గత ఎన్నికల్లో రిజర్వేషన్ల దెబ్బతో వలస వచ్చి, వేరే పార్టీ తరఫున పోటీ చేసిన ఆ నేతకు పరాభవం ఎదురైంది. అతని పార్టీయేమో పదేళ్లుగా అధికారానికి దూరమైంది. ఈసారి మళ్లీ సొంత గూటికే చేరి పోటీ చేస్తున్నా.. కనుచూపు మేరలో గెలుపు అవకాశాలు కనిపించడం లేదు. మరేం చేయాలి?.. ఉందిగా ప్రలోభాల మార్గం.. దానికి నిధుల కొరత లేదు. అటు పార్టీ తరఫున కార్పొరేట్ లాబీ నిధులు కుమ్మరిస్తోంది.. ఇటు సొంత ఆర్థిక వనరులు ఉండనే ఉన్నాయి. ఇంకేముంది ఎచ్చెర్ల టీడీపీ అభ్యర్థి కళా వెంకట్రావు.. ప్రలోభాల కళ ప్రదర్శిస్తున్నారు. పంచాయతీకి ఒక రేటు.. మద్యం కోటా నిర్ణయించి మరీ మందూమనీ పారిస్తున్నారు.
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: దశాబ్ద కాలంగా టీడీపీ అధికారానికి దూరంగా ఉంది.. ఈసారి ఎలాగైనా దాన్ని దక్కించుకోవాలని ఆ పార్టీ నేతలు తెగ ఆరాట పడుతున్నారు. ఈసారి కాకపోతే.. రాజకీయ భవిష్యత్తు శూన్యమవుతుందన్న ఆందోళన వారిని అడ్డదారులు తొక్కిస్తోంది. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. దాని కోసం ఎంత డబ్బయినా వెదజల్లుతాం.. ఎంత మందు కావాలన్నా పోయిస్తాం.. అన్న రీతిలో బరి తెగిస్తున్నారు. ముఖ్యంగా ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆ పార్టీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు ఓటర్లను ప్రలోభపరిచేందుకు గ్రామాలను నోట్ల కట్టలు, మందు సీసాలతో ముంచెత్తుతున్నారు. పంచాయతీకి రూ.5 లక్షల నగదు, కనీసం 20 కేసుల మద్యం పంపిణీకి వ్యూహం రూపొందించుకొని పకడ్బందీగా అమలు చేస్తున్నారు.
గ్రామాల్లో ఎదురు‘గాలి’
2004లో కళా వెంకట్రావు ఉణుకూరు ఎమ్మెల్యేగా ఎన్నికైనా, రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ చతికిలపడి ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన కారణంగా ఉణుకూరు పోయి రాజాం నియోజకవర్గం ఏర్పడింది. అయితే దాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేయడంతో 2009 ఎన్నికల్లో నియోజకవర్గంతో పాటు పార్టీ కూడా మారిన కళా ఎచ్చెర్ల నుంచి ప్రజారాజ్యం తరపున పోటీ చేశారు. అయితే మూడో స్థానంలోనే ఆగిపోవడం, ప్రజారాజ్యం కూడా ఘోర పరాజయం చవిచూడటంతో అధికారం అందకుండా పోయింది. ఆ తర్వాత పరిణామాల్లో తిరిగి టీడీపీలో చేరిన ఆయన ఈ ఎన్నికల్లో మళ్లీ ఎచ్చెర్లలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే వైఎస్‌ఆర్‌సీపీ నుంచి ఆయనకు ఎదురుగాలి వీస్తోంది.
గ్రామాల్లో రోజు రోజుకు ఫ్యాన్ గాలి ప్రభంజనంలా మారుతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై చెరగని ఆదరణ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిపై ప్రజల్లో ఉన్న నమ్మకం, ఆ పార్టీ అభ్యర్థుల, నాయకుల ప్రచారాలకు లభిస్తుందన్న విశేష ఆదరణ టీడీపీ నేతలను కలవరపరుస్తున్నా యి. దాంతో కళా వెంక ట్రావు డబ్బు మూట లు, మద్యం కేసులతో పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకోవాలని కుయుక్తు లు పన్నుతున్నారు. రోజూ తాను ప్రచారానికి వెళ్లే గ్రామాలకు ఒక్కోదానికి ఐదు మద్యం కేసులు, రూ.40 వేల నగదు ముం దుగానే అందజేస్తున్నారు. వాటితోనే స్థానిక టీడీపీ నేతలు జనాలను పోగు చేస్తున్నారు.
పోలింగుకు మరో ప్రణాళిక
కీలకమైన పోలింగ్‌కు మరో ప్రణాళిక సిద్ధం చేశారు. పోలింగుకు మూడు నాలుగు రోజుల ముందు నుంచే గ్రామాలను కొనేయాలని ఎత్తులు వేస్తున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో 115 పంచాయతీలున్నాయి. ప్రతి పంచాయతీకి రూ.5 లక్షల నగదు, 20 కేసుల మద్యం పంపిణీకి టీడీపీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధమైన ఈ ప్రక్రియను మూడో కంటికి తెలియకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు ఐదు గ్రామాలకు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ అభ్యర్థి ఆర్థికంగా బలవంతుడు కావడంతో నోట్లతో ఓట్లు కొనాలని అన్ని రకాల ఎత్తులు వేస్తున్నారు. అయితే గ్రామాల్లో మెజారిటీ ఓటర్లు ఇప్పటికే వైఎస్‌ఆర్‌సీపీకి ఓటు వేయాలని నిర్ణయించుకోవడం, గ్రామాల్లో ఆ పార్టీకి కూడా బలమైన క్యాడర్ ఉండటంతో టీడీపీ చేపట్టిన ప్రలోభాల పర్వం ఉద్రిక్తతలకు దారి తీసే ప్రమాదముంది.
ప్రలోభాల ‘కళ’!
Published Sat, May 3 2014 2:11 AM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM
Advertisement
Advertisement