మూతపడిన చాగల్లు షుగర్ ఫ్యాక్టరీ
సాక్షి, కొవ్వూరు: టీడీపీ సర్కారు కార్మికుల ఉసురుపోసుకుంది. వారి జీవితాలతో దాగుడుమూతలాడింది. చాగల్లు సుగర్ ఫ్యాక్టరీ మూసివేతతో వందలాది కుటుంబాలు రోడ్డున పడినా పట్టించుకోలేదు. జమాన్యానికి కొమ్ముగాస్తూ.. కార్మికుల పొట్టకొట్టింది. తమకు రావాల్సిన బకాయిలైనా ఇప్పించాలని కార్మికులు వేడుకున్నా.. పోరుబాట పట్టినా కనీసం కనికరించలేదు. ఫలితంగా శ్రమజీవుల ఆకలికేకలు మిన్నంటుతున్నాయి. జిల్లాలోనే అత్యధిక చెరకు క్రషింగ్ సామర్థ్యం కలిగిన చాగల్లులోని జైపూర్ చక్కెర కర్మగారం మూతపడడంతో కార్మికులు రోడ్డున పడ్డారు. ఫ్యాక్టరీ మూతపడి 26 నెలలు పూర్తయినా.. జీతాలు, ఇతర రాయితీ బకాయిలు అందక ఆకలి కేకలు పెడుతున్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు నియోజకవర్గంలోనే ఈ దుస్థితి నెలకొన్నా.. టీడీపీ సర్కారు పట్టించుకున్న దాఖలా లేదు.
ఇతర పరిశ్రమలూ మూత
ఫ్యాక్టరీకి అనుబంధంగా నడుస్తున్న చాగల్లు డిస్టిలరీ, జంగారెడ్డిగూడెంలోని రమా మొలాసిస్ పరిశ్రమలూ మూతపడ్డాయి. ఇదే యాజమాన్యం పోతవరంలో నిర్మించిన మరో చక్కెర కర్మాగారం చెరకు పంట లేకపోవడంతో ట్రయిల్‌రన్‌తోనే మూతపడింది. దీంతో సీజన్ కార్మికులతో కలిపి 750 మంది శ్రమజీవులు, ఉద్యోగులు ఉపాధికి దూరమయ్యారు.
పోరుబాట పట్టినా ఫలితం శూన్యం
ఫ్యాక్టరీ మూతతో దాని ఎదుటే 86 రోజులపాటు కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేశారు. ఫ్యాక్టరీ తెరిపించాలని మంత్రులు, ప్రభుత్వ పెద్దల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. అయినా ఫలితం శూన్యం. దీంతో కుటుంబాలతో రోడ్డెక్కి ర్యాలీలు, ధర్నాలు చేసినా టీడీపీ సర్కారు వారి గోడు పట్టించుకోలేదు.
ఆరుగురు కార్మికులు మృతి
ఫలితంగా జీతాలందక, కుటుంబాల పోషణ భారమై, ఆర్థిక ఇబ్బందుల బారిన పడి ఏకంగా ఆరుగురు కార్మికులు ప్రాణాలు కొల్పోయారు. ఫీల్డ్‌మేన్ నల్లూరి శ్రీనివాసరావు, ఫిట్టర్లుగా పనిచేసే ఆలపాటి వెంకటేశ్వరరావు, వీవీఎల్‌ఎన్ ఆచార్యులు, క్లర్క్‌లు వల్లభనేని సత్యనారాయణ, ఎం.దుర్గారావు ఆరోగ్య సమస్యలతో, మనోవేదనతో మృతి చెందారు. ఆత్కూరి కృష్ణమూర్తి రిటైర్డు అయినా పింఛన్ పొందకుండానే మృతి చెందారు.
అసలు కథ ఇదీ..
చాగల్లు ప్యాక్టరీ యాజమాన్యం చెరుకు రైతులకు రూ.70.05 కోట్ల మేర బకాయి పడింది. ఈ బకాయిలు రాబట్టడం కోసం కలెక్టర్ 2016 జనవరి 20న రెవెన్యూ రికవరీ యాక్టు ప్రయోగించి ఫ్యాక్టరీని సీజ్ చేశారు. దీని అనుబంధంగా ఉండే పరిశ్రమలు మూతపడడంతో సీజనల్ కార్మికులతో కలిపి 750 మంది కార్మికులు రోడ్డున పడ్డారు.
అమలుకాని హామీ
మంత్రి జవహర్ కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు దీక్షలు విరమించారు. ఇంత వరకు ఒరిగిందేమీ లేదు. జిల్లాకు చెందిన కార్మిక శాఖ మంత్రిని, కార్మిక శాఖ కమిషనర్‌ని కలిసి గోడు వెళ్లబుచ్చుకున్నా.. సర్కారులో చలనం లేదు. కార్మికులకు జీతాలు, ఇతర అలవెన్స్‌లు అందలేదు. రెండేళ్లు నుంచి కార్మికులు ఉపాధికి దూరమయ్యారు. రిటైర్డు అయిన వాళ్లకు అందాల్సిన సోమ్ములు అందడం లేదు. బతుకు భారమై కార్మికులు విలవిల్లాడుతున్నారు.
చైర్మన్‌ను కలిసినా ఫలితమేదీ!
కార్మిక సంఘం నాయకులు గత ఏడాది అక్టోబర్ 24న ఫ్యాక్టరీ చైర్మన్‌ని కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. నెలలో పీఎఫ్ బకాయిలు జమచేస్తామని, మెడికల్ ప్రీమియం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు కాలేదు. దీంతో ఈ ఏడాది ఫ్రిబవరి 3న మరోసారి కలిశారు. రాయగఢ్‌లో ఆస్తులను అమ్ముతున్నామని త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చినా ఇంత వరకు సొమ్ములు అందలేదు. ఇప్పుడు కొత్తగా నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యూనల్ వాళ్లు సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఫ్యాక్టరీని తమ అధీనంలోకి తీసుకున్నామని, ఫ్యాక్టరీని అమ్మి అయినా సరే మూడు నెలల్లో కార్మికులు, ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తామని చెబుతున్నారని, ఇది ఎప్పటికి జరిగేనో అని కార్మిక సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతుల పరిస్థితి మరింత దైన్యం
ఫ్యాక్టరీ మూతతో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. జిల్లాలో నిడదవోలు, గోపాలపురం, కొవ్వూరు, పోలవరం నియోజకరవర్గాల రైతులు ఈ ఫ్యాక్టరీ పరిధిలోనే చెరుకు సాగు చేసేవారు. మొదట్లో సుమారు 90 వేల ఎకరాల్లో చెరకుపంట సాగయ్యేది. ఫ్యాక్టరీ మూత పడడంతో రైతులు చెరుకుసాగుకు దూరమయ్యారు. బెల్లం తయారు చేసే రైతులు మాత్రమే చెరుకు సాగు చేస్తున్నారు. మూడేళ్ల నుంచి చెరుకుకు ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటున్నారు.
ఈ బకాయిల మాటేంటి ?
∙2017 జనవరి 20న ఫ్యాక్టరీ మూతపడడంతో కార్మికులు, ఉద్యోగులకు 26 నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదు.
∙2017 జనవరి నుంచి ఇప్పటి వరకు కార్మికులకు యాజమాన్యం పీఎఫ్ బకాయిలు చెల్లించలేదు.
ఒక్కో కార్మికుడికి ఏడాదిగా యాజమాన్యం చెల్లించాల్సిన వైద్య ఖర్చులు రూ.10వేలు, బోనస్‌లు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఓవర్ టైమ్(ఓటీ), ఫీల్డ్ సిబ్బందికి ఆదివారం సెలవు దినాల్లో చెల్లించే అలవెన్స్‌లు తదితర పాత బకాయిలు 2014–15 నుంచి చెల్లించడం లేదు. సుమారు రూ.3 కోట్ల మేర ఈ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి.
∙ఫ్యాక్టరీ నడవని కాలంలో కార్మికులు, ఉద్యోగులకు చెల్లించే రిటర్నింగ్ అలవెన్స్‌లు చెల్లించడం లేదు.
∙2014 మార్చి నుంచి యాజమాన్యం కోటా కింద చెల్లించాల్సి ప్రావిడెంట్ ఫండ్ వాటా చెల్లించడం లేదు.
– ఉద్యోగులు, కార్మికుల తరుఫున చెల్లించే ఫీఎఫ్ మాత్రం 2014 మార్చి నుంచి 2016 ఆగస్టు వరకు మాత్రమే చెల్లించారు. దీంతో రిటైర్డు ఉద్యోగులకు పీఎఫ్ రావడం లేదు. ఫ్యాక్టరీ యాజమాన్యం చెల్లించే మొత్తం చెల్లిస్తే తప్ప పీఎఫ్ చెల్లించే వీలులేదు.
∙కార్మికులు, ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న కో–ఆపరేటివ్ క్రిడెట్ సోసైటీ లో ఉన్న నిల్వ లో రూ.90లక్షలు యాజమాన్యం వినియోగించుకుంది. దీంతో కార్మిక సంఘం నాయకులు కో–ఆపరేటివ్ రిజిస్ట్రార్‌కి ఫిర్యాదు చేశారు. నెలకు రూ.10 లక్షలు చొçప్పున 2016 నవంబర్ నుంచి 2017 నవంబర్ వరకు ఆ సొమ్ములు తిరిగి జమ చేస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. దీనిలో కేవలం రూ.10 లక్షలు జమచేసింది. ఇంకా రూ.80లక్షలు బకాయిలు రావాలి.
∙ఆర్థిక ఇబ్బందులున్న సమయంలో కో–ఆపరేటివ్ సోసైటీ సొమ్మును కార్మికులు, ఉద్యోగులు రుణాలుగా తీసుకునే అవకాశం ఉంది. యాజమాన్యం తీసుకున్న సొమ్ములు జమ చేయకపోవడంతో కార్మికులకు ఆ అవకాశం కుడా లేకుండాపోయింది.
మా గోడు పట్టించుకునేవారేరీ వేతనాలు, ఇతర బకాయిలు చెల్లించాలని కోరుతూ 86 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేశాం. మంత్రి కేఎస్ జవహర్ మా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు ఏమీ చేయలేదు. టీడీపీ ప్రభుత్వం కార్మికుల సమస్యల పరిష్కారంపై శ్రద్ధ చూపలేదు. తక్షణం బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఫ్యాక్టరీ తెరిపించేందుకు చర్యలు తీసుకోవాలి. కో–ఆపరేటివ్ క్రిడెడ్ సోసైటీ నుంచి యాజమాన్యం తీసుకున్న రూ.80లక్షల సొమ్ములు తక్షణం తిరిగి జమచేయాలి.
– నీరుకొండ కృష్ణారావు,ది.జైపూర్ సుగర్స్ అండ్ డిస్టిలరీస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు,చాగల్లు
Comments
Please login to add a commentAdd a comment