- మద్దతు ధర కోసం రోడ్డెక్కిన చెరుకు రైతులు
- సీఎం ఇల్లు ముట్టడి భగ్నం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్ట ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను చక్కెర కర్మాగారాల యాజమాన్యాల నుంచి ఇప్పించాలని డిమాండ్ చేస్తూ చెరుకు రైతులు శుక్రవారం నగరంలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. మండ్య, మద్దూరు, హాసన, బెల్గాం తదితర ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో తరలి వచ్చిన రైతులు రైల్వే స్టేషన్ నుంచి ఫ్రీడం పార్కు వరకు ప్రదర్శనగా తరలి వచ్చి ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి నివాసం వరకు ప్రదర్శనగా వెళ్లాలనుకున్న వారి ప్రయత్నాలను పోలీసులు భగ్నం చేశారు.
ఈ సందర్భంగా చెరుకు రైతుల సంఘం అధ్యక్షుడు కురుబూరు శాంత కుమార్ మాట్లాడుతూ రాష్ర్టంలోని 56 చక్కెర కర్మాగారాల నుంచి రైతులకు రూ.3,500 కోట్లకు పైగా రావాల్సి ఉందని తెలిపారు. దీనికి సంబంధించి ఎనిమిది నెలల కిందటే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ, యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమ బకాయిలను ఇప్పించడానికి ముఖ్యమంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం టన్ను మద్దతు ధరను రూ.2,500గా నిర్ణయించడంతో పాటు రూ.150 ప్రోత్సాహకాన్ని ప్రకటించిందని గుర్తు చేశారు. ప్రోత్సాహక మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. చక్కెర కర్మాగారాల యాజమాన్యాలు రూ.2,500 కాకుండా రూ.రెండు వేలు చెల్లిస్తున్నాయనిఆరోపించారు. రాష్ట్రంలోని అనేక కర్మాగారాలు ఎమ్మెల్యేలు, మంత్రుల ఆధీనంలో ఉన్నాయని, ప్రభుత్వం కూడా వీరి అదుపాజ్ఞల్లో ఉందని విమర్శించారు.
కాగా ధర్నా జరుగుతుండగానే శాంత కుమార్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వద్దకు చర్చలు జరిపారు. ప్రోత్సాహకానికి సంబంధించి రూ.350 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేస్తామని సీఎం ఆయనకు హామీ ఇచ్చారు. కాగా రైతుల ధర్నా కారణంగా మెజిస్టిక్ చుట్టుపక్కల కాసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది.