పైకి కపట ప్రేమ.. లోన కాలకూట విషం  | Chandrababu Cunning Things Should Stop By Voters Of Andhra Pradesh | Sakshi
Sakshi News home page

పైకి కపట ప్రేమ.. లోన కాలకూట విషం 

Published Thu, Apr 11 2019 9:18 AM | Last Updated on Thu, Apr 11 2019 9:22 AM

Chandrababu Cunning Things Should Stop By Voters Of Andhra Pradesh - Sakshi

సాక్షి,అమరావతి:  ‘ఆదర్శ రాజకీయాలు నావి. నీతి, నిజాయితీలే ఊపిరిగా బతుకుతున్నా. నేను నిప్పులాంటి వాణ్ణి. దేశంలో ఎవరూ చేయనివిధంగా ఆస్తుల్ని ఏటా ప్రకటిస్తున్న ఆదర్శ రాజకీయవేత్తను. నాకు కులాలు, మతాలు ఉండవు. అందరూ, అన్ని ప్రాంతాలూ సమానమే. ప్రపంచానికే పాఠాలు చెప్పేవాడిని’ ఇటీవల కాలంలో ఏ టీవీలో చూసినా ఈ మాటలు వినిపిస్తున్నాయి. ఏ పత్రిక తిరగేసినా ఇవే కనిపిస్తున్నాయి.

ఇన్ని నీతులు వల్లెవేసే ఈ నాయకుడిలోని మరో స్వరూపం కూడా అప్పడప్పుడు బయటకు కనిపిస్తుంటుంది. పైకి గొప్పవాడిలా కనిపిస్తూ.. ప్రపంచానికే ఆదర్శ పురుషుడినని చెప్పుకునే ఈయన అసలు నైజం అనుకోకుండానే ఒక్కోసారి బయటపడుతూ ఉంటుంది. తాను బయటకు వల్లె వేసేది సూక్తులు, ఆదర్శాలు. లోపల చేసేది కుట్రలు, కుతంత్రాలు అనేది స్పష్టంగా తెలిసిపోతుంటుంది. విషపూరితమైన తన అసలు నైజాన్ని యథాలాపంగా బయట పెట్టేస్తుంటారు.

సీనియర్‌ మోస్ట్‌ పొలిటీషియన్‌ అన్నట్టు పైకి బిల్డప్‌ ఇస్తూ.. లోపల మాత్రం కుట్రలు చేసే ఈ నాయకుడు ఎవరో కాదు.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. బయటకు ప్రేమ ఒలకబోస్తూ.. లోపల విషం కక్కే వారికి ఓటు వేయాలా? నిండైన మనసుతో ప్రేమను పంచేవారికి ఓటు వేయాలా ! ప్రతి ఒక్క ఓటరూ నిర్ణయించుకోవాల్సిన క్షణాలు ఇవే. 

ఆ.. నా కొడుకులకు  జీతాల కోసమా.. 
ఇటీవల ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూ సందర్భంగా చంద్రబాబు, రాధాకృష్ణ ఉద్యోగులపై ఎంత విషం నింపుకున్నారో తేటతెల్లమైంది. ‘ఉద్యోగులకు సెంట్రల్‌ పీఆర్సీ ఇస్తామని చెప్పాం గానీ..’ అని చంద్రబాబు అనగానే.. రాధాకృష్ణ ‘ఉద్యోగులకు సెంట్రల్‌ పీఆర్సీనా! ఆ నా కొడుకులకు (ఉద్యోగులకు) జీతాలు ఇవ్వడానికా జనం ట్యాక్సులు కట్టేది? అది వద్దు. వద్దేవద్దు. తీసేయండి’ అని  వ్యాఖ్యానించారు. దీనికి స్పందనగా చంద్రబాబు ‘మీరు చెప్పినవన్నీ కరెక్టే. కానీ అధికారం లేకపోతే మనమేమీ చేయలేం. వాళ్లను (ఉద్యోగులను) కూడా లాగాలి కదా?’ అని ఉద్యోగుల విషయంలో తన దుర్బుద్ధి ఏమిటో చంద్రబాబు బయటపెట్టారు. 

బయట ఇలా..
‘ప్రభుత్వ నిర్ణయాలను, కార్యక్రమాలను అమలు చేసే బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంటుంది. ప్రభుత్వ యంత్రాంగం సంతోషంగా.. గౌరవప్రదంగా పనిచేసేందుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తాం. యంత్రాంగం సమర్థవంతంగా పని చేసినప్పుడే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరతాయి. ప్రజా సంక్షేమ పథకాలు అమలు కావాలంటే యంత్రాంగం సహకారం ఎంతైనా అవసరం’ ఇది ఉద్యోగుల విషయమై మేనిఫెస్టోలో ప్రస్తావించిన అంశం.  

పైకి లిబరల్‌గా కనిపించాలి.. తర్వాత మేనేజ్‌ చేయాలి 
సంక్షేమ పథకాల విషయంలో కూడా చంద్రబాబు బయటకు చెప్పేది ఒకటి. లోపల  భావం వేరొకటి. ఇటీవల సామాజిక పెన్షన్లను రూ.2వేలకు పెంచడం, పసుపు–కుంకుమ, అన్నదాత సుఖీభవ అంటూ ఎన్నికల ముందు ఓట్ల కోసం ప్రభుత్వ ధనాన్ని చంద్రబాబు ఖర్చు చేశారు. పెద్ద కొడుకుగా ఆదుకుంటున్నానని పెన్షన్ల గురించి చెప్పుకున్నారు. అన్నగా అక్కచెల్లెమ్మలకు పసుపు–కుంకుమ ఇస్తున్నానంటూ ప్రేమను ఒలకబోశారు. 
 
ఇదీ అసలు స్వరూపం 

ఏబీఎన్‌ ఇంటర్వ్యూలోనే .. ‘నేను ఎప్పుడూ ప్రజలకు డబ్బులు (సంక్షేమ పథకాల పేరిట) ఇచ్చేవాడిని కాదు. ఇది నా వ్యక్తిత్వానికి విరుద్ధం. కానీ ఇవ్వకపోతే చేతకాని వాణ్ణి అనుకుంటారు. ఇటీవల కాలంలో ఏం చేశానంటే బిగినింగ్‌లో మరీ డిజాస్టర్‌గా ఉన్నప్పుడు రూ.పది వేలిచ్చాను. నేనేమంటానంటే.. నాలాంటి వాడు కాస్త లిబరల్‌గా కనబడకపోతే చాలా ప్రాబ్లెమ్స్‌ వస్తాయి. లిబరల్‌గా వచ్చిన తరువాత మేనేజ్‌ చేయడం.. ఎడ్యుకేట్‌ చేయడం ఈజీగా వచ్చేస్తాయి’ అని చంద్రబాబు సంక్షేమ పథకాల విషయంలో తన అసలు స్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. 

వాడిపేరు తీసేయాలి
పిల్లనిచ్చిన మామ, తండ్రితో సమానమైన ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఆయనపై ఇప్పటికీ ఎంతటి విషం చిమ్ముతున్నారో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి వీడియో ద్వారా బట్టబయలైంది. ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీ కార్యక్రమం పేరు ఇంకా అదే ఉందా అని రాధాకృష్ణ అంటే చంద్రబాబు ‘వాడి (ఎన్టీఆర్‌) పేరు తీసేయాలి. పేరు మార్చాలి. మారుస్తున్నా’ అన్నారు.  ఇంతకు ముందు కూడా చంద్రబాబు తెలుగుదేశం కరపత్రాలపై ఎన్టీ రామారావు బొమ్మను తీసేయగా.. పార్టీలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 

పైకి చెప్తారిలా...
‘తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు మనకు ఆదర్శం. ఆయన ఆశయాల సాధనకు అందరూ కట్టుబడి పనిచేస్తూ ముందుకు వెళ్దాం. పేదలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అన్నదే అన్నగారి నినాదం. అదే మన లక్ష్యం. ఎన్టీఆర్‌ స్ఫూర్తిగా ముందుకు వెళ్దాం’ పార్టీ సమావేశాలు, ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు చేస్తున్న ప్రతిజ్ఞ. ఎన్టీ రామరావుకు భారతరత్న ఇచ్చేలా మహానాడులో ఏటా తీర్మానాలు ఆమోదిస్తూనే ఉంటారు. 

ముందు హామీ ఇద్దాం.. తర్వాత చూద్దాం..
రైతుల విషయంలో ఇలా.. 
‘రైతే దేశానికి వెన్నెముక. వ్యవసాయం గిట్టుబాటుకాక ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులు క్రాప్‌హాలిడే ప్రకటించడం వ్యవసాయ రంగ సంక్షోభానికి దర్పణం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులను ఆదుకుంటాం. అందుకే వ్యవసాయ రుణాలన్నిటినీ మాఫీ చేయనున్నాం. రుణమాఫీ వ్యవసాయ రంగానికి కొంత ఉపశమనం మాత్రమే’ 2014 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు అన్న మాటలివి. 

లోపలి మనిషి ఇలా.. 
ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ సందర్భంలో రాధాకృష్ణ, చంద్రబాబు అనుకోకుండా మనసులోని అసలు సంగతులను బయటపెట్టారు. ‘రైతుల రుణమాఫీ చేస్తానన్నాను. ఎంత చేస్తానో.. అసలు చేయాలో వద్దో తరువాత డిసైడ్‌ చేసుకోవచ్చు. ముందు హామీ ఇద్దాం’ అంటూ తన నిజస్వరూపాన్ని బయటపెట్టారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అవుతూ సంచలనం రేపుతోంది. 

ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు? 
లోపలి మనిషి బయటకొచ్చినప్పుడు.. 
ఎస్సీ, ఎస్టీలపై చంద్రబాబుకు ఎంత చులకన భావం ఉందో ఇటీవల బయట పెట్టుకున్నారు. ఇటీవల ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ‘ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు. డబ్బులు లేకపోతే. అందరూ సంపన్న వర్గంలోనే పుట్టాలనుకుంటారు. అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాలను ఏలవచ్చనుకుంటారు’ అంటూ ఎస్సీ, ఎస్టీ వర్గాలపై చులకన భావాన్ని బయట పెట్టుకున్నారు. 

పైకి మాత్రం ఇలా..
‘ఎస్సీ, ఎస్టీలు అనాదిగా చాలా వెనుకబడి ఉన్నారు. అంటరానితనం పోవాలి.  రెండు గ్లాసుల విధానం ఇప్పటికీ అమలవుతోంది. ఇది అమానుషం. మనుషు లంతా సమానమే. సమాజంలో అగ్రవర్ణాలతో సమానంగా వారినీ పైకి తీసుకురావడమే నా లక్ష్యం. చదువుల్లో ముందుండాలి. అన్నిరంగాల్లో వారిని పైకి తీసుకువచ్చే బాధ్యత నాది’ అసెంబ్లీలో.. అంబేడ్కర్‌ స్మృతివనం శంకుస్థాపన సమయంలో చంద్రబాబు చేసిన ప్రసంగంలోని కొన్ని మాటలివి. 

తోలు తీస్తా.. తోకలు కత్తిరిస్తా 
ఎస్టీల్లో చేరుస్తామంటూ ఇచ్చిన హామీని నెరవేర్చాలని జిల్లాల పర్యటన సందర్భంగా ఆయనను కలిసి విన్నవించిన మత్స్యకారులపై చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. ‘మీ తోలు తీస్తా. తమాషాలు చేస్తున్నారా?’ అని హూంకరించారు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బందితో వారందరినీ బయటకు నెట్టేయించారు. ఆలయాల్లో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణులు కనీస వేతనాలు ఇవ్వాలని వేడుకున్నందుకు వారినీ అవమానించారు. ‘సచివాలయంలోకి వచ్చి తమాషాలు చేయాలనుకుంటున్నారా. తోకలు కత్తిరిస్తా ఏమనుకుంటున్నారో. మీకు వేతనాలు పెంచేది లేదు ఏం చేసుకుంటారో చేసుకోండి’ అంటూ అవమానించారు. 

రాయలసీమ గూండాలు 
2014 ఎన్నికల సమయంలో విశాఖపట్నంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌కువ్యతిరేకంగా ప్రచారం చేయిస్తూ రాయలసీమ గూండాలు వచ్చారని ఆ ప్రాంత ప్రజలను అవమానించారు. కాపు రిజర్వేషన్ల సందర్భంగా ముద్రగడ పద్మనాభం తునిలో సభ పెట్టినప్పుడు విధ్వంసానికి తెరతీయించి దాని వెనుక సీమ,  పులివెందుల గూండాలు ఉన్నారని వ్యాఖ్యానించారు. 

కపట ప్రేమ ఇలా..
ఇటీవల కడప జిల్లా పులివెందులలో ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంలో రాయలసీమ ప్రాంతంపై చంద్రబాబు తన కపట ప్రేమను ఒలకబోశారు. ‘సీమ ప్రాంత బిడ్డగా గర్విస్తున్నా, సీమలోనే మళ్లీ జన్మించాలని 
కోరుకుంటున్నా’ అన్నారు. 

నేను వేసిన రోడ్ల మీద నడుస్తూ ఓట్లు వేయరా 
నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ‘నేను వేసిన రోడ్లపై నడుస్తూ, నేనిచ్చే పెన్షన్ల డబ్బు తింటూ.. నాకు ఓటు వేయరా’ అని వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత టీడీపీలో చేరిన సందర్భంగా.. ‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఆమె పలు సమస్యల పరిష్కారానికి నా వద్దకు వచ్చినా వేరే పార్టీకి చెందిన వ్యక్తి కనుక ఆ పనులు చేయనని చెప్పేశా’ అని తన కుత్సిత బుద్ధిని బయటపెట్టారు. 

వాచీలేదు.. ఉంగరమూ లేదు 
రాజకీయాల్లో తన అంత నీతిమంతుడు లేడన్నట్టుగా చంద్రబాబు కలరింగ్‌ ఇస్తుంటారు. పేదల సంక్షేమం, వారి అభ్యున్నతే తన ధ్యేయమంటారు. అవినీతి, అక్రమాలకు తాను ఎంతో దూరమని వ్యాఖ్యానిస్తూ.. ‘కావాలంటే చూసుకోండి. నా చేతికి వాచీ లేదు. వేలికి ఉంగరమూ లేదు. ఉదయం ఒక ఇడ్లీ.. రాత్రి రెండు చపాతీలు మాత్రమే తీసుకుంటా’ అని గొప్పలు చెబుతుంటారు. 

నిజంలోకి వెళితే.. 
వాస్తవంలోకి వెళితే చంద్రబాబు చేసే అవినీతి, అక్రమాలు అన్నీఇన్నీ కావు. ఇటీవల ఆయన దగ్గర పనిచేసిన నలుగురు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు చంద్రబాబు అవినీతి ఏస్థాయిలో జరుగుతోందో వివరాలతో సహా వెల్లడించారు. ఈ ఐదేళ్లలో చంద్రబాబు రూ.6 లక్షల కోట్ల మేర దోపిడీ చేశారు. ఎన్నికల్లో ఖర్చు కోసం వందలాది కోట్లు వెచ్చిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో రూ.40 కోట్లు ఇప్పటికే పంపిణీ చేయించారు. 

మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా? 

ప్రత్యేక హోదాకు బదులు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని అంగీకరించిన చంద్రబాబు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ‘హోదాకు మించిన ప్రయోజనాలు ప్యాకేజీ ద్వారా కేంద్రం కల్పిస్తామంటోంది. ప్యాకేజీతోనే అన్నీ వస్తున్నప్పడు హోదా మనకెందుకు? కోడలు మగపిల్లాడిని కంటానంటే ఏ అత్తయినా వద్దంటుందా? మగబిడ్డను కని ఇస్తానంటే అంతకన్నా మంచిదేముంటుంది? ఆడపిల్లల కన్నా మగపిల్లల్ని కనటమే మంచిద’ని వ్యాఖ్యానించి మహిళా లోకంపై తన చులకన భావాన్ని బయట పెట్టుకున్నారు. 

తెరముందు ఇలా..
‘మహిళలంటే నాకెంతో గౌరవం ఉంది. సమాజం పురోగతి సాధించాలంటే మహిళల పాత్ర ఎంతో ముఖ్యం. పురుషులతో పోలిస్తే మహిళలు ఎందులోనూ తీసిపోరు. అవకాశం వస్తే వారికన్నా ముందుకు దూసుకుపోతారు. సమాజంలో సగానికిపైగా మహిళలున్నా అందుకు తగ్గ అవకాశాలు వారికి దక్కడం లేదు’ అంటూ ప్రపంచ మహిళా దినోత్సవం సాక్షిగా చంద్రబాబు అన్న మాటలివి. 

భన్వర్‌లాల్‌కు రోజాతో అక్రమ సంబంధం అంటగట్టమన్నారు
గతం ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ నిష్పక్షపాతంగా ఉంటూ.. చంద్రబాబు అక్రమాలకు అడ్డుకట్టేవేసేవారు. దీన్ని జీర్ణించుకోలేక నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ఆయనకు మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నట్టు ప్రచారం చేయా లని వీడియో కాన్ఫరెన్సుల్లో ఎమ్మెల్యేలు, మంత్రులకు చంద్రబాబు ఆదేశించారు. వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే రోజాతో అక్రమ సంబంధం అంటగట్టండన్నారు.

ఇటీవల వైఎస్సార్‌ సీపీలో చేరిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ ఈ విషయాలను బయటపెట్టారు. తాను చెప్పేవి అబద్ధమైతే చంద్రబాబు మనుమడు దేవాన్‌‡్షపై ప్రమాణం చేయాలని కూడా ఆమంచి సవాల్‌ విసిరారు. చంద్రబాబు నుంచి దీనిపై ఎలాంటి స్పందనా లేదు. 

శవ రాజకీయాలకు పెట్టింది పేరు  

కేసీఆర్‌ను బూచిగా చూపిస్తూ ఈ ఎన్నికల్లో సెంటిమెంట్‌ను రాజేసి ఓట్లు దండుకోవాలన్నది చంద్రబాబు ఎత్తుగడ. ఆయనలోని మరో పార్శా్వన్ని పరిశీలిస్తే.. ‘రోడ్డు ప్రమాదంలో తన బావమరిది హరికృష్ణ చనిపోతే ఆయన ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. హరికృష్ణ శవం పక్కనే పెట్టుకుని టీఆర్‌ఎస్‌నేత,  కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌తో ఎన్నికల్లో పొత్తులపై చర్చలు జరిపారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో కలసి పోటీ చేస్తామని, పొత్తులు కుదుర్చుకుందామని ప్రతిపాదించారు. దానికి కేసీఆర్, కేటీఆర్‌ నిరాకరించారు. హరికృష్ణ శవం ఉందన్న కనీస స్పృహ కూడా లేకుండా చంద్రబాబు అక్కడే శవ రాజకీయాలకు దిగారు. 

మాట మారుస్తారిలా..
‘రాష్ట్రంపై పెత్తనానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుట్రలు పన్నుతున్నారు. వైఎస్‌ జగన్‌కు మద్దతు ఇస్తూ.. ఏపీ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకోవాలనుకుంటున్నారు. పోలవరంపై కేసులు వేసి అది పూర్తి కాకుండా కుట్రలు చేస్తున్నారు’ ఇటీవల కాలంలో చంద్రబాబు తరచూ చేస్తున్న విమర్శలు ఇవి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement