అన్ని ‘డీసీసీ’లపై దృష్టి | All 'vision disisilapai | Sakshi
Sakshi News home page

అన్ని ‘డీసీసీ’లపై దృష్టి

Published Fri, Sep 5 2014 1:23 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

All 'vision disisilapai

శివమొగ్గ : స్థానిక డీసీసీ బ్యాంక్ నగర శాఖలో రూ.కోట్ల కుంభకోణం వెలుగు చూసిన నేపథ్యంలో రాష్ర్టంలోని అన్ని అపెక్స్, డీసీసీ బ్యాంకులపై దృష్టి సారిస్తున్నట్లు రాష్ట్ర సహకారశాఖామంత్రి మహదేవప్రసాద్ స్పష్టం చేశారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..

ఆయా బ్యాంకుల్లో గతంలో జరిగిన వ్యవహరాలను పరిశీలిస్తామన్నారు. శివమొగ్గ నగర శాఖలో రూ.82 కోట్లకు పైగా అవకతవకలు జరిగాయని, మొత్తం 18 మందిని అరెస్ట్ చేశారని తెలిపారు. ఈ కేసును సీఐడీ దర్యాప్తు చేస్తోందని, నిందితులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. శివమొగ్గ డీసీసీ బ్యాంక్ పాలక మండలిని రద్దుచేశామని, ఆ మండలి అధికారిగా కలెక్టర్ విపుల్‌బన్సల్ ను నియమించామని తెలిపారు.

గత సంవత్సరం సహకార బ్యాంకులు ద్వారా 14 లక్షల మంది రైతులకు రూ.6 వేల కోట్లను వడ్డీ రహిత రుణాలుగా అందించామని, ఈ సారి రూ.20 వేల కోట్లను అందిస్తామని తెలిపారు. యశస్విని పథకాన్ని నగర ప్రాంతాలకూ విస్తరించామని తెలిపారు. ఉపముఖ్యమంత్రి స్థానంపై అధిష్టానానిదే తుది నిర్ణయమన్నారు. సమావేశంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కిమ్మనె రత్నాకర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రసన్న కుమార్, ఎమ్మెల్యే కేబీ ప్రసన్న కుమార్, జిల్లా పంచాయతీ అధ్యక్షుడు కలగోడు రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement