వగా..దాన్ని కళా వర్గం అడ్డుకుంది. తరువాత ఎమ్మెల్యే చుట్టూ ప్రదక్షిణలు చేశాక ఎట్టకేలకు అతన్ని చేర్చుకున్నారు. ఎచ్చెర్ల మండలంలో చైర్పర్సన్ సొంత సామాజిక వర్గం నాయకులే ఆమెకు అండగా నిలబడే పరిస్థితులు కనిపించటం లేదు. ప్రస్తుత చైర్పర్సన్ భర్త బాబ్జీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైర్మన్ పేనల్గా ఉన్న ఆయన భార్య ధనలక్ష్మికి జెడ్పీటీసీ టిక్కెట్ రాకుండా సైతం కళావర్గం అడ్డుకుంది. దీనికి చౌదరి బాబ్జీ సొంత సామాజక వర్గానికి చెందిన కొత్తపేట నాయకులే వ్యూహాన్ని ముందుండి నడిపారు. ప్రస్తుతం 28 పంచాయతీల్లో ఫరీదుపేట, కేశవరావుపేట, కుశాలపురం గ్రామాల నాయకులు మాత్రమే బాబ్జీకి అండగా ఉంటున్నారు. మిగతా వారందరు కళా వర్గానికి చేరువవుతున్నారు. కొత్తగా పార్టీలో చేరిన కొ య్యాం, అజ్జరాం నాయకులు సైతం ఎమ్మెల్యే వర్గంతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. జెడ్పీ చైర్పర్సన్ హోదా, మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్నాయుడు మద్దతు చౌదరి దంపతులకు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే వర్గాన్ని ఎదుర్కొనే పరిస్థితులు కనిపించటం లేదు. చాపకింద నీరులా చౌదరి బాబ్జీ కుటుంబాన్ని రాజకీయంగా అణగ తొక్కాలన్న ప్రయతాన్ని కళావెంకటరావు ప్రారంభించారు. రాజాం నుంచి వలస వచ్చిన ఎమ్మెల్యే కళా వ్యూహాత్మకంగా పావులు కదుపుతుండగా.. స్థానిక నాయకుడైన బాబ్జీ వర్గం దాన్ని తిప్పికొట్టలేక పోతుంది. మరో పక్క సొంత మండలమైన ఎచ్చెర్లలో బాబ్జీ దంపతులకు క్రమేపీ బలం తగ్గుతోంది. భవిష్యత్తులో కళావెంకటరావు మంత్రి అవుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన పంచన చేరేందుకు తెలుగుదేశం పార్టీకి చెందిన మండల, గ్రామస్థాయి నాయకులు ఆయనకు దగ్గరయ్యేకు ప్రయత్నిస్తున్నారు. -
కళా వెంకట్రావు కుమర్తె నిశ్చితార్ధ వేడుక
-
రాజాంలో రచ్చ!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో అధికారుల బదిలీల నుంచి ప్రభుత్వపరంగా తీసుకొనే నిర్ణయాల వరకూ ప్రతి విషయంలో తమదే పైచేయి అని నిరూపించుకునేందుకు ఒకవైపు మంత్రి అచ్చెన్నాయుడు వర్గం, మరోవైపు కిమిడి కళా వెంకటరావు వర్గం యథాశక్త్తి ప్రయత్నం చేస్తున్నాయి. మంత్రి ప్రత్యర్థి వర్గం తమ పంతం నెగ్గించుకునేందుకు వీలైతే పొరుగు జిల్లా నేతల సహకారం కూడా తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో రాజాం నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలు అందుకు బలం చేకూర్చుతున్నాయి. ఇటీవల రాజాంలోని శ్రీవేదగాయత్రి జూనియర్ కళాశాలను జీఎన్ఆర్ జూనియర్ కళాశాలకు సమీపంలోకి తరలించారు. ఇది నిబంధనలకు విరుద్ధమంటూ జీఎన్ఆర్ కళాశాల యాజమాన్యం అధికారులకు ఫిర్యాదు చేసింది. అయినా ఫలితం లేకపోవడంతో యాజమాన్య ప్రతినిధులు సంతకవిటి మండల నాయకుడు కొల్ల అప్పలనాయుడు ద్వారా మంత్రి అచ్చెన్నాయుడును కలిశారు. మంత్రి ఆదేశాలతో ఆర్ఐవో వి.పాపారావు గత ఆదివారం శ్రీవేద గాయత్రి కళాశాలను సీజ్ చేశారు. దీంతో ఈ కళాశాల ప్రతినిధులు కళావెంకట రావును ఆశ్రయించారు. ఆయన సూచనలతో విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావును కలిశారు. ఆయన ఆదేశాలతో 24 గంటలు తిరగకముందే కళాశాలను తిరిగి తెరిచారు. రాజాం నగరపంచాయతీ కమిషనర్ పి.సింహాచలం ఎమ్మెల్సీ ప్రతిభాభారతికి అనునూయుడి ముద్రపడిపోయింది. ఏ పని జరగాలన్నా, చివరికి కుళాయి కనెక్షన్ కావాలన్నా ఎమ్మెల్సీకి తెలియకుండా జరగవనే ప్రచారం కూడా జరిగింది. కమిషనర్ తీరు బాగాలేదంటూ ఇటీవల రాజాం, సంతకవిటి మండలాలకు చెందిన టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు మంత్రి అచ్చెన్నాయుడుకు ఫిర్యాదు చేశారు. ఇదే అదనుగా భావించిన మంత్రి... తక్షణమే రాజాం కమిషనర్‌ను బదిలీ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అంతేగాకుండా ఎంతటి స్థాయి నాయకుడు అడ్డుపడినా బదిలీని ఆపొద్దని మరీ ఆదేశాలిచ్చారట. కానీ కళావెంకటరావు, ప్రతిభాభారతి పట్టుబట్టి మరీ కమిషనర్ బదిలీని నిలుపుదల చేయించేశారు. రాజాం ఏఎంసీ చైర్మన్ పదవి విషయంలోనూ మంత్రి అచ్చెన్నాయుడికి ఎదురుదెబ్బ తగిలిందనే ప్రచారం జరుగుతోంది. ఈ పదవికి వంగర మండలానికి చెందిన పైల వెంకటరమణ పేరును ఎమ్మెల్సీ ప్రతిభాభారతి సూచించారు. మంత్రి మాత్రం సంతకవిటి మండలంలో తన అనుచరుడైన కొల్ల అప్పలనాయుడు పేరును తెరపైకి తెచ్చారు. ఇది ఇరువర్గాల మధ్య పంచాయతీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరకూ వెళ్లింది. చివరకు ప్రతిభాభారతి మాట కే సీఎం ప్రాధాన్యం ఇచ్చారనే గుసగుసలు అధికార పార్టీలో వినిపిస్తున్నాయి. ఈ సంఘటనలే గాకుండా రాజాం నియోజకవర్గంలోని అధికారులు కూడా మంత్రి సిఫారసు లేఖలకు విలువ ఇవ్వట్లేదనే ప్రచారం జరుగుతోంది. రాజాంలోని గాయత్రీ కాలనీలో స్థల వివాదం ఒక్కటి మంత్రి అచ్చెన్నాయుడి వద్దకు ఇటీవల వెళ్లింది. తనను ఆశ్రయించిన వర్గానికి అనుగుణంగా వివాదం పరిష్కరించాలని సూచిస్తూ మంత్రి ఒక లేఖ ఇచ్చారట. తీరా దాన్ని తహసిల్దారు పక్కనబెట్టేయడంతో ఆ వర్గం ఖంగుతిన్నారని తెలిసింది. అవతల వర్గానికి ప్రతిభాభారతి అండదండలు ఉండటమే దీనికి కారణమని ప్రచారం జరిగింది. -
శ్రీవారిని దర్శించుకున్న కళా వెంకట్రావ్
తిరుమల: తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు కె.కళా వెంకట్రావ్ గురువారం దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు ప్రముఖ హాస్య నటుడు ధన్‌రాజ్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే చిత్తూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన జయలక్ష్మీ కూడా శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
నీళ్లు నమిలిన కళా వెంకట్రావు
విజయవాడ : పార్టీ ఫిరాయింపులపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఆంధ్ర్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు కె. కళా వెంకట్రావు నీళ్లు నమిలారు. ఆదివారం విజయవాడలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను పార్టీలోకి తీసుకోవడంపై కళా వెంకట్రావుకు విలేకర్లు కొన్ని ప్రశ్నలు సంధించారు. అందులోభాగంగా ఫిరాయింపులను వ్యతిరేకిస్తూ గతంతో మహానాడులో టీడీపీ తీర్మానం చేసింది కదా... మరీ ఇప్పుడు ఇదేమిటి అని కళా వెంకట్రావును విలేకర్లు ప్రశ్నించారు. దీనిపై ఆయన తన సమాధానాన్ని దాటవేశారు. అభివృద్ధిలో భాగస్వాములు కావడానికే ఎమ్మెల్యేలు వస్తున్నారంటూ జవాబు ఇచ్చారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్లో టీడీపీ ఎమ్మెల్యేలు చేరికలను కూడా ఇదే కోణంలో చూస్తారా ?అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు కూడా కళా వెంకట్రావు సమాధానం దాట వేశారు. -
ముద్రగడ దీక్ష విరమణ
-
ముద్రగడ దీక్ష విరమణ
సర్కారు హామీలకు అంగీకరించిన ముద్రగడ (కిర్లంపూడి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): సహధర్మచారిణి పద్మావతితో కలిసి 4 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేసిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సోమవారం మధ్యాహ్నం దీక్షను విరమించారు. ప్రభుత్వం తరఫున చర్చలకు హాజరైన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు, కార్మిక శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అందించిన నిమ్మరసం స్వీకరించి దీక్ష విరమించినట్లు ప్రకటించారు. కాపు జాతి ప్రయోజనాల కోసం తాము చేసిన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, తమ ప్రతినిధుల ద్వారా వర్తమానం పంపినందున దీక్షను విరమిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి చేరిన మంత్రి అచ్చెన్నాయుడు, కళా వెంకటరావు, ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు ముద్రగడతో చర్చించారు. సీఎం చంద్రబాబుతో చర్చించిన మీదట ఆయన అంగీకారంతో ఈ హామీలిస్తున్నట్లు వివరించారు. అంగీకారాన్ని తెల్పిన ముద్రగడ దీక్ష విరమణకు సమ్మతించారు. చర్చలు ఫలప్రదం కావడంతో అచ్చెన్నాయుడు, కళా వెంకటరావు మీడియాకు తెలిపారు. సర్కారు కట్టుబడి ఉంది.. ముద్రగడ కు ఇచ్చిన హామీలను, మాటలను కచ్చితంగా నిలబెట్టుకుంటామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రత్యేక కమిషన్ వేయడం, కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.100 కోట్లు కేటాయించడం ఇందులో భాగమేనన్నారు. బీసీలకు నష్టం లేకుండా కాపు సామాజికవర్గానికి రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. జనవరి 31న తునిలో ఐక్య గర్జన సభ సందర్భంగా జరిగిన విధ్వంసంలో చాలా మందిపై కేసులు నమోదు చేశామనీ, లోతుగా విచారణ చేసిన పిదపే చర్యలు తీసుకుంటామని, అల్లర్లతో సంబంధం లేని వారిని ఇబ్బంది పెట్టబోమని చెప్పారు. పార్టీలో, ప్రభుత్వంలో కాపులపై పూర్తి సానుకూల దృక్పథం ఉందని కళా వెంకటరావు అన్నారు. చర్చలకు ముందుకొచ్చిన ముద్రగడకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. కాపు కార్పొరేషన్‌కు తక్షణమే రూ.500 కోట్లు, ఏటా బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయింపునకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. హామీలు నెరవేరిస్తే కాళ్లు కడుగుతా.. కాపుల ప్రయోజనాల కోసం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికెళ్లి కాళ్లు కడుగుతానని ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. కాపుల రిజర్వేషన్ అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేసి అమలుకు సిద్ధమైతే సీఎం కాళ్లకు మొక్కడానికి వెనుకాడబోమన్నారు. చర్చలు ఫలప్రదం అయిన వెంటనే నిమ్మరసం స్వీకరించిన ముద్రగడ అక్కడే మీడియాతో మాట్లాడారు. ముద్రగడ చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. ‘ఉద్యమానికి పూర్తిగా సహకరించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యజమానులకు, పాత్రికేయులకూ నమస్కారాలు. కాపులను బీసీల్లో కలుపుతామని ఎన్నికల ముందే సీఎం చెప్పారు. ఈ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలోనూ పెట్టారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోగా హామీ నెరవేరుస్తామన్నారు. ఆ విషయాన్ని మర్చిపోయారు. నేను రోడ్డెక్కాక సీఎం చర్చలకు పంపారు. చిన్నచిన్న సడలింపులు ఉన్నప్పటికీ జాతి సంక్షేమం కోసం చర్చలకు అంగీకరించాను. సీఎం గారూ...మిమ్మల్ని కావాలని గానీ...తిట్టాలని గానీ.. అవమానించాలనిగానీ నాకు లేదు. మీరిచ్చిన హామీల వల్లనే రోడ్డెక్కాను. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మీరు ఆలస్యం చేయడంతో ఆకలి కేకలతో ఉన్న కాపు యువత ప్రశ్నించింది. తక్షణ ఉద్యమాన్ని గుర్తు చేసింది. అందుకే దీక్షకు దిగాల్సి వచ్చింది. అయ్యా...మిమ్మల్ని అనరాని మాటలు అని ఉంటాను. క్షమించమని కోరుతున్నాను. మంజునాథ్ కమిషన్ రిపోర్టును తెప్పించుకుని అసెంబ్లీలో తీర్మానం చేయించి కాపుల రిజర్వేషన్‌కు మార్గం సుగమం చేస్తే మీ ఇంటికొచ్చి పళ్లెంలో కాళ్లు పెట్టి కడుగుతా. దయ ఉంచి సీఎం గారూ...మా జాతికి అన్నం పెట్టమని కోరుకుంటున్నాను. రిజర్వేషన్ ఇచ్చేటపుడే క్రీమీలేయర్ పెట్టండి. తక్కువ ఆదాయం ఉన్నవారికే వర్తించేలా చూడండి. బీసీల కోటా వద్దు. మిగతా కోటాలోంచి జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్ కల్పించండి. బీసీల నోటికాడ అన్నం తీయమని చెప్పను. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి. చర్చల ద్వారా ఇచ్చిన హామీలేమిటంటే.. వెంటనే రూ.500 కోట్లను కార్పొరేషన్‌కు ఇస్తామన్నారు. వచ్చే బడ్జెట్ నుంచి ఏటా రూ.1,000 కోట్లు ఇస్తామన్నారు. ఎన్ని అప్లికేషన్లు వచ్చినా పరిశీలించి యువతకు న్యాయం చేస్తామన్నారు. 7 నెలల్లోనే కమిషన్ నివేదిక వచ్చేలా చూస్తామని చెప్పారు. తుని ఐక్య గర్జన సందర్భంగా చాలా మందిపై కేసులు పెట్టారు. అమాయకులపైనా కేసులు పెట్టారు. లోతుగా విచారణ జరిపాకనే అరెస్టులు ఉంటాయన్నారు. ఆ జాబితాను కూడా ఇవ్వమన్నాను. అంగీకరించారు. కమిషన్‌లో సభ్యత్వం కోసం నాలుగు పేర్లు సూచించాను. అందులో ఒకరికి అవకాశం కల్పిస్తామన్నారు. కాపు రిజర్వేషన్ జీవో వల్ల నష్టాలున్నాయని ప్రభుత్వం చెబుతోంది. నమ్ముతున్నాను. సీఎం గారూ...మళ్లీ నన్ను రోడ్డెక్కించవద్దయ్యా...మాట తప్పవద్దు’. మద్దతు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు.. నేను ఉద్యమం మొదలు పెట్టినప్పటి నుంచి పూర్తిగా మద్దతు ప్రకటించిన పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డికి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి, బీజేపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు, టీడీపీ నేతలకు, లోక్‌సత్తా జయప్రకాశ్‌నారాయణ, దళిత నాయకుడు హర్షకుమార్, మాలమహానాడు నేత రత్నాకరరావు, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి, దాసరి, వట్టి, ఆకుల సత్యనారాయణ, వీహెచ్‌లకు రుణపడి ఉంటాను. దీక్షలు విరమించండి..: తనతో పాటు దీక్షలో పాల్గొన్న తన భార్యతోపాటు మిగిలినవారు దీక్ష విరమిస్తున్నట్లు ముద్రగడ పేర్కొన్నారు. తనకు మద్దతు తెలుపుతూ రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు ప్రార ంభించిన వారంతా వెంటనే విరమించుకోవాలని కోరారు. ముద్రగడ అడిగిందేమిటి? ► మాది ఆఖరి పోరాటం, ఆకలి పోరాటం. మమ్మల్ని తక్షణమే బీసీ జాబితాలో చేర్చాలి. ► 1993లో జారీ చేసిన జీవో నంబర్ 30 ఇప్పటికీ సజీవంగానే ఉంది. దానికి చట్టబద్ధత కల్పించాలి ► 1961 అక్టోబర్ 14న ఇచ్చిన జీవో 3250ను పునరుద్ధరించాలి ► కాపుల్ని బీసీలలో చేర్చడానికి కమిషన్ నివేదిక కోసం ఎదురుచూడకుండా జీవో నంబర్ 30, 3250 ఆధారంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (ప్రభుత్వ ఉత్తర్వు)తో బీసీలలో చేర్చాలి ► మంజునాథ కమిషన్ నివేదిక గడువును 9 నెలలకు బదులు మూడు నెలలకు కుదించాలి. ► మేము బీసీ రిజర్వేషన్ల కోటాలో అడగడం లేదు. మాకు ప్రత్యేకంగా ఇవ్వాలి. మా కోసం మరో కేటగిరీ ఏర్పాటు చేయాలి ► ఏడాదికి రూ. 1,000 కోట్లు ఇస్తామన్నారు. రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారు. రెండేళ్లయినందున మిగిలిన రూ.1,900 కోట్లు తక్షణమే విడుదల చేయాలి. ► కాపు ఐక్య గర్జన సందర్భంగా జరిగిన హింసాకాండకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మా జాతిపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేయాలి. ప్రభుత్వం ఇస్తానంటున్నదేమిటి? ► జీవో నంబర్ 30, 3250ల ప్రస్తావనే లేదు ► ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ గురించి మాట్లాడలేదు. ► మంజునాథ కమిషన్ ఏర్పాటై ఇప్పటికే 2 నెలలు కావొస్తున్నందున మరో 7 నెలలు ఆగాలి. ► కాపు కార్పొరేషన్‌కు ఇప్పుడు రూ. 500 కోట్లు. (రెండేళ్ళ బకాయిల్లో మిగిలిన రూ. 1400 కోట్లు ఊసు లేదు) ళీ వచ్చే బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయిస్తాం. ళీ ఈ ఏడాదికి కాపు కమిషన్‌కు వచ్చే అన్ని రుణ దరఖాస్తులు పరిశీలించి పరిష్కారం. ► మంజునాథ కమిషన్‌లో ముద్రగడ సూచించిన వ్యక్తికి చోటు. (నాలుగు పేర్లు ఇచ్చినట్లు ముద్రగడ చెప్పారు) ళీ ఉద్యమంలో పాల్గొన్న వారిపై కేసులు ఉండవు. కానీ, అల్లర్లపై లోతైన దర్యాప్తు అనంతరం నిందితులపై కఠిన చర్యలుంటాయి. -
మంటలు రేపుతున్న మంత్రాంగం!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ‘మూడు గ్రూపులు.. ఆరు వివాదాలు’.. అన్నట్లు తయారైంది. ప్రధానంగా మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్ రవికుమార్, సీనియర్ ఎమ్మెల్యే కళా వెంకటరావులు కేంద్రంగా అధికార పార్టీ రాజకీయాలు సాగుతున్నాయి. మిగతా ఎమ్మెల్యేలకు పెద్దగా విలువ లేకపోవడంతో వారు అంటీముట్టనట్లుగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ, ప్రభుత్వం పరంగా వారికి ఎలాంటి ప్రాధాన్యత లభించడం లేదన్న ఆరోపణలు పార్టీవర్గాల నుంచే వినిపిస్తున్నాయి. ప్రోటోకాల్ పేరుతో కూడా పలువురిని పక్కన పెట్టడం కూడా తెలుగు తమ్ముళ్లను నైరాశ్యంలోకి నెట్టేస్తోంది. దీంతో జిల్లాలో పార్టీ పరిస్థితులను కొందరు ఎప్పటికప్పుడు అధిష్టానం దృష్టికి తీసుకువెళుతున్నారు. ఇటీవల ఎచ్చెర్ల నియోజకవర్గంలో అధికారికంగా నిర్వహించిన ఓ కార్యక్రమానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే కళా వెంకట్రావుకు చెప్పకపోవడంపై ఆయన వర్గం గుర్రుగా ఉంది. ఆ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్న అంతా తానై వ్యవహరించడం ఎమ్మెల్యే వర్గీయులకు మింగుడు పడలేదు. దీనిపై కళా వెంకట్రావు తన సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలాగే ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌ను కేవలం ఆమదాలవలస నియోజకవర్గానికే పరిమితం చేసేందుకు మంత్రి ప్రయత్నిస్తుండడాన్ని ఆయన వర్గం వ్యతిరేకిస్తోంది. గతంలో ఎక్కడ ఏం జరిగినా తామంతా కలిసే ఉన్నామని చూపించేందుకు ప్రయత్నించిన నాయకగణం ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తోంది. ఇతర నియోజకవర్గాల్లో నిర్వహించే కార్యక్రమాలకు విప్‌ను పిలవకపోడం కూడా ఇందుకు ఊతమిస్తోంది. ఆజ్యం పోస్తున్న సంబరాల సంతర్పణ హుద్‌హుద్ తుపాను సాయం పంపిణీలో జన్మభూమి కమిటీల ముసుగులో ఉన్న టీడీపీ సభ్యులు చెప్పినవారికే లబ్ధి చేకూరిందన్న ఆరోపణలున్నాయి. తాజాగా చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ, సంక్రాంతి సంబరాల నిర్వహణలోనూ కొందరికే ప్రాధాన్యత లభిస్తుండటంతో పలువురు టీడీపీ నేతలు మాకెందుకు.. అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కుందువానిపేటలో దీపావళి పర్యటించిన సీఎం చంద్రబాబు పలు హామీలు గుప్పించినా ఇప్పటికీ ఎటువంటి సాయం అందలేదు. దీంతో అక్కడ సంబరాలు జరిపితే ఊరుకునేది లేదని స్థానికులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు తుపానుతో అతలాకుతలమైన ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రభుత్వం సంబరాలు జరపడమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చంద్రన్న కానుకలు కూడా అరకొరగా రావడం, నాసిరకంగా ఉండటం, పూర్తిస్థాయిలో పంపిణీ కాకపోవడంపైనా ప్రజలు మండిపడుతుండటంతో నాయకులు ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు. ఇక నియోజకవర్గ స్థాయిలో పార్టీలో వివాదాలకు దారితీసిన పలు ఉదంతాలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ గెలుపొందిన రాజాం, పాలకొండ, పాతపట్నం నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి పూర్తిగా పట్టు కోల్పోయింది. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో ఉన్నా తమకేమీ సాయం చేయడం లేదని అక్కడి టీడీపీ క్యాడర్ ఆరోపిస్తోంది. ఇచ్చాపురంలో ఇటీవల జరిగిన బదిలీల తంతు అక్కడి ఎమ్మెల్యేకు ఆగ్రహం తెప్పించింది. తాను సూచించిన వారిని కాకుండా మంత్రి తనకు కావాల్సిన వారికి అనుకూలంగా వ్యవహరించడం, గతంలో ఆరోపణ లెదుర్కొన్న, టీడీపీ నాయకులే వ్యతిరేకించిన వారిని ఇక్కడ నియమించడాన్ని స్థానిక ఎమ్మెల్యే తప్పుబడుతున్నారు. సీనియర్ నేత అయిన పలాస ఎమ్మెల్యే స్వపక్షంలోనే విపక్షంగా వ్యవహరిస్తుండటాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల జెడ్పీ సహా వివిధ సమావేశాల్లో ఆయన ఘాటుగా మాట్లాడటాన్ని, పారదర్శకంగా విధులు నిర్వహించని కొందరు అధికారుల తీరును ఎండగట్టడాన్ని పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పైకి అచ్చెన్నవర్గంతో కలిసి తిరుగుతున్న శ్రీకాకుళం ఎమ్మెల్యే అంతర్గతంగా అసంతృప్తితోనే ఉన్నారని, ఇటీవల ఆమె కోడలు మృతి చెందినప్పుడు పరామర్శకు వెళ్లిన పార్టీ నేతలను ఎమ్మెల్యే భర్త పట్టించుకోకపోవడమే దీనికి నిదర్శనమని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. నరసన్నపేట ఎమ్మెల్యే అచ్చెన్న వర్గంతో తిరుగుతుండడాన్ని మంత్రి వ్యతిరేకవర్గం జీర్ణించుకోలేకపోతోంది. పైగా సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా ఇతర ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలకు మంత్రి, ఎంపీలతో కలిసి హాజరవుతుండడాన్ని పలువురు పార్టీ నేతలు ఆక్షేపిస్తున్నారు. నియోజకవర్గంలో ఇటీవల జరిగిన బదిలీలు కూడా ఎమ్మెల్యేను కాదని మంత్రి సూచించిన వారికి అనుకూలంగా జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. టెక్కలిలో పరిస్థితి వేరేగా కనిపిస్తోంది. ఇళ్లపట్టాల పంపిణీ, మంత్రి సొంత మండలమైన కోటబొమ్మాళిలో ఇటీవల మద్యం కేసులు నమోదు కావడం, వైఎస్సార్సీపీ సర్పంచ్‌లపై కక్షగట్టి చెక్‌పవర్ రద్దు చేయిస్తున్నారనే ఆరోపణలు రావడం కూడా స్థానిక టీడీపీ క్యాడర్‌కు ఇబ్బందిగా మారింది. రాజాంలో పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ వ్యవహారశైలిపైనా తెలుగు తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మంత్రిగారిపై పార్టీ ఎమ్మెల్యే ఫైర్
-
మంత్రిగారిపై పార్టీ ఎమ్మెల్యే ఫైర్
శ్రీకాకుళం జిల్లాలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల మధ్య ఏర్పడిన వైరం తారస్థాయికి చేరింది. దాంతో ఆ పంచాయతీ కాస్తా పార్టీ అధ్యక్షుడి చంద్రబాబు నాయుడు వద్దకు చేరింది. జిల్లాకు చెందిన మంత్రి కె.అచ్చెన్నాయుడు వైఖరీపై అదే జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే కళా వెంకటరావు పార్టీ అధ్యక్షడుకి ఫిర్యాదు చేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు తనను ఆహ్వానించకుండా మంత్రి పర్యటిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై తాను మాట్లాడతానని కళా వెంకటరావుకు బాబు హమీ ఇచ్చారని సమాచారం. గత ఏడాది ఆసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో శ్రీకాకుళంలో జిల్లా నుంచి సీనియర్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికైనా... పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏరికోరి మరీ తన కేబినెట్లో కె. అచ్చెన్నాయుడికి చోటు కల్పించారు. జిల్లాకు చెందిన సీనియర్లను పక్కన పెట్టి అచ్చెన్నాయుడికి మంత్రి పదవి ఇవ్వడంపై సదరు నేతలంతా ఆగ్రహంతో ఉన్నారు. అప్పుడే బాబు వద్ద వీరంతా తమ ఆవేదనను వెళ్లకక్కారు. దాంతో వారందరిని బాబు సముదాయించారు. అచ్చెన్నాయుడి వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు తాను హామీ ఇస్తానని పచ్చ తమ్ముళ్లు బాబు హమీ ఇచ్చారు. దాంతో వీరంతా మిన్నకుండి పోయారు. అయితే జిల్లాలో పార్టీకి చెందిన ఏ కార్యక్రమమైనా బాబాయి, అబ్బాయి కనుసన్నల్లో జరుగుతుండంతో పచ్చ తమ్ముళ్లు లోలోపల ఆగ్రహంతో రగిలిపోతున్న సంగతి తెలిసిందే. -
ప్రలోభాల ‘కళ’!
గత ఎన్నికల్లో రిజర్వేషన్ల దెబ్బతో వలస వచ్చి, వేరే పార్టీ తరఫున పోటీ చేసిన ఆ నేతకు పరాభవం ఎదురైంది. అతని పార్టీయేమో పదేళ్లుగా అధికారానికి దూరమైంది. ఈసారి మళ్లీ సొంత గూటికే చేరి పోటీ చేస్తున్నా.. కనుచూపు మేరలో గెలుపు అవకాశాలు కనిపించడం లేదు. మరేం చేయాలి?.. ఉందిగా ప్రలోభాల మార్గం.. దానికి నిధుల కొరత లేదు. అటు పార్టీ తరఫున కార్పొరేట్ లాబీ నిధులు కుమ్మరిస్తోంది.. ఇటు సొంత ఆర్థిక వనరులు ఉండనే ఉన్నాయి. ఇంకేముంది ఎచ్చెర్ల టీడీపీ అభ్యర్థి కళా వెంకట్రావు.. ప్రలోభాల కళ ప్రదర్శిస్తున్నారు. పంచాయతీకి ఒక రేటు.. మద్యం కోటా నిర్ణయించి మరీ మందూమనీ పారిస్తున్నారు. ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: దశాబ్ద కాలంగా టీడీపీ అధికారానికి దూరంగా ఉంది.. ఈసారి ఎలాగైనా దాన్ని దక్కించుకోవాలని ఆ పార్టీ నేతలు తెగ ఆరాట పడుతున్నారు. ఈసారి కాకపోతే.. రాజకీయ భవిష్యత్తు శూన్యమవుతుందన్న ఆందోళన వారిని అడ్డదారులు తొక్కిస్తోంది. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. దాని కోసం ఎంత డబ్బయినా వెదజల్లుతాం.. ఎంత మందు కావాలన్నా పోయిస్తాం.. అన్న రీతిలో బరి తెగిస్తున్నారు. ముఖ్యంగా ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆ పార్టీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు ఓటర్లను ప్రలోభపరిచేందుకు గ్రామాలను నోట్ల కట్టలు, మందు సీసాలతో ముంచెత్తుతున్నారు. పంచాయతీకి రూ.5 లక్షల నగదు, కనీసం 20 కేసుల మద్యం పంపిణీకి వ్యూహం రూపొందించుకొని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. గ్రామాల్లో ఎదురు‘గాలి’ 2004లో కళా వెంకట్రావు ఉణుకూరు ఎమ్మెల్యేగా ఎన్నికైనా, రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ చతికిలపడి ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన కారణంగా ఉణుకూరు పోయి రాజాం నియోజకవర్గం ఏర్పడింది. అయితే దాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేయడంతో 2009 ఎన్నికల్లో నియోజకవర్గంతో పాటు పార్టీ కూడా మారిన కళా ఎచ్చెర్ల నుంచి ప్రజారాజ్యం తరపున పోటీ చేశారు. అయితే మూడో స్థానంలోనే ఆగిపోవడం, ప్రజారాజ్యం కూడా ఘోర పరాజయం చవిచూడటంతో అధికారం అందకుండా పోయింది. ఆ తర్వాత పరిణామాల్లో తిరిగి టీడీపీలో చేరిన ఆయన ఈ ఎన్నికల్లో మళ్లీ ఎచ్చెర్లలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ నుంచి ఆయనకు ఎదురుగాలి వీస్తోంది. గ్రామాల్లో రోజు రోజుకు ఫ్యాన్ గాలి ప్రభంజనంలా మారుతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై చెరగని ఆదరణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిపై ప్రజల్లో ఉన్న నమ్మకం, ఆ పార్టీ అభ్యర్థుల, నాయకుల ప్రచారాలకు లభిస్తుందన్న విశేష ఆదరణ టీడీపీ నేతలను కలవరపరుస్తున్నా యి. దాంతో కళా వెంక ట్రావు డబ్బు మూట లు, మద్యం కేసులతో పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకోవాలని కుయుక్తు లు పన్నుతున్నారు. రోజూ తాను ప్రచారానికి వెళ్లే గ్రామాలకు ఒక్కోదానికి ఐదు మద్యం కేసులు, రూ.40 వేల నగదు ముం దుగానే అందజేస్తున్నారు. వాటితోనే స్థానిక టీడీపీ నేతలు జనాలను పోగు చేస్తున్నారు. పోలింగుకు మరో ప్రణాళిక కీలకమైన పోలింగ్‌కు మరో ప్రణాళిక సిద్ధం చేశారు. పోలింగుకు మూడు నాలుగు రోజుల ముందు నుంచే గ్రామాలను కొనేయాలని ఎత్తులు వేస్తున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో 115 పంచాయతీలున్నాయి. ప్రతి పంచాయతీకి రూ.5 లక్షల నగదు, 20 కేసుల మద్యం పంపిణీకి టీడీపీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధమైన ఈ ప్రక్రియను మూడో కంటికి తెలియకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు ఐదు గ్రామాలకు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ అభ్యర్థి ఆర్థికంగా బలవంతుడు కావడంతో నోట్లతో ఓట్లు కొనాలని అన్ని రకాల ఎత్తులు వేస్తున్నారు. అయితే గ్రామాల్లో మెజారిటీ ఓటర్లు ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలని నిర్ణయించుకోవడం, గ్రామాల్లో ఆ పార్టీకి కూడా బలమైన క్యాడర్ ఉండటంతో టీడీపీ చేపట్టిన ప్రలోభాల పర్వం ఉద్రిక్తతలకు దారి తీసే ప్రమాదముంది. -
ఇచ్చి పుచ్చుకుందాం.. రా!
పాలకొండ, న్యూస్‌లైన్, ‘ఈసారి నీ పాత నియోజకవర్గంలో నన్ను గెలిపించు.. నా పాత నియోజకవర్గంలో నిన్ను గెలిపించేందుకు కృషి చేస్తా..’ -ఇదీ మాజీ మంత్రులు కళావెంకటరావు, కోండ్రు మురళిల మధ్య కుదిరిన అవగాహన.‘ఈసారి నేను గెలవటం డౌటే.. నా గురువు కిశోర్‌చంద్రదేవ్ ఎంపీగా గెలవడమే ముఖ్యం. అందుకే నీకు సాయం చేస్తా. బదులుగా ఎంపీ ఓట్లు మాకు పడేలా చెయ్యి..’ -ఇదీ పాలకొండ కాంగ్రెస్ అభ్యర్థి నిమ్మక సుగ్రీవులు, టీడీపీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణకు ఇచ్చిన ఆఫర్. ‘నియోజకవర్గంలోని కాళింగుల ఓట్లు ఈసారి నాకు పడేలా చేస్తే.. వచ్చే ఎన్నికల్లో మా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించేలా చేస్తా. లేదంటే మీ కోరిక ఏంటో చెబితే మా అధినేతతో చెప్పి తీరేలా చేస్తా. ఇంకా కాదంటే మీ కులం ఓట్లకు రేటు చెప్పు.. ఇప్పిస్తా..’ -ఇదీ టెక్కలి కాంగ్రెస్ అభ్యర్థి కిల్లి రామ్మోహన్‌రావుకు టీడీపీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు ఇచ్చిన బంపర్ ఆఫర్.! జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఇలా మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీయటమే లక్ష్యంగా సాగుతున్న ఈ అనైతిక వ్యవహారంపై ఆ రెండు పార్టీల కార్యకర్తలు భగ్గుమంటున్నారు. దీనివల్ల రెండు పార్టీలకు తీవ్ర నష్టం తప్పదని ఆందోళన చెందుతున్నారు. దీనిపై వారి హెచ్చరికలను మ్యాచ్ ఫిక్సింగ్ నేతలు బేఖాతరు చేస్తున్నారు. టెక్కలిలో వెలమ కులానికి చెందిన అచ్చెన్నాయుడికి కులసమీకరణాల ప్రకారం తగినంత బలం లేదు. ఈ నియోజకవర్గంలో కాళింగ సామాజికవర్గానిది నిర్ణయాత్మక శక్తి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఆ సామాజిక వర్గానికి చెందినవారు కావటంతో అచ్చెన్నను ఓటమి భయం వెన్నాడుతోంది. అర దుకే కాళింగ సామాజిక వర్గానికే చెందిన కాంగ్రెస్ అభ్యర్థి కిల్లి రామ్మోహనరావుతో ఫిక్సింగ్‌కు సిద్ధపడ్డారు. ఈసారి సాయం చేస్తే రానున్న ఎన్నికల్లో టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ పేరును సూచిస్తానని, లేదంటే ఓట్లు వేయించేందుకు రేటు చెప్తే సర్దుబాటు చేస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం. అచ్చెన్నను నమ్మితే కొంప మునగటం ఖాయమని కొందరు, సొమ్ము చేసుకునేందుకు ఇదే మంచి అవకాశమని మరికొందరు చెబుతుండటంతో రామ్మోహనరావు సంకట స్థితిలో ఉన్నారని తెలుస్తోంది. అయితే అచ్చెన్నకు సాయం చేసేందుకు కాళింగ సామాజికవర్గ నేతలు ససేమిరా అంటున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్‌కు రామ్మోహనరావు ఒప్పుకున్నా వీరు సహకరించే అవకాశం కనిపించటం లేదు.పాలకొండలో టీడీపీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణను గెలిపించాలని కాంగ్రెస్ అభ్యర్థి సుగ్రీవులు కంకణం కట్టుకున్నట్టు సమాచారం. తన గురువు, కేంద్ర మంత్రి కిశోర్‌చంద్రదేవ్ అరకు ఎంపీగా గెలవడమే తనకు ప్రధానమని ఆయన చెబుతున్నారు. సుగ్రీవులు ప్రతిపాదనకు టీడీపీ అభ్యర్థి జయకృష్ణ కూడా అంగీకరించారని తెలుస్తోంది. ఎంపీ ఓట్లను కిశోర్దేవ్కు వేయిస్తానని ఆయన హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన టీడీపీ ఎంపీ అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి జయకృష్ణ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నట్లు సమాచారం.ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి కళా వెంకటరావు.. రాజాం కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి కోండ్రు మురళీ ఇప్పటికే ఫిక్సింగ్పై అవగాహనకొచ్చినట్టు ఆ రెండు పార్టీలవారే చెబుతున్నారు. 2004లో ఎచ్చెర్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మురళి సహకారం తీసుకుని గట్టెక్కాలని కళా భావిస్తున్నారు. అందుకు ప్రతిగా రాజాంలో మురళి గెలుపునకు సహకరించాలని నిర్ణయించుకున్నారు. గతంలో కళా ప్రాతినిధ్యం వహించిన ఉణుకూరు నియోజకవర్గం పరిధిలో రాజాం ప్రాంతం ఉండటమే దీనికి కారణం. ఇదిలా ఉండగా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఫిక్సింగ్‌కు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం.