Sugarcane Cultivation
-
చెరుకు నేలచూపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చెరుకు సాగు విస్తీర్ణం నానాటికీ పడిపోతుండగా, క్రషింగ్ సామర్థ్యానికి అనుగుణంగా చెరుకు లభ్యత లేక ఫ్యాక్టరీలు నష్టాల బాట పడుతున్నాయి. పంట గిట్టుబాటు కాక, కూలీల కొరత, ప్రభుత్వం ప్రోత్సాహం కరువు తదితర కారణాలతో రైతులు చెరుకు సాగుకు స్వస్తి చెప్పి ఇతర పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. రాష్ట్రంలోని 12 చక్కెర కర్మాగారాలకు గాను ఇప్పటికే ప్రభుత్వ, సహకార రంగంలోని నాలుగు ఫ్యాక్టరీలు మూతపడ్డాయి.ఇలాంటి సమయంలో చెరు కు సాగులో కీలకమైన డ్రిప్ ఇరిగేషన్ (బిందు సే ద్యం) పరికరాలను సబ్సిడీపై రైతులకు ఇవ్వాల్సిన ప్రభుత్వం నామమాత్రపు విస్తీర్ణానికే సబ్సిడీని పరిమితం చేస్తోంది. దీంతో రాష్ట్రంలో ఫ్యాక్టరీల క్రషింగ్ సామర్థ్యానికి అవసరమైన విస్తీర్ణంలో సుమారు 30 శాతం మాత్రమే చెరుకు సాగవుతోంది. ప్రస్తుతం నిజాం డెక్కన్ షుగర్స్ లిమిటెడ్ యూని ట్లను తిరిగి పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. చెరుకు సాగు విస్తీర్ణం పెంచడంపై దృష్టి పెట్టాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మూడో వంతుకు చెరుకు సాగు రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న 12 చక్కెర కర్మాగారాల రోజువారీ చెరుకు క్రషింగ్ సామర్థ్యం 37,950 టన్నులు. సీజన్లో ఫ్యాక్టరీలు పూర్తి సామర్థ్యంతో క్రషింగ్ చేసేందుకు 4.33 లక్షల టన్నుల చెరుకు అవసరమవుతుంది. ఇందుకోసం 65,780 హెక్టార్లలో చెరుకు పంటను సాగు చేయాల్సి ఉంటుంది. అయితే పదేళ్ల క్రితం సాగైన రీతిలో ప్రస్తుతం చెరుకు సాగవడం లేదు. 2014–15లో 49,183 హెక్టార్లలో చెరుకు సాగవగా, మధ్యలో పెరుగుతూ, తగ్గుతూ ప్రస్తుతం 20,393 హెక్టార్లకు (అధికారుల అంచనా) చేరుకుంది.నిజాం డెక్కన్ షుగర్స్ లిమిటెడ్ (2015లో మూతపడింది) పరిధిలోని మూడు యూనిట్లతో పాటు నిజామాబాద్ సహకార చక్కెర కర్మాగారం పూర్తి స్థాయి క్రషింగ్ సామర్థ్యానికి 14,733 హెక్టార్లలో చెరుకు సాగు జరగాల్సి ఉండగా, ప్రస్తుతం 951 హెక్టార్లకే పరిమితమైంది. నిజాం షుగర్స్ పరిధిలో ని మం¿ోజిపల్లి, బోధన్ యూనిట్ల పరిధిలో చెరుకు సాగు విస్తీర్ణం దాదాపు శూన్య స్థితికి చేరుకుంది. ప్రభుత్వ ప్రోత్సాహమేదీ? చెరుకు సాగును ప్రోత్సహించాల్సిన చెరుకు అభివృద్ధి మండళ్లు (సీడీసీ) పాత్ర నామమాత్రంగా తయారైంది. సీడీసీ వాటా కింద రైతులు, ఫ్యాక్టరీలు ఒక్కో టన్నుకు రూ.4 చొప్పున చెల్లిస్తున్నాయి. చెరుకు సాగు విస్తీర్ణం తగ్గిన నేపథ్యంలో సీడీసీకి సమకూరుతున్న మొత్తం కూడా అరకొరగా ఉండటంతో రైతులు స్ప్రేయర్ల వంటి పరికరాలను కూడా సొంతంగా సమకూర్చుకోవాల్సి వస్తోంది. మరోవైపు చెరుకు సాగుకు ప్రధాన ప్రతిబంధకంగా ఉన్న కూలీల కొరతను అధిగమించేందుకు యాంత్రీకరణ అవసరమున్నా ప్రభుత్వ ప్రోత్సాహం అందడం లేదు.‘స్టేట్ నార్మల్ స్కీమ్’కింద 2014కు పూర్వం ట్రాక్టర్లు, హార్వెస్టర్లు తదితరాలను సమకూర్చుకునేందుకు రైతులకు సబ్సిడీ కింద రూ.16 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. తర్వాతి కాలంలో బడ్జెట్ కేటాయింపులు లేక చెరుకు సాగులో యాంత్రీకరణ అటకెక్కింది. మరోవైపు చెరుకు కనీస మద్దతు ధర (ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్) టన్నుకు రూ.3,150 ఉండగా, కనీసం రూ.4 వేలు ఎఫ్ఆర్పీ అన్నా ఉంటేనే గిట్టుబాటు అవుతుందని రైతులు చెప్తున్నారు.గిట్టుబాటు కాక మానేశా నేను ముప్పై ఏళ్లకు పైగా 40 ఎకరాల్లో చెరుకు సాగు చేశా. గాయత్రీ ఫ్యాక్టరీకి ఏటా రెండు వేల టన్నుల చెరుకు సరఫరా చేశా. అయితే రానురానూ పంట సాగుకు, చెరుకు నరకడానికి అయ్యే ఖర్చులు భారీగా పెరిగాయి. ప్రభుత్వ ప్రోత్సాహం కూడా లేకపోవడంతో గిట్టుబాటుకాక వదిలేశా. ఇతర పంటలు వేస్తున్నా. – సాయిరెడ్డి, తిప్పాపూర్, కామారెడ్డి జిల్లాటన్నుకు రూ.500 బోనస్ ఇవ్వాలి ఎకరానికి 30 నుంచి 40 టన్నుల దిగుబడి వచ్చినా చెరుకు సాగు గిట్టుబాటు కావడం లేదు. ఒక్కో ఎకరంలో చెరుకు సాగుకు రూ.50 వేల వరకు ఖర్చవుతోంది. చెరుకు సాగు విస్తీర్ణం పెరగాలంటే ఇతర పంటలకు ప్రకటించిన తరహాలోనే టన్నుకు రూ.500 బోనస్ ప్రకటించాలి. రికవరీ శాతంతో సంబంధం లేకుండా కనీస మద్దతు ధర చెల్లించాలి. – రచ్చా నరసింహారావు, నేలకొండపల్లి, ఖమ్మం జిల్లా -
చెరకు రైతుల నోట్లో... చంద్రన్న విషం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వ్యవసాయాధార ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో ఒకప్పుడు చెరకు సాగు రైతులకు లాభదాయకమైన పంట. ఇందుకు భీమసింగి సహకార చక్కెర కర్మాగారం, లచ్చయ్యపేట వద్దనున్న ప్రభుత్వ చక్కెర కర్మాగారం వల్ల ఎంతో మేలు పొందేవారు. కానీ వాటిని చూసి చంద్రబాబుకు కన్నుకుట్టింది. కమీషన్ల కోసం రైతుల కడుపుకొట్టడానికి వెనుకాడలేదు. ఆ రెండు చక్కెర కర్మాగారాల జీవం తీసేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు 14 ఏళ్ల పాలన వాటికి శాపంగా మారింది. భీమసింగి చక్కెర కర్మాగారాన్ని మొట్ట మొదట మూతవేసింది 2003లోనే. అదే సమయంలోనే సీతానగరం మండలం లచ్చయ్యపేటలోనున్న ప్రభుత్వ చక్కెర కర్మాగారాన్ని అత్యంత చౌకగా ప్రైవేట్‌పరం చేసేశారు. 2004లో వై.ఎస్. రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత భీమసింగి సుగర్ ఫ్యాక్టరీకి జీవం పోశారు. లాభాల బాట పట్టించారు. మళ్లీ 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత యథావిధిగా నష్టాల్లో ముంచారు. ఫ్యాక్టరీ అభివృద్ధి కోసం రైతుల వంతుగా సేకరించిన రూ.5 కోట్ల సొమ్మును అప్పటి టీడీపీ నాయకులు దుర్వినియోగం చేశారు. చంద్రన్న విషగుళికల్లాంటి అసంజస నిర్ణయాల ఫలితంగా చెరకు రైతులు దారుణంగా నష్టపోయారు.భీమసింగిలో ఇలా...చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా పాలన (1995–2003)లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనున్న 18 ప్రభుత్వ, సహకార చక్కెర కర్మాగారాల్లో 8 ప్రైవేట్‌పరం చేసేశారు. ఆ సమయంలోనే భీమసింగి సుగర్ ఫ్యాక్టరీపై కత్తికట్టారు. 2003–04 సీజన్లో క్రషింగ్ చేయకూడదని ఆదేశాలివ్వడంతో తొలిసారిగా మూతపడింది. పాదయాత్రలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఫ్యాక్టరీని తెరిపించారు. ప్రభుత్వ గ్యారెంటీతో రూ.3.50 కోట్ల రుణం అందించారు. ఫ్యాక్టరీకి గుదిబండగా మారిన అప్పులు రూ.18.04 కోట్లను ప్రభుత్వ షేరు ధనంగా మార్చారు. ఆధునికీకరణకు రూ.36.18 కోట్లు మంజూరు చేశారు. తద్వారా క్రషింగ్ సామర్థ్యాన్ని 1205 మెట్రిక్ టన్నుల నుంచి 2 వేల మెట్రిక్ టన్నులకు పెంచడం, పవర్ ప్లాంట్ ఉత్పత్తి కూడా 1.5 కిలోవాట్ల నుంచి 12 కిలోవాట్లకు పెంచడం లక్ష్యాలుగా నిర్దేశించారు. మిగులు విద్యుత్తును ప్రభుత్వానికి విక్రయించడం ద్వారా ఫ్యాక్టరీ కొంత లాభపడటం అనేదీ ఇందులో భాగం. మరోవైపు ఫ్యాక్టరీ ఆధునికీకరణకు తమ వంతు సహకారంగా రైతులు నుంచి రూ.3 కోట్ల వరకూ పెట్టుబడి నిధి కూడా సేకరించారు. దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తే అది వడ్డీతో రూ.5 కోట్లు అయ్యింది. ఆ నిధికి టీడీపీ నాయకులు గండికొట్టేశారు. 2014 సంవత్సరంలో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడం శాపంగా మారింది. రైతులు అడగకపోయినా ఆ డిపాజిట్లను పంచేశారు. అలా ఆధునికీకరణ ప్రతిపాదనను ఉద్దేశపూర్వకంగానే అటకెక్కించేశారు. చంద్రబాబు ప్రభుత్వ విధానాల ఫలితంగా ఫ్యాక్టరీ సుమారు రూ.47.88 కోట్లు నష్టాల్లోకి వెళ్లింది. ఆప్కాబ్ నుంచి తెచ్చిన రూ.25 కోట్ల రుణంపై ఏటా రూ.3.2 కోట్ల వరకూ వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి. మరోవైపు యంత్రాలన్నీ పనిచేయకుండాపోయాయి.జగనన్న ప్రభుత్వంలోనే భరోసా.... లచ్చయ్యపేట కర్మాగారం యాజమాన్యం బకాయిపడిన బిల్లులు చెల్లించాలని రైతులు, వేతనాల కోసం కార్మికులు రోడ్డున పడ్డారు. వారికి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తన ప్రజాసంకల్పయాత్రలో హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎనిమిది నెలల వ్యవధిలోనే కర్మాగారం భూములను బహిరంగవేలం ద్వారా విక్రయించి రైతులకు, కార్మికులకు, ఉద్యోగులకు బకాయిలు చెల్లించారు. అలాగే లచ్చయ్యపేట, భీమసింగి ఫ్యాక్టరీలపై ఆధారపడిన చెరకు రైతులకు నష్టం లేకుండా మంత్రి బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకటచిన్న అప్పలనాయుడు, పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు, గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య ప్రభుత్వంతో చర్చించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఫలితంగా రైతులు గత నాలుగేళ్లుగా రేగిడి మండలం సంకిలి వద్దనున్న ఈఐడీ ప్యారీ సుగర్ ఫ్యాక్టరీకి చెరకును విక్రయిస్తున్నారు.లచ్చయ్యపేటలో అలా... తొలుత పార్వతీపురం డివిజన్లో రైతుల కోసం సీతానగరం, బొబ్బిలి ప్రాంతాల్లో 1936 సంవత్సరంలో శ్రీరామా చక్కెర కర్మాగారాలు ప్రారంభమయ్యాయి. వాటిలో బొబ్బిలి కర్మాగారం 1973లో, సీతానగరం కర్మాగారం 1974లో మూతపడ్డాయి. ఈ రెండింటినీ అనుసంధానం చేస్తూ 1992లో లచ్చయ్యపేట వద్ద కర్మాగారాన్ని నిర్మించడానికి అప్పటి ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్దనరెడ్డి శంకుస్థాపన చేశారు. ఇది నిర్మాణం పూర్తయిన సందర్భంలోనే చంద్రబాబు తొలిసారిగా 1995 సెప్టెంబర్‌లో సొంత మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఈ కర్మాగారాన్ని ప్రారంభించిందీ ఆయనే. లాభాల్లో సాగుతున్న సమయంలో నష్టాల ముసుగువేసి 2002 సంవత్సరంలో అత్యంత చౌకగా అమ్మకం పెట్టేసిందీ చంద్రబాబే. ఎన్సీఎస్ యాజమాన్యంలో కర్మాగారం పరిస్థితి మరింత దిగజారింది. ఏడాదికేడాది చెరకు రైతులకు బిల్లులు చెల్లించక ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. చెరకు రైతులకు రూ. 24 కోట్లు, కార్మికుల జీతాలు, బ్యాంక్ రుణాలు కలిపి మరో రూ.19 కోట్లు బకాయిలు పెట్టేశారు. దీంతో ఆందోళనకు దిగిన రైతులను, కార్మికులను బుజ్జగించడానికి చంద్రబాబు 2014లో మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు యాజమాన్యం పరిధిలోఉన్న కర్మాగారం భూములను ఐడీఆర్ చట్టం కింద స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. అయితే వాటిని వేలం వేయకుండా 2019 సంవత్సరంలో పదవి దిగిపోయేవరకూ నాన్చుతూ వచ్చారు. -
చెరకు సాగులో సస్యరక్షణ చర్యలు కీలకం
-
రింగ్ పిట్ విధానం లో చక్కెర శాతం పెరుగుతుంది
-
చెరకు గడ్డిజాతికి చెందిన తీయటి మొక్క
-
చేదెక్కనున్న చక్కెర..!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో చెరకు సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గడంతో చక్కెర పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గత ఏడాదితో పోలిస్తే సుమారు 2 వేల హెక్టార్ల మేర సాగు విస్తీర్ణం తగ్గగా, వచ్చే ఏడాది మరింత పడిపోయే అవకాశముందని కర్మాగారాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో పదకొండు చక్కెర కర్మాగారాలకు గాను బోధన్‌లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ 2008, ఎన్డీఎస్ఎల్ పరిధిలోని మరో మూడు చక్కెర కర్మాగారాలు 2016 నుంచి మూతపడ్డాయి. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు చక్కెర కర్మాగారాలు మాత్రమే పనిచేస్తున్నాయి. ప్రతి ఏటా చెరకు క్రషింగ్ సీజన్ నవంబర్ రెండో వారంలో ప్రారంభం కావాల్సి ఉండగా, చెరకు కొరతతో క్రిష్ణవేణి చక్కెర కర్మాగారం మినహా, మిగతావన్నీ డిసెంబర్ మొదటి వారంలో క్రషింగ్ ప్రారంభించాయి. గత ఏడాది రాష్ట్రంలో సుమారు 29 వేల హెక్టార్లలో చెరకు సాగు చేయగా, ఈ ఏడాది 27 వేల హెక్టార్లకు సాగు విస్తీర్ణం పడిపోయింది. మంజీర నది పరీవాహక ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో గణపతి, గాయత్రి చక్కెర కర్మాగారాల పరిధిలో సాగు విస్తీర్ణంపై తీవ్ర ప్రభావం చూపింది. మరోవైపు సాగునీరు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లోనూ రైతులు వరి, మొక్కజొన్న సాగువైపు మొగ్గుచూపుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుత ప్లాంటేషన్ సీజన్లోనూ చెరుకు సాగు విస్తీర్ణం ఆశాజనకంగా లేదని చక్కెర శాఖ వర్గాలు చెప్తున్నాయి. వచ్చే ఏడాది (2020–21) రాష్ట్రంలో చక్కెర ఉత్పత్తి సగానికి పడిపోతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో చక్కెర పరిశ్రమల పూర్తిస్థాయి క్రషింగ్ సామర్ధ్యం 33 లక్షల నుంచి 36 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఈ ఏడాది 15లక్షల మెట్రిక్ టన్నులకు మించి క్రషింగ్ జరిగే పరిస్థితి కనిపించడం లేదు. కష్టకాలంలో కర్మాగారాలు.. ఈ ఏడాది చెరుకు రైతులకు టన్నుకు సగటున రూ.3,080 చొప్పున మద్దతు ధర (ఎఫ్ఆర్పీ) చెల్లిస్తుండగా, పొరుగున ఉండే కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన చక్కెర కర్మాగారాలు అదనంగా టన్నుకు రూ.100 నుంచి రూ.150 వరకు చెల్లిస్తున్నాయి. స్థానికంగా క్రషింగ్ ఆలస్యంగా ప్రారంభం కావడం, పొరుగు రాష్ట్రాల్లో ఎక్కువ ధర లభిస్తుండటంతో రైతులు పొరుగు రాష్ట్రాలకు చెరుకు తరలించేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు గత ఏడాది ఆల్కహాల్ తయారీకి సహకరించిన కర్మాగారాలకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని విడుదల చేయాల్సి ఉంది. కాకతీయ, గణపతి చక్కెర కర్మాగారాల్లో కార్మికులు, యాజమాన్యం నడుమ నెలకొన్న వివాదాలు కూడా క్రషింగ్‌పై కొంత ప్రభావం చూపాయి. చెరుకు సాగుకు రైతులు మొగ్గు చూపకపోవడం, క్రషింగ్ సామరŠాధ్యనికి సరిపడా చెరుకు సరఫరా కాకపోవడంతో సీజన్‌ను కుదించాల్సిన పరిస్థితిలో యాజమాన్యాలు ఉన్నాయి. గత ఏడాది 24.83 లక్షల మెట్రిక్ టన్నుల చెరుకును క్రషింగ్ చేసి, 2.56 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి సాధించారు. ఈ ఏడాది రాష్ట్రంలోని ఏడు కర్మాగారాల పరిధిలో చక్కెర ఉత్పత్తి 1.6 లక్షల టన్నులకు మించక పోవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కర్మాగారాల వద్ద కిలో చక్కెర ధర రూ.35 పలుకుతుండగా, బయట మార్కెట్ ధరలతో పోలిస్తే తమకు అంతగా లాభసాటిగా లేదని కర్మాగారాల ప్రతినిధులు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెరుకు సాగును ప్రోత్సహించని పక్షంలో రాబోయే రోజుల్లో చక్కెర కర్మాగారాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటాయనే ఆందోళన అటు కర్మాగారాలు, ఇటు చెరుకు రైతులు వ్యక్తం చేస్తున్నారు. -
చెరకు ‘కరువు’!
సాక్షి, హైదరాబాద్: వచ్చే క్రషింగ్ సీజన్ నాటికి రాష్ట్రంలో చెరకు సాగు విస్తీర్ణం రికార్డు స్థాయిలో పడిపోనున్నది.మద్దతు ధర చెల్లింపులో చక్కెర కర్మాగారాల వైఖరి, కరువు పరిస్థితులు తదితరాల నేపథ్యంలో ఈ రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో సహకార, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో నడుస్తున్న చక్కెర కర్మాగారాలు మూత పడ్డాయి. చెరుకు సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోనుందనే అంచనాల నేపథ్యంలో ప్రైవేటు రంగంలోని చక్కెర కర్మాగారాలు కూడా మూతపడే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో 11 కర్మాగారాలు ఉండగా ఇప్పటికే సహకార రంగంలోని నిజామాబాద్ షుగర్ ఫ్యాక్టరీతో పాటు ఎన్డీఎస్ఎల్ భాగస్వామ్యంలోని బోధన్, మెదక్, మెట్పల్లి చక్కెర కర్మాగారాలు కూడా మూత పడ్డాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రైవేటు రంగంలోని ఏడు చక్కెర కర్మాగారాలు మాత్రమే పనిచేస్తున్నాయి. వీటి క్రషింగ్ సామర్థ్యం రోజుకు 2,4700 టన్నులు. ఏటా చెరకు సాగు విస్తీర్ణం తగ్గుతుండటంతో ఫ్యాక్టరీల సామర్థ్యానికి అనుగుణంగా చెరుకు సరఫరా కాకపోవడంతో క్రషింగ్ సీజన్‌ను గడువుకు ముందే ముగిస్తున్నారు. చెరకు, చక్కెర శాఖ గణాంకాల ప్రకారం 2018–19 క్రషింగ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 35,568 హెక్టార్లలో చెరుకు సాగు చేశారు. వచ్చే క్రషింగ్ సీజన్ 2019–20లో చెరకు సాగు విస్తీర్ణం కేవలం 23,188 హెక్టార్లకే పరిమితం అవుతుందని అధికారులు అంచనా వేశారు. గణపతి, కామారెడ్డి గాయత్రి షుగర్స్ మినహా మిగతా అన్ని ఫ్యాక్టరీల పరిధిలో కేవలం 2,500 హెక్టార్లలోపు విస్తీర్ణంలో మాత్రమే చెరకు సాగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఏడాది వ్యవధిలోనే 12,380 హెక్టార్లలో చెరుకు సాగు విస్తీర్ణం తగ్గుతుండటంతో ఫ్యాక్టరీల మనుగడకు సవాలుగా మారనుంది. భారీగా తగ్గనున్న దిగుబడి రాష్ట్రంలోని ఏడు చక్కెర కర్మాగారాల పరిధిలో గత ఏడాది 2018–19 క్రషింగ్ సీజన్లో 24.14 లక్షల మెట్రిక్ టన్నుల చెరకును క్రషింగ్ చేశారు. ప్రస్తుతం తెలంగాణలో హెక్టారుకు సగటున 70 టన్నుల చెరుకు దిగుబడి వస్తోంది. సాగు విస్తీర్ణం పడిపోతున్న నేపథ్యంలో దిగుబడి కూడా 8.66 మెట్రిక్ టన్నుల మేర తగ్గనుంది. గత ఏడాదితో పోలిస్తే వచ్చే క్రషింగ్ సీజన్ నాటికి కేవలం 16 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే దిగుబడి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో చెరకు సాగు విస్తీర్ణం పెరగాల్సిన అవసరం ఉందని చక్కెర రంగం నిపుణులు చెప్తున్నా.. క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వ్యయ ప్రయాసలకోర్చి సాగు చేసినా కనీస మద్దతు ధర (ఎఫ్ఆర్పీ) టన్నుకు రూ.2845 మించడం లేదు. మరోవైపు క్రషింగ్ కోసం పంటను కర్మాగారాలకు తరలించినా ఫ్యాక్టరీ యాజమాన్యాలు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. గత ఏడాది క్రషింగ్‌కు సంబంధించి చక్కెర కర్మాగారాలు రైతులకు రూ. 729.69 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 476.57 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లోకి చేరాయి. మరో రూ.245 కోట్ల బకాయిల కోసం రైతులు కర్మాగారాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కుంగదీస్తున్న కరువు పరిస్థితులు దేశ వ్యాప్తంగా 527 చక్కెర కర్మాగారాలు ఉండగా తెలంగాణలో 11 కర్మాగారాలు ఉన్నాయి. చక్కెర కర్మాగారాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే నష్టాలతో రాష్ట్రంలో ఇప్పటికే సహకార, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య కర్మాగారాలు నాలుగు మూతపడ్డాయి. చెరకు సాగుకు పేరొందిన మంజీర, గోదావరి నదీ తీర ప్రాంతంలో వర్షాభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. సిం గూరు, నిజాంసాగర్ల్లో నీటిమట్టం డెడ్‌స్టోరేజీకి చేరింది. ఎన్డీఎస్ఎల్, నిజామాబాద్ సహకార చక్కెర ఫ్యాక్టరీలు మూత పడటంతో రైతులు ఇప్పటికే ప్రత్యామ్నాయ పంటలు, వర్షాధార పంటల సాగువైపు మొగ్గు చూపారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో మరింతమంది చక్కెర రైతులు పత్తి, సోయా వంటి ప్రత్యామ్నాయ పం టల సాగువైపు మొగ్గు చూపుతుండటంతో రాబోయే రోజుల్లో చక్కెర కర్మాగారాలు చెరకు కొరతను ఎదుర్కోనున్నాయి. -
షుగర్స్ ఫ్యాక్టరీ రైతుల అగ్రహం
-
చెరకు ప్రకృతి సేద్యంతో బతుకు తియ్యన!
8’ గీ 2’ దూరంలో చెరకు నాటాలి..ఆకులన్నిటికీ ఎండ తగిలితేనే అధిక దిగుబడి సాధ్యం ఆచ్ఛాదన, జీవామృతంతో చక్కని దిగుబడి! ఎకరానికి 40 నుంచి 80 టన్నుల చెరకు దిగుబడి ఖాయం రికవరీ కూడా 9% నుంచి 14%కు పెరుగుతుంది అంతర పంటలతో ఏడాదంతా అదనపు ఆదాయం తెలుగు నాట చెరకు రైతులకు సుభాష్ పాలేకర్ మార్గదర్శనం సాగునీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్న పంటగా వరి తర్వాత స్థానాన్ని చెరకు పంట ఆక్రమిస్తున్నది.కరువు పరిస్థితుల్లో చెరకు సాగు కనాకష్టంగా మారింది. ఈ నేపథ్యంలో చెరకు సాగును ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోకి మార్చుకోవడమే మేలన్న భావన వేళ్లూనుకుంటున్నది. విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపంలోని ఎన్.సి.ఎస్. సుగర్స్ ఎం.డి. నారాయణం నాగేశ్వరరావు వేలాది మంది రైతులకు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయోద్యమ పితామహుడు పద్మశ్రీ డా. సుభాష్ పాలేకర్ చేత ఇటీవల శిక్షణ ఇప్పించారు.ఆయన బొబ్బిలి వచ్చి రెండు రోజులపాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రకృతి వ్యవసాయంలో చెరకు దిగుబడి ఎకరానికి 40 టన్నుల నుంచి 80 టన్నులకు పెరగడం ఖాయమని పాలేకర్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ప్రకృతి వ్యవసాయంలో సాగు చేస్తున్న చెరకు తోటలు దిగ్విజయంగా ఎకరానికి వంద టన్నులకు పైగా దిగుబడినిస్తున్నాయన్నారు. చెరకు వరుసల మధ్య 8 అడుగుల దూరం పెట్టి.. ఏడాది పొడవునా అనేక అంతర పంటలు సాగు చేయవచ్చు అంటున్నారు. పాలేకర్ చెరకు సాగు పద్ధతి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చెరకు రైతులకు ఉపకరిస్తుందన్న భావనతో.. పాలేకర్ మాటల్లోనే సవివరంగా అందిస్తోంది ‘సాగుబడి’..! చెరకు ‘గ్రామీణి’ కుటుంబంలో గడ్డి జాతికి చెందిన బహువార్షిక మొక్క. గడ్డి మొలిచే ఏ భూముల్లోనైనా చెరకును సాగు చేయొచ్చు. పొలంలో ఒక్కసారి నాటితే వందేళ్లయినా కార్శి తోటలు తీసుకోవచ్చు. మూడేళ్లకే నరికేయాల్సిన పని లేదు. ఇది స్వప్నం కాదు, వాస్తవం. మహారాష్ట్రలో ప్రకృతి వ్యవసాయంలో 12వ కార్శి తోటలు ఉన్నాయి. కావాలనుకుంటే వెళ్లి చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో రైతులు ఎకరానికి 4 టన్నుల చెరకు విత్తనం వాడుతున్నారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో ఎకరానికి కేవలం 240 కిలోల విత్తనం సరిపోతుంది. ఎకరానికి 4.5 క్వింటాళ్ల పంచదారను ఉత్పత్తి చేయగలిగేంత చెరకు విత్తనాన్ని వృథాగా నేలపాలు చేస్తున్నారు. ఇది అర్థం లేని పని. వరుసల మధ్య ఎడాన్ని బట్టి దిగుబడి! చెరకు ‘ఫొటో సింథటిక్’ మొక్క. ప్రతి ఆకుకూ (8,500 నుంచి 12,000 ఫుట్ క్యాండిళ్ల) పూర్తి స్థాయిలో సూర్యరశ్మి అవసరం. మే, జూన్‌లో 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎండనూ తట్టుకొని చెరకు ఆకులు ఆహారోత్పత్తి చేసుకుంటాయి. నీడ పనికిరాదు. చదరపు అడుగులోని చెరకు ఆకులు రోజుకు 12.5 కిలో కేలరీల సౌరశక్తిని గ్రహించగలవు. తద్వారా 2.25 గ్రాముల మేరకు చెరకు గడ పెరుగుతుంది. ఈ విధంగా ఎకరంలో ఏడాదికి 160 కోట్ల కిలో కేలరీల సౌరశక్తిని చెరకు ఆకులు గ్రహిస్తే.. 240 టన్నుల వరకు చెరకు దిగుబడి వస్తుంది. మీరిప్పుడు వరుసల మధ్య రెండు, మూడు అడుగుల దూరం పాటిస్తున్నారు. వరుసల మధ్య 3 అడుగుల దూరం పెడితే 33 శాతం ఆకులపైనే ఎండ పడి, ఎకరానికి 20 టన్నుల దిగుబడి వస్తుంది. 5 అడుగుల దూరం పెడితే 40 టన్నుల దిగుబడి వస్తుంది. 8 అడుగుల దూరం పెడితే కింది ఆకులపైన కూడా పూర్తిగా ఎండపడి, ఎకరానికి 60 టన్నుల దిగుబడి వస్తుంది. 8‘“ 8‘ దూరంలో నాటితే అత్యధిక దిగుబడి వస్తుంది. అయితే, 8’“ 8’ దూరం మరీ ఎక్కువ అనిపిస్తే.. 8‘“ 2‘ దూరంలో నాటుకోండి. ఇందుకోసం ఎకరానికి 2,722 కన్నుల విత్తనం సరిపోతుంది. ఎకరానికి 4 టన్నులకు బదులు 44 గడలను విత్తనంగా వాడితే రూ.11 వేల ఖర్చు తగ్గుతుంది. ఆచ్ఛాదన, జీవామృతంతో చక్కని దిగుబడి! 160 కోట్ల కిలో కేలరీల సౌరశక్తిని ఉపయోగించుకొని ప్రకృతి సేద్యంలో ఎకరంలో ఏడాదికి 240 టన్నుల చెరకు దిగుబడి తీయాలంటే.. భూమిలో సేంద్రియ కర్బనం 2.5% ఉండాలి. కర్బనం, నత్రజని 10:1 నిష్పత్తిలో ఉండాలి. కానీ, మన దేశంలో భూములు రసాయనిక ఎరువుల వల్ల నిస్సారంగా మారాయి. సేంద్రియ కర్బనం 0.07% మాత్రమే ఉంది. భూమిలో సేంద్రియ కర్బనాన్ని పెంచుకునే కొద్దీ పంటల దిగుబడి పెరుగుతుంది. దీన్ని 1%కి పెంచితే ఎకరానికి వంద టన్నుల చెరకు దిగుబడి సాధించవచ్చు. సేంద్రియ కర్బనం జీవనద్రవ్యం (హ్యూమస్) ద్వారా నేలకు అందుతుంది. జీవనద్రవ్యమే భూమికి సారం, దిగుబడి శక్తి, ఉత్పాదక శక్తి. ఆకులు, గడ్డీ గాదం వంటి పంటల అవశేషాలను భూమిలో కలిసి కుళ్లిపోయేలా చేస్తే జీవనద్రవ్యం పెరుగుతుంది. చెరకు ఆకులను తగులబెట్టవద్దు. చెరకు ఆకును పొలంలో వరుసల మధ్య ఖాళీలో వేస్తేనే మట్టిలో జీవనద్రవ్యం తయారవుతుంది. ఆచ్ఛాదన వేయకపోతే జీవనద్రవ్యం తయారు కాదు. మట్టిలో జీవనద్రవ్యం రకరకాల మేలు చేసే సూక్ష్మజీవుల ద్వారా తయారవుతుంది. నాటు ఆవు పేడలో ఇవి పుష్కలంగా ఉన్నాయి. గ్రాము దేశీ ఆవు పేడలో 300 కోట్ల మేలు చేసే సూక్ష్మజీవులున్నాయి. టన్నుల కొద్దీ పేడ ఎరువు అవసరం కూడా లేదు. ఎకరానికి నెలకు 10 కిలోల దేశీ ఆవు పేడతో జీవామృతం తయారు చేసి వాడితే చాలు. పంటల అవశేషాల ద్వారా నేలకు కర్బనం ఎక్కువగా అందుతుంది. గాలిలో 78.6% ఉన్న నత్రజనిని గ్రహించి 36 రకాల సూక్ష్మజీవులు నేలకు అందిస్తాయి. అపరాల పంట వేళ్లలో ఉండే సూక్ష్మజీవులు జీవనద్రవ్యం తయారీకి ఉపకరిస్తాయి. అందువల్ల, చెరకు పొలంలో వరుసల మధ్య ఆకులు, కొమ్మరెమ్మలు, గడ్డీ గాదాన్ని ఆచ్ఛాదనగా వేయడంతోపాటు.. పప్పుధాన్యాలను అంతర పంటలుగా తప్పకుండా వేయాలి. అప్పుడే పంట దిగుబడులనందించే జీవనద్రవ్యం తయారవుతుంది. చెట్లకు కావాల్సిన పోషకాలలో 98.5% గాలి, ఎండ, బ్రహ్మాండ శక్తి (కాస్మిక్ ఎనర్జీ), తేమ ద్వారా ప్రకృతిసిద్ధంగా అందుతున్నాయి. మిగతా 1.5% పోషకాలను ఖనిజాల రూపంలో మొక్కలు మట్టి నుంచి తీసుకుంటున్నాయి. పంచభూతాలు, సూక్ష్మజీవులు, దేశీ ఆవు పేడ ఉంటే చాలు.. మార్కెట్లో వేటినీ కొనకుండానే నిశ్చింతగా ప్రకృతి సేద్యం చేయవచ్చు. చెరకు సాగులో 90% సాగు నీరు ఆదా! పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో చెరకు సాగులో డ్రిప్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోకుండానే 90% సాగు నీటిని పొదుపు చేయవచ్చని సుభాష్ పాలేకర్ తెలిపారు. అదెలాగో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.. చెరకు సాళ్ల మధ్య 8 అడుగుల దూరం ఉంచాలి. సాళ్ల మధ్యలో 2 అడుగులకు ఒకటి చొప్పున 4 కాలువలు తవ్వుకొని అంతర పంటలు సాగు చేసుకోవాలి (వివరాలకు బొమ్మ చూడండి). చెరకు నాటిన తర్వాత మొదటి 3 నెలల పాటు సాళ్ల మధ్య ఉన్న ఈ 4 కాలువల్లోనూ నీటిని పారించాలి. చెరకు నాటిన 3 నెలల తర్వాత 1వ కాలువకు నీరివ్వడం పూర్తిగా ఆపేయాలి (ఈ కాలువలోనే చెరకు మొక్క నాటి ఉంటుంది). 2, 3, 4 కాలువలకు మామూలుగానే నీరివ్వాలి. – చెరకు నాటిన 6 నెలల తర్వాత.. 2, 4 కాలువలకు కూడా నీరివ్వడం ఆపేసి, 3వ కాలువకు మాత్రమే నీరివ్వాలి. ఇలా చేయడం వల్ల పంట మొక్కల వేళ్లు నీటి తేమ ఉండే 3వ కాలువ వైపే చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేస్తాయి. అప్పుడు వేరు పొడవు పెరుగుతుంది. ఆకుల సంఖ్యతో పాటు ఆహారోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. కాండం పొడవు, చుట్టుకొలత, బరువు పెరుగుతాయి. దిగుబడి పెరుగుతుంది. చెరకు నరకడానికి నెల రోజుల ముందే ఆ ఒక్క కాలువకూ నీరివ్వడం ఆపేయాలి. తద్వారా చక్కెర / బెల్లం దిగుబడి పెరుగుతుంది. 3 కాలువలకు నీరు ఆపేయడంతో 75% సాగు నీరు ఆదా అయ్యింది. ఆచ్ఛాదన ద్వారా మరో 15% తేమ వాతావరణం నుంచి మొక్కలకు అందుతుంది. ఇలా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో 10% నీటి ఖర్చుతోనే పంటల సాగు పూర్తవుతుంది. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ చెరకు, అంతర పంటల సాగు పద్ధతి భూమిని దున్ని సిద్ధం చేసిన తర్వాత చెరకును 8‘ “ 2‘ దూరంలో నాటుకోండి. అతి కొద్ది స్థలంలో 8‘ “ 4‘, 8‘ “ 8‘ దూరంలోనూ నాటుకొని ప్రయోగాత్మకంగా సాగు చేసి చూడండి. తేడా మీకే తెలిసివస్తుంది. చెరకు విత్తనంగా ఒక కన్ను ముచ్చెను నాటుకుంటే చాలు. కన్ను ఆకాశం వైపు చూసేలా నాటాలి. వర్షాధారంగా చెరకు సాగు చేస్తుంటే.. వర్షాకాలం ప్రారంభమయ్యాక జూన్‌లో నాటాలి. సాగు నీరుంటే అక్టోబర్ – నవంబర్, జనవరి – ఫిబ్రవరి తదితర నెలల్లో వీలువెంబడి నాటుకోవచ్చు. చెరకు సాళ్ల మధ్య 8 అడుగుల దూరం తప్పనిసరి. 8 అడుగుల దూరంలో ఉన్న చెరకు సాళ్ల మధ్య.. అంతరపంటల సాగు కోసం 2 అడుగులకు ఒకటి చొప్పున 4 కాలువలు తీసుకోవాలి. పంట ఏదైనా స్థానిక / దేశవాళీ సూటి వంగడాలనే ఎంపిక చేసుకోవాలి. ఇవైతేనే ప్రకృతి సేద్యంలో అధిక దిగుబడినిస్తాయి. విత్తనాలు గానీ, నారు గానీ కచ్చితంగా బీజామృతంతో శుద్ధిచేసిన తర్వాతే నాటాలి. 1వ కాలువ : ఎడమ కింది వైపు ఒంటి కన్ను చెరకు ముచ్చెను నాటుకోవాలి. పైన ఎడమ, కుడి వైపు ఉల్లి / వెల్లుల్లి వేసుకోవాలి. 2వ కాలువ : పైన ఎడమ వైపు పప్పుధాన్యాలు (శనగ, కంది, పొట్టి కంది, పెసర, మినుము, ఉలవ, బీన్స్, చెట్టు చిక్కుడు వంటి ద్విదళ జాతి కూరగాయ పంటలు) విత్తుకోవచ్చు. పైన కుడి వైపున కూరగాయ పంటలు, నూనె గింజలు విత్తుకోవచ్చు. 3వ కాలువ : ఎడమ, కుడి వైపులలో ఏకదళ పంటలైన వరి (సుగంధ వరి వంటి ఔషధ గుణాలున్న దేశీ వంగడాలు వేసుకోవాలి), రాగులు (తైదలు /చోళ్లు) నాటుకోవచ్చు. 4వ కాలువ : ఎడమ వైపు పైన ద్విదళ పంటలైన కూరగాయ పంటలు (మిరప, పసుపు, అల్లం, వంగ, టొమాటో, క్యాలీఫ్లవర్, క్యాబేజి, గోరుచిక్కుడు, చెట్టు చిక్కుడు, బెండ, ఆకుకూరలు), నూనెగింజలు (వేరుశనగ, పొద్దుతిరుగుడు, కుసుమ, నువ్వు, లిన్సీడ్, ఆవాలు, సోయాబీన్స్) విత్తుకోవచ్చు లేదా నాటుకోవచ్చు. కుడి వైపు పైన పప్పుధాన్య పంటలు విత్తుకోవచ్చు. ఆచ్ఛాదన, అంతర పంటల మార్పిడి! చెరకు పంటలో మొదటి రెండు సాళ్ల మధ్య ఆచ్ఛాదన వేస్తే.. తర్వాత రెండు సాళ్ల మధ్య అంతరపంటలు పండించాలి. చెరకు ఒక సీజన్ పూర్తయ్యాక.. గతంలో ఆచ్ఛాదన వేసిన సాలులో ఈ దఫా అంతర పంటలు వేయాలి. గతంలో అంతర పంటలు పండించిన సాలులో ఈ దఫా చెరకు ఆకులు, పిలకలతో ఆచ్ఛాదన చేయాలి. ఆచ్ఛాదనగా వేసే గడ్డీ గాదంలో 25 శాతం పప్పు ధాన్య పంటల వ్యర్థాలు, 75 శాతం వరి, చిరుధాన్యాల పంటల గడ్డి కలిసి ఉండేలా చూస్తే ఉత్తమ ఫలితం ఉంటుంది. మెట్ట పొలాలకు ఘనజీవామృతం మెట్ట పంటల సాగులో ద్రవ జీవామృతాన్ని నేలకు ఇవ్వడం కష్టం కాబట్టి ఘనజీవామృతాన్ని నేలకు ఇవ్వొచ్చు. అనంతపురం జిల్లాలో కరువు కాలంలోనూ వేరుశనగ వర్షాధార సాగులో ఘనజీవామృతం అద్భుత ఫలితాలనిచ్చింది. మన దేశంలోనే కాదు దక్షిణాసియా, ఆఫ్రికా దేశాల్లో ఘన జీవామృతంతో వర్షాధార సేద్యంలో సత్ఫలితాలొచ్చాయి. ఘనజీవామృతం తయారీ పద్ధతి... నాటు ఆవు పేడను ఎండబెట్టి పొడిగా చేసి జల్లెడ పట్టాలి. 200 కిలోల పేడ పొడిని ఒక ప్లాస్టిక్ పట్టాపై పరచి.. దానిపై 20 లీటర్ల ద్రవ జీవామృతాన్ని చల్లాలి. నిలువుగా, అడ్డంగా పారతో కలియదిప్పాలి. ఈ మిశ్రమాన్ని నీడలో 48 గంటల పాటు నిల్వ ఉంచాలి. ఎండ, వాన పడకుండా జాగ్రత్త వహించాలి. కలిపిన 48 గంటల తర్వాత ఘనజీవామృతాన్ని ఎండలో పల్చగా పరచి ఎండబెట్టాలి. రోజుకు 2,3 సార్లు కలియదిప్పుతూ బాగా ఎండేలాæ చూడాలి. తేమ పూర్తిగా ఎండిన తర్వాత.. ఒక చెక్కతో ఉండలన్నింటినీ చితిపి పొడిగా మార్చాలి. గోనె సంచిలో నింపి నిల్వ చేసుకోవాలి. ఘనజీవామృతాన్ని ఏడాది వరకు వాడుకోవచ్చు. చెరకు తోటకు ఎకరానికి 400 కిలోల ఘనజీవామృతాన్ని దుక్కిలో వేసి కలియదున్నాలి. సీజనల్ పంటలకైతే ఎకరానికి 200 కిలోల చొప్పున వేసుకుంటే చాలు. జీవామృతాన్ని 15 రోజుల వరకు వాడొచ్చు! రసాయనిక ఎరువులే కాదు, పేడ ఎరువు, కంపోస్టు, వర్మీ కంపోస్టు, సూక్ష్మపోషక ఎరువులు వంటివి అసలు వాడకుండానే ప్రకృతి వ్యవసాయం చేయవచ్చు. ఘనజీవామృతం, జీవామృతంలను సొంతంగా రైతులే తయారు చేసి వాడుకుంటే చాలు.. చక్కని పంట దిగుబడులు పొందవచ్చు. జీవామృతం ఎరువు కాదు. మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్యను పంట భూముల్లో ఇబ్బడిముబ్బడిగా పెంపొందించే సంవర్ధనమే (మదర్ కల్చర్ – తోడు) ద్రవ జీవామృతం. జీవామృతాన్ని సిద్ధం చేసుకున్న తర్వాత 15 రోజుల వరకు వాడుకోవచ్చని సుభాష్ పాలేకర్ ఇటీవల బొబ్బిలిలో చెరకు రైతుల శిక్షణా తరగతుల్లో చెప్పారు.. వివరాలను ఆయన మాటల్లోనే ఇక్కడ పొందుపరుస్తున్నాం.. జీవామృతం తయారీ పద్ధతి పంట ఏదైనా ఎకరానికి ఒక విడతకు 200 లీటర్ల జీవామృతం సరిపోతుంది. ప్లాస్టిక్ డ్రమ్ము లేదా సిమెంటు తొట్టెను నీడలో ఉంచి.. 200 లీటర్ల నీరు పోయాలి. 10 కిలోల దేశీ ఆవు తాజా పేడ కలపాలి (సగం నాటు ఆవు పేడ కచ్చితంగా వాడాలి. సగం నాటు ఎద్దు పేడ వాడొచ్చు. మొత్తం నాటు ఎద్దు పేడ వాడొద్దు). 5–10 లీటర్ల నాటు లేదా దేశీ ఆవు మూత్రం కలపాలి (శాకాహారి అయిన మనిషి మూత్రం కూడా కొంత కలపవచ్చు). కిలో నల్లబెల్లం కలపాలి (నల్ల బెల్లం కాకపోతే ఎర్రటి / పసుపు రంగు బెల్లం వాడొచ్చు. తెల్లని చక్కెరను మాత్రం జీవామృతం తయారీలో వాడొద్దు. బెల్లానికి బదులు తీపి పండ్ల గుజ్జు వాడొచ్చు లేదా 3 లీటర్ల చెరకు రసం లేదా 4 కిలోల చెరకు ముక్కలు వాడొచ్చు). కిలో పప్పుధాన్యాల పిండి కలపాలి. పిడికెడు చేను గట్టు మీద మట్టి లేదా అడవిలోని మట్టి కలపాలి (జీవామృతంలో సూక్ష్మజీవరాశిని పెంపొందించేందుకు మట్టిని కలపాలి). ఇవన్నీ కలిపిన తర్వాత 48 గంటలకు జీవామృతం వాడకానికి సిద్ధమవుతుంది. అప్పటి నుంచి 15 రోజుల వరకు పంటలకు వాడుకోవచ్చు. రోజూ ఉదయం, సాయంత్రం ఒక నిమిషం పాటు కుడి వైపునకు తప్పకుండా కర్రతో కలపాలి. సూక్ష్మజీవరాశి పెంపొందడానికి ఇది చాలా అవసరం. చెరకు తోటలో జీవామృతాన్ని పోసే పద్ధతి నీటిపారుదల సదుపాయం ఉన్న చెరకు తోటలో జీవామృతాన్ని ఎకరం పొలానికి 200 లీటర్ల చొప్పున నెలకు కనీసం ఒకసారి లేదా రెండుసార్లు ఇవ్వాలి. మధ్య మధ్యలో రెండు, మూడుసార్లు ఎకరానికి నెలకు 400 లీటర్ల జీవామృతం ఇవ్వాలి. ప్రకృతి వ్యవసాయంలోకి మారిన తొలి ఏడాది ఎన్ని ఎక్కువ సార్లు జీవామృతాన్ని భూమికి ఇస్తే అంత మంచి ఫలితాలు కనిపిస్తాయి. చెరకు 8‘ “ 8‘ (సాళ్లు, మొక్కల మధ్య 8 అడుగుల దూరం) తోటలో నెలకు ఒకటి లేదా రెండు సార్లు మొక్కకు లీటరు చొప్పున జీవామృతం (నేల మీద పోసేటప్పుడు జీవామృతానికి నీరు కలిపి పలచన చేయాల్సిన అవసరం లేదు) పోయాలి. 8‘ “ 2‘ దూరం పెట్టినప్పుడు నెలకు ఒకటి లేదా రెండు సార్లు మొక్కకు పావు లీటరు చొప్పున పోయాలి. నీటి వసతి లేని మెట్ట పంటలో కూడా జీవామృతం పోసి అద్భుత ఫలితాలు పొందవచ్చు. చెరకుపై జీవామృతం పిచికారీ పద్ధతి 1వ పిచికారీ : చెరకు కన్ను నాటిన తర్వాత 21 రోజులకు మొదటి విడత పిచికారీ చేయాలి. ఎకరానికి 100 లీటర్ల నీటిలో 5 లీటర్ల జీవామృతాన్ని కలిపి పిచికారీ చేయాలి. చెరకు పంటతోపాటు అంతరపంటలపై కూడా పిచికారీ చేయాలి. 2వ పిచికారీ : 1వ పిచికారీ తర్వాత 21 రోజులకు ఎకరానికి 150 లీటర్ల నీటిలో 10 లీటర్ల వడకట్టిన జీవామృతం కలిపి పిచికారీ చేయాలి. 3వ పిచికారీ : 2వ పిచికారీ తర్వాత 21 రోజులకు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 20 లీటర్ల వడకట్టిన జీవామృతం కలిపి పిచికారీ చేయాలి. 4వ పిచికారీ : 3వ పిచికారీ తర్వాత 200 లీటర్ల నీటిలో 5 లీటర్ల పుల్ల మజ్జిగ కలిపి పిచికారీ చేయాలి. 5వ పిచికారీ : 4వ పిచికారీ తర్వాత 30 రోజులకు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 20 లీటర్ల వడకట్టిన జీవామృతం కలిపి పిచికారీ చేయాలి. 6వ పిచికారీ : 5వ పిచికారీ తర్వాత 30 రోజులకు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 20 లీటర్ల వడకట్టిన జీవామృతం కలిపి పిచికారీ చేయాలి. 5 నెలల తర్వాత మనిషి వెళ్లే ఖాళీ ఉండదు కాబట్టి జీవామృతం పిచికారీ సాధ్యపడదు. -
చెరకు సాగుకు చక్కని యంత్ర పరికరాలు!
సంప్రదాయ చెరకు సాగులో యాజమాన్య చర్యలు చేపట్టటంలో కూలీలే కీలకం. మారిన పరిస్థితుల్లో కూలీల కొరతతో చెరకు రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పెరిగిన కూలీ రే ట్లు రైతుకు గుదిబండగా మారి చెరకు సాగు నష్టాల చేదును పంచుతోంది. చెరకు రైతు లాభాల బాట పట్టేందుకు అదును వెంబడి ఆధునిక యాంత్రీకరణ పద్ధతులను ఉపయోగించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ దిశగా విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు పీవీకే జగన్నాథం, శ్రీదేవి ముందడుగు వేశారు. విత్తనం నాటే దగ్గరి నుంచి పంటను చక్కెర కర్మాగారాలకు పంపేవరకు వివిధ దశల్లో పనులను సులువుగా చేసుకునేందుకు ఆరు యంత్ర పరికరాలను వారు రూపొందించారు. వ్యవసాయ యాంత్రీకరణపై ఇటీవల ఢిల్లీలో జరిగిన నూతన ఆవిష్కరణల సదస్సులో వీటికి ప్రశంసలు లభించడం విశేషం. ఆ యంత్ర పరికరాల వివరాలు ‘సాగుబడి’ పాఠకుల కోసం.. విత్తన చెరకు నాటే యంత్ర పరికరం... విత్తన చెరకును నాటటం, విత్తనశుద్ధి వంటి పనులను ఈ యంత్ర పరికరం (షుగర్‌కేన్ కట్టర్ ప్లాంటర్)తో ఒకేసారి పూర్తి చేయవచ్చు. బోదెలలో అడుగు లోతులో విత్తనాన్ని ఉంచి, శుద్ధి చేసిన ద్రావణాన్ని పిచికారీ చేసి, ఆపైన మట్టితో కప్పుతుంది. ఒకేసారి రెండు సాళ్లలో విత్తనాన్ని నాటుతుంది. సంప్రదాయ సాగుతో పోల్చితే ఎకరాకు టన్ను దిగుబడి పెరుగుతుంది. విత్తే సమయం 6 గంటల నుంచి రెండున్నర గంటలకు తగ్గుతుంది. రూ. 1,500 ఖర్చు ఆదా అవుతుంది. 4 టన్నులకు బదులు 1.25 టన్నుల విత్తనం సరిపోతుంది. దీనితో నాటిన చెరకు మొక్క వేర్లు ఎక్కువ దూరం విస్తరిస్తాయి. దీనివల్ల చెరకు గడ లావు, పొడవు, బరువు పెరిగి దిగుబడి ఎక్కువగా వస్తుంది. దీని ఖరీదు రూ. 1. 97 లక్షలు. ఒంటికన్ను కణుపులను వరుసల్లో నాటే యంత్ర పరికరం.. బడ్‌చిప్ ప్లాంటర్ అనే యంత్ర పరికరాన్ని ట్రాక్టర్‌కు జోడించి ఉపయోగించాలి. కత్తిరించిన చెరకు కణుపులను నర్సరీ ట్రేలలో పెంచి, 20-30 రోజుల వయస్సులో నాటుకుంటారు. ట్రేలను యంత్రంపై పెట్టుకొని కూలీలు మొక్కలను నాళికల్లో వేస్తే ఏకకాలంలో రెండు సాళ్లలో మొక్కలను నాటుతుంది. గంటకు 4 వేల మొక్కలను నాటుతుంది. మొక్కల మధ్య దూరం 30-70 సెం.మీ, సాళ్ల మధ్య 120-150 సెం.మీ. దూరం ఉండేలా ఏర్పాటు చేశారు. సాళ్లు, మొక్కల మధ్య దూరాన్ని అవసరాన్ని బట్టి తగ్గించుకోవటం, పెంచుకోవటం చేయవచ్చు. సంప్రదాయ పద్ధతితో పోల్చితే ఎకరాకు రూ.3,600 వరకు ఖర్చు ఆదా అవుతుంది. విత్తనం నాలుగు టన్నులకు బదులు ఒక టన్ను సరిపోతుంది. విత్తే సమయం సగానికి త గ్గుతుంది. ఈ యంత్ర పరికరం ధర రూ. 2.13 లక్షలు. చెరకులో అంతర కృషి యంత్ర పరికరం... చెరకు పంట కాలం పూర్తయ్యే సరికి నాలుగు సార్లు కలుపు తీయాల్సి ఉంటుంది. చిన్న ట్రాక్టర్‌కు రోటావేటర్‌ను బిగించి సాళ్ల మధ్య అంతరకృషి చేయటం ద్వారా కలుపును నిర్మూలించవచ్చు. చెరకులో కలుపు నిర్మూలనకు రోటావేటర్ బిగించిన మినీ ట్రాక్టర్‌ను వాడతారు. రైతువారీ పద్ధతిలో కూలీల ఖర్చు రూ. ఐదు వేలవుతుంది. ఈ యంత్రాన్ని ఉపయోగిస్తే రూ. వెయ్యి మాత్రమే ఖర్చవుతుంది. సాళ్ల మధ్య నేల గుల్ల బారుతుంది. మూడొంతుల సమయం ఆదా అవుతుంది. ఎకరాకు రూ. నాలుగు వేల వరకు రైతుకు ఆదా అవుతుంది. చెరకు గడల నుంచి ఆకులు రెలిచే యంత్రం... మిల్లులకు రవాణా చేసేముందు చెరకుపైన ఉండే ఆకులు, వ్యర్థాలను రైతులు తొలగిస్తారు. సంప్రదాయ పద్ధతిలో ఒక పూట చేసే పనిని ఈ యంత్రం గంటలోనే చేస్తుంది. 3.6 హెచ్‌పీ డీజిల్ ఇంజిన్‌తో ఇది పనిచేస్తుంది. ఇద్దరు కూలీలు సరిపోతారు. టన్ను చెరకు ఆకులను గంటలో తొలగిస్తుంది. చెరకును యంత్రంలో పెడుతుంటే ఆకులను తొలగిస్తుంది. మూడొంతుల సమయం సగం ఖర్చు రైతుకు ఆదా అవుతుంది. ఈ యంత్ర పరికరం ఖరీదు రూ. లక్ష. చెత్తను భూమి మీద పరిచే యంత్ర పరికరం.. సాధారణంగా కోతలు పూర్తయ్యాక పొలంలో మిగిలే వ్యర్థాలను రైతులు తగులబెడతారు. దానికి బదులు ఈ యంత్రం సహాయంతో మూడు, నాలుగు సెం. మీ. పొడవు ముక్కలుగా చేయటం వల్ల పలు ప్రయోజనాలున్నాయి. ఈ వ్యర్థాలు పొలంలోనే కుళ్లి నేల సారవంతం అవుతుంది. ఆచ్ఛాదనగా వాడితే సాగునీటిలో మూడోవంతు ఆదా అవుతుంది. ఈ యంత్రం 45 హెచ్‌పీ ట్రాక్టర్ట్తో పనిచేస్తుంది. గంటకు రెండున్నర ఎకరాల్లో చెరకు వ్యర్థాలను ఇది ముక్కలు చేస్తుంది. ఈ యంత్ర పరికరం ఖరీదు రూ. 2 లక్షల 87 వేలు. కార్శి తోట నిర్వహణ యంత్ర పరికరం... ట్రాక్టర్‌కు జోడించి వాడుకునే యంత్ర పరికరం ఇది. కార్శి తోటలోని చెరకు దుబ్బులను నేలకు సమాంతరంగా కత్తిరిస్తుంది. ఈయంత్రంలోని బ్లేడ్ అంచులు పదునుగా ఉండి దుబ్బులను కోస్తుంది. ఒక ఎకరాలో దుబ్బులను గంటన్నరలో కత్తిరిస్తుంది. కూలీలతో ఆరుగంటలు పట్టే పనిని ఈ యంత్రం సహాయంతో గంటన్నరలో పూర్తి చేయవచ్చు. ఖర్చు మూడొంతులు తగ్గుతుంది. నేలలోకి గాలి ప్రసరణ ం పెరిగి కొత్త వేరు వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. మూడొంతుల సమయం, కూలీల ఖర్చు ఆదా అవుతాయి. ఈ యంత్ర పరికరం ఖరీదు రూ. 90 వేలు. - దాడి కృష్ణ వెంకటరావు, సాక్షి, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా యాంత్రీకరణతోనే చెరకు రైతుకు లాభాలు చెరకు సాగులో యంత్రాల వినియోగం ఇప్పటివరకు దుక్కిదున్నటానికే పరిమితం. మిగిలిన పనులకు కూలీలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ఖర్చు పెరిగి నష్టాలు రావటంతో చెరకు సాగును రైతులు మానుకుంటున్నారు. యంత్రాల వాడకం వల్ల ఖర్చు త గ్గుతుంది. అదును వెంబడి పనులు పూర్తవడం వల్ల మంచి దిగుబడులతోపాటు లాభాలు వస్తాయి. ఇవి కావలసిన రైతులు స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించవచ్చు. వీటి కొనుగోలుకు ప్రభుత్వ రాయితీలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. - డాక్టర్ పీవీకే జగన్నాథం (94419 44640), పంట కోత అనంతర సాంకేతిక పరిజ్ఞాన విభాగం అధిపతి, వ్యవసాయ పరిశోధనా కేంద్రం, అనకాపల్లి -
చేదెక్కుతున్న సాగు
అనూహ్య ఉత్పాతాలు అన్నదాత ఉసురు తీస్తున్నాయి. కష్టనష్టాల సుడిగుండాల పాలబడి సేద్యం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. చెరకు రైతు బతుకు చేదెక్కుతోంది. హుద్‌హుద్ కక్కిన విషంతో జీవనం ఆర్థికంగా దుర్భరమైంది. పెట్టుబడి వాయువేగానికి కొట్టుకుపోయింది. అందివచ్చిన పంటతో అప్పులు తీర్చేద్దామని ఆశించిన అన్నదాతకు చేతికి చిల్లిగవ్వరాని దుస్థితి. జిల్లాలో ఏ చెరకు రైతును కదిపినా కన్నీటి వెతలే. మారిన బతుకు చిత్రం చూస్తే కడుపు తరుక్కుపోతుంది. ఇలా అయితే కష్టమే నాది యలమంచిలి మండలం సోమలింగపాలెం. రెండు ఎకరాల్లో చెరకు పంట చేపట్టాను. హుద్‌హుద్ తుఫాన్‌కు ధ్వంసమైంది. మూడేళ్లుగా తుఫాన్లు, భారీ వర్షాలకు చెరకు పంట నష్టపోతున్నాం. పెట్టుబడులు సైతం తుడిచిపెట్టుకుపోతున్నాయి. గత నెల 12న సంభవించిన హుద్‌హుద్ కారణంగా పంటంతా కుళ్లిపోతోంది. ఇలా అయితే చెరకు సాగు కష్టమే. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లింపులో నిబంధనల పేరుతో తీవ్ర జాప్యం చేస్తోంది. - యల్లపు వెంకట్, చెరకు రైతు సాక్షి, విశాఖపట్నం: చెరకు సాగు కలిసిరావడంలేదు. ఖర్చులు బాగా పెరిగిపోయాయి. ఇంటిల్లిపాదీ రెక్కలు ముక్కలు చేసుకున్నాగిట్టుబాటు కావడం లేదు. దానికితోడు ఉత్పాతాలు నట్టేట ముంచుతున్నాయి. జిల్లాలోని నాలుగు చక్కెర మిల్లులు మద్దతు ధరను చెల్లించడం లేదు. తుఫాన్‌కు తీవ్రంగా నష్టపోయిన యాజమాన్యాలు ప్రభుత్వం ప్రకటించిన టన్నుకు రూ.2260లు కనీసపు ధరను ఇచ్చే పరిస్థితిలో లేవు. జిల్లాలో చెరకు సాగు సాధారణ విస్తీర్ణం 40,353 హెక్టార్లు. ఈ ఏడాది 37,435 హెక్టార్లలో పంటను చేపట్టారు. ఇందులో 50శాతం పంట తుఫాన్‌కు ధ్వంసమైంది. పెట్టుబడులు పెరిగిపోవడంతో ఇప్పటికే ఏటేటా చెరకు సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. ఎకరం భూమి ఐదు దుక్కులకు రూ.5వేలు, విత్తనం,నాట్లుకు రూ.10వేలు, నాలుగుసార్లు జడచుట్టు, బోదెలకు రూ.4వేలు,కలుపుతీత, ఎరువులు ఇలా మొత్తంగా రూ.25వేలు ఖర్చవుతోంది. ఎకరాకు 25 నుంచి 30 టన్నుల చెరకు ఉత్పత్తి అవుతోంది. దానిని నరకడం,ఫ్యాక్టరీకి తరలించడానికి మరో రూ.ఆరు ఏడు వేలు ఖర్చు. ఇదంతా దిగుబడి బాగా వస్తేనే. హుద్‌హుద్‌లాంటి వాటికి గురయితే అంతే సంగతి. మిల్లులు మద్దతు ధర బాగా తగ్గించేశాయి. పర్యవసానంగా రైతుకు ఎకరాకు 30 వేలు కూడా గిట్టుబాటు కావడం లేదు. ఇప్పటికే తెగుళ్లు, మదుపుల భారంతో విలవిల్లాడుతున్న చెరకు రైతును తుఫాన్ మరింతగా ముంచేసింది. భారీ గాలులు, వర్షం ధాటికి పంట పూర్తిగా నేలమట్టమై కనీసం విత్తనం ఖర్చుకూడా రాని దయనీయ పరిస్థితి. దిగుబడి బాగా తగ్గి రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎకరాకు కనీసం రూ.3వేలు రావని వాపోతున్నారు. ఇక కౌలుకు తీసుకుని పంట చేపట్టిన రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. చెరకు సాగు చేపట్టలేం నాది యలమంచిలి మండలం సోమలింగపాలెం. ఎకరా పొలంలో సాగుచేస్తున్న చెరకుతోట ఎండిపోతోంది. రెండేళ్లక్రితం నీలం, గత ఏడాది భారీ వర్షాలు, ఈ ఏడాది హుద్‌హుద్ తుఫాన్ మా పాలిట శాపమవుతున్నాయి. ఏటా నష్టపోతున్నాం. విపత్తులప్పుడు పాలకులు, అధికారుల ప్రకటనలు చూస్తే మరుసటి రోజే నష్టపరిహారం వస్తుందన్న ఆశ కలుగుతోంది. కాని అది కార్యరూపం దాల్చేసరికి ఎక్కువ సమయం పడుతోంది. దీంతో కోలుకోలేకపోతున్నాము. ప్రభుత్వం ఆదుకోవాలి. - వై.పరమేశ్వరరావు, చెరకు రైతు -
చెరుకు సాగులో జాగ్రత్త
ఈ పురుగులతో జర భద్రం పొలుసు పురుగు కణుపు ఏర్పడినప్పటి నుంచి చెరుకు నరికే వరకూ పొలుసు పురుగు ఆశిస్తుంది. నీటి ఎద్దడి ఉంటే మరింత నష్టపరుస్తుంది. నివారణకు విత్తనపు దవ్వను పొలుసు పురుగు అశించని తోటల నుంచి సేకరించాలి. మూ డు కాళ్ల చెరుకు గడలను మలాథియన్ 2.0 మిల్లీలీటర్ల లేదా థైమిథోయేట్ 1.7 మిల్లీలీట ర్ల మందును లీటర్ నీటిలో కలిపి 15 నిమిషాల్లో ముంచి నాటాలి. చెరుకులో పురుగు వ్యాప్తిని అరికట్టడానికి ఆకులు తుంచి(మొవ్వలో 8 ఆకులు ఉంచి) ైడె మిథోయేన్ 3 మిల్లీలీటర్ల నీటిలో పిచికారీ చేయాలి. కాండం తొలుచు పురుగు చెరుకు నాటినప్పటి నుంచి నరికే వరకు ఈ పురుగు సోకి పంట నష్టపరుస్తుంది. చెరుకు బాల్య దశలో పీక పురుగుగా పంటకు నష్టం కలిగిస్తుంది. ఈ పురుగు ఎక్కువగా వర్షాధార పంటపై సోకుతుంది. నివారణకు లోతైన కాలువలో చెరుకు గడలు నాటాలి. నాటే ముందు మిథైల్ పారాథియాల్ పొడి మందును ఎకరాకు 10 కిలోల చొప్పున వేయాలి. వీలైనంత తక్కువ వ్యవధిలో దగ్గరదగ్గరగా నీటి తడులు ఇవ్వాలి. ఎండోసల్ఫాన్ రెండు మిల్లీలీటర్ల మందును లీటరు నీటిని కలిపి నాటిన 4,6,9 వారాల్లో పిచికారీ చేయాలి. కాటుక తెగులు ఈ తెగులు సోకిన చెరుకులో మొక్కలోని మొవ్వ పొడవైన నల్లని కొరడాగా మారుతుంది. దిగుబడి, రసం నాణ్యత తగ్గుతుంది. ఈ తెగులు విత్తనపు గెనువుల ద్వారా వ్యాపిస్తుంది. మూడు కాళ్ల గెనువులను వేడి నీటిలో మూడు నిమిషాలు లేదా తేమతో మిళితమైన గాలిలో 2 గంటలు విత్తనశుద్ధి చేయాలి. గుడ్డిదుబ్బు తెగులు ఈ తెగులు ఆశించిన మొక్కల మొదళ్ల నుంచి సన్నని తెల్లని పిలకలు అధికంగా వస్తాయి. ఆకులు పొలిపోయి చిన్నవిగా కనిపిస్తాయి. మొక్కలు గడ్డిదుబ్బలు మాదిరి గా ఉంటాయి. నివారణకు తెగులు సోకిన మొక్కలను తోటల నుంచి వేరు చేయరాదు. దుబ్బలను తవ్వి తగులపెట్టాలి. విత్తనపు ముచ్చెలను వేడి నీటిలో గానీ, తేమతో మిళి తమైన వేడి గాలిలో గానీ శుధ్ది చేయాలి. కీట కాలను నివారించడానికి మలాథియాన్ లేదా డైమిథోయేట్ రెండు మిల్లీలీటర్ల మందును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి. తెగుళ్లను తట్టుకునే రకాలను సాగు చేయాలి. అడవి పందుల నుంచి రక్షణ కందకాల తవ్వకం పొలం చుట్టూ రెండు అడుగుల వెడల్పు. ఒకటిన్నర అడుగుల లోతులో కందకాన్ని తవ్వినట్లుయితే అడవి పందులు పొలంలోకి రాకుండా నిరోధించవచ్చు. అలాగే వర్షాభావ సమయంలో కందకాల్లో నిల్వ ఉన్న నీరు పొలాన్ని తేమగా ఉంచుతుంది. దీంతో భూగర్భ జలాలు కూడా పెరుగతాయి. విషపు ఎరలు గోధుమ పిండిలో ఉల్లిపాయ, వెల్లుల్లిని మొత్తగా చూర్ణం చేసి కలిపి పొలం చుట్టూ పెట్టాలి. ఈ ఉండలను పందులు తినడం అలవాటు చేసుకుంటాయి. ఆ తర్వాత సోడియం మోనోప్లోరో ఎసిటేట్ లేదా వార్ఫెరిన్ కలిపిన ఉండలను పెట్టాలి. వీటిని తిన్న పందులు అజీర్ణానికి లోనై దరిదాపులకు రావు. రసాయనిక పద్ధతులు ఫోరేట్ గుళికలను ఇసుకలో కలిపి చిన్నచిన్న సంచుల్లో కట్టి పంట చూట్టూ అక్కడక్కడ కర్రలను నాటి వేలాడదీయాలి. గాలితో పంట చుట్టూ పరిసరాల్లో ఫోరేట్ గుళికల నుంచి ఘాటైన వాసన వస్తుంది. ఈ వాసనకు అడవి పందులు పంటలోకి వచ్చేందుకు జంకుతాయి. కుళ్లిన కోడిగుడ్ల ద్రావణాన్ని తీసుకుని నీటిని కలిపి పొలం చుట్టూ చల్లడం ద్వారా దుర్గంధం వచ్చి పందులు ఆవైపు రావు. వెంట్రుకలు వెదజల్లాలి క్షౌరశాలలో దొరికే వ్యర్థ వెంట్రుకలను సేకరించి పంట పొలం గట్లపై ఒక అడుగు వెడల్పులో చల్లాలి. పంటను తినేందుకు వచ్చిన పందులు వీటి వాసన చూడగానే వెంట్రుకలు ముక్కులోకి వెళ్లి శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడుతాయి. ఊర పందుల విసర్జనాలను పొలం చుట్టూ చల్లితే వచ్చే దుర్వాసనకు అడవిపందులు దూరంగా ఉంటాయి. అలాగే వేటకుక్కలతో పందులను తరమడం, టపాసుల పేల్చడంతో వంటి పద్ధతులతో కూడా పందులు రాకుండా నివారించవచ్చు. జీవ కంచెలు ఒక రకమైన పంట పొలాన్ని కాపాడుకోవాలంటే దాని చుట్టూ నాలుగు వరుసుల్లో మరో పంట మొక్కలను పెంచడంతో పందుల బారి నుంచి రక్షించుకోవచ్చు. వేరుశెనగ పంట చుట్టూ నాలుగు వరుసల్లో కుసుమ పంటను వేయడం ద్వారా ఆ మొక్కకు ఉన్న ముళ్లు అడవి పందులను గాయపర్చే అవకాశం ఉంది. అలాగే కుసుమ ఘాటుగా ఉండటంతో పం దులు వేరుశెనగ మొక్కను గుర్తించలేవు. మొక్కజొన్న పంట చుట్టూ అముదం వేసి రక్షించు కొవచ్చు. ఇనుప కంచే ఏర్పాటుతో పంట చుట్టూ బలమైన కర్రలు పాతి వీటికి ఒక అడుగు ఎత్తులో ముళ్లను కలిగి ఉన్న ఇనున తీగను ఏర్పాటు చేయాలి. ఒక ఎకరా పొలం చుట్టూ ముళ్ల కంచె వేయడానికి సూమారు రూ.10 వేల నుంచి రూ 15 వేల వరకు ఖర్చవుతుంది. వలయాకారంలో ఉండే ముళ్ల కంచెను కూడా వేయవచ్చు. పందులు కంచెను దాటే సమయంలో పదునుగా కంచె ముళ్లు పందిని గాయపరుస్తాయి. ఒకసారి గాయపడిన పంది మళ్లీ లోపలికి వచ్చేందుకు ప్రయత్నించవు. సోలార్ ఫెన్సింగ్ పొలం చుట్టూ సోలార్ ఫెన్సింగ్ కంచెను ఏర్పాటు చేసి పందుల బారి నుంచి పంటలను కాపాడుకోవచ్చు. సోలార్ ప్లేట్ల నుంచి సూమారు 12 వోల్టుల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. పందులు కంచెను తాకినప్పడు షాక్‌కు గురువుతాయి. ఈ దెబ్బతో అడవిపందులు పారిపోతాయి. తక్కువ సామర్థ్యం గల విద్యుత్‌తో ఇలా చేయడంతో మనుషులకు, జంతువులకు ఎలాంటి ప్రాణహాని ఉండదు. -
చేదుగుళిక
కలిసిరాని చెరకు సాగు స్వల్పకాలిక వంగడాలపై రైతుల ఆసక్తి ఏటేటా తగ్గుతున్న పంట జిల్లాలో చెరకు సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. ఈ పంటకు మదుపులు బాగా పెరిగిపోయాయి. ఇంటిల్లిపాదీ రెక్కలు ముక్కలు చేసుకున్నా గిట్టుబాటు కావడం లేదు. గడచిన పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది తక్కువ విస్తీర్ణంలో నాట్లు వేశారు. చక్కెర మిల్లులు మద్దతు ధరను చెల్లించకపోవడంతో నీటి వసతి పుష్కలంగా ఉన్న భూములలో సైతం సరుగుడు, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలు వేస్తున్నారు. చెరకు ఏక వార్షిక పంట. సుమారు పది నెలలు పెంచాల్సి ఉంటుంది. ఈ సమయంలో అతివృష్టి, అనావృష్టికి గురయితే అంతే సంగతి. మునగపాక : చెరకు సాగు రైతుకు లాభసాటి కావడం లేదు. దీంతో ఈ పంట విస్తీర్ణం జిల్లాలో ఏటేటా తగ్గిపోతోంది. సాధారణ విస్తీర్ణం 38,329 హెక్టార్లు. ఈ ఏడాది 37,459 హెక్టార్లే సాగయింది. మూడేళ్లుగా చీడపీడల బెడద, చక్కెర మిల్లులు మద్దతు ధర చెల్లించకపోవడం, మార్కెట్లో బెల్లం ధరల్లో హెచ్చు తగ్గులు ఈ పంటను చేపట్టే రైతులను దివాలా తీసేలా చేస్తున్నాయి. తాతల కాలం నుంచి జీవనాధారంగా వస్తున్న పంటను వదులుకోలేక వేరే పనులు చేసే అవకాశం లేక రైతులు తీవ్ర దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కుటుంబమంతా ఏడాది పాటు కష్టపడినా పెట్టుబడులు కూడా దక్కకపోవడంతో అప్పులపాలైపోతున్నారు. ఎకరా చెరకు సాగుకు రూ. 40వేల నుంచి రూ. 45వేలు వరకు ఖర్చవుతోంది. పంట చీడపీడలు, అతివృష్టి, అనావృష్టికి గురయి దిగుబడి తగ్గిపోతోంది. కనీసం పదిపాకాలకు మించి దిగుబడులు రావడం లేదు. బెల్లం మొదటిరకం క్వింటా రూ.2910 నుంచి రూ. 3070లు పలుకుతోంది. ఈ లెక్కన పదిపాకాలకు సుమారు రూ.30వేలు ఆదాయం వస్తోంది. అంటే ఎకరాకు రూ.15వేలు నష్టం తప్పడం లేదు. చక్కెర మిల్లులు కూడా మద్దతు ధర చెల్లించడం లేదు. గతేడాది సరఫరా చేసిన చెరకుకు ఇప్పటి వరకు తుమ్మపాల యాజమాన్యం చెల్లింపులు జరపలేదు. దీనికి తోడు అతివృష్టి, అనావృష్టిలు దిగుబడిపై ప్రభావం చూపుతున్నాయని వ్యవసాయ అధికారులు అంటున్నారు. మద్దతు ధర లేదు నాది మునగపాక. చెరకు సాగే జీవనాధారం. అయితే పంట మదుపులకు, ఆదాయానికి పొంతన ఉండడం లేదు. బెల్లం తయారు చేస్తే మార్కెట్లో ధర ఉండడం లేదు. ఫ్యాక్టరీకి తరలిస్తే మద్దతు ధర లేదు సరికదా చెల్లింపులు లేవు. తీవ్రంగా నష్టపోతున్నాం. అందుకే ఈ ఏడాది 30సెంట్ల తోటను రసానికి అమ్మాను. పది టన్నులు వస్తుంది. టన్ను రూ. 2300లు. మొత్తం రూ. 23వేలు వరకు ఆదాయం వస్తుంది. ఇదే బాగుంది. - పెంటకోట శ్రీనివాసరావు ఏటా నష్టమే నాది మునగపాక. రెండెకరాల్లో చెరకు వేశా. గతేడాది రెండెకరాల్లోని పంటకు తెగుళ్లు సోకాయి. నివారణ చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. ఎకరాకు రూ.45వేలు వరకు మదుపు పెట్టా. చీడపీడల కారణంగా ఎకరా చెరకు గానుగాడితే పదిపాకాలకు మించి బెల్లం రాలేదు. మార్కెట్ ధర ప్రకారం ఎకరాకు రూ. 23వేలు మాత్రమే వచ్చింది. ఈ లెక్కన ఎకరాకు రూ 22వేలు వరకు నష్టపోయా. ఇంటిల్లిపాదీ కష్టపడినా నష్టమే వచ్చింది. - పెంటకోట వెంకటరావు, వ్యవసాయ రైతు -
ఒంటికన్ను కణుపులు వాడండి!
పాడి-పంట: అనకాపల్లి (విశాఖపట్నం): ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చెరకు సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోతోంది. ఓ వైపు పెట్టుబడి వ్యయం పెరగడం, కూలీల కొరత... మరోవైపు దిగుబడులు పెరగకపోవడం, గిట్టుబాటు ధర లభించకపోవడం... దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఎకరం విస్తీర్ణంలో చెరకు సాగుకు 40-50 వేల రూపాయలు ఖర్చవుతున్నాయి. సాగు ఖర్చును తగ్గించుకోగలిగినప్పుడే రైతులు లాభాల బాట పడతారు. ముచ్చెలకు బదులు బడ్‌చిప్/ఒంటికన్ను కణుపులను వినియోగించడం ద్వారా పెట్టుబడి వ్యయాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చునని చెబుతున్నారు విశాఖపట్నం జిల్లా అనకాపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త (చెరకు) డాక్టర్ ఎం.భరతలక్ష్మి. ఆ వివరాలు... చెరకు తోటలో రైతులు మూడు లేదా రెండు కళ్ల ముచ్చెలు నాటుతుంటారు. ఇందుకోసం ఎకరానికి 4-6 టన్నుల ముచ్చెలు అవసరమవుతాయి. ముచ్చెలకు బదులు మొగ్గతో ఉన్న ఒంటికన్ను కణుపులను గడల నుంచి వేరు చేసి, వాటిని ట్రేలల్లో పెంచి, నారు మొక్కలను ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే విత్తన మోతాదు బాగా తగ్గుతుంది. రైతుకు నికరాదాయం పెరుగుతుంది. ఈ విధానంపై రెండు రాష్ట్రాలలోని చెరకు పరిశోధనా స్థానాలలో గత నాలుగైదేళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఒక్కో నారు మొక్క నుంచి 10-15 కిలోల దిగుబడి పొందవచ్చునని తేలింది. ఎన్నో ప్రయోజనాలు సంప్రదాయ పద్ధతితో పోలిస్తే ఈ పద్ధతిలో పైరు ఎక్కువ పిలకలు తొడుగుతుంది. పిలకలన్నీ ఒకే విధంగా పెరుగుతాయి కాబట్టి గడల సంఖ్య, వాటి బరువు, చెరకు దిగుబడి, చక్కెర శాతం ఎక్కువగా ఉంటాయి. తెలంగాణలో ఎకరానికి సుమారు 10 టన్నులు, కోస్తాలో 5 టన్నుల మేర దిగుబడి పెరిగిందని పరిశోధనల్లో తేలింది. కణుపులను తేలికగా శుద్ధి చేసి, తద్వారా ఆరోగ్యవంతమైన నారును పెంచి చీడపీడల బారి నుంచి పైరును కాపాడుకోవచ్చు. నారు మొక్కలను ట్రేలల్లో పెంచడం వల్ల నెల రోజుల పంటకాలం కలిసొస్తుంది. ముందుగానే చెరకు క్రషింగ్ మొదలు పెట్టవచ్చు. నీరు, ఇతర వనరులు కూడా ఆదా అవుతాయి. ట్రేలల్లో ఒంటికన్ను కణుపులను నాటిన తర్వాత గడలో మిగిలిన భాగాన్ని పంచదార లేదా బెల్లం తయారీకి ఉపయోగించుకోవచ్చు. ఈ పద్ధతి యాంత్రీకరణకు బాగా అనువుగా ఉంటుంది. ఎలా తీయాలి? రైతులు ముందుగా అధిక దిగుబడినిచ్చే అనువైన రకాన్ని ఎంచుకోవాలి. 6-7 నెలల వయసున్న ఆరోగ్యవంతమైన తోట నుంచి గడలను సేకరించాలి. వీటి నుంచి ఒంటికన్ను కణుపులను వేరు చేయాలి. ఇందుకోసం యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పద్ధతిలో చెరకు సాగుకు ఎకరానికి కేవలం 70-80 కిలోల విత్తన కణుపులు సరిపోతాయి. సేకరణ సమయంలో విత్తన కణుపులు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే మొలక శాతం తగ్గుతుంది. కణుపులను గ్రేడింగ్ చేసి, మేలైన వాటిని తీసుకోవడం మంచిది. లీటరు నీటిలో 0.5 గ్రాముల కార్బండజిమ్+ఒక మిల్లీలీటరు మలాథియాన్ చొప్పున కలిపి, ఆ మందు ద్రావణంలో విత్తన కణుపులను 15 నిమిషాల పాటు ముంచి శుద్ధి చేయాలి. దీనివల్ల అనాసకుళ్లు తెగులు, పొలుసు పురుగు బారి నుంచి తోటను కాపాడుకోవచ్చు. ట్రేలో అమర్చి... విత్తన కణుపులను నాటడానికి ప్లాస్టిక్ ట్రేలను ఉపయోగించాలి. ఒక్కో ట్రేలో 50 నారు మొక్కలను పెంచవచ్చు. కొబ్బరి పీచుతో చేసిన ఎరువు (కోకో ఫీడ్)/బాగా చివికిన పశువుల ఎరువు/వర్మి కంపోస్ట్‌కు తగినంత మట్టిని కలిపి ట్రే గుంతను సగానికి పైగా నింపాలి. విత్తన కణుపును 60-70 డిగ్రీల వాలుగా నాటాలి. దానిపై మళ్లీ ఎరువు వేసి, కణుపు కనబడకుండా అదమాలి. ఆ ట్రేలను షేడ్‌నెట్ కింద లేదా నీడలో వరుసకు 10 చొప్పున ఉంచాలి. వాటిపై నల్లని పాలిథిన్ షీటును కప్పి గాలి చొరబడకుండా బిగించాలి. దీనివల్ల మొక్కలు 3-4 రోజుల్లో మొలుస్తాయి. కణుపు నుంచి మొక్క బయటికి వచ్చిన వెంటనే పాలిథిన్ షీటును తీసేయాలి. రోజు విడిచి రోజు రోజ్క్యాన్ లేదా స్ప్రింక్లర్లతో నీటిని చల్లాలి. నాటిన వారం రోజులకు మొక్కలన్నీ మొలిచి, ఆకులు తొడగడం మొదలవుతుంది. నాటిన 4 వారాలకు మొక్క 3-4 ఆకులు తొడుగుతుంది. వేర్లు కూడా వృద్ధి చెందుతాయి. నాటిన రెండు వారాల తర్వాత కూడా కణుపుల నుంచి మొలక రాకపోతే వాటిని తీసేసి కొత్త కణుపులు నాటాలి. ఎకరం తోటలో నాటేం దుకు 7,500-8,000 నారు మొక్కలు (150-175 ప్లాస్టిక్ ట్రేలలో పెంచిన) అవసరమవుతాయి. నారు మొక్కలు బలహీనంగా ఉన్నట్లయితే 19:19:19 ఎరువు 0.1% లేదా వర్మివాష్ 1% ద్రావణాన్ని వాటిపై పిచికారీ చేయాలి. (మిగతా వివరాలు రేపటి పాడి-పంటలో) -
చక్కెర మిల్లుకు చేదు కాలం!
జిల్లాలో పెరుగుతున్న చెరకు విస్తీర్ణం చతికిలపడుతున్న సుగర్ ఫ్యాక్టరీలు ఆధునికీకరణకు సర్కారు చొరవ చూపేనా ఎపిట్కో కమిటీ నివేదికను పరిశీలించాలంటున్న యాజమాన్యాలు చోడవరం : జిల్లాలో వరికి సమానంగా రైతులు చెరకు పంటను సాగుచేస్తున్నారు. చోడవరం, ఏటికొప్పాక, తాండవ, అనకాపల్లి సహకార చక్కెర కర్మాగారాలు ఉండడంతో ఏటా లక్షన్నర ఎకరాలకు మించి చెరకు సాగు జరుగుతుంది. ఈ ఏడాది వరి సాగుకు వాతావరణం అనుకూలించకపోవడంతో చెరకు సాగు సుమారు 20 శాతం పెరిగింది. సాధారణ విస్తీర్ణం కంటే అదనంగా 40వేల ఎకరాల్లో చెరకు సాగు జరుగుతుంది. అంటే సుమారు 2 లక్షల ఎకరాల వరకు ఈ ఏడాది చెరకు సాగు జరుగుతుంది. అయితే పంట విస్తీర్ణం పెరుగుతున్నా ఉన్న నాలుగు ఫ్యాక్టరీల్లో ఏటేటా మిషనరీ పాతబడి పోయి క్రషింగ్ సామర్థ్యం తగ్గిపోతుంది. సాగుకు అనుకూలంగా ఫ్యాక్టరీలు ఆధునికీకరణకు నోచుకోని పరిస్థితి నెలకొంది. రెండేళ్ల కిందట ఎపిట్కో కమిటీ రాష్ట్రంలో ఉన్న అన్ని సహకార చక్కెర కర్మాగారాలను క్షుణ్ణంగా పరిశీలించింది. తక్షణం ఆధునికీకరణ జరగకపోతే ఫ్యాక్టరీలన్నీ మూతపడే ప్రమాదం ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. సుమారు రూ.500 కోట్లు వెచ్చిస్తే అన్ని ఫ్యాక్టరీలు తిరిగి రైతులకు భరోసాగా నిలుస్తాయని సూచింది. అంతేకాకుండా ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి అయ్యే బెగాస్ ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉన్నందున అన్ని ఫ్యాక్టరీల్లోనూ కో జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని, తమిళనాడు మాదిరిగా ఇక్కడ కూడా ట్రాన్స్‌కోకు వీటి నిర్వహణ అప్పగిస్తే మంచిదని సూచింది. అయితే కిర ణ్‌కుమార్ సర్కార్ ఎపిట్కో కమిటీ నివేదికను పక్కన పెట్టింది. బకాయిలతో నెట్టుకొస్తున్నారు... ఈ ఏడాదైనా సుగర్ ఫ్యాక్టరీలను ఆధునికీకరించకపోతే చోడవరం, ఏటికొప్పాక లాంటి లాభాల్లో ఉన్న ఫ్యాక్టరీలు కూడా నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం పొంచి ఉంది. పంచదార ధర రెండేళ్లుగా ఘోరంగా పడిపోవడంతో కనీస మద్దతు ధర కూడా రైతులకు ఇవ్వలేని పరిస్థితిలో ఫ్యాక్టరీలు పడ్డాయి. చోడవరం ఫ్యాక్టరీకి ఉప ఉత్పత్తులైన మొలాసిస్, కో జనరేషన్ ద్వారా వచ్చిన ఆదాయంతో గట్టెక్కినప్పటికీ మిగతా ఫ్యాక్టరీలు రైతులకు నేటికీ ఈ బకాయిలు చెల్లించలేకపోయాయి. ఈ పరిస్థితుల్లో ఇటు రైతులను, అటు ఫ్యాక్టరీల మనుగడను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ ఏడాదైనా సుగర్ ఫ్యాక్టరీల ఆధునికీకరణకు చొరవ చూపాలని రైతులు, ఫ్యాక్టరీల యాజమాన్యాలు కోరుతున్నాయి. ఆధునికీకరణ చాలా అవసరం సహకార చక్కెర కర్మాగారాలు పూర్తిగా ఇబ్బందుల్లో ఉన్నాయి. ఆధునికీకరణ ప్రతి ఫ్యాక్టరీకి చాలా అవసరం. చెరకు పంటపై రైతులు ఆసక్తి చూపుతున్నప్పటికీ ఫ్యాక్టరీల క్రషింగ్ కెపాసిటీ లేక పంటను పూర్తిగా ఫ్యాక్టరీలు తీసుకోలేకపోతున్నాయి. గతంలో ప్రభుత్వాలు వేసిన కమిటీల ప్రతిపాదనలు కూడా ఇంకా ఆచరణలోకి రాలేదు. మొలాసిన్, ఇథనాయిల్కు ఇప్పుడు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ధర కూడా ఆశాజనకంగా ఉంది. ఫ్యాక్టరీల్లో ఉప ఉత్పత్తుల యూనిట్లు లేకపోవడం వల్ల కూడా ఆర్థికంగా వెనుకబడిపోతున్నాయి. ఇప్పుడు పూర్తిగా పంచదారపైనే ఆధారపడాల్సి వస్తుంది. అది కూడా ధరలు హెచ్చుతగ్గులు ఉన్నాయి. ప్రతి ఫ్యాక్టరీలో క్రషింగ్ సామర్ధ్యాన్ని పెంచే బాయిలర్ హౌస్‌లను నిర్మించుకోవాల్సి ఉంది. -వి.వి.రమణారావు, ఎండీ, గోవాడ సుగర్స్ -
మాటలు చెప్పి..కోటలు కూల్చి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రూ. 308 కోట్ల నష్టం జరి గినా, రూ.65.45 కోట్లకే డెల్టా పేప ర్ మిల్స్‌కు నిజాం షుగర్ ఫాక్టరీని ధారదత్తం చేసిన చీకటి ఒప్పందం ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మంది పొట్టకొట్టింది. లాభాల బాటలో నడుస్తున్న ఫ్యాక్టరీని నష్టాల సాకుతో టీడీపీ హయాంలో ప్రయివేటు పరం చేసిన ఘటనను ప్రజలు ఇప్పటికీ చర్చించుకుంటున్నారు. 1936 ని జాం కాలంలో శక్కర్‌నగర్‌లో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. చెరుకు సాగు కోసం ని జాంసాగర్ ప్రాజెక్టును నిర్మించారు. 16 వే ల ఎకరాలను కేటాయించారు. కార్మికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. నిజాంపాలన ముగిసిన తర్వాత ఫ్యాక్టరీ ప్ర భుత్వ స్వాధీనమైంది. ఇది జిల్లా అభివృద్ధి కే కాక, రాష్ట్రంలో చక్కెర పరిశ్రమ చంద్రబాబు హయాంలో 2002లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్యాక్టరీని కారు చౌకగా ప్రయివేటు సంస్థకు అప్పగించారు. తరువాత ఈ కర్మాగారం నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్‌గా రూపాంతరం చెందింది. శక్కర్‌నగర్ ప్రధాన యూనిట్‌తోపాటు కరీంనగర్ జిల్లా మెట్పల్లి, మెదక్ జిల్లా ముంబోజిపేట ఫ్యాక్టరీలను ప్రైవేట్ సంస్థ స్వాధీనమయ్యాయి. రైతు, కార్మిక సంఘాలు తీవ్రస్థాయి లో వ్యతిరేకించినా చంద్రబాబు పట్టించుకోలేదు. ప్రయివేటీకరణ లో భారీ అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని తీవ్ర ఆ రోపణలు వచ్చాయి. వైఎస్ విజయమ్మ పిటిషన్ చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరుపాలని 2011 అక్టోబర్‌లో వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బలమైన ఆధారాలతో 18 ఆరోపణలు పిటిషన్లో పొందుపర్చగా, ఇందులో నిజాం దక్కన్ షుగర్స్ ప్రైవేటీకరణ అవి నీతి అంశం కూడా ఉంది. వైఎస్ఆర్ హయాంలో శాసనసభా సంఘం నిజాం షుగర్స్ ప్రయివేటీకరణలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 2006లో సభాసంఘాన్ని నియమిం చారు. అప్పటి దేవాదాయ శాఖ మంత్రి రత్నాకర్‌రావు చైర్మన్‌గా, ఎ మ్మెల్యేలు పి. సుదర్శన్ రెడ్డి, ఎస్ గంగారాం, సురేశ్ షెట్కార్, బాజి రెడ్డి గోవర్ధన్, జి.చిన్నారెడ్డి, పద్మాదేవేందర్ రెడ్డి, కళా వెంకట్రావు, మర్రి శశిధర్‌రెడ్డి సభ్యులుగా ఉన్నారు. సభా సంఘం విచారణ చేసి 350 పే జీల నివేదికను ప్రభుత్వానికి అం దించింది. ప్ర యివేటీకరణలో అక్రమాలు జరిగాయని తేల్చి చెప్పింది. తిరిగి ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని సిఫారసు చేసింది. నివేదిక వచ్చి ఏళ్లు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం ప ట్టించుకోలేదు. ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక, రైతు, నిజాం షుగర్స్ పరిరక్షణ కమిటీలు పదకొండేళ్లుగా పోరాడుతున్నాయి. నిజాం షుగర్స్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఎం. అప్పిరెడ్డి సభా సంఘం సిఫారసులు అమలు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై పలుమార్లు విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వానికి అక్షింత లు వేసినా పట్టించుకోలేదు. -
చెరుకు రైతుకు మిగిలేది చేదే!
= పెరిగిన పెట్టుబడి వ్యయం = దక్కని గిట్టుబాటు ధర = ప్రకటించింది టన్నుకు రూ.2,400 = రూ.3,500 ఇవ్వాలని రైతుల డిమాండ్ హనుమాన్‌జంక్షన్, న్యూస్‌లైన్ : చెరుకు సాగు రైతన్నకు చేదును మిగుల్చుతోంది. గిట్టుబాటు ధర లభించకపోవటంతో రైతులు తీవ్ర ఒడిదుడుకులకు గురవుతున్నారు. ఏటా ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరుగుతున్నా చక్కెర కర్మాగారాలు చెరుకు ధరలను పెంచకపోవటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. హనుమాన్‌జంక్షన్‌లోని డెల్టా షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న బాపులపాడు, గన్నవరం, నూజివీడు, మైలవరం, చాట్రాయి, ముసునూరు, ఆగిరిపల్లి, పెదపాడు మండలాల్లో సుమారు 8,600 ఎకరాల్లో చెరుకు సాగులో ఉంది. ఈ ఏడాది 2.40 లక్షల టన్నుల చెరుకు క్రషింగ్‌ను ఫ్యాక్టరీ లక్ష్యంగా పెట్టుకుంది. తేలని గిట్టుబాటు ధర... మరో నెల రోజుల్లో చెరుకు క్రషింగ్ ప్రారంభం కానుంది. డెల్టా షుగర్స్ పరిధిలో 2013-14 సీజన్లో నాలుగు వేల ఎకరాల్లో మొక్క చెరుకు, మరో 4,600 ఎకరాల్లో పిలక చెరుకు సాగులో ఉంది. జిల్లాలోని కేసీపీ కర్మాగారం టన్ను చెరుకు ధర రూ.2,400గా ప్రకటించటంతో డెల్టా షుగర్స్ రైతులు అయోమయంలో పడ్డారు. గత సీజన్లో డెల్టా యాజమాన్యం టన్ను చెరుకు ధర సబ్సిడీ పోను రూ.2,200 అందజేసింది. ఎకరాకు లక్ష రూపాయలకు పైగా ఉత్పత్తి వ్యయం అవుతుండగా, దిగుబడి మాత్రం 30 టన్నులకు మించటం లేదని రైతులు చెబుతున్నారు. ప్రస్తుత సీజన్లోనైనా డెల్టా యాజమాన్యం సరైన గిట్టుబాటు ధర ప్రకటిస్తుందని రైతులు ఆశతో ఉన్నారు. తగ్గుతున్న సాగు విస్తీర్ణం... చెరుకు పంటకు సరైన గిట్టుబాటు ధర రాకపోవటంతో రైతాంగం ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెడుతున్నారు. ఇప్పటికే మొక్కజొన్న, పామాయిల్ సాగుకు రైతులు మొగ్గుచూపటంతో జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న చక్కెర ఫ్యాక్టరీల క్రషింగ్ సామర్థ్యం సుమారు 25 లక్షల టన్నులు కాగా 2012-13 సీజన్లో 12 లక్షల టన్నులు మాత్రమే క్రషింగ్ కావటం దీనికి నిదర్శనం. డెల్టా ఫ్యాక్టరీ పరిధిలో గతంలో 12 వేల ఎకరాలకు పైబడి చెరుకు సాగులో ఉండగా 2011-12 సీజన్లో తొమ్మిదివేల ఎకరాలకు, 2012-13 సీజన్లో 8,600 ఎకరాలకు, ప్రస్తుతం 8,400 ఎకరాలకు సాగు విస్తీర్ణం క్రమేణా తగ్గటం ఆందోళన కలిగిస్తోంది. రెట్టింపైన పెట్టుబడి వ్యయం.. ఏటా చెరుకు ఉత్పత్తి వ్యయం పెరుగుతున్నప్పటికీ ఆ స్థాయిలో గిట్టుబాటు ధరలు పెరగకపోవటంతో రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. అడ్డగోలుగా పెరిగిన డీజిల్, ఎరువుల ధరలు, కూలీల కొరత రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరోపక్క కూలిరేట్లు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. గత సీజన్లో ఎలుకల బెడద చెరుకు రైతును కోలుకోలేని దెబ్బ తీసింది. ఈసారి దిగుబడి ఆశాజనకంగానే ఉన్నా ధర ఏమాత్రం అందుతుందో వేచి చూడాల్సిందే. టన్నుకు రూ.3500 ఇవ్వాలి పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో టన్ను చెరుకు ధర రూ.3500 ప్రకటించకుంటే రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఎకరాకు సుమారు లక్షన్నర రూపాయల వ్యయం అవుతోంది. చెరుకు రైతుల ద్వారా ఫ్యాక్టరీలకు లాభాలు, ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం భారీగా వస్తున్నా ఆరుగాలం కష్టించే రైతు మాత్రం నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. న్యాయమైన ధర ప్రకటించి చెరుకు సాగును నిలబెట్టుకోకపోతే భవిష్యత్‌లో గడ్డుకాలం ఎదుర్కోక తప్పదు. - నండూరు సత్య వెంకటేశ్వర శర్మ, చెరుకు ఉత్పత్తిదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి