TDP: రోడ్డెక్కి రచ్చ చేస్తామని హెచ్చరిక.. ఉలిక్కిపడ్డ కళా.. | TDP Kala Venkata Rao Relative Cheats Etcherla People | Sakshi
Sakshi News home page

TDP: రోడ్డెక్కి రచ్చ చేస్తామని హెచ్చరిక.. ఉలిక్కిపడ్డ కళా..

Published Tue, Sep 27 2022 8:25 AM | Last Updated on Tue, Sep 27 2022 8:26 AM

TDP Kala Venkata Rao Relative Cheats Etcherla People - Sakshi

తెలుగుదేశం జమానాలో జన్మభూమి కమిటీల పెత్తనాలు.. ఆ ముసుగులో వారి ఆగడాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేల బంధువులు సైతం జన్మభూమి కమిటీ నేతలమంటూ జనంపై స్వారీ చేసేవారు. పథకాలు కావాలంటే ముడుపులు కట్టాల్సిందేనంటూ విచ్చలవిడిగా వసూళ్లకు తెగబడేవారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో మాజీమంత్రి కళా వెంకటరావు బంధువు ఒకాయన కూడా రాబంధువులా మారి జనాలను పీక్కు తిన్నాడు. ప్రభుత్వ పథకాల ద్వారా ఆవులు, గేదెలు, ఇళ్లు ఇప్పిస్తామంటూ వేలకు వేలు వసూలు చేశాడు. అలాగని పథకాలు మంజూరు చేయించలేదు.. దండుకున్న డబ్బులూ తిరిగి ఇవ్వలేదు. దీనిపై అప్పట్లోనే బాధితులు నిలదీసినా అధికార మదంతో అణచి వేశారు. మూడేళ్ల తర్వాత కూడా తమ డబ్బులు రాకపోవడంతో బాధితులంతా మూకుమ్మడిగా కళా వారి నివాసానికి వెళ్లి నిలదీశారు. రోడ్డెక్కి రచ్చ చేస్తామని హెచ్చరించారు. దాంతో ఉలిక్కిపడిన కళా కుటుంబీకులు కొందరికి చెల్లింపులు జరిపారు.  

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎచ్చెర్ల నియోజకవర్గంలో టీడీపీ నేతల వ్యవహారాలు రోజుకొకటిగా బయటపడుతున్నాయి. మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు బంధువు పంచాయితీ ఇప్పటికీ పరిష్కారం కాలేదు. అధికారంలో ఉన్నప్పుడు అందరి వద్ద డబ్బులు తీసుకుని, ఆ తర్వాత ముఖం చాటేయడం పంచాయితీ కళా వద్దకు చేరడంతో కొన్ని రోజులుగా నియోజకవర్గంలో ఇదే చర్చ నడుస్తోంది.  

తెలిసిన బాగోతమే 
టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పెత్తనం అంతా ఇంతా కాదు. కమిటీ సభ్యుల ముసుగులో టీడీపీ నేతలు చెలరేగిపోయారు. ప్రజలకు ఏం కావాలన్నా ముడుపులు ముట్టజెప్పాల్సిన పరిస్థితులు ఉండేవి. సంక్షేమ పథకాలు అందాలంటే చేతులు తడపాల్సి వచ్చేది. ప్రతి పథకానికి ఒక రేటు పెట్టి వసూళ్ల దందా చేశారు. ఇక, నాడు మంత్రులు, ఎమ్మెల్యేలుగా పదవులు చేపట్టిన నాయకుల బంధువులు, అనుచరులైతే మరింత రెచ్చిపోయారు. అయిన దానికి కాని దానికి ప్రజలను పీడించేశారు. కొన్ని పథకాలు మంజూరు చేస్తామంటూ డబ్బులు తీసుకుని చేతులేత్తేసిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి ఘటనలు ఇప్పుడు టీడీపీలో రచ్చ చేస్తున్నాయి. ఆ పార్టీలో గొడవకు దారితీస్తున్నాయి.    

పథకాల కోసం వసూళ్లు
జి.సిగడాం మండలం నిద్దాం, అద్వానంపేట గ్రామాల్లో తెలుగు దేశం ప్రభుత్వం హయంలో ఆవులు, గేదెలు రాయితీపై మంజూరు చేస్తామని 40 మంది లబ్ధిదారుల నుంచి మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు బంధువు అధిక మొత్తంలో వసూళ్లు చేశారు. ఆ గ్రామంలో జన్మభూమి కమిటీ నాయకుడిగా పెత్తనం చెలాయిస్తూ పథకాల పేరుతో భారీ మొత్తంలో లబ్ధిదారుల నుంచి తీసుకున్నారు. ఇళ్లు కూడా మంజూరు చేస్తామని చెప్పి వసూళ్లకు తెగబడ్డారు. ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ.20వేలు వరకు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ, వారికి న్యాయం చేయలేదు. చెప్పినట్టుగా ఆవులు, గేదెలు, ఇళ్లు మంజూరు చేయించలేదు. అలాగని తీసుకున్న డబ్బులు వెనక్కి ఇవ్వలేదు. ఇదే విషయమై టీడీపీ హయాంలో జరిగిన జన్మభూమి–మా ఊరు గ్రామసభలో కూడా అప్పట్లో కొందరు నిలదీశారు. ఇదిగో అదిగో అంటూ తాత్సారం చేస్తూ వచ్చారే తప్ప టీడీపీ ప్రభుత్వం దిగిపోయేవరకు వాపసు చేయలేదు. 

కళా వద్దకు చేరిన పంచాయితీ.. 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చినా కూడా వారిలో స్పందన లేదు. దీంతో బాధితులంతా ఏకమై మాజీ మంత్రి కళా వెంకటరావు నివాసం ఉంటున్న రాజాం వెళ్లి గట్టిగా నిలదీశారు. పథకాల కోసం తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించకపోతే రోడ్డెక్కుతామని, అవసరమైతే మీడియాకు తెలియపరుస్తామని కళా ముందే హెచ్చరించారు. దీంతో కళాతో పాటు ఆయన బంధువు ఉలిక్కి పడ్డారు. ఇది కాస్త వివాదంగా మారింది.

మీడియా ప్రతినిధులకు, నియోజకవర్గ టీడీపీ కేడర్‌కు ఇదంతా తెలిసింది. చెప్పాలంటే దావానంలా వ్యాపించింది. దీంతో గుట్టుగా యుద్ధ ప్రాతిపదికన ఒక్కొక్కరికీ వెయ్యి రూపాయలు తగ్గేంచేసి కొంతమందికి చెల్లింపులు చేశారు. మరికొంతమందికి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ తంతు ఇప్పుడు జి.సిగడాం మండలంలోనే కాకుండా ఎచ్చెర్ల నియోజకవర్గంలోనే హాట్‌ టాపిక్‌ అయింది.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement