కళా x చౌదరి!
ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమైంది. ఈ నియోజకవర్గం పరిధిలో ముఖ్యమంత్రి పర్యటనకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. అధికారికంగా ఖరారు కానప్పటికీ.. జనవరి మెుదటి వారంలో పర్యటన ఉండే అవకాశం ఉంది. ఎస్‌ఎంపురం పరిధిలో ట్రిఫుల్ ఐటీ భవనాలకు శంకుస్థాపన, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో రూ.18 కోట్లుతో నిర్మించిన అకడిమిక్ బ్లాక్ ప్రారంభోత్సవం, ఎస్.ఎం.పురం గ్రామంలో జన్మభూమి గ్రామ సభ నిర్వహించేలా కార్యక్రమాలను అధికారులు రూపొందించారు. ఈ మేరకు ఇప్పటికే జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం స్థలాల పరిశీలన, అధికారులకు పలు సూచనలు సైతం చేశారు. అయితే జెడ్పీ చైర్‌పర్సన చౌదరి ధనలక్ష్మి సొంతఊరు, దత్తత గ్రామమైన ఎస్.ఎం.పురంలో జన్మభూమి–మన ఊరు కార్యక్రమాన్ని రద్దు చేయాలని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనరసింహానికి ఫోన్ చేసి కోరడంతోపాటు.. తన నియోజక వర్గంలో తనకు తెలియకుండా గ్రామ సభ ఎలా నిర్వహిస్తారని నిలదీయడంతో రద్దు చేసినట్టు తెలిసింది.
దీంతో ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా తమ సొంత గ్రామంలో జన్మభూమి–మన ఊరు గ్రామ సభ రాజకీయంగా బలపడాలని, తమవర్గాన్ని బలోపేతం చేసుకోవాలన్న జెడ్పీ చైర్‌పర్సన్ వ్యూహం బెడిసి కొట్టింది. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దృష్టికి సైతం ఈ విషయాన్ని చైర్‌పర్సన్ భర్త, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు నారాయణమూర్తి (బాబ్జీ) తీసుకెళ్లారు. అయితే ప్రస్తుతానికి ఈ విషయంలో మంత్రి జోక్యం చేసుకోలేదని సమాచారం. మరోపక్క జెడ్పీ చైర్‌పర్సన్ వర్గాన్ని నిర్వీర్యం చేసేందుకు ఎమ్మెల్యే కళావెంకటరావు కసరత్తులు ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది. ఎస్‌ఎంపురంలో గ్రామ సభను పెట్టకుండా అడ్డుకోవటం ఎంత వరకు న్యాయమనే అంశంపై చైర్‌పర్సన్ భర్త బాబ్జీ ఎచ్చెర్ల మండల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన కొంతమంది వాట్సాఫ్‌లో సమాచారాన్ని ఎమ్మెల్యే కళావెంకటరావుకు చేరవేశారు. కళా, చౌదరి వర్గాల మధ్య వర్గపోరుకు ఈ సంఘటన ఉదాహరణగా ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు.
సొంత సామాజిక వర్గం దూరం!
సొంత సామాజిక వర్గానికి చెందిన నాయకులే చౌదరి దంపతులకు దూరమవుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొయ్యాం గ్రామానికి చెందిన ఓ నాయకుడుని జెడ్పీచైర్‌పర్సన్ వర్గం పార్టీలో చేర్చుకోవడానికి అనుమతులు ఇవ్వగా..దాన్ని కళా వర్గం అడ్డుకుంది. తరువాత ఎమ్మెల్యే చుట్టూ ప్రదక్షిణలు చేశాక ఎట్టకేలకు అతన్ని చేర్చుకున్నారు. ఎచ్చెర్ల మండలంలో చైర్‌పర్సన్ సొంత సామాజిక వర్గం నాయకులే ఆమెకు అండగా నిలబడే పరిస్థితులు కనిపించటం లేదు. ప్రస్తుత చైర్‌పర్సన్ భర్త బాబ్జీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైర్మన్ పేనల్‌గా ఉన్న ఆయన భార్య ధనలక్ష్మికి జెడ్పీటీసీ టిక్కెట్ రాకుండా సైతం కళావర్గం అడ్డుకుంది. దీనికి చౌదరి బాబ్జీ సొంత సామాజక వర్గానికి చెందిన కొత్తపేట నాయకులే వ్యూహాన్ని ముందుండి నడిపారు. ప్రస్తుతం 28 పంచాయతీల్లో ఫరీదుపేట, కేశవరావుపేట, కుశాలపురం గ్రామాల నాయకులు మాత్రమే బాబ్జీకి అండగా ఉంటున్నారు.
మిగతా వారందరు కళా వర్గానికి చేరువవుతున్నారు. కొత్తగా పార్టీలో చేరిన కొ య్యాం, అజ్జరాం నాయకులు సైతం ఎమ్మెల్యే వర్గంతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ హోదా, మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు మద్దతు చౌదరి దంపతులకు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే వర్గాన్ని ఎదుర్కొనే పరిస్థితులు కనిపించటం లేదు. చాపకింద నీరులా చౌదరి బాబ్జీ కుటుంబాన్ని రాజకీయంగా అణగ తొక్కాలన్న ప్రయతాన్ని కళావెంకటరావు ప్రారంభించారు. రాజాం నుంచి వలస వచ్చిన ఎమ్మెల్యే కళా వ్యూహాత్మకంగా పావులు కదుపుతుండగా.. స్థానిక నాయకుడైన బాబ్జీ వర్గం దాన్ని తిప్పికొట్టలేక పోతుంది. మరో పక్క సొంత మండలమైన ఎచ్చెర్లలో బాబ్జీ దంపతులకు క్రమేపీ బలం తగ్గుతోంది. భవిష్యత్తులో కళావెంకటరావు మంత్రి అవుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన పంచన చేరేందుకు తెలుగుదేశం పార్టీకి చెందిన మండల, గ్రామస్థాయి నాయకులు ఆయనకు దగ్గరయ్యేకు ప్రయత్నిస్తున్నారు.