సాక్షి, శ్రీకాకుళం: ఫ్యాన్ గెలుపు సునామీలో సైకిల్ కొట్టుకుపోయింది. తలపండిన టీడీపీ నేతలకు దిమ్మతిరిగేలా ఓటర్లు షాక్ ఇచ్చారు. అవినీతిపరుల పాలనను మూకుమ్మడిగా తిరస్కరించారు. రాజకీయ ఓనమాలు నేర్చుకుంటున్న నవ నాయకత్వానికి పట్టం కట్టారు. జిల్లాలో ఎచ్చెర్ల, పాతపట్నం, పలాస నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు తొలిసారి గెలుపు రుచేంటో చూపించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో తొలిసారి అడుగిడునున్న రెడ్డి శాంతి, గొర్లె కిరణ్‌కుమార్, సీదిరి అప్పలరాజుల గెలుపునకు దోహదపడిన కొన్ని అంశాలు చదివిద్దేమిలా..
డాక్టర్ దెబ్బకు టీడీపీ కోట బద్దలు
మందస: ఓ వైపు సుదీర్ఘ రాజకీయ అనుభవం.. సామ, దాన, భేద, దండోపాయాలు తెలిసిన నాయకత్వం గౌతు శ్యామసుందర శివాజీ సొంతం. మరోవైపు పిన్న వయస్కుడు, అతిసామాన్య కుటుంబం నుంచి వచ్చిన యువ నాయకుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు భారతంలోని అభిమన్యుడు లాంటి వాడే. ఈయన కురువృద్ధుడు లాంటి శివాజీ రాజకీయ బాణాలను, పాశుపతాస్త్ర, బ్రహ్మాస్త్రాలతో ఎదుర్కొని జయకేతనం ఎగురవేశారు. వజ్రపుకొత్తూరు మండలంలోని ఓమారుమూల గ్రామమైన దేవునల్తాడలో ఓ సామాన్య మత్స్యకార కుటుంబానికి చెందిన సీదిరి దాలయ్య, నీలమ్మ దంపతులకు అప్పలరాజు జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న సామెతను రుజువు చేస్తూ, విద్యలో మంచి ప్రతిభ చూపారు. ఎంబీబీఎస్ చదివి పలాస–కాశీబుగ్గలో ప్రాక్టీసు చేస్తూ ఎంతో మంచి వైద్యునిగా పేరు తెచ్చుకున్నారు.
రెండేళ్ల క్రితం వైఎస్సార్‌సీపీ అప్పలరాజు ప్రతిభ, నిపుణత చూసి, పలాస నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. ఏమాత్రం రాజకీయ అనుభవం లేకున్నా రాజకీయాల్లో దూసుకుపోయారు. ప్రజల మనసులో మంచిస్థానం సంపాదించగలిగారు. ఈయన్ను ఎదుర్కొనలేక టీడీపీ కుటిల యత్నాలకు దిగింది. ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యే గౌతు శివాజీ, అభ్యర్థిగా శిరీష, ఆమె భర్త వెంకన్నచౌదరి, గౌతు విజయలక్ష్మి, జీకే నాయుడు, పీరికట్ల విఠల్‌రావు, వజ్జ బాబురావు ఇలా ఒకరేమిటి ఎంతోమంది రాజకీయ అనుభవం గల నాయకులు ఒక వైపు.. తానొక్కడే ఒంటిచేత్తో మరో వైపు పోరాడిన అప్పలరాజు సునాయాస విజయాన్ని చేజిక్కించుకున్నారు. అత్యధికంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన శివాజీ కుమార్తె శిరీషను ఓడించి, పలాసలో వైఎస్సార్‌సీపీకి స్థానం కల్పించిన డాక్టర్ సీదిరి అప్పలరాజు రాజకీయ వ్యూహానికి రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోతున్నారు.
రెడ్డి శాంతి ప్రభంజనం
ఎల్.ఎన్.పేట: పాతపట్నం నియోజకవర్గంలో రెడ్డి శాంతి గెలుపు జన ప్రభంజనంగా నిలిచింది. ఈమెను ఓడించాలని అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు పన్నిన కుయుక్తులు ఓటర్ల సునామీలో కొట్టుకుపోయాయి. స్థానికేతరాలని, ఈమెను కలవాలంటే ఢిల్లీ వెళ్లాలా అంటూ ప్రత్యర్థి పార్టీ నాయకులు చేసిన ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారు. వంశధార నిర్వాసితులను బలవంతంగా గ్రామాల నుంచి బయటకు పంపించిన తెలుగుదేశం పార్టీకి వారి ఉసురే తగిలిందని నిర్వాసిత గ్రామాల్లో చర్చించుకుంటున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు నిర్వాసితుల అండగా నిలుస్తారని భావించినప్పటికీ గట్టి గుణపాఠమే చెప్పారు. మెళియాపుట్టి మండలంలో ఆఫ్‌షోర్ రిజర్వాయర్‌లో నష్టపోయిన బాధితుల సమస్యలతోపాటు వంశధార నిర్వాసితుల సమస్యలపైన పోరాటం చేస్తూ అండగా నిలిచిన ఈమె తన విజయానికి బాటలు వేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లు చేసిన అక్రమాలు ప్రజలకు వివరించడంతోపాటు ప్రజలకు అండగా ఉంటానని నియోజకవర్గం మొత్తంగా పర్యటించినందుకు ప్రజలంతా అక్కున చేర్చుకున్నారు.
కిరణ్‌కే పట్టం
ఎచ్చెర్ల క్యాంపస్: రాజకీయ కురువృద్ధుడు, మంత్రి కళా వెంకటరావును ఎచ్చెర్ల నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మట్టి కరిపించారు. టీడీపీ పాలనలో ప్రతిపక్ష పార్టీ ఉనికి లేకుండా చేసిన కళాకు ఓటర్లు సైతం గట్టి సమాధానమిచ్చారు. ఈ మేరకు స్థానిక నేత గొర్లె కిరణ్‌కుమార్‌కు బ్రహ్మరథం కట్టారు. 2014 ఎన్నికల్లో కళా వెంకటరావు చేతిలో కిరణ్ ఓటమి చవిచూశారు. అయినప్పటికీ నిరాశ చెందకుండానే వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలసి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యలపై పోరాడుతూ వచ్చారు. ఈ దఫా ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్టు కోసం మీసాల నీలకంఠంనాయుడు కూడా పోటీపడినప్పటికీ కొన్ని నెలల క్రితం ఈయన మంత్రి కళా లాబీయింగ్‌తో టీడీపీలో చేరిపోయారు. దీంతో కిరణ్‌కుమార్‌కు టిక్కెట్టు ఖాయమైంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఆర్థికంగా బలమైన అభ్యర్థి కావటంవ వల్ల కళా విజయం తథ్యంగా టీడీపీ వర్గాలు భావించాయి. అయితే కిరణ్‌కుమార్ స్థానికుడు కావటం, ఎన్నికల్లో ఓడినా నిరంతరం ప్రజల్లో ఉండటంలో అన్ని వర్గాల ప్రజలు మద్దతుగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment