సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సహకార రంగంలోని చక్కెర కర్మాగారాలకు ఉరేసిందే చంద్రబాబు. ఆయన ప్రభుత్వ హయాంలో చేపట్టిన చర్యల కారణంగా అనేక సుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. వేలాది రైతులు, కార్మికులు రోడ్డున పడ్డారు. చివరకు వారికి ఇవ్వాల్సిన సొమ్ము కూడా చంద్రబాబు బకాయి పెట్టారు. ఈ వాస్తవాలను వదిలేసిన ఈనాడు పత్రిక మూతపడ్డ ఆ ఫ్యాక్టరీలకు మళ్లీ ప్రాణం పోస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేసింది.
వైఎస్ జగన్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సహకార రంగంలోని చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు ఉపసంఘం వేసింది. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలను రైతులు, ఉద్యోగులకు చెల్లించింది. మూతబడ్డ కర్మాగారాల్లో క్రషింగ్ మొదలయ్యేలా చేసింది. కానీ సామర్థ్యానికి తగినట్టుగా చెరకు ఉత్పత్తి లేదు.
దీంతో స్థానికంగా సాగయ్యే పంట ఉత్పత్తులకు అదనపు విలువ కల్పించడం ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ఆహార శుద్ధి పరిశ్రమలు నెలకొల్పాలని ప్రభుత్వం సంకల్పించింది. రైతులకు మేలు చేయడం కూడా నేరమన్నట్టుగా రామోజీ తన అక్కసును వెళ్లగక్కుతున్నారు. వాస్తవాలను కప్పిపుచ్చుతూ బురద రాతలు రాస్తున్నారు. రామోజీ ముసుగేసిన వాస్తవాలేమిటో ఒక్కసారి పరిశీలిద్దాం..
ఆరోపణ: చక్కెర కర్మాగారాలను మూతపడేలా చేశారు
వాస్తవం: సహకార రంగంలో ఉన్న డెయిరీలనే కాదు.. చక్కెర కర్మాగారాలను కూడా నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుదే. లాభాల బాటలో నడుస్తున్న చిత్తూరు, రేణిగుంట, కోవూరు, ఎన్‌వీఆర్ జంపని చక్కెర కర్మాగారాలను తన అనుయాయులకు కట్టబెట్టే లక్ష్యంతో 2003–04లో వాటిని మూతపడేటట్టు చేశారు. వైఎస్సార్ ప్రభుత్వం మినహా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సైతం వీటిని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పనిచేయడంతో పదింటికి తొమ్మిది మూతపడ్డాయి. బాబు నిర్వాకం వల్ల ప్రైవేటు రంగంలో ఉన్న కర్మాగారాలపై ఆ ప్రభావం పడింది.
ఈ రంగంలోని 19కి 15 మూతపడేలా చేశారు. ప్రస్తుతం ఆంధ్ర, కేసీపీ సుగర్స్‌లో ఒక్కొక్క యూనిట్, శ్రీకాకుళంలోని ఈఐబీ ప్యారీ, చిత్తూరులోని ఎస్‌ఏజే సుగర్స్ మాత్రమే పనిచేస్తున్నాయి. అదీ కూడా 45 లక్షల టన్నుల క్రషింగ్ సామర్థ్యం కల్గిన ఈ కర్మాగారాలు కేవలం 19 లక్షల టన్నుల సామర్థ్యంతో పని చేసే స్థాయికి పడిపోయాయి. ఇదంతా బాబు నిర్వాకం వల్లనే అన్నది సుస్పష్టం.
ఆరోపణ: రైతులకు ప్రోత్సాహమేదీ?
వాస్తవం: బాబు హయాంలో మూతపడిన చిత్తూరు, రేణిగుంట, కోవూరు, ఎన్‌వీఆర్ జంపని సహకార చక్కెర కర్మాగారాలను వైఎస్సార్ అధికారంలోకి వచ్చీరాగానే పునరుద్ధరించారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాల నిర్వాకంతో అవి మళ్లీ మూతపడ్డాయి. ఫ్యాక్టరీలు మూతపడటం, ప్రభుత్వాల ప్రోత్సాహం కరవవడంతో చెరకు రైతులు ఇతర పంటల వైపు మళ్లారు. దీంతో చెరకు సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. ఒకప్పుడు లక్ష హెక్టార్లకు పైగా సాగైన చెరకు ప్రస్తుతం 35 వేల హెక్టార్లకు పడిపోయింది. సహకార, ప్రైవేటు కర్మాగారాల ద్వారా ఒకప్పుడు కోటి టన్నులకు పైగా క్రషింగ్ జరగ్గా, ప్రస్తుతం 23 లక్షల టన్నులకు పరిమితమైంది.
ఆరోపణ: రైతులు, ఉద్యోగులను ఆదుకున్నదెవరు?
వాస్తవం: సహకార రంగంలో ఉన్న కర్మాగారాలను మూతపడేలా చేయడమే కాదు.. రైతులు, ఉద్యోగులకు చెల్లించాల్సిన వందల కోట్లను చంద్రబాబు ఎగ్గొట్టారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు ఎగ్గొట్టిన రూ.167.60 కోట్లు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చెల్లించింది. ఉద్యోగులకు బకాయిపెట్టిన రూ. 108 కోట్లలో రూ.14 కోట్లు ఇప్పటికే చెల్లించింది. మరో 94 కోట్లు జూలైలో చెల్లించేందుకు ఏర్పాట్లు చేసింది.
ఆరోపణ: ఆ కర్మాగారాలను పునరుద్ధరించలేదేమి?
వాస్తవం: బాబు హయాంలో నిర్వీర్యమైన అనకాపల్లి, తాండవ, ఏటికొప్పాక, విజయరాయ కర్మాగారాల పునరుద్ధరణకు వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే ఏ కర్మాగారమైనా పూర్తి స్థాయిలో నడవాలంటే ముడిసరుకు అవసరం. కానీ వీటి పరిసర ప్రాంతాల్లో చెరకు సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. ఫ్యాక్టరీల సామర్థ్యానికి తగినట్టుగా చెరుకు దొరకడంలేదు. ఫలితంగా పూర్తి సామర్థ్యానికి తగినట్టుగా క్రషింగ్ జరిపే పరిస్థితి లేదు. వందల కోట్లు ఖర్చు పెట్టి వీటిని ఆధునికీకరించినా క్రషింగ్ చేసేందుకు ముడిసరుకైన చెరుకు దొరికే పరిస్థితి లేదు.
ఆరోపణ: ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకే?
వాస్తవం: సామర్థ్యానికి సరిపడా చెరకు లేక క్రషింగ్ నిలిచిన ఈ కర్మాగారాలను ఆహార శుద్ధి పరిశ్రమలుగా మార్చడం ద్వారా రైతులకు మేలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. స్థానికంగా లభించే పంట ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేయడం ద్వారా వాటికి అదనపు విలువ చేకూర్చి తద్వారా రైతులకు అదనపు లబ్ధి కలిగించాలన్నది ప్రభుత్వ సంకల్పం. పైగా ఈ పరిశ్రమలన్నీ ప్రభుత్వమే స్వయంగా నిర్మిస్తోంది. కర్మాగారాలకు చెందిన గజం స్థలం కాదు కదా.. వాటికి చెందిన పూచిక పుల్ల కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఏకోశానా లేదు.
కేవలం నిర్వహణ మాత్రమే.. అదీ రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు, నిర్వహణకు ముందుకొచ్చే సంస్థలకు లీజుకివ్వాలని సంకల్పించింది. ఇందులో తప్పేముంది? ఏదైనా ప్రభుత్వ స్థలం లేదా ఆస్తులున్నాయంటే దొడ్డి దారిన తన అనుయాయులకు కట్టబెట్టాలన్న ఆలోచన చంద్రబాబు నైజం. ఇదే రీతిలో చిత్తూరు, రేణిగుంట, కొవ్వూరు, జంపని సుగర్ ఫ్యాక్టరీలను తన అనుయాయులకు కట్టబెట్టిన చరిత్ర బాబుదే.
ఇలా వేల కోట్ల విలువైన ఆస్తులను కట్టబెట్టారు. కానీ ఈ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, వాటి ద్వారా రైతులకు, సంబంధిత వర్గాల వారికి మేలు చేయాలనే నిత్యం ఆలోచన చేస్తోంది. ఆ దిశగానే అడుగులు వేస్తోంది. రామోజీకి మాత్రం కళ్లెదుట ఉన్న ఈ వాస్తవేలేవీ కనిపించవు. నిత్యం పైత్యపు రాతలతో కాలకూట విషం కక్కుతూనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment