రైతన్నల ఆత్మాభిమానమే నా లక్ష్యం | YSR Rythu Bharosa scheme to be extended to tenant farmers | Sakshi
Sakshi News home page

రైతన్నల ఆత్మాభిమానమే నా లక్ష్యం

Published Mon, Jul 8 2019 4:17 AM | Last Updated on Mon, Jul 8 2019 9:26 AM

YSR Rythu Bharosa scheme to be extended to tenant farmers - Sakshi

సాక్షి, అమరావతి : రైతన్నలు ఆత్మాభిమానంతో జీవించేలా చేయడమే తన లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. అన్నదాతలు పండించిన ప్రతి గింజకూ న్యాయం జరగాలన్నదే తన ధ్యేయమని పేర్కొన్నారు. రైతుల కళ్లల్లో వెలుగులు చూడడమే తన ఆశయమని స్పష్టం చేశారు. రైతాంగానికి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రైతు బాంధవుడు, మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతు దినోత్సవం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతన్నలకు తొలి లేఖ రాశారు. ఇందులో తన ప్రాధమ్యాలను వివరించారు. ఆ లేఖలోని ముఖ్యాంశాలు...

ఆత్మ బంధువులు, అన్నదాతలైన రైతన్నలకు మీ జగన్‌ నమస్కరిస్తూ రాస్తున్న లేఖ..
డాక్టర్‌ వైఎస్సార్‌ జయంతి సందర్భంగా ప్రతిఏటా జూలై 8వ తేదీన రైతు దినోత్సవం నిర్వహించాలని మన ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల కోసం మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వేసిన బాటను మరింత మెరుగు పరిచేందుకు మన ప్రభుత్వం నవరత్నాలతో ముందుకు వచ్చింది. రైతులకిచ్చిన మాట నిలబెట్టుకునేందుకు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఎన్నో నిర్ణయాలు తీసుకున్నా. ఈ ఏడాది అక్టోబరు నుంచే ప్రతి రైతు కుటుంబానికీ రూ.12,500 రైతు భరోసా కింద అందించబోతున్నాం. ఈ డబ్బును బ్యాంకులు ఇంతకు ముందున్న మీ అప్పులకు జమ చేసుకోకుండా నేరుగా మీ చేతికే అందించబోతున్నాం. 54 లక్షల రైతు కుటుంబాలకు రూ.8,750 కోట్ల మేర పెట్టుబడి సహాయం అందబోతోంది. 15.36 లక్షల కౌలు రైతులకూ మేలు జరుగుతుంది. ఇంత భారీ మొత్తాన్ని ఒకే విడతలో రైతుల చేతికి అందించడం కేవలం ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే కాకుండా 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల భారతదేశ చరిత్రలోనే ఒక రికార్డు.

రూ.2 వేల కోట్లతో విపత్తుల సహాయనిధి
తుపానులు, ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి రూ.2,000 కోట్లతో విపత్తు సహాయ నిధిని ఏర్పాటు చేస్తున్నాం. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని నెలకొల్పుతున్నాం. శనగ రైతులకు క్వింటాల్‌కు రూ.1,500 ప్రోత్సాహకంగా ప్రకటిస్తూ జీవో జారీ చేశాం. ఈ రోజు నుంచే ఆ డబ్బును అందించబోతున్నాం. ప్రతి నియోజకవర్గంలోనూ శీతల గిడ్డంగులు, గోదాముల నిర్మాణంతో పాటు అవసరమైన చోట ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నాం.

కౌలుదారులకు మేలు చేస్తాం..
భూ యజమానుల హక్కులను పూర్తిగా కాపాడుతూ, కౌలుదారులకు సైతం మేలు చేసేలా 11 నెలల పాటు సాగు ఒప్పందం ఉండేలా కౌలు చట్టంలో మార్పులు తీసుకురాబోతున్నాం. తద్వారా కౌలు రైతులకు అన్ని రకాలుగా మంచి చేయాలని నిర్ణయించాం. వ్యవసాయానికి సంబంధించిన కారణాల వల్ల చనిపోయిన రైతు కుటుంబానికి రూ.7 లక్షలు అందిస్తాం. ఆ డబ్బు రైతు కుటుంబం చేతికే అందిస్తాం. ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్‌ కరెంటు అందిస్తున్నాం. సహకార డెయిరీలకు పాలు పోసే ప్రతి పాడి రైతుకు లీటరుకు అదనంగా రూ.4 బోనస్‌ రెండో ఏడాది నుండి ఇవ్వబోతున్నాం. పామాయిల్‌ రైతులకు రూ.85 కోట్ల మేర ఆర్థిక సహాయం అందించబోతున్నాం. పొగాకు ధరల స్థిరీకరణకు చర్యలు తీసుకున్నాం. నాఫెడ్‌ ద్వారా కొబ్బరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. రైతులకు భూసార కార్డులు, రాయితీపై విత్తనాల సరఫరా, సకాలంలో ఎరువుల పంపిణీ, రాయితీపై సూక్ష్మపోషకాల సరఫరా వంటి వాటికి చర్యలు తీసుకుంటున్నాం.

కల్తీ విత్తనాల నిరోధానికి చర్యలు
కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను నిరోధించడానికి చర్యలు చేపడతాం. ప్రతి నియోజకవర్గంలో ప్రయోగశాలలు, ప్రతి గ్రామంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నాం. ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలు చేసేందుకు వ్యవసాయ మిషన్‌ ఏర్పాటు చేశాం. చివరిగా ఒక్క మాట... పండించిన ప్రతి ధాన్యపు గింజపై అది ఎవరు తినాలో దేవుడు రాసి పెడతాడన్నది నానుడి. కష్ట జీవులైన రైతులు, వారి కుటుంబాల్లో ఆనందాలను నింపేలా మనందరి ప్రభుత్వం చేస్తున్న ప్రతి ప్రయత్నానికీ.. అవినీతిని నిర్మూలించడానికి సాగిస్తున్న కృషికి దేవుడి దీవెనలు, మీ అందరి మద్దతు కావాలని కోరుకుంటున్నా. ప్రతి రైతన్నకూ రైతు దినోత్సవ శుభాకాంక్షలు’’  

రూ.84 వేల కోట్ల పంట రుణాలు
బ్యాంకుల నుంచి ఈ ఏడాది రైతులకు రూ.84,000 కోట్లు రుణాలుగా అందజేయాలని నిర్ణయించాం. రూ.లక్ష వరకు పంట ఋణాలు తీసుకున్న రైతులు గడువు లోపు తిరిగి చెల్లిస్తే ఆ రుణాలపై వడ్డీ ఉండదు. వైఎస్సార్‌ వడ్డీ లేని పంట రుణాల పథకాన్ని ప్రారంభిస్తున్నాం. రైతులు చెల్లించాల్సిన పంటల బీమా ప్రీమియంను ఇక ప్రభుత్వమే చెల్లిస్తుంది. రూ.2,163 కోట్ల బీమా ప్రీమియంను రైతుల తరఫున ప్రభుత్వమే చెల్లిస్తుంది.

పగటి పూటే 9 గంటల విద్యుత్‌
ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 60 శాతానికి పైగా వ్యవసాయ కనెక్షన్లకు పగటి పూటే 9 గంటల పాటు కరెంటు సరఫరా చేస్తున్నాం. వచ్చే ఏడాది జూన్‌ నాటికి మిగిలిన ఫీడర్లలో కూడా పగటిపూటే కరెంటు ఇచ్చే సామర్థ్యాన్ని తీసుకువచ్చేలా రూ.1,700 కోట్లు ఖర్చు చేసున్నాం. నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తంగా 200 రిగ్గులతో రైతుల పొలాల్లో ఉచితంగా బోర్లు వేయించబోతున్నాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement