సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతిభా భారతికి రాజకీయ సమాధి
సీనియర్ నాయకురాలిపై చిన్నచూపు
సొంత నియోజకవర్గంలోటిక్కెట్ లేకుండా చేసిన వైనం
తొడగొట్టిన గ్రీష్మకు పంగనామాలు
కాంగ్రెస్‌పార్టీకి చెందిన వలసనేతకోండ్రుకు అందలం
డబ్బుకు టికెట్ అమ్మేసిన వైనం
25 ఏళ్లుగా మరో ప్రభుత్వ ఉద్యోగినికి ఆశచూపి ఎగనామం
చంద్రబాబు వంచన రాజకీయంపై భగ్గుమంటున్న టీడీపీలోని ఓ వర్గం
విజయనగరం: కావలి ప్రతిభా భారతి... టీడీపీ సీనియర్ నాయకురాలు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో ఆమె కీలక నేత. మంత్రిగా, స్పీకర్‌గా ఆమె విశేష సేవలు అందజేశారు. చిత్తశుద్ధి, విలువలతో కూడిన రాజకీయాలకు ఆమె కేరాఫ్‌గా మారారు. అలాంటి నాయకురాలి కుటుంబానికి చంద్రబాబు నాయుడు రాజకీయ సమాధికట్టారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్టే ప్రతిభా భారతి కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశారని సొంత పార్టీ నాయకులే పెదవి విరుస్తున్నారు. తన సొంత నియోజకవర్గంలో టీడీపీ టికెట్ కేటాయించకుండా.. డబ్బులకోసం వలసనాయకుడికి టికెట్ అమ్మేశారని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు గెలిచి రాష్ట్రంలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ప్రతిభా భారతిని చంద్రబాబు నిలువునా ముంచడంతో ఏమిచేయాలో తోచక.. చంద్రబాబు, కోండ్రుల కుట్ర రాజకీయాలను చూసి ఓర్వలేక.. సొంతగ్రామానికి కూడా రాకుండా విశాఖపట్నం, హైదరాబాద్‌లలో ఆమె గడుపుతున్నారు.
గ్రీష్మకు రిక్తహస్తం..
ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ టీడీపీ కోసం చాలా కష్టపడ్డారు. తల్లికి అండగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 2014 నుంచి 2019 వరకూ రాజాంలోనే ఉంటూ అనేక కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు సొంత సొమ్ము ఖర్చుచేశారు. 2019లో టిక్కెట్ వస్తుందని ఆశపడి భంగపాటుకు గురయ్యారు. తల్లీకూతుళ్ల వద్ద డబ్బులు లేవని చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి చెందిన కోండ్రును టీడీపీలోకి తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంబాల జోగులు చేతిలో 16,800 ఓట్ల తేడాతో కోండ్రు ఓడిపోయారు. అనంతరం దాదాపు మూడున్నరేళ్లు నియోజకవర్గంలో టీడీపీ కేడర్‌ను ఆయన పట్టించుకోలేదు.
ఈ సమయంలో గ్రీష్మ పార్టీకి అండగా నిలిచారు. 2022లో ఒంగోలులో జరిగిన టీడీపీ మహానాడు సభలో తొడగొట్టి వైఎస్సార్‌సీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. టికెట్ తనకే వస్తుందని ఆశపడ్డారు. రాజాంలో చంద్రబాబు, లోకేశ్‌ల పర్యటనల విజయవంతానికి కృషిచేశారు. చివరకు తండ్రీకొడుకులిద్దరూ ఆమెకు టికెట్ కేటాయించకుండా పంగనామాలు పెట్టడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని తమ అనుచరుల వద్ద తరచూ ఏకరువు పెడుతూ.. కోండ్రును చిత్తుగా ఓడించేందుకు తమదైన శైలిలో పావులు కదుపుతున్నట్టు సమాచారం.
25 ఏళ్లుగా ఊరిస్తూ..
మరోవైపు అటు పాలకొండ ఎస్సీ నియోజకవర్గంగా, ఇటు రాజాం నియోజకవర్గం ఏర్పడిన తరువాత పాలకొండ, రాజాం ప్రాంతాల్లో నివసిస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగినికి కూడా చంద్రబాబు నిరాశే చూపించారు. 1994 నుంచి ఓ ప్రభుత్వ ఉద్యోగి టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తూ వస్తోంది. టీడీపీ కార్యక్రమాలకు అండగా ఉంటూ ఆర్థిక సాయంచేస్తూ వచ్చింది. పాలకొండ ఎస్సీ రిజర్వేషన్‌లో ఉన్న సమయంలోనే ఆమెకు టికెట్ ఇస్తామని టీడీపీ ఆశచూపింది.
అప్పట్లో పలు పత్రికల్లో కూడా ఆమె పేరు బయటకు వచ్చింది. ఆమెకు టికెట్ కేటాయిస్తామని ఆశచూపిన చంద్రబాబు.. తిరిగి నిరాశే మిగిల్చారు. డబ్బున్నవారికే టీడీపీ టిక్కెట్ ఇస్తామని చేతలతో స్పష్టంచేశారు. రాజాంలో సోమవారం నిర్వహించిన ప్రజాగళం సభకు కూడా టీడీపీ వ్యతిరేక వర్గం హాజరుకాలేదు. ప్రతిభాభారతి అభిమానులు, ఇటు సామాజిక వర్గ నేతలు తమ ప్రతాపాన్ని ఓటు రూపంలో చూపిస్తామని చెబుతున్నారు. కన్నింగ్ నాయకుడికి బుద్ధిచెబుతామని స్పష్టంచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment