వర్గోన్నతి.. అధోగతి | Tdp Government Neglects The Government Hospitals | Sakshi
Sakshi News home page

వర్గోన్నతి.. అధోగతి

Mar 20 2019 8:04 AM | Updated on Mar 20 2019 8:08 AM

Tdp Government Neglects The Government Hospitals - Sakshi

కొవ్వూరు ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి

సాక్షి, కొవ్వూరు: పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. జిల్లాలో నరసాపురం, పాలకొల్లు, భీమవరం, కొవ్వూరు సామాజిక (కమ్యూనిటీ) ఆస్పత్రులను ఏరియా ఆస్పత్రులుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఆస్పత్రి భవనాలపై అప్పట్లో బోర్డులు సైతం మార్చారు. కొద్దినెలలకే ఆయన హఠాన్మరణంలో అప్‌గ్రేడేషన్‌ ప్రక్రియ మరుగున పడింది. ఐదేళ్ల నుంచి చంద్రబాబు సర్కారు దీనిపై శ్రద్ధ చూపలేదు. ఫలితంగా పేదలు ఉచిత వైద్య సేవలకు దూరమవుతున్నారు. రెండు నెలలు క్రితం నరసాపురం, భీమవరం ఆసుపత్రులను అప్‌గ్రేడ్‌ చేస్తూ ప్ర«భుత్వం జీఓ 44ని జారీ చేసింది. అయితే ఇందుకు అవసరమైన వైద్యులు, సిబ్బంది, మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలను సమకూర్చలేదు. కొవ్వూరు, పాలకొల్లు ఆసుపత్రులు ప్రతిపాదన దశలోనే ఉన్నాయి. కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.5 కోట్లతో ఇటీవల నూతన భవనాల నిర్మాణం చేపట్టారు. అప్‌గ్రేడేషన్‌ కాకపోవడంలో   పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించలేక రిఫరల్‌ ఆసుపత్రిగా మారింది. దీంతో జిల్లాలోని నాలుగు సామాజిక ఆస్పత్రులను ఏరియా ఆస్పత్రులుగా మార్చాలన్న ప్రతిపాదన కార్యరూపం దాల్చడం లేదు.  


అప్‌గ్రేడేషన్‌ చేస్తే ఉన్నత వైద్యం
జిల్లాలోని ఆయా నాలుగు ఆస్పత్రుల్లో రోజుకు సుమారు 2 వేల మంది వరకు వైద్య సేవలు పొందుతున్నారు. సామాజిక ఆసుపత్రులను 100 పడకల ఆస్పత్రులుగా అప్‌గ్రేడ్‌ చేయడం ద్వారా ప్రస్తుతం పనిచేస్తున్న వైద్య సిబ్బంది కంటే రెట్టింపు సిబ్బంది సమకూరే అవకాశం ఉంది. 50 పడకల ఆస్పత్రులకు సివిల్‌ సర్జన్, డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ తోపాటు ఐదుగురు సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు, దంత వైద్యులు, పది మంది స్టాఫ్‌ నర్సులు, హెడ్‌ నర్సు ఉంటారు. 100 పడకల ఆస్పత్రులుగా మార్చితే నలుగురు సివిల్‌ సర్జన్లు, 12 మంది అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్లతోపాటు 24 మంది స్టాఫ్‌ నర్సులు, నలుగురు హెడ్‌ నర్సుల పోస్టులు రావడంతోపాటు దాదాపు అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. బెడ్స్‌ పెరుగుతాయి.  


వైద్యం.. పూజ్యం
ప్రభుత్వాస్పత్రులు అప్‌గ్రేడ్‌ కాకపోవడంతో రోగులు ప్రైవేట్‌ ఆస్పత్రుల బాటపడుతున్నారు. నరసాపురం, పాలకొల్లు, భీమవరం ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులు భీమవరంలోని ప్రైవేట్‌ ఆస్పత్రులను, ఏలూరు జిల్లా ఆస్పత్రిని ఆశ్రయించాల్సి వస్తుంది. అత్యవసర సమయాల్లో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఉన్నాయి. కొవ్వూరు ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి వస్తున్న రోగులను రాజమండ్రి, కాకినాడ ఆస్పత్రులకు తరలివస్తున్నారు. జిల్లాలో తాడేపల్లిగూడెం, తణుకు, జంగారెడ్డిగూడెంలో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రులు, ఏలూరులో జిల్లా ప్రభుత్వాస్పత్రి ఉంది. మరోవైపు ఎన్‌టీఆర్‌ వైద్య సేవలో పలు రోగాలకు వైద్యం చేయకపోవడం, సకాలం లో వైద్యానికి అనుమతి రాకపోవడం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. వాహనాల నిర్వహణ సరిగా లేక 108 వాహనాలు కూడా పూర్తిస్థాయిలో సేవలందించలేకపోతున్నాయి.  


కాగితాలకే పరిమితం
భీమవరం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని ఏరియా ఆసుపత్రిగా మార్చుతూ ప్రభుత్వం జీఓలు జారీ చేసింది. వైద్యులు, వైద్య సిబ్బంది నియామకంపై శ్రద్ధ చూపలేదు. ఆసుపత్రి అప్‌గ్రేడేషన్‌ కాగితాలకే పరిమితం అయ్యింది. భీమవరం ఆసుపత్రి డెల్టా ప్రాంతంతో పాటు కృష్ణా జిల్లానుంచి రోగులు వస్తుంటారు. వందలాది మంది వైద్యసేవలు పొందుతున్నారు. ఐదేళ్ల నుంచి ప్రభుత్వం అప్‌గ్రేడేషన్‌ గురించి పట్టించుకోలేదు. ఎన్నికలకు నెలరోజుల ముందు జీఓ జారీ చేసి చేతులు దులుపుకుంది.
– కోడే యుగంధర్, భీమవరం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement