పార్టీ ప్రచార యాత్రగా..
- పార్టీ యాత్రను తలపించిన చంద్రబాబు జిల్లా పర్యటన
- ప్రచార రథంపై నుంచేప్రసంగాలు
- జనంపై చిర్రుబుర్రులు
- పలుచోట్ల జనస్పందన కరువు
- విశాఖను ముంబై నగరంగా మార్చుతానని ప్రకటన
- చక్కెర కర్మాగారాల సమస్యలపై ప్రత్యేక దృష్టికి హామీ
అధికారంలోకి వచ్చాక తొలిసారి జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు అడుగడుగునా ప్రభుత్వ కార్యక్రమాన్ని కాస్తా పార్టీ ప్రచార యాత్రగా మార్చేశారు. ముఖ్యమంత్రిహోదాలో పర్యటిస్తున్న ఆయన పార్టీ ప్రచారం రథంపైనుంచే మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. గ్రామాల్లోకి కాన్వాయ్ ప్రవేశించగానే సీఎం ముందున్న వాహనంలో ప్రభుత్వ అభివృద్ధి గీతాలు కాకుండా పార్టీ గేయం వందలసార్లు మైక్‌లో వినిపించడంతో తొలిరోజు పర్యటన పార్టీ యాత్ర లేదా ప్రభుత్వ పర్యటన అనేది తేడా కనిపించలేదు.
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో కేబినెట్ సమావేశానికి హాజరయ్యాక మరోసారి పూర్తిస్థాయి పర్యటనకు తొలిసారిగా బాబు వచ్చినా.. జన స్పందన పెద్దగా లేదనే చెప్పాలి. వాస్తవానికి చంద్రబాబు ఎప్పుడూ విమానాశ్రయానికి వచ్చినా భారీగా కార్యకర్తలు హాజరై హడావుడి చేసేవారు. ఈదఫా కనీసం కార్యకర్తలు పలుచగా కనిపించారు. శుక్రవారం వరలక్ష్మి వ్రతం పండగ సెగ తగిలిందని సొంతపార్టీనేతలే వ్యాఖ్యానించారు.
సమస్యలు వినిపిస్తే చిర్రుబుర్రు
8.30 గంటలకు సీఎం ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల్సి ఉన్నా గంట ఆలస్యంగా 9.40కి చేరుకున్నారు. అక్కడినుంచి గాజువాక మీదుగా వెళ్తుండగా స్థానిక ఉక్కు నిర్వాసితులతోపాటు మరికొందరు వినతిపత్రాలు ఇవ్వడానికి రావడంతో చంద్రబాబు పార్టీ ప్రచార రథం ఎక్కి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అక్కడినుంచి అనకాపల్లి నూకాంబిక ఆలయానికి 11.10గంటలకు చేరుకున్నారు. అనంతరం స్థానిక ఏరియా ఆస్పత్రి ఆకస్మిక తనిఖీకి వెళ్లారు. ఆస్పత్రిలో సౌకర్యాలపై ఆరా తీశారు. ముందుగానే సీఎం వస్తున్నారని సమాచారం రావడంతో ఆస్పత్రివర్గాలు ఆస్పత్రిని శుభ్రంగా మార్చాయి. అనంతరం ఆస్పత్రి సమస్యలపై వైద్యులతో ముప్పావుగంటపాటు సమావేశమయ్యారు. అక్కడినుంచి 12.40గంటలకు తుమ్మపాలకు చేరుకున్నారు.
చెరకు రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. తమకు చెరకుబకాయిలు అందడం లేదని, కుటుం బాలు రోడ్డునపడుతున్నాయని మొర వినిపించే ప్రయత్నం చేసినా బాబు మాత్రం వారి రోదన వినలేదు. అదంతా గత ప్రభుత్వ పాలన పాపం అంట తప్పించుకున్నారు. చెరకు ఫ్యాక్టరీని ఆధునికీకరించే విషయమై ఉన్నతాధికారులతో కమిటీ వేస్తున్నానని మూడు నెలల్లో సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. 1.20గంటలకు గంధవరానికి చేరుకుని స్థానిక మహిళలతో ముచ్చటించారు. అయితే గ్రామంలో అభివృద్ధి లేదని స్థానికులు సమస్యలు ఏకరువు పెట్టగా బాబు అసహనం వ్యక్తం చేశారు.
ఓ అవ్వ తనకు పింఛన్ తక్కువగా వస్తుందని, కొడుకు సరిగ్గా చూడ్డం లేదని చెప్పడంతో ఆమెకు సెల్‌ఫోన్ కొనిచ్చి పింఛన్ సమాచారం దానిద్వారా తెలుసుకునేందుకు రూ.10వేలు ఇస్తున్నట్లు చెప్పారు. అక్కడినుంచి గోవాడ చేరుకుని చెరకు రైతులతో మాట్లాడారు. తమకు వేతనాలు పెరిగేలా చూడాలని కోరిన రైతులను ఇప్పటికే ఎక్కువ వేతనాలు వస్తున్నాయి కదా అని వారిని నిరుత్సాహ పరిచారు.
4లక్షలు ఉన్న చెరకు క్రషింగ్ సామర్థ్యాన్ని 8లక్షల మెట్రిక్ టన్నులకు పెంచుతామని హామీ ఇచ్చారు. అనంతరం అక్కడినుంచి చోడవరంలోని రైతు బహిరంగ సభకు హాజరయ్యారు. తిరిగి రాత్రి ఏడు గంటలకు అనకాపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రానికి హాజరై సైంటిస్టులతో ముఖాముఖీలో పాల్గొన్నారు. చంద్రబాబు తొలిరోజు పర్యటనలో ప్రజా సమస్యలు వినకుండా పైపైనే కానిచ్చేసి తమ ప్రభుత్వం ఏం చేస్తుందో గొప్పలు చెప్పుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు.
విశాఖను ముంబైగా మార్చుతా
విశాఖనగరాన్ని ముంబైగా తీర్చిదిద్దుతానని సీఎం ప్రకటించారు. ప్రపంచాన్ని విశాఖకు తీసుకువస్తానని చెప్పారు. విశాఖ ఉక్కు సామర్థ్యాన్ని పెంచుతామని, నగరంలో ఔటర్‌రింగ్‌రోడ్డు అభివృద్ధిచేస్తానని హామీ ఇచ్చారు. ఫార్మా,పారిశ్రామికరంగాలను సైతం ప్రోత్సహిస్తానన్నారు. విశాఖను కాలుష్యం సమస్య వేధిస్తుందని, దాని పరిష్కారానికి కట్టుబడి ఉన్నటు ్లచెప్పారు.
మెట్రోకూడా పూర్తిచేస్తామని, అరనుకు ఊటీ,కొడెకైనాల్ తరహాలో పర్యాటకపరంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వస్తే విశాఖనగరానికి తాగునీటి సమస్యతోపాటు పరిశ్రమలకు నీరు కూడా సులువుగా ఇస్తామని చెప్పారు. ఇళ్లకు,పరిశ్రమలకు విద్యుత్ పెంచుతామన్నారు.