క్రషింగ్ చేపట్టక వెలవెలబోతున్న ట్రైడెంట్ యార్డు, కర్ణాటకకు చెరకు లోడ్‌తో వెళ్తున్న లారీ
సంగారెడ్డి: జహీరాబాద్‌లోని ‘ట్రైడెంట్’ యాజమాన్యం క్రషింగ్‌ను చేపట్టే పరిస్థితి కనిపించకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో రైతులు పక్క రాష్ట్రాలకు చెరకును తరలిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ప్రజా ప్రతినిధులు మర్చిపోవడంతో రైతాంగం వారిపై ఆశలు వదులుకొని తమ దారి తామే చూసుకుంటున్నారు. ఇప్పటికే పలు కర్మాగారాలతో ఒప్పందం సైతం చేసుకున్నారు.
జహీరాబాద్ జోన్ పరిధిలో సుమారు 18 వేల ఎకరాల్లో చెరకు పంట సాగులో ఉంది. 7 లక్షల టన్నుల మేర చెరకు పంట ఉత్పత్తి కానుంది. ఇంత మొత్తంలో పంట జోన్ పరిధిలో ఉండడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు పక్కనే ఉన్న కర్ణాటకకు పంటను తరలిస్తున్నారు. కర్ణాటకలోని చించోళి, బరూర్, మన్నాక్కెల్లి, గాంధీ చక్కెర కర్మాగారాలకు పంటను పంపిస్తున్నారు.
జహీరాబాద్ నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, యాజమాన్యంపై ఆశలు వదులుకొని ఇప్పటికే జోన్ పరిధిలో సాగులో ఉన్న దాంట్లో 8 వేల ఎకరాల పంటను పక్కనే ఉన్న కర్ణాటకలోని చించోళి యాజమాన్యంతో ఒప్పందం చేసుకున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. జోన్ పరిధిలోని జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్‌కల్, మొగుడంపల్లి మండలాల్లో రైతులు చెరకు పంటను విస్తారంగా సాగు చేసుకున్నారు. కర్ణాటకలోని యాజమాన్యాలు టన్నుకు ధర రూ.2,650 మేర చెల్లించి, చెరకు కోత, రవాణా ఖర్చులను వారే భరిస్తున్నారని రైతులు పేర్కొన్నారు.
రూ.9 కోట్ల మేర బకాయి..
‘ట్రైడెంట్’ కర్మాగారంలో 2022–23 క్రషింగ్ సీజన్‌కు గాను 2.55 లక్షల టన్నుల చెరకును గాను గాడించింది. టన్నుకు రూ.3,270 ధర నిర్ణయించింది. మొదటి విడత కింద టన్నుకు రూ.3 వేల వంతున చెల్లిస్తూ వచ్చింది. మిగితా రూ.270 పెండింగ్ పెట్టింది. జనవరి నెలాఖరు, ఫిబ్రవరి మాసంలో చెరకును సరఫరా చేసిన రైతులకు మాత్రం పూర్తిస్థాయిలో బిల్లులు పడ్డాయి. జోన్ పరిధిలో ఉన్న మొత్తం 2,287 మంది రైతులు కర్మాగారానికి చెరకును సరఫరా చేశారు. ఇందులో 1,699 మంది రైతులకు టన్నుకు రూ.270 వంతున బకాయి పడింది. మిగిలిన రైతులకు పూర్తిస్థాయిలో బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. రూ.83 కోట్లకు గాను రైతాంగానికి ఇప్పటి వరకు రూ.74 కోట్ల మేర చెల్లించారు. ఇంకా రూ.9 కోట్ల మేర బకాయిలను చెల్లించాల్సి ఉందని రైతులు పేర్కొంటున్నారు.
ఇచ్చిన హామీని మరిచిన నేతలు!
ఎన్నికల సందర్భంగా కర్మాగారంలో క్రషింగ్‌ను చేపట్టేలా చర్యలు తీసుకుంటామని, మొత్తం చెరకు బకాయిలు ఇప్పిస్తామని రైతులకు ప్రజా ప్రతినిధులు, అధికారులు హామీ ఇచ్చి మర్చిపోయారని రైతులు వాపోతున్నారు. పలు సమావేశాల్లో ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, నియోజకవర్గం బీఆర్‌ఎస్ ఎన్నికల ఇన్‌చార్జి దేవిప్రసాద్ హామీ ఇచ్చారని రైతులు పేర్కొంటున్నారు. అవసరం అయితే తమ ఆస్తులను అమ్మి బకాయిలు చెల్లిస్తామని మాట ఇచ్చారని, వారు ఇప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నిస్తున్నారు. డిసెంబర్ మొదటివారంలోనే క్రషింగ్ జరిపేలా చూస్తామని చెప్పినట్లు గుర్తు చేస్తున్నారు.
అధికారులు హామీ ఇచ్చి..
ఎన్నికల ప్రచారం నిమిత్తం నవంబర్ 23వ తేదీన జహీరాబాద్‌కు అప్పటి సీఎం కేసీఆర్ ప్రచారం నిమిత్తం వస్తుండడంతో సభను అడ్డుకునేందుకు రైతులంతా తీర్మానించారు. డిసెంబర్ మొదటి వారంలో బకాయిలను ఇప్పించడంతోపాటు క్రషింగ్‌ను జరిపిస్తామని ఎమ్మెల్యే మాణిక్‌రావు, కేన్, పోలీసు అధికారులు హామీ ఇచ్చి తమ ఆందోళనను విరమింపజేశారు. ఎన్నికలు ముగిసిన అనంతరం ఎవరూ పట్టించుకోవడం లేదు. – కొండల్‌రెడ్డి, రైతుసంఘం నాయకుడు, జహీరాబాద్
ఇవి చదవండి: వలస.. ఏదీ భరోసా?
Comments
Please login to add a commentAdd a comment