జీ హుజూర్
చక్కెర కర్మాగారాల లాబీయింగ్‌కి తలొగ్గిన సర్కారు
ప్రభుత్వం నిర్ణయంపై భగ్గుమన్న రైతు సంఘాలు
బెళగావి సమావేశాలను అడ్డుకుంటామని హెచ్చరిక
బెంగళూరు : ైరె తులకు మేలు చేసే నిర్ణయాలే తీసుకుంటామని ప్రతి వేదికపై చెప్పే అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతల్లో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. ఏడాది కాలంగా చెరుకు రైతులకు బాకీ పడిన మొత్తాన్ని చక్కెర కర్మాగారాల యాజమన్యం ఒత్తిడికి తలొగ్గి విడతల్లో, రెండేళ్లలో తీర్చడానికి అంగీకరించడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని బాధిత రైతులు వాపోతున్నారు. ఈ విషయంలో కోర్టు ఉత్తర్వులను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. విధానసౌధాలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర సహకార, చక్కెర శాఖ మంత్రి హెచ్.ఎస్.మహదేవ ప్రసాద్ మాట్లాడుతూ...‘గత ఏడాదికి సంబంధించి ప్రతి టన్ను చెరుకుకు రూ.2,500ను మద్దతు ధరగా చెల్లించాల్సి ఉంది. అయితే చక్కర కర్మాగారాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా ఈనెల 30 లోపు రూ.2,100 చెల్లించాల్సిందిగా సూచిస్తున్నాము. అటు పై మిగిలిన మొత్తంలో రూ.200ను నెల లోపు చెల్లించి, మిగిలిన రూ.200ను రెండేళ్లలోపు ఏడాదికి రూ.100 చొప్పున చెల్లించాలి. అంతేకాకుండా నంబర్ 30లోపు ఈ ఏడాదికి చెరుకుకు సంబంధించి క్రషింగ్ ఖచ్చితంగా మొదలు పెట్టాలి. ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అలాంటి చక్కర కర్మాగారాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే చెరుకు క్రషింగ్ చేపడుతుంది.’ అని తెలిపారు. ప్రభుత్వ తాజా నిర్ణయంపై రాష్ట్ర చెరుకు రైతుల సంఘం అధ్యక్షుడు శాంతకుమార్ నిప్పులు చెరిగారు.
చక్కెర కర్మాగారాల యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఈనెల 30లోపు గత ఏడాది ప్రభుత్వం ప్రకటించిన రూ.2,500 మద్దతు ధరను చెల్లించాల్సిందిగా హైకోర్టు చక్కెర కర్మాగారాలకు సూచించినా ప్రభుత్వం మాత్రం కంతుల వారిగా చెల్లించాలని సూచించడం సరికాదన్నారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ వేలాది మంది రైతులతో ఈనెల 28న బెళగావి (బెల్గాం)లో జరిగే మంత్రిమండలి సమావేశాన్ని అడ్డుకుంటామన్నారు. అంతేకాకుండా శీతాకాల సమావేశాలను బెల్గాంలో ఎట్టిపరిస్థితుల్లోను జరగనివ్వబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్ర రైతు సంఘం, హసిరుసేన అధ్యక్షుడు కోడిహళ్లి చంద్రశేఖర్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ప్రభుత్వ నిర్ణయం అవైజ్ఞానికంగా ఉందన్నారు. పొరుగున ఉన్న మహారాష్ట్ర టన్ను చెరుకుకు రూ.2,535లను రైతులకు ఒకేసారి ఇస్తోందన్నారు. కొన్ని రాష్ట్రాల్లో చెరుకు రైతులకు టన్నుకు రూ.3వేలకు పైగా దక్కుతోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం వల్ల చెరుకు రైతులకు పెట్టుబడి కంటే తక్కువ ధర లభిస్తోందని తెలిపారు. ఆ తక్కువ మొత్తాన్ని కూడా వాయిదాల పద్ధతిన ఇవ్వాలని ప్రభుత్వం సూచించడం తగదన్నారు. ఈ విషయమై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం జరిగేవరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు.