జిల్లా టీడీపీలో ‘కళ’కలం
►సమీక్షల నుంచి పదవుల పందేరం వెనుకా ఆయన ప్రభావమే
►సీనియర్లను పక్కన పెట్టేస్తున్న పరిస్థితి
► అశోక్‌కు పోటీగా వర్గం తయారు
► జిల్లా టీడీపీలో విస్తృత చర్చ
జిల్లా టీడీపీలో మరోవర్గం బలపడుతోందా... పార్టీకి పెద్ద దిక్కుగా ఇన్నాళ్లు నిలిచిన అశోక్‌గజపతిరాజుకు ప్రాధాన్యం తగ్గుతోందా... ఆయనకు తెలియకుండానే పార్టీలో కొన్ని వ్యవహారాలు నడుస్తున్నాయా... రాష్ట్ర పార్టీ అధ్యక్షుడైన కళావెంకటరావు ప్రభావం జిల్లాలో పెరుగుతోందా... సమీక్షల నుంచి... పదవుల కేటాయింపు వరకూ ఆయన సూచనల మేరకే సాగుతోందా... జిల్లాలో ఇప్పుడు మరో పవర్‌సెంటర్ తయారవుతోందా... దీని వెనుక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి చిన్నబాబు కోటరీని బలోపేతం చేస్తున్నారా... ఇప్పుడు జిల్లా పార్టీలో ప్రధానంగా జరుగుతున్న చర్చ ఇదే. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే... అక్షరాలా అది నిజమేనేమోనని అనిపిస్తోంది.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లా తెలుగుదేశం పార్టీలో సమీకరణాలు మారుతున్నాయి. కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుపై నమ్మకం సడలిందో, ఈయనతో భవిష్యత్ రాజకీయాలు చేయలేమనో, లోకేష్ తనకంటూ కోటరీని తయారు చేసుకుంటున్నారో తెలియదు గాని జిల్లా పార్టీలో కళా వెంకటరావు ప్రభావం ఎక్కువవుతోంది. పార్టీ పదవుల్లో కీలకంగా వ్యవహరిస్తున్న లోకేష్, కళా వెంకటరావుల మధ్య బంధం పెరగడంతో ఒకప్పుడు రాష్ట్ర పార్టీలోనే నంబర్ టూగా భావించే అశోక్ గజపతిరాజు ప్రాధాన్యం తగ్గుతూ వస్తున్నట్టు స్పష్టమవుతోంది. కళౠ చెప్పినట్టే అదిష్టానం నడుచుకుంటున్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సుజయకృష్ణరంగారావును పార్టీలో చేర్చుకోవడం, ఆయనకు మంత్రి పదవి భరోసా లభించడం, శత్రుచర్లకు ఎమ్మెల్సీ ఇవ్వడం వంటివి అందులో భాగమని విశ్లేషించుకుంటున్నాయి.
పవర్‌సెంటర్ మార్చడమే లక్ష్యంగా...
ఎన్నికలకు ముందు శత్రుచర్ల విజయరామరాజును పార్టీలోకి తీసుకొచ్చిందే కళా వెంకటరావు అని అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పుడే అశోక్ ప్రాబల్యాన్ని తగ్గించే బీజం పడ్డట్టు వాదనలు విన్పించాయి. ఇక, లోకేష్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కళా వెంకటరావు నియమితులయ్యాక వ్యూహా లు ఊపందుకున్నాయి. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగరావును చేర్చుకోవడం అశోక్‌కు ఇష్టం లేకపోయినా కళా వెంకటరావు పావులు కదపడంవల్లే మార్గం సుగుమం అయ్యిందనే వాదనలు ఉన్నాయి. అంతేనా... ఆయనకు మంత్రి పదవి ఇప్పించడానికి లోకేష్ నుంచి హామీ కూడా ఇప్పించినట్టు ప్రచారం నడిచింది. అశోక్ బంగ్లా నుంచి పవర్ సెంటర్‌ను మార్చడమే దీని వెనుకున్న లక్ష్యమని తెలిసింది.
సమీక్షల వెనుకా... ఆయనే!
మూడు రోజుల క్రితం ఉండవల్లిలో జరిగిన పార్టీ సమీక్ష కూడా కళా వెంకటరావు సూచన మేరకే జరిగినట్టు తెలుస్తోంది. ఆయనేదైతే బ్రీఫింగ్ ఇచ్చారో దాని ప్రకారం చర్చించినట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కళా ఇచ్చిన స్క్రిప్టును చంద్రబాబు చదివి విన్పించారని కూడా తెలుస్తోంది. ఎవరెవరిని మందలించాలో, ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలో, ఎవరికి సుతిమెత్తని చురకలంటించాలో కళా వెంకటరావు చేసిన సలహాలు బాగా పనిచేశాయని పార్టీలో చర్చ నడుస్తోంది.
చివరికి, ఎమ్మెల్సీ కేటాయింపుల్లో కూడా ఆయన మార్కే కన్పించిందంటున్నారు. జిల్లాలో శోభా హైమావతి, గద్దే బాబూరావు, ఐ.వి.పి.రాజు, త్రిమూర్తుల రాజు తదితరుల సీనియర్లు ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ పదవి విషయంలో వారినెవ్వరినీ పరిగణనలోకి తీసుకోలేదు. ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన శత్రుచర్లతో సరిపెట్టేశారు. ఈ విషయంలో సీనియర్లకు మొండి చేయి ఎదురైందనే చెప్పుకోవాలి.
శత్రుచర్లకు ఎమ్మెల్సీ పదవి వెనుక కళా...
కళా పదును పెట్టిన వ్యూహంలో భాగంగానే శత్రుచర్ల విజయరామరాజుకు ఎమ్మెల్సీ సీటు కేటాయించినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయినా, పార్టీలో సీనియారిటీ లేకపోయినా తనకంటూ వర్గాన్ని తయారు చేసుకోవాలన్న ఆలోచనలో భాగంగా సమీకరణలు పక్కన పెట్టి శత్రుచర్లకు ఎమ్మెల్సీ ఇప్పించినట్టు వాదనలు ఉన్నాయి. ఉండవల్లి సమీక్షలో శత్రుచర్లపై అధినేతకు అశోక్ చేసిన ఫిర్యాదు వెనుక ఈ అక్కసు ఉందనే గుసగుసలు విన్పించాయి. ఫిర్యాదు చేసినా చంద్రబాబు పట్టించుకోకుండా శత్రుచర్లకు కురుపాం పగ్గాలు అప్పగించడం వెనక కళా డైరెక్షన్ కారణమనే వాదనలు కొనసాగుతున్నాయి. భవిష్యత్‌లో సుజయకృష్ణ రంగారావుకు మంత్రి పదవి ఇప్పించే విషయంలోనూ కళా పావులు కదుపుతున్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.