రాజాంలో కళాను అరెస్ట్ చేస్తున్న దృశ్యం
సాక్షి, రాజాం/నెల్లిమర్ల: వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై దాడి ఘటనకు సంబం ధించి టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావును బుధవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం స్టేషన్ బెయిల్‌పై ఆయన్ను విడుదల చేశారు. విజయనగరం జిల్లా రామతీర్థంలోని బోడికొండపై శ్రీరాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడం తెలిసిందే. దీనిపై విజయసాయిరెడ్డి రామతీర్థాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన వాహనంపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగి చెప్పులు, రాళ్లు విసిరారు. ఈ దాడిపై నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసిన టీడీపీ కార్యకర్తలు.. కళా వెంకట్రావు ప్రేరేపించడంతోనే తాము విజయసాయిరెడ్డి వాహనంపై దాడికి పాల్పడినట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అన్ని పరిశీలనల అనంతరం పోలీసులు బుధవారం రాత్రి రాజాంలోని కళా నివాసానికి వెళ్లి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ను చీపురుపల్లికి తరలించారు. తర్వాత చీపురుపల్లి పోలీస్‌స్టేషన్‌లో స్టేషన్ బెయిల్ లభించడంతో ఆయన విడుదలయ్యారు. ఇదిలా ఉండగా, ఇదే కేసులో 8 మంది టీడీపీ నేతలను నెల్లిమర్ల పోలీసులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఇటీవల విజయనగరంలో పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడిన టీడీపీ జిల్లా నేత కూడా ఇందులో ఉన్నారు. గొర్లిపేటకు చెందిన టీడీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్‌తోపాటు మరో ఇద్దరు నేతలు, అలాగే దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న సీతారామునిపేటకు చెందిన ఇద్దరు టీడీపీ నేతలు, పూతికపేటకు చెందిన మరొకరు, నెల్లిమర్లకు చెందిన ఓ టీడీపీ నేత కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment