దీక్షా సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బస్సులు లేకపోవడంతో ప్రయాణికుల అవస్థలు
హోదా విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం వంచించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి ధర్మపోరాటదీక్ష చేపట్టారు. నాలుగేళ్లపాటు కేంద్రంలో అంటకాగి... హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అంటూ చిలకపలుకులు
పలికి...చివరకు జనం ఆకాంక్ష తెలుసుకుని మళ్లీ హోదాయే కావాలంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఇప్పుడు తప్పుతెలుసుకున్నానని జనాన్ని నమ్మించేందుకే ఈపోరాట దీక్ష పేరుతో సభలు పెడుతు
న్నారు. కానీ జనాన్ని తరలించేందుకువందలాది ఆర్టీసీ బస్సుల్ని వాడుకోవడంతో అసలైన ప్రయాణికులు రాకపోకలకుచాలా అవస్థలు పడ్డారు.
విజయనగరం గంటస్తంభం: విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టి ఏకంగా నాలుగున్నరేళ్లు గడిచింది. రాష్ట్ర రాజధాని మొదలు అనేక విషయాల్లో అంతా తానే చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకున్న ముఖ్యమంత్రి చివరికి ఏమీ చేయలేక ఆ నింద కేంద్ర ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేశారు. విజయనగరంలో మంగళవారం జరిగిన ధర్మపోరాట దీక్షలో ఈ మేరకు కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఏ అంశాల్లోనైతే ప్రధాని మంత్రిని పొగిడారో అవే అంశాలపై తీవ్ర విమర్శలు చేయడం విశేషం. ఇదిలాఉండగా ధర్మపోరాట సభకు భారీగా జనాన్ని తీసుకొచ్చేందుకు తెలుగుదేశం నాయకులు ఆపసోపాలు పడ్డారు. తాయిలాలు ఇచ్చి తెచ్చుకున్నారు. మరోవైపు సీపీఐ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. పాఠశాలకు మధ్యాహ్నం నుంచి సెలవులు ఇచ్చేశారు. పాఠశాల నుంచి విద్యార్థులతో బయటకు వచ్చిన బస్సులను పోలీసులు ఎక్కడికక్కడ నిలువరించడంతోట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి అవస్థలు పడ్డారు.
విమర్శలకే పెద్దపీట
విజయనగరం ఆయోధ్యమైదానంలో మంగళవారం తెలుగుదేశం పార్టీ ధర్మపోరాట దీక్ష సభ నిర్వహించింది. ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతోపాటు రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర పార్టీ నాయకులు హాజరయ్యారు. వీరంతా తమ ప్రసంగాల్లో అధిక సమ యం కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శలు చేసేందుకే వెచ్చించారు. పనిలోపనిగా రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పైనా కూడా విమర్శలు గుప్పించారు.
అంతా కేంద్రం వల్లేనట
సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు ఇతర నేతలు రాష్ట్రంలో తమ వైఫల్యాలను కూడా కేంద్రంపై నెట్టేందుకు విఫల యత్నం చేశారు. ముఖ్యంగా ఇన్నాళ్లూ ప్రత్యేకహోదా విషయంలో మాట తప్పిన ముఖ్యమంత్రి హోదా అవసరం లేదని, హోదా అగితే జైళ్లకు పంపిస్తామని హెచ్చరించారు. ప్రత్యేక హోదా కంటే బెటర్ ప్యాకేజీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. మట్టినీళ్లు ఇచ్చినపుడు మిన్నకున్నారు. ఇప్పుడు ప్రజల్లో ప్రత్యేకహోదా నినాదం బలంగా ఉండడంతో ఆ తప్పును కేంద్రప్రభుత్వంపై నెట్టేందుకు ప్రత్యేకహోదా విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట తప్పారని స్క్రీన్‌పై మరీ ఆయన అప్పట్లో అన్నమాటలు వేసి చూపించడం ఇందుకు నిదర్శనం. అంతేకాదు పోలవరం తానే కడతానని కేంద్రం నుంచి లాక్కొని, ఎన్నికలకు ముందే పూర్తి చేస్తానన్నారు. ఇప్పుడు పూర్తి చేయలేకపోవడంతో ఆ నిందను కేంద్రంపై నెట్టేందుకు తీవ్రంగా యత్నించారు. విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ, దుగ్గరాజుపట్నం ఫోర్టు విషయంలో కూడా నాలుగేళ్లు ఏమనకుండా ఉండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కేంద్రం నాలుగేళ్లలో చాలా చేసిందని చెప్పిన ముఖ్యమంత్రి, ఆపార్టీ నాయకులు ఇప్పుడు కేంద్రం సహకరించలేదని మండిపడ్డం విశేషం. ఇదిలాఉంటే నోట్లరద్దుతో జనాన్ని ఇబ్బంది పెట్టారనీ, జీఎస్‌టీవల్ల ప్రజలపై మోయలేని భారం మోపారని మండిపడ్డారు. ఈ రెండింటినీ నాడు మొదట సమర్థించింది చంద్రబాబు నాయుడే కావడం అంతా గుర్తు చేసుకున్నారు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు తలుపులు మూసి విభజించిందని అప్పట్లో ఆరోపించిన నాయకులు కాంగ్రెస్‌తో తాజాగా తెలంగాణలో జత కట్టి అదంతా దేశం కోసమే నంటూ చెప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరచింది.
తాయిలాలు ఇచ్చి జనసమీకరణ
ధర్మపోరాట దీక్ష 2గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. ఆ సమయానికి జనాల కోసం వేసిన కుర్చీలు కొన్ని కూడా నిండలేదు. తెలుగుదేశం నాయకులు భారీగా జన సమీకరణ చేయాలని భావించి 1200 బస్సులను జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు పంపారు. రావడానికి చాలామంది ఆసక్తి చూపలేదు. కొన్ని ప్రాంతాలనుంచి ఖాళీ బస్సులే వచ్చేశాయి. డబ్బు, మద్యం ఇచ్చి బలవంతంగా తెప్పించారు. ఎక్కడికక్కడ మద్యంతో బిర్యానీలు తినడం కనిపించింది. ఇదిలాఉంటే జనం వస్తారో రారో అన్న అనుమానంతో అధికారపార్టీ నాయకులు వెలుగు అధికారులను పిలిచి మహిళా సంఘాలను పంపించే బాధ్యత అప్పగించారు. ఏదైతే నేం 3గంటల సమయానికి కాస్త సభ కళకళలాడింది. సభకు జనాన్ని తరలించేందుకు నాలుగు జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులు తెప్పించారు. సాయంత్రం పట్టణంలో ప్రజలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకోవడం, స్కూల్ బస్సులు, విద్యార్ధులను కూడా ఆపేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు భగ్గుమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment