చక్కెర కర్మాగారాల ప్రైవేటీకరణకు కుట్ర
ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి నెట్టేస్తోంది తమవారికి కట్టబెట్టే కుట్రలు చేస్తోంది ధ్వజమెత్తిన వైఎస్ జగన్
విశాఖపట్నం: సహకార రంగంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి నెట్టేసి తమవారికి కట్టబెట్టాలని కుట్రలు పన్నుతోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. చక్కెర రైతుల తరఫున పోరాడతామని, ఫ్యాక్టరీల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని స్పష్టంచేశారు. హుదూద్ తుపాను బాధిత విశాఖపట్నం జిల్లాలో ఐదో రోజు పర్యటనలో భాగంగా జగన్ శనివారం అనకాపల్లి, చోడవరంలతోపాటు విశాఖ ఏజెన్సీలోని పాడేరు, హుకుంపేట, అరకు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. తమ వద్దకు వచ్చిన జగన్‌ను చూసి చెరకు రైతులు, గిరిజనులు ప్రభుత్వం తమను ఆదుకోవడంలేదని వాపోయారు. తమకు సాయం చేయాలని, తమ కోసం పోరాడాలని కోరారు. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు విశాఖపట్నంలో బయలుదేరిన ఆయన అనకాపల్లిలోని ఆవఖం డం వద్ద ఆగి వరద ముంపులో మునిగిన చెరకు తోటలను పరిశీలించారు. కూలిన గుడిసెలను చూశారు. అక్కడినుంచి అనకాపల్లిలోని చవితి నివీధి, విజయరామరాజుపేట జంక్షన్, తుమ్మపాల, వెంకుపాలెం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. కూలిన ఇళ్లు, గుడిసెలను పరిశీలించారు. చెరకు రైతులు, మహిళలతో మాట్లాడారు. ఏజెన్సీలోని పాడేరులోని గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. మోదుపల్లిలో తుపానుకు దెబ్బతిన్న కాఫీ తోటలను పరిశీలించారు. యరడపల్లిలో బురదలో నడుస్తూ కూలిన ఇళ్లను పరిశీలించారు. గిరిజనులతో మాట్లాడారు.
అరకులోయ రూరల్ మండలంలో కొండచరియ విరిగిపడి దుర్మరణం పాలైన మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. అరకులో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. శనివారం అర్ధరాత్రి వరకు అలుపు లేకుండా ఆయన పర్యటన సాగింది. ఈ సందర్భంగా తమ్ముపాల, మోదుపల్లి వద్ద ఆయన చెరకు, కాఫీ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఏమన్నారంటే....
► సహకార రంగంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి నెట్టేస్తోంది. అనకాపల్లి షుగర్స్ రైతులకు రూ.6కోట్లు ఇవ్వాల్సి ఉండగా... కేవలం రూ.2కోట్లే ఇచ్చింది. మిగిలిన రూ.4కోట్లు ఇవ్వకపోగా... ఫ్యాక్టరీ రూ.23కోట్లు నష్టాల్లో ఉన్నట్లు చూపిస్తోంది. ఆ సాకుతో ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయాలన్నది ప్రభుత్వ దురుద్దేశం. గతంలో కూడా ఇలాగే సహకారరంగంలోని సుగర్ ఫ్యాక్టరీలను తమవారికి తక్కువ ధరకు కట్టబెట్టేశారు. ఈసారి అదే చేద్దామనుకుంటున్నారు.
► రైతులతో ప్రభుత్వం చెలగాటమాడాలని చూస్తోంది. సర్కారు ఆటలు సాగనివ్వం. సుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతాం. చెరకు రైతులకు హెక్టారుకు రూ.10వేలు పరిహారం ఇస్తామమని ప్రభుత్వం చెబుతోంది. అది ఏమూలకు సరిపోతుంది? ఎకరాకు రూ.15వేలు ఇవ్వాలి. కొబ్బరి చెట్టుకు రూ.5వేలు ఇవ్వాలి.
► కాఫీ రైతులకు పరిహారం విషయంలో ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించాలి. కాఫీ తోటల్లో కూలిపోయిన సిల్వర్‌వోక్ చెట్లు మరో 15ఏళ్లకుగానీ పెరగవు. ఆ చెట్ల నీడలోనే కాఫీ తోటలు పెరుగుతాయి. అవి లేకపోతే కాఫీ తోటలు పెరగవని ప్రభుత్వానికి తెలీదా? ప్రభుత్వం హెక్టారుకు రూ.15వేలు ఇస్తామని చెబుతోంది. ఇంతకంటే అన్యాయం మరొకటి ఉండదు. గిరిజనులు ఏజెన్సీలో తప్ప బయటకు వెళ్లలేరు. వారికి మరో బతుకుదెరువు లేదు. కాబట్టి నష్టపోయిన కాఫీ తోటలకు హెక్టారుకు రూ.లక్ష పరిహారాన్ని ప్రకటించాలి.
అందరికీ భరోసానిస్తూ...
విశాఖపట్నంలో శనివారం ఉదయం మొదలైన జగన్ ఐదోరోజు పర్యటన అర్ధరాత్రి వరకూ సాగింది. తుపానువల్ల తమకు కలిగిన నష్టాన్ని రైతులు, గిరిజనులు ఆయనకు చెప్పుకున్నారు. అందరికీ న్యాయం జరిగేవరకూ పోరాడతానని భరోసానిస్తూ జగన్ ముందుకు సాగారు. జగన్ పర్యటన లో ముఖ్యాంశాలు ఇలా...
► గత పైలీన్ తుపానుతో మొత్తం పంట పోయింది. కానీ పరిహారం ఇవ్వలేదు. ఈసారైనా పంట చేతికొస్తుందనుకుంటే మళ్లా తుపాను ముంచెత్తింది. ఇంతవరకు ఎవ్వరూ రాలేదు. మా గతేం కాను. దిక్కుతోచడం లేదని కర్రిరాము, పిల్లా కొండయ్య, అప్పలనాయుడులు జగన్‌తో చెప్పుకుని వాపోయారు.
► గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే తుమ్మపాల ఫ్యాక్టరీని అమ్మేద్దామనుకున్నారు. అప్పట్లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి అడ్డుకున్నారు. మళ్లీ ఇప్పుడు సీఎం ఆ ఫ్యాక్టరీని అమ్మేస్తారనిపిస్తోంది. ఫ్యాక్టరీ మూసేశారు. ఏడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. చెరకు క్రషింగ్ డబ్బులు ఇవ్వడం లేదు.రైతులం రోడ్డున పడతామని ఆందోళన వ్యక్తంచేశారు. తుపాను వచ్చినప్పుడు భారీ వర్షాలకు ఏలేరు, పులికాల్వ పొంగడంతో 3,500 ఎకరాల్లో చెరకు పంట మునిగిపోతున్నా సర్కారు పట్టించుకోవడం లేదని జగన్ దృష్టికి తీసుకువచ్చారు.