త్వరలో హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారి విస్తరణ
ఏపీలో 260 కిలోమీటర్ల హైవే అభివృద్ధి
4 లేన్ల నుంచి 6 లేన్ల ఎక్స్‌ప్రెస్ హైవేగా మార్పు
డీపీఆర్ రూపొందిస్తున్న ఎన్‌హెచ్‌ఏఐ
ఇప్పటికే భూసేకరణ పూర్తి
డీపీఆర్‌కు ఆమోదముద్ర పడగానే టెండర్లు
ఎన్‌హెచ్–44.. దేశంలోనే అతి పెద్ద జాతీయ రహదారి. కశ్మీర్ రాజధాని శ్రీనగర్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు 3,745 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ రహదారి 11 రాష్రాల్లోని 30 ప్రధాన నగరాలను అనుసంధానిస్తోంది. జాతీయ రవాణా వ్యవస్థలో ఎన్‌హెచ్–44 అత్యంత కీలకమైంది. ఈ రహదారిలో బెంగళూరు–హైదరాబాద్ నగరాల మధ్య వాహనాల రద్దీ అధికంగా ఉంది. ఇప్పుడున్న ‘ఫోర్ వే’ సౌలభ్యంగా ఉన్నా.. ఐదేళ్లలో వాహనాల రద్దీ తీవ్రంగా పెరిగింది.
ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్‌కు సరిపోని పరిస్థితి. కర్నూలు సమీపంలోని పుల్లూరు టోల్‌గేట్ నుంచి బెంగళూరు–హైదరాబాద్ మధ్య నిత్యం 16 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అలాగే అమకతాడు టోల్‌గేట్ పరిధిలో 11 వేల వాహనాలు వెళ్లొస్తున్నాయి. దేశంలో అభివృద్ధి చెందిన, చెందుతున్న నగరాల్లో బెంగళూరు–హైదరాబాద్ ప్రధానమైనవి. ఐటీతో పాటు పారిశ్రామికంగా రెండు నగరాలు అభివృద్ధి చెందాయి.
రెండు నగరాల మధ్య 583 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణం చేసేవారి సంఖ్య కూడాఎక్కువే. కొందరు రైళ్లు, విమానాల్లో వెళుతున్నా అధిక శాతం రోడ్డు మార్గంలోనే ప్రయాణిస్తున్నారు. దీంతో వాహనాల రద్దీ పెరిగింది. ముఖ్యంగా కార్ల వినియోగం అధికమైంది.
ట్రాఫిక్ పెరగడాన్ని గుర్తించిన కేందప్రభుత్వం భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ రహదారిని 6 లేన్లుగా విస్తరించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సిద్ధం చేయాలని అనంతపురం నేషనల్ హైవే అధికారులకు సూచించింది.
పూర్తయిన భూసేకరణ.. నిర్మాణ ఖర్చులతోనే డీపీఆర్
ఎన్‌హెచ్–44ను డబుల్ లైన్ నుంచి నాలుగు లేన్ల రహదారిగా విస్తరించే సమయంలోనే ఆరు లేన్లకు సంబంధించి భూసేకరణ జరిగింది. అప్పట్లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 6 లేన్ల కోసం భూసేకరణ చేశారు. 4 లేన్ల రహదారిని నిర్మించి తక్కిన భూమిని రిజర్వ్‌గా ఉంచారు.
ఇప్పుడు కేవలం రహదారిని 6 లేన్లకు విస్తరించేందుకు అవసరమైన ఖర్చును మాత్రమే అంచనా వేసి డీపీఆర్ రూపొందిస్తున్నారు. కల్వర్టులు, వంతెనలు ఇతరత్రా ఖర్చులు లెక్కిస్తున్నారు. భూసేకరణలో సమస్యలు, కోర్టు వివాదాలు కూడా లేవు. దీంతో డీపీఆర్‌ను జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు పంపిస్తే ఆమోదముద్ర వేసి టెండర్లు పిలుస్తారు.
‘సీమ’ వాసులకు ప్రయాణం మరింత సులభం
ఎన్‌హెచ్–44 విస్తరణతో ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు వైఎస్సార్ జిల్లా వాసులకు ప్రయాణం సులభం కానుంది. కర్నూలు–హైదరాబాద్ 217.7 కిలోమీటర్లు ఉంది. ప్రస్తుతం 4గంటల సమయం పడుతోంది. అలాగే కర్నూలు–బెంగళూరు మధ్య 359.4 కిలోమీటర్ల దూరం ఉంది.
ప్రయాణానికి 7 గంటలు పడుతోంది. ఎన్‌హెచ్–44 విస్తరిస్తే సమయం తగ్గే అవకాశం ఉంది. అనంతపురం జిల్లా వాసులకూ హైదరాబాద్, బెంగళూరుకు ప్రయాణ సమయం తగ్గనుంది. కడప, చిత్తూరు జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లాలనుకునే వారికి కర్నూలు నుంచి, బెంగళూరుకు ప్రయాణించే వైఎస్సార్ జిల్లా వాసులకు కొడికొండ చెక్‌పోస్ట్ సమీపంలోని కొండూరు నుంచి ప్రయాణం వేగవంతం కానుంది.
హైదరాబాద్–బెంగళూరు ఇండ్రస్టియల్ కారిడార్‌లో నోడ్ పాయింట్‌గా కేంద్రం ఓర్వకల్లు మెగా ఇండ్రస్టియల్ హబ్‌ను గుర్తించింది. ఎన్‌హెచ్–44 విస్తరణ పారిశ్రామికంగానూ ఉపయోగపడనుంది.
డీపీఆర్ సిద్ధమవుతోంది
బెంగళూరు–హైదరాబాద్ నేషనల్ హైవేను 12 లేన్లుగా విస్తరిస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. 4 నుంచి 6 లేన్లకు విస్తరిస్తున్నాం. ఇందుకు సంబంధించి డీపీఆర్ రూపొందిస్తున్నాం. భూసేకరణ సమస్య లేదు. దీంతో 2, 3 నెలల్లో డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తాం. దీని ఆధారంగా కేంద్రం విస్తరణపై నిర్ణయం తీసుకోనుంది. – రఘు, ప్రాజెక్ట్ డైరెక్టర్, నేషనల్ హైవేస్ అథారిటీ, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment