రోడ్డు ప్రమాదమైనా.. అస్వస్థతకు గురైనా.. పురిటి నొప్పులు పడుతున్నా.. కళ్లముందు ఎవరైనా మృత్యువుతో పోరాడుతున్నా ప్రతి ఒక్కరికీ ఠక్కున గుర్తుకు వచ్చే అపర సంజీవని 108 అంబులెన్స్. ఫోన్ చేసిన 15 నిమిషాల్లో పూర్తి సరంజామాతో వాలిపోయి.. పోతున్న ప్రాణాలను పట్టి జీవితాలను నిలబెట్టిన ప్రాణదాత ఈ వాహనం. ప్రజల ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ 108 సేవలు ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం, నిర్వాకంతో పూర్తిస్థాయిలో అందని దుస్థితి ఏర్పడింది. ఫలితంగా ఆపన్నులు విగతజీవులుగా మారిపోతున్నారు. అంబులెన్స్‌లో ఆక్సిజన్ లేక మొన్న పిఠాపురంలో ఒకరు మృతి చెందితే.. వాహనం సకాలంలో సంఘటన స్థలానికి చేరుకోక నాలుగు నెలల క్రితం పిఠాపురం సమీపంలోని చేబ్రోలు వద్ద రోడ్డు ప్రమాదంలో ఏడు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ప్రాణదాత అంపశయ్య పైకి చేరి.. సేవలు నిర్వీర్యమవుతున్న వేళ.. సకాలంలో వైద్యం అందక జిల్లాలో పలువురు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి.
మండపేట/ కాకినాడ సిటీ: సంఘటన జరిగినా పెద్దల నుంచి చిన్నారుల వరకూ వెంటనే 108కు ఫోన్ చేసేంతగా అనతికాలంలోనే ప్రజల్లోకి ఈ సేవలు చొచ్చుకుపోయాయి. వైఎస్సార్ ఆలోచనలను ఆదర్శంగా తీసుకుని 18 రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఆయన హఠాన్మరణానంతరం వచ్చిన పాలకులు 108 సేవలను క్రమంగా నిర్వీర్యం చేస్తూ వచ్చారు. దీంతో అంతంతమాత్రంగా మారిన ఈ సేవలు ఐదేళ్లుగా పట్టిన ‘చంద్ర’గ్రహణంతో మరింతగా క్షీణించాయి.
వైఎస్ గురుతులను చెరిపేయాలన్న లక్ష్యంతో 108 సేవల్ని టీడీపీ ప్రభుత్వం దెబ్బతీస్తూ వచ్చింది. ఫలితంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ప్రథమ చికిత్సను సహితం అందించలేని దుస్థితికి 108 సేవలు చేరుకున్నాయి. 108 సేవలు సక్రమంగా అందకపోవడంతో ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో ప్రభుత్వం ఎన్నికల ముందు జగ్గంపేట, ప్రత్తిపాడు, అన్నవరం, కరప, తాళ్లరేవు మండలాలకు ఒక్కొక్కటి చొప్పున కొత్త వాహనాలను అందించింది. అయినప్పటికీ ఇతర సమస్యలు అలాగే ఉండడంతో 108 సేవలు సకాలంలో అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
ఇవీ సమస్యలు
- జిల్లాలో 42 వాహనాలకు గాను అధికారిక లెక్కల ప్రకారం 39 తిరుగుతున్నాయి. వాస్తవానికి దాదాపు 13 వాహనాలు నాలుగు నెలల నుంచి ఏడాది కాలంగా పాడై షెడ్లలోనే ఉండగా, 29 వాహనాలు మాత్రమే తిరుగుతున్నట్టు తెలుస్తోంది.
- చాలా 108 అంబులెన్సులలో పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. ప్రతి అంబులెన్స్‌కు ఇద్దరు పైలట్లను, ఇద్దరు టెక్నీషియన్లను నియమించారు. చాలా అంబులెన్సులలో నిన్నమొన్నటి వరకూ టెక్నీషియన్లు కూడా లేక ప్రథమ చికిత్స కూడా అందేది కాదు. కొన్ని వాహనాలు ఒక్క పైలట్‌తోనే నడుస్తున్నాయి. సిబ్బంది ఉన్న చాలా వాహనాల్లో ప్రథమ చికిత్సకు అవసరమైన పరికరాలు కూడా లేవు. దీంతో ప్రమాద బాధితులు, అపాయంలో ఉన్నవారికి అత్యవసర వైద్య సేవలు అందడం లేదు. దీనినిబట్టి ఈ సేవలపై ప్రభుత్వం ఏ స్థాయిలో నిర్లక్ష్యం చూపుతోందో అర్థం చేసుకోవచ్చు.
- అధిక శాతం వాహనాలు మైనర్ రిపేర్లతో నడుస్తున్నాయి. ఇంజిన్ ఆయిల్ మార్చకపోవడం, టైర్లు అరిగిపోవడం, బ్రేకులు పని చేయకపోవడం తదితర సమస్యలు అపర సంజీవని లక్ష్యానికి ప్రతిబంధకమవుతున్నాయి.
- సాధారణంగా రెండు లక్షల కిలోమీటర్లు తిరిగిన అంబులెన్సులను మార్చాల్సి ఉండగా.. జిల్లాలో అధిక శాతం వాహనాలు నాలుగు నుంచి ఐదు లక్షల కిలోమీటర్లు తిరిగినవి కావడం గమనార్హం. దీంతో అత్యవసర సమయాల్లో ఇవి ఎక్కడ ఆగిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది.
- అత్యవసరంగా వెళ్లాల్సిన సమయంలో వాహనాలు మొరాయించి తీవ్ర జాప్యం జరుగుతూండటంతో ప్రాణనష్టం జరిగిపోతోంది.
- ఫిట్‌నెస్ లేకపోవడంతో తరచూ వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి.
- ఇటీవల ఆరు కొత్త వాహనాలు ఇచ్చినట్టు చెబుతుండగా మరమ్మతులు చేయించక పాత వాహనాలు షెడ్లలోనే మూలుగుతున్నాయి.
- వైఎస్ హయాంలో అత్యవసర వైద్యసేవల కోసం అంబులెన్సులలో 120 రకాల మందులు అందజేస్తే ప్రస్తుత ప్రభుత్వం 100కు తగ్గించేసి, వాటిని కూడా అరకొరగానే అందిస్తోంది.
ఆక్సిజన్ లేక పోతున్న ఆయువు
అత్యవసర కేసుల్లో క్షతగాత్రులకు, రోగికి ఆక్సిజన్ అందించడం తప్పనిసరి. ఆస్పత్రికి తరలించేంత వరకూ రోగి ప్రాణాలు నిలపడంలో ఆక్సిజన్ కీలకం. కాగా జిల్లాలో కేవలం ఐదు వాహనాల్లో మాత్రమే ఆక్సిజన్ అందుబాటులో ఉండడం గమనార్హం. మిగిలిన వాహనాల్లో సిలిండర్లు కూడా లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఒక్కో వాహనంలో రెండు ఆక్సిజన్ సిలిండర్లు ఉంచుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఆక్సిజన్ అయిపోయిందని చెప్పినా నిర్వాహకులు ఆక్సిజన్ సమకూర్చడం లేదని పలువురు 108 సిబ్బంది చెబుతున్నారు. శ్వాస సంబంధ సమస్యతో బాధ పడుతున్న పిఠాపురం ఇందిరా కాలనీ వాసి కూరపాటి చినగంగరాజు 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా.. అంబులెన్సులో ఆక్సిజన్ లేక మార్గంమధ్యలోనే మృతి చెందడం ‘అపర సంజీవని’ సేవలు నిర్వీర్యమవుతున్న తీరుకు నిదర్శనం.
ఇంధనమూ కష్టమే
108 వాహనాలకు డీజిల్ నింపడం కూడా కష్టంగా మారింది. రోజూ డీజిల్ నింపుకొనేందుకు ఆయా ప్రాంతాల్లో 108 వాహనాలకు కొన్ని బంకులు కేటాయించారు. ఇదివరకు ఆన్‌లైన్ బిల్లింగ్ పేరుతో ఫుల్‌ట్యాంక్ కొట్టేవారు. అయితే ఇప్పటికే లక్షల రూపాయల మేర డీజిల్ బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో బంకు యజమానులు డీజిల్ పోయడానికి నిరాకరిస్తున్నారని తెలుస్తోంది.
అత్యవసర సేవలకు ప్రాధాన్యం ఇవ్వాలి
108 అనేది అత్యవసర సేవ. దీనిపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు. ప్రమాదాలు జరిగిన సమయాల్లో వేలాది మంది ప్రాణాలను కాపాడిన ఘనత 108కు ఉంది. కొత్త వాహనాలను ఏర్పాటు చేసి సేవలను మెరుగుపరచాలి. ప్రసూతి కోసం ఇదే వాహనాలను ఉపయోగించడంతో ప్రమాదాలు జరిగినప్పుడు సకాలంలో వాహనాలు అందడం లేదు. ప్రసూతి కోసం గర్భిణులను ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. నిధులు కేటాయించి, డీజిల్‌కు ఇబ్బందులు లేకుండా చూడాలి. – అడ్డూరి ఫణీశ్వర రవిరాజ్‌కుమార్, జిల్లా ప్రయాణికుల సంఘం కార్యదర్శి, డీఆర్‌యూసీసీ మెంబర్, కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment