Mahadeva Prasad
-
ఇదేమి చోద్యం !
సాక్షి, బెంగళూరు: రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా? ఈ విషయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, సహకార శాఖ మంత్రి హెచ్.ఎస్ మహదేవ ప్రసాద్ తలోదారిలో ప్రయాణిస్తున్నారా?.. అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇందుకు మంగళవారం జరిగిన సంఘటనలను విపక్షాలతో పాటు రైతుల సంఘాల నాయకులు ప్రస్తావిస్తున్నారు. శీతాకాల సమావేశాల్లో భాగంగా బెళగావిలో రెండో రోజు మంగళవారం ప్రశ్నోత్తరాల సమయం కంటే ముందే శాసనసభలో విపక్ష సభ్యులు కరువుపై చర్చకు పట్టుబట్టాయి. 50 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొని రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని బీజేపీ, జేడీఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం తక్షణం వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని పట్టుబట్టారు. కలుగజేసుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య..రైతుల కష్టాలు తమకూ తెలుసన్నారు. సహకార సంఘాల్లో తీసుకున్న పంటరుణాలను మాఫీ చేసే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. ఈ విషయమై ఇప్పటికే వివిధ మార్గాల్లో నివేదికలు కూడా తెప్పించుకున్నామని పేర్కొంటూ మొదట ప్రశ్నోత్తరాల సమయానికి సహకరించాలని విపక్షాలకు సూచించారు. ఈ సమయంలో స్పీకర్ కోడివాళ కలుగజేసుకోవడంతో కొశ్చన్ అవర్ ప్రారంభమైంది. ఇదిలాఉండగా చెరకు ఫెరుుర్ అండ్ రెమ్యూనిరేటీవ్ (ఎఫ్ఆర్పీ) ధరను పెంచే విషయంతో పాటు బకాయిల చెల్లింపు తదితర విషయాలకు సంబంధించి రైతు సంఘం నాయకులతో సహకార శాఖ మంత్రి మహదేవ ప్రసాద్ బెళగావిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో వ్యసాయ రుణాలను మాఫీ చేస్తే ప్రభుత్వ ఖజానాపై రూ.9,978 కోట్లు భారం పడుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత ఆర్థికభారాన్ని ప్రభుత్వం మోయలేదని తేల్చిచెప్పారు. అందువల్ల రైతుల రుణాల మాఫీ చేయలేమని స్పష్టం చేశారు. అరుుతే రుణాల వడ్డీలను రీ షెడ్యూల్ చేసే విషయం మాత్రం అలోచిస్తామన్నారు. దీనిపై రాష్ట్ర చెరుకు రైతు సంఘం అధ్యక్షుడు కురుబూరు శాంతకుమార్ స్పందిస్తూ..ఒకే విషయమై బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వారు విరుద్ధ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. చర్చలు విఫలం... చెరకుకు ఫెయిర్ అండ్ రెమ్యూనిరేటీవ్ (ఎఫ్ఆర్పీ) పెంపు విషయంతో పాటు బకారుుల చెల్లింపుపై ప్రభుత్వం, రైతు సంఘం నాయకుల మధ్య ఏర్పడిన ప్రతిష్టంబన తొలగలేదు. ఎఫ్ఆర్పీని టన్నుకు రూ.3,050 వరకు పెంచాలని రైతు సంఘం నాయకులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా రైతులకు చక్కెర కర్మాగారాల నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలనేది వారి మరొక ప్రధాన డిమాండ్. ఈ నేపథ్యంలో రాష్ట్ర సహకార శాఖ మంత్రి మహదేవ ప్రసాద్ అధ్యక్షతన బెళగావిలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చెరకు రైతు సంఘం నాయకులు, వివిధ ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులు, చక్కర కర్మాగార యాజమాన్యం ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చెరుకు ఎఫ్ఆర్పీ పెంచడం సాధ్యం కాదని మహదేవ ప్రసాద్ రైతులతో పేర్కొన్నారు. దీంతో ఆగ్రహం చెందిన రైతులు ’చక్కెర యాజమాన్యం లాబీకి తలొగ్గిన మంత్రికి రైతుల కష్టాలు అర్థం కావడం లేదు. చెరుకు ఎఫ్ఆర్పీ పెంచేంతవరకూ తాము వెనకడుగువేసేది లేదు. వెంటనే బకాయిలను చెల్లించాలి. అప్పటి వరకూ బెళగావిలో వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తుంటాం’ అని పేర్కొంటూ సమావేశం నుంచి అర్థాతరంగా బయటకి వచ్చేశారు. అటుపై మంత్రి మహదేవ్ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ...మంగళవారం జరిగిన చర్చలు అసంపూర్ణంగా ముగిసాయన్నారు. ఈ విషమై ఈనెల 24న మరోసారి రైతు సంఘం నాయకులతో చర్చిస్తామన్నారు. సమస్యకు తప్పక పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
జీ హుజూర్
చక్కెర కర్మాగారాల లాబీయింగ్‌కి తలొగ్గిన సర్కారు ప్రభుత్వం నిర్ణయంపై భగ్గుమన్న రైతు సంఘాలు బెళగావి సమావేశాలను అడ్డుకుంటామని హెచ్చరిక బెంగళూరు : ైరె తులకు మేలు చేసే నిర్ణయాలే తీసుకుంటామని ప్రతి వేదికపై చెప్పే అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతల్లో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. ఏడాది కాలంగా చెరుకు రైతులకు బాకీ పడిన మొత్తాన్ని చక్కెర కర్మాగారాల యాజమన్యం ఒత్తిడికి తలొగ్గి విడతల్లో, రెండేళ్లలో తీర్చడానికి అంగీకరించడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని బాధిత రైతులు వాపోతున్నారు. ఈ విషయంలో కోర్టు ఉత్తర్వులను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. విధానసౌధాలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర సహకార, చక్కెర శాఖ మంత్రి హెచ్.ఎస్.మహదేవ ప్రసాద్ మాట్లాడుతూ...‘గత ఏడాదికి సంబంధించి ప్రతి టన్ను చెరుకుకు రూ.2,500ను మద్దతు ధరగా చెల్లించాల్సి ఉంది. అయితే చక్కర కర్మాగారాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా ఈనెల 30 లోపు రూ.2,100 చెల్లించాల్సిందిగా సూచిస్తున్నాము. అటు పై మిగిలిన మొత్తంలో రూ.200ను నెల లోపు చెల్లించి, మిగిలిన రూ.200ను రెండేళ్లలోపు ఏడాదికి రూ.100 చొప్పున చెల్లించాలి. అంతేకాకుండా నంబర్ 30లోపు ఈ ఏడాదికి చెరుకుకు సంబంధించి క్రషింగ్ ఖచ్చితంగా మొదలు పెట్టాలి. ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అలాంటి చక్కర కర్మాగారాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే చెరుకు క్రషింగ్ చేపడుతుంది.’ అని తెలిపారు. ప్రభుత్వ తాజా నిర్ణయంపై రాష్ట్ర చెరుకు రైతుల సంఘం అధ్యక్షుడు శాంతకుమార్ నిప్పులు చెరిగారు. చక్కెర కర్మాగారాల యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఈనెల 30లోపు గత ఏడాది ప్రభుత్వం ప్రకటించిన రూ.2,500 మద్దతు ధరను చెల్లించాల్సిందిగా హైకోర్టు చక్కెర కర్మాగారాలకు సూచించినా ప్రభుత్వం మాత్రం కంతుల వారిగా చెల్లించాలని సూచించడం సరికాదన్నారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ వేలాది మంది రైతులతో ఈనెల 28న బెళగావి (బెల్గాం)లో జరిగే మంత్రిమండలి సమావేశాన్ని అడ్డుకుంటామన్నారు. అంతేకాకుండా శీతాకాల సమావేశాలను బెల్గాంలో ఎట్టిపరిస్థితుల్లోను జరగనివ్వబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్ర రైతు సంఘం, హసిరుసేన అధ్యక్షుడు కోడిహళ్లి చంద్రశేఖర్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ప్రభుత్వ నిర్ణయం అవైజ్ఞానికంగా ఉందన్నారు. పొరుగున ఉన్న మహారాష్ట్ర టన్ను చెరుకుకు రూ.2,535లను రైతులకు ఒకేసారి ఇస్తోందన్నారు. కొన్ని రాష్ట్రాల్లో చెరుకు రైతులకు టన్నుకు రూ.3వేలకు పైగా దక్కుతోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం వల్ల చెరుకు రైతులకు పెట్టుబడి కంటే తక్కువ ధర లభిస్తోందని తెలిపారు. ఆ తక్కువ మొత్తాన్ని కూడా వాయిదాల పద్ధతిన ఇవ్వాలని ప్రభుత్వం సూచించడం తగదన్నారు. ఈ విషయమై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం జరిగేవరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు. -
హరిత ఉత్సవ్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలోని అన్ని జిల్లాల్లో రైతుల సౌకర్యార్థం నర్సరీలను ప్రారంభించడానికి యోచిస్తున్నట్లు సహకార శాఖ మంత్రి హెచ్ఎస్ మహదేవ ప్రసాద్ తెలిపారు. నగరంలోని లాల్‌బాగ్‌లో ది నర్సరీ మెన్ కో-ఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసిన మూడు రోజుల హరిత ఉత్సవాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సొసైటీ గత 50 సంవత్సరాలుగా మొక్కల పెంపకం, నిర్వహణ, హరిత వనాల స్థాపన తదితర పనులను చేపడుతూ వస్తోందని తెలిపారు. దీని వల్ల పట్టణ ప్రాంత రైతులకు అనుకూలంగా ఉంటుందన్నారు. జిల్లా కేంద్రాల్లో ఈ సొసైటీ కేంద్రాలు లేనందున రైతులకు సరైన సదుపాయం లభించడం లేదన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో సొసైటీ శాఖలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు వివరించారు. దీనిపై సొసైటీ ప్రతిపాదనలు సమర్పిస్తే, జిల్లా కేంద్రాల్లోని ఉద్యాన వనాల శాఖ భూములను కేటాయిస్తామని వెల్లడించారు. ఇప్పటికే మైసూరు, హాసన జిల్లాల్లో ఈ నర్సరీ శాఖలు పని చేస్తున్నాయని చెప్పారు. నగర శివార్లలోని యలహంక, దేవనహళ్లి, కెంగేరి తదితర చోట్ల కూడా ఈ శాఖలను ప్రారంభించి, రైతులకు అనుకూలంగా ఉండేలా చూస్తామన్నారు. -
వారమంతా క్షీర భాగ్య
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల మొదలు ఉన్నత పాఠశాలల వరకు క్షీర భాగ్య పథకం కింద పిల్లలకు వారానికి మూడు సార్లు పంపిణీ చేస్తున్న పాలను ఇకపై వారమంతా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని సహకార శాఖ మంత్రి హెచ్ఎస్ మహదేవ ప్రసాద్ తెలిపారు. బెంగళూరు పాడి సమాఖ్య ఉత్పత్తి చేసిన నెయ్యి లడ్డూలను మంగళవారం ఆయనిక్కడ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ క్షీర భాగ్య కింద కోటి మంది పిల్లలు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. పాల ఉత్పత్తిదారులకు ప్రభుత్వం లీటరుకు ఇస్తున్న ప్రోత్సాహకాన్ని రూ. 2 నుంచి రూ.4 కు పెంచడంతో పాల సేకరణ కూడా రోజుకు 43 లక్షల లీటర్ల నుంచి 60 లక్షల లీటర్లకు పెరిగిందని తెలిపారు. క్షీర భాగ్య కింద కర్ణాటక పాడి సమాఖ్య సహా ఇతర సమాఖ్య శాఖలకు రూ. 636 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించారు. రైతులకు ప్రోత్సాహకంగా రూ 940 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. కల్తీ పాలు విక్రయిస్తే చర్యలు బెంగళూరులో కల్తీ పాలను విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి చర్యలకు పాల్పడే వారిని జైలుకు పంపిస్తామని నగర ఇన్చార్జి మంత్రి రామలింగారెడ్డి హెచ్చరించారు. పిల్లలు ఎక్కువగా పాలు తాగుతుంటారని, కల్తీ పాలు ఇస్తే వారి ఆరోగ్యం ఏమవుతుందని ప్రశ్నించారు. కనుక కల్తీ పాలను విక్రయించే సమాజ ద్రోహులపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటే దీనిని అరికట్టవచ్చని అన్నారు. బెంగళూరులో కల్తీ పాలను విక్రయించే వారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
అన్ని ‘డీసీసీ’లపై దృష్టి
శివమొగ్గ : స్థానిక డీసీసీ బ్యాంక్ నగర శాఖలో రూ.కోట్ల కుంభకోణం వెలుగు చూసిన నేపథ్యంలో రాష్ర్టంలోని అన్ని అపెక్స్, డీసీసీ బ్యాంకులపై దృష్టి సారిస్తున్నట్లు రాష్ట్ర సహకారశాఖామంత్రి మహదేవప్రసాద్ స్పష్టం చేశారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆయా బ్యాంకుల్లో గతంలో జరిగిన వ్యవహరాలను పరిశీలిస్తామన్నారు. శివమొగ్గ నగర శాఖలో రూ.82 కోట్లకు పైగా అవకతవకలు జరిగాయని, మొత్తం 18 మందిని అరెస్ట్ చేశారని తెలిపారు. ఈ కేసును సీఐడీ దర్యాప్తు చేస్తోందని, నిందితులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. శివమొగ్గ డీసీసీ బ్యాంక్ పాలక మండలిని రద్దుచేశామని, ఆ మండలి అధికారిగా కలెక్టర్ విపుల్‌బన్సల్ ను నియమించామని తెలిపారు. గత సంవత్సరం సహకార బ్యాంకులు ద్వారా 14 లక్షల మంది రైతులకు రూ.6 వేల కోట్లను వడ్డీ రహిత రుణాలుగా అందించామని, ఈ సారి రూ.20 వేల కోట్లను అందిస్తామని తెలిపారు. యశస్విని పథకాన్ని నగర ప్రాంతాలకూ విస్తరించామని తెలిపారు. ఉపముఖ్యమంత్రి స్థానంపై అధిష్టానానిదే తుది నిర్ణయమన్నారు. సమావేశంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి కిమ్మనె రత్నాకర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రసన్న కుమార్, ఎమ్మెల్యే కేబీ ప్రసన్న కుమార్, జిల్లా పంచాయతీ అధ్యక్షుడు కలగోడు రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు వడ్డీ రహిత రుణాలు
* ఈ నెలాఖరు నుంచి అమల్లోకి * రూ. 3 లక్షల వరకూ రుణం * సుమారు ఎనిమిది లక్షల మందికి లబ్ధి * కోడ్ వల్ల ఆలస్యంగా అమలు * సర్కార్‌పై ఏటా రూ.850 కోట్ల భారం * 27న యశస్విని పథకం అమలు * రూ. 2 లక్షల వరకు ఉచిత చికిత్సలు * 70 లక్షల మందికి లబ్ధి * సహకార శాఖ మంత్రి మహదేవ ప్రసాద్ వెల్లడి సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోని రైతులకు ఈ నెలాఖరు నుంచి రూ.3 లక్షల వరకు వడ్డీ రహిత రుణాలిచ్చే పథకాన్ని అమలు చేస్తామని సహకార శాఖ మంత్రి హెచ్ఎస్. మహదేవ ప్రసాద్ తెలిపారు. మంగళవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ బడ్జెట్లో పేర్కొన్న మేరకు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ పథకాలన్ని అమలు చేయాల్సి ఉన్నా, ఎన్నికల నియమావళి వల్ల ఆలస్యమైందని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 2,19,515 మంది రైతులకు రూ.7,559 కోట్ల రుణాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇందులో 99 శాతం వడ్డీ రహిత రుణాలన్నారు. అంతకు ముందు ఏడాదితో పోల్చుకుంటే గత ఏడాది సుమారు 1,559 కోట్ల అధిక రుణాలిచ్చినట్లు చెప్పారు. కొత్తగా ఆరు లక్షల మంది రైతులు రుణాలు పొందారని తెలిపారు. ఏటా రూ.వెయ్యి కోట్లు చొప్పున రుణ పంపిణీని పెంచుతూ రూ.10 వేల కోట్ల వార్షిక రుణాలను ఇవ్వాలనే లక్ష్యం విధించుకున్నట్లు వెల్లడించారు. కాగా రైతులకు వడ్డీ రహిత రుణాల వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.800 కోట్ల నుంచి రూ.850 కోట్ల వరకు భారం పడుతుందని తెలిపారు. 27న యశస్విని పథకం పట్టణాల్లోని సహకార సంఘాల సభ్యుల కోసం ఉద్దేశించిన నగర యశస్విని పథకాన్ని ఈ నెల 27న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇక్కడి జ్ఞాన జ్యోతి ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో ప్రారంభిస్తారని మంత్రి చెప్పారు. ఈ పథకం కింద సుమారు 800 వివిధ రోగాలకు రూ.2 లక్షల వరకు ఉచిత చికిత్సలు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. తద్వారా పట్టణాల్లోని 70 లక్షల మంది సహకార సంఘాల సభ్యులు లబ్ధి పొందుతారని చెప్పారు. ఈ పథకాన్ని కోరుకునే సహకార సంఘాల సభ్యులు ఏటా రూ.1,010 బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీలు రూ.810 చెల్లించాలని ఆయన తెలిపారు.