Sugar factories
-
చక్కెర కర్మాగారాలను పిప్పి చేసింది బాబే
సాక్షి, అమరావతి: ఎవరైనా ఓ మాట చెబితే దానికో హేతుబద్ధత ఉండాలి. కానీ, రామోజీ మాటలకు రోత పద్ధతే తప్ప హేతుబద్దత ఉండదు. ఇందుకు చక్కెర కర్మాగారాలపై ఈనాడు ప్రచురించిన కథనమే ఇందుకు నిదర్శనం. అసలు రాష్ట్రంలో చక్కెర కర్మాగారాలను నమిలి, పీల్చి పిప్పి చేసిందే రామోజీ ప్రియ మిత్రుడు చంద్రబాబు. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఎన్నో ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఎందరో చెరుకు రైతులు కుదేలైపోయారు. వేలాది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తర్వాత సహకార రంగంలో మూతపడిన చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చీరాగానే వీటి పునరుద్ధరణకు ఉప సంఘం వేశారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలను రైతులు, ఉద్యోగులకు చెల్లించారు. మూతబడ్డ కర్మాగారాల్లో క్రషింగ్ ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. క్రషింగ్ సామర్థ్యానికి తగినట్టుగా చెరుకు ఉత్పత్తి లేకపోవడంతో స్థానికంగా సాగయ్యే పంట ఉత్పత్తులకు అదనపు విలువ కల్పించడం ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ఆహార శుద్ధి పరిశ్రమలు నెలకొల్పాలని సంకల్పించారు. రైతులకు ఇంతలా మంచి జరిగితే తట్టుకోలేని విపక్షాలు కోర్టును ఆశ్రయించి అడ్డుకున్నాయి. ఈ వాస్తవాలను విస్మరించి ఈనాడు పత్రికలో ‘‘తీపి మాటలు చెప్పి పీల్చి పిప్పి’ అంటూ రామోజీ మరో రోత కథ అచ్చేశారు. ఈ కథనంలో వాస్తవాలేమిటో ఒక్కసారి పరిశీలిద్దాం.. ఆరోపణ: చక్కెర కర్మాగారాలకు సమాధి కట్టారు వాస్తవం: సహకార రంగంలో ఉన్న డెయిరీలనే కాదు..చక్కెర కర్మాగారాలను కూడా నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుదే. బాబు హయాంలో మూతపడిన చిత్తూరు, రేణుగుంట, కోవూరు, ఎన్వీఆర్ జంపని సహకార చక్కెర కర్మాగారాలను దివంగత మహానేత వైఎస్సార్ అధికారంలోకి వచ్చీరాగానే పునరుద్ధరిస్తే వాటిని మళ్లీ చంద్రబాబు మూతపడేలా చేశారు. లాభాల బాటలో నడుస్తున్న చిత్తూరు, రేణిగుంట, కోవూరు, ఎన్వీఆర్ జంపని చక్కెర కర్మాగారాలను తన అనుయాయులకు కట్టబెట్టే లక్ష్యంతో వాటిని నిర్వీర్యం చేసి 2003–04లోనే మూత పడేలా చేశారు. ఫలితంగా పదింటికి తొమ్మిది మూతపడగా, ఆ ప్రభావంతో 15 ప్రైవేటు కర్మాగారాలు సైతం మూత పడ్డాయి. ప్రస్తుతం ఆంధ్ర, కేసీపీ షుగర్స్‌లో ఒక్కొక్క యూనిట్, శ్రీకాకుళంలోని ఈఐబీ ప్యారీ, చిత్తూరులోని ఎస్ఎన్జే షుగర్స్ మాత్రమే పనిచేస్తున్నాయి. అదీ కూడా 45 లక్షల టన్నుల క్రషింగ్ సామర్థ్యం కల్గిన ఈ కర్మాగారాలు కేవలం 19 లక్షల టన్నుల సామర్థ్యంతో పని చేసే స్థాయికి చేరాయి. ఇదంతా బాబు చేసిన పాపాల ఫలితమే. ఆరోపణ: రైతులను ఆదుకోని వైఎస్సార్సీపీ సర్కారు? వాస్తవం: బాబు ఎగ్గొట్టిన బకాయిలతో సహా ఈ ఐదేళ్లలో రైతులకు రూ.346.47 కోట్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెల్లించింది. అలాగే ఉద్యోగులకు బకాయిపెట్టిన రూ. 72.86 కోట్లు చెల్లించింది. మరొక వైపు ఉప సంఘం సిఫార్సుల మేరకు బాబు హయాంలో నిర్వీర్యమైన అనకాపల్లి, తాండవ, ఏటికొప్పాక, విజయ రాయ కర్మాగారాల పునరుద్ధరణ చర్యలు చేపట్టినప్పటికీ, సామర్థ్యానికి తగినట్టుగా చెరుకు దొరకని పరిస్థితి నెలకొంది. సగటున రోజుకు 17,750 టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో ఈ కర్మాగారాలకు కనీసం 4 నెలలకు 23.09 లక్షల టన్నుల చెరుకు అవసరం కాగా, రూ.2.80 లక్షల టన్నులకు మించి లభించడంలేదు. పైగా వీటిలోని యంత్ర పరికరాలన్నీ మూలపడి శిథిలావస్థకు చేరుకున్నాయి. ముడిì సరుకు లేకుండా వందల కోట్లు ఖర్చుపెట్టి ఆధునికీకరించడం వలన ఫలితమేమిటో రామోజీకే తెలియాలి. ఆరోపణ: చెరుకు రైతులకుప్రోత్సాహం కరువు వాస్తవం: వైఎస్ జగన్ ప్రభుత్వం చెరుకు సాగు చేసే ప్రతి రైతుకు అవసరమైన ఆర్థిక చేయూత అందిస్తోంది. ఓ వైపు రాయితీలు, ప్రోత్సాహకాలతో పాటు.. వైఎస్సార్ రైతు భరోసా కింద చెరుకు రైతులకు సైతం ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది. పంట నష్ట పరిహారంతో పాటు సున్నా వడ్డీ రాయితీ, పైసా భారం పడకుండా పంటల బీమా అమలు చేస్తోంది. కూలీల కొరత, పెరిగిన పెట్టుబడి ఖర్చులకు తోడు గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల మెజార్టీ రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లారు. ఫలితంగా ఒకప్పుడు లక్ష హెక్టార్లకు పైగా సాగైన చెరుకు.. ప్రస్తుతం (2023–24)లో 41 వేల హెక్టార్లకు పడిపోయి, 23.65 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. ఆరోపణ: రూ.2 వేల కోట్ల ఆస్తులు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం? వాస్తవం: సామర్థ్యానికి సరిపడా చెరుకు లేక క్రషింగ్ నిలిచిన ఈ కర్మాగారాలను ఆహార శుద్ధి పరిశ్రమలుగా మార్చాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. స్థానికంగా లభించే పంట ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేయడం ద్వారా వాటికి అదనపు విలువ చేకూర్చి తద్వారా రైతులకు అదనపు లబ్ధి చేకూర్చాలన్నది వైఎస్ జగన్ ప్రభుత్వ సంకల్పం. పైగా ఈ పరిశ్రమలన్నీ ప్రభుత్వమే స్వయంగా నిర్మించి లీజు పద్ధతిన వాటి నిర్వహణను మాత్రమే ఆసక్తి గల సంస్థలకు అప్పగించాలని భావించింది. కర్మాగారాల ఆస్తులు, స్థలాలపై లీజుకు తీసుకునే సంస్థలకు ఎలాంటి హక్కులు ఉండవన్నది సుస్పష్టం. అయితే, మూతపడిన చక్కెర కర్మాగారాల వ్యవహారంపై కోర్టులో స్టే ఉన్నందున ప్రభుత్వ ప్రయత్నం కార్యరూపం దాల్చలేదు. అలాంటప్పుడు వేల కోట్ల విలువైన వీటిని ప్రైవేటు వ్యక్తులకు ఎలా ధారాదత్తం చేస్తారో రామోజీనే చెప్పాలి. -
కర్ణాటకనే దిక్కు! ‘ట్రైడెంట్’లో ఊసేలేని చెరకు క్రషింగ్..
సంగారెడ్డి: జహీరాబాద్‌లోని ‘ట్రైడెంట్’ యాజమాన్యం క్రషింగ్‌ను చేపట్టే పరిస్థితి కనిపించకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో రైతులు పక్క రాష్ట్రాలకు చెరకును తరలిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ప్రజా ప్రతినిధులు మర్చిపోవడంతో రైతాంగం వారిపై ఆశలు వదులుకొని తమ దారి తామే చూసుకుంటున్నారు. ఇప్పటికే పలు కర్మాగారాలతో ఒప్పందం సైతం చేసుకున్నారు. జహీరాబాద్ జోన్ పరిధిలో సుమారు 18 వేల ఎకరాల్లో చెరకు పంట సాగులో ఉంది. 7 లక్షల టన్నుల మేర చెరకు పంట ఉత్పత్తి కానుంది. ఇంత మొత్తంలో పంట జోన్ పరిధిలో ఉండడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు పక్కనే ఉన్న కర్ణాటకకు పంటను తరలిస్తున్నారు. కర్ణాటకలోని చించోళి, బరూర్, మన్నాక్కెల్లి, గాంధీ చక్కెర కర్మాగారాలకు పంటను పంపిస్తున్నారు. జహీరాబాద్ నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, యాజమాన్యంపై ఆశలు వదులుకొని ఇప్పటికే జోన్ పరిధిలో సాగులో ఉన్న దాంట్లో 8 వేల ఎకరాల పంటను పక్కనే ఉన్న కర్ణాటకలోని చించోళి యాజమాన్యంతో ఒప్పందం చేసుకున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. జోన్ పరిధిలోని జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, మొగుడంపల్లి మండలాల్లో రైతులు చెరకు పంటను విస్తారంగా సాగు చేసుకున్నారు. కర్ణాటకలోని యాజమాన్యాలు టన్నుకు ధర రూ.2,650 మేర చెల్లించి, చెరకు కోత, రవాణా ఖర్చులను వారే భరిస్తున్నారని రైతులు పేర్కొన్నారు. రూ.9 కోట్ల మేర బకాయి.. ‘ట్రైడెంట్’ కర్మాగారంలో 2022–23 క్రషింగ్ సీజన్‌కు గాను 2.55 లక్షల టన్నుల చెరకును గాను గాడించింది. టన్నుకు రూ.3,270 ధర నిర్ణయించింది. మొదటి విడత కింద టన్నుకు రూ.3 వేల వంతున చెల్లిస్తూ వచ్చింది. మిగితా రూ.270 పెండింగ్ పెట్టింది. జనవరి నెలాఖరు, ఫిబ్రవరి మాసంలో చెరకును సరఫరా చేసిన రైతులకు మాత్రం పూర్తిస్థాయిలో బిల్లులు పడ్డాయి. జోన్ పరిధిలో ఉన్న మొత్తం 2,287 మంది రైతులు కర్మాగారానికి చెరకును సరఫరా చేశారు. ఇందులో 1,699 మంది రైతులకు టన్నుకు రూ.270 వంతున బకాయి పడింది. మిగిలిన రైతులకు పూర్తిస్థాయిలో బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. రూ.83 కోట్లకు గాను రైతాంగానికి ఇప్పటి వరకు రూ.74 కోట్ల మేర చెల్లించారు. ఇంకా రూ.9 కోట్ల మేర బకాయిలను చెల్లించాల్సి ఉందని రైతులు పేర్కొంటున్నారు. ఇచ్చిన హామీని మరిచిన నేతలు! ఎన్నికల సందర్భంగా కర్మాగారంలో క్రషింగ్‌ను చేపట్టేలా చర్యలు తీసుకుంటామని, మొత్తం చెరకు బకాయిలు ఇప్పిస్తామని రైతులకు ప్రజా ప్రతినిధులు, అధికారులు హామీ ఇచ్చి మర్చిపోయారని రైతులు వాపోతున్నారు. పలు సమావేశాల్లో ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, నియోజకవర్గం బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి దేవిప్రసాద్ హామీ ఇచ్చారని రైతులు పేర్కొంటున్నారు. అవసరం అయితే తమ ఆస్తులను అమ్మి బకాయిలు చెల్లిస్తామని మాట ఇచ్చారని, వారు ఇప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నిస్తున్నారు. డిసెంబర్ మొదటివారంలోనే క్రషింగ్ జరిపేలా చూస్తామని చెప్పినట్లు గుర్తు చేస్తున్నారు. అధికారులు హామీ ఇచ్చి.. ఎన్నికల ప్రచారం నిమిత్తం నవంబర్ 23వ తేదీన జహీరాబాద్‌కు అప్పటి సీఎం కేసీఆర్ ప్రచారం నిమిత్తం వస్తుండడంతో సభను అడ్డుకునేందుకు రైతులంతా తీర్మానించారు. డిసెంబర్ మొదటి వారంలో బకాయిలను ఇప్పించడంతోపాటు క్రషింగ్‌ను జరిపిస్తామని ఎమ్మెల్యే మాణిక్‌రావు, కేన్, పోలీసు అధికారులు హామీ ఇచ్చి తమ ఆందోళనను విరమింపజేశారు. ఎన్నికలు ముగిసిన అనంతరం ఎవరూ పట్టించుకోవడం లేదు. – కొండల్‌రెడ్డి, రైతుసంఘం నాయకుడు, జహీరాబాద్ ఇవి చదవండి: వలస.. ఏదీ భరోసా? -
చంద్రబాబు హయాంలో.. నిజాం షుగర్స్ పతనం! దానిని తెరిపిస్తామంటూ.. బీజేపీ సవాల్..!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పసుపుబోర్డు అంశమే ప్రధాన ఎజెండాగా గత పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన ఎంపీ అర్వింద్ బీఆర్ఎస్కు మరో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. స్వయాన ప్రధానమంత్రి నరేంద్రమోదీ పసుపు బోర్డును ప్రకటించడంతో ఇదే ఉత్సాహంతో అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. నిజాంషుగర్స్ ప్రధాన అంశంగా తీసుకుని ముందుకు వెళ్తామని, చెరుకు సాగు విస్తీర్ణాన్ని పెంచి రైతులకు మేలు చేస్తామని ఎంపీ అర్వింద్ ఈ సందర్భంగా పేర్కొంటున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు అంశం ఫలితాన్ని శాసించింది. పసుపు బోర్డు కోసం బాండ్ పేపర్ రాసిచ్చి బరిలోకి దిగిన ఎంపీ ధర్మపురి అర్వింద్ మెజారిటీ విజయం సాధించారు. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని తీసుకొచ్చి పసుపుబోర్డు ప్రకటింపజేశారు. ఇదే ఊపుతో ఉత్తర తెలంగాణలో బీజేపీ ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో సత్తాచాటే లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తున్నారు. పసుపుబోర్డు నేపథ్యంలో ఆ పంట సాగు విస్తీర్ణాన్ని పెంచాలనే లక్ష్యం ముంగిటకు వచ్చామని ఎంపీ అర్వింద్ చెబుతున్నారు. ఇక ఉత్తర తెలంగాణలో చెరుకు పంటసాగు విస్తీర్ణాన్ని పెంచడమే ఎజెండాగా ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉమ్మడి కరీంనగర్‌లోని మెట్పల్లిలో రైతులతోఆత్మీ య సమావేశం నిర్వహించనున్నారు. ఉత్తరప్రదేశ్ పాలసీపై అధ్యయనం.. దేశంలో ఇథనాల్ వాడకం పెరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి కరీంగనర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో దాని తయారీ కోసం చెరుకు పంట సాగు విస్తీర్ణం పెంచే లక్ష్యంతో అర్వింద్ పార్టీ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ప్రత్యేకంగా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. నిజాంషుగర్ ఫ్యాక్టరీలు ఉమ్మడి నిజామాబాద్(బోధన్), ఉమ్మడి కరీంగనర్(జగిత్యాల జిల్లా ముత్యంపేట), ఉమ్మడి మెదక్(ముంబోజిపల్లి)లో ఉన్నాయి. ఈ క్రమంలో అర్వింద్ ఉత్తరప్రదేశ్‌లోని చెరుకు పాలసీని స్టడీ చేస్తున్నారు. యూపీలో మాదిరిగా చెరుకు పంటసాగుతో పాటు దాన్ని రెగ్యులేట్ చేసేందుకుగాను షుగర్, బ్రౌన్ షుగర్, ఇథనాల్ అనే మూడు ఉత్పత్తుల తయారీకి ప్లాన్ చేస్తున్నారు. చెరుకుకు మద్దతు ధర ఇస్తున్న నేపథ్యంలో పశ్చిమ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదక ఖర్చు 30శాతం ఎక్కువ ఉంటోంది. దీంతో షుగర్ ఎగుమతులు అంతగా చేయలేని పరిస్థితి. ఇథనాల్ ఉత్పత్తి లక్ష్యంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని, తద్వారా చెరుకు సాగువిస్తీర్ణాన్ని పెంచి రైతులకు మేలు చేస్తామని ఎంపీ వివరించారు. 2022 జూన్ 12, 13 తేదీల్లో జిల్లాలో కేంద్ర భారీపరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో కలిసి ఈ ప్రాంతాల్లో పర్యటించినప్పటి నుంచే చెరుకు పంట సాగు, నిజాం షుగర్స్ విషయమై సుదీర్ఘ అధ్యయనం చేస్తున్నట్లు ఎంపీ తెలిపారు. ఉత్తర తెలంగాణలో వరి, మొక్కజొన్న, చెరకు పంటల నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేయడంతోపాటు ఇతర ఫుడ్‌ప్రాసెసింగ్ పరిశ్రమలు, వ్యవసాయ అధారిత యూనిట్లు నెలకొల్పితే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయంటున్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు భారీగా సబ్సిడీలు ఇస్తున్న నేపథ్యంలో రైతులకు మరింత మేలు కలుగుతుందన్నారు. రాష్ట్రంలో బీజేపీకి అధికారం ఇస్తే తక్షణమే జిల్లాలోని నిజాం షుగర్‌ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెబుతుండడంతోపాటు దీన్నే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాగా నిజామాబాద్ జిల్లాలో సాధారణ వరిసాగు 2,86,160 ఎకరాలు కాగా.. నిజాం షుగర్స్ మూతపడడంతో చెరుకు రైతులు వరికి మారడంతో 4 లక్షల ఎకరాలకు పెరిగింది. చంద్రబాబు హయాంలో.. నిజాం షుగర్స్ పతనానికి 2002లో చంద్రబాబు ప్రభుత్వం బీజం వేసింది. అప్పట్లో రూ.308 కోట్ల విలువ కలిగి ఉన్న నిజాం షుగర్స్ కర్మాగారాన్ని కేవలం రూ.65.45 కోట్లకు డెల్టా పేపర్ మిల్స్ అనే ప్రైవేటు కంపెనీకి విక్రయించారు. తర్వాత వైఎస్సార్ ప్రభుత్వం ఈ వ్యవహారంపై 2006లో శాసనసభా సంఘాన్ని నియమించగా భారీ అవినీతి చోటుచేసుకున్నట్లు తేల్చారు. ఇదిలా ఉండగా 2014లో ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ నిజాం షుగర్స్‌ను ప్రభుత్వపరం చేస్తామన్నారు. కానీ విచిత్రంగా 2015 డిసెంబర్ 23న ఫ్యాక్టరీ మూడుయూనిట్లను మూసేశారు. 2005 – 06లో చెరుకు 35వేల టన్నుల దిగుబడి ఉన్నప్పుడు నడిచిన ఈ కర్మాగారాలను, 2015లో లక్ష టన్నుల చెరుకు దిగుబడి ఉన్నప్పటికీ మూసేయడం గమనార్హం. -
చక్కెర కర్మాగారాలకు ఉరేసింది చంద్రబాబే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సహకార రంగంలోని చక్కెర కర్మాగారాలకు ఉరేసిందే చంద్రబాబు. ఆయన ప్రభుత్వ హయాంలో చేపట్టిన చర్యల కారణంగా అనేక సుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. వేలాది రైతులు, కార్మికులు రోడ్డున పడ్డారు. చివరకు వారికి ఇవ్వాల్సిన సొమ్ము కూడా చంద్రబాబు బకాయి పెట్టారు. ఈ వాస్తవాలను వదిలేసిన ఈనాడు పత్రిక మూతపడ్డ ఆ ఫ్యాక్టరీలకు మళ్లీ ప్రాణం పోస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సహకార రంగంలోని చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు ఉపసంఘం వేసింది. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలను రైతులు, ఉద్యోగులకు చెల్లించింది. మూతబడ్డ కర్మాగారాల్లో క్రషింగ్ మొదలయ్యేలా చేసింది. కానీ సామర్థ్యానికి తగినట్టుగా చెరకు ఉత్పత్తి లేదు. దీంతో స్థానికంగా సాగయ్యే పంట ఉత్పత్తులకు అదనపు విలువ కల్పించడం ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ఆహార శుద్ధి పరిశ్రమలు నెలకొల్పాలని ప్రభుత్వం సంకల్పించింది. రైతులకు మేలు చేయడం కూడా నేరమన్నట్టుగా రామోజీ తన అక్కసును వెళ్లగక్కుతున్నారు. వాస్తవాలను కప్పిపుచ్చుతూ బురద రాతలు రాస్తున్నారు. రామోజీ ముసుగేసిన వాస్తవాలేమిటో ఒక్కసారి పరిశీలిద్దాం.. ఆరోపణ: చక్కెర కర్మాగారాలను మూతపడేలా చేశారు వాస్తవం: సహకార రంగంలో ఉన్న డెయిరీలనే కాదు.. చక్కెర కర్మాగారాలను కూడా నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుదే. లాభాల బాటలో నడుస్తున్న చిత్తూరు, రేణిగుంట, కోవూరు, ఎన్వీఆర్ జంపని చక్కెర కర్మాగారాలను తన అనుయాయులకు కట్టబెట్టే లక్ష్యంతో 2003–04లో వాటిని మూతపడేటట్టు చేశారు. వైఎస్సార్ ప్రభుత్వం మినహా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సైతం వీటిని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పనిచేయడంతో పదింటికి తొమ్మిది మూతపడ్డాయి. బాబు నిర్వాకం వల్ల ప్రైవేటు రంగంలో ఉన్న కర్మాగారాలపై ఆ ప్రభావం పడింది. ఈ రంగంలోని 19కి 15 మూతపడేలా చేశారు. ప్రస్తుతం ఆంధ్ర, కేసీపీ సుగర్స్‌లో ఒక్కొక్క యూనిట్, శ్రీకాకుళంలోని ఈఐబీ ప్యారీ, చిత్తూరులోని ఎస్ఏజే సుగర్స్ మాత్రమే పనిచేస్తున్నాయి. అదీ కూడా 45 లక్షల టన్నుల క్రషింగ్ సామర్థ్యం కల్గిన ఈ కర్మాగారాలు కేవలం 19 లక్షల టన్నుల సామర్థ్యంతో పని చేసే స్థాయికి పడిపోయాయి. ఇదంతా బాబు నిర్వాకం వల్లనే అన్నది సుస్పష్టం. ఆరోపణ: రైతులకు ప్రోత్సాహమేదీ? వాస్తవం: బాబు హయాంలో మూతపడిన చిత్తూరు, రేణిగుంట, కోవూరు, ఎన్వీఆర్ జంపని సహకార చక్కెర కర్మాగారాలను వైఎస్సార్ అధికారంలోకి వచ్చీరాగానే పునరుద్ధరించారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాల నిర్వాకంతో అవి మళ్లీ మూతపడ్డాయి. ఫ్యాక్టరీలు మూతపడటం, ప్రభుత్వాల ప్రోత్సాహం కరవవడంతో చెరకు రైతులు ఇతర పంటల వైపు మళ్లారు. దీంతో చెరకు సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. ఒకప్పుడు లక్ష హెక్టార్లకు పైగా సాగైన చెరకు ప్రస్తుతం 35 వేల హెక్టార్లకు పడిపోయింది. సహకార, ప్రైవేటు కర్మాగారాల ద్వారా ఒకప్పుడు కోటి టన్నులకు పైగా క్రషింగ్ జరగ్గా, ప్రస్తుతం 23 లక్షల టన్నులకు పరిమితమైంది. ఆరోపణ: రైతులు, ఉద్యోగులను ఆదుకున్నదెవరు? వాస్తవం: సహకార రంగంలో ఉన్న కర్మాగారాలను మూతపడేలా చేయడమే కాదు.. రైతులు, ఉద్యోగులకు చెల్లించాల్సిన వందల కోట్లను చంద్రబాబు ఎగ్గొట్టారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు ఎగ్గొట్టిన రూ.167.60 కోట్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చెల్లించింది. ఉద్యోగులకు బకాయిపెట్టిన రూ. 108 కోట్లలో రూ.14 కోట్లు ఇప్పటికే చెల్లించింది. మరో 94 కోట్లు జూలైలో చెల్లించేందుకు ఏర్పాట్లు చేసింది. ఆరోపణ: ఆ కర్మాగారాలను పునరుద్ధరించలేదేమి? వాస్తవం: బాబు హయాంలో నిర్వీర్యమైన అనకాపల్లి, తాండవ, ఏటికొప్పాక, విజయరాయ కర్మాగారాల పునరుద్ధరణకు వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే ఏ కర్మాగారమైనా పూర్తి స్థాయిలో నడవాలంటే ముడిసరుకు అవసరం. కానీ వీటి పరిసర ప్రాంతాల్లో చెరకు సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. ఫ్యాక్టరీల సామర్థ్యానికి తగినట్టుగా చెరుకు దొరకడంలేదు. ఫలితంగా పూర్తి సామర్థ్యానికి తగినట్టుగా క్రషింగ్ జరిపే పరిస్థితి లేదు. వందల కోట్లు ఖర్చు పెట్టి వీటిని ఆధునికీకరించినా క్రషింగ్ చేసేందుకు ముడిసరుకైన చెరుకు దొరికే పరిస్థితి లేదు. ఆరోపణ: ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకే? వాస్తవం: సామర్థ్యానికి సరిపడా చెరకు లేక క్రషింగ్ నిలిచిన ఈ కర్మాగారాలను ఆహార శుద్ధి పరిశ్రమలుగా మార్చడం ద్వారా రైతులకు మేలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. స్థానికంగా లభించే పంట ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేయడం ద్వారా వాటికి అదనపు విలువ చేకూర్చి తద్వారా రైతులకు అదనపు లబ్ధి కలిగించాలన్నది ప్రభుత్వ సంకల్పం. పైగా ఈ పరిశ్రమలన్నీ ప్రభుత్వమే స్వయంగా నిర్మిస్తోంది. కర్మాగారాలకు చెందిన గజం స్థలం కాదు కదా.. వాటికి చెందిన పూచిక పుల్ల కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఏకోశానా లేదు. కేవలం నిర్వహణ మాత్రమే.. అదీ రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు, నిర్వహణకు ముందుకొచ్చే సంస్థలకు లీజుకివ్వాలని సంకల్పించింది. ఇందులో తప్పేముంది? ఏదైనా ప్రభుత్వ స్థలం లేదా ఆస్తులున్నాయంటే దొడ్డి దారిన తన అనుయాయులకు కట్టబెట్టాలన్న ఆలోచన చంద్రబాబు నైజం. ఇదే రీతిలో చిత్తూరు, రేణిగుంట, కొవ్వూరు, జంపని సుగర్ ఫ్యాక్టరీలను తన అనుయాయులకు కట్టబెట్టిన చరిత్ర బాబుదే. ఇలా వేల కోట్ల విలువైన ఆస్తులను కట్టబెట్టారు. కానీ ఈ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, వాటి ద్వారా రైతులకు, సంబంధిత వర్గాల వారికి మేలు చేయాలనే నిత్యం ఆలోచన చేస్తోంది. ఆ దిశగానే అడుగులు వేస్తోంది. రామోజీకి మాత్రం కళ్లెదుట ఉన్న ఈ వాస్తవేలేవీ కనిపించవు. నిత్యం పైత్యపు రాతలతో కాలకూట విషం కక్కుతూనే ఉన్నారు. -
ఏపీ మంత్రివర్గ ఉపసంఘం భేటీ
సాక్షి, అమరావతి: చెరకు కర్మాగారాల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. విజయవాడ సీఆర్డీఏ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు బొత్స, మేకపాటి, కన్నబాబు పాల్గొన్నారు. షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణకోసం చేపట్టవలసిన చర్యలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఉత్తరాంధ్రలో చెరకు ఉత్పత్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సూచించారు. (చదవండి: మూడు రాజధానులు పెట్టి తీరుతాం: కొడాలి నాని) చక్కెర కర్మాగారాల సమస్యలు ఆర్థిక, పౌరసరఫరాల శాఖతో కూడా ముడిపడి ఉన్నందున మరో సమావేశం ఏర్పాటు చేయాలని, తరువాత సమావేశానికి ఆయా శాఖల కార్యదర్శులను కూడా పిలవాలని ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యకు మంత్రి మేకపాటి సూచించారు. పర్మినెంట్, సీజనల్ ఉద్యోగుల సంఖ్య, వారి జీతాల గురించి మంత్రి బొత్స సత్యనారాయణ అడిగి తెలుసుకున్నారు.శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు సహకార చక్కెర కర్మాగారం గురించి మంత్రి మేకపాటి వివరించారు. స్థానిక చెరకు రైతుల అవసరమైన వ్యవసాయ ఆధారిత ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామని, జపాన్ సంస్థలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చారని సహచర మంత్రులకు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. (చదవండి: ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఇవే..) వచ్చే సీజన్లో ఫ్యాక్టరీల పునరుద్ధరణకు ఇప్పుడే కార్యాచరణ ప్రారంభించాలని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు సూచించారు. 6 చక్కెర కర్మాగారాలకు కేటాయించిన భూములు, వాటి విలువపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. పనిచేయని షుగర్ ఫ్యాక్టరీల గత బకాయిలు, విడుదల చేసిన నిధుల వినియోగంపై మంత్రులు ఆరా తీశారు. చిత్తూరు, నెల్లూరు, కడప, విశాఖలోని చక్కెర ఫ్యాక్టరీల ఆర్థిక పరిస్థితి, యంత్రాల స్థితిపై మంత్రులు వాకబు చేశారు. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు చక్కెర అవసరాలు, కొనుగోలు వివరాలపైనా చర్చ జరిగింది. తమిళనాడు రాష్ట్రంలో కర్మాగారాల్లో ఉత్పత్తి అయ్యే చక్కెరను స్థానిక పౌరసరఫరాల శాఖకు పంపిణీ చేసే పద్ధతి గురించి షుగర్, కేన్ కమిషనర్ వెంకట్రావు ప్రస్తావించారు. ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, షుగర్స్ డైరెక్టర్ వెంకట్రావ్ , చక్కెర కర్మాగారాల ప్రతినిధులు హాజరయ్యారు. -
‘ఏడాదిలోనే విత్తన శుద్ధి కేంద్రాలు పూర్తి చేస్తాం’
సాక్షి, విశాఖపట్నం : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగం ఏడాదిలోనే అభివృద్ధి చెందిందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఏడాదిలోనే విత్తన శుద్ధి కేంద్రాలు పూర్తి చేస్తామని తెలిపారు. చెరుకు రైతులకు 55 కోట్ల బకాయిలు ముఖ్యమంత్రి చెల్లించారన్నారు. మంత్రి గురువారం మాట్లాడుతూ.. చెక్కర కర్మాగారాలు అభివృద్ధి చేయడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెరకు రైతులకు ఆదుకున్నారన్నారు. (‘నాడు – నేడు’పై మన కల నిజం కావాలి) చోడవరం చెరకు ఫ్యాక్టరీ కోసం ఇప్పటి వరకు ఏడాది కాలంలో 96 కోట్లు నిధులు మంజూరు చేశారని మంత్రి తెలిపారు. చోడవరం షుగర్స్‌లో 140 కోట్ల పంచదార నిల్వ ఉంచగా వెంటనే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. చక్కెర కర్మాగారాలు ఆధునీకరణకు అగష్టు నెల గడువులోగా కమిటీ వేస్తామన్నారు. ప్రతి జిల్లాలో సీడ్ ప్రోసెసింగ్ యూనిట్లు, ప్రతి నియోజకవర్గంలో మినీ ప్రోసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి కన్నబాబు వెల్లడించారు. (ఏపీలో కొత్తగా 1555 పాజిటివ్ కేసులు) -
‘వైఎస్సార్ జయంతి రోజు మర్చిపోలేని అనుభూతి’
సాక్షి, విశాఖపట్నం : దశాబ్ద కాలంగా బకాయిలు చెల్లించకపోవడంతో సహకార చక్కెర కర్మాగారం రైతులు ఇబ్బందులు పడ్డారని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల సమస్యలు తెలుసుకొని ముఖ్యమంత్రిగా తన బాధ్యత నెరవేర్చారని ప్రశంసించారు. కాగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని వైఎస్సార్ రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ హయాంలో వడ్డీలేని రుణాల కోసం రైతులకు బకాయి పడ్డ 1054 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారు. దీంతో పాటు రాష్ట్రంలోని 5 సహకార చక్కెర కర్మాగారాల పరిధిలో రైతులకు అప్పటి టీడీపీ ప్రభుత్వం చెల్లించాల్సిన 54.6 కోట్ల రూపాయల పాత బకాయిలను కూడా సీఎం జగన్ విడుదల చేశారు. ('మాది ఎన్నటికి రైతుల పక్షపాతి ప్రభుత్వమే') మంత్రి అవంతి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ రైతు పక్షపాతిగా మరోసారి చరిత్రలో నిలిచిపోయారన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యవసాయానికి ఓ బ్రాండ్ అంబాసిడర్ అని, ఆయన జయంతి రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మర్చిపోలేని అనుభూతిని ఇచ్చారని అవంతి శ్రీనివాస్ కొనియాడారు. రైతు భరోసా కేంద్రాలు ద్వారా విత్తనాలు దగ్గర నుంచి పంట ఉత్పత్తి కొనుగోలు వరకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుండటం హర్షనీయమన్నారు.(‘ఆయన పాలన గుప్తుల కాలాన్ని గుర్తు చేసింది’) ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీకి చెందిన 5 వేల మందికి పైగా రైతులకు 10 కోట్ల రూపాయలు, తాండవకు చెందిన 4 వేల మంది రైతులకు సంబంధించి 9 కోట్ల రూపాయల బకాయిలు విడుదలయ్యాని తెలిపారు. రెండు చక్కెర కర్మాగారాలు బకాయిల చెల్లింపుకు నిధులు విడుదల చేయడం మాములు విషయం కాదని, బకాయిల చెల్లింపు తో మళ్ళీ చెరకు సాగు చేయడానికి రైతులు ముందుకు వస్తారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. (అందుబాటులోకి 21 సంజీవని బస్సులు) టీడీపీ హయాంలో సహకార చక్కెర కర్మాగారాలు నడవలేని స్థితిలో ఉండేవని యలమంచలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కన్నబాబు విమర్శించారు. రెండేళ్లుగా బకాయిలు చెల్లించక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని బకాయిలను సెటిల్ చేయడం రైతులు ఊహించుకోలేదన్నారు. కాగా తాండవ, ఏటికొప్పాక రైతులకు ఈ రోజు ఎంతో పవిత్రమైన, అదృష్టమైన రోజు అని పాయకరావుపేట ఎమ్యెల్యే గొల్ల బాబురావు అన్నారు. -
చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణపై సీఎం సమీక్ష
సాక్షి, అమరావతి : సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సమీక్షా నిర్వహించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ పాల్గొన్నారు. రైతులకు చెల్లించాల్సిన బకాయిల వివరాలు ఆరా తీసిన సీఎం.. వారికి ఒక్క రూపాయి కూడా బకాయిలు లేకుండా తీర్చాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఈనెల 8న రైతు దినోత్సవం సందర్భంగా 54.6 కోట్ల రూపాయలను చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. దీంతో శ్రీ విజయరామ గజపతి ఫ్యాక్టరీ కింద రూ.8.41 కోట్లు, చోడవరం షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో రూ.22.12 కోట్లు, ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ కింద రూ.10.56 కోట్లు, తాండవ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో రూ.8.88 కోట్లతో పాటు, అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీ రైతులకు రూ.4.63 కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించనుంది. దీంతో దాదాపు 15 వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. (సీఎం జగన్‌ను అభినందించిన పవన్ కల్యాణ్ ) ప్రస్తుతం సహకార చక్కెర కర్మాగారాల వద్ద ఉన్న నిల్వలను ఎంత వరకు వినియోగించగలమో ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. టీటీడీతో పాటు, ప్రధాన దేవాలయాలు, ప్రభుత్వ హాస్టళ్లు, అంగన్వాడీలు సహా వివిధ ప్రాంతాల్లో చక్కెర నిల్లలు చేసేలా చూడాలన్నారు. దీని వల్ల చక్కెర ఫ్యాక్టరీలకు మేలు జరుగుతుందన్నారు. సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీలపై మరింత లోతుగా అధ్యయనం చేసి కార్యాచరణ రూపొందించాలని అధికారులు, మంత్రలను సీఎం జగన్ ఆదేశించారు. ఆగస్టు 15 నాటికి వీటికి సంబంధించిన సమగ్ర నివేధిక సిద్ధం చేయాలని తెలిపారు. (అచ్చెన్నాయుడుకు చుక్కెదురు ) -
‘ఆ ఘనత ఏపీ సీఎం వైఎస్ జగన్‌దే’
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో ఉన్న నాలుగు చెక్కర ఫ్యాక్టరీల అభివృద్ధికి రూ. 100 కోట్ల గ్రాంటు మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కొనియాడారు. సీఎం జగన్ మరో ఎన్నికల హామిని నెరవేర్చారంటూ సంతోషం వ్యక్తం చేశారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సహకార చక్కెర కర్మాగారాలను ఆదుకునేందుకు రూ. 200 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హయాంలో గోవాడ చెక్కెర ఫ్యాక్టరీ రూ.150 కోట్ల నష్టాల ఊబిలో ఉందని అన్నారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి రూ. 40.25కోట్లు మంజూరైందని, రెండు రోజుల్లో గోవాడ చెక్కర కర్మాగారం రైతులు, కార్మికులకు రూ. 18.28 కోట్లు చెల్లించనున్నట్లు తెలిపారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో రూ. 22 కోట్లతో డిస్టలరీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రూ. 47 కోట్లు గ్రాంటు రూపంలో ఇవ్వడం వల్ల రైతులకు, కార్మికులకు ఏంతో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ రైతు పక్షపాతి : బీశెట్టి సత్యవతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల పక్షపాతి అని అనకాపల్లి ఎంపీ బీశెట్టి సత్యవతి అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో చక్కెర ఫ్యాక్టరీలు మూలన పడ్డాయని ఆరోపించారు. సీఎం జగన్ రైతు బాంధవుడని కొనియాడారు. -
'చక్కెర కర్మాగారాలకు పునర్ వైభవం తేవాలి'
సాక్షి, అమరావతి : సహకార చక్కెర కర్మాగారాలు, సహకార డెయిరీలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సహకార చక్కెర కర్మాగారాల పునర్ వైభవానికి సమగ్ర ప్రణాళిక తయారుచేయాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం పనిచేస్తున్న కర్మాగారాలు, తిరిగి తెరవాల్సిన కర్మాగారాల విషయంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇప్పుడున్న పోటీని తట్టుకోవడానికి, లాభదాయకంగా నడపడానికి అవసరమైన చర్యలను అందులో పొందుపరచాలన్నారు. కర్మాగారాలను తాజా సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధిచేయడంతో పాటు ఉప ఉత్పత్తులు ద్వారా అవి సొంతకాళ్లమీద నిలబడ్డానికి అవసరమైన అన్ని ఆలోచనలు చేయాలని నిర్దేశించారు. చక్కెర సరఫరా చేసినందుకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వీలైనంత త్వరలో చెల్లించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రణాళికలో నిర్దేశించిన విధంగా సహకార డెయిరీలకు పాలు పోస్తున్నందుకు ప్రతి లీటరుకూ రూ.4ల బోనస్ అమలుపైనా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సహకార డెయిరీల బలోపేతం, రైతులకు మరింత లబ్ధి చేకూర్చే అన్నిరకాల చర్యలపైనా వీలైనంత త్వరగా ప్రతిపాదనలు సిద్ధంచేయాలని సీఎం ఆదేశించారు. -
చెరకు ‘కరువు’!
సాక్షి, హైదరాబాద్: వచ్చే క్రషింగ్ సీజన్ నాటికి రాష్ట్రంలో చెరకు సాగు విస్తీర్ణం రికార్డు స్థాయిలో పడిపోనున్నది.మద్దతు ధర చెల్లింపులో చక్కెర కర్మాగారాల వైఖరి, కరువు పరిస్థితులు తదితరాల నేపథ్యంలో ఈ రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో సహకార, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో నడుస్తున్న చక్కెర కర్మాగారాలు మూత పడ్డాయి. చెరుకు సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోనుందనే అంచనాల నేపథ్యంలో ప్రైవేటు రంగంలోని చక్కెర కర్మాగారాలు కూడా మూతపడే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో 11 కర్మాగారాలు ఉండగా ఇప్పటికే సహకార రంగంలోని నిజామాబాద్ షుగర్ ఫ్యాక్టరీతో పాటు ఎన్డీఎస్ఎల్ భాగస్వామ్యంలోని బోధన్, మెదక్, మెట్పల్లి చక్కెర కర్మాగారాలు కూడా మూత పడ్డాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రైవేటు రంగంలోని ఏడు చక్కెర కర్మాగారాలు మాత్రమే పనిచేస్తున్నాయి. వీటి క్రషింగ్ సామర్థ్యం రోజుకు 2,4700 టన్నులు. ఏటా చెరకు సాగు విస్తీర్ణం తగ్గుతుండటంతో ఫ్యాక్టరీల సామర్థ్యానికి అనుగుణంగా చెరుకు సరఫరా కాకపోవడంతో క్రషింగ్ సీజన్‌ను గడువుకు ముందే ముగిస్తున్నారు. చెరకు, చక్కెర శాఖ గణాంకాల ప్రకారం 2018–19 క్రషింగ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 35,568 హెక్టార్లలో చెరుకు సాగు చేశారు. వచ్చే క్రషింగ్ సీజన్ 2019–20లో చెరకు సాగు విస్తీర్ణం కేవలం 23,188 హెక్టార్లకే పరిమితం అవుతుందని అధికారులు అంచనా వేశారు. గణపతి, కామారెడ్డి గాయత్రి షుగర్స్ మినహా మిగతా అన్ని ఫ్యాక్టరీల పరిధిలో కేవలం 2,500 హెక్టార్లలోపు విస్తీర్ణంలో మాత్రమే చెరకు సాగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఏడాది వ్యవధిలోనే 12,380 హెక్టార్లలో చెరుకు సాగు విస్తీర్ణం తగ్గుతుండటంతో ఫ్యాక్టరీల మనుగడకు సవాలుగా మారనుంది. భారీగా తగ్గనున్న దిగుబడి రాష్ట్రంలోని ఏడు చక్కెర కర్మాగారాల పరిధిలో గత ఏడాది 2018–19 క్రషింగ్ సీజన్లో 24.14 లక్షల మెట్రిక్ టన్నుల చెరకును క్రషింగ్ చేశారు. ప్రస్తుతం తెలంగాణలో హెక్టారుకు సగటున 70 టన్నుల చెరుకు దిగుబడి వస్తోంది. సాగు విస్తీర్ణం పడిపోతున్న నేపథ్యంలో దిగుబడి కూడా 8.66 మెట్రిక్ టన్నుల మేర తగ్గనుంది. గత ఏడాదితో పోలిస్తే వచ్చే క్రషింగ్ సీజన్ నాటికి కేవలం 16 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే దిగుబడి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో చెరకు సాగు విస్తీర్ణం పెరగాల్సిన అవసరం ఉందని చక్కెర రంగం నిపుణులు చెప్తున్నా.. క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వ్యయ ప్రయాసలకోర్చి సాగు చేసినా కనీస మద్దతు ధర (ఎఫ్ఆర్పీ) టన్నుకు రూ.2845 మించడం లేదు. మరోవైపు క్రషింగ్ కోసం పంటను కర్మాగారాలకు తరలించినా ఫ్యాక్టరీ యాజమాన్యాలు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. గత ఏడాది క్రషింగ్‌కు సంబంధించి చక్కెర కర్మాగారాలు రైతులకు రూ. 729.69 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 476.57 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లోకి చేరాయి. మరో రూ.245 కోట్ల బకాయిల కోసం రైతులు కర్మాగారాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కుంగదీస్తున్న కరువు పరిస్థితులు దేశ వ్యాప్తంగా 527 చక్కెర కర్మాగారాలు ఉండగా తెలంగాణలో 11 కర్మాగారాలు ఉన్నాయి. చక్కెర కర్మాగారాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే నష్టాలతో రాష్ట్రంలో ఇప్పటికే సహకార, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య కర్మాగారాలు నాలుగు మూతపడ్డాయి. చెరకు సాగుకు పేరొందిన మంజీర, గోదావరి నదీ తీర ప్రాంతంలో వర్షాభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. సిం గూరు, నిజాంసాగర్ల్లో నీటిమట్టం డెడ్‌స్టోరేజీకి చేరింది. ఎన్డీఎస్ఎల్, నిజామాబాద్ సహకార చక్కెర ఫ్యాక్టరీలు మూత పడటంతో రైతులు ఇప్పటికే ప్రత్యామ్నాయ పంటలు, వర్షాధార పంటల సాగువైపు మొగ్గు చూపారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో మరింతమంది చక్కెర రైతులు పత్తి, సోయా వంటి ప్రత్యామ్నాయ పం టల సాగువైపు మొగ్గు చూపుతుండటంతో రాబోయే రోజుల్లో చక్కెర కర్మాగారాలు చెరకు కొరతను ఎదుర్కోనున్నాయి. -
కనికరం లేని సర్కారు.. కార్మికుల కన్నీరు
సాక్షి, కొవ్వూరు: టీడీపీ సర్కారు కార్మికుల ఉసురుపోసుకుంది. వారి జీవితాలతో దాగుడుమూతలాడింది. చాగల్లు సుగర్ ఫ్యాక్టరీ మూసివేతతో వందలాది కుటుంబాలు రోడ్డున పడినా పట్టించుకోలేదు. జమాన్యానికి కొమ్ముగాస్తూ.. కార్మికుల పొట్టకొట్టింది. తమకు రావాల్సిన బకాయిలైనా ఇప్పించాలని కార్మికులు వేడుకున్నా.. పోరుబాట పట్టినా కనీసం కనికరించలేదు. ఫలితంగా శ్రమజీవుల ఆకలికేకలు మిన్నంటుతున్నాయి. జిల్లాలోనే అత్యధిక చెరకు క్రషింగ్ సామర్థ్యం కలిగిన చాగల్లులోని జైపూర్ చక్కెర కర్మగారం మూతపడడంతో కార్మికులు రోడ్డున పడ్డారు. ఫ్యాక్టరీ మూతపడి 26 నెలలు పూర్తయినా.. జీతాలు, ఇతర రాయితీ బకాయిలు అందక ఆకలి కేకలు పెడుతున్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు నియోజకవర్గంలోనే ఈ దుస్థితి నెలకొన్నా.. టీడీపీ సర్కారు పట్టించుకున్న దాఖలా లేదు. ఇతర పరిశ్రమలూ మూత ఫ్యాక్టరీకి అనుబంధంగా నడుస్తున్న చాగల్లు డిస్టిలరీ, జంగారెడ్డిగూడెంలోని రమా మొలాసిస్ పరిశ్రమలూ మూతపడ్డాయి. ఇదే యాజమాన్యం పోతవరంలో నిర్మించిన మరో చక్కెర కర్మాగారం చెరకు పంట లేకపోవడంతో ట్రయిల్రన్తోనే మూతపడింది. దీంతో సీజన్ కార్మికులతో కలిపి 750 మంది శ్రమజీవులు, ఉద్యోగులు ఉపాధికి దూరమయ్యారు. పోరుబాట పట్టినా ఫలితం శూన్యం ఫ్యాక్టరీ మూతతో దాని ఎదుటే 86 రోజులపాటు కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేశారు. ఫ్యాక్టరీ తెరిపించాలని మంత్రులు, ప్రభుత్వ పెద్దల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. అయినా ఫలితం శూన్యం. దీంతో కుటుంబాలతో రోడ్డెక్కి ర్యాలీలు, ధర్నాలు చేసినా టీడీపీ సర్కారు వారి గోడు పట్టించుకోలేదు. ఆరుగురు కార్మికులు మృతి ఫలితంగా జీతాలందక, కుటుంబాల పోషణ భారమై, ఆర్థిక ఇబ్బందుల బారిన పడి ఏకంగా ఆరుగురు కార్మికులు ప్రాణాలు కొల్పోయారు. ఫీల్డ్మేన్ నల్లూరి శ్రీనివాసరావు, ఫిట్టర్లుగా పనిచేసే ఆలపాటి వెంకటేశ్వరరావు, వీవీఎల్ఎన్ ఆచార్యులు, క్లర్క్‌లు వల్లభనేని సత్యనారాయణ, ఎం.దుర్గారావు ఆరోగ్య సమస్యలతో, మనోవేదనతో మృతి చెందారు. ఆత్కూరి కృష్ణమూర్తి రిటైర్డు అయినా పింఛన్ పొందకుండానే మృతి చెందారు. అసలు కథ ఇదీ.. చాగల్లు ప్యాక్టరీ యాజమాన్యం చెరుకు రైతులకు రూ.70.05 కోట్ల మేర బకాయి పడింది. ఈ బకాయిలు రాబట్టడం కోసం కలెక్టర్ 2016 జనవరి 20న రెవెన్యూ రికవరీ యాక్టు ప్రయోగించి ఫ్యాక్టరీని సీజ్ చేశారు. దీని అనుబంధంగా ఉండే పరిశ్రమలు మూతపడడంతో సీజనల్ కార్మికులతో కలిపి 750 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. అమలుకాని హామీ మంత్రి జవహర్ కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు దీక్షలు విరమించారు. ఇంత వరకు ఒరిగిందేమీ లేదు. జిల్లాకు చెందిన కార్మిక శాఖ మంత్రిని, కార్మిక శాఖ కమిషనర్ని కలిసి గోడు వెళ్లబుచ్చుకున్నా.. సర్కారులో చలనం లేదు. కార్మికులకు జీతాలు, ఇతర అలవెన్స్‌లు అందలేదు. రెండేళ్లు నుంచి కార్మికులు ఉపాధికి దూరమయ్యారు. రిటైర్డు అయిన వాళ్లకు అందాల్సిన సోమ్ములు అందడం లేదు. బతుకు భారమై కార్మికులు విలవిల్లాడుతున్నారు. చైర్మన్‌ను కలిసినా ఫలితమేదీ! కార్మిక సంఘం నాయకులు గత ఏడాది అక్టోబర్ 24న ఫ్యాక్టరీ చైర్మన్‌ని కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. నెలలో పీఎఫ్ బకాయిలు జమచేస్తామని, మెడికల్ ప్రీమియం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు కాలేదు. దీంతో ఈ ఏడాది ఫ్రిబవరి 3న మరోసారి కలిశారు. రాయగఢ్‌లో ఆస్తులను అమ్ముతున్నామని త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చినా ఇంత వరకు సొమ్ములు అందలేదు. ఇప్పుడు కొత్తగా నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యూనల్ వాళ్లు సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఫ్యాక్టరీని తమ అధీనంలోకి తీసుకున్నామని, ఫ్యాక్టరీని అమ్మి అయినా సరే మూడు నెలల్లో కార్మికులు, ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తామని చెబుతున్నారని, ఇది ఎప్పటికి జరిగేనో అని కార్మిక సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల పరిస్థితి మరింత దైన్యం ఫ్యాక్టరీ మూతతో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. జిల్లాలో నిడదవోలు, గోపాలపురం, కొవ్వూరు, పోలవరం నియోజకరవర్గాల రైతులు ఈ ఫ్యాక్టరీ పరిధిలోనే చెరుకు సాగు చేసేవారు. మొదట్లో సుమారు 90 వేల ఎకరాల్లో చెరకుపంట సాగయ్యేది. ఫ్యాక్టరీ మూత పడడంతో రైతులు చెరుకుసాగుకు దూరమయ్యారు. బెల్లం తయారు చేసే రైతులు మాత్రమే చెరుకు సాగు చేస్తున్నారు. మూడేళ్ల నుంచి చెరుకుకు ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటున్నారు. ఈ బకాయిల మాటేంటి ? ∙2017 జనవరి 20న ఫ్యాక్టరీ మూతపడడంతో కార్మికులు, ఉద్యోగులకు 26 నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదు. ∙2017 జనవరి నుంచి ఇప్పటి వరకు కార్మికులకు యాజమాన్యం పీఎఫ్ బకాయిలు చెల్లించలేదు. ఒక్కో కార్మికుడికి ఏడాదిగా యాజమాన్యం చెల్లించాల్సిన వైద్య ఖర్చులు రూ.10వేలు, బోనస్‌లు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఓవర్ టైమ్(ఓటీ), ఫీల్డ్ సిబ్బందికి ఆదివారం సెలవు దినాల్లో చెల్లించే అలవెన్స్‌లు తదితర పాత బకాయిలు 2014–15 నుంచి చెల్లించడం లేదు. సుమారు రూ.3 కోట్ల మేర ఈ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ∙ఫ్యాక్టరీ నడవని కాలంలో కార్మికులు, ఉద్యోగులకు చెల్లించే రిటర్నింగ్ అలవెన్స్‌లు చెల్లించడం లేదు. ∙2014 మార్చి నుంచి యాజమాన్యం కోటా కింద చెల్లించాల్సి ప్రావిడెంట్ ఫండ్ వాటా చెల్లించడం లేదు. – ఉద్యోగులు, కార్మికుల తరుఫున చెల్లించే ఫీఎఫ్ మాత్రం 2014 మార్చి నుంచి 2016 ఆగస్టు వరకు మాత్రమే చెల్లించారు. దీంతో రిటైర్డు ఉద్యోగులకు పీఎఫ్ రావడం లేదు. ఫ్యాక్టరీ యాజమాన్యం చెల్లించే మొత్తం చెల్లిస్తే తప్ప పీఎఫ్ చెల్లించే వీలులేదు. ∙కార్మికులు, ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న కో–ఆపరేటివ్ క్రిడెట్ సోసైటీ లో ఉన్న నిల్వ లో రూ.90లక్షలు యాజమాన్యం వినియోగించుకుంది. దీంతో కార్మిక సంఘం నాయకులు కో–ఆపరేటివ్ రిజిస్ట్రార్‌కి ఫిర్యాదు చేశారు. నెలకు రూ.10 లక్షలు చొçప్పున 2016 నవంబర్ నుంచి 2017 నవంబర్ వరకు ఆ సొమ్ములు తిరిగి జమ చేస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. దీనిలో కేవలం రూ.10 లక్షలు జమచేసింది. ఇంకా రూ.80లక్షలు బకాయిలు రావాలి. ∙ఆర్థిక ఇబ్బందులున్న సమయంలో కో–ఆపరేటివ్ సోసైటీ సొమ్మును కార్మికులు, ఉద్యోగులు రుణాలుగా తీసుకునే అవకాశం ఉంది. యాజమాన్యం తీసుకున్న సొమ్ములు జమ చేయకపోవడంతో కార్మికులకు ఆ అవకాశం కుడా లేకుండాపోయింది. మా గోడు పట్టించుకునేవారేరీ వేతనాలు, ఇతర బకాయిలు చెల్లించాలని కోరుతూ 86 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేశాం. మంత్రి కేఎస్ జవహర్ మా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు ఏమీ చేయలేదు. టీడీపీ ప్రభుత్వం కార్మికుల సమస్యల పరిష్కారంపై శ్రద్ధ చూపలేదు. తక్షణం బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఫ్యాక్టరీ తెరిపించేందుకు చర్యలు తీసుకోవాలి. కో–ఆపరేటివ్ క్రిడెడ్ సోసైటీ నుంచి యాజమాన్యం తీసుకున్న రూ.80లక్షల సొమ్ములు తక్షణం తిరిగి జమచేయాలి. – నీరుకొండ కృష్ణారావు,ది.జైపూర్ సుగర్స్ అండ్ డిస్టిలరీస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు,చాగల్లు -
ప్రత్యామ్నాయ ఇంధనంగా ఇథనాల్ సాధ్యమేనా ?
ఆగస్టు 10వ తేదీ ప్రపంచ జీవ ఇంధన దినోత్సవాన్ని జరుపుకున్నాం. జీవ ఇంధనాలను ఉపయోగించడం ద్వారా పెట్రోలు వినియోగాన్ని తగ్గించవచ్చని, తద్వారా కోట్ల రూపాయలు ఆదా చేసుకోవచ్చన్న భావనతో ప్రపంచ దేశాలు జీవ ఇంధనమైన ఇధనాల్‌ను పెట్రోల్‌లో కలపాలని నిర్ణయించాయి. మన దేశంలో కూడా ఇథనాల్ వినియోగాన్ని పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వంలోని నూతన,పునర్వినియోగ ఇంధన మంత్రిత్వ శాఖ 2009లో జీవ ఇంధనాలపై జాతీయ విధానాన్ని రూపొందించింది.2013 జనవరి నుంచి ఇథనాల్ కలిపిన పెట్రోలును అమ్మే విధానాన్ని(ఇబీపీ) ప్రారంభించింది. పెట్రోలియం కంపెనీలు 5శాతం ఇథనాల్ కలిపిన పెట్రోలునే అమ్మాలని ఆదేశించింది.2017 నాటికి 20శాతం ఇథనాల్ కలిపిన పెట్రోలు అమ్మాలని లక్ష్యంగా పెట్టుకుంది.అయితే, ప్రభుత్వాల అలసత్వం, ఇథనాల్ తగినంత ఉత్పత్తి కాకపోవడం తదితర కారణాల వల్ల గడువుదాటినా లక్ష్యం నెరవేరలేదు. ఇథనాల్‌కు కొరత చక్కెర పరిశ్రమల్లో ఉప ఉత్పత్తిగా ఇథనాల్ తయారవుతోంది. వివిధ కారణాల వల్ల చెరకు దిగుబడులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఇథనాల్ ఉత్పత్తి తగ్గిపోతోంది. ఇథనాల్‌ను లిక్కర్ తయారీలో ఉపయోగించడం, లిక్కర్ రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉండటంతో ఆ ప్రభుత్వాలు ఇథనాల్‌పై అధిక పన్నులు వసూలు చేస్తున్నాయి. చక్కెర కంపెనీలు కూడా ఇథనాల్‌ను డిస్టిలరీలకు (ఎక్కువ ధర లభిస్తుండటం వల్ల) అమ్మడానికే మొగ్గు చూపుతున్నాయి.దాంతో చమురు కంపెనీలకు కావలసినంత ఇథనాల్ దొరకడం లేదు.ఈ సమస్యను అధిగమించడం కోసం ప్రభుత్వం 2018 నాటి జాతీయ జీవ ఇంధన విధానంలో కొన్ని వెసులుబాట్లు కల్పించింది. చక్కెర కర్మాగారాలు చక్కెరను తయారు చేయకుండానే ఇథనాల్‌ను తయారు చేయడానికి అనుమతి ఇచ్చింది.అలాగే,సంప్రదాయంగా వస్తున్న మొలాసిస్ నుంచే కాకుండా ఇతర జీవ వ్యర్థాలు, కుళ్లిన బంగాళాదుంపలు, పాడైపోయిన ధాన్యం, గోధుమ, జొన్న, తవుడు మొదలైన వాటి నుంచి కూడా ఇథనాల్ తయారీకి అవకాశాలు కల్పించింది. రెండో తరం ఇథనాల్ గోధుమ పొట్టు, తవుడు, పంట వ్యర్థాల నుంచి తయారు చేసే ఇథనాల్‌ను రెండోతరం ఇథనాల్‌గా పిలుస్తారు. ఈ రకం ఇథనాల్ తయారీకి చమురు సంస్థలు 12 రెండో తరం ఇథనాల్ రిఫైనరీలను దేశంలో ఆంధ్ర ప్రదేశ్ సహా11 రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్నాయి.వీటి ఏర్పాటుకు 10,000 కోట్లు వెచ్చిస్తున్నాయి. పెట్రోల్‌లో ఇథనాల్‌ని కలుపుతూ వాడుతున్న రాష్ట్రాలు 21 కేంద్ర పాలిత ప్రాంతాలు 4 ప్రస్తుతం భారత్‌లో లభిస్తున్న ఇథెనాల్ 300 కోట్ల లీటర్లు ఇందులో 130 కోట్ల లీటర్లను లిక్కర్ తయారీకి వినియోగిస్తున్నారు మిగిలిన 170 లీటర్లలో 60 నుంచి 80 శాతం రసాయనాల తయారీకి వాడుతున్నారు. 100 నుంచి 120 కోట్ల లీటర్లు మాత్రమే పెట్రోలులో కలపడానికి అందుబాటులో ఉంది ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకాన్ని పెంచడం కోసం ఇథనాల్‌పై 18 శాతం ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించింది -
షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తాం: వైఎస్ జగన్
సాక్షి, చిత్తూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సహకార రంగంలోని రెండు చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. నగరి నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న ఆయనను మంగళవారం ఎస్వీ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు, రైతులు కలిశారు. చెరకు ఫ్యాక్టరీ మూత వేయడంతో ఉపాధి కోల్పోయామని, 11 వేల మందికి జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మూతపడిన ఈ ఫ్యాక్టరీలను వైఎస్ రాజశేఖరరెడ్డి తెరిపించారని తెలిపారు. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైఎస్ జగన్ మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. -
ఆ మంత్రులు అవివేకులు
సాక్షి, చిత్తూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలనలో చిత్తూరు జిల్లా తీవ్ర వివక్షకు గురైందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తన సొంత నియోజక వర్గాన్నే అభివృద్ధి చేయలేక పోయారని విమర్శించారు. ఉపాధి కోసం కుప్పం ప్రజలు లక్షలాది మంది రోజు వేరే ప్రాంతాలకు వలసపోతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు తన నియోజక వర్గానికి సాగు, తాగు నీరు ఇవ్వలేక పోయారని ఎద్దేవా చేశారు. జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీని మూసేసి రైతులకు త్రీవ అన్యాయం చేశారని పెద్దిరెడ్డి విమర్శించారు. వైఎస్ఆర్ హయంలో షుగర్ ఫ్యాక్టరీలకు ప్రాణం పోసి రైతులకు మేలు చేశారని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత షుగర్ ఫ్యాక్టరీలు మళ్లీ ముతపడ్డాయన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రపై విమర్శలు చేసే మంత్రులు అవివేకులు అని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. ప్రజాసంకల్పయాత్ర ఎలా సాగుతుందో వచ్చి చూస్తే తెలుస్తుందని సూచించారు. ఇంటికెళ్లే ముందైనా టీడీపీ నేతలు వాస్తవాలు తెలుసుకోవాలని పెద్దిరెడ్డి అన్నారు. -
చెరకును పీల్చేస్తున్నారు
తన్నుకుపోతున్న పొరుగు జిల్లాల ప్రైవేట్ చక్కెర కర్మాగారాలు పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీ ఎలా సమకూరిందన్నదే ప్రశ్న పట్టించుకోని చెరకు అభివృద్ధి అధికారులు అనకాపల్లి : జిల్లాలో సహకార చక్కెర కర్మాగారాల పరిధిలో సాగవుతున్న చెరకుపై ప్రైవేట్ కర్మాగారాలు కన్నేశాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ప్రైవేట్ చక్కెర కర్మాగారాలు నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రాంతంలోని చెరకును తరలిస్తున్నాయి. తుమ్మపాల చక్కెర కర్మాగారంలో గత రెండు సీజన్ల నుంచి గానుగాట జరగకపోవడంతో దీనిని వారికి అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఈ విషయంలో చెరకు అభివృద్ధి అధికారులు ప్రైవేట్ కర్మాగారాలకు అనుకూలం గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి చక్కెర కర్మాగారం పరిధిలో ఉన్న చెరకును తరలించే విషయంలో ఆయ ఫ్యాక్టరీలకు అధికారాలు ఉంటాయి. తుమ్మపాల చక్కెర కర్మాగారంలో గాను గాట ఆడకపోవడంతో ఈ ప్రాంత చెరకును ఏటికొప్పాక, తాండవ చక్కెÆ ý‡ కర్మాగారాలకు తరలించాలని ఉన్నతాధికారులు ఆదేశా లు జారీ చేశారు. అయితే చెల్లింపు లు నగదు రహితంగా జరగాలన్న నిబంధన పెద్ద ప్రతిబంధకంగా మారింది. పెద్ద నోట్ల రద్దు అంశాన్ని అనుకూలంగా మలుచుకొని... అనకాపల్లి చక్కెర కర్మాగారం పరిధిలో లక్ష హెక్టార్లకు పైబడి చెరకు సాగవుతోంది. దీనిలో కొంత చెరకును బెల్లం తయారీకి వినియోగించగా, మిగిలిన చెరకును తప్పని పరిస్థితుల్లో కర్మాగారాలకు తరలించాల్సి ఉంది. సహకార చక్కెర కర్మాగారాలకు చెరకును తరలించే రైతులకు ఇవ్వాల్సిన మద్దతు ధరను నగదు రహి త లావాదేవీల రూపేణా వారి అకౌంట్లలో జమ చేయాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. కానీ ఈ నిబంధనలు అమలు చేయకుండా పొరుగు జిల్లాలకు చెందిన ప్రైవేట్ కర్మాగారాలు వ్యవహరించడం పలు అనుమానాలు తావిస్తోంది. ఈ ప్రాం తం నుంచి చెరకును తరలిస్తున్న ఒక ప్రైవేట్ కర్మాగారం.. తన పరిధిలో చెరకును తరలించిన రైతులకు రూ.8 కోట్ల వరకు బకాయి పడింది. కానీ అనకాపల్లి పరిధి లోని రైతుల నుంచి సేకరిస్తున్న చెరకుకు మద్దతు ధరను టన్ను కు రూ.2,070 చొప్పున చెల్లిస్తోంది. అది కూడా నగదు రూపంలోనే కావడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని సంస్థల వద్ద కొత్త కరెన్సీ లేదు. కానీ అనకాపల్లి కర్మాగారం పరిధిలోని కూం డ్రం, నీలకంఠాపురం, వెంకుపాలెం కేంద్రంగా ఏర్పాటు చేసిన చెరకు బరువు తూచే కాటాల వద్ద చెల్లింపులను ఏ రోజుకు ఆ రోజుకు జరుపుతున్నారు. సుమారు 400 టన్నుల వరకు రోజుకు çతరలించుకుపోతున్నారు. ఈ ప్రాంత రైతులకు రోజుకు రూ.8 లక్షల నగదును కొత్త కరెన్సీ రూపంలో అందిస్తున్నారు. ఇది ఎలా సాధ్యమైందన్నదే ఇప్పుడు వెయ్యి డాలర్ల ప్రశ్న. సహకార కర్మాగారాల పరిధిలో టన్నుకు రూ.2300 సహకార చక్కెర కర్మాగారాల పరిధిలో టన్నుకు రూ.2300 చెల్లిం చాల్సి ఉంది. అది కూడా అకౌంట్లలోనే జమ చేయాలనే నిబంధన ఉంది. ఈ విధంగా కూడా రైతులు ప్రైవేట్ కర్మాగారాలకు చెరకును తరలించడం ద్వారా టన్నుకు రెం డు వందలకు పైగా నష్టపోతున్నారు. అయితే సహకార కర్మాగారాలకు తరలించే చెరకుకు మద్దతు ధర ఎప్పుడు అందుతుందో తెలియని ఆందోళన కూడా రైతుల్లో కనిపిస్తోంది. ఇప్పుడు ఏటికొప్పాక, తాండవ చక్కెర కర్మాగారాలకు తరలివెళ్లాల్సిన 20 వేల టన్నుల చెరకును ఇప్పటికే ప్రైవేట్ కర్మాగారాలు తీసుకెళ్లిపోయాయి. అయితే జిల్లాలో సహకార రంగంలో కొనసాగుతున్న కర్మాగారాల పరిధిలో సమకూరాల్సిన చెరకు మోతాదు తగ్గితే అక్కడ కూడా క్రషింగ్ జరిపే అవకాశాలు తగ్గుతాయి. తద్వారా భవిష్యత్‌లో ప్రైవేట్ కర్మాగారాల పుణ్యాన తాండవ, ఏటికొప్పాక చక్కెర కర్మాగారాలకు ప్రమాదం పొంది ఉంది. -
సుగర్ ఫ్యాక్టరీల నిర్వీర్యానికి కుట్ర
- 30 లోగా గోవాడ రైతులకు బకాయిలు చెల్లించాలి - లేకుంటే ఆ తరువాత పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి - కలెక్టర్‌కు స్పష్టంచేసిన వైఎస్సార్సీపీ నేత బొత్స సాక్షి, విశాఖపట్నం: సహకార రంగంలో ఉన్న సుగర్ ఫ్యాక్టరీలను హస్తగతం చేసుకోవాలన్న కుట్రతోనే లాభాలబాటలో ఉన్న ఫ్యాక్టరీలను సైతం నిర్వీర్యం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో తొమ్మిదేళ్ల టీడీపీ హయాంలో కూడా ఇదే రీతిలో సుగర్ ఫ్యాక్టరీలను నష్టాలపాల్జేసి మూతపడేలా చేశారని, మళ్లీ నేడు అదే రీతిలో టీడీపీ పాలకులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తుమ్మపాల ఫ్యాక్టరీలో క్రషింగ్ నిలిపేయడం, లాభాల బాటలో ఉన్న చోడవరం గోవాడ సుగర్ ఫ్యాక్టరీని నష్టాలపాల్జే యడం చూస్తుంటే దీని వెనుక భారీ కుట్ర దాగి ఉందని అర్థమవుతోందన్నారు. చోడవర ం గోవాడ సుగర్ రైతులకు పేరుకుపోయిన బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ బొత్సతోపాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తదితరులు రైతులతో కలిసి బుధవారం విశాఖ కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ ఎన్. యువరాజ్‌ను వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బొత్స కలెక్టర్‌తో మాట్లాడుతూ గోవాడ ఫ్యాక్టరీ టీడీపీ అధికారంలోకి వచ్చే ముందు రూ.20 నుంచి 22 కోట్ల మిగులులో ఉండేదని, గతంలో తాను మంత్రిగా ఉన్నపుడు ఏటా క్రషింగ్ అయిన వెంటనే సకాలంలో చెల్లింపులు చేయడమే కాకుండా, రూ.200 బోనస్ కూడా ఇచ్చేవారమని గుర్తుచేశారు. పదేళ్లుగా లాభాలబాటలో ఉన్న ఈ ఫ్యాక్టరీ నేడు నష్టాల్లో కూరుకుపోతుందో అర్థం కావడం లేదన్నారు. బోనస్ మాటదేవుడెరుగు గతేడాది క్రషింగ్‌కు సంబంధించి టన్నుకు రూ.175ల చొప్పున ఇంకా రైతులకు చెల్లించాల్సి ఉందన్నారు. గతేడాది జరిగిన మహాజనసభలో ఫ్యాక్టరీలో అవినీతిపైనే కాకుండా బకాయిల కోసం రైతులు ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయాన్ని గుర్తు చేశారు. అప్పట్లో ఇదే సమస్యను మీ దృష్టికితీసుకొస్తే జేసీతో విచారించి రైతులకు న్యాయం చేస్తామని చెప్పారని ఐదు నెలలైనా నేటికీ సమస్య అలాగే ఉందని బొత్స చెప్పారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ జేసీ నెలరోజుల్లోనే నివేదిక ఇచ్చారని, కానీ చెల్లించాల్సిన బకాయిలు రూ.7.5 కోట్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఆ రూ.7.5 కోట్లయినా ఈ నెలాఖరు లోగా ఇచ్చేలా ఏర్పాటు చేయాలని, లేకుంటే మరోసారి రైతులు రోడ్డెక్కే పరిస్థితులు నెలకొంటాయని, ఆ తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని బొత్స హెచ్చరించారు. అలాగే జేసీ ఎంక్వైరీ రిపోర్టును కూడా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. హామీలు విస్మరించిన టీడీపీ ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ, సుగర్ ఫ్యాక్టరీలను బలోపేతం చేస్తాం.. తుమ్మపాల ఫ్యాక్టరీని పూర్తి స్థాయిలో ఆధునికీకరిస్తాం.. లేకుంటే రాజీనామా చేస్తాం.. అంటూ టీడీపీ నాయకులు శుష్కవాగ్దానాలు చేసి గద్దెనెక్కారని, కానీ నేడు వాటిని పూర్తిగా విస్మరించారని ఆవేదన వ్యక్తంచేశారు. మీరేమీ రాజీనామాలు చేయనవసరం లేదు రైతుల ఆవేదనను అర్థం చేసుకోండి.. బకాయిలను వెంటనే చెల్లించి క్రషింగ్‌కు అనుమతులివ్వండి చాలు అని బొత్స కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ర్ట అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి,రాష్ర్ట కార్యదర్శి కంపా హనోక్, రాష్ర్ట ప్రచార కమిటీ కార్యదర్శి రవిరెడ్డి, రాష్ర్ట యువజన విభాగం అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్, బీసీసెల్ నాయకుడు ఫక్కి దివాకర్, డీసీఎంఎస్ చైర్మన్ మక్కా మహాలక్ష్మి నాయుడు, డీసీసీబీ డెరైక్టర్ గుమ్మిడి సత్యదేవ్, జెడ్పీ ప్లోర్ లీడర్ చిక్కాల రామారావు, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గైరమ్మ సత్తిబాబు, గోవాడ సుగర్ ఫ్యాక్టరీ రైతు సంఘ నాయకులు కె.జగ్గారావు, ఓరుగంటి నెహ్రూ, ఏరువాక సత్యారావు, రాపేటి నాగేశ్వరరావు, శీలం శంకరరావు, సూరిశెట్టి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. -
తీపి కబురు లేదు
బడ్జెట్లో చక్కెర కర్మాగారాలకు మొండిచెయ్యి నిధుల కేటాయింపు ఊసెత్తని ప్రభుత్వం పాలకుల నిర్లక్ష్యంతో అప్పులపాలవుతున్న ఫ్యాక్టరీలు, రైతులు చోడవరం:ఈ సారి బడ్జెట్లోనూ చక్కెర కర్మాగారాలకు మొం డిచేయే చూపారు. దివాలా దిశలో ఉన్న సహకార చక్కెర కర్మాగారాలను ఆదుకునే దిశగా ప్రభుత్వం ఎటువంటి చ ర్యలు చేపట్టలేదు. రెండేళ్లుగా చక్కెర కర్మాగారాల పరిస్థితి దినదిన గండంగా ఉంది. ఒక పక్క అప్పులు, మరోపక్క ఆధునికీకరణకు నోచుకోక ఫ్యాక్టరీలు సంక్షోభం దిశగా పయనిస్తున్నాయి. ఈ పరిస్థితిలో 2016-17 బడ్జెట్‌పై ఫ్యాక్టరీలు, చెరకు రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అసెంబ్లీలో గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆ ఊసే ఎత్తలేదు. సహకార చక్కెర కర్మాగారాలు, చెరకు రైతుల సంక్షేమానికి ప్రత్యక్షంగా నిధులు కేటాయించకపోవడం చూస్తే ఈ రంగంపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఏపాటిటో అర్థమవుతుంది. 4 ఫ్యాక్టరీలు మూత రాష్ట్రంలో 10 సహకార చక్కెర కర్మాగారాలు ఉండగా వా టిలో ఇప్పటికే 4 ఫ్యాక్టరీలు మూతబడ్డాయి. ఈ ఏడాది 6 ఫ్యాక్టరీలు మాత్రమే క్రషింగ్ చేస్తున్నాయి. అవి కూడా అప్పుల బాధతో నడుస్తున్నాయి. గత ఏడాది చెరకు పేమెంట్లే ఇంకా రైతులకు పూర్తిగా ఇవ్వలేదు. ఇటీవల కేంద్రం ఇచ్చిన వడ్డీలేని రుణం తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండేళ్లలో ఫ్యాక్టరీలను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మూతపడిన ఫ్యాక్టరీలను తెరిపించడంతో పాటు అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న ఫ్యాక్టరీలకు ఆర్థిక సాయం చేసి వాటిని ఆదుకోవాల్సి ఉంది. ఏటా తగ్గుతున్న చెరకు సాగు రాష్ట్ర వ్యాప్తంగా వరి తర్వాత అత్యధిక విస్తీర్ణంలో సాగు జరిగే చెరకు పంట ఏటేటా తగ్గుతూ వస్తోంది. గత ఏడాది 60 శాతానికి చెరకు సాగు విస్తీర్ణం పడిపోయింది. ఫ్యాక్టరీల మనుగడ సరిగా లేకపోవడం, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం, పెట్టుబడులు పెరిగి పోవడం, ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం వంటి కారణాలే ఇందుకు కారణం. చెరకు సాగు తగ్గిపోవడం వల్ల రాష్ర్ట వ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది రైతులు, రైతు కూలీలు, కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కేవలం రూ.500 కోట్లు కేటాయిస్తే రాష్ట్రంలో ఉన్న 10 ఫ్యాక్టరీలు మళ్లీ ఆధునిక యంత్రాలతో ముస్తాబై రైతులకు అండగా నిలిచే అవకాశం ఉందని గతంలో ఎపిట్కో కమిటీ ఇచ్చిన నివేదికలో ప్రభుత్వానికి చెప్పింది. తాజాగా గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం వేసిన అధ్యయన కమిటీ కూడా ఫ్యాక్టరీల ఆధునికీకరణ, చెరకు సాగు విస్తీర్ణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నివేదిక ఇచ్చింది. కాని ఇవేవీ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. కనీసం బడ్జెట్లో నైనా ఫ్యాక్టరీల ఆధునికీకరణ కోసం నిధులు కేటాయిస్తుందని యాజమాన్యాలు, చెరకు రైతులు ఎంతో ఆశతో ఎదురు చూశారు. కాని నిరాశే మిగిలింది. రూ.50 కోట్లిచ్చినా బకాయిలు తీరేవి కనీసం గత సీజన్‌కు సంబంధించి టన్నుకు రూ.200 అయినా ప్రోత్సాహం ఇస్తుందని గోవాడ, ఏటికొప్పాక, తాండవ, భీమసింగ్తోపాటు అన్ని ఫ్యాక్టరీలు ఆశించాయి. సుమారు రూ.50 కోట్లు ఇచ్చినా రైతుల బకాయిలు తీర్చి అప్పుల ఊబిలోంచి ఫ్యాక్టరీలు కొంత బయటపడేవి. కాని బడ్జెట్లో ఆ కేటాయింపు కూడా జరగలేదు.కనీసం వ్యవసాయ బడ్జెట్లోనైనా ఎక్కడైనా చెరకు ఫ్యాక్టరీలు, రైతుల గురించి ప్రస్తావిస్తారంటే అది కూడా చేయలేదు. సాధారణంగా అన్ని పంటల్లో దీన్ని కూడా ఒకటిగానే పరిగణించారే తప్ప కొన్ని లక్షల మంది ఆధారపడి ఒక ప్రత్యేక రంగంగా నడుస్తున్న సుగర్ ఫ్యాక్టరీలకు స్పష్టమైన నిధుల కేటాయించినట్టు ఎక్కడా పేర్కొనకపోవడం ఫ్యాక్టరీ వర్గాలు, రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
చేదెక్కుతున్న సాగు
ప్రభుత్వ పోకడలు రైతుల ఉసురు పోసుకుంటున్నాయి. ప్రతికూల వాతావరణ ం,మద్దతు ధర లేకపోవడం, చక్కెరమిల్లుల దయనీయ పరిస్థితుల ప్రభావం చెరకు సాగుకు అన్నదాతను దూరం చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో కాడిమేడి వదిలేస్తున్న వైనం దీనికి అద్దం పడుతోంది. ఇప్పటికే రైతులు నాట్లు వేయడం మానేశారు. వేసిన పంటకే ఎరువులు దొరకక నానా అవస్థలు పడుతున్నారు. దీంతో ఈ ఏడాది నాలుగు చక్కెర కర్మాగారాల్లో లక్ష్యం మేరకు క్రషింగ్ అనుమానమే. మరో పక్క బెల్లం తయారీ కూడా నామమాత్రంగా ఉండేలా ఉంది. - తగ్గిన చెరకు పంట విస్తీర్ణం - రుణాలివ్వని బ్యాంకర్లు - పెట్టుబడులు లేక ఆసక్తి చూపని రైతులు - ఆందోళన కలిగిస్తున సుగర్ ఫ్యాక్టరీల పరిస్థితులు చోడవరం: అంతర్జాతీయ బెల్లం మార్కెట్, నాలుగు సహకార చక్కెర కర్మాగారాలు ఉండటంతో జిల్లాలో ఏటా 2లక్షల ఎకరాల్లో చెరకు సాగయ్యేది. ఈ ఏడాది బెల్లం ధరలు తగ్గడం, చెరకు సరఫరా చేసిన రైతులకు మిల్లు యాజమాన్యాలు సకాలంలో చెల్లిం పులు చేపట్టకపోవడంతో ఈ పంటపై రైతుల్లో ఆసక్తి తగ్గింది. ఇప్పటి వరకు 70శాతమే నాట్లు పడ్డాయి. మిగతా 30శాతం నాట్లు వేసే పరిస్థితి కనిపించడం లేదు. గతేడాది చెరకు రైతుల కష్టాలు అంతా ఇంతా కాదు. పంట పక్వానికి వచ్చే సమయంలో హుద్‌హుద్ ధాటికి 40శాతం పంటను కోల్పోయారు. ఉన్నదానిని దక్కించుకుని బెల్లం తయారీకి, ఫ్యాక్టరీలకు తరలించినా పెట్టుబడులు కూడా దక్కలేదు. బెల్లం ధరలు తగ్గిపోవడం, పంచదారకు ధరలేకపోవడం, రాష్ట్రం ప్రభుత్వం ఆదుకోని విధానంతో సుగర్ ఫ్యాక్టరీలు చతికిలపడ్డాయి. రైతులకు సకాలంలో చెల్లింపులు చేపట్టలేకపోయాయి. కేంద్రం ప్రకటించిన రూ.2265 మద్దతు ధరనే గోవాడ లాంటి ఫ్యాక్టరీ సైతం ఇవ్వలేదు. దీనికి తోడు ఫ్యాక్టరీల పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. పెట్టుబడులకు చేతిలో చిల్లిగవ్వ లేక, ఒక వేళ అప్పులు చేసినా గిట్టుబాటు ధర లభిస్తుందన్న నమ్మకం లేక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పంట వేస్తే అప్పులేనంటూ సాగు విస్తీర్ణాన్ని తగ్గించారు. ఈ ఏడాది చెరకు నాట్లు సమయంలో వర్షాలు అనుకూలించలేదు. మోటార్ల సాయంతోనైనా నాట్లు వేద్దామంటే జలాశయాలు, నదులు, చెరువులు, కొండగెడ్డలు అడుగంటడంతో అన్నదాతలు నిరాశకు గురయ్యారు. వీటికి తోడు కూలీ ధరలు, ఎరువులు, విత్తనం ధరలు భారీగా పెరగడంతో గతంలో ఎకరాకు రూ.30వేలు పెట్టుబడి పెడితే ఈ ఏడాది రూ.45వేలకు పైబడే పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రప్రభుత్వం పుణ్యమా అని రుణమాఫీ అమలుకాకపోవడంతో బ్యాంకులు సైతం అప్పులివ్వలేదు. రైతులు పూర్తిగా ప్రైవేటు వ్యాపారులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. ఇన్ని సమస్యలు చుట్టుముట్టడంతో చెరకు సాగుకు దూరమవుతున్నారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ పరిధిలో సుమారు 30వేల ఎకరాల్లో చెరకు సాగు జరగాల్సి ఉండగా ఇప్పటి వరకు 22వేల ఎకరాల్లో మాత్రమే చేపట్టారు. జిల్లాలో అత్యధికంగా చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లోనే సుమారు 80వే ఎకరాలకు పైబడి చెరకు పండిస్తారు. అలాంటిది ఈ ఏడాది 65వేలకు మించలేదు. నెలాఖరుతో నాట్లుకు సీజన్ ముగుస్తోంది.చోడవరం, చీడికాడ, బుచ్చెయ్యపేట, సబ్బవరం,అనకాపల్లి, కశింకోటతో పాటు చెరకు పండించే అనేక ప్రాంతాల్లో భూములను రైతులు రీఎలర్టర్లకు అమ్మేస్తున్నారు. అప్పులు చేసి సాగుచేయలేమని వాపోతున్నారు. -
సీతయ్య... ఎవరి మాట వినడు!
సొంత ప్రయోజనాలే ముఖ్యం! ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోని వైనం సీతయ్య... ఎవరి మాట వినడు! అని వెండితెరపై హరికృష్ణ పలుకుతుంటే థియేటర్ మారుమోగింది. అయితే రాష్ట్ర రాజకీయాల్లోనూ ఓ సీతయ్య ఉన్నాడు. ఆయన కూడా ఎవరి మాట వినడు. ఆయనకు ప్రజల సంక్షేమం కన్నా సొంత ప్రయోజనాలే ముఖ్యం. ఆశ్చర్యంగా ఉంది కదూ... ఇంతకీ ఆ సీతయ్య ఎవరు అని అనుకుంటున్నారా? ఆయనే మండ్య జిల్లా ఇన్చార్జి మంత్రి అంబరీష్!! మండ్య : రోమ్ నగరం మొత్తం మంటల్లో కాలి బూడిదవుతున్న తరుణంలో నీరో రాజు ఫీడేలు వాయిస్తున్నట్లుంది మంత్రి అంబరీష్ పనితీరు. మండ్య జిల్లాలో రైతులు సాగు చేసిన చెరుకు పంటకు మద్దతు ధర లభించక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే జిల్లా ఇన్చార్జి మంత్రి అంబరీష్ మాత్రం తనకేమీ పట్టనట్లు అపెక్స్ బ్యాంకు ప్రతినిధి ఎంపిక విషయంలో తన అభిప్రాయానికి విలువనివ్వలేదంటూ ప్రభుత్వంపై అలకబూనారు. రాష్ట్రంలోనే అత్యధికంగా అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్న జిల్లా మండ్యకు పేరుంది. రైతుల తరుఫున నిలిచి వారిలో మనోస్థైర్యం నింపాల్సిన తరుణంలో కనీసం జిల్లాలో సైతం ఆయన పర్యటించకపోవడం పలు విమర్శలకు దారి తీస్తోంది. అంతేకాదు, రైతు సమస్యలపై అసెంబ్లీలో చర్చించాల్సిన బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగాను ఆయన వ్యవహరించకపోవడం అన్నదాతలను మరింత కుంగదీస్తోంది. ప్రారంభానికి నోచుకోని చక్కెర ఫ్యాక్టరీలు మండ్య జిల్లాలో ఐదు చక్కెర ఫ్యాక్టరీలు ఉన్నా... అవి ఇంత వరకు ప్రారంభం కాలేదు. దీంతో 30 వేల హెక్టార్లలో రైతులు సాగు చేసిన చెరుకుకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది. అంతేకాదు సాగు నీరు అందక చెరుకు పంట ఎండిపోతోంది. దీంతో కొందరు అన్నదాతలు రెండవ పంట పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటూ చెరుకు పంటకు నిప్పు పెట్టేస్తున్నారు. ఈ దశలోనే పంట పెట్టుబడుల కింద తీసుకున్న అప్పులు తీర్చాలంటూ ఒత్తిళ్లు ప్రారంభం కావడంతో వాటిని తీర్చే మార్గం కానరాక బలవన్మరణాలకు పాల్పడతున్నారు. పండించిన చెరుకు పంటకు గిట్టుబాటు ధరలేకపోవడంతో పాటు దిగుబడిని సుదూరంగా ఉన్న చక్కెర ఫ్యాక్టరీలకు తరలించడం మరింత భారంగా మారడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. సంక్షోభంలో రైతులకు దూరంగా మండ్య జిల్లాలో ఇప్పటికే చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న అన్నదాతల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన ప్రజాప్రతినిధులు కనీసం ఆ దిశగా అడుగేయడం లేదు. ఆఖరుకు జిల్లా ఇన్చార్జి మంత్రి అంబరీష్ సైతం రైతులకు అండగా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం మండ్య జిల్లా వాసులను ఆగ్రహానికి గురిచేస్తోంది. రాష్ట్రంలో బోర్డులు, నామినేటెడ్ అభ్యర్థుల ఎంపిక విషయంలో తన మద్దతుదారులకు అవకాశం కల్పించలేదన్న కారణంతో సీఎం సిద్ధరామయ్యపై అలకబూనిన ఆయన వైఖరి జిల్లా వాసులకు కొత్తేమి కాదు. అయితే జిల్లా వాసుల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడాన్ని ప్రజలు సహించలేకపోతున్నారు. మంత్రిగా అంబరీష్ పూర్తిగా విఫలమయ్యారంటూ పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
చక్కెరపై మరో పిడుగు
2శాతం సేల్స్‌ట్యాక్స్ విధించిన ప్రభుత్వం క్వింటాపై రూ.50 అదనపు భారం ఇప్పటికే వ్యాట్ 5శాతమే మోయలేకపోతున్న ఫ్యాక్టరీలు అమ్మకాలు లేక నిల్వలు పేరుకుపోయే ప్రమాదం నష్టాలు తప్పవంటున్న యాజమాన్యాలు చోడవరం:చక్కెర కర్మాగారాలపై ప్రభుత్వం మరో పిడుగు పడేసింది. ఇప్పటికే నష్టాలతో ఆపసోపాలు పడుతున్న సహకార చక్కెర కర్మాగారాలపై తాజాగా సెంట్రల్ సేల్స్‌ట్యాక్స్ కింద 2శాతం పన్ను విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీనివల్ల చక్కెర కర్మాగారాలపై మరింత భారం పడి నష్టాల్లోకి వెళ్లనున్నాయి. కొత్త రాష్ట్రంలో 10సహకార చక్కెర కర్మాగారాలు ఉండగా వీటిలో ఈ ఏడాది ఏడు ఫ్యాక్టరీలే క్రషింగ్ చేస్తున్నాయి. వాటిలో జిల్లాలో గోవాడ, ఏటికొప్పాక, తాండవ, అనకాపల్లి, విజయనగరం జిల్లాలో భీమసింగ్ ఫ్యాక్టరీలు ఇప్పటికే క్రషింగ్‌లో దూసుకుపోతున్నాయి. గోవాడ, ఏటికొప్పాక మినహా మిగతా ఫ్యాక్టరీలన్నీ నష్టాల్లో ఉండి ప్రభుత్వం ఇచ్చే అప్పుపైనే ఆధారపడి నడుస్తున్నాయి. అసలే మార్కెట్లో పంచదార ధరలు తగ్గిపోయి, ఉత్పత్తి ధరలు పెరిగిపోయి ఎటూపాలుపోని స్థితిలో ఫ్యాక్టరీలు ఉన్నాయి. దీనికితోడు ఏ రాష్ట్రంలోని విధంగా వ్యా ట్ ట్యాక్స్ 5శాతం క్వింటాకు రూ.150 చొప్పున ఇప్పటికే రా ష్ట్రప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. ఈ వ్యాట్ భారం వల్ల రాష్ట్రీయ పంచదారను కొనుగోలుచేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. -
చేదు గీతం
పడిపోయిన పంచదార ధర నష్టాలు దిశగా చక్కెర మిల్లులు ఉత్పత్తి ఖర్చులు రాని వైనం గగ్గోలు పెడుతున్న యాజమాన్యాలు వ్యాట్‌తో నిండా మునిగిపోతున్న పరిశ్రమ చోడవరం: జిల్లాలోని నాలుగు సుగర్ ఫ్యాక్టరీలు నష్టాలతో సతమతమవుతున్నాయి. రోజురోజుకు పంచదార ధరలు తగ్గిపోవడంతోపాటు ఇటీవల వచ్చిన హుద్‌హుద్‌కు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వ్యాట్ చా ర్జీలు లేకపోవడంతో గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి చక్కెర మన రాష్ట్రంలోకి తక్కువ ధరకు దిగుమతి అవుతోంది. రాష్ట్రంలో చక్కెర కొనాలంటే క్వింటాకు రూ.150 వ్యాట్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాలి. ఈ పరిస్థితిలో వ్యాట్ ఛార్జి కూడా కొనుగోలుదారులపైనే ఫ్యాక్టరీలు సహకార రంగంలోని చక్కెర మిల్లులు చేదుగీతం ఆలపిస్తున్నాయి. రోజు రోజుకు మార్కెట్లోపంచదార ధరలు తగ్గుముఖం పడుతుండటంతో ఫ్యాక్టరీల యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. అసలే హుదుహుద్ తుఫాన్ దెబ్బ..ఆపై తగ్గిన చెరకు దిగుబడి..గతేడాది బకాయిలు ఇప్పటికీ రైతులకు చెల్లించని కొన్ని ఫ్యాక్టరీలు.. దీనికి తోడు పిడుగులాంటి వ్యాట్‌తో జిల్లాలోని సహకార చక్కెర కర్మాగారాలు నష్టాల బాట పడుతున్నాయి. దీనివల్ల ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో అదనంగా క్వింటా దగ్గర రూ.150 పెరుగుతోంది. అంతర్జాతీయంగా పంచదారకు డిమాండ్ తగ్గడంతో రాష్ట్రీయ చక్కెర ఎగుమతులు నామమాత్రంగాగానే జరుగుతున్నాయి. దీంతో ప్రస్తుతం క్వింటా పంచదార ధర రూ.2450కి పడిపోయింది. 2013-14క్రషింగ్ సీజన్ ముగిసే నాటికి అంటే ఈ ఏడాది మార్చినెలలో క్వింటా రూ3050కు అమ్మగా క్రమేణా రూ. 2900, 2700లకు అమ్మింది. ఈ ధరకే ఫ్యాక్టరీలు గగ్గోలు పెడుతుంటే వారం రోజుల నుంచి ఏకంగా 2550, 2450కి ధర పడిపోవడంతో సహకార చక్కెర కర్మాగారాలు మరింత ఆందోళన చెందుతున్నాయి. పెరిగిన ముడిసరుకుల ధరలు, ఫ్యాక్టరీ నిర్వహణ ఖర్చులు, రైతులకు చెల్లించేధర కలుపుకుంటే క్వింటా పంచదార ఉత్పత్తికి ఫ్యాక్టరీలకు రూ.3వేలు వరకు ఖర్చవుతోంది. ప్రస్తుతం ధర చూస్తే అసలుకే ఎసరు వచ్చేటట్టు ఉంది. ఇక లాభాలు మాట దేవుడెరుగు ఉత్పత్తి వ్యయమైనా గిట్టుబాటైతే చాలని అంటున్నాయి యాజమాన్యాలు. జిల్లాలోని గోవాడ, ఏటికొప్పాక ఫ్యాక్టరీలే లాభనష్టాలు లేకుండా నడుస్తున్నాయి. వీటికి కూడా ఈ ఏడాది నష్టాలు తప్పవంటున్నారు. రెండునెలల కిందట సంభవించిన హుదుహుద్ తుఫాన్‌కు గోవాడ, అనకాపల్లి. ఏటికొప్పాక ఫ్యాక్టరీలు తీవ్రంగా నష్టపోయాయి. ఫ్యాక్టరీ మిల్లుహౌస్లు, గోడౌన్లలో నిల్వ ఉంచిన పంచదార బస్తాలు కూడా తడిసి నష్టాలబారిన పడ్డాయి. ఈ క్రమంలో గోవాడ ఫ్యాక్టరీ చాలా ఎక్కువగా నష్టపోయింది. రూ.2700ధరలోనైనా ఉన్న నిల్వలను అమ్ముడుపోకపోవడం, ప్రస్తుతం ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో సుగర్స్ ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. మరోపక్క పాత నిల్వలే ఇంకా పూర్తిగా అమ్మకం కాకపోగా ఈ ఏడాది క్రషింగ్ ప్రారంభం కావడంతో కొత్త పంచదార కూడా గోడౌన్లకు వచ్చి చేరనుంది. తగ్గుముఖం పట్టిన పంచదార ధరతో యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి. -
జీ హుజూర్
చక్కెర కర్మాగారాల లాబీయింగ్‌కి తలొగ్గిన సర్కారు ప్రభుత్వం నిర్ణయంపై భగ్గుమన్న రైతు సంఘాలు బెళగావి సమావేశాలను అడ్డుకుంటామని హెచ్చరిక బెంగళూరు : ైరె తులకు మేలు చేసే నిర్ణయాలే తీసుకుంటామని ప్రతి వేదికపై చెప్పే అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతల్లో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. ఏడాది కాలంగా చెరుకు రైతులకు బాకీ పడిన మొత్తాన్ని చక్కెర కర్మాగారాల యాజమన్యం ఒత్తిడికి తలొగ్గి విడతల్లో, రెండేళ్లలో తీర్చడానికి అంగీకరించడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని బాధిత రైతులు వాపోతున్నారు. ఈ విషయంలో కోర్టు ఉత్తర్వులను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. విధానసౌధాలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర సహకార, చక్కెర శాఖ మంత్రి హెచ్.ఎస్.మహదేవ ప్రసాద్ మాట్లాడుతూ...‘గత ఏడాదికి సంబంధించి ప్రతి టన్ను చెరుకుకు రూ.2,500ను మద్దతు ధరగా చెల్లించాల్సి ఉంది. అయితే చక్కర కర్మాగారాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా ఈనెల 30 లోపు రూ.2,100 చెల్లించాల్సిందిగా సూచిస్తున్నాము. అటు పై మిగిలిన మొత్తంలో రూ.200ను నెల లోపు చెల్లించి, మిగిలిన రూ.200ను రెండేళ్లలోపు ఏడాదికి రూ.100 చొప్పున చెల్లించాలి. అంతేకాకుండా నంబర్ 30లోపు ఈ ఏడాదికి చెరుకుకు సంబంధించి క్రషింగ్ ఖచ్చితంగా మొదలు పెట్టాలి. ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అలాంటి చక్కర కర్మాగారాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే చెరుకు క్రషింగ్ చేపడుతుంది.’ అని తెలిపారు. ప్రభుత్వ తాజా నిర్ణయంపై రాష్ట్ర చెరుకు రైతుల సంఘం అధ్యక్షుడు శాంతకుమార్ నిప్పులు చెరిగారు. చక్కెర కర్మాగారాల యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఈనెల 30లోపు గత ఏడాది ప్రభుత్వం ప్రకటించిన రూ.2,500 మద్దతు ధరను చెల్లించాల్సిందిగా హైకోర్టు చక్కెర కర్మాగారాలకు సూచించినా ప్రభుత్వం మాత్రం కంతుల వారిగా చెల్లించాలని సూచించడం సరికాదన్నారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ వేలాది మంది రైతులతో ఈనెల 28న బెళగావి (బెల్గాం)లో జరిగే మంత్రిమండలి సమావేశాన్ని అడ్డుకుంటామన్నారు. అంతేకాకుండా శీతాకాల సమావేశాలను బెల్గాంలో ఎట్టిపరిస్థితుల్లోను జరగనివ్వబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్ర రైతు సంఘం, హసిరుసేన అధ్యక్షుడు కోడిహళ్లి చంద్రశేఖర్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ప్రభుత్వ నిర్ణయం అవైజ్ఞానికంగా ఉందన్నారు. పొరుగున ఉన్న మహారాష్ట్ర టన్ను చెరుకుకు రూ.2,535లను రైతులకు ఒకేసారి ఇస్తోందన్నారు. కొన్ని రాష్ట్రాల్లో చెరుకు రైతులకు టన్నుకు రూ.3వేలకు పైగా దక్కుతోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం వల్ల చెరుకు రైతులకు పెట్టుబడి కంటే తక్కువ ధర లభిస్తోందని తెలిపారు. ఆ తక్కువ మొత్తాన్ని కూడా వాయిదాల పద్ధతిన ఇవ్వాలని ప్రభుత్వం సూచించడం తగదన్నారు. ఈ విషయమై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం జరిగేవరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు. -
‘చక్కెర’కు చేదు ఫలం!
తుఫాన్ తాకిడితో కోలుకోలేని దెబ్బ ధ్వంసమైన గోవాడ, తుమ్మపాల, ఏటికొప్పాక ఫ్యాక్టరీలు రూ.40 కోట్ల యంత్రాలు, రూ.110 కోట్ల పంచదార లాస్ చోడవరం : హుదూద్ తుఫాన్ బీభత్సం సహకార చక్కెర కర్మాగారాలకు చేదు ఫలం మిగిల్చింది. అసలే అంతంతమాత్రంగా ఉన్న పరిస్థితిని మరింత దిగజార్చింది. మరో నెలరోజుల్లో అన్ని ఫ్యాక్టరీలు క్రషింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఊహించని విపత్తు ఫ్యాక్టరీలను కుదిపేసింది. జిల్లాలోని గోవాడ, ఏటికొప్పాక, అనకాపల్లి (తుమ్మపాల), తాండవ చక్కెర కర్మాగారాలకు తీరని నష్టం వాటిల్లింది. నాలుగు దశాబ్దాల క్రితం ప్రారంభించిన ఫ్యాక్టరీలు కావడంతో మిషనరీ, గోదాముల పైకప్పులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తుఫాన్ వర్షాలకు మిషనరీ తడిసి దెబ్బతినగా గోదాముల పైకప్పులు ఎగిరిపోయి నిల్వ ఉంచిన పంచదార బస్తాలు తడిసిపాడయ్యాయి. తాం డవ ఫ్యాక్టరీకి అంతగా నష్టం జరగకున్నా మిగతా మూడు ఫ్యాక్టరీలకు భారీ నష్టమే మిగిలింది. దాదాపు రూ.150 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. ఒక్క గోవాడ ఫ్యాక్టరీలోనే రూ.14 కోట్ల విలువైన మిషనరీ ధ్వంసమైంది. గోదాముల్లో నిల్వ ఉంచిన రూ.82 కోట్ల విలువైన 2 లక్షల 52 వేల బస్తాల పంచదార తడిసిపోయింది. ఏటికొప్పాకలో రూ.5 కోట్ల మేర ప్లాంట్‌కు, రూ.10 కోట్ల విలువైన పంచదారకు నష్టం జరిగింది. తుమ్మపాల సుగర్స్ మిషనరీ పూర్తిగా దెబ్బతింది. పాతమిల్లు కావడంతో గాలుల విధ్వంసానికి ఫ్యాక్టరీ పూర్తిగా ధ్వంసమైంది. రూ.9 కోట్ల మేర ఫ్యాక్టరీకి నష్టం వాటిల్లగా రూ.2 కోట్ల విలువైన పంచదార తడిసిపోయింది. వీటన్నింటికీ బీమా సదుపాయం ఉ న్నప్పటికీ ప్రభుత్వం మరో రూ.70 కోట్ల మేర ఆదుకోవాల్సి ఉందని ఆయా ఫ్యాక్టరీల యాజ మాన్యాలు, పాలకవర్గాలు కోరుతున్నాయి. దిక్కుతోచని స్థితిలో రైతులు తుఫాన్ బీభత్సంతో ఫ్యాక్టరీలకు నష్టం జరగడం ఒక ఎత్తయితే, క్రషింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో విపత్తు ఎదుర్కోవాల్సి రావడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. పంట కోతకు రావడంతో చెరకు సరఫరాకు రైతులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో తుఫాన్ విరుచుకుపడింది. జిల్లాలో దాదాపు లక్ష ఎకరాల్లో చెరకు పంట నేలమట్టమైనట్లు ప్రాథమిక అంచనా. ఇందులో 40 వేల ఎకరాల్లో పంట పూర్తిగా పక్వానికి వచ్చిన దశలో ఉంది. తొలివిడత క్రషింగ్‌కు కటింగ్ ఆర్డర్ ఇచ్చేది ఈ పంటకే. ఈ పరిస్థితుల్లో తోటలన్నీ ఒరిగిపోయి నీటమునగడంతో రికవరీ ఐదు శాతానికి మించి రాదని వ్యవసాయాధికారులే చెబుతున్నారు. ఈ విధంగా లెక్కేస్తే రైతులకు లక్షల్లో నష్టం వాటిల్లినట్లే. పంట దెబ్బతిని రైతులు, ఫ్యాక్టరీలు దెబ్బతిని యాజమాన్యాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. పరిస్థితి ఏదైనా సకాలంలో క్రషింగ్ ప్రారంభం కాకుంటే రైతులు మరింత నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో యాజమాన్యాలు ప్రభుత్వ ఆసరా కోసం ఎదురు చూస్తూ, మరోవైపు బీమా సొమ్ము కోసం అన్ని పాట్లు పడుతున్నాయి. తక్షణం ప్రభుత్వం ఆదుకోకుంటే సహకార ఫ్యాక్టరీల మనుగడ మరింత ప్రశ్నార్థకంలో పడే ప్రమాదం ఉంది. డిసెంబర్‌కు క్రషింగ్ ఎన్నిఅడ్డంకులు ఎదురైనా డిసెంబర్ మొదటి వారానికి క్రషింగ్ ప్రారంభిస్తాం. తుఫాన్ తాకిడికి తీవ్ర నష్టం జరిగింది. అయినా రైతు శ్రేయస్సు దృష్ట్యా క్రషింగ్‌కు అవసరమైన చర్యలు చేపడుతున్నాం. ఫ్యాక్టరీ మిల్లు హౌస్ మరమ్మతుకు కూలీలను, అవసరమైన సామగ్రి సమకూర్చుతూ మరమ్మతు పనులు వేగవంతం చేస్తాం. సహకార చక్కెర ఫ్యాక్టరీల మనుగడను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొంతమేర ఆదుకోవాలి - గూనూరు మల్లునాయుడు, చైర్మన్ గోవాడ సుగర్స్ -
చక్కెర కర్మాగారాల ప్రైవేటీకరణకు కుట్ర
ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి నెట్టేస్తోంది తమవారికి కట్టబెట్టే కుట్రలు చేస్తోంది ధ్వజమెత్తిన వైఎస్ జగన్ విశాఖపట్నం: సహకార రంగంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి నెట్టేసి తమవారికి కట్టబెట్టాలని కుట్రలు పన్నుతోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. చక్కెర రైతుల తరఫున పోరాడతామని, ఫ్యాక్టరీల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని స్పష్టంచేశారు. హుదూద్ తుపాను బాధిత విశాఖపట్నం జిల్లాలో ఐదో రోజు పర్యటనలో భాగంగా జగన్ శనివారం అనకాపల్లి, చోడవరంలతోపాటు విశాఖ ఏజెన్సీలోని పాడేరు, హుకుంపేట, అరకు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. తమ వద్దకు వచ్చిన జగన్‌ను చూసి చెరకు రైతులు, గిరిజనులు ప్రభుత్వం తమను ఆదుకోవడంలేదని వాపోయారు. తమకు సాయం చేయాలని, తమ కోసం పోరాడాలని కోరారు. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు విశాఖపట్నంలో బయలుదేరిన ఆయన అనకాపల్లిలోని ఆవఖం డం వద్ద ఆగి వరద ముంపులో మునిగిన చెరకు తోటలను పరిశీలించారు. కూలిన గుడిసెలను చూశారు. అక్కడినుంచి అనకాపల్లిలోని చవితి నివీధి, విజయరామరాజుపేట జంక్షన్, తుమ్మపాల, వెంకుపాలెం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. కూలిన ఇళ్లు, గుడిసెలను పరిశీలించారు. చెరకు రైతులు, మహిళలతో మాట్లాడారు. ఏజెన్సీలోని పాడేరులోని గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. మోదుపల్లిలో తుపానుకు దెబ్బతిన్న కాఫీ తోటలను పరిశీలించారు. యరడపల్లిలో బురదలో నడుస్తూ కూలిన ఇళ్లను పరిశీలించారు. గిరిజనులతో మాట్లాడారు. అరకులోయ రూరల్ మండలంలో కొండచరియ విరిగిపడి దుర్మరణం పాలైన మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. అరకులో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. శనివారం అర్ధరాత్రి వరకు అలుపు లేకుండా ఆయన పర్యటన సాగింది. ఈ సందర్భంగా తమ్ముపాల, మోదుపల్లి వద్ద ఆయన చెరకు, కాఫీ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఏమన్నారంటే.... ► సహకార రంగంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి నెట్టేస్తోంది. అనకాపల్లి షుగర్స్ రైతులకు రూ.6కోట్లు ఇవ్వాల్సి ఉండగా... కేవలం రూ.2కోట్లే ఇచ్చింది. మిగిలిన రూ.4కోట్లు ఇవ్వకపోగా... ఫ్యాక్టరీ రూ.23కోట్లు నష్టాల్లో ఉన్నట్లు చూపిస్తోంది. ఆ సాకుతో ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయాలన్నది ప్రభుత్వ దురుద్దేశం. గతంలో కూడా ఇలాగే సహకారరంగంలోని సుగర్ ఫ్యాక్టరీలను తమవారికి తక్కువ ధరకు కట్టబెట్టేశారు. ఈసారి అదే చేద్దామనుకుంటున్నారు. ► రైతులతో ప్రభుత్వం చెలగాటమాడాలని చూస్తోంది. సర్కారు ఆటలు సాగనివ్వం. సుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతాం. చెరకు రైతులకు హెక్టారుకు రూ.10వేలు పరిహారం ఇస్తామమని ప్రభుత్వం చెబుతోంది. అది ఏమూలకు సరిపోతుంది? ఎకరాకు రూ.15వేలు ఇవ్వాలి. కొబ్బరి చెట్టుకు రూ.5వేలు ఇవ్వాలి. ► కాఫీ రైతులకు పరిహారం విషయంలో ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించాలి. కాఫీ తోటల్లో కూలిపోయిన సిల్వర్‌వోక్ చెట్లు మరో 15ఏళ్లకుగానీ పెరగవు. ఆ చెట్ల నీడలోనే కాఫీ తోటలు పెరుగుతాయి. అవి లేకపోతే కాఫీ తోటలు పెరగవని ప్రభుత్వానికి తెలీదా? ప్రభుత్వం హెక్టారుకు రూ.15వేలు ఇస్తామని చెబుతోంది. ఇంతకంటే అన్యాయం మరొకటి ఉండదు. గిరిజనులు ఏజెన్సీలో తప్ప బయటకు వెళ్లలేరు. వారికి మరో బతుకుదెరువు లేదు. కాబట్టి నష్టపోయిన కాఫీ తోటలకు హెక్టారుకు రూ.లక్ష పరిహారాన్ని ప్రకటించాలి. అందరికీ భరోసానిస్తూ... విశాఖపట్నంలో శనివారం ఉదయం మొదలైన జగన్ ఐదోరోజు పర్యటన అర్ధరాత్రి వరకూ సాగింది. తుపానువల్ల తమకు కలిగిన నష్టాన్ని రైతులు, గిరిజనులు ఆయనకు చెప్పుకున్నారు. అందరికీ న్యాయం జరిగేవరకూ పోరాడతానని భరోసానిస్తూ జగన్ ముందుకు సాగారు. జగన్ పర్యటన లో ముఖ్యాంశాలు ఇలా... ► గత పైలీన్ తుపానుతో మొత్తం పంట పోయింది. కానీ పరిహారం ఇవ్వలేదు. ఈసారైనా పంట చేతికొస్తుందనుకుంటే మళ్లా తుపాను ముంచెత్తింది. ఇంతవరకు ఎవ్వరూ రాలేదు. మా గతేం కాను. దిక్కుతోచడం లేదని కర్రిరాము, పిల్లా కొండయ్య, అప్పలనాయుడులు జగన్‌తో చెప్పుకుని వాపోయారు. ► గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే తుమ్మపాల ఫ్యాక్టరీని అమ్మేద్దామనుకున్నారు. అప్పట్లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి అడ్డుకున్నారు. మళ్లీ ఇప్పుడు సీఎం ఆ ఫ్యాక్టరీని అమ్మేస్తారనిపిస్తోంది. ఫ్యాక్టరీ మూసేశారు. ఏడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. చెరకు క్రషింగ్ డబ్బులు ఇవ్వడం లేదు.రైతులం రోడ్డున పడతామని ఆందోళన వ్యక్తంచేశారు. తుపాను వచ్చినప్పుడు భారీ వర్షాలకు ఏలేరు, పులికాల్వ పొంగడంతో 3,500 ఎకరాల్లో చెరకు పంట మునిగిపోతున్నా సర్కారు పట్టించుకోవడం లేదని జగన్ దృష్టికి తీసుకువచ్చారు. -
సంక్షోభంలో చక్కెర ఫ్యాక్టరీలు
* పడిపోయిన పంచదార ధర * ఫ్యాక్టరీల్లో భారీగా పేరుకుపోతున్న నిల్వలు * ఆందోళనలో యాజమాన్యాలు చోడవరం: రాష్ట్రంలో చక్కెర కర్మాగారాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. చక్కెర ధరలు మార్కెట్లో గణనీయంగా పడిపోవడంతో ఫ్యాక్టరీలన్నీ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లో 10 సహకార చక్కెర కర్మాగారాలు ఉండగా కడప, తెనాలిలో ఫ్యాక్టరీలు మూతబడ్డాయి. మిగతా ఎనిమిది ఒడిదుడుకుల మధ్య నడుస్తున్నాయి. చోడవరం(గోవాడ), ఏటికొప్పాక ఫ్యాక్టరీలు లాభనష్టాలు లేకుండా నడుస్తుండగా అనకాపల్లి, తాండవ, భీమసింగ్, చిత్తూరు, రేణిగుంట, నెల్లూరు(కొవ్వూరు) ఫ్యాక్టరీలు ప్రభుత్వ రుణంపై ఆధారపడి నడుస్తున్నాయి. ఇప్పటికే పాత యంత్రాలతో నడుస్తున్న ఈ ఫ్యాక్టరీలకు ఇప్పుడు పేరుకుపోతున్న పంచదార నిల్వలు పెద్ద సమస్యగా మారాయి. ఇబ్బందుల వలయం... గత ఏడాదిగా పంచదారకు మార్కెట్లో ఆశించన మేర ధర లేదు. అప్పటి వరకు క్వింటా రూ. 3200 వరకు విక్రయించగా ఒక్కసారిగా రూ.2900లకు పడిపోయింది. ఆతర్వాత ఈ ఏడాది మొదట్లో రూ.3100వరకు విక్రయించగా గత ఐదునెలలుగా మరలా రూ.2800కు ధర పడిపోయింది. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలే. మిగతా రాష్ట్రాల్లో పంచదారపై వ్యాట్ లేదు. ఇక్కడ మాత్రం బస్తాకు రూ.150 వ్యాట్ చార్జీని ప్రభుత్వం వసూలు చేస్తోంది. దీనికి తోడు ఇతర రాష్ట్రాల నుంచి పంచదారను ఇక్కడకు దిగుమతి చేసుకుంటున్నారు. ఈపరిస్థితుల్లో పంచదారను కొనుగోలుచేసేందుకు వ్యాపారులు ఎవరూ ముందుకు రావడంలేదు. వచ్చిన కొద్దిమంది కూడా సిండికేట్ అవడంతో ధర పెరగడం లేదు. మూడేళ్ల కిందట గత ప్రభుత్వం పంచదారపై లెవీ ఎత్తేయడంతో చౌకదుకాణాలకు సరఫరా చేసే పంచదారకు మార్కెట్‌ధర చెల్లించి ఫ్యాక్టరీలను నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. అయితే ఇది టెండర్ల పద్ధతిలో కొనుగోలు చేస్తున్నది. ఈ టెండర్లలో ఒక్క మన రాష్ట్రం చక్కెరనే అనుమతిస్తే ఇక్కడ ఫ్యాక్టరీలకు కొంత ఊరట కలిగేది. కాని ప్రభుత్వం ఇతర రాష్ట్రాల చక్కెరను కూడా అనుమతించడంతో ఇక్కడి ఫ్యాక్టరీలకు నష్టం కలుగుతోంది. ఇతర రాష్ట్రాల్లో పంచదార తయారీకి అయ్యే ఖర్చు కంటే మన పాత మిల్లుల్లో ఉత్పత్తికి అయ్యే ఖర్చు బస్తాకు సుమారు రూ.200నుంచి 300వరకు అదనం అవుతుంది. దీనివల్ల ఇతర రాష్ట్రాల వారు తక్కువకే కోడ్ చేసి టెండర్లు సొంతం చేసుకుంటున్నారు. ఈ పరిణామాల వల్ల మన రాష్ట్రంలో నిల్వలు పేరుకుపోయాయి. క్వింటా పంచదార ఉత్పత్తికి రూ.3వేలు వరకు ఖర్చవుతుంటే రూ.2800 ధరకు అమ్మలేక ఫ్యాక్టరీలు ఆందోళన చెందుతున్నాయి. విశాఖజిల్లాలో ఉన్న నాలుగు ఫ్యాక్టరీల్లోనే ఏకంగా రూ.270కోట్లు విలువచేసే 7లక్షల30వేల క్వింటాళ్ల పంచదార నిల్వలు అమ్మకం కాకుండా గోడౌన్లలో ఉండిపోయాయి. ఒక్క చోడవరం ఫ్యాక్టరీలోనే రూ. 180కోట్లు విలువచేసే 4.5లక్షల క్వింటాళ్ల పంచదార మూలుగుతోంది. అయితే ధర వస్తుందని దాచి ఉంచే పరిస్థితి కూడాలేదు. తయారైన పంచదార 8నెలలు దాటితే క్రమేణా రంగుమారి నాణ్యత తగ్గే ప్రమాదం కూడా ఉంది. ఒక పక్క సరుకు అమ్ముడుకాక, మరోపక్క గోడౌన్లకు అద్దె చెల్లించుకోలేక ఆర్థిక భారంతో సహకార ఫ్యాక్టరీలు నలిగిపోతున్నాయి. ప్రభుత్వ సహాయం కోసం యాజమాన్యాలు ఎదురుచూస్తున్నాయి. -
షుగర్ ఫ్యాక్టరీల అధ్యయానికి నిపుణుల కమిటీ
హైదరాబాద్: రాష్ట్రంలో షుగర్ ఫ్యాక్టరీల అధ్యయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిపుణుల కమిటీలో సభ్యులుగా సర్వారాయ షుగర్స్ వైస్ ప్రెసిడెంట్ సుధాకర్ చౌదరి, మధుకాన్ షుగర్స్ సలహాదారు భరద్వాజ, ఏపీ సీడ్స్ డైరెక్టర్ ఎన్వీ నాయుడు, ఆడిటర్ శ్రీనివాస్‌మోహన్ నియమితులయ్యారు. రాష్త్రంలోని షుగర్ ఫ్యాక్టరీలో నెలకొన్న పరిస్థితులపై నిపుణుల కమిటీ అధ్యయనం చేసి ఓ నివేదికను అందచేయనుంది. నిపుణుల కమిటీ అందించిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోనుంది. -
చెరుకు బకాయిలు రూ. 200 కోట్లు!
సీజన్ ముంచుకొస్తుండడంతో అన్నదాత ఆందోళన పట్టించుకోని సర్కార్ బొబ్బిలి: అన్నదాతకు అన్నివిధాల అన్యాయమే జరుగుతోంది. ప్రకృతి ఒకవైపు పగపడుతుంటే...మరోవైపు పండించిన పంటకు రావలసిన సొమ్ములు చేతికిరాక నానా అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా చెరుకు పంటకు సంబంధించి రాష్ట్రంలో రైతులకు అందాల్సిన బకారుులు రూ.200 కోట్లు వరకు ఉన్నాయంటే పరిస్థితి అర్థం అవుతుంది. రాష్ట్రంలో 42 చక్కెర కర్మాగారాలు ఉండగా 29 ఫ్యాక్టరీలు రైతులకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపాన లచ్చయ్యపేట ఎన్సీఎస్ చక్కెర కర్మాగారం రైతులకు బకారుుల చెల్లించని నేపథ్యంలో ఫ్యాక్టరీ డెరైక్టర్లు జైలు పాలు కావడంతో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఎన్సీఎస్ గ్రూపునకు నెల్లూరు వద్ద కూడా మరో ఫ్యాక్టరీ ఉండగా... అక్కడా కోట్ల రూపాయల్లో బకారుు పడడంతో అక్కడి రైతులు కూడా ఆందోళన చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో సహకార రంగంలో నాలుగు చక్కెర కర్మాగారాలున్నారుు. వాటి పరిధిలో సుమారు రూ.40 కోట్ల వరకు రైతులకు చెల్లించాల్సి ఉంది. నెల్లూరు జిల్లాలో మూడు మిల్లులు ఉండగా రెండింటిని ప్రైవేటు యూజమాన్యం నిర్వహిస్తుండగా, ఒకటి సహకార రంగంలో నడుస్తోంది. ఆ జిల్లాలో కూడా రూ.26 కోట్లు వరకు బిల్లులు రైతులకు చెల్లించాల్సి ఉంది. విశాఖ జిల్లాలో నాలుగు సహకార రంగానికి చెందిన మిల్లులు ఉండగా రూ.20 కోట్ల వరకు బకారుులున్నారుు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో నాలుగు కర్మాగారాలు ఉండగా ఆమదాలవలస కర్మాగారర ఎప్పుడో మూతపడింది. భీమసింగి మిల్లు సహకార రంగంలో, సంకిలి, లచ్చయ్యపేట కర్మాగారాలు ప్రైవేటు యూజమాన్యాల చేతిలో ఉన్నారుు. చెరుకు పంటకు ఎకరాకు సుమారు రూ.40 వేల వరకు మదుపులైతే సరాసరి 25 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. వీటికి కేంద్ర ప్రభుత్వం రూ.2వేలు గిట్టుబాటు ధర కల్పిస్తే, రాష్ట్ర ప్రభుత్వం, మిల్లులు కలిపి మిగిలిన డబ్బులు రైతులకు ఇవ్వాలి. 2002 వరకూ కేంద్రం ప్రకటించిన మద్దతు ధరపై రాష్ట్ర ప్రభుత్వం సలహా ధరను ఇచ్చేది. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం దానిని ఎత్తేయడంతో రైతు పరిస్థితి అగమ్యగోచరంగా తయూరై యూజమాన్యం ఆడిందే ఆటగా మారింది. 12 ఏళ్లుగా రాష్ట్రం ధరను ప్రకటించని పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సలహా ధర ఇవ్వాలని సుప్రీం కోర్టు సైతం సూచించినా ఇప్పటికీ అమలు కాలేదు. మిగిలిన రాష్ట్రాల్లో ఇది అమలవుతోంది. ప్రైవేటు ఇష్టారాజ్యం... గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో చక్కెర కర్మాగారాలు నడిచేటప్పుడు వారిచ్చిన సౌకర్యాలు, ప్రోత్సాహకాలు, మద్దతు ధర వల్ల ప్రైవేటు ఫ్యాక్టరీలు దిగి వచ్చేవి. అప్పట్లో 20 ఫ్యాక్టరీలను సహకార రంగం, ప్రభుత్వం కలిపి నడపగా 20 ఫ్యాక్టరీలు ప్రైవేటు యూజమాన్యంలో నడిచేవి. ఇప్పుడు 11 ప్రభుత్వ ఫ్యాక్టరీలు మూతపడగా, కో ఆపరేటివ్ రంగానికి చెందిన ఏడు మాత్రమే మిగిలారుు. వీటిలో తక్కువ సామర్థ్యం కలిగిన పాత యంత్రాలు ఉండడంతో క్రషింగ్ అంతంతమాత్రంగా సాగుతోంది. దీంతో ప్రైవేటు యజమాన్యాల ఇష్టారాజ్యం సాగుతోంది. రాష్ట్రంలో అత్యంత తక్కువగా లచ్చయ్యపేట ఎన్సీఎస్ కర్మాగారంలోనే రూ.2350 ధర ఉంది. ఈ మిల్లు పరిధిలో సుమారు 16 వేల మంది రైతులకు ప్రోత్సాహకాలు ప్రకటించినా చెల్లింపులు లేవు. -
ఇదెక్కడి చోద్యం..!
చెరకు సరఫరా చేసిన 15 రోజుల్లోగా రైతులకు సొమ్ము చెల్లించాలన్నది నిబంధన ఆ నిబంధనను తుంగలో తొక్కిన ప్రభుత్వం.. రెండేళ్లుగా రైతులకు బకాయిలు చెల్లించని దుస్థితి కేన్ కమిషనర్ బెన్హర్ఎక్క ప్రతిపాదనను బుట్టదాఖలు చేయడంపై చెరకు రైతు కన్నెర్ర సాక్షి ప్రతినిధి, తిరుపతి: చెరకు సరఫరా చేసిన 15 రోజుల్లోగా రైతులకు సొమ్ము చెల్లించాలన్న నిబంధన అమలుకు ప్రభుత్వం నీళ్లొదిలింది. రైతుకు టన్నుకు రూ.300 చొప్పున ప్రోత్సాహంగా చెల్లించడాన్ని రెండేళ్లుగా దాటవేస్తోంది. చెరకు ఉత్పత్తి వ్యయం రెట్టింపైన నేపథ్యంలో రైతుకు టన్నుకు రూ.2,600 చొప్పున ఇవ్వాలన్న కేన్ కమిషనర్ బెన్హర్ఎక్క ప్రతిపాదనను సైతం బుట్టదాఖలు చేయడంపై రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా పోరుబాట పట్టేందుకు చెరకు రైతులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో చెరకు 25,724 హెక్టార్లలో సాగుచేస్తున్నారు. రేణిగుంట మండలం గాజులమండ్యంలోని శ్రీవెంకటేశ్వర సహకార చక్కెర కర్మాగారం(ఎస్వీ షుగర్స్), చిత్తూరు సహకార చక్కెర కర్మాగారం(చిత్తూరు షుగర్స్)తోపాటూ మరో రెండు ప్రైవేటు చక్కెర కార్మాగారాలు జిల్లాలో ఉన్నాయి. కర్మాగారాలకు చెరకు తోలిన 15 రోజుల్లోగా రైతులకు సొమ్ము చెల్లించాలన్నది నిబంధన. కానీ.. ఆ నిబంధనను ప్రైవేటు కర్మాగారాలతోపాటూ సహకార కార్మాగారాలు, ప్రభుత్వం కూడా తుంగలో తొక్కుతున్నాయి. 2012-13, 2013-14 క్రషింగ్ సీజన్లో టన్నుకు రూ.1,800 చొప్పున చక్కెర కర్మాగారాలు.. రూ.మూడు వందల చొప్పున ప్రోత్సాహం గా ప్రభుత్వం ఇవ్వడానికి అంగీకరించింది. ఎస్వీ షుగర్స్ 2012-13 సీజన్లో 1,41,162 టన్నులు, 2013-14 సీజన్లో 1,22,681 టన్నుల చెరకును క్రషింగ్ చేశారు. చిత్తూరు షుగర్స్‌లో 2012-13లో 44 వేల టన్నులు, 2013-14లో 22 వేల టన్నులు క్రషింగ్ చేశారు. టన్నుకు రూ.1800 చొప్పున చక్కెర కర్మాగారాలు కిందా మీదా పడి చెల్లించాయి. కానీ.. టన్నుకు రూ.300 చొప్పున చెల్లించాల్సిన ప్రభుత్వం ఎప్పటికప్పుడు దాటవేస్తూ వస్తోంది. బకాయిల చెల్లింపుపై స్పష్టత ఏదీ..? ఎస్వీ షుగర్స్‌కు చెరకు సరఫరా చేసిన రైతులకు రూ.9.54 కోట్లు, చిత్తూరు షుగర్స్‌కు సరఫరా చేసిన రైతులకు రూ.8.93 కోట్లు మొత్తం రూ.18.47 కోట్లను ప్రభుత్వం బకాయిపడింది. బకాయిలు చెల్లించాలని రైతులు ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని కోరినా చలనం లేదు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల్లో ఇదే అంశాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రస్తావించారు. తక్షణమే చెరకు రైతులకు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు దాటవేశారు కేన్ కమిషనర్ ప్రతిపాదన ఏమైంది..? చెరకు ఉత్పత్తి వ్యయం రెట్టింపైంది. కానీ.. చెరకుకు కనీస మద్దతు ధర మాత్రం పెంచడం లేదు. ఇదే అంశాన్ని నవంబర్ 20, 2012న జిల్లా పర్యటనకు వచ్చిన కేన్ కమిషనర్ బెనహర్ఎక్క దృష్టికి చెరకు రైతులు తీసుకెళ్లారు. రైతుల వాదనతో ఏకీభవించిన కేన్ కమిషనర్.. చెరకు టన్నుకు రూ.2,600 చొప్పున కనీస మద్దతు ధరగా రైతులకు చెల్లించాలని ప్రతిపాదన చేశారు. ఆ ప్రతిపాదనను అమలుచేయాలని రైతులు పట్టుబడుతున్నారు. టన్నుకు రూ.2,600 చొప్పున కనీస మద్దతు ధరను 2012-13 క్రషింగ్ సీజన్ నుంచి అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కనీస మద్దతు ధరగా రూ.2,600ను పరిగణనలోకి తీసుకుంటే.. జిల్లాలో 27 వేల మంది చెరకు రైతులకు రూ.45 కోట్లను ప్రభుత్వం బకాయి పడింది. ఆ రూ.45 కోట్లను తక్షణమే చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై సోమవారం కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌ను కలవాలని చెరకు రైతులు నిర్ణయించారు. కలెక్టర్ స్పందనను బట్టి ఉద్యమానికి సిద్ధం కావాలని రైతులు భావిస్తున్నారు. -
పార్టీ ప్రచార యాత్రగా..
పార్టీ యాత్రను తలపించిన చంద్రబాబు జిల్లా పర్యటన ప్రచార రథంపై నుంచేప్రసంగాలు జనంపై చిర్రుబుర్రులు పలుచోట్ల జనస్పందన కరువు విశాఖను ముంబై నగరంగా మార్చుతానని ప్రకటన చక్కెర కర్మాగారాల సమస్యలపై ప్రత్యేక దృష్టికి హామీ అధికారంలోకి వచ్చాక తొలిసారి జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు అడుగడుగునా ప్రభుత్వ కార్యక్రమాన్ని కాస్తా పార్టీ ప్రచార యాత్రగా మార్చేశారు. ముఖ్యమంత్రిహోదాలో పర్యటిస్తున్న ఆయన పార్టీ ప్రచారం రథంపైనుంచే మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. గ్రామాల్లోకి కాన్వాయ్ ప్రవేశించగానే సీఎం ముందున్న వాహనంలో ప్రభుత్వ అభివృద్ధి గీతాలు కాకుండా పార్టీ గేయం వందలసార్లు మైక్‌లో వినిపించడంతో తొలిరోజు పర్యటన పార్టీ యాత్ర లేదా ప్రభుత్వ పర్యటన అనేది తేడా కనిపించలేదు. సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో కేబినెట్ సమావేశానికి హాజరయ్యాక మరోసారి పూర్తిస్థాయి పర్యటనకు తొలిసారిగా బాబు వచ్చినా.. జన స్పందన పెద్దగా లేదనే చెప్పాలి. వాస్తవానికి చంద్రబాబు ఎప్పుడూ విమానాశ్రయానికి వచ్చినా భారీగా కార్యకర్తలు హాజరై హడావుడి చేసేవారు. ఈదఫా కనీసం కార్యకర్తలు పలుచగా కనిపించారు. శుక్రవారం వరలక్ష్మి వ్రతం పండగ సెగ తగిలిందని సొంతపార్టీనేతలే వ్యాఖ్యానించారు. సమస్యలు వినిపిస్తే చిర్రుబుర్రు 8.30 గంటలకు సీఎం ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల్సి ఉన్నా గంట ఆలస్యంగా 9.40కి చేరుకున్నారు. అక్కడినుంచి గాజువాక మీదుగా వెళ్తుండగా స్థానిక ఉక్కు నిర్వాసితులతోపాటు మరికొందరు వినతిపత్రాలు ఇవ్వడానికి రావడంతో చంద్రబాబు పార్టీ ప్రచార రథం ఎక్కి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అక్కడినుంచి అనకాపల్లి నూకాంబిక ఆలయానికి 11.10గంటలకు చేరుకున్నారు. అనంతరం స్థానిక ఏరియా ఆస్పత్రి ఆకస్మిక తనిఖీకి వెళ్లారు. ఆస్పత్రిలో సౌకర్యాలపై ఆరా తీశారు. ముందుగానే సీఎం వస్తున్నారని సమాచారం రావడంతో ఆస్పత్రివర్గాలు ఆస్పత్రిని శుభ్రంగా మార్చాయి. అనంతరం ఆస్పత్రి సమస్యలపై వైద్యులతో ముప్పావుగంటపాటు సమావేశమయ్యారు. అక్కడినుంచి 12.40గంటలకు తుమ్మపాలకు చేరుకున్నారు. చెరకు రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. తమకు చెరకుబకాయిలు అందడం లేదని, కుటుం బాలు రోడ్డునపడుతున్నాయని మొర వినిపించే ప్రయత్నం చేసినా బాబు మాత్రం వారి రోదన వినలేదు. అదంతా గత ప్రభుత్వ పాలన పాపం అంట తప్పించుకున్నారు. చెరకు ఫ్యాక్టరీని ఆధునికీకరించే విషయమై ఉన్నతాధికారులతో కమిటీ వేస్తున్నానని మూడు నెలల్లో సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. 1.20గంటలకు గంధవరానికి చేరుకుని స్థానిక మహిళలతో ముచ్చటించారు. అయితే గ్రామంలో అభివృద్ధి లేదని స్థానికులు సమస్యలు ఏకరువు పెట్టగా బాబు అసహనం వ్యక్తం చేశారు. ఓ అవ్వ తనకు పింఛన్ తక్కువగా వస్తుందని, కొడుకు సరిగ్గా చూడ్డం లేదని చెప్పడంతో ఆమెకు సెల్‌ఫోన్ కొనిచ్చి పింఛన్ సమాచారం దానిద్వారా తెలుసుకునేందుకు రూ.10వేలు ఇస్తున్నట్లు చెప్పారు. అక్కడినుంచి గోవాడ చేరుకుని చెరకు రైతులతో మాట్లాడారు. తమకు వేతనాలు పెరిగేలా చూడాలని కోరిన రైతులను ఇప్పటికే ఎక్కువ వేతనాలు వస్తున్నాయి కదా అని వారిని నిరుత్సాహ పరిచారు. 4లక్షలు ఉన్న చెరకు క్రషింగ్ సామర్థ్యాన్ని 8లక్షల మెట్రిక్ టన్నులకు పెంచుతామని హామీ ఇచ్చారు. అనంతరం అక్కడినుంచి చోడవరంలోని రైతు బహిరంగ సభకు హాజరయ్యారు. తిరిగి రాత్రి ఏడు గంటలకు అనకాపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రానికి హాజరై సైంటిస్టులతో ముఖాముఖీలో పాల్గొన్నారు. చంద్రబాబు తొలిరోజు పర్యటనలో ప్రజా సమస్యలు వినకుండా పైపైనే కానిచ్చేసి తమ ప్రభుత్వం ఏం చేస్తుందో గొప్పలు చెప్పుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు. విశాఖను ముంబైగా మార్చుతా విశాఖనగరాన్ని ముంబైగా తీర్చిదిద్దుతానని సీఎం ప్రకటించారు. ప్రపంచాన్ని విశాఖకు తీసుకువస్తానని చెప్పారు. విశాఖ ఉక్కు సామర్థ్యాన్ని పెంచుతామని, నగరంలో ఔటర్‌రింగ్‌రోడ్డు అభివృద్ధిచేస్తానని హామీ ఇచ్చారు. ఫార్మా,పారిశ్రామికరంగాలను సైతం ప్రోత్సహిస్తానన్నారు. విశాఖను కాలుష్యం సమస్య వేధిస్తుందని, దాని పరిష్కారానికి కట్టుబడి ఉన్నటు ్లచెప్పారు. మెట్రోకూడా పూర్తిచేస్తామని, అరనుకు ఊటీ,కొడెకైనాల్ తరహాలో పర్యాటకపరంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వస్తే విశాఖనగరానికి తాగునీటి సమస్యతోపాటు పరిశ్రమలకు నీరు కూడా సులువుగా ఇస్తామని చెప్పారు. ఇళ్లకు,పరిశ్రమలకు విద్యుత్ పెంచుతామన్నారు. -
చక్కెర మిల్లుకు చేదు కాలం!
జిల్లాలో పెరుగుతున్న చెరకు విస్తీర్ణం చతికిలపడుతున్న సుగర్ ఫ్యాక్టరీలు ఆధునికీకరణకు సర్కారు చొరవ చూపేనా ఎపిట్కో కమిటీ నివేదికను పరిశీలించాలంటున్న యాజమాన్యాలు చోడవరం : జిల్లాలో వరికి సమానంగా రైతులు చెరకు పంటను సాగుచేస్తున్నారు. చోడవరం, ఏటికొప్పాక, తాండవ, అనకాపల్లి సహకార చక్కెర కర్మాగారాలు ఉండడంతో ఏటా లక్షన్నర ఎకరాలకు మించి చెరకు సాగు జరుగుతుంది. ఈ ఏడాది వరి సాగుకు వాతావరణం అనుకూలించకపోవడంతో చెరకు సాగు సుమారు 20 శాతం పెరిగింది. సాధారణ విస్తీర్ణం కంటే అదనంగా 40వేల ఎకరాల్లో చెరకు సాగు జరుగుతుంది. అంటే సుమారు 2 లక్షల ఎకరాల వరకు ఈ ఏడాది చెరకు సాగు జరుగుతుంది. అయితే పంట విస్తీర్ణం పెరుగుతున్నా ఉన్న నాలుగు ఫ్యాక్టరీల్లో ఏటేటా మిషనరీ పాతబడి పోయి క్రషింగ్ సామర్థ్యం తగ్గిపోతుంది. సాగుకు అనుకూలంగా ఫ్యాక్టరీలు ఆధునికీకరణకు నోచుకోని పరిస్థితి నెలకొంది. రెండేళ్ల కిందట ఎపిట్కో కమిటీ రాష్ట్రంలో ఉన్న అన్ని సహకార చక్కెర కర్మాగారాలను క్షుణ్ణంగా పరిశీలించింది. తక్షణం ఆధునికీకరణ జరగకపోతే ఫ్యాక్టరీలన్నీ మూతపడే ప్రమాదం ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. సుమారు రూ.500 కోట్లు వెచ్చిస్తే అన్ని ఫ్యాక్టరీలు తిరిగి రైతులకు భరోసాగా నిలుస్తాయని సూచింది. అంతేకాకుండా ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి అయ్యే బెగాస్ ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉన్నందున అన్ని ఫ్యాక్టరీల్లోనూ కో జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని, తమిళనాడు మాదిరిగా ఇక్కడ కూడా ట్రాన్స్‌కోకు వీటి నిర్వహణ అప్పగిస్తే మంచిదని సూచింది. అయితే కిర ణ్‌కుమార్ సర్కార్ ఎపిట్కో కమిటీ నివేదికను పక్కన పెట్టింది. బకాయిలతో నెట్టుకొస్తున్నారు... ఈ ఏడాదైనా సుగర్ ఫ్యాక్టరీలను ఆధునికీకరించకపోతే చోడవరం, ఏటికొప్పాక లాంటి లాభాల్లో ఉన్న ఫ్యాక్టరీలు కూడా నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం పొంచి ఉంది. పంచదార ధర రెండేళ్లుగా ఘోరంగా పడిపోవడంతో కనీస మద్దతు ధర కూడా రైతులకు ఇవ్వలేని పరిస్థితిలో ఫ్యాక్టరీలు పడ్డాయి. చోడవరం ఫ్యాక్టరీకి ఉప ఉత్పత్తులైన మొలాసిస్, కో జనరేషన్ ద్వారా వచ్చిన ఆదాయంతో గట్టెక్కినప్పటికీ మిగతా ఫ్యాక్టరీలు రైతులకు నేటికీ ఈ బకాయిలు చెల్లించలేకపోయాయి. ఈ పరిస్థితుల్లో ఇటు రైతులను, అటు ఫ్యాక్టరీల మనుగడను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ ఏడాదైనా సుగర్ ఫ్యాక్టరీల ఆధునికీకరణకు చొరవ చూపాలని రైతులు, ఫ్యాక్టరీల యాజమాన్యాలు కోరుతున్నాయి. ఆధునికీకరణ చాలా అవసరం సహకార చక్కెర కర్మాగారాలు పూర్తిగా ఇబ్బందుల్లో ఉన్నాయి. ఆధునికీకరణ ప్రతి ఫ్యాక్టరీకి చాలా అవసరం. చెరకు పంటపై రైతులు ఆసక్తి చూపుతున్నప్పటికీ ఫ్యాక్టరీల క్రషింగ్ కెపాసిటీ లేక పంటను పూర్తిగా ఫ్యాక్టరీలు తీసుకోలేకపోతున్నాయి. గతంలో ప్రభుత్వాలు వేసిన కమిటీల ప్రతిపాదనలు కూడా ఇంకా ఆచరణలోకి రాలేదు. మొలాసిన్, ఇథనాయిల్కు ఇప్పుడు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ధర కూడా ఆశాజనకంగా ఉంది. ఫ్యాక్టరీల్లో ఉప ఉత్పత్తుల యూనిట్లు లేకపోవడం వల్ల కూడా ఆర్థికంగా వెనుకబడిపోతున్నాయి. ఇప్పుడు పూర్తిగా పంచదారపైనే ఆధారపడాల్సి వస్తుంది. అది కూడా ధరలు హెచ్చుతగ్గులు ఉన్నాయి. ప్రతి ఫ్యాక్టరీలో క్రషింగ్ సామర్ధ్యాన్ని పెంచే బాయిలర్ హౌస్‌లను నిర్మించుకోవాల్సి ఉంది. -వి.వి.రమణారావు, ఎండీ, గోవాడ సుగర్స్ -
చెరుకు రైతుకు అన్యాయం
చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యాల ఒత్తిడికి సర్కార్ తలొగ్గిందంటూ మండలి నుంచి బీజేపీ వాకౌట్ మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం సాక్షి, బెంగళూరు : రాష్ర్టంలో చెరుకు లావాదేవీలకు సంబంధించి రూపొందించిన ముసాయిదా బిల్లును చూస్తే ప్రభుత్వం చక్కెర కర్మాగారాల యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గినట్లు అర్థమవుతోందంటూ బీజేపీ శనివారం శాసన మండలి నుంచి వాకౌట్ చేసింది. అనంతరం సభ ఈ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించింది. చక్కెర కర్మాగారాలు రైతుల నుంచి చెరుకు కొనుగోళ్లు, బిల్లుల చెల్లింపు తదితర లావాదేవీలకు సంబంధించి రూపొందించిన ముసాయిదా బిల్లుపై సుమారు రెండు గంటల పాటు చర్చ జరిగింది. సహకార శాఖ మంత్రి హెచ్ఎస్. మహదేవ ప్రసాద్ చర్చకు సమాధానమిస్తూ, సవరణ బిల్లు చట్టం రూపం దాల్చితే చెరుకును కొనుగోలు చేసిన 14 రోజుల్లోగా చక్కెర కర్మాగారాల యాజమాన్యాలు సొమ్ము చెల్లించాల్సి ఉంటుందన్నారు. లేనట్లయితే వడ్డీ సహా నిర్ణీత గడువులోగా చెల్లించాలని తెలిపారు. చర్చలో జేడీఎస్ సభ్యులు బసవరాజ హొరట్టి, మరితిబ్బేగౌడ, కాంగ్రెస్ సభ్యుడు ఉగ్రప్ప తదితరులు పాల్గొన్నారు. -
మా బతుకంతా చేదే..
మద్దతు ధర కోసం రోడ్డెక్కిన చెరుకు రైతులు సీఎం ఇల్లు ముట్టడి భగ్నం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్ట ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను చక్కెర కర్మాగారాల యాజమాన్యాల నుంచి ఇప్పించాలని డిమాండ్ చేస్తూ చెరుకు రైతులు శుక్రవారం నగరంలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. మండ్య, మద్దూరు, హాసన, బెల్గాం తదితర ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో తరలి వచ్చిన రైతులు రైల్వే స్టేషన్ నుంచి ఫ్రీడం పార్కు వరకు ప్రదర్శనగా తరలి వచ్చి ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి నివాసం వరకు ప్రదర్శనగా వెళ్లాలనుకున్న వారి ప్రయత్నాలను పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా చెరుకు రైతుల సంఘం అధ్యక్షుడు కురుబూరు శాంత కుమార్ మాట్లాడుతూ రాష్ర్టంలోని 56 చక్కెర కర్మాగారాల నుంచి రైతులకు రూ.3,500 కోట్లకు పైగా రావాల్సి ఉందని తెలిపారు. దీనికి సంబంధించి ఎనిమిది నెలల కిందటే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ, యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమ బకాయిలను ఇప్పించడానికి ముఖ్యమంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం టన్ను మద్దతు ధరను రూ.2,500గా నిర్ణయించడంతో పాటు రూ.150 ప్రోత్సాహకాన్ని ప్రకటించిందని గుర్తు చేశారు. ప్రోత్సాహక మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. చక్కెర కర్మాగారాల యాజమాన్యాలు రూ.2,500 కాకుండా రూ.రెండు వేలు చెల్లిస్తున్నాయనిఆరోపించారు. రాష్ట్రంలోని అనేక కర్మాగారాలు ఎమ్మెల్యేలు, మంత్రుల ఆధీనంలో ఉన్నాయని, ప్రభుత్వం కూడా వీరి అదుపాజ్ఞల్లో ఉందని విమర్శించారు. కాగా ధర్నా జరుగుతుండగానే శాంత కుమార్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వద్దకు చర్చలు జరిపారు. ప్రోత్సాహకానికి సంబంధించి రూ.350 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేస్తామని సీఎం ఆయనకు హామీ ఇచ్చారు. కాగా రైతుల ధర్నా కారణంగా మెజిస్టిక్ చుట్టుపక్కల కాసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. -
చెరకు రైతుల డబ్బు బకాయి కింద జమ
* రూ. 218 కోట్లు బదలాయించుకున్న బ్యాంకులు * కృష్ణాలో లబోదిబోమంటున్న రైతులు సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలో చెరకు రైతులకు రుణమాఫీ హుళక్కైంది. బ్యాంకర్లు పంట రుణ బాకీలను వసూలు చేసేసుకున్నారు. జిల్లాలో హనుమాన్ షుగర్స్, ఉయ్యూరు కేసీపీ, లక్ష్మీపురం చక్కెర కర్మాగారాలు 2013-14 సీజన్‌కు సంబంధించిన పంట డబ్బును రైతులకు విడుదల చేశాయి. యాజమాన్యాల నుంచి మూడురోజుల క్రితం రైతుల ఖాతాల్లో పడిన పంట డబ్బును బ్యాంకు అధికారులు పంట రుణం కింద జమ చేసేసుకున్నారు. రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్న రైతాంగం ఈ పరిణామంతో నివ్వెరపోరుుంది. ప్రభుత్వం రుణమాఫీపై నాన్చడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు అధికారులు కూడా రుణమాఫీకి సంబంధించి తమకు ఎటువంటి ఉత్తర్వులు రాకపోవటం వల్లే రైతుల రుణ ఖాతాలకు షుగర్ ఫ్యాక్టరీల నుంచి వచ్చిన డబ్బును తాము జమ చేసుకున్నట్లు చెబుతున్నారు. జిల్లాలోని 23,500 మంది చెరకు రైతుల రుణాలకు సంబంధించిన మొత్తం రూ.218 కోట్లను బ్యాంకు అధికారులు ఈ విధంగా జమ చేసేసుకున్నారు. బ్యాంకర్లు రైతులతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం, నిబంధనల మేరకే తమకు రావలసిన బకాయిలను జమ చేసుకోవడంతో.. రైతులు కూడా దీనిపై ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది. రుణమాఫీపై ప్రభుత్వం సత్వరమే నిర్ణయం తీసుకుని ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని రైతులు వాపోతున్నారు. -
జోరుగా చెరకు నాట్లు
అకాల వర్షాలతో జోరుగా నాట్లు సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం చోడవరం, న్యూస్‌లైన్ : ఖరీఫ్‌కు ముందే వర్షాలు కురవడంతో చెరకు నాట్లు జోరుగా సాగుతున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది చెరకు విస్తీర్ణం కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ నెలాఖరుతో జిల్లాలో అన్ని సహకార చక్కెర కర్మాగారాలు క్రషింగ్‌ను ముంగించడంతో మే నుంచే చెరకు నాట్లు వేసేందుకు రైతులు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 60 శాతం నాట్లు పూర్తయ్యాయి. గత ఏడాది జిల్లాలో లక్షా 64 వేల ఎకరాల్లో చెరకు సాగు జరిగింది. దీనివల్ల చోడవరం, ఏటికొప్పాక, తాండవ, అనకాపల్లి (తుమ్మపాల) సుగర్ ఫ్యాక్టరీలు అనుకున్న లక్ష్యం మేరకు సకాలంలో క్రషింగ్ చేయగలిగాయి. గడచిన సీజన్లో బెల్లం ధర కూడా రైతులకు ఊరటనిచ్చింది. పంచదార ధరలు పెరుగుతూ... తగ్గుతూ వచ్చినప్పటికీ 2013-14 సీజన్లో సుగర్ ఫ్యాక్టరీలు కూడా మద్దతు ధర ఆశాజనకంగానే చెల్లించాయి. అత్యధికంగా గోవాడ సుగర్ ఫ్యాక్టరీ టన్నుకు రూ.2300 వరకు చెల్లించగా మిగలిన మూడు ఫ్యాక్టరీలు రూ.1800 నుంచి రూ.2 వేలు వరకు చెల్లించాయి. ఈ ఏడాది కేంద్రమే నేరుగా చెరకు టన్నుకు రూ.2125 మద్దతు ధర ఇవ్వాలని నిర్దేశించడంతో పెట్టుబడులు పెరిగినా రైతులు చెరకు సాగుపై మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. దీనికితోడు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, ఇతర సదుపాయాలు ఇచ్చేందుకు ఫ్యాక్టరీలు కూడా ముందుకు రావడం రైతుకు కొంత ఊరట కలుగుతుంది. ఈ పరిస్థితుల్లో గత సీజన్ కంటే ఈసారి జిల్లాలో చెరకు విస్తీర్ణం బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మద్దతు ధర, రాయితీలతోపాటు నాట్లు వేసే సమయంలో వర్షాలు కూడా అనుకూలించడంతో జోరుగా చెరకు నాట్లు వేస్తున్నారు. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో జలాశయాల్లో కూడా నీటి నిల్వలు ఆశాజనకంగా ఉండటం వల్ల సాగునీటి ఇబ్బందులు ఉండవని రైతులు భావిస్తున్నారు. అందుకే ఈ సారి మెట్ట ప్రాంతాల్లో ముందుగానే దుక్కులు దున్ని చెరకు నాట్లు వేశారు. ప్రస్తుతం పల్లపు ప్రాంతాల్లో నాట్లు ఊపందుకుకోవడంతో ఎక్కడ చూసినా రైతులు పొలం పనులతో బిజీగా కనిపిస్తున్నారు. ఈ ఖరీఫ్‌లో సుమారు 2 లక్షల ఎకరాల్లో చెరకు సాగు జరిగే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయాధికారులు భావిస్తున్నారు. ఈ పరిణామం బెల్లం, పంచదార ఉత్పత్తులకు మంచిదని చెబుతున్నారు. -
‘గోవాడ’ అద్భుతం
రికార్డు స్థాయిలో క్రషింగ్ 83రోజుల్లో 3లక్షల టన్నులు గానుగాట సహకార చక్కెర కర్మాగారాల చరిత్రలో ప్రథమం ఆశాజనకంగా 9.27 సరాసరి రికవరీ కోటి యూనిట్లకు చేరువలో విద్యుత్ ఉత్పత్తి ఏప్రిల్‌లోనే లక్ష్యం సాధించే దిశగా ఫ్యాక్టరీ చోడవరం,న్యూస్‌లైన్ : రాష్ట్ర సహకార చక్కెర కర్మాగారాల చరిత్రలో ‘గోవాడ’ సుగర్ ఫ్యాక్టరీ రికార్డు సృష్టించింది. ప్రైవేటు ఫ్యాక్టరీలకు దీటుగా మునుపెన్నడూలేని విధంగా 83రోజుల్లో మూడు లక్షల టన్నుల చెరకు గానుగాడింది. రైతులకు భరోసాగా నిలబడింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎనిమిది సహకార చక్కెర కర్మాగారాలు క్రషింగ్ జరుపుతున్నాయి. అందులో జిల్లాలోనే చోడవరం, ఏటికొప్పాక, తాండవ, అనకాపల్లి ఫ్యాక్టరీలు ఉన్నారు. ఏటా లక్ష్యం మేరకు మే నెల వరకు గానుగాడేవారు. ఈ ఏడాది ఏప్రిల్ నాటికే లక్ష్యం మేరకు క్రషింగ్ ముగించాలని ఈ సుగర్స్ యాజమాన్యం యోచిస్తోంది. భారీ తుఫాన్లు, అకాల వర్షాలు వంటి ప్రతి కూల పరిస్థితులు ఈ ఏడాది నెలకొన్నప్పటికీ కొత్తగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్ గూనూరు మల్లునాయుడు,ఎమ్డీ వి.వెంకటరమణరావు ఈ సీజన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అధిక దిగుబడి,రికవరీకి కృషి చేశారు. డిసెంబర్ 30న ఇక్కడ రెగ్యులర్ క్రషింగ్ ప్రారంభమైంది. ఓవర్‌హాలింగ్, ఇతర కారణాలతో మూడు రోజులు మాత్రమే గానుగాటకు అంతరాయం ఏర్పడింది. గురువారం నాటికి 83 రోజుల్లో 3.1లక్షల టన్నుల చెరకు గానుగాడి రికార్డు సృష్టించింది. రికవరీ కూడా ఆశాజనకంగానే ఉంది. సరాసరి 9.27శాతం రావడంతో ఫ్యాక్టరీ యాజమాన్యం, రైతుల్లో ఆశలు చిగురిస్తున్నారు. మిల్లు కెపాసిటీకి తగ్గట్టుగా రోజువారీ 3600 టన్నులు దాటి క్రషింగ్ చేయగా, ఒక దశలో రోజుకి 4వేల టన్నులు కూడా ఆడారు. 5.3లక్షల టన్నులు లక్ష్యంతో ఏప్రిల్ నెలాఖరుకు క్రషింగ్ పూర్తిచేయాలని నిర్ణయించారు. మిల్లులో లోపాలను ఎప్పటికప్పుడు సరిచేసుకోవడంతో ఎప్పుడూలేని విధంగా ఫిబ్రవరి ఆఖరునాటికే మూడులక్షల టన్నులు గానుగాడారు. రోజువారీ రికవరీ 11 శాతంగా నమోదుతో మంచి దిగుబడి సాధించే దిశగా సుగర్స్ అడుగులు వేస్తుంది. మరో పక్క కో- జనరేషన్ ప్లాంట్ ద్వారా ఇప్పటి వరకు 93లక్షల యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. రాష్ట్రంలోని ఏ సహకార చక్కెర కర్మాగారం ఈ స్థాయిలో భారీగా క్రషింగ్‌ను ఎన్నడూ చేపట్టలేదు. ప్రైవేటు ఫ్యాక్టరీల్లోనే సాధ్యమైంది. ఈ పరిణామంతో ఫ్యాక్టరీతోపాటు రైతులకు కూడా మేలు జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.