వారమంతా క్షీర భాగ్య
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాల మొదలు ఉన్నత పాఠశాలల వరకు క్షీర భాగ్య పథకం కింద పిల్లలకు వారానికి మూడు సార్లు పంపిణీ చేస్తున్న పాలను ఇకపై వారమంతా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని సహకార శాఖ మంత్రి హెచ్‌ఎస్ మహదేవ ప్రసాద్ తెలిపారు. బెంగళూరు పాడి సమాఖ్య ఉత్పత్తి చేసిన నెయ్యి లడ్డూలను మంగళవారం ఆయనిక్కడ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ క్షీర భాగ్య కింద కోటి మంది పిల్లలు లబ్ధి పొందుతున్నారని చెప్పారు.
పాల ఉత్పత్తిదారులకు ప్రభుత్వం లీటరుకు ఇస్తున్న ప్రోత్సాహకాన్ని రూ. 2 నుంచి రూ.4 కు పెంచడంతో పాల సేకరణ కూడా రోజుకు 43 లక్షల లీటర్ల నుంచి 60 లక్షల లీటర్లకు పెరిగిందని తెలిపారు. క్షీర భాగ్య కింద కర్ణాటక పాడి సమాఖ్య సహా ఇతర సమాఖ్య శాఖలకు రూ. 636 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించారు. రైతులకు ప్రోత్సాహకంగా రూ 940 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు.
కల్తీ పాలు విక్రయిస్తే చర్యలు
బెంగళూరులో కల్తీ పాలను విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి చర్యలకు పాల్పడే వారిని జైలుకు పంపిస్తామని నగర ఇన్‌చార్జి మంత్రి రామలింగారెడ్డి హెచ్చరించారు. పిల్లలు ఎక్కువగా పాలు తాగుతుంటారని, కల్తీ పాలు ఇస్తే వారి ఆరోగ్యం ఏమవుతుందని ప్రశ్నించారు. కనుక కల్తీ పాలను విక్రయించే సమాజ ద్రోహులపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటే దీనిని అరికట్టవచ్చని అన్నారు. బెంగళూరులో కల్తీ పాలను విక్రయించే వారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.