ఆంధ్రప్రదేశ్‌కు ఆయన దాదాపు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి ఆయన సుమారు 35 ఏళ్లు ఎమ్మెల్యే. అందువల్ల కుప్పం అద్భుతమైన ప్రగతి సాధించి ఉంటుందని ప్రజలు అనుకోవచ్చు. కానీ కుప్పం వెళ్లి చూస్తే పనికి తక్కువ ప్రచారానికి ఎక్కువ అన్నట్లుగా అర్థమవుతుంది. మీడియా అకాడమీ చైర్మన్ హోదాలో నేను ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గాన్ని.. అలాగే కుప్పం ఎమ్మెల్యే అయినా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంను పరిశీలిద్దామని వెళ్లాను. పులివెందుల-కుప్పం మధ్య పోల్చి ఎవరి అభివృద్ధి ఎలా ఉంది అనేది విశ్లేషించాలన్నది నా ఈ ప్రయత్నం.
ఈ రెండిటిలో పులివెందుల అభివృద్ధి అద్భుతంగా ఉందనిపిస్తుంది. అదే టైంలో కుప్పం ప్రగతి జరగలేదని చెప్ప జాలం. కానీ.. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నియోజకవర్గం ఆ స్థాయిలో అభివృద్ధి చెందలేదని మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే పులివెందులలో సైలెంట్‌గా పనులు జరిగితే.. కుప్పంలో మాత్రం అభివృద్ధి కన్నా ప్రచారానికే అధిక ప్రాధాన్యం లభించినట్లు తెలుస్తుంది.
✍️ వైఎస్సార్ జిల్లాలో పులివెందుల ఒక మూల ఉంటుంది. దానికి సమీపంలోనే బెంగళూర్ చెన్నై లాంటి నగరాలు గాని ఇతర రాష్ట్రాల సరిహద్దులు గాని ఉండవు. కుప్పం కూడా చిత్తూరు జిల్లాలో ఒక మూలకున్నట్టుగా అనిపించినా.. బెంగళూరుకు అతి సమీపంలో, అలాగే తమిళనాడుకి దగ్గరలో ఉండడం తోటి అదొక సెంటర్ పాయింట్గానే ఉందని చెప్పాలి. అలాంటి చోట చంద్రబాబునాయుడు అనేక పరిశ్రమలను తీసుకొని వచ్చి ఉండాలి. కానీ అక్కడ అసలు పారిశ్రామిక ప్రగతి అన్నదే తు.. తూ.. మంత్రంగానే ఉన్నది.
✍️అలాగే అనేక విద్యా సంస్థలను కూడా నెలకొల్పి ఉండవచ్చు. కానీ కేవలం ప్రైవేట్ రంగంలో ఒక మెడికల్ కళాశాల ఒక ఇంజనీరింగ్ కళాశాల వంటివి మాత్రం కనబడ్డాయి. కాకపోతే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చిన ద్రావిడ విశ్వవిద్యాలయం మాత్రం ఉంది. అక్కడ 1600 ఎకరాల స్థలం ఉన్న దాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు చాలా తక్కువ మంది విద్యార్థులు ప్రస్తుతం అక్కడ అభ్యసిస్తున్నారు. దానికి కారణం కోర్సులు తక్కువగా ఉండడమే. దాన్ని జనరల్ యూనివర్సిటీగా కూడా మార్చి మరింత వెలుగులోకి తీసుకురావాలని అక్కడ స్థానికులు ఎప్పటినుంచో కోరుతున్నారు.
ఇక కుప్పం వేరే కార్యక్రమాలు చూస్తే.. కుప్పానికి రింగ్ రోడ్ ఒకటి ప్రతిపాదించి చంద్రబాబు తన సమయంలో దాన్ని పూర్తి చేయలేకపోయారు. దానితోటి అది ఉపయోగంలోకి రాకుండా పోయింది. పైగా ప్రతిపాదిత రింగ్ రోడ్డు సమీపాన తెలుగుదేశం నేతల భూ దందా కూడా సాగిందట!. ఒక మాజీ మంత్రి అక్కడ ముందస్తుగానే పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని కొందరు చెబుతున్నారు. కుప్పానికి ప్రధానమైన సమస్యలలో సాగునీరు తాగునీరు కొరత ఉంది. అయితే.. హంద్రీనీవా ద్వారా నీటిని తీసుకువెళ్లాలని గతంలో ప్రభుత్వాలు ప్రయత్నించాయి. రాజశేఖర్ రెడ్డిది ఒరిజినల్ స్కీం. ఆ స్కీం లేకపోతే కుప్పానికి నీరు వచ్చే అవకాశం లేదు.
✍️ చంద్రబాబు 1995 నుంచి 2004 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో దానికి సంబంధించి పెద్ద కదలిక లేదు. 2014 నుంచి 2019 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేగంగా కాలువ పనులు చేపట్టి పథకానికి అవసరమైన లిఫ్ట్‌ను కూడా పూర్తి చేసి ఉంటే.. ఈపాటికే కుప్పంకు నీరు వచ్చుండేది. తద్వారా ఆయన ప్రజల అభిమానాన్ని చూరకొనేవారు. కానీ, దురదృష్టవశాత్తు ఆ పని చేయలేకపోయారు. ఇప్పుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాత్రం కుప్పానికి నీటిని తీసుకురావడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దీనిని పూర్తి చేయగలిగితే ప్రతిపక్ష నేత నియోజకవర్గానికి నీరిచ్చిన ఘనత జగన్‌కు దక్కుతుంది. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రచారం హడావిడి చేసారు. అంతేతప్ప వాస్తవానికి నీరు రాలేదు. కాకపోతే అప్పట్లో అక్కడ కాంట్రాక్టు చేసిన ఒక టీడీపీ ఎంపీకి బాగా గిట్టుబాటు అయిందని చెబుతారు.
✍️ ఇక సంక్షేమ కార్యక్రమాల విషయానికి వస్తే చంద్రబాబు టైం లో అమలు చేసిన స్కీములకన్నా కనీసం ఐదారు రెట్లు జగన్ పాలనలో ప్రజలు లబ్ధి పొందారు. ఒక్క కుప్పం పట్టణంలోనే అమ్మబడి చేయూత పలు స్కీముల కింద 100 కోట్లు ప్రజలు పొందారు కుప్పంలో ఇది ఒక రికార్డు గాని భావించాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అన్నేళ్లు ఉన్నప్పటికీ అక్కడ ప్రభుత్వ స్కూళ్లను బాగు చేయాలన్న ఆలోచన చేయలేదు.
కుప్పం సెంటర్ లోనే ఉన్న ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎంతో అధ్వాన్నంగా ఉండేది. దాన్ని ఇప్పుడు జగన్ ప్రభుత్వం నాడు-నేడు కింద పూర్తిగా మార్చివేసి అభివృద్ధి అంటే ఇది అని ప్రజలకు తెలియచెప్పింది. ఆ స్కూలుకు ఇప్పుడు వెళ్లి చూస్తే మంచి బల్లలు మంచి ఆహారం ఇతర సదుపాయాలతో కళకళలాడుతోంది. అక్కడ టాయిలెట్లు ఫైవ్ స్టార్ హోటల్లో టాయిలెట్ల రేంజ్ లో ఉన్నాయంటే ఆశ్చర్యం కాదు. రాష్ట్రవ్యాప్తంగా వీటిని ఒకే తరహాలో అభివృద్ధి చేస్తున్నారు జగన్.
✍️ అంతేకాదు.. ఆ మధ్య కుప్పం వెళ్లి సుమారు 70 కోట్ల మేర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి వచ్చారు. పేదలకు ఇళ్ల నిర్మాణంలో కూడా జగనే ముందంజలో ఉన్నారు. చంద్రబాబు టైంలో కేవలం అతి తక్కువ మందికి మాత్రమే ఇళ్లు ప్రభుత్వపరంగా లభించగా.. ఇప్పుడు 800 లకు పైగా ఇళ్లను జగన్ ప్రభుత్వం నిర్మిస్తోంది. తెలుగుదేశం టైంలో ఎంత ప్రయత్నం చేసినా ఇంటి జాగా ఇవ్వలేదని.. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే కులం, మతం, పార్టీ వంటివి చూడకుండా అర్హులైనటువంటి వారికి ఇచ్చారని కొందరు లబ్ధిదారులు చెప్పారు. కుప్పాన్ని పులివెందులని పోల్చి చూస్తే పులివెందుల అభివృద్ధి ముందు.. కుప్పం అసలు నిలబడలేదు.
✍️ ఎందుకంటే.. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయ్యాక పులివెందుల అభివృద్ధికి పునాదులు వేయడమే కాకుండా పరుగులు పెట్టించారు. అక్కడ రింగ్ రోడ్లు పలు పరిశోధనా సంస్థలు విద్యాసంస్థలు పరిశ్రమలు నైపుణ్య అభివృద్ధి సంస్థ తదితర ఎన్నో సంస్థలు అక్కడ కనిపిస్తాయి. నగరవనం పేరిట ఏర్పాటు చేసిన పార్కు అందరిని ఆకర్షిస్తుంది. ఇప్పుడు కొత్తగా నిర్మించిన బస్టాండ్ ఒక కొత్త ఆకర్షణగా మారింది. మార్కెట్ యార్డునూ ఆధునికరించారు. ఇవేవీ కుప్పంలో జరగలేదు. కుప్పం పులివెందుల రెండిటికీ నీటి సమస్య ఉన్నా వైఎస్సార్ చూపించిన చొరవతో సొరంగ మార్గం ద్వారా గండికోట వరకు నీరు తెచ్చి అక్కడి నుంచి లిఫ్టులు కూడా అమలు చేసి పులివెందులకు నీరు ఇచ్చి చూపించారు. అదే చంద్రబాబు కుప్పంలో కాలవలు కూడా పూర్తి చేయలేకపోయారు.
పులివెందుల బస్టాండ్
✍️ పులివెందులలో కూడా నాడు నేడు కింద అభివృద్ధి చేసిన స్కూలు చూస్తే ముచ్చట వేస్తుంది. పులివెందులలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంటే.. కుప్పంలో అలా లేదు. ఒకప్పుడు చంద్రబాబు వ్యవసాయ రంగంలో ఇజ్రాయిల్ టెక్నాలజీ అంటూ హడావిడి చేశారు. కానీ అది ఇప్పుడు ఏమైందో తెలియదు. గత టర్మ్‌లో ఆ ఊసే వచ్చినట్టుగా లేదు. అయితే కుప్పంలో బోగస్ ఓటర్ల విషయంలో మాత్రం తెలుగుదేశందే రికార్డ్ అని చెబుతున్నారు. ఇప్పటికే సుమారు 17 వేల బోగస్ ఓట్లు తొలగించినా.. ఇంకా ఉన్నాయని, పైగా తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల వారిని కూడా చేర్చిన ఘనత టీడీపీదేనని వైఎస్సార్‌సీపీ విమర్శిస్తోంది.
ముఖ్యమంత్రి జగన్ కుప్పంకిచ్చిన ప్రాధాన్యతతో ఎన్నో పనులు చేపట్టామని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ వివరించారు. దానికి తోడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం పై ప్రత్యేక దృష్టి సారించారని.. అందువల్లే వైఎస్సార్‌సీపీ స్థానిక ఎన్నికలలో ఘన విజయం సాధించిందని చెప్పారు. పులివెందుల మున్సిపల్ ఎన్నికలలో మొత్తం ఏకగ్రీవంగా వైసిపి మున్సిపాలిటీని కైవసం చేసుకుంటే చంద్రబాబు తన మున్సిపాలిటీలో ఓటమికి గురి అయ్యారు. దానితో అసెంబ్లీ ఎన్నికలలో ఏమవుతుందో అన్న భయం ఆయనను వెంటాడుతుండగా.. పులివెందులలో జగన్ నిబ్బరంగా ముందుకు సాగుతున్నారు. పులివెందులలో సైలెంట్ గా అభివృద్ధిని చేసి చూపిన ఘనత రాజశేఖర్ రెడ్డి.. ఆ తరువాత జగన్‌లకు దక్కితే.. చంద్రబాబు అట్టహాసం ప్రచార ఆర్భాటంతో కుప్పం ప్రజల్ని భ్రమల్లో ఉంచుతున్నారన్న విషయం ఈ పరిశీలన ద్వారా ఎవరికైనా అర్థమైపోతుంది.
కుప్పంలో ప్రచార ఆర్భాటం.. పులివెందులలో ప్రగతిపై విశ్లేషణ
::: కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment