TS Nizamabad Assembly Constituency: పసుపుబోర్డు మరింత దూకుడు.. బీఆర్‌ఎస్‌కు మరో మాస్టర్‌ స్ట్రోక్‌ ఇచ్చేందుకు రెడీ!
Sakshi News home page

చంద్రబాబు హయాంలో.. నిజాం షుగర్స్‌ పతనం! దానిని తెరిపిస్తామంటూ.. బీజేపీ సవాల్‌..!

Published Fri, Oct 13 2023 1:04 AM | Last Updated on Fri, Oct 13 2023 2:00 PM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: పసుపుబోర్డు అంశమే ప్రధాన ఎజెండాగా గత పార్లమెంట్‌ ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన ఎంపీ అర్వింద్‌ బీఆర్‌ఎస్‌కు మరో మాస్టర్‌ స్ట్రోక్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. స్వయాన ప్రధానమంత్రి నరేంద్రమోదీ పసుపు బోర్డును ప్రకటించడంతో ఇదే ఉత్సాహంతో అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. నిజాంషుగర్స్‌ ప్రధాన అంశంగా తీసుకుని ముందుకు వెళ్తామని, చెరుకు సాగు విస్తీర్ణాన్ని పెంచి రైతులకు మేలు చేస్తామని ఎంపీ అర్వింద్‌ ఈ సందర్భంగా పేర్కొంటున్నారు.

2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో పసుపు బోర్డు అంశం ఫలితాన్ని శాసించింది. పసుపు బోర్డు కోసం బాండ్‌ పేపర్‌ రాసిచ్చి బరిలోకి దిగిన ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మెజారిటీ విజయం సాధించారు. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని తీసుకొచ్చి పసుపుబోర్డు ప్రకటింపజేశారు. ఇదే ఊపుతో ఉత్తర తెలంగాణలో బీజేపీ ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో సత్తాచాటే లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తున్నారు.

పసుపుబోర్డు నేపథ్యంలో ఆ పంట సాగు విస్తీర్ణాన్ని పెంచాలనే లక్ష్యం ముంగిటకు వచ్చామని ఎంపీ అర్వింద్‌ చెబుతున్నారు. ఇక ఉత్తర తెలంగాణలో చెరుకు పంటసాగు విస్తీర్ణాన్ని పెంచడమే ఎజెండాగా ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉమ్మడి కరీంనగర్‌లోని మెట్‌పల్లిలో రైతులతోఆత్మీ య సమావేశం నిర్వహించనున్నారు.

ఉత్తరప్రదేశ్‌ పాలసీపై అధ్యయనం..
దేశంలో ఇథనాల్‌ వాడకం పెరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి కరీంగనర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో దాని తయారీ కోసం చెరుకు పంట సాగు విస్తీర్ణం పెంచే లక్ష్యంతో అర్వింద్‌ పార్టీ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ప్రత్యేకంగా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. నిజాంషుగర్‌ ఫ్యాక్టరీలు ఉమ్మడి నిజామాబాద్‌(బోధన్‌), ఉమ్మడి కరీంగనర్‌(జగిత్యాల జిల్లా ముత్యంపేట), ఉమ్మడి మెదక్‌(ముంబోజిపల్లి)లో ఉన్నాయి.

ఈ క్రమంలో అర్వింద్‌ ఉత్తరప్రదేశ్‌లోని చెరుకు పాలసీని స్టడీ చేస్తున్నారు. యూపీలో మాదిరిగా చెరుకు పంటసాగుతో పాటు దాన్ని రెగ్యులేట్‌ చేసేందుకుగాను షుగర్‌, బ్రౌన్‌ షుగర్‌, ఇథనాల్‌ అనే మూడు ఉత్పత్తుల తయారీకి ప్లాన్‌ చేస్తున్నారు. చెరుకుకు మద్దతు ధర ఇస్తున్న నేపథ్యంలో పశ్చిమ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదక ఖర్చు 30శాతం ఎక్కువ ఉంటోంది. దీంతో షుగర్‌ ఎగుమతులు అంతగా చేయలేని పరిస్థితి. ఇథనాల్‌ ఉత్పత్తి లక్ష్యంగా నిజాం షుగర్‌ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని, తద్వారా చెరుకు సాగువిస్తీర్ణాన్ని పెంచి రైతులకు మేలు చేస్తామని ఎంపీ వివరించారు.

2022 జూన్‌ 12, 13 తేదీల్లో జిల్లాలో కేంద్ర భారీపరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్‌ పాండే ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో కలిసి ఈ ప్రాంతాల్లో పర్యటించినప్పటి నుంచే చెరుకు పంట సాగు, నిజాం షుగర్స్‌ విషయమై సుదీర్ఘ అధ్యయనం చేస్తున్నట్లు ఎంపీ తెలిపారు. ఉత్తర తెలంగాణలో వరి, మొక్కజొన్న, చెరకు పంటల నుంచి ఇథనాల్‌ ఉత్పత్తి చేయడంతోపాటు ఇతర ఫుడ్‌ప్రాసెసింగ్‌ పరిశ్రమలు, వ్యవసాయ అధారిత యూనిట్లు నెలకొల్పితే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయంటున్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు భారీగా సబ్సిడీలు ఇస్తున్న నేపథ్యంలో రైతులకు మరింత మేలు కలుగుతుందన్నారు.

రాష్ట్రంలో బీజేపీకి అధికారం ఇస్తే తక్షణమే జిల్లాలోని నిజాం షుగర్‌ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెబుతుండడంతోపాటు దీన్నే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాగా నిజామాబాద్‌ జిల్లాలో సాధారణ వరిసాగు 2,86,160 ఎకరాలు కాగా.. నిజాం షుగర్స్‌ మూతపడడంతో చెరుకు రైతులు వరికి మారడంతో 4 లక్షల ఎకరాలకు పెరిగింది.

చంద్రబాబు హయాంలో..
నిజాం షుగర్స్‌ పతనానికి 2002లో చంద్రబాబు ప్రభుత్వం బీజం వేసింది. అప్పట్లో రూ.308 కోట్ల విలువ కలిగి ఉన్న నిజాం షుగర్స్‌ కర్మాగారాన్ని కేవలం రూ.65.45 కోట్లకు డెల్టా పేపర్‌ మిల్స్‌ అనే ప్రైవేటు కంపెనీకి విక్రయించారు. తర్వాత వైఎస్సార్‌ ప్రభుత్వం ఈ వ్యవహారంపై 2006లో శాసనసభా సంఘాన్ని నియమించగా భారీ అవినీతి చోటుచేసుకున్నట్లు తేల్చారు.

ఇదిలా ఉండగా 2014లో ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ నిజాం షుగర్స్‌ను ప్రభుత్వపరం చేస్తామన్నారు. కానీ విచిత్రంగా 2015 డిసెంబర్‌ 23న ఫ్యాక్టరీ మూడుయూనిట్లను మూసేశారు. 2005 – 06లో చెరుకు 35వేల టన్నుల దిగుబడి ఉన్నప్పుడు నడిచిన ఈ కర్మాగారాలను, 2015లో లక్ష టన్నుల చెరుకు దిగుబడి ఉన్నప్పటికీ మూసేయడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement