‘కళ’ను కలవలేని టీడీపీ శ్రేణులు
ఎందు‘కళా’ అంటూ పార్టీ శ్రేణుల్లో ఆవేదన
ఆయన వెనుక వెళ్లేందుకు ససేమిరా
ఉన్న కొద్దిపాటి క్యాడర్ జారుకుంటున్న వైనం
ఏ స్థాయి నేతలైనా పీఏతోనే మాట్లాడాలా? అంటూ మండిపాటు
చాలుచాలులే అంటూ మొహంమీదే చెబుతున్న పరిస్థితి
చీపురుపల్లి: వాస్తవంగా ఆయన వలస నేత. ఆయన ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా సొంత ఇల్లు ఉండదు. ఆఫీసు ఉండదు. ఆయనను అనుచరులూ నమ్మరు. ఎన్నికల వేళ ఉపయోగించుకోవడమే తప్ప... ఆపద వేళ ఆదుకోవడం ఆయనకు తెలియదు. ఆర్థికంగా కుంగిపోయినా రూపాయి సాయం చేసే గుణం లేదు. నాలుగు దశాబ్దాల సీనియారిటీ ఉందని చెప్పుకునే ఆయనకు ఆ నియోజకవర్గంలో కనీసం అద్దెకు ఇల్లు కూడా తీసుకోరు. ఎన్నికల ప్రచారంలో తిరగడం, తీరా గెలిచినా, ఓడినా సరే విశాఖ, విజయవాడ, హైదరాబాద్‌లలో గడపడం ఆయనకు అలవాటు.
ఓటమి చెందితే ఎలాగూ కనిపించని ఆ సీనియర్ నేత గెలిచినా సరే ప్రజలు ఎలా ఉన్నారో, నియోజకవర్గం అభివృద్ధి ఏమిటో కనీసం పట్టించుకోరంటూ ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన టీడీపీ శ్రేణులు చెప్పేమాటలతో చీపురుపల్లిలోని పార్టీ శ్రేణుల్లో గుబులు రేగుతోంది. పార్టీ శ్రేణుల్లో ‘కళ’ తప్పింది. ఓటమి ఖాయమని తెలిసినా కొద్దిమంది నాయకులు ఆయన వెంట నడుస్తున్నారు. ఆయన తీరు తెలిసి నైరాశ్యంలోకి వెళ్లిపోయారు.
2014లో ఎచ్చెర్లలో గెలుపొంది, మంత్రి పదవి అలంకరించి ఆ నియోజకవర్గానికి ఏమైనా చేశారా అంటే అక్కడి ప్రజలు సున్నా సింబల్ చూపిస్తున్న దుస్థితి. దీంతో ఆయన నాయకత్వాన్ని 2019లో అక్కడి ప్రజలు తిరస్కరించారు. ఓటమి చెందాక ఐదేళ్లు ఆ నియోజకవర్గ ప్రజలకు కనీసం ముఖం కూడా చూపించలేదట. ఆ వలసనేత తీరు ఇప్పుడు చీపురుపల్లి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. సొంత కుటుంబ సభ్యులకే వెన్నుపోటు పొడిచే నైజం ఉన్న నాయకుడు ఇప్పుడు ప్రజలను ఏం ఉద్దరిస్తాడన్న చర్చ రచ్చబండలపై సాగుతోంది.
అంతా పీఏ కన్నుసన్నల్లోనే...
నలభై ఏళ్లు సీనియారిటీ ఉన్న ఆయన ప్రజలకు ఎలాగూ ముఖం చూపించరు సరికదా.. గ్రామ, మండల స్థాయిలో పార్టీ క్యాడర్‌నూ కలవరట. ఏదైనా కష్ట, సుఖాలు చెప్పుకోవాలన్నా, అభివృద్ధి కోసం మాట్లాడాలన్నా సరే ఆయన అపాయింట్‌మెంట్ ఉండదట. పార్టీ క్యాడరైనా, నాయకులైనా ఎవరైనా సరే పీఏగా ఉన్న వెంకటేశ్వరస్వామిని కలుసుకుని తమ గోడు వెల్లబోసుకుని అక్కడ నుంచి వెళ్లిపోవాల్సిందే.
ప్రస్తుతం కొత్త నియోజకవర్గమైన చీపురుపల్లిలో కూడా అదే పరిస్థితి క్యాడర్‌కు ఎదురవుతోందనే చర్చ ఆ పార్టీ సోషల్ మీడియా గ్రూపుల్లోనే సాగుతుండం గమనార్హం. ఇంకా ఎన్నికలు జరగలేదు, గెలుపు, ఓటములు సంగతి పక్కన పెడితే ప్రస్తుతం కూడా క్యాడర్‌తో ఆయన మాట్లాడే పరిస్థితి లేదని, పీఏతోనే ప్రతీ విషయం చెప్పుకోవాల్సి వస్తోందని నాయకులు తలలు పట్టుకుంటున్నారు. అందుకనే ఆ సీనియర్ ఏ నియోజకవర్గం వదిలి వెళ్లిపోయినా అక్కడ క్యాడర్ అంతా పండగ చేసుకుంటారని టీడీపీ వర్గీయుల్లోనే చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment