వైఎస్‌ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది పనులు గమనిస్తే ఎంతో చూడముచ్చటేసింది. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పులివెందులకు మహర్దశ పట్టిందని చెప్పాలి. ఎక్కడో విసిరేసినట్లు ఉండే పులివెందుల అభివృద్దికి సెంటర్ పాయింట్ అయ్యింది. అభివృద్ది అంటే ఇలా ఉండాలని అన్నంతగా ఆయన దాని తీరు తెన్నులు మార్చేశారు. అధికారిక హోదాలో అక్కడ పర్యటించిన నాకు ఎన్నో విషయాలు తెలిశాయి. రాజశేఖరరెడ్డి అభివృద్దికి బాటలు వేస్తే, ప్రస్తుత ముఖ్యమంత్రి,వైఎస్ కుమారుడు అయిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దానిని పరుగులు పెట్టిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బహుశా ఏ నగరంలోకాని, ఏ పట్టణంలో కాని భూగర్భ డ్రైనేజీ పూర్తి స్థాయిలో ఉండకపోవచ్చు.కాని పులివెందులలో మాత్రం పట్టణం అంతా అండర్ గ్రౌండ్ డ్రేనేజీ. ఎక్కడా మురుగు కాల్వలు కనిపించలేదు.
ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే కాదు.. ఆనందించవలసిన విషయమే. ఏపీలో అన్ని పట్టణాలు ఇలా తయారయితే రాష్ట్ర రూపురేఖలే మారిపోతాయి. కాని అది అంత తేలిక కాదని తెలుసు. ఒకప్పుడు పులివెందులలో నీటి సమస్య ఉండేది. కాని ఇప్పుడు నీటి కొరత లేదు. ఒక జర్నలిస్టు మిత్రుడు దాని గురించి ఇలా చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు మీడియాతో మాట్లాడుతూ గండికోటకు నీటిని సొరంగ మార్గం ద్వారా నీటిని తెచ్చి, అక్కడ నుంచి లిఫ్ట్‌లు పెట్టి పులివెందులకు నీరు ఇవ్వాలి...తాను ముఖ్యమంత్రి అయితే అలా చేస్తానని చెప్పారట. దాని విన్న జర్నలిస్టులకు ఇదెలా సాధ్యమన్న ప్రశ్న వచ్చింది. వారెవరూ దీనిని నమ్మలేదట. వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే తను ప్లాన్ చేసిన విధంగా నీటిని పులివెందులకు తరలించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యాయని ఆ జర్నలిస్టు మిత్రుడు వివరించారు.
తదుపరి అప్పట్లో అనుమానాలు వ్యక్తం చేసిన జర్నలిస్టులను ఉద్దేశించి ఇప్పుడు మీ సందేహం తీరిందా అని అడిగారట. పులివెందుల చుట్టూ ఉన్న అవుటర్ రింగ్ రోడ్డును చూసి తీరవలసిందే. ఎటు వెళ్లాలన్నా చాలా తేలికగా వెళ్లడానికి అనువుగా ఈ డబుల్ రోడ్డు నిర్మాణం జరిగింది.అందువల్లో ఆయా రింగ్ రోడ్డు కూడళ్లలో వైఎస్ విగ్రహాలను రకరకాల రూపాలలో ఏర్పాటు చేశారు. ఒక చోట పాదయాత్ర చేస్తున్న దృశ్యం ,మరోచోట ఆయన చేయి ఎత్తి ప్రజలకు అభివాదం చేస్తున్నట్లు ఇలా పలు విగ్రహాలు ఉన్నాయి. ఈ అవుటర్ రింగ్ రోడ్డు చూడగానే హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డే గుర్తుకు వస్తుంది. పులివెందుల చుట్టూరా ఈ రింగ్ రోడ్డును ఆధారంగా చేసుకుని పలు అభివృద్ది పనులు చేపట్టారు.
కొన్ని పరిశ్రమలు వచ్చాయి. ప్రభుత్వానికి సంబంధించిన పరిశోధన సంస్థలు ఏర్పాటయ్యాయి.జెఎన్ టియు, త్రిబుల్ ఐటి ,స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణం జరుగుతోంది.ఇక్కడ ఆర్టిసి బస్ స్లాండ్ అత్యంత అధునాతనంగా రూపొందించారు. ఎయిర్ పోర్టులో మాదిరి సదుపాయాలు ఉండాలన్నది జగన్ ఆకాంక్ష అని మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ చెప్పారు.కొన్నిచోట్ల గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, డిజిటల్ లైబ్రరీ, హెల్త్ క్లినిక్ మొదలైనవాటిని ఒకే చోట ఒక కాంపౌండ్ లోనే నెలకొల్పారు. రాణిగారి తోట ప్రదేశాన్ని నగర వనంగా అభివృద్ది చేశారు. అసలు ఒకప్పుడు నీళ్లే దొరకని పులివెందులలో ఒక కాల్వను వినియోగంలోకి తెచ్చి పడవలు నడుపుతూ టూరిజంగా మార్చారు. జగనన్న కాలనీ పేరుతో ఎనిమిదివేల ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇవి పూర్తి అయితే పులివెందులలో ఇల్లు లేనివారు ఉండరని వరప్రసాద్ తెలిపారు.
అక్కడ క్రికెట్‌కు ప్రత్యేక స్టేడియం ఏర్పాటవుతోంది. హాకికి టర్ఫ్ గ్రౌండ్ రూపొందించారు. దీనిని అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో స్థాపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మార్కెట్ యార్డును ఆధునిక వసతులతో తయారు చేస్తున్నారు. ఒక మాల్, ఐదు ధియేటర్లతో కూడిన సిటీ సెంట్రల్ మాల్ తయారవుతోంది.ప్రభుత్వం నాడు-నేడు కింద ఆధునీకరించిన స్కూల్ లో విద్యార్థుల సంఖ్య డబుల్ అయింది. అక్కడ అడ్మిషన్లు దొరకడం కష్టంగా మారి, రాజకీయ నేతలపై ఒత్తిడులు వస్తుంటాయి. వైఎస్ కుటుంబం నడుపుతున్న వెంకటప్ప స్కూల్ కూడా ప్రాచుర్యం పొందింది. మానసిక వికలాంగుల కోసం ప్రత్యేక పాఠశాల ఉంది. మెడికల్ కాలేజీ శరవేగంగా రెడీ అవుతోంది.
స్థానిక ఆస్పత్రిని అభివృద్ది చేసిన తర్వాత అక్కడికి వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. లైవ్ స్టాక్ పరిశోధన సంస్థ, ప్రకృతి సేద్యం రీసెర్చ్ సెంటర్ ఇలా అనేకం అక్కడ ఉన్నాయి. టెక్స్ టైల్ పరిశ్రమ గత ఇరవై ఏళ్లుగా నడుస్తోంది. అపాచీ సంస్థ యూనిట్ రాబోతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే అక్కడ అభివృద్ది అందరిని అబ్బురపరుస్తాయి. ఇడుపులపాయలో వైఎస్ సమాధి ప్రజల సందర్శన కేంద్రంగా మారింది. మేము కూడా అక్కడికి వెళ్లినప్పుడు సుమారు వంద మంది ప్రజలు కనిపించారు. ముఖ్యంగా వారిలో పేదలు ఎక్కువ మంది ఉన్నారు. తాము వైఎస్ అభిమానులమని తెలిపారు. ప్రతి రోజు వెయ్యి నుంచి పదిహేను వందల మంది వరకు వస్తుంటారని , కొందరైతే సమాధి వద్ద కూర్చుని విలపిస్తుంటారని అక్కడ ఉన్న భద్రత సిబ్బంది తెలిపారు. పేదల గుండెల్లో వైఎస్ నిలిచిపోయారంటే ఇదే కదా అని అనిపించింది. జగన్‌మోహన్‌రెడ్డి సైతం తండ్రి దారిలో నడుస్తూ పలు అభివృద్ది పనులు చేపట్టడంపై అక్కడ సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment