ఉమ్మడి విజయనగరంలో రెండు
చక్కెర కర్మాగారాలు నాశనం
కమీషన్ల కోసం రైతుల నోట మట్టికొట్టిన నాటి టీడీపీ పాలకులు
చెరకు రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
బకాయిలు చెల్లించడంతో రైతన్నలకు ఊపిరి
వాస్తవాలను దాచిపెట్టి టీడీపీ నాయకుల దుష్ప్రచారం
సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల కోసం కొత్త నాటకం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వ్యవసాయాధార ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో ఒకప్పుడు చెరకు సాగు రైతులకు లాభదాయకమైన పంట. ఇందుకు భీమసింగి సహకార చక్కెర కర్మాగారం, లచ్చయ్యపేట వద్దనున్న ప్రభుత్వ చక్కెర కర్మాగారం వల్ల ఎంతో మేలు పొందేవారు. కానీ వాటిని చూసి చంద్రబాబుకు కన్నుకుట్టింది. కమీషన్ల కోసం రైతుల కడుపుకొట్టడానికి వెనుకాడలేదు. ఆ రెండు చక్కెర కర్మాగారాల జీవం తీసేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు 14 ఏళ్ల పాలన వాటికి శాపంగా మారింది. భీమసింగి చక్కెర కర్మాగారాన్ని మొట్ట మొదట మూతవేసింది 2003లోనే.
అదే సమయంలోనే సీతానగరం మండలం లచ్చయ్యపేటలోనున్న ప్రభుత్వ చక్కెర కర్మాగారాన్ని అత్యంత చౌకగా ప్రైవేట్‌పరం చేసేశారు. 2004లో వై.ఎస్. రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత భీమసింగి సుగర్ ఫ్యాక్టరీకి జీవం పోశారు. లాభాల బాట పట్టించారు. మళ్లీ 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత యథావిధిగా నష్టాల్లో ముంచారు. ఫ్యాక్టరీ అభివృద్ధి కోసం రైతుల వంతుగా సేకరించిన రూ.5 కోట్ల సొమ్మును అప్పటి టీడీపీ నాయకులు దుర్వినియోగం చేశారు. చంద్రన్న విషగుళికల్లాంటి అసంజస నిర్ణయాల ఫలితంగా చెరకు రైతులు దారుణంగా నష్టపోయారు.
భీమసింగిలో ఇలా...
చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా పాలన (1995–2003)లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనున్న 18 ప్రభుత్వ, సహకార చక్కెర కర్మాగారాల్లో 8 ప్రైవేట్‌పరం చేసేశారు. ఆ సమయంలోనే భీమసింగి సుగర్ ఫ్యాక్టరీపై కత్తికట్టారు. 2003–04 సీజన్‌లో క్రషింగ్ చేయకూడదని ఆదేశాలివ్వడంతో తొలిసారిగా మూతపడింది. పాదయాత్రలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఫ్యాక్టరీని తెరిపించారు.
ప్రభుత్వ గ్యారెంటీతో రూ.3.50 కోట్ల రుణం అందించారు. ఫ్యాక్టరీకి గుదిబండగా మారిన అప్పులు రూ.18.04 కోట్లను ప్రభుత్వ షేరు ధనంగా మార్చారు. ఆధునికీకరణకు రూ.36.18 కోట్లు మంజూరు చేశారు. తద్వారా క్రషింగ్ సామర్థ్యాన్ని 1205 మెట్రిక్ టన్నుల నుంచి 2 వేల మెట్రిక్ టన్నులకు పెంచడం, పవర్ ప్లాంట్ ఉత్పత్తి కూడా 1.5 కిలోవాట్ల నుంచి 12 కిలోవాట్లకు పెంచడం లక్ష్యాలుగా నిర్దేశించారు. మిగులు విద్యుత్తును ప్రభుత్వానికి విక్రయించడం ద్వారా ఫ్యాక్టరీ కొంత లాభపడటం అనేదీ ఇందులో భాగం. మరోవైపు ఫ్యాక్టరీ ఆధునికీకరణకు తమ వంతు సహకారంగా రైతులు నుంచి రూ.3 కోట్ల వరకూ పెట్టుబడి నిధి కూడా సేకరించారు.
దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తే అది వడ్డీతో రూ.5 కోట్లు అయ్యింది. ఆ నిధికి టీడీపీ నాయకులు గండికొట్టేశారు. 2014 సంవత్సరంలో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడం శాపంగా మారింది. రైతులు అడగకపోయినా ఆ డిపాజిట్లను పంచేశారు. అలా ఆధునికీకరణ ప్రతిపాదనను ఉద్దేశపూర్వకంగానే అటకెక్కించేశారు. చంద్రబాబు ప్రభుత్వ విధానాల ఫలితంగా ఫ్యాక్టరీ సుమారు రూ.47.88 కోట్లు నష్టాల్లోకి వెళ్లింది. ఆప్కాబ్ నుంచి తెచ్చిన రూ.25 కోట్ల రుణంపై ఏటా రూ.3.2 కోట్ల వరకూ వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి. మరోవైపు యంత్రాలన్నీ పనిచేయకుండాపోయాయి.
జగనన్న ప్రభుత్వంలోనే భరోసా....
లచ్చయ్యపేట కర్మాగారం యాజమాన్యం బకాయిపడిన బిల్లులు చెల్లించాలని రైతులు, వేతనాల కోసం కార్మికులు రోడ్డున పడ్డారు. వారికి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రజాసంకల్పయాత్రలో హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎనిమిది నెలల వ్యవధిలోనే కర్మాగారం భూములను బహిరంగవేలం ద్వారా విక్రయించి రైతులకు, కార్మికులకు, ఉద్యోగులకు బకాయిలు చెల్లించారు. అలాగే లచ్చయ్యపేట, భీమసింగి ఫ్యాక్టరీలపై ఆధారపడిన చెరకు రైతులకు నష్టం లేకుండా మంత్రి బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకటచిన్న అప్పలనాయుడు, పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు, గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య ప్రభుత్వంతో చర్చించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఫలితంగా రైతులు గత నాలుగేళ్లుగా రేగిడి మండలం సంకిలి వద్దనున్న ఈఐడీ ప్యారీ సుగర్ ఫ్యాక్టరీకి చెరకును విక్రయిస్తున్నారు.
లచ్చయ్యపేటలో అలా...
తొలుత పార్వతీపురం డివిజన్‌లో రైతుల కోసం సీతానగరం, బొబ్బిలి ప్రాంతాల్లో 1936 సంవత్సరంలో శ్రీరామా చక్కెర కర్మాగారాలు ప్రారంభమయ్యాయి. వాటిలో బొబ్బిలి కర్మాగారం 1973లో, సీతానగరం కర్మాగారం 1974లో మూతపడ్డాయి. ఈ రెండింటినీ అనుసంధానం చేస్తూ 1992లో లచ్చయ్యపేట వద్ద కర్మాగారాన్ని నిర్మించడానికి అప్పటి ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్దనరెడ్డి శంకుస్థాపన చేశారు. ఇది నిర్మాణం పూర్తయిన సందర్భంలోనే చంద్రబాబు తొలిసారిగా 1995 సెప్టెంబర్‌లో సొంత మామ ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటుతో ముఖ్యమంత్రి అయ్యారు.
ఈ కర్మాగారాన్ని ప్రారంభించిందీ ఆయనే. లాభాల్లో సాగుతున్న సమయంలో నష్టాల ముసుగువేసి 2002 సంవత్సరంలో అత్యంత చౌకగా అమ్మకం పెట్టేసిందీ చంద్రబాబే. ఎన్‌సీఎస్ యాజమాన్యంలో కర్మాగారం పరిస్థితి మరింత దిగజారింది. ఏడాదికేడాది చెరకు రైతులకు బిల్లులు చెల్లించక ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. చెరకు రైతులకు రూ. 24 కోట్లు, కార్మికుల జీతాలు, బ్యాంక్ రుణాలు కలిపి మరో రూ.19 కోట్లు బకాయిలు పెట్టేశారు. దీంతో ఆందోళనకు దిగిన రైతులను, కార్మికులను బుజ్జగించడానికి చంద్రబాబు 2014లో మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు యాజమాన్యం పరిధిలోఉన్న కర్మాగారం భూములను ఐడీఆర్ చట్టం కింద స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. అయితే వాటిని వేలం వేయకుండా 2019 సంవత్సరంలో పదవి దిగిపోయేవరకూ నాన్చుతూ వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment