సాక్షి, అమరావతి: అధికార తెలుగుదేశం పార్టీ అరాచకాలు, అక్రమాలు ఆగడం లేదు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్లు అందకుండా టీడీపీ పెద్దలు భారీ కుట్రకు తెరతీశారు. టీడీపీ సర్కారు పాలనపై ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వారి ఓట్లు తమకు పడే అవకాశమే లేదన్న నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ ముఖ్యులు వచ్చారు. అందుకే ఉద్యోగుల ఓటు హక్కునే కాలరాచే కుతంత్రానికి పాల్పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మందికి పోస్టల్ బ్యాలెట్లు అందకుండా చేశారు. కొందరికి బ్యాలెట్ పేపర్లు లేకుండా ఖాళీ కవర్లు పంపించడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా 4,48,443 మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. వారిలో దాదాపు 3,64,249 మంది పోస్టల్ బ్యాలెట్ పొందారు. ఇంకా 84,194 మందికి బ్యాలెట్ పత్రాలు అందలేదు. అంటే వారు ఓటువేసే అవకాశం ఇక దాదాపు లేనట్లే.
ఎన్నికల విధుల్లో ప్రైవేట్ సిబ్బంది
ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడానికి చాలా రోజుల ముందునుంచే తెలుగుదేశం పార్టీ నేతలు తమ స్కెచ్‌కు పదును పెట్టారు. పోలింగ్ సిబ్బందిగా రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులకు బదులు ప్రైవేట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, అంగన్‌వాడీ వర్కర్లు, నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలకు చెందిన ఉద్యోగులను నియమించేలా పావులు కదిపారు. తమకు అనుకూలమైన సిబ్బందిని ఎన్నికల విధుల్లో నియమించేలా ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. పోలింగ్‌కు 15 రోజుల ముందు ప్రైవేట్ కాలేజీలు, స్కూళ్ల అధ్యాపకులు, ఉపాధ్యాయులు దాదాపు 45 వేల మందిని ఎన్నికల విధుల్లో నియమించారు. వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కూడా కల్పించారు. ఏప్రిల్ 5, 6, 7 తేదీల్లో ఫెసిలిటేషన్ సెంటర్లలో వారితో అధికార పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయించారు.
ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో ఎన్నికల సంఘం(ఈసీ) అప్రమత్తమైంది. చాలా జిల్లాల్లో ప్రైవేట్ సిబ్బందిని ఎన్నికల విధుల నుంచి తొలగించింది. వారి స్థానంలో ప్రభుత్వ సిబ్బందిని నియమిస్తూ ఏప్రిల్ 8న ఉత్తర్వులు ఇచ్చారు. ఓటు హక్కు వినియోగించుకొనేందుకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించాలని కోరగా, తరువాత ఇస్తామని చెప్పారు. కానీ, వేలాది మందికి ఇప్పటికీ పోస్టల్ బ్యాలెట్లు అందకపోవడం గమనార్హం. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి.
గెలుపోటముటల్లో పోస్టల్ బ్యాలెట్లు కీలకం
ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటముల్లో పోస్టల్ బ్యాలెట్లు కీలకంగా మారుతున్నాయి. అందుకే తమ ప్రభుత్వ పనితీరు పట్ల విముఖంగా ఉన్న ఉద్యోగులకు ఓటు హక్కు లేకుండా చేసేందుకు టీడీపీ పెద్దలు కుట్ర పన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఉద్యోగుల రాజ్యాంగ హక్కును కాలరాస్తారా?
‘‘ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్లను అందజేయకపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. వారి రాజ్యాంగ హక్కును కాలరాయడమే. దీనికంటే అన్యాయం, దారుణం మరొకటి ఉండదు. ఎన్నికల సంఘం వెంటనే స్పందించి, ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్లు జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి’’
– మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్
అర్హులైన వారందరికీ పోస్టల్ బ్యాలెట్లు అందజేయాలి
‘‘పోస్టల్ బ్యాలెట్లు అందజేయకపోతే ఉద్యోగులు తమ ఓటు హక్కును కోల్పోతారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్నికల్లో గెలిచే అభ్యర్థి, ఓడిపోయే అభ్యర్థికి మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా తక్కువ ఉన్నప్పుడు పోస్టల్ బ్యాలెట్లే కీలకం అవుతాయి. అర్హులైన ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్లు అందేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి’’
– ఈఏఎస్ శర్మ, కేంద్ర ఇంధన శాఖ రిటైర్డ్ కార్యదర్శి
హైకోర్టులో పిటిషన్ వేస్తాం..
‘‘వేలాది మంది ఉద్యోగులు ఓటు హక్కు కోల్పోయే పరిస్థితి వచ్చింది. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు చివరి నిమిషంలో పోలింగ్ డ్యూటీ వేశారు. దీనివల్ల వారు పోస్టల్ బ్యాలెట్‌కు దూరమయ్యారు. కలెక్టర్లను అడిగితే ఎన్నికల సంఘం అనుమతిస్తే అవకాశం ఇస్తామంటున్నారు. ఎన్నికల సంఘం అధికారిని సంప్రదిస్తే కలెక్టర్లే చూసుకోవాలని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం మినహా మాకు మరోమార్గం కనిపించడం లేదు’’
– వెంకట్రామిరెడ్డి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య కన్వీనర్
అర్హులందరికీ పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించాలి
‘‘అర్హులైన ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. అందరూ ఓటెయ్యాలి, ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి అంటూ ప్రభుత్వం ఓవైపు ప్రచారం చేస్తూనే మరోవైపు ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం లేకుండా చేయడం దారుణం. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే పోస్టల్ బ్యాలెట్లు అందజేశారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకొనేలా పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించాలి’’
– వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ, ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షులు
Comments
Please login to add a commentAdd a comment