అభిప్రాయం
పులివెందుల ప్రజల గురించీ, ఇక్కడి సంస్కృతి గురించీ అభ్యంతరకరంగా మాట్లాడ్డం ఇవ్వాళ ప్రతి ఒక్కరికీ అలవాటు అయిపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ ప్రాంత ప్రజల పట్ల విషం కక్కడం పెరిగిపోయింది. ఇక్కడ జరిగే రాజకీయ సంఘటనలన్నింటికీ మొత్తం పులివెందుల ప్రజలనూ, ఆ ప్రాంతాన్నీ, సంస్కృతినీ తప్పుపడుతూ మాట్లాడుతున్నారు.
ఇప్పటికే పులివెందుల ప్రజల పట్ల మిగతా ప్రాంతాల్లో ఒక చెడు అభిప్రాయాన్ని కలిగించడంలో మీడియా, సినిమా వాళ్లూ, రాజకీయనాయకులూ సఫలీకృతమయ్యారు. ఇప్పుడు సోషల్ మీడియా కూడా తోడవడంతో చివరికి ఈ ధోరణి ఎక్కడికెళ్లి ఆగుతుందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. నిజానికి ఈ ముద్ర మొత్తం రాయలసీమకు ఉంది. ఇక్కడ లేని జీవితాన్ని ఇక్కడిదిగా చూపించి డబ్బు చేసుకోవడంలో సినిమా వాళ్లు ముందున్నారు. ఇవ్వాళ ఏ సినిమా రంగమైతే రాయలసీమనూ... అందులోనూ పులివెందుల వంటి ప్రాంతాలనూ నేరపూరితంగా చూపిస్తూ ఉందో, ఆ రంగానికి ఇక్కడి ప్రజలు చేసిన సేవ అంతా ఇంతా కాదు.
సినిమారంగంలో మొత్తం దక్షిణ భారతదేశంలోనే తొలి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన బీఎన్ రెడ్డి పులివెందుల ప్రాంతం వాడే. ఈయన తీసిన ‘స్వర్గ సీమ’, ‘బంగారు పాప’, ‘మల్లీశ్వరి’ వంటి సినిమాలు కళాఖండాలు. ‘వాహిని’ సంస్థను స్థాపించి ఈయన సృష్టించిన చిత్రరాజాలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచే వచ్చిన బి. నాగిరెడ్డి కూడా సినీ రంగానికి ఎంతో సేవ చేశారు. విజయా సంస్థను ప్రారంభించి ఈయన నిర్మించిన ‘పాతాళ భైరవి’, ‘మాయా బజార్’, ‘గుండమ్మ కథ’, ‘మిస్సమ్మ’, ‘షావుకారు’ వంటి సినిమాలు అజరామరమైనవి.
పత్రికా రంగంలోనూ బి. నాగిరెడ్డి అపార కృషి చేశారు. చక్రపాణితో కలసి ‘చందమామ’ పత్రికను ప్రారంభించారు. అప్పటి తరం పిల్లలు చందమామ చదవకుండా పెరగలేదంటే అతిశయోక్తి కాదు. మోరార్జీ దేశాయ్ వంటి మాజీ ప్రధాని కూడా బి. నాగిరెడ్డిని చందమామతోనే గుర్తు పెట్టుకుని ‘చందమామ రెడ్డిగారు’ అని పిలిచేవారట. తర్వాత ఆయన మహిళల కోసం ‘వనిత’, సినిమా పాఠకుల కోసం ‘విజయ చిత్ర’ వంటి పత్రికలను నడిపారు.
అలనాటి హాస్య నటుడు పద్మనాభం, ‘షో’ చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు పొందిన నీలకంఠ వంటి వారు కూడా ఈ ప్రాంతం వారే. ఇక్కడ పుట్టిన రచయితలు మొదటి నుంచి అభ్యుదయ వాదులు. తమ రచనల్లో మానవత్వం, స్త్రీ హక్కులు, రైతు జీవితం, సామరస్య భావాల గురించి రాశారు. ‘తెలుగునాట భక్తి రసం తెప్పలుగా పారుతోంది – డ్రైనేజి స్కీము లేక... డేంజరుగా మారుతోంది’ అన్న ప్రముఖ హేతువాద జర్నలిస్టు గజ్జల మల్లారెడ్డి ఇక్కడి వాడే. తెలుగు సాహిత్య విమర్శ దిగ్గజం రాచమల్లు రామచంద్రారెడ్డి, కథకులు వైసీవీ రెడ్డి, నాద మునిరాజు, అరవేటి శ్రీనివాసులు, కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కారం పొందిన వేంపల్లె షరీఫ్ వంటి వాళ్లు ఇక్కడివాళ్లే.
ఎక్కువమంది వ్యవసాయం చేసి బతుకుతారు. ఒకప్పుడు చిరుధాన్యాలతోపాటు వేరుశనగ విపరీతంగా పండేది. ఇప్పుడు రైతులు చీని, నిమ్మ తోటలను
పెంచుతున్నారు. వందల అడుగుల లోతులో బోర్లు వేస్తే కానీ నీళ్లు పడని స్థితి. తమతోపాటు పొలాల్లో పనిచేసి తమకింత తిండి పెట్టే మూగజీవాలను ఇక్కడివాళ్లు ఇంటి మనుషుల కిందే చూసుకుంటారు. అవి చనిపోతే మనుషులతో సమానంగా అంత్యక్రియలు చేస్తారు.
మధ్యాహ్నం ఇంటికొచ్చిన అతిథికి అన్నం పెట్టకుండా పంపరు. ఆడపిల్లలందరినీ వాళ్ల వయసుతో నిమిత్తం లేకుండా గౌరవంగా ‘అమ్మా’ అని పిలుస్తారు. అత్యంత గౌరవ మర్యాదలకూ, సున్నితత్వానికీ, సహ జీవన సంస్కృతికీ నెలవు ఇక్కడి నేల. అందుకే ఇక్కడి నుంచి అంతమంది కళాకారులు రాగలిగారు. పెద్దన లాంటి వాళ్లు ‘ఇక్కడ పుట్టిన చిగురు కొమ్మయినా చేవే’ అన్నారంటే ఇదే కారణం.
అదంతా వదిలేసి కేవలం కళ్లముందు జరుగుతున్న కొన్ని రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని మొత్తం ఇక్కడి వాళ్లంతా దుర్మార్గులు అన్నట్టు, ఇక్కడి సంస్కృతి అంతా ఆటవిక సంస్కృతి అన్నట్టు రాజకీయనాయకులు మీడియాలో మాట్లాడుతున్నారు. నిజానికి రాజకీయ స్వభావమూ, ప్రాంతీయ స్వభావమూ ఒకటి కాదు.
ఏ ప్రాంతంలో అయినా రాజకీయం అన్నింటికీ అతీతమైంది. దానికి ఎల్లలు లేవు. అది పెట్టుబడి దారులతో కలసి దేశవ్యాప్తంగానే అన్ని రకాల వ్యవస్థలనూ, మానవీయ విలువలనూ ధ్వంసం చేస్తోంది. ఒక దశలో ప్రజాస్వామ్యానికి మూల సూత్రమైన ప్రజలను సైతం నిర్లక్ష్యం చేసి కేవలం డబ్బు, ప్రలోభాలు, బెదిరింపులతో అధికారం చేపట్టే దశకు వచ్చింది.
ఇలాంటి రాజకీయాల్లో ఎవరూ ప్రశ్నలు, విమర్శలకు అతీతులు కాదు. అయితే ఆ ముసుగులో తమకు గిట్టని లేదా ఓటేయని ప్రాంతాలను ఆ యా స్థానిక రాజకీయ నాయకుల చర్యలతో కలిపి నిందించడం కరెక్టు కాదు. ముఖ్యంగా పులివెందుల నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు కడప ఎంపీగా,
రెండు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి, తరువాత వచ్చిన ఆయన తనయడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది.
జగన్‌పై రాజకీయ విమర్శలు చేయాల్సి వచ్చినప్పుడల్లా ఒక వర్గం మీడియా, నేతలు మొత్తం పులివెందుల ప్రాంతాన్నీ, అక్కడి ప్రజలనూ నిందిస్తూ మాట్లాడుతున్నారు. విచక్షణతో రాజకీయ విమర్శలను రాజకీయాలకు లేదా రాజకీయ వ్యక్తుల వరకే పరిమితం చేస్తే బావుంటుంది. అలా కాకుండా పరిస్థితి ఇలాగే కొనసాగితే పులివెందుల ప్రాంత ప్రజలు, ప్రజా సంఘాల వాళ్లు తగిన కార్యాచరణతో సదరు మీడియా, రాజకీయ నేతల ధోరణికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సి వస్తుంది.
– డా‘‘ వేంపల్లె షరీఫ్
జర్నలిస్టు, రచయిత ‘ 96034 29366
Comments
Please login to add a commentAdd a comment