రైతులకు వడ్డీ రహిత రుణాలు | Interest-free loans to farmers | Sakshi
Sakshi News home page

రైతులకు వడ్డీ రహిత రుణాలు

Published Wed, May 14 2014 3:20 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 AM

రైతులకు వడ్డీ రహిత రుణాలు

రైతులకు వడ్డీ రహిత రుణాలు

* ఈ నెలాఖరు నుంచి అమల్లోకి
* రూ. 3 లక్షల వరకూ రుణం
* సుమారు ఎనిమిది లక్షల మందికి లబ్ధి
* కోడ్ వల్ల ఆలస్యంగా అమలు
సర్కార్‌పై ఏటా రూ.850 కోట్ల భారం
27న యశస్విని పథకం అమలు
* రూ. 2 లక్షల వరకు ఉచిత చికిత్సలు
* 70 లక్షల మందికి లబ్ధి
సహకార శాఖ మంత్రి మహదేవ ప్రసాద్ వెల్లడి

 
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోని రైతులకు ఈ నెలాఖరు నుంచి రూ.3 లక్షల వరకు వడ్డీ రహిత రుణాలిచ్చే పథకాన్ని అమలు చేస్తామని సహకార శాఖ మంత్రి హెచ్‌ఎస్. మహదేవ ప్రసాద్ తెలిపారు. మంగళవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ బడ్జెట్‌లో పేర్కొన్న మేరకు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ పథకాలన్ని అమలు చేయాల్సి ఉన్నా, ఎన్నికల నియమావళి వల్ల ఆలస్యమైందని  వివరించారు.

గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 2,19,515 మంది రైతులకు రూ.7,559 కోట్ల రుణాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇందులో 99 శాతం వడ్డీ రహిత రుణాలన్నారు. అంతకు ముందు ఏడాదితో పోల్చుకుంటే గత ఏడాది సుమారు 1,559 కోట్ల అధిక రుణాలిచ్చినట్లు చెప్పారు. కొత్తగా ఆరు లక్షల మంది రైతులు రుణాలు పొందారని తెలిపారు. ఏటా రూ.వెయ్యి కోట్లు చొప్పున రుణ పంపిణీని పెంచుతూ రూ.10 వేల కోట్ల వార్షిక రుణాలను ఇవ్వాలనే లక్ష్యం విధించుకున్నట్లు వెల్లడించారు. కాగా రైతులకు వడ్డీ రహిత రుణాల వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.800 కోట్ల నుంచి రూ.850 కోట్ల వరకు భారం పడుతుందని తెలిపారు.
 
 27న యశస్విని పథకం

 పట్టణాల్లోని సహకార సంఘాల సభ్యుల కోసం ఉద్దేశించిన నగర యశస్విని పథకాన్ని ఈ నెల 27న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇక్కడి జ్ఞాన జ్యోతి ఆడిటోరియంలో జరిగే  కార్యక్రమంలో ప్రారంభిస్తారని మంత్రి చెప్పారు. ఈ పథకం కింద సుమారు 800 వివిధ రోగాలకు రూ.2 లక్షల వరకు ఉచిత  చికిత్సలు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. తద్వారా పట్టణాల్లోని 70 లక్షల మంది సహకార సంఘాల సభ్యులు లబ్ధి పొందుతారని చెప్పారు. ఈ పథకాన్ని కోరుకునే సహకార సంఘాల సభ్యులు ఏటా రూ.1,010 బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎస్‌సీ, ఎస్‌టీలు రూ.810 చెల్లించాలని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement