ఎన్నారై సంధ్య గజపతిరావు చౌదరిని చంద్రబాబుకు పరిచయం చేస్తున్న కళా వెంకటరావు
గత సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి ఎచ్చెర్ల తేదేపా శ్రేణుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్న ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకట్రావు తీరు మరోమారు స్థానిక నేతల ఆగ్రహానికి గురౌతోంది. ఇప్పటికే కళాను ఎరువు నేతగా భావించి దూరం పెడుతున్న సొంత పార్టీ నేతలు ఆయన తాజా చిన్నెలతో అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. తమను కాదని గతంలో వివాదాస్పదమైన ఎన్నారై మహిళను పార్టీ అధినేత వద్దకు స్వయంగా తీసుకెళ్లి విజయనగరం జిల్లా కమిటీలో స్థానం కలి్పంచడం ఎచ్చెర్ల టీడీపీలో అసమ్మతి జ్వాలను ఎగదోసింది. కళాను వచ్చే ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతీసి సత్తా చూపిస్తామని హెచ్చరిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీలో మరో రచ్చ మొదలైంది. కొత్తగా పార్టీలో చేరిన ఎన్‌ఆర్‌ఐ సంధ్య గజపతిరావు చౌదరి వ్యవహారం చిచ్చురేపింది. ఇంతవరకు నియోజకవర్గ టీడీపీ నేతలను నేరుగా చంద్రబాబును కలిపించే అవకాశం ఇవ్వని కిమిడి కళా వెంకటరావు ఇప్పుడుఏకంగా నిన్నగాక మొన్న పారీ్టలోకి వచ్చిన ఎన్‌ఆర్‌ఐతో మాట్లాడించడం ఆ పార్టీలో కొత్త వివాదానికి దారితీసింది. వివాదాస్పదమైన ఎన్‌ఆర్‌ఐను పార్టీలోకి తీసుకోవడమే తప్పని వ్యతిరేకించగా, ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ఆమెను మరింత ప్రొత్సహించడం సుదీర్ఘకాలంగా టీడీపీలో పనిచేస్తున్న శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు.
దూరమవుతున్న కేడర్..
2019 ఎన్నికల తర్వాత కిమిడి కళా వెంకటరావు పరిస్థితి దారుణంగా తయారైంది. ఒకప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా, మంత్రిగా పనిచేసిన కళాను ఇప్పుడు గ్రామాల్లో పట్టించుకునే నాయకులే లేరు. పెద్దగా ప్రాధాన్యం లేని వ్యక్తులను వెంటబెట్టుకుని పార్టీ కార్యక్రమాలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. దీనికంతటికీ కళా అనుసరిస్తున్న తీరే కారణం. అధికారంలో ఉన్నంతసేపూ కేడర్‌ను పట్టించుకోలేదని, అధికారం పోయాక తన కొడుకు రామ్ మల్లిక్‌నాయుడిని తమపై రుద్దుతున్నారని నాయకులంతా తీవ్ర ఆవేదనతో ఉన్నారు.
దీంతో నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోనూ కీలక నాయకులు కళాకు దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గంలో తనే మళ్లీ పోటీ చేస్తానని చెబుతూ, అధిష్టానం వద్ద తన కుమారుడికి సీటు ఇవ్వాలని కోరుతూ.. తనదైన రాజకీయం చేస్తున్నాడని టీడీపీ శ్రేణులు వాపోతున్నారు. ఎన్నాళ్లీ కళా పెత్తనమని గుర్రుగా ఉన్నారు. రణస్థలం మండలంలో మాజీ ఏఎంసీ చైర్మన్ కలిశెట్టి అప్పలనాయుడు, జి.సిగడాం మాజీ ఎంపీపీ బాల బొమ్మన వెంకటేశ్వరరావు, ఎచ్చెర్లలో జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్షి్మ, జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ, లావేరు మండలంలో అలపాన సూర్యనారాయణ, దామోదరావు తదితర కీలకనేతలంతా కళా వెంకటరావును బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. కళా పేరెత్తితేనే మండిపడుతున్నారు. ఎన్నికలొచ్చినప్పుడు తమ సత్తా ఏంటో చూపిస్తామని బాహాటంగానే చెబుతున్నారు.
కొత్త గ్రూపుతో వివాదం..
ఎచ్చెర్ల మండలం టీడీపీ పెద్ద దిక్కు చౌదరి బాబ్జీ అని ఆ పార్టీ నేతలు చెబుతుంటారు. ఇప్పుడు ఆయనకే చెక్ పెట్టేలా ఆ గ్రామంలో ఉన్న ఎన్‌ఆర్‌ఐ సంధ్య గజపతిరావు చౌదరిని పార్టీలోకి తీసుకొచ్చి మరో గ్రూపును తయారు చేశారు. ఇదే ఎన్‌ఆర్‌ఐ.. గతంలో చౌదరి బాబ్జీ కొడుకు ఆత్మహత్యాయత్నానికి ప్రధాన కారకురాలని అప్పట్లో పెద్ద వివాదమే నడిచింది. గ్రామంలో తాము నిర్మించిన ఆలయాన్ని ప్రారంభోత్సవం కానివ్వకుండా సంధ్య గజపతిరావు చౌదరి అడ్డుకుంటున్నారని, మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని చౌదరీ బాబ్జీ కొడుకు చౌదరి అవినాష్ పోలీసు స్టేషన్‌పై నుంచి దూకేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అప్పట్లో సంధ్య గజపతిరావు చౌదరిపై చంద్రబాబు సీరియస్‌గా స్పందించారు. ఇప్పుడు ఆమెను పార్టీలోకి తీసుకోవడమే కాకుండా విజయనగరం జిల్లా తెలుగు మహిళ కమిటీలో చోటు కలి్పంచారు. ఎప్పటి నుంచో పనిచేస్తున్న నాయకులను నేరుగా కలిసే అవకాశమివ్వని కళా వెంకటరావును ఈమెను నేరుగా చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి మాట్లాడించారు.
ఆ ఫొటోను సోషల్ మీడియాలోకి వదిలారు. దీంతో పుండుపై కారం జల్లినట్టు... ఎన్‌ఆర్‌ఐ సంధ్య చంద్రబాబును కలవడాన్ని నియోజకవర్గ టీడీపీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిని వదిలేసి గ్రామంలో ఏ మాత్రం పట్టులేని సంధ్యను ప్రోత్సహించడమేంటని ప్రశ్నిస్తున్నారు. చౌదరి బాబ్జీకి పోటీగా గ్రామంలో రాజకీయం చేయించడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నారు. దీనంతటికీ కారణమైన కళాను 2019 కన్నా దారుణంగా ఓడించేందుకు ఆ పార్టీ శ్రేణులు కంకణం కట్టుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment