Interest-free loans to farmers
-
రైతన్నల ఆత్మాభిమానమే నా లక్ష్యం
సాక్షి, అమరావతి : రైతన్నలు ఆత్మాభిమానంతో జీవించేలా చేయడమే తన లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. అన్నదాతలు పండించిన ప్రతి గింజకూ న్యాయం జరగాలన్నదే తన ధ్యేయమని పేర్కొన్నారు. రైతుల కళ్లల్లో వెలుగులు చూడడమే తన ఆశయమని స్పష్టం చేశారు. రైతాంగానికి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రైతు బాంధవుడు, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతు దినోత్సవం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతన్నలకు తొలి లేఖ రాశారు. ఇందులో తన ప్రాధమ్యాలను వివరించారు. ఆ లేఖలోని ముఖ్యాంశాలు... ఆత్మ బంధువులు, అన్నదాతలైన రైతన్నలకు మీ జగన్ నమస్కరిస్తూ రాస్తున్న లేఖ.. డాక్టర్ వైఎస్సార్ జయంతి సందర్భంగా ప్రతిఏటా జూలై 8వ తేదీన రైతు దినోత్సవం నిర్వహించాలని మన ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల కోసం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వేసిన బాటను మరింత మెరుగు పరిచేందుకు మన ప్రభుత్వం నవరత్నాలతో ముందుకు వచ్చింది. రైతులకిచ్చిన మాట నిలబెట్టుకునేందుకు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఎన్నో నిర్ణయాలు తీసుకున్నా. ఈ ఏడాది అక్టోబరు నుంచే ప్రతి రైతు కుటుంబానికీ రూ.12,500 రైతు భరోసా కింద అందించబోతున్నాం. ఈ డబ్బును బ్యాంకులు ఇంతకు ముందున్న మీ అప్పులకు జమ చేసుకోకుండా నేరుగా మీ చేతికే అందించబోతున్నాం. 54 లక్షల రైతు కుటుంబాలకు రూ.8,750 కోట్ల మేర పెట్టుబడి సహాయం అందబోతోంది. 15.36 లక్షల కౌలు రైతులకూ మేలు జరుగుతుంది. ఇంత భారీ మొత్తాన్ని ఒకే విడతలో రైతుల చేతికి అందించడం కేవలం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాకుండా 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల భారతదేశ చరిత్రలోనే ఒక రికార్డు. రూ.2 వేల కోట్లతో విపత్తుల సహాయనిధి తుపానులు, ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి రూ.2,000 కోట్లతో విపత్తు సహాయ నిధిని ఏర్పాటు చేస్తున్నాం. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని నెలకొల్పుతున్నాం. శనగ రైతులకు క్వింటాల్‌కు రూ.1,500 ప్రోత్సాహకంగా ప్రకటిస్తూ జీవో జారీ చేశాం. ఈ రోజు నుంచే ఆ డబ్బును అందించబోతున్నాం. ప్రతి నియోజకవర్గంలోనూ శీతల గిడ్డంగులు, గోదాముల నిర్మాణంతో పాటు అవసరమైన చోట ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నాం. కౌలుదారులకు మేలు చేస్తాం.. భూ యజమానుల హక్కులను పూర్తిగా కాపాడుతూ, కౌలుదారులకు సైతం మేలు చేసేలా 11 నెలల పాటు సాగు ఒప్పందం ఉండేలా కౌలు చట్టంలో మార్పులు తీసుకురాబోతున్నాం. తద్వారా కౌలు రైతులకు అన్ని రకాలుగా మంచి చేయాలని నిర్ణయించాం. వ్యవసాయానికి సంబంధించిన కారణాల వల్ల చనిపోయిన రైతు కుటుంబానికి రూ.7 లక్షలు అందిస్తాం. ఆ డబ్బు రైతు కుటుంబం చేతికే అందిస్తాం. ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ కరెంటు అందిస్తున్నాం. సహకార డెయిరీలకు పాలు పోసే ప్రతి పాడి రైతుకు లీటరుకు అదనంగా రూ.4 బోనస్ రెండో ఏడాది నుండి ఇవ్వబోతున్నాం. పామాయిల్ రైతులకు రూ.85 కోట్ల మేర ఆర్థిక సహాయం అందించబోతున్నాం. పొగాకు ధరల స్థిరీకరణకు చర్యలు తీసుకున్నాం. నాఫెడ్ ద్వారా కొబ్బరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. రైతులకు భూసార కార్డులు, రాయితీపై విత్తనాల సరఫరా, సకాలంలో ఎరువుల పంపిణీ, రాయితీపై సూక్ష్మపోషకాల సరఫరా వంటి వాటికి చర్యలు తీసుకుంటున్నాం. కల్తీ విత్తనాల నిరోధానికి చర్యలు కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను నిరోధించడానికి చర్యలు చేపడతాం. ప్రతి నియోజకవర్గంలో ప్రయోగశాలలు, ప్రతి గ్రామంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నాం. ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలు చేసేందుకు వ్యవసాయ మిషన్ ఏర్పాటు చేశాం. చివరిగా ఒక్క మాట... పండించిన ప్రతి ధాన్యపు గింజపై అది ఎవరు తినాలో దేవుడు రాసి పెడతాడన్నది నానుడి. కష్ట జీవులైన రైతులు, వారి కుటుంబాల్లో ఆనందాలను నింపేలా మనందరి ప్రభుత్వం చేస్తున్న ప్రతి ప్రయత్నానికీ.. అవినీతిని నిర్మూలించడానికి సాగిస్తున్న కృషికి దేవుడి దీవెనలు, మీ అందరి మద్దతు కావాలని కోరుకుంటున్నా. ప్రతి రైతన్నకూ రైతు దినోత్సవ శుభాకాంక్షలు’’ రూ.84 వేల కోట్ల పంట రుణాలు బ్యాంకుల నుంచి ఈ ఏడాది రైతులకు రూ.84,000 కోట్లు రుణాలుగా అందజేయాలని నిర్ణయించాం. రూ.లక్ష వరకు పంట ఋణాలు తీసుకున్న రైతులు గడువు లోపు తిరిగి చెల్లిస్తే ఆ రుణాలపై వడ్డీ ఉండదు. వైఎస్సార్ వడ్డీ లేని పంట రుణాల పథకాన్ని ప్రారంభిస్తున్నాం. రైతులు చెల్లించాల్సిన పంటల బీమా ప్రీమియంను ఇక ప్రభుత్వమే చెల్లిస్తుంది. రూ.2,163 కోట్ల బీమా ప్రీమియంను రైతుల తరఫున ప్రభుత్వమే చెల్లిస్తుంది. పగటి పూటే 9 గంటల విద్యుత్ ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 60 శాతానికి పైగా వ్యవసాయ కనెక్షన్లకు పగటి పూటే 9 గంటల పాటు కరెంటు సరఫరా చేస్తున్నాం. వచ్చే ఏడాది జూన్ నాటికి మిగిలిన ఫీడర్లలో కూడా పగటిపూటే కరెంటు ఇచ్చే సామర్థ్యాన్ని తీసుకువచ్చేలా రూ.1,700 కోట్లు ఖర్చు చేసున్నాం. నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తంగా 200 రిగ్గులతో రైతుల పొలాల్లో ఉచితంగా బోర్లు వేయించబోతున్నాం. -
నేడే రైతు పండుగ
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టనుంది. వైఎస్సార్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడంతో ప్రారంభమయ్యే రైతు దినోత్సవ కార్యక్రమాలు సాయంత్రం వరకూ కొనసాగుతాయి. ప్రభుత్వ సంస్థలతో పాటు వైఎస్సార్సీపీ రైతు విభాగం, పలు రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా రైతు దినోత్సవాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. రాష్ట్రస్థాయిలో ప్రధాన కార్యక్రమాన్ని వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటారు. ఆయన సోమవారం ఉదయం విజయవాడ నుంచి ఇడుపులపాయ వెళ్లి వైఎస్సార్ ఘాట్‌లో దివంగత మహానేత సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం గండి ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత జమ్మలమడుగులో రైతు దినోత్సవ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక నిర్ణయాలను ప్రకటించడంతో పాటు మూడు ముఖ్యమైన పథకాలను లాంఛనంగా ప్రారంభిస్తారని సమాచారం. సామాజిక పింఛన్ల పంపిణీకి శ్రీకారం అన్నదాతల శ్రేయస్సే ధ్యేయంగా ఇప్పటికే ప్రకటించిన పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రివర్గం(కేబినెట్) ఆమోద ముద్ర వేసిన మిగతా పథకాలను సోమవారం రైతు దినోత్సవ సభలో సీఎం ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతులకు వడ్డీలేని రుణాల పంపిణీ, ఉచిత పంటల బీమా, రబీ నుంచే అందించే పెట్టుబడి సాయం రూ.12,500 వంటి కీలక పథకాలకు సర్కారు శ్రీకారం చుట్టనుంది. ‘వైఎస్సార్ రైతు భరోసా’లో భాగంగా ప్రకటించిన వడ్డీ లేని రుణాల పథకం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చేలా ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారు. ఇక ఉచిత పంటల బీమా కార్యక్రమం కింద రాష్ట్రంలో ఖరీఫ్, రబీలలో సాగు చేసే 27 రకాల పంటలకు రైతులు చెల్లించాల్సిన ప్రీమియం వాటాను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇందుకోసం రూ.2,163 కోట్లు కేటాయించారు. 16 లక్షల మంది కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఇందుకు కౌలు రైతులు మీ–సేవా కేంద్రానికి వెళ్లి, ఒక్క రూపాయి చెల్లించి పంట పేరు, చిరునామాను నమోదు చేయించుకోవాలి. పెట్టుబడి సాయం కింద ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్ల పాటు రూ.50,000 అందించే రైతు భరోసా పథకాన్ని, దురదృష్టవశాత్తూ రైతు దుర్మరణం పాలైనా, ఆత్మహత్యకు పాల్పడినా రూ.7 లక్షలు చెల్లించే పథకాన్ని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతు దినోత్సవ సభలో లాంఛనంగా ప్రారంభిస్తారు. వీటితో పాటు సామాజిక పింఛన్ల పంపిణీని కూడా ఇదే సభలో ఆరంభిస్తారు. రైతులు ఉపయోగించే ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ రద్దు, శనగ రైతులకు మార్కెట్ వ్యత్యాస ధర చెల్లింపు వంటి వాటిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 17 మంది రైతులకు సన్మానం రాష్ట్రంలో 13 జిల్లాలకు చెందిన 17 మంది ఉత్తమ రైతులకు జమ్మలమడుగు సభలో సీఎం జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా సన్మానం జరుగనుంది. అలాగే సభా స్థలి సమీపంలో వ్యవసాయం, అనుబంధ రంగాల శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి సందర్శిస్తారు. ఈ స్టాళ్లలో చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడే పరికరాలను, వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. పంట రుణాల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది. వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఉద్యాన విభాగం ఏర్పాటు చేసే అరటి పరిశోధన కేంద్రానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. రైతన్నలకు వైఎస్ జగన్ సందేశం రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో రైతు దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇన్చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొంటారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు నివాళులు అర్పించిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు లేఖ రూపంలో రాసిన సందేశాన్ని అధికారులు చదివి వినిపిస్తారు. శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు, రైతులు, రైతు ప్రముఖులతో ముఖాముఖి నిర్వహిస్తారు. రైతులను, శాస్త్రవేత్తలను సన్మానిస్తారు. రైతాంగం సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వివరాలతో కూడిన పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాలను ఆవిష్కరిస్తారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి అరుణ్‌కుమార్ ఇప్పటికే సంబంధిత జాయింట్ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రైతు దినోత్సవం సందర్భంగా గుంటూరులోని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం, మార్కెట్ యార్డుల్లో, మార్టేరులోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అన్నదాతలకు వైఎస్సార్సీపీ రైతు విభాగం శుభాకాంక్షలు రైతు దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు, రాష్ట్ర అగ్రి మిషన్ ఉపాధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నదాతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. సుదీర్ఘకాలంగా వ్యవసాయ రంగంలోనే కొనసాగుతున్న సీనియర్ రైతు దంపతులను గుర్తించి, సన్మానించాలని సూచించారు. రైతు దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చే సందేశాన్ని ప్రతి గ్రామానికీ తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరులోని శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే రైతు దినోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఎం.సుచరిత, ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఖాదర్ వలీ తదితరులు పాల్గొంటారని ఆ ఫౌండేషన్ ఛైర్మన్ పద్మశ్రీ వై.వెంకటేశ్వరరావు తెలిపారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా ఉత్తమ రైతులను సన్మానించాలని పలు స్వచ్ఛంద సంస్థలు నిర్ణయించాయి. (వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి సమగ్ర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రైతులకు వడ్డీ రహిత రుణాలు
* ఈ నెలాఖరు నుంచి అమల్లోకి * రూ. 3 లక్షల వరకూ రుణం * సుమారు ఎనిమిది లక్షల మందికి లబ్ధి * కోడ్ వల్ల ఆలస్యంగా అమలు * సర్కార్‌పై ఏటా రూ.850 కోట్ల భారం * 27న యశస్విని పథకం అమలు * రూ. 2 లక్షల వరకు ఉచిత చికిత్సలు * 70 లక్షల మందికి లబ్ధి * సహకార శాఖ మంత్రి మహదేవ ప్రసాద్ వెల్లడి సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోని రైతులకు ఈ నెలాఖరు నుంచి రూ.3 లక్షల వరకు వడ్డీ రహిత రుణాలిచ్చే పథకాన్ని అమలు చేస్తామని సహకార శాఖ మంత్రి హెచ్ఎస్. మహదేవ ప్రసాద్ తెలిపారు. మంగళవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ బడ్జెట్లో పేర్కొన్న మేరకు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ పథకాలన్ని అమలు చేయాల్సి ఉన్నా, ఎన్నికల నియమావళి వల్ల ఆలస్యమైందని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 2,19,515 మంది రైతులకు రూ.7,559 కోట్ల రుణాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇందులో 99 శాతం వడ్డీ రహిత రుణాలన్నారు. అంతకు ముందు ఏడాదితో పోల్చుకుంటే గత ఏడాది సుమారు 1,559 కోట్ల అధిక రుణాలిచ్చినట్లు చెప్పారు. కొత్తగా ఆరు లక్షల మంది రైతులు రుణాలు పొందారని తెలిపారు. ఏటా రూ.వెయ్యి కోట్లు చొప్పున రుణ పంపిణీని పెంచుతూ రూ.10 వేల కోట్ల వార్షిక రుణాలను ఇవ్వాలనే లక్ష్యం విధించుకున్నట్లు వెల్లడించారు. కాగా రైతులకు వడ్డీ రహిత రుణాల వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.800 కోట్ల నుంచి రూ.850 కోట్ల వరకు భారం పడుతుందని తెలిపారు. 27న యశస్విని పథకం పట్టణాల్లోని సహకార సంఘాల సభ్యుల కోసం ఉద్దేశించిన నగర యశస్విని పథకాన్ని ఈ నెల 27న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇక్కడి జ్ఞాన జ్యోతి ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో ప్రారంభిస్తారని మంత్రి చెప్పారు. ఈ పథకం కింద సుమారు 800 వివిధ రోగాలకు రూ.2 లక్షల వరకు ఉచిత చికిత్సలు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. తద్వారా పట్టణాల్లోని 70 లక్షల మంది సహకార సంఘాల సభ్యులు లబ్ధి పొందుతారని చెప్పారు. ఈ పథకాన్ని కోరుకునే సహకార సంఘాల సభ్యులు ఏటా రూ.1,010 బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీలు రూ.810 చెల్లించాలని ఆయన తెలిపారు.