జననేత వైఎస్సార్
ఏ నాయకుడైనా దశాబ్దాల తరబడి ప్రజల మనసులలో గూడు కట్టుకుంటే ఆయన గొప్ప నాయకుడు అవుతారు. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల మనసులలో తన తండ్రితో పాటు తను గుర్తుండిపోవాలని కోరుకుంటుంటారు.
నిజమే! జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల స్మృతిలో ఎలా ఉండిపోగలిగారు? ఒక ముఖ్యమంత్రిగా ఆయన అందించిన సేవలు కారణమా? ఆయనలోని మానవత్వ కోణం కారణమా? తనను కలిసి సాయం అభ్యర్ధించినవారందరికి ఏదో రూపంలో సహాయపడాలని భావించే వ్యక్తి కావడం కారణమా?
వైఎస్ రాజశేఖరరెడ్డి ఇలా అనేక రూపాలలో జనం గుండెల్లో నిలిచిపోయారు. ఆయన ప్రాతినిద్యం వహించిన రాజకీయ పార్టీపై భిన్నాభిప్రాయం కలిగినవారైనా, ఆయన వ్యక్తిత్వం గురించి పాజిటివ్ గా మాట్లాడుకోవడం గొప్ప విషయం అని చెప్పాలి. ముఖ్యమంత్రిగా ఆయన తీసుకువచ్చిన కొన్ని స్కీములు చిరకాలం నిలిచిపోయాయి.
ఆయన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు సైతం వాటిని కొనసాగించవలసి రావడమే వాటి గొప్పతనంగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు అప్పట్లో ఆరోగ్యశ్రీ స్కీమ్ ను ఆయన ప్రతిపాదించి అమలు చేసినప్పుడు తెలుగుదేశం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ డబ్బును ప్రభుత్వ ఆస్పత్రులకు ఖర్చు పెడితే సరిపోతుందని వాదించేది.
పేదల చెంతకు కార్పొరేట్ వైద్యం
కాని వైఎస్ ఆర్ పేదలకు కూడా కార్పొరేట్ వైద్యం అందించాలని తలపెట్టి ఆ స్కీమ్ ను కొనసాగించారు. అప్పట్లో కొన్ని సన్నివేశాలను మాబోటి వాళ్లం చూసి ఆశ్చర్యపోయామంటే అతిశయోక్తి కాదు. ఒకసారి ఒక కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్ళి తిరిగి వస్తూ అక్కడే ఉన్న మెడికల్ షాప్ కు వెళ్లాను. అక్కడ ఒక పేద వృద్దురాలు ఒక కార్డును కౌంటర్ లో ఇచ్చి కొన్ని మందులు తీసుకుంది.
ఇంత వృద్దురాలు, అంతగా చదువు లేని ఈ మనిషి ఇంత పెద్ద ఆస్పత్రికి ఎలా వచ్చిందా? అన్న ఆసక్తి కలిగి ఆరా తీశాను. వైఎస్ ప్రభుత్వం అందించిన ఆరోగ్యశ్రీ కార్డు ఆధారంగా ఆమె వచ్చి డాక్టర్ కు చూపించుకుని మందులు కూడా తీసుకువెళుతోంది. ఆ రకంగా నిరుపేదలకు కూడా కార్పొరేట్ వైద్యాన్ని అందించిన నేతగా వైఎస్ ఆర్ నిలిచిపోయారు.
(చదవండి: మీ స్ఫూర్తి చేయిపట్టి నడిపిస్తోంది నాన్న.. సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్)
బాబుకు ఆనాడే చెప్పారు
ఆయనకు నీటిపారుదల ప్రాజెక్టులంటే ప్రాణం. ఈ మాట ఏదో ఇప్పుడు చెప్పడం కాదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో ఒకసారి హైదరాబాద్ జూబ్లిహాల్ లో ప్రాజెక్టులపై అఖిలపక్ష సమావేశం జరిగింది. లోక్ సభ సభ్యుడిగా అప్పట్లో వైఎస్ ఉండేవారు. ఆ సందర్భంగా వైఎస్ మాట్లాడుతూ పోలవరం తదితర భారీ ప్రాజెక్టులను చేపట్టాలని డిమాండ్ చేస్తూ, అలా చేయకపోతే చరిత్రహీనుడుగా మిగిలిపోతావని హెచ్చరించారు.
అయినా చంద్రబాబు ఆ మాటను సీరియస్ గా తీసుకోలేదు. కాకపోతే ఎన్నికల ముందు ఆయా ప్రాజెక్టులకు శంకుస్థాపన అంటూ హడావుడి చేసేవారు. 1999 ఎన్నికల తర్వాత వైఎస్ శాసనసభలో ప్రతిపక్ష నేత అయ్యారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణానికి చొరవ తీసుకోకపోవడంతో వైఎస్ ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు.
చంద్రబాబు వేసిన శంకుస్థాపన రాళ్ల వద్ద పూలు పెట్టి నిరసన తెలిపేవారు. తదుపరి 2004లో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. వెంటనే ప్రాదాన్యత క్రమంలో ఇరిగేషన్ కు సంబందించి ఒక అధికారిక సమావేశం మంత్రులతో నిర్వహించారు. ఆ సందర్భంగా శర్మ అనే సీనియర్ ఐఎఎస్ అధికారి ఉండేవారు.
ఆయన ఆ సమావేశంలో ఒక నివేదిక ఇచ్చి ప్రజెంటేషన్ ఇచ్చారు. నలభైఆరువేల కోట్ల రూపాయల వ్యయం చేస్తే ఇరవైతొమ్మిది ప్రాజెక్టులను చేపట్టవచ్చని వివరించారు. అప్పట్లో జెసి దివాకరరెడ్డి కూడా వైఎస్ క్యాబినెట్ లో ఉండేవారు. ఇంత పెద్ద నివేదికను చంద్రబాబుకు చూపించలేదా అని అడిగారు.
దానికి ఆ అధికారి సమాధానం ఇస్తూ తాము చూపించామని, కాని అంత ఆసక్తి కనబరచలేదని, దాంతో దానిని పక్కనపెట్టామని చెప్పారు. ప్రభుత్వం చూపే శ్రద్దను బట్టే తాము నివేదికలు ఇస్తామని వ్యాఖ్యానించారు. ఇది వాస్తవమే. చంద్రబాబు సి.ఎమ్. గా ఉన్న రోజుల్లో పోలవరం, పులిచింతల ప్రాజెక్టుల గురించి ఎవరైనా అడిగినా సీరియస్ గా తీసుకునేవారు కారు.
అవి అయ్యే ప్రాజెక్టులు కావని ఆయన భావించేవారు. ఎన్నికలకు ఉపయోగపడవన్నది ఆయన అభిప్రాయం. కాని వైఎస్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచన చేశారు. ఆ రోజు అధికారిక సమావేశం నుంచి బయటకు వచ్చి లిప్ట్ లో కిందకు వచ్చారు. అక్కడ వేచి ఉన్న పాత్రికేయులను ఆయనే వాట్ సర్ అంటూ పలకరించారు.
(చదవండి: అన్నదాత కలల పండుగ!)
అలా మాట్లాడడం ఆయనకు అలవాటు. ఆ క్రమంలో నా వద్దకు కూడా ఆయన వచ్చారు. పోలవరం, పులిచింతల పూర్తి చేస్తారా? సార్ ? అని నేను ప్రశ్నించాను. అవును చేసి చూపిస్తాం సార్ అని జవాబు ఇచ్చారు. అదే విషయాన్ని ఆ తర్వాత తిరుపతి మీడియా సమావేశంలో కూడా వెల్లడించారు.
పట్టు వదలని వైఎస్సార్
అయినా అవి అంత తేలికగా అవుతాయా అన్న సంశయం ఉండేది. కాని వైఎస్ ఆర్ మాత్రం పట్టు వదలిపెట్టలేదు. చంద్రబాబు టైమ్ లో పులిచింతల ప్రాజెక్టును నల్గొండ జిల్లాకు చెందిన కొందరు రాజకీయ నేతలు వ్యతిరేకించేవారు. దాంతో ఆయన గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన టిడిపి నేతలు ఈ ప్రాజెక్టు గురించి అడిగినా, ఇప్పుడు మాట్లాడవద్దంటూ వారిని వారించేవారు.
అదే వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రం సంబంధిత నాయకులను పిలిచి మాట్లాడి ఎవరైనా సహకరించాల్సిందేనని స్పష్టం చేసి పనులు ఆరంభించారు. అదే ఈరోజు కృష్ణా,గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలలోని కొన్ని ప్రాంతాలకు వరదాయిని అయింది. ఈ ఏడాది జూన్ మొదట్లో ఆశించిన మేర వర్షాలు పడలేదు. అయినా పులిచింతల ప్రాజెక్టులో నిల్వచేసిన నీటిని సాగునీటి అవసరాలకోసం ప్రభుత్వం విడుదల చేయగలిగింది.
మహానేత ముందు చూపు
పోలవరం ప్రాజెక్టు ఈ రోజు ఈ స్వరూపం సంతరించుకోవడానికి కారణం వైఎస్ ఆర్ అని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. ఆయన పోలవరంపై అఖిలపక్షం పెట్టి దాని ఆనుపానులను చర్చించారు. అంతేకాదు. ఖమ్మం జిల్లాలో, పశ్చిమగోదావరి జిల్లాలో ముంపు ప్రాంతవాసులకు, నిర్వాసితులకు అప్పట్లో మంచి ప్యాకేజీ ప్రతిపాదించి ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్ళారు.
ఆ తర్వాత కేంద్రం నుంచి ప్రాజెక్టుకు రావల్సిన అనుమతులు సంపాదించడంలో నిర్విరామకృషి చేశారు. అవన్ని ఒక రూపానికి వచ్చిన దశలో, ప్రాజెక్టు పనులు ఆరంభించబోయే టైమ్ కు ఆయన దురదృష్టవశాత్తు కన్నుమూశారు. అయినా ఆయన కలలు కన్న పోలవరం ఇప్పుడు సాకారం అవుతోంది.
పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రాజెక్టుగా రాష్ట్ర విభజన సమయంలో ఒప్పుకోవడానికి అప్పటికే అన్ని అనుమతులకు ఓకే కావడం కూడా కారణం అని చెప్పాలి. అప్పట్లో పోలవరం కుడి, ఎడమ కాల్వల తవ్వకం చేపట్టి విశాలమైన కాల్వలను నిర్మించారు. ప్రాజెక్టు లేకుండా కాల్వలేమిటని అప్పట్లో టిడిపి విమర్శించేది.
కాని వైఎస్ దూరదృష్టి ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది. చంద్రబాబు టైమ్ లో పట్టిసీమ లిప్ట్ ను చేపట్టగలిగారంటే దానికి కారణం వైఎస్ తవ్వించిన కాల్వే. ఈ రోజుల్లో ఈ కాల్వలకు భూ సేకరణ చేయాలంటే ఎంతో కష్టం అయ్యేది. ఈ రకంగా ఆయన చేసిన మేలును విభజిత ఆంద్రప్రదేశ్ ఎన్నటికి మరవదు.
అదే కాదు. వెలిగొండ, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ.. వాటన్నిటిపై ఎన్నో రకాలుగా విపక్షాలు అడ్డు తగలడానికి ప్రయత్నించినా ఆయన లెక్క చేయలేదు. అవే ఇప్పుడు ఎపికి ప్రాణపదంగా మారాయి. హైదరాబాద్ అభివృద్దికి అవుటర్ రింగ్ రోడ్డు ఎంతగా ఉపకరిస్తోందో చెప్పనవసరం లేదు. దానికి పునాదిరాయి వేసింది వైఎస్ ఆరే. భూ సేకరణ జరిపించింది ఆయనే.
ప్రధానిని ఒప్పించిన వైఎస్సార్
రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని వాదించి ఆనాటి ప్రధానిని ఒప్పించిన ఘనత కూడా వైఎస్ దే. చంద్రబాబు నాయుడు టైమ్ లో హైటెక్ సిటీ పేరుతో ఒక భవనం నిర్మించి మొత్తం హైదరాబాద్ నగరాన్ని తానే కట్టానని ప్రచారం చేసుకుంటారు. కాని వైఎస్ హయాంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తో సహా అనేక ఐటి పరిశ్రమలు ఆయన టైమ్ లో వచ్చాయి.
కాని కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని తనకు అనుకూలంగా ప్రచారం చేసుకోవడంలో విఫలం అయింది. అంతేకాక సోనియాగాంధీ మాట వినలేదన్న కక్షతో ఏకంగా వైఎస్ కుమారుడైన జగన్ స్థాపించిన పరిశ్రమలలో పెట్టుబడులపై పిచ్చి ఆరోపణలతో కేసులు పెట్టించి జైలులోకూడా నిర్భందించారు. దాని ఫలితమే ఇప్పుడు కాంగ్రెస్ అనుభవిస్తోంది.
రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పదేళ్లుగా అధికారం లేకుండా పోయింది. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రావాలని చాలా కష్టపడుతోంది. ఎపిలో అయితే ఆ ఆశ కూడా లేదు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, పట్టణాలలో రాజీవ్ గృహకల్ప వంటి స్కీములు చేపట్టారు. జిల్లా కేంద్రాలన్నిటిలో రోడ్లకు ఒక షేప్ తెచ్చి అందంగా తయారు చేయించడంలో ఆయన ప్రభుత్వ కృషి ఎంతగానో ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.
అడిగితే కాదనని నేత
వ్యక్తులుగా తనను కలిసినవారిపట్ల ఆయన ఎంతో ఆదరణ చూపించేవారు. ఉదాహరణకు పులివెందుల నుంచి నీరుకావి పంచె కట్టిన ఒక సామాన్య రైతు వచ్చి సెక్రటేరియట్ లో వైఎస్ ను కలిశారు. ఆయన తన ఇంటిలో పెళ్లికి ఆర్ధికసాయం అడిగారు. వెంటనే వైఎస్ ఎవరికో పోన్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత ఒక స్టార్ హోటల్ వద్దకు వెళ్లి డబ్బు తీసుకోవాలని సిబ్బంది చెప్పారు.
ఆ రైతు అక్కడకు వెళ్లారు. ఆయన వెళ్లి ఒక పారిశ్రామికవేత్తను కలిసి సార్ వెళ్లమన్నారని చెప్పగా ఆయన ఆశ్చర్యపోయారు. ఇదేమిటి ఈ వ్యక్తికి ఐదు లక్షలు ఇవ్వడమా అని అనుకున్నారు. అసలు ఎందుకు ఈ డబ్బు వాడాలని అనుకుంటున్నది అడిగాడు. దానికి తన ఇంటిలో పెళ్లి గురించి ఆ రైతు చెప్పగానే చాలా సంతోషంగా ఆ పారిశ్రామికవేత్త డబ్బు అందచేశాడు.
ఈ విషయాన్ని ఆ తర్వాత రోజుల్లో ఒక ప్రముఖుడు నాకు చెప్పారు. ఇలా ఒకటికాదు. ఉదయాన్నే ప్రజాదర్బార్ లో విన్నపాలు ఇవ్వడానికి వచ్చేవారందరిని పలకరించి వారి సమస్యలు వినేవారు. ఒకసారి ఒక వ్యక్తిని చూసి ఇదేమిటి మీరు ఇక్కడ ఉన్నారు అని అడిగారు. మిమ్మల్ని కలవడానికే వచ్చానని అతను చెప్పారు. వెంటనే ఆయనను క్యాంప్ ఆఫీస్ లోని ఒక గదిలో కూర్చోబెట్టమన్నారు.
దర్బార్ ముగిసిన తర్వాత ఆయన వద్దకు వెళ్లి మాట్లాడారు. ఆయన ఆర్దికసాయం కోసం వచ్చారు. ఆ వివరాలు తెలుసుకుని తను చేయదగిన సాయం చేశారు. ఇంతకీ ఆయన ఎవరంటే వైఎస్ కు క్లాస్ మేటే. తెనాలి నుంచి వచ్చిన ఆయనను అంత ఆదరంగా చూసి పంపించారు. ఇలా ఎన్నో ఘట్టాలు వైఎస్ చరిత్రలో ఉన్నాయి.
ఆ 30 సీట్లు ఎంతో కీలకం
ఇక రాష్ట్ర విభజనపై ఆయన అభిప్రాయాలు అందరికి తెలిసినవే. అందులో రాజకీయ కోణాలు ఎలా ఉన్నా, వైఎస్ జీవించి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదన్నది ఎక్కువ మంది నమ్మకం. 2009 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించి మొత్తం బాధ్యతను తన భుజ స్కందాల మీద వేసుకుని పార్టీని గెలిపించారు.
అప్పట్లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రెండుసార్లు అధికారంలోకి రాగలిగిందంటే ఎపి నుంచి వచ్చిన ముప్పైకి పైగా లోక్ సభ సీట్లు ఎంత కీలకం అయ్యాయో చెప్పనక్కర్లేదు. అసెంబ్లీ కి వచ్చేసరికి కాంగ్రెస్ కు 156 సీట్లే వచ్చాయి. అధికారం వచ్చినా ఆ సీట్ల సంఖ్య తనకు సంతృప్తి కలిగించలేదు. అందుకే తనకు ప్రజలు పాస్ మార్కు మాత్రమే ఇచ్చారని, వచ్చేసారి ఫస్ట్ క్లాస్ తెచ్చుకునేలా పాలన చేస్తానని నిజాయితీగా తన అభిప్రాయాన్ని వైఎస్ ఆర్ చెప్పారు.
ఒక నేత లేకుంటే రాష్ట్రం ఎన్ని గండాలను ఎదుర్కుంటుందో చెప్పడానికి ఆ రోజుల్లో చాలా మంది వైఎస్ లేని లోటు గురించి ఉదహరించేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ ప్రస్తుతం విభజిత ఎపిలో అంతకు మించిన పాలన అందించడమే కాదు. వైఎస్ ఆర్ ను నిత్యం జనం గుండెల్లో ఉండేలా చేస్తూ, ఆయన జయంతిని ఒక పండగలా మార్చారు. ఏ కుమారుడు తన తండ్రికి ఇంతకన్నా గొప్ప నివాళి అర్పించలేడని రుజువు చేసుకుంటున్నారు.
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment