మంటలు రేపుతున్న మంత్రాంగం!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ‘మూడు గ్రూపులు.. ఆరు వివాదాలు’.. అన్నట్లు తయారైంది. ప్రధానంగా మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్ రవికుమార్, సీనియర్ ఎమ్మెల్యే కళా వెంకటరావులు కేంద్రంగా అధికార పార్టీ రాజకీయాలు సాగుతున్నాయి. మిగతా ఎమ్మెల్యేలకు పెద్దగా విలువ లేకపోవడంతో వారు అంటీముట్టనట్లుగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ, ప్రభుత్వం పరంగా వారికి ఎలాంటి ప్రాధాన్యత లభించడం లేదన్న ఆరోపణలు పార్టీవర్గాల నుంచే వినిపిస్తున్నాయి. ప్రోటోకాల్ పేరుతో కూడా పలువురిని పక్కన పెట్టడం కూడా తెలుగు తమ్ముళ్లను నైరాశ్యంలోకి నెట్టేస్తోంది.
దీంతో జిల్లాలో పార్టీ పరిస్థితులను కొందరు ఎప్పటికప్పుడు అధిష్టానం దృష్టికి తీసుకువెళుతున్నారు. ఇటీవల ఎచ్చెర్ల నియోజకవర్గంలో అధికారికంగా నిర్వహించిన ఓ కార్యక్రమానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే కళా వెంకట్రావుకు చెప్పకపోవడంపై ఆయన వర్గం గుర్రుగా ఉంది. ఆ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్న అంతా తానై వ్యవహరించడం ఎమ్మెల్యే వర్గీయులకు మింగుడు పడలేదు. దీనిపై కళా వెంకట్రావు తన సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలాగే ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌ను కేవలం ఆమదాలవలస నియోజకవర్గానికే పరిమితం చేసేందుకు మంత్రి ప్రయత్నిస్తుండడాన్ని ఆయన వర్గం వ్యతిరేకిస్తోంది. గతంలో ఎక్కడ ఏం జరిగినా తామంతా కలిసే ఉన్నామని చూపించేందుకు ప్రయత్నించిన నాయకగణం ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తోంది. ఇతర నియోజకవర్గాల్లో నిర్వహించే కార్యక్రమాలకు విప్‌ను పిలవకపోడం కూడా ఇందుకు ఊతమిస్తోంది.
ఆజ్యం పోస్తున్న సంబరాల సంతర్పణ
హుద్‌హుద్ తుపాను సాయం పంపిణీలో జన్మభూమి కమిటీల ముసుగులో ఉన్న టీడీపీ సభ్యులు చెప్పినవారికే లబ్ధి చేకూరిందన్న ఆరోపణలున్నాయి. తాజాగా చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ, సంక్రాంతి సంబరాల నిర్వహణలోనూ కొందరికే ప్రాధాన్యత లభిస్తుండటంతో పలువురు టీడీపీ నేతలు మాకెందుకు.. అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కుందువానిపేటలో దీపావళి పర్యటించిన సీఎం చంద్రబాబు పలు హామీలు గుప్పించినా ఇప్పటికీ ఎటువంటి సాయం అందలేదు. దీంతో అక్కడ సంబరాలు జరిపితే ఊరుకునేది లేదని స్థానికులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు తుపానుతో అతలాకుతలమైన ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రభుత్వం సంబరాలు జరపడమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చంద్రన్న కానుకలు కూడా అరకొరగా రావడం, నాసిరకంగా ఉండటం, పూర్తిస్థాయిలో పంపిణీ కాకపోవడంపైనా ప్రజలు మండిపడుతుండటంతో నాయకులు ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు. ఇక నియోజకవర్గ స్థాయిలో పార్టీలో వివాదాలకు దారితీసిన పలు ఉదంతాలు ఉన్నాయి.
వైఎస్సార్‌సీపీ గెలుపొందిన రాజాం, పాలకొండ, పాతపట్నం నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి పూర్తిగా పట్టు కోల్పోయింది. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో ఉన్నా తమకేమీ సాయం చేయడం లేదని అక్కడి టీడీపీ క్యాడర్ ఆరోపిస్తోంది.
ఇచ్చాపురంలో ఇటీవల జరిగిన బదిలీల తంతు అక్కడి ఎమ్మెల్యేకు ఆగ్రహం తెప్పించింది. తాను సూచించిన వారిని కాకుండా మంత్రి తనకు కావాల్సిన వారికి అనుకూలంగా వ్యవహరించడం, గతంలో ఆరోపణ లెదుర్కొన్న, టీడీపీ నాయకులే వ్యతిరేకించిన వారిని ఇక్కడ నియమించడాన్ని స్థానిక ఎమ్మెల్యే తప్పుబడుతున్నారు. సీనియర్ నేత అయిన పలాస ఎమ్మెల్యే స్వపక్షంలోనే విపక్షంగా వ్యవహరిస్తుండటాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల జెడ్పీ సహా వివిధ సమావేశాల్లో ఆయన ఘాటుగా మాట్లాడటాన్ని, పారదర్శకంగా విధులు నిర్వహించని కొందరు అధికారుల తీరును ఎండగట్టడాన్ని పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
పైకి అచ్చెన్నవర్గంతో కలిసి తిరుగుతున్న శ్రీకాకుళం ఎమ్మెల్యే అంతర్గతంగా అసంతృప్తితోనే ఉన్నారని, ఇటీవల ఆమె కోడలు మృతి చెందినప్పుడు పరామర్శకు వెళ్లిన పార్టీ నేతలను ఎమ్మెల్యే భర్త పట్టించుకోకపోవడమే దీనికి నిదర్శనమని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. నరసన్నపేట ఎమ్మెల్యే అచ్చెన్న వర్గంతో తిరుగుతుండడాన్ని మంత్రి వ్యతిరేకవర్గం జీర్ణించుకోలేకపోతోంది. పైగా సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా ఇతర ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలకు మంత్రి, ఎంపీలతో కలిసి హాజరవుతుండడాన్ని పలువురు పార్టీ నేతలు ఆక్షేపిస్తున్నారు. నియోజకవర్గంలో ఇటీవల జరిగిన బదిలీలు కూడా ఎమ్మెల్యేను కాదని మంత్రి సూచించిన వారికి అనుకూలంగా జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. టెక్కలిలో పరిస్థితి వేరేగా కనిపిస్తోంది. ఇళ్లపట్టాల పంపిణీ, మంత్రి సొంత మండలమైన కోటబొమ్మాళిలో ఇటీవల మద్యం కేసులు నమోదు కావడం, వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌లపై కక్షగట్టి చెక్‌పవర్ రద్దు చేయిస్తున్నారనే ఆరోపణలు రావడం కూడా స్థానిక టీడీపీ క్యాడర్‌కు ఇబ్బందిగా మారింది. రాజాంలో పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ వ్యవహారశైలిపైనా తెలుగు తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.