చేదు గీతం
పడిపోయిన పంచదార ధర
నష్టాలు దిశగా చక్కెర మిల్లులు
ఉత్పత్తి ఖర్చులు రాని వైనం
గగ్గోలు పెడుతున్న యాజమాన్యాలు
వ్యాట్‌తో నిండా మునిగిపోతున్న పరిశ్రమ
చోడవరం: జిల్లాలోని నాలుగు సుగర్ ఫ్యాక్టరీలు నష్టాలతో సతమతమవుతున్నాయి. రోజురోజుకు పంచదార ధరలు తగ్గిపోవడంతోపాటు ఇటీవల వచ్చిన హుద్‌హుద్‌కు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వ్యాట్ చా ర్జీలు లేకపోవడంతో గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి చక్కెర మన రాష్ట్రంలోకి తక్కువ ధరకు దిగుమతి అవుతోంది. రాష్ట్రంలో చక్కెర కొనాలంటే క్వింటాకు రూ.150 వ్యాట్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాలి. ఈ పరిస్థితిలో వ్యాట్ ఛార్జి కూడా కొనుగోలుదారులపైనే ఫ్యాక్టరీలు
సహకార రంగంలోని చక్కెర మిల్లులు చేదుగీతం ఆలపిస్తున్నాయి. రోజు రోజుకు మార్కెట్‌లోపంచదార ధరలు తగ్గుముఖం పడుతుండటంతో ఫ్యాక్టరీల యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. అసలే హుదుహుద్ తుఫాన్ దెబ్బ..ఆపై తగ్గిన చెరకు దిగుబడి..గతేడాది బకాయిలు ఇప్పటికీ రైతులకు చెల్లించని కొన్ని ఫ్యాక్టరీలు.. దీనికి తోడు పిడుగులాంటి వ్యాట్‌తో జిల్లాలోని సహకార చక్కెర కర్మాగారాలు నష్టాల బాట పడుతున్నాయి.
దీనివల్ల ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో అదనంగా క్వింటా దగ్గర రూ.150 పెరుగుతోంది. అంతర్జాతీయంగా పంచదారకు డిమాండ్ తగ్గడంతో రాష్ట్రీయ చక్కెర ఎగుమతులు నామమాత్రంగాగానే జరుగుతున్నాయి. దీంతో ప్రస్తుతం క్వింటా పంచదార ధర రూ.2450కి పడిపోయింది. 2013-14క్రషింగ్ సీజన్ ముగిసే నాటికి అంటే ఈ ఏడాది మార్చినెలలో క్వింటా రూ3050కు అమ్మగా క్రమేణా రూ. 2900, 2700లకు అమ్మింది. ఈ ధరకే ఫ్యాక్టరీలు గగ్గోలు పెడుతుంటే వారం రోజుల నుంచి ఏకంగా 2550, 2450కి ధర పడిపోవడంతో సహకార చక్కెర కర్మాగారాలు మరింత ఆందోళన చెందుతున్నాయి. పెరిగిన ముడిసరుకుల ధరలు, ఫ్యాక్టరీ నిర్వహణ ఖర్చులు, రైతులకు చెల్లించేధర కలుపుకుంటే క్వింటా పంచదార ఉత్పత్తికి ఫ్యాక్టరీలకు రూ.3వేలు వరకు ఖర్చవుతోంది. ప్రస్తుతం ధర చూస్తే అసలుకే ఎసరు వచ్చేటట్టు ఉంది. ఇక లాభాలు మాట దేవుడెరుగు ఉత్పత్తి వ్యయమైనా గిట్టుబాటైతే చాలని అంటున్నాయి యాజమాన్యాలు.
జిల్లాలోని గోవాడ, ఏటికొప్పాక ఫ్యాక్టరీలే లాభనష్టాలు లేకుండా నడుస్తున్నాయి. వీటికి కూడా ఈ ఏడాది నష్టాలు తప్పవంటున్నారు. రెండునెలల కిందట సంభవించిన హుదుహుద్ తుఫాన్‌కు గోవాడ, అనకాపల్లి. ఏటికొప్పాక ఫ్యాక్టరీలు తీవ్రంగా నష్టపోయాయి. ఫ్యాక్టరీ మిల్లుహౌస్‌లు, గోడౌన్లలో నిల్వ ఉంచిన పంచదార బస్తాలు కూడా తడిసి నష్టాలబారిన పడ్డాయి. ఈ క్రమంలో గోవాడ ఫ్యాక్టరీ చాలా ఎక్కువగా నష్టపోయింది. రూ.2700ధరలోనైనా ఉన్న నిల్వలను అమ్ముడుపోకపోవడం, ప్రస్తుతం ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో సుగర్స్ ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. మరోపక్క పాత నిల్వలే ఇంకా పూర్తిగా అమ్మకం కాకపోగా ఈ ఏడాది క్రషింగ్ ప్రారంభం కావడంతో కొత్త పంచదార కూడా గోడౌన్లకు వచ్చి చేరనుంది. తగ్గుముఖం పట్టిన పంచదార ధరతో యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి.