ఈ నెల ఒకటో తేదీన విశాఖలో కలెక్టర్ వివేక్ యాదవ్‌తో మాట్లాడుతున్న మంత్రి గంటా శ్రీనివాసరావు, చిత్రంలో వినయంగా కూర్చున్న మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు (ఫైల్‌ఫొటో)
ఇద్దరూ మంత్రులే... కానీ ఒకరు దర్జా ఒలకబోస్తారు. మరొకరేమో... వారి ముందు వినయంగా ఉంటారు. ఈ తేడా ఎందుకొస్తోందో అర్థం కాక.. జిల్లా ప్రజలు జుత్తు పీక్కుంటున్నారు. అధికారులతోగానీ... జిల్లా ఎమ్మెల్యేలతోగానీ... చేపట్టిన సమీక్షలు అమరావతిలోనో... పక్కనే ఉన్న విశాఖలోనో జరుగుతుంటాయి. అక్కడికే మన జిల్లా మంత్రి వెళ్తుంటారు. ఇదెంతవరకు సబబని ప్రశ్నిస్తే... అదేమీ అధికారికం అని తాను అనుకోవడంలేదని చెబుతుంటారు. చాలా విచిత్రంగా ఉన్న ఈ వ్యవహారం చూసే జిల్లావాసులకు మాత్రం తలకొట్టేసినట్టుంటోంది.
సాక్షిప్రతినిధి, విజయనగరం:జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు అమరావతిలోనో... విశాఖపట్నంలోనో సమావేశాలు పెట్టి విజయనగరం జిల్లా రాజకీయ, పరిపాలనాంశాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాకు చెందిన అదే హోదాలో ఉన్న మంత్రి సుజయ్ మాత్రం ఆయన ఎక్కడికి పిలిస్తే అక్కడకు వెళ్ల్లడం జిల్లా టీడీపీలో ఓ వర్గాన్ని తీవ్రంగా బాధిస్తోంది. పార్టీ విషయాలపైనసుజయ్ సమీక్షలు జరపకపోవడంపై పార్టీ వర్గాలు, జిల్లా సమస్యలపై చర్చించకపోవడంపై ప్రజలూ అసంతృప్తితో ఉన్నారు. రాజవంశ ఠీవి.. ఆ పౌరుషం కొందరిలో కనిపించదు. అలాగని సామాన్యులుగా మామూలు జనంలో కలిసిపోయే మనస్తత్వం కూడా వారిలో ఉండదు. పేరుకు రాజులమని చెప్పుకోవడం తప్ప ఆ స్థాయిని, గౌరవాన్ని నిలుపుకోవడంలో విఫలమవుతూనే ఉంటారు. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే జిల్లాలో ప్రజాప్రతినిధులుగా రాజ వంశం వారే ప్రధాన పదవుల్లో ఉన్నారు. వారిలో సుజయ్‌కృష్ణ రంగారావు ఒకరు. రాష్ట్ర గనులశాఖ మంత్రిగా ఉన్న ఆయనంటే బొబ్బిలి ప్రాంతంలో ఒకప్పుడు చాలా గౌరవం ఉండేది. కానీ విశ్వసనీయతను నిలుపుకోలేక, పదవి కోసం పార్టీ జెండా మార్చి తనకు తానుగా ప్రతిష్టను దిగజార్చుకున్నారు. పోనీ టీడీపీలోకి వెళ్లిన తర్వాతైనా తన స్థాయికి తగ్గట్టుగా నడుచుకుంటున్నారా అంటే అదీ లేదు. అక్కడా గుర్తింపునకు నోచుకోవడంలేదు.
ఇన్‌చార్జి మంత్రిదే హవా...
అధికార పార్టీలో చిన్న పదవిలో ఉన్నవారైనా తామెవరికీ తీసిపోనట్టు ప్రవర్తిస్తారు. కానీ సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి పదవిలో ఉన్న సుజయ్ మాత్రం సాటి మంత్రి దగ్గర కాస్త తగ్గి ఉన్నట్టు కనిపిస్తున్నారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా గంటా శ్రీనివాసరావును చంద్రబాబు నియమించిన తర్వాత రాజకీయ, పాలన పరిస్థితులపై సమీక్షించడానికి ఆయన జిల్లాకు రావడం లేదు. గడచిన ఎనిమిది నెలల్లో తొలిసారి వచ్చినపుడు అధికారులను పరిచయం చేసుకుని వెళ్లిపోగా ఆ తర్వాత ఒకటి రెండు ప్రారంభోత్సవాలకు, ఆగస్టు 15న జెండా ఆవిష్కరణకు మాత్రమే ఆయన వచ్చి వెళ్లారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా సమీక్షించాల్సిన బాధ్యత ఉండటంతో జిల్లా నేతలను, అధికారులను తాను ఎక్కడుంటే అక్కడకు పిలిపించుకుని మొక్కుబడిగా సమావేశం నిర్వహిస్తున్నారు.
రాజధానిలోనే... రాజకీయ చర్చలు
మరోవైపు తనకంటూ జిల్లాలో ఓ వర్గాన్ని ఏర్పరచుకున్నారు. కొందరు ఎమ్మెల్యేలు, నాయకులు ఆయన పంచన చేరారు. ఈ నేపథ్యంలో జిల్లాలో నేతల మధ్య ఏర్పడే వివాదాలను అమరావతిలోనే కూర్చొని గంటా సెటిల్ చేస్తున్నారు. లేదా విశాఖలో చర్చలు జరుపుతున్నారు. తాజాగా అమరావతిలో జిల్లా టీడీపీ నేతలతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మూడు రోజుల క్రితం మంత్రి సుజయకృష్ణ రంగారావు, కలెక్టర్ వివేక్‌యాదవ్‌ను విశాఖ రప్పించుని మాట్లాడారు. సుజయ్ మాత్రం గంటా ఎలా అంటే అలా, ఎక్కడికంటే అక్కడికి వెళుతూ ఆయన చెప్పినదానికల్లా తలాడిస్తున్నారు. ఇప్పటికే అశోక్‌గజపతిరాజు వ్యవహారాల్లో గంటా తలదూర్చినా ఆయన ఇంత వరకూ ఏమీ అనలేకపోతున్నారనే అపవాదు ఉంది. కానీ అశోక్ విషయంలో గంటా వ్యవహారశైలిపై చంద్రబాబు సీరియస్ అయ్యారని, గంటాను మందలించారని ప్రచారం జరిగింది. కనీసం అలాంటిది సుజయ్ విషయంలో లేకపోవడం విస్మయం కలిగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment