చెరకు ‘కరువు’! | Sugarcane Crop Was Falling Down | Sakshi
Sakshi News home page

చెరకు ‘కరువు’!

Published Sun, May 5 2019 2:28 AM | Last Updated on Sun, May 5 2019 5:20 AM

Sugarcane Crop Was Falling Down - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే క్రషింగ్‌ సీజన్‌ నాటికి రాష్ట్రంలో చెరకు సాగు విస్తీర్ణం రికార్డు స్థాయిలో పడిపోనున్నది.మద్దతు ధర చెల్లింపులో చక్కెర కర్మాగారాల వైఖరి, కరువు పరిస్థితులు తదితరాల నేపథ్యంలో ఈ రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో సహకార, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో నడుస్తున్న చక్కెర కర్మాగారాలు మూత పడ్డాయి. చెరుకు సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోనుందనే అంచనాల నేపథ్యంలో ప్రైవేటు రంగంలోని చక్కెర కర్మాగారాలు కూడా మూతపడే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో 11 కర్మాగారాలు ఉండగా ఇప్పటికే సహకార రంగంలోని నిజామాబాద్‌ షుగర్‌ ఫ్యాక్టరీతో పాటు ఎన్‌డీఎస్‌ఎల్‌ భాగస్వామ్యంలోని బోధన్, మెదక్, మెట్‌పల్లి చక్కెర కర్మాగారాలు కూడా మూత పడ్డాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రైవేటు రంగంలోని ఏడు చక్కెర కర్మాగారాలు మాత్రమే పనిచేస్తున్నాయి.

వీటి క్రషింగ్‌ సామర్థ్యం రోజుకు 2,4700 టన్నులు. ఏటా చెరకు సాగు విస్తీర్ణం తగ్గుతుండటంతో ఫ్యాక్టరీల సామర్థ్యానికి అనుగుణంగా చెరుకు సరఫరా కాకపోవడంతో క్రషింగ్‌ సీజన్‌ను గడువుకు ముందే ముగిస్తున్నారు. చెరకు, చక్కెర శాఖ గణాంకాల ప్రకారం 2018–19 క్రషింగ్‌ సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 35,568 హెక్టార్లలో చెరుకు సాగు చేశారు. వచ్చే క్రషింగ్‌ సీజన్‌ 2019–20లో చెరకు సాగు విస్తీర్ణం కేవలం 23,188 హెక్టార్లకే పరిమితం అవుతుందని అధికారులు అంచనా వేశారు. గణపతి, కామారెడ్డి గాయత్రి షుగర్స్‌ మినహా మిగతా అన్ని ఫ్యాక్టరీల పరిధిలో కేవలం 2,500 హెక్టార్లలోపు విస్తీర్ణంలో మాత్రమే చెరకు సాగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఏడాది వ్యవధిలోనే 12,380 హెక్టార్లలో చెరుకు సాగు విస్తీర్ణం తగ్గుతుండటంతో ఫ్యాక్టరీల మనుగడకు సవాలుగా మారనుంది. 

భారీగా తగ్గనున్న దిగుబడి 
రాష్ట్రంలోని ఏడు చక్కెర కర్మాగారాల పరిధిలో గత ఏడాది 2018–19 క్రషింగ్‌ సీజన్‌లో 24.14 లక్షల మెట్రిక్‌ టన్నుల చెరకును క్రషింగ్‌ చేశారు. ప్రస్తుతం తెలంగాణలో హెక్టారుకు సగటున 70 టన్నుల చెరుకు దిగుబడి వస్తోంది. సాగు విస్తీర్ణం పడిపోతున్న నేపథ్యంలో దిగుబడి కూడా 8.66 మెట్రిక్‌ టన్నుల మేర తగ్గనుంది. గత ఏడాదితో పోలిస్తే వచ్చే క్రషింగ్‌ సీజన్‌ నాటికి కేవలం 16 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే దిగుబడి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో చెరకు సాగు విస్తీర్ణం పెరగాల్సిన అవసరం ఉందని చక్కెర రంగం నిపుణులు చెప్తున్నా.. క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వ్యయ ప్రయాసలకోర్చి సాగు చేసినా కనీస మద్దతు ధర (ఎఫ్‌ఆర్‌పీ) టన్నుకు రూ.2845 మించడం లేదు. మరోవైపు క్రషింగ్‌ కోసం పంటను కర్మాగారాలకు తరలించినా ఫ్యాక్టరీ యాజమాన్యాలు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. గత ఏడాది క్రషింగ్‌కు సంబంధించి చక్కెర కర్మాగారాలు రైతులకు రూ. 729.69 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 476.57 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లోకి చేరాయి. మరో రూ.245 కోట్ల బకాయిల కోసం రైతులు కర్మాగారాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
 
కుంగదీస్తున్న కరువు పరిస్థితులు 
దేశ వ్యాప్తంగా 527 చక్కెర కర్మాగారాలు ఉండగా తెలంగాణలో 11 కర్మాగారాలు ఉన్నాయి. చక్కెర కర్మాగారాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే నష్టాలతో రాష్ట్రంలో ఇప్పటికే సహకార, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య కర్మాగారాలు నాలుగు మూతపడ్డాయి. చెరకు సాగుకు పేరొందిన మంజీర, గోదావరి నదీ తీర ప్రాంతంలో వర్షాభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. సిం గూరు, నిజాంసాగర్‌ల్లో నీటిమట్టం డెడ్‌స్టోరేజీకి చేరింది. ఎన్‌డీఎస్‌ఎల్, నిజామాబాద్‌ సహకార చక్కెర ఫ్యాక్టరీలు మూత పడటంతో రైతులు ఇప్పటికే ప్రత్యామ్నాయ పంటలు, వర్షాధార పంటల సాగువైపు మొగ్గు చూపారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో మరింతమంది చక్కెర రైతులు పత్తి, సోయా వంటి ప్రత్యామ్నాయ పం టల సాగువైపు మొగ్గు చూపుతుండటంతో రాబోయే రోజుల్లో చక్కెర కర్మాగారాలు చెరకు కొరతను ఎదుర్కోనున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement