బంగ్లా టు కోట..!
⇔ టీడీపీలో మరో వపర్ సెంటర్
⇔ బంగ్లా రాజకీయాలకు బ్రేక్
⇔ బొబ్బిలి రాజులకు ప్రాధాన్యం
⇔ తగ్గుతున్న అశోక్ ప్రాబల్యం
⇔ శత్రుచర్ల రాకతో మొదలు
⇔ సుజయకృష్ణ మంత్రి పదవితో పతాక స్థాయికి చేరిన వైనం
⇔ కళా వెంకటరావు డైరెక్షన్‌లో వ్యూహాత్మక అడుగులు
⇔ అశోక్ అనుచరులల్లో కలవరం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీలో మరో ‘పవర్’ సెంటర్ తయారైంది. వర్గ పోరు తారాస్థాయికి చేరింది. బంగ్లా రాజకీయా లకు బ్రేక్ పడింది. బొబ్బిలి రాజులకోట మరో రాజకీయ వేదిక కాబోతోంది. ఇన్నాళ్లు జిల్లాలో పార్టీ పెద్ద దిక్కుగా నిలిచిన అశోక్ గజపతిరాజుకు ప్రాధాన్యం మసకబారుతోంది. అధిష్టానం వద్ద పట్టు సడలుతోంది. ఆయనకు తెలియకుండా పార్టీలో వ్యవహారాలు సాగిపోతుండడమే దీనికి నిదర్శనం. అశోక్‌ను సంప్రదించకుండా బొబ్బిలి ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చారనే వాదన బలం గా విన్పిస్తోంది. బంగ్లా ఆధిపత్య రాజకీయాలకు బ్రేక్ పడినట్టు ప్రచారం జోరందుకుంది. జిల్లాలో ని రాజకీయ పరిణామాలు అశోక్ అనుచరులను కలవరపెడుతున్నాయి. ఆలోచనలో పడేశాయి.
తగ్గిన ప్రాధాన్యం..
పూసపాటి అశోక్ గజపతిరాజు జిల్లా టీడీపీలో తిరుగులేని నేత. కేంద్రమంత్రిగా ఉన్నప్పటికీ మొన్నటివరకు తనే టీడీపీ రాజకీయాలను శాసించారు. ఏ విషయంలోనైనా తనదే పైచేయి. పార్టీ, అధికారిక నిర్ణయాలన్నీ తన కనుసన్నల్లోనే నడిచాయి. రాష్ట్ర మంత్రిగా కిమిడి మృణాళిని ఉనప్పటికీ బంగ్లా వేదికగానే రాజకీయాలు కొనసాగాయి. మిగతా నేతల మాదిరిగానే అశోక్ గజపతిరాజుతో కలిసి మృణాళిని నడిచారు. ఇప్పుడా ఆధిపత్యానికి బ్రేక్ పడింది. తనకు తెలియకుండానే అధిష్టానం మరో పవర్‌సెంటర్‌ను తెరచింది.
కళా వెంకటరావు డైరెక్షన్‌లో..
అశోక్ గజపతిరాజుపై నమ్మకం సడలిందో...ఈయనతో భవిష్యత్ రాజకీయాలు చేయలేమనో... అశోక్‌కు మరో ప్రత్యామ్నాయంగా మరో కోటరీ ఉండాలనో తెలియదు గాని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు చెప్పినట్టుగా అధిష్టానం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. జిల్లాలో కళా వెంకటరావు ప్రాబల్యాన్ని దశలవారీగా పెంచి తద్వారా అశోక్ ఆధిపత్యానికి గండి కొడుతూ వస్తోంది. అశోక్‌కు నచ్చని నిర్ణయాలు తీసుకుని మానసికంగా బలహీనం చేస్తోంది.
కాంగ్రెస్‌లో అనేక పర్యాయాలు మంత్రిగా పనిచేసిన శత్రుచర్ల విజయరామరాజును పార్టీలోకి తీసుకొచ్చి అశోక్ ప్రాబల్యాన్ని తగ్గించే భీజం వేసింది. విజయనగరం రాజులు వ్యతిరేకించినా ఫలితం లేకపోయింది. అశోక్ ఆలోచనలకు భిన్నంగా కురుపాం ఇన్‌చార్జి బాధ్యతలను సైతం శత్రుచర్ల మేనల్లుడికి అప్పగించారు. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన సుజయకృష్ణ రంగారావును పార్టీలోకి తీసుకు వచ్చారు.
సుజయ రాకను అశోక్ తొలుత వ్యతిరేకిం చారని, చంద్రబాబు ఒప్పించడంతో వెనక్కి తగ్గారనే వాదనలు ఉన్నాయి. ఇవన్నీ చాలవన్నట్టు ఇటీవల తన అభిప్రాయానికి భిన్నంగా శత్రుచర్ల విజయరామరాజుకు ఏకంగా శ్రీకా కుళం స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ చేశారు. ఈ నేపథ్యంలో అశోక్‌కు ధీటుగా మరో వర్గానికి ఆజ్యం పోసినట్టు అయ్యింది.
అశోక్‌ను పట్టించుకోకుండా...
సుజయ్‌కు మంత్రి పదవి ఇవ్వడంలో అశోక్ గజపతిరాజు మాటను పట్టించుకోలేదన్నది సమాచారం. జిల్లాలో మారుతున్న సమీకరణాలను ముందుగానే పసిగట్టిన అశోక్ గజపతిరాజు వ్యూహాత్మకంగా అడుగులు వేయడం ప్రారంభించారు. సుజయకృష్ణ రంగారావుకు మంత్రి పదవి ఇస్తున్నారనే ప్రచారం జోరందుకోగానే తెరవెనుకుండి మంత్రాంగం నడిపించారు.ద్వారపురెడ్డి జగదీష్, కోళ్ల లలితకుమారి, మీసాల గీత, కొండపల్లి అప్పలనాయుడు, గుమ్మడి సంధ్యారాణి తదితరులను తెరపైకి తెచ్చి, సుజయకు వ్యతిరేకంగా స్వరం విన్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు బోగట్టా.
ఆయనిచ్చిన భరో సాతోనే సదరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేరుగా సీఎం వద్దకు వెళ్లి సుజయకృష్ణకు మంత్రి పదవి ఇవ్వొద్దని, బీసీలకు ఇవ్వాలని, తమలో ఏ ఒక్కరికిచ్చినా ఫర్వాలేద ని, ఓసీకిస్తే పార్టీకి నష్టం అన్న వాదన వినిపించారు. పక్కా వ్యూహంతోనే సుజయకృష్ణకు వ్యతిరేకంగా పావులు కదిపారు. అయితే, సీఎం చంద్రబాబు ఇవేవీ పట్టిం చుకోలేదు. పార్టీలో లోకేష్ డామినేషన్ పెరిగిందో... అశోక్‌ను నమ్ముకుంటే కష్టమని చంద్రబాబు భావించారో తెలియదు గాని అసమ్మతి నేతల వాదన వినిపించుకోలేదు. అశోక్ సైతం జోక్యం చేసుకుని మనసులో మాట చెప్పినా అధిష్టానం పట్టించుకోలేదని తెలుస్తోంది.
మరో రాజకీయ కేంద్రం..
వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మరో రాజకీయ అధికార కేంద్రం ఏర్పాటు చేసేందుకు అధిష్టానం మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. శత్రుచర్లకు ఎమ్మెల్సీ ఇవ్వడం, ఇటీవల జరిగిన సమీక్షలో కళా వెంకటరావు డైరెక్షన్ ప్రకారం సమీక్షలు జరగడం, శత్రుచర్లపై అశోక్ ఫిర్యాదు చేయడం, ఫిర్యాదు చేసినా శత్రుచర్లకే చంద్రబాబు పెద్ద పీట వేయడం, కాదన్నా సుజయకృష్ణకు మంత్రి పదవి ఇవ్వడం వంటివన్ని చూస్తుంటే జిల్లాలో మరో నాయకత్వాన్ని తయారు చేసేందుకు టీడీపీ అధిష్టానం అడుగులు వేసినట్టు స్పష్టమవుతోంది. ఇవన్నీ గమనిస్తున్న అశోక్ అనుచరులు తట్టుకోలేకపోతున్నారు. పార్టీలో ఏం జరుగుతుందోనని కలవరపడుతున్నారు. చెప్పాలంటే బంగ్లా నేతలకు భయం పట్టుకుంది. కొందరు ‘ప్రత్యామ్నా య’ ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం.