ఇదీ చీపురుపల్లి కూటమి అభ్యర్థి కళా వెంకటరావు ప్రచార తీరు
నవ్వుకుంటున్న సొంత పార్టీ కేడర్, ద్వితీయ శ్రేణి నాయకులు
చీపురుపల్లి: అబద్ధం ఆడితే అతికినట్లు..పురాణం చెప్తే ఆకట్టుకునేలా ఉండాలంటారు. ఇదే తరహాలో ఎన్నికల ప్రచారంలో శతవిధాలా ప్రయత్నిస్తున్న చీపురుపల్లి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీకి చెందిన కళా వెంకటరావు తీరును చూస్తూ ఆయన చెబుతున్న అబద్ధాలు వింటూ సొంత పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు నవ్వుకుంటున్నారు.
నోటికొచ్చిన అబద్ధం చెప్పడం ప్రజలను మోసం చేసి మభ్యపెట్టడం టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య అనుకుంటారు అంతా. ఎందుకంటే సాక్షాత్తు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడే పూటకో అబద్ధం, రోజుకో మోసం అనే చందాన తొలి నుంచి రాజకీయాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన్నే ఆదర్శంగా తీసుకుంటున్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ఉన్న ఆ పార్టీ నేతలు మన బాస్ ఇష్టారాజ్యం అబద్ధాలు చెబుతున్నప్పుడు మనం చెప్తే ఏముందిలే అనుకుంటున్నారేమో గాని చంద్రబాబునే డిటోగా ఫాలో అయిపోతున్నారు.
అందులో భాగంగానే చీపురుపల్లి కూటమి అభ్యర్థిగా కొత్తగా నియోజకవర్గానికి వచ్చిన కిమిడి కళా వెంకటరావు కూడా మద్యపాన నిషేధం, డ్వాక్రా రుణమాఫీ, తోటపల్లి సాగునీటి కాలువ కోసం అబద్ధాలే ప్రచార అస్త్రాలుగా ప్రతి రోజూ ప్రజలను మభ్యపెట్టే ప్రక్రియ ప్రారంభించారని స్థానికంగా చర్చ జరుగుతోంది. అసలు ఇక్కడి ప్రజలకు ఏమీ తెలియదన్నట్లు, రెండు దశాబ్దాల క్రితంలో మాదిరిగా ఏం చెప్పినా పర్లేదునుకుంటున్నారేమో గానీ మరీ అబద్ధాలు చెప్పేస్తున్నారని సొంత పార్టీ కార్యకర్తలే చెవులు కొరుక్కుంటున్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా ఎంతో విజ్ఞత కలిగిన ఓటర్లు ఉన్న చీపురుపల్లిలో ఇలాంటి పుక్కిటి పురాణాలు ఎవరూ నమ్మరని టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నట్లు సమాచారం.
మద్యపాన నిషేధం ఎత్తేసి, మంచి లిక్కర్ ఇస్తామంటూ..
పేదలకు మద్యం దూరం చేయాలన్న లక్ష్యంతో టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్‌టీ రామారావు మద్యపాన నిషేధం విధించారు. ఆ తరువాత ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కుని ము ఖ్యమంత్రి అయిన చంద్రబాబు మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసిన సంగతి అందరికీ గుర్తుంది. మూడుశాబ్దాల క్రితం నుంచి మద్యం తాగించి పేదల ప్రాణాలు తోడేస్తున్నది చంద్రబాబేనని మద్యపాన నిషేదం కోసం మాట్లాడే అర్హత బాబుకు ఎక్కడుందంటూ చర్చ జరుగుతోంది.
అంతేకాకుండా మరొకడుగు ముందుకేసి గత కొంతకాలంగా నాణ్యమైన లిక్కర్ ఇస్తానని చంద్రబాబు బహిరంగ సభల్లో ప్రకటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మద్యంలో కూడా మంచి, చెడు రకాలు ఉన్నాయా అంటూ కొత్త అర్థాన్ని తీసుకొచ్చిన చంద్రబాబు మరోవైపు మద్యపాన నిషేధం కోసం మాట్లాడుతుండడం, ఆ విషయాన్ని ఇక్కడ కళా వెంకటరావు ప్రజలపై రుద్దేందుకు చేస్తున్న కృషి చూస్తుంటే విడ్డూరంగా ఉందని అంతా అనుకుంటున్నారు.
వైఎస్సార్ హయాంలోనే తోటపల్లి సాకారం..
తోటపల్లి కోసం టీడీపీ నేతలు చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. తోటపల్లి ప్రాజెక్టు కోసం కేటాయించిన నిధులను చంద్రబాబు పక్కదోవ పట్టించి ప్రాజెక్టు పనులు నిలిపివేశారు. అదే 2004లో అధికారంలోకి వచ్చిన దివంగత మహానేత వైఎస్సార్ రూ.400 కోట్లు నిధులు కేటాయించి పనులు ప్రారంభించిన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేసుకోవాలని రైతులు అంటున్నారు. 2009లో మహానేత మరణ సమయానికి 90 శాతం పనులు కూడా పూర్తయిన సంగతి అందరికీ తెలిసిందే.
మహిళలను మోసం చేసింది చంద్రబాబు..
మహిళలను జగన్‌మోహన్‌రెడ్డి మోసం చేశాడని టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న నేపథ్యంలో మహిళలను మోసం చేసింది చంద్రబాబు కదా అంటూ నవ్వుకుంటున్నారు. 2014 ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, అప్పులు తీర్చొద్దని మహిళలకు మాట ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక రుణమాఫీ ఊసెత్తని చంద్రబాబు మహిళలను మోసం చేశాడు. అదే 2019 ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగు విడతల్లో మహిళల రుణాలను పూర్తిస్థాయిలో వారి ఖాతాల్లోనే జమ చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment