Hudood Storm
-
హ్యామ్స్ ఫెస్ట్
‘హ్యామ్ ఫెస్ట్ ఇండియా 2014’ యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది. నాడు సునామీ, నేడు హుదూద్... అల్లకల్లోలమైన విశాఖలో హ్యామ్స్ రేడియో కీలక పాత్ర పోషించింది. సెల్ఫోన్లు, ల్యాండ్లైన్లు పనిచేయని చోట... పనిచేసిన అమెచ్యూర్ రేడియోలో తామూ భాగస్వాములు కావాలని ఈ ఫెస్ట్‌కు వచ్చిన యువత ఆసక్తి చూపించారు. బంజారాహిల్స్ ముఫకంజా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో శనివారం నిర్వహించిన ఈ ప్రదర్శనలో దేశంలోని హ్యామర్లతో పాటు విద్యార్థులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కమ్యూనికేషన్ రంగంలో చోటు చేసుకొంటున్న సాంకేతిక అంశాలపై సెమినార్లు నిర్వహించారు. -
వంటకు తంటా !
శ్రీకాకుళం పాతబస్టాండ్: అన్నివర్గాలనూ అవస్థల పాల్జ్జేసి న హుదూద్ తుపాను ప్రభావం ఇప్పుడు వంట గ్యాస్‌పై పడింది. గ్యాస్ కొరత ఉండడంవతో బుక్ చేసిన తరువాత సిలిండర్ అందేసరికి నెల రోజులు పైబడుతుండడంతో వినియోగదారులు అల్లాడిపోతున్నారు. మహిళలు వంటకు తంటా పడుతున్నారు. గత నెల 12వ తేదీన సంభవించిన తుపాను కారణంగా జిల్లాకు రావాల్సిన వంట గ్యాస్ సరఫరా గణనీయంగా తగ్గింది. గ్యాస్ కంపెనీలకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఉత్పత్తి పడిపోయింది. ఫలితంగా కావాల్సినంత స్థాయిలో గ్యాస్‌ను సరఫరా చేయలేకపోతున్నాయి. గతనెల రెండో తేదీన అన్లైన్లో బుక్ చేసిన వినియోగదారులకు ఇప్పటికీ సిలిండర్లు సరఫరా కాకపోవడంతో గ్యాస్ ఏజెన్సీల చుట్టూ వినియోగదారులు తిరుగుతున్నారు. జిల్లాలో హెచ్‌పీ, భారత్, ఇండియన్ తదితర గ్యాస్ ఏజన్సీలు 20 ఉన్నాయి. వీటిలో దీపం, డబల్ సిలిండర్, ఇతర వినియోగదారులు కలిపి 3.72 లక్షల మంది ఉన్నారు. వీటిలో ఇప్పటి వరకు ఆధార్, బ్యాంకు ఖాతాల అనుసంధానం 2.85 లక్షల సర్వీసులకు జరిగాయి. ఇందులో 1.21 ల క్షలు కనెక్షన్లు దీపం పథకంలో ఉండగా వీటిలో ఇప్పటి వరకు ఆధార్ అనుసంధానం చేసినవి 82 వేలు ఉన్నాయి. జిల్లాలో వినియోగంలో ఉన్న గ్యాస్ కనెక్షన్లు అన్నీ కలిపి 2.85 లక్షలు ఉన్నాయి. వీరిలో చాలామంది గ్యాస్ బుక్ చేసినా సిలిండర్లు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో రోజుకి సుమారు 5000 సిలిండర్లను వినియోగదారులు వాడుతున్నారు. గ్యాస్ అయిపోయిన వారంతా తిరిగి బుక్ చేసుకొని సిలిండర్ల కోసం ఎదురు చూస్తున్నారు. గ్యాస్ కొరత విషయూన్ని జిల్లా సివిల్ సప్లై ఆధికారి సీహెచ్ ఆనంద కుమార్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా తుపాను వల్ల ఇబ్బంది వచ్చిందన్నారు. ప్రస్తుతం సరఫరా ప్రారంభమైందని, మరో పది రోజుల్లో పరిస్థితి చక్కబడుతోందన్నారు. -
యూరియా ధరలకు రెక్కలు
అసలు ధర రూ.283.. రూ.400కు విక్రయాలు కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు జిల్లాలో రైతులపై రూ.4 కోట్ల భారం చోద్యం చూస్తున్న అధికారులు మచిలీపట్నం/ చల్లపల్లి : హుదూద్ తుపాను దెబ్బకు యూరియా ధరలకు రెక్కలొచ్చాయి. యూరియాకు డిమాండ్ పెరగడంతో వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఎరువుల దుకాణాల్లో బహిరంగంగానే అధిక ధరలు వసూలు చేస్తున్నారు. దీంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై వ్యవసాయాధికారులు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. బస్తాకు రూ.100 అదనం ఈ ఏడాది జిల్లాలో 6.25 లక్షల ఎకరాల్లో వరి, 1.30 లక్షల ఎకరాల్లో పత్తి, 40 వేల ఎకరాల్లో చెరుకు, 20 వేల ఎకరాల్లో మొక్కజొన్న, ఆరువేల ఎకరాల్లో పసుపు సాగును రైతులు చేపట్టారు. ఈ పంటలకు ఎరువుగా వాడేందుకు 1.20 లక్షల టన్నుల యూరియా అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. అధికారుల లెక్కల ప్రకారం వరికి ఎకరాకు 75 కిలోలు మాత్రమే వాడాల్సి ఉండగా, రైతులు 150 కిలోల వరకు వాడుతున్నారు. ఈ లెక్కన జిల్లాలో వరి పంటకు 1.85 లక్షల టన్నుల యూరియా అవసరం అవుతుంది. ప్రస్తుతం మూడో కోటా, చిగురు కోటా వేసే పనిలో ఉన్నారు. ఈ రెండుసార్లు యూరియా చల్లేందుకు జిల్లా వ్యాప్తంగా 65 వేల టన్నుల యూరియా కావాల్సి ఉండగా ప్రస్తుతం కొరత ఏర్పడటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మార్పీ ధర ప్రకారం యూరియా రూ.283కు, వేపనూనె కలిపిన యూరియా రూ.298కి అమ్మాల్సి ఉంది. హుదూద్ తుపాను వల్ల విశాఖపట్నంలో నిల్వ ఉంచిన సుమారు రెండు లక్షల టన్నుల యూరియా నీటిపాలవడంతో యూరియా కొరత ఏర్పడింది. దీనికితోడు అధికారులు సూచించిన దానికంటే రెంటింపు స్థాయిలో యూరియా వాడటం వల్ల డిమాండ్ పెరిగింది. ఈ కారణాల వల్ల దివిసీమతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రూ.283కు అమ్మాల్సిన 50 కిలోల యూరియా బస్తాను రూ.400 వరకు వ్యాపారులు అమ్ముతూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. యూరియాకు డిమాండ్ పెరగడం, కొరత ఏర్పడటంతో హోల్‌సేల్ వర్తకుల నుంచి రూ.283 విలువ గల 50 కిలోల యూరియా బస్తాను రూ.360కి కొనుగోలు చేసి తీసుకొస్తున్నట్టు కొంతమంది వ్యాపారులు చెబుతున్నారు. రవాణా చార్జీలు, ఎత్తుడు, దింపుడు కూలి, లాభాలు కలుపుకొని అంత రేటుకు అమ్మాల్సి వస్తోందని వారు పేర్కొంటున్నారు. ఏదేమైనా బస్తాకు రూ.100 అదనంగా చెల్లించాల్సి రావడం రైతులకు పెనుభారంగా మారింది. దీనివల్ల జిల్లా వ్యాప్తంగా రైతులపై రూ.4 కోట్ల అదనపు భారం పడనుంది. బ్లాక్ మార్కెట్‌కు పీఏసీఎస్ ఎరువులు జిల్లాలో 425 పీఏసీఎస్‌లు ఉండగా వీటిలో 280 చోట్ల మాత్రమే ఎరువుల అమ్మకాలు సాగుతున్నాయి. వీటిలో చాలా పీఏసీఎస్‌లు రెండుసార్లకు సరిపడా మాత్రమే ఎరువులను నిల్వ ఉంచుకున్నాయి. మిగిలిన రెండు కోటాల ఎరువులను కొద్దిరోజుల నుంచి పీఏసీఎస్‌లకు రప్పించుకుంటున్నారు. దివిసీమలోని ఓ మండలంలో రెండురోజుల క్రితం రెండు సొసైటీలకు రెండేసి చొప్పున యూరియా లోళ్లు రాగా, యూరియాకు ఉన్న డిమాండ్‌తో వాటిని బస్తా రూ.320 చొప్పున రహస్యంగా బయట ఎరువుల షాపులకు అమ్ముకున్నారనే విమర్శలున్నాయి. ప్రస్తుతం యూరియాకు బాగా డిమాండ్ పెరగడం, కొరత ఉండటంతో చాలాచోట్ల పీఏసీఎస్‌లలో ఇదే తరహా వ్యాపారం చేస్తున్నట్టు తెలిసింది. ఉన్నతాధికారులు స్పందించి యూరియాను ఎమ్మార్పీ ధరలకే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. కొరత లేదు జిల్లాలో ఇటీవలే 3,400 టన్నుల యూరి యాను సరఫరా చే శాం. మరికొద్ది రోజుల్లో యూరియా ర్యాక్‌లు జిల్లాకు రానున్నాయి. ఎవరైనా యూరియాకు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. ఆయా మండలాల ఏవోలతో ఎప్పటికప్పుడు ఎరువుల విక్రయాలపై సమీక్ష నిర్వహిస్తూనే ఉన్నాం. - నరసింహులు, వ్యవసాయ శాఖ జేడీ -
అందాల సీమకు దారేదీ?
పర్యాటకంపై తుపాను ప్రభావం తీవ్రంగా దెబ్బతిన్న కేకే లైన్ అరకు వెళ్లే దారి లేక టూరిస్టుల నిరాశ ఏటా ఈ సీజన్లోనే రద్దీ చీకటి గుహల్లోంచి రైలు వెళుతుంటే గెంతులేయాలని, గోల చేయాలని ఆశ పడతారు... వయ్యారి భామలా ఒంపులు తిరుగుతున్న రైల్వే ట్రాక్‌ని కిటికీల్లోంచి తొంగి చూస్తూ ముగ్ధులవుతారు... అందాల అరకులో వలిసె పూల అందాలను, ఉరకలెత్తే జలపాతాలను సందర్శించి సమ్మోహితులవుతారు... దేశ విదేశాలకు చెందిన వేలాదిమంది టూరిస్టులు ప్రతి ఏటా శీతాకాలం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తారు. అక్టోబరు మొదటి వారంలో ఎంతో ఆశావహంగా మొదలైన పర్యాటక సీజన్ హుదూద్ తుపానుతో కుదేలైంది. కేకే లైన్ దెబ్బతిని అరకు వెళ్లే మార్గం లేకపోవడం, సందర్శనీయ స్థలాలన్నీ కళావిహీనంగా మారడంతో ప్రస్తుతం టూరిస్టుల తాకిడి గణనీయంగా తగ్గింది. అందాల సీమను సందర్శించే దారి లేక పర్యాటకుల్లో నిరాశ ఆవహించింది. విశాఖపట్నం సిటీ: అందాల విశాఖను చూసేందుకు అంతా తరలివచ్చేవారు. దేశ విదేశాల నుంచి పర్యాటకులు క్యూ కట్టేవారు. సుందరమైన మహా నగరాన్ని చూసి పులకించేందుకు పొరుగు రాష్ట్రాల ప్రజలు పోటీ పడేవారు. శీతగాలులు వీచాయంటే చాలు.. బెంగాలీలు పెద్ద ఎత్తున వచ్చి పక్షుల్లా విశాఖలో వాలేవారు. వచ్చేపోయే వారి రాకతో రైల్వే స్టేషన్ కళకళలాడేది. రిజర్వేషన్ బెర్తుల కోసం నగర ప్రజలతో సమానంగా రాష్ట్రేతరులు పోటీపడేవారు. అరకు వెళ్లే రైలు నిండా ఇతర రాష్ట్రాలవారే వుండేవారు. కానీ ఈసారి ఆ కళ కనిపించడం లేదు. అరకు రైలు లేదని తెలుసుకుని వేలాదిమంది పర్యాటకులు నగరానికి రావడం మానేశారు. వెళ్లిపోయే వారితో రద్దీగా వుండే రైళ్లు సైతం ఇప్పుడు పర్యాటకులు లేక బోసిపోతున్నాయి. అప్పటిలాగే కొన్ని రైళ్లకు రద్దీ వున్నా అది నగరవాసులను ఇబ్బంది పెట్టే స్థాయిలో లేదు. వాస్తవానికి గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పర్యాటకులు 20 శాతం పెరిగినట్టు రైల్వే వర్గాలు ముందుగానే అంచనా వేశారు. విశాఖ అందాలంటే బెంగాలీలు మనసు పారేసుకుంటారు. బెంగాలీలు ఎగబడుతుండడంతో ఒడిశా, ఛత్తీస్‌గఢ్, బీహార్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారంతా శీతాకాలంలో విశాఖ నగర అందాలను ఆస్వాదించేందుకు పోటీ పడుతుంటారు. పచ్చ పరికిణీ ఆరేసినట్టుగా వుండే అరకు అందాలను కొండా కోనల్లోంచి మెలికలు తిరుగుతూ గుహల్లోంచి మెల్లగా జారుకునే రైల్లోంచి చూడాలని అంతా కలలు కంటారు. ఎన్నిసార్లు చూసినా ఇలాంటి సుందర దృశ్యాలు మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా వుంటాయి. అందుకే బెంగాలీలు ఏటా విశాఖ పర్యటనకు వస్తుంటారు. కానీ ఇప్పుడు రాష్ట్రేతరులు పూర్తిగా విశాఖకు రావడం మానేశారు. దాదాపు 50 శాతం మంది ప్రయాణికులు విశాఖకు రావడం మానేశారని వాల్తేరు రైల్వే అంచనా వేస్తోంది. ఇంత దారుణంగా ప్రయాణికుల సంఖ్య పడిపోవడానికి హుదూద్ ఒక్కటే కారణమని తేల్చారు. అక్టోబర్ మాసంలో మూడు రోజులపాటు రైళ్లు పూర్తిగా రద్దు కావడం ఒక ఎత్తయితే ఆ తర్వాత విశాఖ అందాలన్నీ కనుమరుగయ్యాయని తెలియడంతో పర్యాటకులు రావడం మానేశారని భావిస్తున్నారు. 2013 అక్టోబర్ ఒకటో తేదీ-10వ తేదీ మధ్య విశాఖ స్టేషన్లో అమ్ముడైన టికెట్లు 2.72 లక్షలు కాగా 2014లో అదే రోజుల్లో 3.25 లక్షల మందికి పెరిగారు. అంటే దాదాపు 20 శాతం మంది ప్రయాణికులు పెరిగినట్టు అంచనా వేశారు. 2013 అక్టోబర్ మాసంలో 11వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య 3.02 లక్షల మంది ప్రయాణిస్తే 2014 అక్టోబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య కేవలం 1.58 లక్షల మంది మాత్రమే ప్రయాణించారు. అంటే దాదాపు 47 శాతం మంది ప్రయాణికులు తగ్గినట్టు అంచనా వేశారు. పర్యాటక సీజన్‌పై తుపాను బాగా ప్రభావం చూపిందనడానికి ఇది ఉదాహరణ -
సీఎం సారూ.. ఏమిస్తారు!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు శనివారం జిల్లా పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు జిల్లా పర్యటనలకు పశ్చిమగోదావరి జిల్లా నుంచే శ్రీకారం చుట్టారు. సరిగ్గా వంద రోజుల క్రితం మెట్ట ప్రాంతంలో ఆయన పర్యటించిన సంగతి తెలిసిందే. జూలై 16, 17 తేదీల్లో గోపాలపురం, చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో రైతులతో ముఖాముఖి పేరిట చంద్రబాబు పర్యటించారు. హుదూద్ తుపాను కారణంగా రద్దయిన జన్మభూమి కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తూ ఈనెల 1నుంచి 11వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా జన్మభూమి-మాఊరు కార్యక్రమాలు నిర్వహించాలని గురువారం జరిగిన మంత్రివర్గ భేటీలో నిర్ణయించారు. ఈ మేరకు తొలి పర్యటనను పశ్చిమగోదావరి జిల్లా నుంచే శ్రీకారం చుడుతున్న సీఎం ఈసారి డెల్టా ప్రాంతాన్ని ఎంచుకున్నారు. రుణమాఫీ జాప్యంపై అన్నిచోట్లా రైతుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో చంద్రబాబు పర్యటనలో ఎక్కడా అపశృతులు దొర్లకుండా ముందుజాగ్రత్తగానే ఉండి, పాలకొల్లు నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారు. పార్టీకి బలమైన పునాదులు ఉన్న ఉండి నియోజకవర్గం నుంచే బాబు పర్యటన మొదలు కానుంది. ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు స్వగ్రామమైన కలవపూడి శివారు గ్రామం మోడిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, జన్మభూమి-మా ఊరు సభ నిర్వహిస్తారు. మధ్యాహ్నం నుంచి పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని యలమంచిలి మండలం ఇలపకుర్రు, కుమ్మరిపాలెం, దొడ్డిపట్ల గ్రామాల్లో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు చంద్రబాబు శ్రీకారం చుడతారు. పొలం పిలుస్తోంది, జన్మభూమి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధానంగా రుణమాఫీ జాప్యం నేపథ్యంలో ఎక్కడా నిరసన ధ్వనులు వినబడకుండా పార్టీ నేతలు తగిన చర్యలు తీసుకున్నారు. నవ్యాంధ్ర సీఎంగా పశ్చిమ డెల్టా ప్రాంతానికి తొలిసారి వస్తున్న బాబుకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా, సజావుగా పర్యటన సాగిపోవాలన్న ఉద్దేశంతో పార్టీ జిల్లా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు తోట సీతారామలక్ష్మి ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ పెద్దఎత్తున పోలీసులను మోహరిస్తున్నారు. వరాలు ఏమిస్తారో.. ఉండి, పాలకొల్లు నియోజకవర్గాల పర్యటనకు వస్తున్న చంద్రబాబు నాయుడు ఈ ప్రాంత అభివృద్ధికి, సుడిదోమ కారణంగా పంటలు నష్టపోరుున రైతులకు ఎలాంటి వరాలిస్తారోనని ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. డెల్టా ఆధునికీకరణ పనులు పూర్తికాకపోవడం, శివారు ప్రాంతాలకు నీరందకపోవడం, డ్రెరుున్లను ప్రక్షాళన చేయక వర్షాకాలంలో చేలు ముంపుబారిన పడటం వంటి ఇబ్బందికర పరిస్థితులు డెల్టాలో నెలకొన్నాయి. పారిశ్రామిక ప్రాజెక్టులేవీ ఆ ప్రాంతంలో లేని దృష్ట్యా వాటి ఏర్పాటు దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమైనా ప్రకటన చేస్తే బాగుంటుందనే అభిప్రాయం ప్రజాప్రతినిధుల నుంచి వ్యక్తమవుతోంది. డెల్టా అభివృద్ధి, కీలకమైన ప్రాజెక్టుల ప్రకటన కోసం వారంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. పోలవరం ఊసేది బాబూ చంద్రబాబు రెండోసారి జిల్లా పర్యటనలోనూ ఎక్క డా పోలవరం సందర్శన లేకపోవడం ఆక్షేపణీయం. ప్రాజెక్ట్ ప్రాంతానికి సీఎం వస్తే పనులు వేగం పుంజు కునే అవకాశం ఉంది. ఎంతో కీలకమైన పునరావాసం, నిర్వాసితుల సమస్యలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ చంద్రబాబు మొదటినుంచీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. డెల్టా ప్రాంతంలో పర్యటిస్తున్న బాబు డెల్టా ఆధునికీకరణ పనులను ఓ సారి స్వయంగా పరిశీలిస్తే అక్కడి పరిస్థితులు ఏమిటనేది అర్థమవుతుంది. సీఎం టూర్ షెడ్యూల్‌ను చూస్తుంటే ఈసారి పర్యటన వల్ల కూడా జిల్లాకు ఒరిగేదేమీ కనిపించడం లేదు. - డేగా ప్రభాకర్, సీపీఐ జిల్లా శాఖ కార్యదర్శి వినతి పత్రాలిచ్చి ఏం ప్రయోజనం చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు ఐదు నెలలవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ ఇప్పటివరకూ అమలు కాలేదు. రుణమాఫీ అమలులో తీవ్ర జాప్యం చేస్తున్నారు. అంగన్వాడీ వర్కర్లను తొలగించారు. ఐకేపీ కాంట్రాక్ట్ వర్కర్లను కుదించారు. ఇలాంటి సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వాల్సి ఉన్నా.. మోసపూరిత చంద్రబాబుకు వాటిని ఇవ్వడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. మా పార్టీ పోరుబాట ఎంచుకుంది. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా త్వరలో జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతాం. - మంతెన సీతారాం, సీపీఎం జిల్లా శాఖ కార్యదర్శి సుడిదోమతో దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి సుడిదోమ స్వైరవిహారం చేసి వరి చేలను పీల్చిపిప్పి చేస్తోంది. దోమపోటు కారణంగా పైర్లు ఎండిపోతున్నాయి. ఎండు తెగులు వల్ల పిడికెడు ధాన్యం గింజలైనా దక్కే పరిస్ధితి కనిపిం చడం లేదు. కనీసం ఎండుగడ్డిగానైనా పనికి రాని దుస్థితి నెలకొంది. చీడపీడల వల్ల నష్టపోతున్న అన్నదాతలకు పంటల బీమా పథకం వర్తించే పరిస్థితి లేదు. అందువల్ల ప్రభుత్వమే పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలి. - బి.బలరామ్, అధ్యక్షుడు, రాష్ట్ర రైతు సంఘం -
తుపాను బాధితులకు సాయం
ఎచ్చెర్ల/ఎచ్చెర్ల రూరల్: హుదూద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు వైఎస్ఆర్ ఫౌండేషన్, సాక్షి మీడియా గ్రూపు నడుంబిగించాయి. సహాయక చర్యల్లో భాగంగా ఎచ్చెర్ల మండలం బుడగుట్ల పాలేంలో బియ్యం, దుస్తులు (చీర,జాకెట్)అందజేశాయి. రేషన్ కార్డులు ఆధారంగా 500 మందికి ఈ కిట్లను అందజేశారు. పంపిణీ ప్రక్రియను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎచ్చెర్ల సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుపాను సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పంట నష్టాలు అంచనా వేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ పాస్‌పుస్తకాలు, ఆధార్, బ్యాంకు పుస్తకాల కార్డులతో రైతులను ప్రదక్షిణలు చేయిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ మాడుగుల మురళీధర్ బాబా, మాజీ మార్కెట్ కమిటీ చెర్మైన్ జీరు రామారావు, మాజీ సర్పంచి అంబటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
శిక్షా... కక్షా...
డీలర్లపై నాయకులు కన్నెర్ర చేస్తున్నారు. పాత కక్షలను మదిలో ఉంచుకుని తాజాగా జరిగిన చిన్న తప్పులను ఎత్తి చూపిస్తూ శిక్ష విధిస్తున్నారు. హుదూద్ సాయం సరుకుల పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయని వస్తున్న ఆరోపణలను ఆయుధాలుగా చేసుకుని తమకు వ్యతిరేకులైన రేషన్ డీలర్లపై దండెత్తుతున్నారు. దీనికోసం అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. మరోవైపు అనూహ్యంగా డీలర్లు కూడా గొంతు పెంచారు. ఢీ అంటే ఢీ అంటూ నాయకులకే సవాల్ విసురుతున్నారు. తమను మానసిక క్షోభకు గురి చేస్తే సరుకులు పంపిణీ చేయలేమని, నవంబర్ ఒకటి నుంచి సమ్మె చేస్తామ ని అల్టిమేటం జారీ చేశారు. డీలర్లు, నాయకుల మధ్య గొడవ ఇప్పుడు ప్రజల పీకల మీదకు వచ్చింది. విజయనగరం కంటోన్మెంట్ : జిల్లాలో డీలర్లు రాజకీయంగా బలవుతున్నారా అంటే అవుననే సమాధానమే విని పిస్తోంది. చాలా చోట్ల డీలర్లను తొలగిద్దామనే ఆలోచన ఉన్నప్పటికీ సంఘటితంగా ఉన్న వారిని ఏం చేయలేని కొందరు రాజకీ య నాయకులు ఆయా డీలర్లపై ‘హుదూద్’ ఆయుధాన్ని ప్రయోగిస్తున్నారని తెలిసింది. పరిహారం అందించడంలో డీలర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారని, లబ్ధిదారులకివ్వాల్సిన బియ్యంలో కోత విధిస్తున్నారన్న ఆరోపణలు చేస్తూ వారిని అధికారులతో సస్పెండ్ చేయిస్తున్నారు. దీంతో డీలర్లు కూడా తిరగబడుతున్నారు. అక్రమంగా విధిస్తున్న సస్పెన్షన్లను వెంటనే రద్దు చేయకపోతే జిల్లా వ్యాప్తంగా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.. నవంబర్ ఒకటి నుంచి రేషన్ సరుకుల సరఫరాను బంద్ చేస్తామని అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. తమ పార్టీ, వర్గం కాని డీలర్లను తప్పించేందుకు పలువురు నాయకులు ఎప్పటి నుంచో కాచుకుని కూర్చున్నారు. హుదూద్ రూపంలో ఇప్పటికి వారికి అవకాశం వచ్చింది. పరిహారం పంపిణీలో డీలర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ...తమకు నచ్చని డీర్లపై కూడా పనిలోపనిగా ఫిర్యాదు చేయిస్తున్నారని సమాచారం. రాజకీయ నాయకులు ఆరోపణలు చేయడంతో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందిని అప్రమత్తం చేసింది. మరో వైపు రెవెన్యూ సిబ్బంది దాడులు చేస్తూ సస్పెండ్ చేస్తున్నారు. దీంతో ఆగ్ర హించిన రేషన్ డీలర్లు సమ్మె చేస్తామని ప్రకటించడంతో కథ కొత్త మలుపు తిరిగింది. ఇటీవల జిల్లాలోని బీభత్సం సృష్టించిన తుపాను తాకిడికి నష్టపోయిన బాధితులకు బియ్యం తదితర నిత్యావసరాలను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సరకుల్లో ముఖ్యంగా బియ్యం పంపిణీలో పలు అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. కార్డుదారులకు ఇచ్చే 25 కిలోల బియ్యంలో మూడు నుంచి 5 కిలోల బియ్యం తక్కువగా ఉంటున్నాయనీ, పది కిలోలు ఇచ్చిన చోట 2కిలోలు తక్కువ ఉంటున్నాయనీ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అక్రమాలకు పాల్పడిన డీలర్లను సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఎంఎం నాయక్, జాయింట్ కలెక్టర్‌కు, ఆర్డీఓకూ ఆదేశించారు. మరోపక్క పౌరసరఫరాల శాఖా మంత్రి పరిటాల సునీత కూడా డీలర్లపై గుర్రుగా ఉన్నారు. పలు చోట్ల ఈ ఆరోపణలు రావడంతో ఎనిమిది మంది డీలర్లను ఒకేసారి సస్పెండ్ చేశారు. మరో పక్క దాడులు కొనసాగుతున్నాయి. తుపాను బాధితులకు పంపిణీ చేస్తున్న నిత్యావసరాల్లో అవకతవకలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరికలు కూడా పంపిస్తుండటంతో డీలర్లు మండిపడుతున్నారు. కమీషన్ లేకుండా పంపిణీ చేస్తే బహుమతి ఇదా...? డీలర్ల ఆవేదన మరోలా ఉంది. జిల్లాలో తాము ఎక్కడా బియ్యం తరలించి అమ్ముకోలేదనీ, బియ్యం తరుగుతో వస్తున్నాయనీ, తరుగుకు గురవుతున్న గోడౌన్లలో దాడులు నిర్వహించకుండా కొద్దిపాటి తేడా వచ్చినా తమను జైలుకు పంపిస్తామనీ, కేసులు బనాయిస్తామని బెదిరిస్తూ తమను మానసికంగా హింసిస్తున్నారని వాపోతున్నారు. జిల్లాలో ఆరు లక్షల మందికి సరుకులను ఎటువంటి కమీషన్ లేకుండా పంపిణీ చేస్తున్నామన్నారు. ఇందుకు మాకు సస్పెన్షన్లు బహుమతా అని ప్రశ్నిస్తున్నారు. పోనీ ఎవరికైనా బియ్యం ఇవ్వకుండా పంపించేశామా చెప్పండని వారు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో 1362 రేషన్ షాపుల్లో 6,61,296 రేషన్ కార్డులుండగా ప్రతి నెలా రేషన్ సరుకులు ఇస్తున్నారు. ఇప్పుడు డీలర్లు సరుకులు పంపిణీ చేయకుండా సమ్మె చేస్తామనడంతో వారికి సరుకుల సరఫరా ప్రశ్నార్ధకమయింది. డీలర్ల అక్రమ సస్పెన్షన్లు ఎత్తివేయాలనీ లేకుంటే నిరవధికంగా సరుకులను పంపిణీ చేయబోమని చెబుతున్నారు. అయితే దీనికి అధికారులు కూడా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా డీలర్లు పనిచేయడంతో సస్పెండ్ చేయక తప్పదని చెబుతున్నారు. మరో ముగ్గురు డీలర్ల సస్పెన్షన్ జిల్లాలో అక్రమాలకు పాల్పడుతున్న మరో ముగ్గురు డీలర్లను సస్పెండ్ చేస్తున్నట్టు విజయనగరం ఆర్డీఓ జే వెంకటరావు తెలిపారు. నెల్లిమర్ల మం డలం సారిపల్లి, టెక్కలితో పాటు మరో గ్రామానికి చెందిన డీలర్‌ను సస్పెం డ్ చేసినట్టు ఆయన చెప్పారు. డీలర్లు తుపాను బాధిత కుటుంబాలకు సరఫరా చేస్తున్న రేషన్ సరకులకు పక్కదారి పట్టించడం, అవకతవకలకు పాల్పడటం వంటి కారణాలతో సస్పెండ్ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. పార్టీలకతీతంగా సస్పెండ్లు చేస్తున్నాం. సస్పెన్షన్లు ఊరికే చేయలేదు. రాజకీయంగానూ చేయలేదు. బాధితులకు ఇవ్వాల్సిన బియ్యం సక్రమంగా అందించకపోవడం, ఒక్కరికే పలు కార్డులకు సంబంధించిన బియ్యం అందివ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం నుంచి వచ్చిన నిబంధనల ప్రకారం సరుకులు సరఫరా చేయాలి. అలా చేయడం లేదు. అందుకనే కలెక్టర్ ఆదేశాలిచ్చారు. ఆ ప్రకారమే చేస్తున్నాం. కమిటీ సమక్షంలో సరుకులు సరఫరా చేస్తే అక్రమాలుండవని అలా చెప్పాం కానీ, అదేదో ప్రొటోకాల్ అనుకుంటే ఎలా? సమ్మె చేస్తామంటే ఎలా? ఆదేశాలిచ్చిన కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చుకోవాలి గానీ ఇలా ప్రకటిస్తారా? - జే వెంకటరావు, ఆర్డీఓ, విజయనగరం. ప్రొటోకాల్ పాటించకుంటే సస్పెండ్ చేస్తారా? బియ్యం పంపిణీకి ప్రొటోకాల్ పాటించలేదని మమ్మల్ని సస్పెండ్ చేస్తున్నారు. వేరే ఎవరో వచ్చి ఫొటోలు తీసుకున్నా, అరకేజీ బియ్యం తక్కువ వచ్చినా సస్పెండ్ చేస్తున్నారు. ఇది అన్యాయం. జిల్లాలో తుపాను బాధితులకు ప్రభుత్వమే సహాయం చేస్తుండటంతో తాము కూడా ముందుకు వచ్చి కమీషన్ లేకుండా సరుకులు పంపిణీ చేస్తున్నాము. ఇదే మా నేరమా? ఇందుకు సస్పెన్షన్లు బహుమతా?? మంచినూనె, పంచదార విషయంలో ఎందుకీ అనుమానం రాలేదు. బియ్యం గోడౌన్లలో తరుగు వస్తోంది. వారిపై చర్యలు తీసుకోకుండా మాపై చర్యలా? బియ్యం కూడా ప్యాకెట్లుగా ఇవ్వమనండి అందరికీ పంచేస్తాం. 50 కిలోల బస్తాలో 650 గ్రాములు ఎక్కువగా ఇవ్వాల్సిందిపోయి తిరిగి రెండు కేజీలు తగ్గిస్తున్నారు. ఆ లోటు భర్తీ చేసుకుంటున్నాం. దీనికే క్రిమినల్ కేసులు పెడతారా? అందరి సస్పెన్షన్లు బేషరతుగా ఎత్తేయాలి. లేకుంటే నవంబర్ ఒకటి నుంచి సరుకులు సరఫరా బంద్ చేస్తాం. - బుగత వెంకటేశ్వర రావు రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు -
30,697 హెక్టార్లలో పంట నష్టం
పెదఖండేపల్లి (శృంగవరపుకోట రూరల్) : హుదూద్ తుపాను వల్ల జిల్లాలో 30,697 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు అంచనా వేశామని వ్యవసాయశాఖ జిల్లా జాయింట్ డెరైక్టర్ ప్రమీల తెలిపారు. పెదఖండేపల్లి గ్రామంలో జేడీ ప్రమీల, రైతు శిక్షణా కేంద్రం డిప్యూటీ డెరైక్టర్ ఆశాదేవి, కొత్తవలస సబ్‌డివిజన్ ఏడీఏ కె.మహారాజన్ తదితరులు ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా తుపాను తాకిడికి దెబ్బతిన్న చెరుకు, ఇతర పంటలను పరిశీలించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. హుదూద్ కారణంగా వీచిన గాలులకు ఇప్పటివరకు జిల్లాలో 513 గ్రామాల్లో 632 హెక్టార్లలో వరి, 436 హెక్టార్లలో మొక్కజొన్న, 444 హెక్టార్లలో పత్తి, 153 హెక్టార్లలో చెరుకు పంటలకు నష్టం వాటిల్లినట్లు గుర్తించామన్నారు. మరో 14,483 హెక్టార్లలో పంట నష్టాలను పరిశీలించాల్సి ఉందన్నారు. అలాగే 5,404 మంది రైతులకు 50శాతం పైబడి పంట నష్టం జరిగిందన్నారు. 6698 హెక్టార్లలో వరి, 4091 హెక్టార్లలో పత్తి, 5064 హెక్టార్లలో చెరుకు తదితర పంట నష్టాలను సర్వే చేయాల్సి ఉందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తంగా 66వేలమంది రైతులకు పంట నష్టం వాటిల్లగా ఇప్పటివరకు 30వేల మంది రైతులను గుర్తించామన్నారు. వరి, మొక్కజొన్న, మినుము, పెసర, శెనగ తదితర విత్తనాలను రాయితీపై అందజేస్తామని ఆమె ప్రకటించారు. పంట నష్టపోయిన రైతులు తప్పనిసరిగా బ్యాంకు ఖాతాలను కలిగి ఉండాలని సూచించారు. మండలంలోని పెదఖండేపల్లి గ్రామంలో 236 హెక్టార్లలో చెరుకు పంటకు నష్టం వాటిల్లిందని సర్పంచ్ యాళ్ల రమణ, ఎంపీటీసీ తదితరులు జేడీ ప్రమీల దృష్టికి తీసుకొచ్చారు. కానీ సర్వే అధికారులు ఈ నష్టాన్ని గుర్తించడం లేదని వారు ఆరోపించారు. జేడీ వెంట ఏడీఏ కె.మహరాజన్, మండల వ్యవసాయాధికారిణి ఎం.స్వాతికుమారి, ఏఈఓ పి.హైమావతి తదితరులు ఉన్నారు. -
వివక్ష.. అక్రమాలు తేటతెల్లం!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : హుదూద్ తుపాను విజయనగరం జిల్లాలో బీభత్సం సృష్టించింది. ఉన్నోడు లేనోడు అని కాకుండా అందరికీ నష్టం వాటిల్లింది. ఒక్కొక్కరినీ ఒక్కో రూపంలో నష్టపరిచింది. దీంతో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయి. కొనుగోలు చేద్దామన్నా దొరకని పరిస్థితి ఏర్పడింది. ప్రజల్లో రోజురోజుకూ వెల్లువెత్తుతున్న ఆవేదనను దృష్టిలో పెట్టుకుని సర్కార్ స్పందించింది. తక్షణ సాయం కింద సరుకులు విడుదల చేసింది. పెరిగిన ధరలు నియంత్రించాలంటే యుద్ధ ప్రాతిపదికన నిత్యావసర సరుకులను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. కాకపోతే పంపిణీకొచ్చేసరికి వివక్ష చోటు చేసుకుంది. తొలుత పంపిణీ కొన్ని ప్రాంతాలకు పరిమితం చేసింది. ఇక, గులాబీ కార్డుదారులకు, రేషన్‌కార్డుల్లేని వారికి మొండి చేయి చూపింది. వారికి ఒక్కబియ్యం గింజ కూడా అందని పరిస్థితి నెలకొంది. ఇక, తక్షణ సాయంలోనూ పలువురు డీలర్ల చేతివాటం ప్రదర్శిస్తున్నారు. టీడీపీ నాయకుల అండతో ఒక్కొక్క కార్డుదారుని నుంచి ఐదేసి కిలోలను వెనకేసుకుంటున్నారు. అంతటితో ఆగకుండా గోనెసంచి కోసం రూ.20 వసూలు చేస్తూ తుపాను బాధితులను దోపిడీ చేస్తున్నారు.హుదూద్ దెబ్బకు జిల్లాలోని 12 మండలాలు పూర్తిగా, 22 మండలాలు పాక్షికంగా నష్టపోయినట్టు అధికారులు గుర్తించారు. తీవ్ర ప్రభావం ఉన్న మండలాల్లో 25 కిలోల బియ్యం, మూడు కిలోల బంగాళ దుంపలు, రెండు కిలోల ఉల్లిపాయలు, కిలో చక్కెర, అర కిలో కారం, కిలో ఆయిల్, కిలో ఉప్పు, రెండు కిలోల కందిపప్పు, ఐదు లీటర్ల కిరోసిన్ పంపిణీ చేయాల్సి ఉంది. పాక్షికంగా దెబ్బతిన్న మండలాల్లో 10 కిలోల బియ్యం, కిలో పంచదార, కిలో ఉప్పు, కిలో పామాయిల్, కిలో కందిపప్పు పంపిణీ చేయాలి. అయితే, కందిపప్పు జిల్లాకు రాలేదు. దీంతో మిగతా సరుకులన్నీ పంపిణీ చేస్తున్నారు. తెలుపు రేషన్‌కార్డు దారులకు మాత్రమే పంపిణీ చేసి, గులాబీ కార్డుదారులకు, రేషన్‌కార్డుల్లేని వారికీ మొండి చేయి చూపుతున్నారు. పక్కనున్న విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రం తెలుపు, గులాబీ అనే తేడా చూడకుండా రేషన్‌కార్డుదారులందరికీ సరుకులు పంపిణీ చేస్తున్నారు. రేషన్‌కార్డుల్లేని వారికీ కూడా ఏదొక గుర్తింపు పత్రం చూసి సరుకులిస్తున్నారు. కానీ, జిల్లాలో తెలుపు రేషన్‌కార్డుదారులకు తప్ప మరెవ్వరికీ నిత్యావసర సరుకులు ఇవ్వడం లేదు. దీంతో 45 వేల మందికి సాయమందని పరిస్థితి నెలకొంది. ఇప్పుడా సరుకులేమయ్యాయన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని నిఘా సంస్థలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. తక్షణ సాయంలోనూ చేతివాటం ప్రభుత్వమందించే తక్షణ సాయంలోనూ పలువురు డీలర్లు కక్కుర్తి పడుతున్నారు. సరుకులన్నింటిలోనూ తూకంలో కోత పెడుతున్నారు. 25 కిలోల బియ్యం పంపిణీ చేసే చోట 5 నుంచి 7 కిలోలు, 10 కిలోల బియ్యం పంపిణీ చేసే చోట 2 నుంచి 3 కిలోలు కన్నం వేస్తున్నారు. ఒక్క బియ్యం విషయంలోనే కాదు మిగతా సరుకులు తూచేటప్పుడూ హస్తలాఘవం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే డీలర్లపై జిల్లా అధికారులకు అనేక ఫిర్యాదులొచ్చాయి. గంట్యాడ, గుర్ల, బొబ్బిలి, భోగాపురం, పూసపాటిరేగ, నెల్లిమర్ల, డెంకాడ తదితర మండలాల్లోనైతే బాధితులు గోల పెడుతున్నారు. గంట్యాడ, భోగాపురం, పార్వతీపురంలో కేసులు నమోదయ్యాయి. మెంటాడ మండలం కుంటినవలస, గుర్ల తమ్మిరాజుపేట డీలర్లపై విజయనగరం ఆర్డీఓకు శుక్రవారం ఫిర్యాదులొచ్చాయి. గోనె సంచికి రూ.20 వసూలు ఇదంతా ఒక ఎత్తు అయితే ఇద్దరేసి కార్డుదారులకు కలిపి 50 కిలోల బస్తాను ఇచ్చినప్పుడు గోనె సంచికోసమని వారి వద్ద నుంచి రూ.20 వసూలు చేస్తున్నారు. వారికి ఉచితంగా అందజేసిన బియ్యం ధర రూ.50. వారి వద్ద నుంచి రూ.20 వసూలు చేస్తుంటే బాధితులకు అందేది కేవలం రూ.30 సాయం మాత్రమే. బాధితులకు అందజేసిన బియ్యంపై మాఫియా కన్ను కూడా పడింది. ప్రతి నెలా కోటా సరుకు రూపంలో వస్తున్న బియ్యాన్ని డీలర్లు, వ్యాపారులు, మిల్లర్లు వ్యూహాత్మకంగా కొనుగోలు చేసి, రీసైక్లింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. ఇప్పుడు భారీగా బియ్యం విడుదలవడం, ఉచితం కావడంతో కన్నేశారు. అవకాశం ఉన్న చోట పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీలర్లకు పలుచోట్ల టీడీపీ నాయకులు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే అమలు చేద్దాం ః కలెక్టర్ ఇతర జిల్లాల్లో ఇస్తే గనక గులాబి రేషన్‌కార్డులకు తక్షణ సాయం కింద నిత్యావసర సరుకులను అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎంఎం నాయక్ తెలిపారు. సరుకులు పంపిణీ చేయాలని జాయింట్ కలెక్టర్‌కు ఆదేశాలిస్తానని చెప్పారు. తెల్లరేషన్ కార్డుదారులతో పాటు గులాబీ కార్డు దారులకు సరుకులు అందిస్తామన్నారు. మేం తుపాను బాధితులం కాదట హూదూద్ తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయినవారమే. అయినా మాకు గులాబీ రంగు కార్డు ఉందని నిత్యావసర సరుకులు ఉచితంగా ఇవ్వడం లేదు. తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి అడిగినా గులాబీ రంగు కార్డు ఉన్నవారికి ఇవ్వమని కరాఖండిగా రెవెన్యూ సిబ్బంది చెప్పారు. గులాబీ రంగు కార్డు ఉన్నంతమాత్రాన మేం తుపాను బాధితులంకాబోమా... నిత్యవసర సరుకులు మాకూ ఇవ్వాలి. - వై.జగన్మోహన్రావు, విశ్రాంత ఉద్యోగి, జామి -
విమర్శల తుఫాన్
జిల్లాకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధులు విమర్శనాస్త్రాలు ఎదుర్కోలేక సతమతమవుతున్నారు. ఆ పార్టీలో జిల్లాకు పెద్ద దిక్కు అయిన కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు దగ్గర నుంచి మున్సిపల్ చైర్మన్ వరకూ విమర్శల తుఫాన్లో చిక్కుకున్నారు. బయట పడలేక కొందరు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొంతమందిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, మరికొంతమందిపై సొంత పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. దీంతో ఏం చేయాలో ఆ నేతలకు పాలుపోవడం లేదు... సాక్షి ప్రతినిధి, విజయనగరం : హుదూద్ తుఫాన్ దెబ్బకు జిల్లా కకావికలమైన తరుణంలో ఆదుకోవల్సిన కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు ఢిల్లీలో కాలంగడపడంపై జిల్లా వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుదూద్ తుఫాన్ సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. వేలాది మంది ఎన్యుమరేషన్ చేస్తున్నా నష్టాన్ని నేటికీ అంచనా వేయలేని పరిస్థితి నెల కొంది. ప్రజలు పడుతున్న కష్టాలైతే అన్నీ ఇన్నీ కావు. తాగునీటి కోసం, విద్యుత్ కోసం నానా అవస్థలు పడుతున్నారు. రహదారి సౌకర్యం లేక అనేక గ్రామాల ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు. జిల్లాకొచ్చిన మంత్రులు, ప్రతిపక్ష నేతలు, అధికారులంతా ఈ నష్టాలు, కష్టాలను చూసి చలించిపోయారు. కానీ, జిల్లా ప్రజలు ఎన్నుకోవడంతో కేంద్రమంత్రైన పూసపాటి అశోక్ గజపతిరాాజుకు మాత్రం తుఫాన్ తీరం దాటిన తరువాత జిల్లాకొచ్చి, డీఆర్డీఏలో సమీక్ష చేసి, సీఎం పర్యటనలో పాల్గొని వెళ్లిపోయారు. ఆ తర్వాత పత్తాలేరు. ఇదే జిల్లా ప్రజలకు ఆగ్రహం తెప్పిస్తోంది. సాక్షాత్తు సీఎం రెండు సార్లు జిల్లాలో పర్యటించి బాధితులను పరామర్శించే ప్రయత్నం చేశారు. కేబినెట్ దాదాపు ఇక్కడికొచ్చి పర్యటించి వెళ్లింది. కమిషనర్, డెరైక్టర్ హోదా గల అధికారులైతే లెక్క లేదు. వెళ్లి వస్తున్నారు. జిల్లా యంత్రాంగమైతే అదే పనిలో నిమగ్నమయ్యింది. కానీ, అశోక్ గజపతిరాజు ఇతర జిల్లా మంత్రులు, నేతలొచ్చి వెళ్లినట్టుగా జిల్లాలో పర్యటించారు. సీఎం హాజరవ్వడంతో భోగాపురంలో రెండు పర్యాయాలు పర్యటించారు. ఆ తర్వాత విజయనగరం టౌన్లో గడిపేశారు. సీఎం జిల్లా దాటిన తర్వాత ఎంచెక్కా ఢిల్లీకి వెళ్లిపోయారు. దీంతో ఎవరేం చేస్తున్నారో ఆరాతీసే నాథుడు కరువయ్యాడు. పర్యవేక్షణ ఏమీ లేకపోవడంతో నేటికీ పునరుద్ధరణ పనులు కొనసా....గుతున్నాయి. ఇప్పుడిదే విమర్శలకు తావిచ్చింది. ఇలాంటప్పుడు జిల్లాలో ఉండకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గంలో కనీస పరామర్శ చేయలేదని, తమ బాధల్ని ఎవరికి చెప్పుకోవాలని విజయనగరం పార్లమెంట్ పరిధిలో సర్వత్రా విన్పిస్తోంది. చెప్పాలంటే జనాగ్రహం పెల్లుబుకుతోంది. బయటికి చెప్పలేకపోయనా టీడీపీ నాయకులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు. మృణాళిని పదవి ఊడగొట్టడమే లక్ష్యంగా పావులు మంత్రి పదవి వచ్చిన దగ్గరి నుంచి అక్కుసుతో ఉన్న ఎమ్మెల్యేలు తమ స్పీడు పెంచారు. జిల్లాలో ఏళ్లతరబడి రాజకీయం చేసిన వారిని కాదని, ఎన్నికలప్పుడు పక్క జిల్లా నుంచి వచ్చిన మహిళకు మంత్రి పదవి ఇస్తారా అని మండి పడుతూ వస్తున్న నేతల కు ఇప్పుడొక మంచి అవకాశం వచ్చి పడింది. ఇన్నాళ్లూ ఆమె సహకరించడం లేదని, నియోజకవర్గంలో ఎవర్ని పట్టించుకోవడం లేదని, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కనీసం గౌరవం ఇవ్వలేదని తమకున్న వర్గీయుల చేత విమర్శనస్త్రాలు సంధించారు. ఇంతవరకు తెరవెనుక ఉండి కథ నడిపించిన ఎమ్మె ల్యేలు ఇప్పుడొక అడుగు ముందుకేసి గ్రూపు రాజకీయానికి తెరలేపారు. తమను కూడా పట్టించుకోవడం లేదని, అధికారులు తమ మాట వినలేదని, తుఫాన్ బీభత్సం పునరుద్ధరణలో కూడా విఫలమయ్యారని, మంత్రిగా సరికాదంటూ పరోక్షంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారు. మంత్రి పదవి ఊడగొట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్యే గీతపై మున్సిపల్ కౌన్సిలర్లు గుర్రు ఎమ్మెల్యే మీసాల గీతపై విజయనగరం మున్సిపల్ కౌన్సిలర్లు గుర్రుగా ఉన్నారు. వార్డుల్లో జరిగే కార్యక్రమాల్లో తమను విస్మరిస్తున్నారని, తమకు పేరు రాకుండా చేస్తున్నారని, తమను చిన్న చూపు చూడటంతో మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణపైనా అదే తరహాలో మండిపడుతున్నారు. సొంత అజెండాతో నడుస్తూ పార్టీ కౌన్సిలర్లుకు కనీసం విలువ ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఇవన్నీ తమ దృష్టికొచ్చాయో ఏమో గాని కౌన్సిలర్ల ద్వారా వ్యవహారాలు జరగాలని, ఆ దిశగా వారికొక సూచనలు చేయాలని ఎమ్మెల్యే గీత శనివారం అశోక్ బంగ్లాలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం 11గంటలకు జరగాల్సిన సమావేశం మధ్యాహ్నం 12.30 గంటలైనా ప్రారంభం కాకపోవడం, మీసాల గీత హాజరు కాకపోవడంతో ఆమెపై ఉన్న అక్కసునంత గుర్తు చేసుకుని ఎమ్మెల్యే దగ్గర్లో ఉన్నారనగానే దాదాపు 11మంది కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. గ్రూపుగా ఏర్పడి తోటపాలెంలోని ఓ నాయకుడు ఇంట్లో సమావేశమయ్యారు. ఎమ్మె ల్యే నిర్వహించబోయిన సమావేశానికి ఎటువంటి పదవి లేని సైలాడ త్రినాథరావు నాయకత్వం వహించడమేంటని, ఆయన చెప్పినట్టు నడుచుకోవడమేంటని, నియోజకవర్గాన్ని వదిలేసి మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే మీసాల గీత పర్యటించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ధ్వజమెత్తారు. దీంతో అవాక్కైన ఎమ్మెల్యే గీత కాస్త మనస్థాపం చెందారు. మంత్రి పుల్లారావు హాజరైన కార్యక్రమానికి వెళ్లానని, ఒక్కొక్కసారి ఆలస్యం జరుగు తుందని, అంతమాత్రాన తమకు వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదని గీత ఆవేదన చెందుతున్నారు. కౌన్సిలర్ల ద్వారా అన్నీ జర గాలన్న ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేస్తే వారలా వ్యవహరిస్తే తానేం చేయగలనని, అశోక్ గజపతిరాజు వద్ద ప్రస్తావించి, నా పని నేను చేసుకుంటానంటూ సన్నిహితుల వద్ద వాపోయారు. మొత్తానికి అటు అశోక్, మంత్రి, ఇటు ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ ఒకేసారి విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. టీడీపీ రాజకీయం రసవత్తరంగా మారింది. -
10 వేల హెక్టార్లలో పంట నష్టం పరిశీలన
శృంగవరపుకోట రూరల్ : హుదూద్ తుపాను తాకిడికి అరటి, బొప్పాయి, జీడి, మామిడి, కొబ్బరి, కూరగాయలు, పామాయిల్ తోటలు జిల్లా వ్యాప్తంగా దెబ్బతిన్నాయనీ, ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 10 వేల హెక్టార్లలో పంట నష్టాలను పరిశీలించినట్టు ఉద్యానవనశాఖ డిప్యూటీ డెరైక్టర్ ఎల్.వజ్రశ్రీ తెలిపారు. ఎస్.కోట మండలంలోని కిల్తంపాలెం పంచాయతీ పరిధిలో తుపానుకు దెబ్బతిన్న ఉద్యానవన పంటలను ఏడీఏ పీఎల్ ప్రసాద్, హెచ్ఓ ఎ.రమేష్‌కుమార్‌లతో కలిసి శనివారం పరిశీలించారు. అనంతరం స్థానిక ఎంపీపీ రెడ్డి వెంకన్న, ఎంపీటీసీ సభ్యులు ఆర్.చంద్రశేఖర్, ఆడారి రమేష్, పలువురు ప్రజాప్రతినిధులతో పంట నష్టాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 5405 హెక్టార్లలో అరటి, 3,258 హెక్టార్లలో కూరగాయలు, 400 హెక్టార్లలో బొప్పాయి, 2503 హెక్టార్లలో కొబ్బరి, 963 హెక్టార్లలో జీడి, 40వేల హెక్టార్లలో మామిడిపంట దెబ్బతిన్నాయన్నారు. వరి పంట పరిశీలన జియ్యమ్మవలస : మండల పరిధిలోని సీమనాయుడు వలసలో నీట మునిగిన వరి పంటను కేవికే సస్యరక్షణా కేంద్రం శాస్త్ర వేత్త పి.ఉదయ్‌బాబు బృందం పరిశీలించింది. ఈ సందర్బంగా ఉదయ్‌బాబు మాట్లాడుతూ, 50 శాతం మేర నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందజేస్తుందని చెప్పారు. ప్రస్తుతం వరి పంటలో సుడిదోమ ఎక్కువగా ఉందని తెలిపారు. దీని నివారణకు 200 మిల్లీ లీటర్ల డైక్లోరోపాస్, 250 మిల్లీలీటర్ల మోనోక్రోటోపాస్, 200 గ్రాముల కార్బండిజమ్ కలిపి పిచికారీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎ.డి విజయ్, కేవికే శాస్త్రవేత్త యు.త్రివేణి, వీఆర్వో వాగ్ధేవి, సత్యం, రైతులు పాల్గొన్నారు. -
మూడు రోజుల్లో వెలుగులు
యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు ఈపీడీసీఎల్‌కు రూ.750 కోట్ల నష్టం సీఎండీ శేషగిరిబాబు యలమంచిలి: మూడు రోజుల్లో జిల్లా అంతటా విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామని ఈపీడీసీఎల్ సీఎండీ ఎం.శేషగిరిబాబు తెలిపారు. వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ సరఫరా అందించడానికి మరికొంత సమయం పడుతుందన్నారు. శనివారం రాత్రి యలమంచిలిలో విద్యుత్ పునరుద్ధరణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. విశాఖ జిల్లా మొత్తం విద్యుత్ వ్యవస్థ అతలాకుతలమైందన్నారు. చాలాచోట్ల విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్లు నేలమట్టం కావడంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు ఎంత వేగవంతం చేసినా ఫలితం కన్పించడం లేదన్నారు. కొన్నిచోట్ల విద్యుత్ లైన్లు పూర్తిగా దెబ్బతినడంతో తాత్కాలికంగా వేరొక లైన్ ద్వారా సరఫరా ఇచ్చి అసౌకర్యం కలగకుండా చూస్తున్నామని చెప్పారు. జిల్లాలో పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నామని చెప్పారు. జిల్లాలో దాదాపు ఏడు వేల మంది సిబ్బంది, రెండు వేల మంది అధికారులు ఈ పనుల్లో నిమగ్నమై ఉన్నట్టు తెలిపారు. హుదూద్ తుపాను బీభతానికి ఉత్తరాంధ్రలో ఏపీఈపీడీసీఎల్ కు సుమారు రూ.750 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 7.64 లక్షల విద్యుత్ కనెక్షన్లకు 7 లక్షల కనెక్షన్లకు విద్యుత్ పునరుద్ధరించామని తెలిపారు. విశాఖపట్నంలో 11.32 లక్షల కనెక్షన్లలో ఇప్పటి వరకు 9 లక్షలకు పైగా కనెక్షన్లకు విద్యుత్ సరఫరా జరుగుతోందన్నారు. గ్రేటర్ విశాఖ పరిధిలో మూడు జోన్లలో రెండు జోన్లకు పూర్తిగాను, మూడవ జోన్లో 75 శాతం కనెక్షన్లకు సరఫరా ఇచ్చామన్నారు. -
‘ఇన్శాట్ 3డీ’తో హుదూద్‌పై ముందు జాగ్రత్త!
న్యూఢిల్లీ: ఉత్తరాంధ్ర, ఒడిశాల్లో తీవ్ర విధ్వంసం సృష్టించిన హుదూద్ తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించడంలో మన ‘ఇన్శాట్ 3డీ’ ఉపగ్రహం ఎంతో తోడ్పడిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. హుదూద్ తుపానును గుర్తించడంతో పాటు దాని ప్రయాణమార్గం, తీవ్రత, గాలివేగం వంటి ఎన్నో వివరాలను ఆ ఉపగ్రహం అత్యంత కచ్చితత్వంతో అందజేసిందని తెలిపింది. ఈ మేరకు వాతావరణశాఖ ఒక నివేదికను విడుదల చేసింది. -
కార్మికులకు ‘షాక్’
బొబ్బిలి: హుదూద్ తుపాను ప్రభావం నుంచి కార్మికులు ఇంకా తేరుకోలేదు... విద్యుత్తు వ్యవస్థ ఛిన్నాభిన్నం అవ్వడం, ఇప్పటివరకూ పరిశ్రమలకు పుష్కలంగా సరఫరా రాకపోవడంతో వేలాది మంది కార్మికులు గత 15 రోజులుగా పస్తులుండే పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రభుత్వం కనీసం కార్మికుల గురించి ఆలోచన చేయకపోవడంతో ఏం చేయాలో వారికి ఏమీ పాలుపోవడం లేదు.. ప్రస్తుతం జిల్లాలో దాదాపుగా అన్ని పరిశ్రమలూ మూతపడ్డాయి. విద్యుత్తు సరఫరా లేకపోవడమే ప్రధాన కారణంగా ఉన్నా, యాజమాన్యం కార్మికుడిని ఆదుకోవడానికి జనరేటర్ సాయంతో అయినా మిల్లును నడిపే పరిస్థితి కూడా లేదు.. ప్రధానంగా ఈ ఎఫెక్టు జనపనార మిల్లులపై పడింది. ఈ నెల 12 నుంచి జిల్లాలో ఉండే 9 జూట్ మిల్లులు కూడా మూత పడడంతో దాదాపు 25 వేల మంది కార్మికులు ఆకలితో అలమటించాల్సిన దుస్థితి దాపురించింది. బొబ్బిలిలో ఎస్ఎల్ఎస్, నవ్యా, జ్యోతి జూట్‌మిల్లులు ఉండగా, విజయనగరంలో అరుణా, ఈస్టుకోస్టు, నెల్లిమర్ల, సాలూరులో, జీగిరాం, కొత్తవలసలో ఉమా, చెన్నాపురాల్లో ఉండే మిల్లులు మూతపడ్డాయి. ప్రకృతి వైపరీత్యం వల్ల మిల్లులు మూత పడ్డాయి కాబట్టి ఏదో రకంగా మిల్లు తిప్పితే పనిచేస్తాం, లేకపోతే లే ఆఫ్ ఇవ్వాలని కార్మికులంతా డిమాండ్ చేస్తున్నారు. తుపాను వల్ల పంటలు పోతే పరిశీలన చేసి పరిహారం ఇస్తున్నారు, ఇళ్లు కోల్పోయిన వారిని ఆదుకుంటున్నారు. తుపాను ప్రాంతాల్లో చెట్లు పడిపోతే అధికారులు స్పందిస్తున్నారు. మరి వేలాది మంది కార్మికులు పనిలేకుండా పస్తులుంటున్నా ఏ ప్రజాప్రతినిధి గానీ, అధికారి గారీ ఎందుకు స్పందించడం లేదని వారంతా ప్రశ్నిస్తున్నారు. యాజమాన్యాలతో మాట్లాడి కార్మికుల ఆకలిని తీర్చాలని కోరుతున్నారు. అలాగే బొబ్బిలి, పూసపాటిరేగ, కొత్తవలసల్లో ఉండే వందలాది పరిశ్రమలు కూడా విద్యుత్తు లేకపోవడం వల్ల మూతపడ్డాయి. గ్రోత్‌సెంటరులో ఉండే ఫెర్రోఅల్లాయిస్ ఫ్యాక్టరీలతో పాటు అనేక ఫ్యాక్టరీలు మూతపడడంతో కార్మికులకు పని లేకుండా పోయింది. ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాల పునరుద్ధరణ కార్యక్రమం ఇంకా కొనసాగుతుండడంతో విద్యుత్తు పూర్తి స్థాయిలో అందడం లేదు. ప్రస్తుతం శుక్రవారానికి 11కేవీలైనుపై ఉండే పరిశ్రమలకు విద్యుత్తు సరఫరా చేస్తున్నామని డీఈ మసిలామణి చెప్పారు. 33కేవీపై ఆధారపడే వారికి మాత్రం సరఫరా చేయలేదు..కార్మికుల పోరాటానికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. -
పేదల బియ్యంపై హుదూద్ పంజా!
విజయనగరం కంటోన్మెంట్: హుదూద్ తుపాను భవిష్యత్‌పై కూడా తన ప్రభావాన్ని చూపుతోంది. రేషన్ డిపోల ద్వారా పేదలకందించే బియ్యాన్ని ఎలా సేకరించాలో తెలియని పరిస్థితుల్లో అధికారులున్నారు. పౌరసరఫరాల శాఖ ద్వారా లెవీ సేకరణ చేసి పేదోడికి పట్టెడన్నం పెట్టే రేషన్ బియ్యం పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. మారిన లెవీ నిబంధనల ప్రకారం పౌరసరఫరాల శాఖ ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రకృతి సహకరించలేదు. లెవీ సేకరణ లక్ష్యాన్ని డిసెంబర్లో నిర్ణయిస్తారు. సేకరణ విధానం మారడంతో ముందుగా మేల్కొన్న జిల్లా అధికారులు లక్ష్యాలను అధిగమించేందుకు ప్రణాళికలు వేశారు. అయితే భీకర గాలులతో విరుచుకుపడిన హుదూద్ వల్ల లెవీ సేకరణ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లాలో 28 వేల పైచిలుకు హెక్టార్లలో వరి తదితర పంటలు దెబ్బతిన్నాయి. దీంతో ధాన్యం దిగుబడి తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది. కొత్త నిబంధనల ప్రకారం 25 శాతం మిల్లర్లు, 75 శాతం పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేయాల్సి ఉంది. ఒక్కసారిగా భారం పెరిగినా...సేకరణ ప్రభావం ప్రజాపంపిణీపై పడకుండా ముందుగానే ధాన్యం కొనుగోలు చేయాలని యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. ఇందుకు గాను జిల్లాలోని మహిళా సంఘాలు, సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జాతీయ వ్యవసాయ ఉత్పత్తుల సూచి పెంచిన ధరల మేరకే కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అధికారుల నిర్ణయం మేరకు గ్రేడ్ ఁఎరూ. రకం క్వింటాలుకు రూ.1400, కామన్ గ్రేడ్ రకం రూ.1360 గా ధర నిర్ణయించారు. పెంచిన కేంద్ర ప్రభుత్వ మద్దతు ధరతోనే ఈ ఉత్పత్తులను సేకరించాలని నిర్ణయించారు. అంతే కాకుండా అనుబంధ శాఖలతో సమావేశం నిర్వహించి 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలోని మహిళా సంఘాల ద్వారా 14 కొనుగోలు కేంద్రాలు, డీసీసీబీ ఆధ్వర్యంలోని సహకార సంఘాల ద్వారా 46 కేంద్రాలు ఏర్పాటు చేసి, మొత్తం 60 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేద్దామనుకున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో 2.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని ప్రభుత్వ యంత్రాంగం అంచనా వేసింది. అయితే అధికారుల అంచనాలను హుదూద్ తలకిందులు చేసింది. అసలే ఖరీఫ్ ఆలస్యం కావడం మరో పక్క వరి పంట తుపానుతో దెబ్బ తినడం వంటి పరిణామాలతో దిగుబడి బాగా తగ్గిపోయే ప్రమాదం కనిపిస్తోంది. దీంతో ఈ ఏడాది దిగుబడి రెండు లక్షల మెట్రిక్ టన్నులయినా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారుల అంచనా. గత ఏడాది ధాన్యం దిగుబడి 3.24 లక్షల మెట్రిక్ టన్నులుగా అంచనా వేసి, ఇందులో స్థానిక అవసరాలకు గాను 30 శాతం మినహాయించి 1.81 లక్షల టన్నుల లెవీ సేకరణను పౌరసరఫరాల శాఖ అధికారులు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. కానీ 1.46 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే లెవీ సేకరణ చేశారు. ఈ ఏడాది తుపాను, మారిన విధానం కారణంగా లెవీ సేకరణలో ఇబ్బందులు తప్పవని యంత్రాంగం భయపడుతోంది. కొత్త నిబంధనల ప్రకారం మిల్లర్లు తాము సేకరించిన ఉత్పత్తుల్లో 25 శాతం మాత్రమే ప్రభుత్వానికి ఇస్తారు. దీంతో ప్రజాపంపిణీకి బియ్యం సరిపడని ప్రమాదముంది. సాధారణంగా దిగుబడి బాగా ఉన్నప్పుడే ధాన్యం సరిపడని పరిస్థితి నెలకొంటే ఇప్పుడీ తుపాను దెబ్బకు మరింత దిగుబడి తగ్గిపోయి తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందని అంటున్నారు. అంతే కాకుండా తుపాను సాయం కింద ఇప్పటికే ఉన్న లెవీ బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేయడంతో మరింత లోటు ఏర్పడింది. అంతే కాకుండా మిల్లర్లతో పోటీ ఉండనే ఉంది. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలోని ప్రజాపంపిణీకి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మిల్లర్ల పోటీని తట్టుకోవాల్సి ఉంది. బహిరంగ మార్కెట్లో ధాన్యం కొనుగోలులో పౌరసరఫరాల శాఖతో మిల్లర్లు పోటీ పడి ధాన్యం దొరక్కుండా చేసే ప్రమాదం ఉంది. ఈ ఏడాది లెవీ సేకరణ కష్టమే జిల్లాలో ఈ ఏడాది 2.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని మొదట అంచనా వేసినా, తుపాను గాలులకు వరి దుబ్బులు, వెన్నెలు దెబ్బతిన్నాయి. దీంతో ధాన్యం దిగుబడి గణనీయంగా తగ్గే పరిస్థితులున్నాయి. తద్వారా లెవీ సేకరణ కూడా తగ్గనుంది. - భాస్కర శర్మ, అసిస్టెంట్ మేనేజర్(టెక్నికల్), పౌరసరఫరాల శాఖ కార్యాలయం, విజయనగరం -
నష్టం రూ.1500 కోట్ల పైనే!
శ్రీకాకుళం పాతబస్టాండ్: హుదూద్ తుపాను, అనంతరం సంభవించిన వరదల వల్ల జిల్లాకు వాటిల్లిన నష్టం రోజులు గడుస్తున్నకొద్దీ పెరుగుతోంది. సర్వేల్లో నష్టం అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి. జిల్లా యంత్రాంగం ఇప్పటివరకు జరిపిన సర్వేల ప్రకారం చూస్తే రూ.1500 కోట్లకుపైగానే నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. 12 రోజలు గడిచినా తుపాన్ దెబ్బ నుంచి ప్రజలు, రైతులు ఇంకా తేరుకోలేదు. సర్వేలకు వచ్చిన అధికారులకు నష్టాలను వివరించలేని దీనస్థితిలో రైతులు ఉన్నారు. మరికొందరు నిబంధనల కారణంగా జరిగిన నష్టానికి పరిహారం పొందే పరిస్థితి లేదు. పల్లం 5 ఎకరాలు, మెట్టు 10 ఎకరాల్లోపు ఉన్న రైతులనే పరిహారానికి అర్హులుగా పరిగణించడం, అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు నష్ట పరిహారాన్ని దానికే పరిమితం చేయడంతో మధ్య, పెద్ద రైతులు మరింతగా కుంగిపోతున్నారు. పరిహారం పెంచినా నిబంధనలు ప్రతిబంధకంగా మారాయని ఆధికారులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టాన్ని 60 శాతం వరకే రాయాలన్న నిబంధన కూడా ఉండటంతో పూర్తి స్థాయిలో పరిహారం అందదని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా నష్టం అంచనాలు ఇంకా పూర్తి కాలేదు. ముఖ్యంగా వ్యవసాయ, ఉద్యానవన శాఖల సర్వేలు పూర్తి కావడానికి కనీసం మరో వారం పడుతుంది. వీటిని మినహాయిస్తే, మిగిలిన రంగాల నష్టం సుమారు రూ.850 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా వేశారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖలకు ఇన్పుట్ రాయితీ సుమారు రూ.180 కోట్లు ఉంటుందని లెక్కలు వేశారు. హెక్టారుకు ప్రభుత్వం ప్రకటించిన రూ.15 వేల పరిహారం ఆధారంగా ఈ లెక్కలు వేశారు. అంటే ఎకరాకు రూ.6 వేలే వస్తుంది. వాస్తానికి ఎకరా వరి సాగుకు సుమారు రూ.25 వేలు ఖర్చవుతుంది. ఆధికారులు మాత్రం ఇన్పుట్ రాయితీ రేటునే నష్టంగా తీసుకుంటున్నారు. తుపాను, వరదల వల్ల 1.54 లక్షల హెక్టర్లలో పంట నష్టం వాటిల్లినట్లు.. ఆ మేరకు ఒక్క వ్యవసాయ రంగానికే రూ.720 కోట్ల మేరకు నష్టం జరిగినట్లు తెలుస్తోంది. సర్వేలు పూర్తి అయ్యేసరికి ఇది మరింత పెరుగుతుంది. ఇవీ నష్టం అంచనాలు తుపాను, అనంతరం నాగావళి, వంశధార వరదలకు జిల్లాలోని 38 మండలాల్లో 1863 గ్రామాలు ప్రభావితమయ్యాయి. వీటిలో 196 గ్రామాలు తీవ్రంగా, 1667 గ్రామాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇద్దరు చనిపోగా, ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరికి రూ.10.45 లక్షల పరిహారం చెల్లించాలి. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖలకు సంబంధించి తాత్కాలిక మరమ్మతులకు రూ. 10 కోట్లు, శాశ్వత పనులకు రూ.153 కోట్లు అవసరమని లెక్కలు వేశారు. పురపాలక సంఘాల పరిధిలో రోడ్లు, భవనాలు, ఇతర ఆస్తుల నష్టం సుమారు రూ.4 కోట్లుగా అంచనా వేశారు. విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లింది. సబ్స్టేషన్లు, ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ స్ట్రక్చర్లు, స్తంభాలు చాలావరకు దెబ్బ తినడం వల్ల సుమారు రూ.16 కోట్ల నష్టం వాటిల్లింది. గృహనిర్మాణ శాఖ పరిధిలో పక్కా, పూరిళ్లు కలిపి 6877 దెబ్బతిన్నాయి. వీటి నష్టం సుమారు రూ.4 కోట్లు ఉంటుంది. పశుసంవర్థక శాఖ పరిధిలో పెద్ద పశువులు 27, చిన్న జీవాలు 211, పౌల్ట్రీ సంబంధిత జీవాలు 17,500 మృతి చెందాయి. ఎనిమిది పాడి యూనిట్లు దెబ్బతినడంతో సుమారు రూ.4.70 కోట్ల నష్టం జరిగింది. మత్స్యశాఖకు సంబంధించి వెయ్యి బోట్లు, 300 వలలను మత్స్యకారులు నష్టపోయారు. నష్టం సుమారు రూ.13.85 కోట్లు ఉంటుందని అంచనా. వంశధార కాలువలతోపాటు నీటిపారుదల శాఖకు చెందిన పలు 173 నిర్మాణాలు దెబ్బతిన్నాయి. వీటి శాశ్వత మరమ్మతులకు రూ.108 కోట్లు అవసరమని అంచనా. గ్రామీణ నీటి సరఫరా విభాగానికి చెందిన పలు నీటి పథకాలు దెబ్బతినగా రూ.1.5 కోట్ల నష్టం వాటిల్లింది. విద్యాశాఖ పరిధిలో 12 మండలాల్లో 24 పాఠశాలల ప్రహరీ గోడలు, తరగతి గదులపై చెట్లు పడిపోవడం వల్ల సుమారు రూ.3,28 కోట్ల నష్టం వాటిల్లింది. సామాజిక అటవీ విభాగం పరిధిలో కూడా ప్లాంటేషన్లు దెబ్బతినడం, మొక్కలు నాశనం కావడంతో నష్టం సుమారు రూ.1.70 కోట్ల వరకు ఉంటుంది. పరిశ్రమల శాఖకు రూ.85 కోట్ల వరకు నష్టం అంచనా వేశారు. పలు రెసిడెన్షియల్ పాఠశాలల భవనాలు కూలడం, చెట్లు పడటంతో రూ. 20 కోట్ల మేర నష్టం వాటిల్లింది, ఎనిమిది మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రహరీ గోడలు, అదనపు గదులు, మరుగుదొడ్లు నాశనమయ్యాయి. రూ.కోటి ఉంటుందని అంచనా. దేవాదాయ శాఖకు కూడా రూ.20 లక్షల నష్టం వాటిల్లింది. -
బాణసంచా వ్యాపారులకు హుదూద్ దెబ్బ
నరసన్నపేట:హుదూద్ తుపాను ప్రభావం దీపావళి పండుగపై సైతం పడింది. ఏడాదికి ఒకసారి ఉత్సాహంగా అందరూ జరుపుకొనే పండుగ సందడిపై తుపాను ప్రభావం స్పష్టంగా కనిపించింది. తుపాను బాధితులు ఇబ్బందుల్లో ఉండడంతోపాటు పర్యావరణ పరిరక్షణ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మూడు జిల్లాల్లో దీపావళి సామగ్రి విక్రయాలను ఈ ఏడాది నిషేధించారు. దీంతో విక్రయూనికి కొద్దిరోజులు ముందుగానే తెప్పించిపెట్టుకున్న బాణసంచాను వ్యాపారులు గుడౌన్లకే పరిమితం చేయడంతో తీవ్రంగా నష్టపోయూరు. నిషేధం ఉండడంతో బాణసంచా ఎక్కడా లభ్యం కాలేదు. దీంతో పిల్లలను బుజ్జగించలేక తల్లిదండ్రులు అవస్థలు పడ్డారు. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. 6 కోట్లు నుంచి పది కోట్ల రూపాయల వరకు బాణ సంచాను వ్యాపారులు తెప్పించి కనీసం 20 కోట్ల రూపాయలకు విక్రయించేవారు. దీనికి కోసం ముందగానే లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టేవారు. దుకాణాలు తెరిచేందుకు పంచాయతీ , అగ్నిమాపక , రెవెన్యూ , పోలీసు తదితర శాఖల అనుమతులు అవసరం. ఈ అనుమతులు పొందడానికి అనధికారికంగా లెసైన్స్‌ఫీజులు రూపేనా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి వ్యాపారులు అనుమతులు తెచ్చుకునేవారు. ఈ సంవత్సరం దీపావళి రెండు రోజుల ముందు ముఖ్యమంత్రి ఈ మూడు జిల్లాల్లో బాణసంచా విక్రయాలు అనుమతించవద్దని ఆదేశించడంతో అధికారులు, వ్యాపారులు ఇరకాటంలో పడ్డారు. జిల్లాకు తాడేపల్లిగూడెం, శివకాశీ వంటి సుదూర ప్రాంతాల నుంచి హోల్‌సేల్ ధరలకు వ్యాపారులు బాణసంచా తెచ్చి విక్రయిస్తుంటారు. వీటిని విక్రయించేందుకు కేవలం దీపావళి ముందు రోజు కానీ, అంతకంటే ముందు రోజు కానీ అనుమతిస్తుంటారు. అయితే దీపావళి అనంతరం ఈ లెసైన్స్‌లు విక్రయాలకు ఉపయోగపడవు. తెచ్చిన లక్షలాది రూపాయల విలువచేసే బాణ సంచాను వచ్చే ఏడాది వరకు భద్ర పరిచేందుకు అనుమతి ఉండదు. అంతేకాకుండా భద్రపరచడం కూడా వ్యాపారికి తలకుమించిన భారమే. ఈ కారణంగా వ్యాపారులంతా తాము తెచ్చిన సరుకును తిరిగి అదే హోల్‌సేల్‌వ్యాపారికి రిటన్ చేశారు. -
నవంబర్ ఒకటి నుంచి మళ్లీ జన్మభూమి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ ఒకటో తేదీ నుంచి జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని తిరిగి నిర్వహించనుంది. నవంబర్ ఒకటి నుంచి ఎనిమిది పనిదినాలపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తొలుత అక్టోబర్ 2 నుంచి 20 వరకూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం పదిరోజుల నిర్వహణ తరువాత హుదూద్ తుపాను కారణంగా దీనిని తాత్కాలికంగా వాయిదా వేయడం తెలిసిందే. -
టపాసులు లేని దీపావళి
విజయనగరం కంటోన్మెంట్: దీపావళి ఆనందాన్ని హుదూద్ చిదిమేసింది. మేలుకోబోతే మరో ప్రమాదాన్ని ఆహ్వానించినట్టే అవుతుంది. అందుకే ఈ దీపావళిని జిల్లా దీపాలతోనే సరిపెట్టుకోబోతోంది. తుపాను కారణంగా నిండామునిగిన చాలా మంది పండగచేసుకునే పరిస్థితిలో లేరు. మరో పక్క ఎక్కడికక్కడ చెట్లు విరిగిపడ్డాయి. దీంతో చాలా ప్రాంతాల్లో మోడువారిన చెట్లు, ఎండిన ఆకులతో నిండిపోయాయి. చిన్న నిప్పు వీటికి అంటుకుంటే పెద్ద ప్రమాదమే సంభవిస్తుంది. దీంతో బాణసంచా విక్రయించరాదన్న అధికారుల ఉత్తర్వులతో తుపాను ప్రభావం పెద్దగాలేని మిగతా ప్రాంతంలోనూ ఉత్సాహం తగ్గిపోయింది. దీపావళి పండగను టపాసులు లేకుండా దీపాలతోనే జరుపుకోవాలని, కనీసం కాల్చడం కూడా వద్దని కలెక్టర్ ఎంఎం నాయక్ ప్రజలకు సూచించారు. బాణసంచా విక్రయాలు చేయరాదని, దుకాణాలను మూసేయాలని కూడా ఆదేశాలిచ్చారు. రెండు డివిజన్లలోని సబ్ కలెక్టర్, ఆర్డీఓలకు ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. బాణసంచా విక్రయాలు చేయనీయకుండా కేసులు నమోదు చేసి, విక్రయాలు చేస్తున్న దుకాణాలను సీజ్ చేసి, యజమానులపై కేసులు పెట్టాలని పోలీసు, ఫైర్ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ఇలా ఆదేశాలు ఇవ్వడం జిల్లా చరిత్రలో ఇదే ప్రథమం. దీంతో ఈ ఏడాది వెలుగు విరజిమ్ముతూ తిరిగే భూ చక్రాల భ్రమణాలు, విష్ణు చక్రాల విశ్వరూపాలు, కాకరపువ్వొత్తుల వెన్నెల వెలుగులు, వెలుగు పూలు విరజిమ్మే చిచ్చుబుడ్డుల అందాలు, బాంబుల మోతలు లేకుండానే దీపావళి జరగనుంది. కీలక సమయం... దీపావళికి ముందు రోజు బాణసంచా వ్యాపారులకు కీలక సమయం. గత ఏడాది సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా విక్రయాలు సరిగా సాగలేదు. ఈ ఏడాది తుపాను కారణంగా మారోమారు వారి వ్యాపారాలు డీలా పడ్డాయి. జిల్లాలో ఏటా దాదాపు రూ.ఎనిమిది కోట్ల మేర బాణసంచా విక్రయాలు జరుగుతుంటాయి. జిల్లా ప్రజలే కాకుండా సమీప రాష్ట్రాలయిన ఒడిశా, చత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి కూడా వచ్చి బాణసంచాను టోకున కొనుగోలు చేస్తారు. దీంతో చాలా వరకూ విక్రయాలు జరిగిపోయినా జిల్లాకు సంబంధించి విక్రయాలు జరిగిపోయినా దాదాపు రూ.5 కోట్ల రూపాయల వరకూ విక్రయాలు నిలిచిపోయాయి. ఇప్పటికే చాలా మంది వద్ద అడ్వాన్సులు తీసుకుని సరుకులు తీసుకువెళ్లే సమయంలో నిషేధం అమలు కావడంతో బాణసంచా వ్యాపారులు జేసీ, కలెక్టర్ వద్దకు వెళ్లి కలిసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినా అవేవీ సఫలం కాలేదు. అధికారులు కనీసం వీరిని కలిసేందుకు కూడా ఇష్టపడకపోవడంతో నిరాశతో వెనుతిరిగారు. మంగళవారం రాత్రి కూడా చివరకంటా ప్రయత్నాలు చేసిన వ్యాపారులు ఇక చేసేదేం లేక మిన్నకుండి పోయారు. -
సిక్కోల్లో చీకట్లే..!
సిక్కోలు జిల్లా దీపావళి సందడికి దూరమైంది. హుదూద్ తుపాను ధాటికి పంటలన్నీ నాశనమయ్యూయి. రైతులు, మత్స్యకారుల బతుకుల్లో వెలుగులు నింపే సమయంలో చీకట్లు అలముకున్నాయి. నిత్యావసర సరుకుల ధరలు నింగిని తాకుతున్నాయి. తిండికి కూడా కటకటలాడాల్సిన పరిస్థితి. ఫలితం.. చాలా పల్లెల్లో పిండి వంటల ఘమఘమలు, మహిళల హడావుడి కానరావడం లేదు. మరోవైపు ప్రభుత్వం దీపావళి పండుగను నిషేధించడంతో బాణసంచా విక్రయూలు పూర్తిగా నిలిచిపోయూయి. పాలకొండ రూరల్: నరకాసురునిపై యుద్ధం సాగించి విజయానికి కారకమైన మహిళా శక్తికి నిదర్శనంగా సాగే దీపావళి ఇంటిల్లిపాదికీ ఇష్టమైన పండుగ. దివ్వెల పండుగ. దుష్టసంహారానికి ప్రతీకగా జరుపుకునేది. సమాజంలోని చీకటిని తొలగించి ప్రజల బతుకుల్లో వెలుగులు నింపేదే దీపావళి. అయితే, ఈ ఏడాది ప్రకృతి విపత్తులతో విలవిల్లాడుతున్న జిల్లా వాసులు పండుగకు దూరమయ్యూరు. పేలని టపాసులు... దీపావళి పండగ ప్రాధాన్యత పక్కన పెడితే బాణసంచా ధరలు నింగినంటాయి. ఈ ఏడాది బాణసంచా దుకాణాలు పూర్తిగా లేకపోవడం, ఇటీవల తయారీ కేంద్రాల్లో జరిగిన అగ్నిప్రమాదాలు కారణంగా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు, నిబంధనలు విధించడంతో శ్రీకాకుళం, పాలకొండ, రాజాం వంటి ముఖ్య పట్టణాల్లో కూడా లెసైన్స్ ఉన్న బాణసంచా దుకాణాలు లేని పరిస్థితి నెలకొంది. దీంతో చిన్నపాటి మందుగుండు సామాగ్రి కూడా కొనుక్కొనేందుకు వీలు లేకుండాపోయింది. అడపా దడపా అమ్ముతున్నా ధరలు ఆకాశాన్నంటుతున్నారుు. మార్వాడీల్లో దీపావళి కళ శ్రీకాకుళం కల్చరల్: దీపావళి పండగకు వయుసుతో నిమిత్తం లేకుండా అందరూ ఆనందంగా చేసుకునే పండగ. దీపావళి అంటే దీపోత్సవం. ఆరోజన దీపలక్ష్మీ శత సహస్ర కిరణ కాంతులతో అమావాస్యనాటి అజ్నానపు చీకట్లను పారద్రోలి జగత్తును తేజోమయం చేసి, జ్ఞాన జ్యోతులు ప్రకాశింప చేస్తుంది. చీకటిపై వెలుతురు, అసత్యంపై సత్యం, విజయం సాధించిన రోజుగా ఈ పండుగను జరుపుకుంటారు. ఆశ్వీయుజ బహుళ త్రయోదశినే ధన త్రయోదశిగా వ్యవహరిస్తారు. మార్వాడీలు దీపావళిని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. వివిధ ఆకారాల దీపాలతో పండుగను జరుపుకొంటారు. లక్ష్మీపూజలు జిల్లాలో మార్వాడీ కుటుంబ సభ్యులు దీపావళి పండుగకు సిద్ధమవుతున్నారు. దీని కోసం తమ ఇళ్లను, షాపులను విద్యుత్ దీపాలతో అలంకరించారు. దీపావళి రోజు సాయంత్రం షాపులలో, ఇళ్లవద్ద లక్ష్మీపూజలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా మార్వాడీల సంఘం ప్రతినిధి ప్రదీప్ బిహాని మాట్లాడుతూ ఈరోజు నుంచి మా వ్యాపారానికి చెందిన లావాదేవీల అకౌంటు పుస్తకాలను ప్రారంభిస్తామని తెలిపారు. మా ఎదుగుదలకు కారణమైన లక్ష్మీదేవికి పూజలు చేస్తామని తెలిపారు. దీపం అంతరార్థం మన పూర్వీకులు దీప దర్శనానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు. ఈ సంప్రదాయం భక్తి భావాలకు నెలవైన దీపావళి రోజున ఒక్కొక్క రకమైన ప్రమిదతో వెలిగిస్తే కోరికలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. బంగారు ప్రమిదను గోధుమలపై పెట్టి, నలువైపులా గులాబి రేకులు అలంకరించి స్వచ్చమైన ఆవు నెయ్యితో వెలిగిస్తే ధన సమృద్ధి, బుద్ధి చాతుర్యం సిద్ధిస్తుంది. వెండి ప్రమిదను బియ్యంపై ఉంచి చుట్టూ తెల్లగులాబీ అలంకరించి ఆవు నెరుు్యతో దీపం వెలిగిస్తే ధనసంపద పెరుగుతుంది. రాగి ప్రమిదను కందిపప్పుపై ఉంచి ఎర్రన్ని పూవురేకులతో అలంకరించి నువ్వుల నూనెతో వెలిగిస్తే మనోబలం కలిగి, అరిష్టం నశిస్తుంది. పసుపురంగు పువ్వులు శనగ పప్పుపై ఉంచి నువ్వుల నూనెతో వెలిగిస్తే ధనానికి స్థిరత్వం కలుగుతుంది. ఇనుప ప్రమిదను మినప పప్పుపై ఉంచి ముదురు నీలం రంగు పూలు అలంకరించి పెడితే అరిష్టం నశిస్తుంది. మట్టి ప్రమిదను సంధ్యాసమయంలో ఆవు నెరుు్యతో తులసి మొక్క వద్ద వెలిగిస్తే దుష్ట శక్తుల ప్రభావం పోతుంది. నాలుగు వీధుల కూడలిలో దీపం పెడితే లాభం చేకూరుతుంది. రావిచెట్టు కింద ఆవనూనెతో దీపం పెట్టడం వల్ల కోరికలు తీరుతాయి. నువ్వుల నూనెతో 41రోజులు దీపం పెడితే దీర్ఘరోగాలు నయమవుతాయి. అరిటి చెట్టుకింద ప్రతి గురువారం నెయ్యితో దీపం వెలిగిస్తే కన్యలకు వెంటనే వివాహం అవుతుందని నమ్మకం. పవిత్రమైనది... దీపావళి ఎంతో పవిత్రమైన పర్వది నం. కాలరాత్రికి దీపావ ళి. జగన్మాతకు మహాప్రీతిపాత్రమైన రోజులు దీపావళి అమావాస్య, మహాశివరాత్రి, కృష్ణాష్టమి. ఈ మూడింటిలో ఎంతో ప్రాధాన్యత ఉన్నది దీపావళి. ప్రకృతి విపత్తులతో ప్రజలు పండుగకు దూరంకావడం విచారకరం. - దార్లపూడి లక్ష్మీప్రసాదశర్మ, ప్రధాన అర్చకుడు, కోటదుర్గమ్మ దేవస్థానం పంటా లేదు.. పండుగా లేదు.. ఈ ఏడాది తుపానుతో దీపావళి చేసుకునే పరిస్థితి లేకుండా పోరుుంది. కనీసం పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు. ఇంకా దీపావళి పండగ సంబరాలు చేసుకొనే పరిస్థితి ఎక్కడుంది. - ఖండాపు ప్రసాదరావు, అభ్యుదయ రైతు -
అందరూ ముందుకొస్తే పూర్వవైభవం
విశాఖపట్నం : హుదూద్ తుపాను కారణంగా నష్టపోయిన విశాఖ నగర బ్రాండ్ ఇమేజ్ను నిలబెట్టేందుకు అందరూ ముందుకు రావాలని రాష్ట్రమానవవనరులశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. తుపానులను జయిద్దాం నినాదంతో బీచ్‌రోడ్‌లో జిల్లా యంత్రాంగం బుధవారం రాత్రి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయస్థాయిలో పేరుగాంచి విశాఖను సుందరనగరంగా తీర్చిదిద్దడానికి ప్రతిఒక్కరి సహకారం అవసరమన్నారు. హుదూద్ నుంచి తక్కువ రోజుల్లో ప్రజలను తేరుకునేలా చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కుతుందన్నారు. పంచాయితీరాజ్‌శాఖామంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ విశాఖపునర్నిర్మాణంలో ప్రతిఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ఎంపీ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ విశాఖను స్మార్ట్ సిటీగా చేయడమే ప్రధాని నరేంద్రమోడీ లక్ష్యమన్నారు. దీని వెనుక కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కృషి ఉందన్నారు. హుదూద్ ప్రభావంతో చెదిరిన పచ్చదనం గురించి ఆందోళన చెందవద్దని.. ఆరు నెలల్లో 60శాతం పచ్చదనం కనబడుతుందన్నారు. అంతకుముందు ‘తుపానులను జయిద్దాం’ అనే నినాదంతో కాగడా, కొవ్వొత్తుల ప్రదర్శన ఉత్సాహంగా సాగింది. బీచ్‌రోడ్ పాండురంగస్వామి ఆలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర పట్టణాభివృధ్దిశాఖామంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి ప్రారంభించిన ఈ ర్యాలీ ఆర్ కె బీచ్ కాళీమాత ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సభాప్రాంగణం వరకూ సాగింది. కార్యక్రమంలో మంత్రులు కిమిడి మృణాళిణి, శిద్దా రాఘవరావు, పరిటాల సునీత, కింజారపు అచ్చంనాయుడు, పీతల సుజాత, కామినేని శ్రీనివాస్, పి.నారాయణ, రావెల కిశోర్‌బాబు, పల్లె రఘునాదరెడ్డి,ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ మూర్తి, వాసుపల్లి గణేశ్‌కుమార్, గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ యువరాజ్ తో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం తుపాను బాదితుల సహాయార్దం ఉద్యోగుల జేఏసి 8కోట్లు రూపాయిలు చెక్కును కలెక్టర్ చేతులు మీదుగా ముఖ్యమంత్రికి అందచేసారు. -
రైతుల జీవితాలతో చెలగాటం
-
రైతుల జీవితాలతో చెలగాటం
ఏపీ సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తిన జగన్మోహన్రెడ్డి ► రాష్ట్రంలో రైతు రుణాలు, రూ.87 వేల కోట్లు, డ్వాక్రా రుణాలు రూ.14 వేల కోట్లు ► వీటికి ఏడాది వడ్డీ రూ.14 వేల కోట్లు, రెండేళ్లకు కలిపి వడ్డీ రూ.28 వేల కోట్లు ► ఈ లెక్కన రూ.1లక్ష 29 వేల కోట్ల రుణాలుండగా రూ.5వేల కోట్లు ఇచ్చారు ► పింఛన్లకు ఏడాదికి రూ.3,700 కోట్లు అవసరమైతే.. రూ.1,300 కోట్లు కేటాయించారు ► మిగిలిన రూ. 2,400 కోట్లు విడుదల చేయకుండా ఆ మేరకు పింఛన్లు కోసేస్తున్నారు ► రుణమాఫీ, రీ షెడ్యూల్ లేకపోవడంతో పంటబీమా కోల్పోయిన రైతన్నలు ► చంద్రబాబు మోసాలపై నవంబర్ 5న అన్నదాతలు, అక్కచెల్లెళ్ల చేత అడిగిస్తాం ► శ్రీకాకుళం జిల్లాలో హుదూద్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన ► బాణసంచా పేలుడు మృతుల కుటుంబాలను ఓదార్చేందుకు హుటాహుటిన వెళ్లిన జగన్, రెండో రోజు పర్యటన రద్దు శ్రీకాకుళం: ‘‘అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీపై తొలిసంతకం చేస్తానన్న చంద్రబాబు నాయుడు ఈ రోజు రుణమాఫీ కోసం ఇచ్చింది కేవలం రూ.5 వేల కోట్లు. ఆ మాత్రం ఇచ్చి మొత్తం రైతు రుణాలలో 20 శాతం ఇచ్చానని చెపుతున్నారు. మొత్తం రైతు రుణాలు రూ.87 వేల కోట్లు, డ్వాక్రా అక్కచెల్లెళ్ల రుణాలు రూ.14 వేల కోట్లు. మొత్తం దాదాపు రూ.లక్ష కోట్లు. వీటికి ఏడాది వడ్డీ రూ.14 వేల కోట్లు. అప్పుడే రెండో ఏడాది కూడా వస్తుంది, అంటే మరో రూ.14 వేల కోట్లు. రెండేళ్ల వడ్డీకలిపితే రూ.28 వేల కోట్లు అవుతుంది. ఈ లెక్కన మొత్తం రూ.1.29 లక్షల కోట్లు రుణ మాఫీ చేయాలి. కానీ ఆయనేమో రూ.5వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇది సమంజమేనా? రుణమాఫీ అంటే ఇదేనా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం చంద్రబాబునాయుడిని ప్రశ్నించారు. ఆయన మంగళవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణస్వామిని దర్శిం చుకున్నారు. తుపానుకు సర్వస్వం కోల్పోయిన ప్రజలు ఆ కష్టం నుంచి తేరుకోవాలని ఆల యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీకాకుళం జిల్లాలోని హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. జీలుగుపాలెం, కోటపాలెం, పాతర్లపల్లి, కోస్టా జంక్షన్లలో బాధితులను పరామర్శించారు. కిల్లిపాలెం, కళ్లేపల్లి, పెదగనగళ్లపేట, మురపాక, తదితర ప్రాంతాల్లో ప్రసంగించారు. ఆయన మాటల్లోని ముఖ్యాంశాలు... రాష్ట్రంలో 43,11,636 పింఛన్లు వున్నాయి. ఇప్పుడు రూ.1,000 పింఛన్ ఇస్తామంటున్నారు. అంటే వాటికి రూ.3,700 కోట్లు అవుతుంది. కానీ మొన్న బడ్జెట్లో వీటికి రూ.1,300 కోట్లు కేటాయించారు.మిగిలిన రూ.2,400 కోట్లు ఇవ్వకుండా ఆ మేరకు పింఛన్లు కత్తిరించే కార్యక్రమం చేస్తున్నారు. ‘‘మొన్నటివరకు ఐసీఐసీఐ బ్యాంకు అనే సంస్థ వాళ్ళు నెలనెలా ఊళ్ళకు వచ్చి మేము బతికున్నామో లేదోచూసి వేలి ముద్ర వేయించుకుని రూ.200 పింఛన్ ఇచ్చి వెళ్లేవారు. మరి అప్పుడు బోగస్ కానివి ఇప్పుడెలా బోగస్ అయ్యాయి?’’ అని చంద్రబాబుని నిలదీయండి. ప్రతిరోజూ నేను చూస్తున్నా రోడ్డుకు అటుప్రక్క, ఇటుప్రక్క ఒరిగిన చెట్లు, నష్టపోయిన పంటలు, కూలిన ఇళ్లు కనపడ్డాయి. చెరకు, వరి, అరటి, కొబ్బరి, మామిడి, జీడిమామిడి ఇలా అన్ని పంటలు, తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాటిని చూసి నేను రైతులను అడిగా.. పంటలు ఇంత తీవ్రంగా నష్టపోయాయి కదా! మరి ఇన్సూరెన్స్ ఏమైనా వస్తుందా అని. దానికి రైతులు ఏమన్నారంటే, అయ్యా...‘‘చంద్రబాబుగారు మీరెవరూ రుణాలు కట్టొద్దు, నేను అధికారంలోకి రాగానే మీ రుణాలన్నీ మాఫీ చేస్తాం’ అన్నారు. అందుకే మేము లోన్లు కట్టలేదు, ఇప్పుడేమో రీ షెడ్యూల్ కూడా చేయలేదు, అందువల్ల ఇన్సూరెన్స్‌లేదు, ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు అని చెప్పారు. గ్రామాల్లో తాగటానికి మంచినీళ్లు లేవు, బోర్లకు కరెంట్ లేదు, జనరేటర్‌తో బోర్లు నడిపించి ప్రజలకు కనీసం మంచినీళ్లయినా ఇద్దామనే మనసులేని దారుణమైన ప్రభుత్వమిది. తాగునీటికోసం జనరేటర్ డీజిల్‌కు డబ్బులిస్తామని కూడా చెప్పని దారుణమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వుంది. మనం చంద్రబాబును, ఈ ప్రభుత్వాన్ని నిల దీయకపోతే, మరో పది రోజులుపోతే.. బియ్యం కార్డులు, పింఛన్లు తగ్గిపోతాయి. రుణమాఫీ ఎగిరిపోతుంది. కేవలం రూపాయి కిలో బియ్యం 25 కేజీలు కొన్ని గ్రామాలకు ఇచ్చి, కొందరికి ఇవ్వకుండా అంతా చేసేశామంటూ ఏమీ చెయ్యకుండానే ఈనాడు పత్రికలోనో, మరో చానల్లోనో అంతా బాగుంది, బ్రహ్మాండంగా వుంది, బిల్ క్లింటన్ కన్నా, నవీన్ పట్నాయక్ కన్నాబాబు బాగా చేశాడు అని అద్భుతంగా ప్రచారం చేసుకుంటారు. అందుకే ఈ ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తీసుకు రావాలి, లేకపోతే మంచి జరగ దు. అందుకే డ్వాక్రా, రైతు రుణమాఫీ కోసం, మన అవ్వ, తాతలు, వికలాంగ, వితంతు పింఛన్లు కోసం, తూర్పుగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో తుపాను బాధితుల సహా య పునరావాసం కోసం నవంబర్ 5న అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు, నిరసనలు నిర్వహిద్దాం. రెండోరోజు పర్యటన రద్దు తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన పేలుడు ఘట నలో మృతిచెందినవారి కుటుంబాల్ని పరామర్శించేందుకు జగన్ హుటాహుటిన బయల్దేరి వెళ్లారు. దీంతో శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లోని మరికొన్ని ప్రాంతాల్లో మంగళవారం జరగాల్సిన పర్యటన రద్దయింది. బుధవారం జరగాల్సిన రెండోరోజు పర్యటనను కూడా రద్దు చేశారు. తమకు ఏ సాయమూ అందలేదంటున్న బాధితులు జగన్ తాను పర్యటించిన ప్రతి ఊరిలో తుఫాను బాధిత ప్రజలను పరామర్శిస్తూ... మీకు ప్రభుత్వం నుండి ఏమైనా సహాయం అందిందా? పంట, ఆస్తినష్టం వివరాల నమోదుకు ఎవరైనా అధికారులు మీ గ్రామాలకు వచ్చారా? అని ప్రశ్నిస్తూ వాటికి సమాధానం బాధితులంతా చేతులెత్తి, పెద్దగా వినపడేలా చెప్పాలని కోరారు. తమకు ఏవీ అందలేదని, తమ వద్దకు ఏ అధికారులు రాలేదని ప్రతీచోటా బాధితులు ముక్త కంఠంతో చెప్పారు. కొల్లిపాలెంలో రైతు డి.రామారావు తుపానుకు నష్టపోయిన చెరుకు పంటను, పలువురు రైతులు వరి, అరటి పంటలను తీసుకువచ్చి జగన్‌కు చూపించారు. తమను ఎవరూ పట్టించుకోవటం లేదని సర్వం నష్టపోయి పుట్టెడు దుఃఖంలో వుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని ఆవేదనను వెళ్లబోసుకున్నారు. -
వికాసపట్నం చేద్దాం
కడలి కల్లోలానికి ఆర్కేబీచ్ అందవిహీనం అయింది. సుడిగాలి తాకిడికి యారాడ కొండలు వణికిపోయాయి. ప్రకృతి కాంతను ఒడిలో దాచుకున్న విశాఖపట్నం.. అదే ప్రకృతి కన్నెర్ర చేయడంతో శోక సంద్రమైంది. హుదూద్ తుపాను తీవ్రత విశాఖను కకావికలం చేసింది. ఉప్పెనలా వచ్చిపడిన కష్టం నుంచి విశాఖను ఊరడించేందుకు మా తరం ముందుకురావాలంటోంది విద్యార్థిలోకం. దుండిగల్‌లోని మర్రిలక్ష్మారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు క్యాంపస్ కబుర్లలో.. వైజాగ్ వాసులకు ధైర్యంతో పాటు కర్తవ్యాన్ని నిర్దేశించారు. శ్రీకాంత్: హుదూద్ తుపాను విశాఖపట్నాన్ని సర్వనాశనం చేసింది. వెరీ బ్యాడ్ న్యూస్. ఇందులో గుడ్ ఏంటంటే.. పెద్ద ఎత్తున ప్రాణనష్టం లేకపోవడం. నరేష్: ముందుగానే ఇంటిమేషన్స్ అందాయి కదా! అది బతికించింది. అలేఖ్య: ఏం లాభం.. తుపాను తర్వాత శాటిలైట్ పూర్తిగా ధ్వంసమైంది. ఈరోజుల్లో ఫోన్‌కాల్స్ కట్ అయితే దానికిమించిన నరకం ఇంకోటి ఉండదు కదా! ఫుడ్, ఎకామిడేషన్ లేక లక్షలమంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. టీవీల్లో చూసినపుడు చాలా బాధనిపించింది. గణేష్‌బాబు: ఓకే తుపాను, వరదలు వచ్చినపుడు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. మళ్లీ కొన్నాళ్లకు మామూలు పరిస్థితులు వస్తాయి. కానీ వందల ఏళ్లనాటి చెట్లు వేళ్లతో సహా నేలకొరిగాయి. విశాఖ తీరాన తిరిగి పచ్చదనం రావాలంటే ఎన్ని ఏళ్లు పడుతుందో ! శ్రావ్య: నిజమే.. అసలు అంత పెద్ద చెట్లు ఎలా కూలిపోయాయో ఆశ్చర్యం వేస్తుంది. నేలసారం వల్ల అంటున్నారు చాలామంది. ఆకాశ్: డెఫినెట్లీ.. ఇసుక నేలలో చెట్లకు, జిగురు నేలలో చెట్లకు చాలా తేడా ఉంటుంది. మన హైదరాబాద్‌లో కూడా చెట్లు త్వరగా కూలిపోతాయి. చిన్న వర్షానికి కూడా చెట్లు రోడ్డుకి అడ్డంగా పడిపోతుంటాయి కదా! గణేష్‌బాబు: యా.. వైజాగ్ మ్యాగ్జిమమ్ ఇసుక నేలే. చెట్లు అంత పెద్ద ఎత్తున కూలిపోవడానికి అదీ ఒక కారణం కావొచ్చు. కృష్ణ: అవన్నీ పక్కన పెట్టండి.. రాత్రిపూట కరెంట్ ఓ గంట పోతేనే ఏదో ప్రళయం వచ్చినట్టు ఫీలైపోతాం. అలాంటిది అక్కడ ఇప్పటికీ చాలా చోట్ల కరెంటు లేదు. ఎలా ఉంటున్నారో ఏమో..? గణేష్‌బాబు: రాబోయే ప్రమాదాలను ముందుగానే కనిపెట్టగల్గుతున్నాం.. కానీ వాటి నుంచి బయటపడలేకపోతున్నాం. కృష్ణ: సముద్ర తీర ప్రాంతాల్లో కరెంటు మొత్తం అండర్‌గ్రౌండ్ సిస్టమ్‌లో ఉంటే బెటర్. ఈవెన్ మొబైల్ నెట్వర్క్ కూడా అలాగే ఏర్పాటు చేయాలి. శ్రావ్య: అన్నిటికంటే ముఖ్యమైంది ఆకలి. ఆ సమయంలో తిండిలేక చాలామంది ఇబ్బందిపడ్డారు. ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి అక్కడి ప్రభుత్వం ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సింది. అలేఖ్య: వైజాగ్‌ని రీబిల్డ్ చేయాలంటే చాలా కష్టం. ఇందులో అందరూ భాగస్వాములు కావాలి. శ్రావ్య: ముఖ్యంగా యూత్. గణేష్ బాబు: కాలేజీ విద్యార్థులంతా గ్రూపులుగా వెళ్లి రీబిల్డింగ్లో పాలుపంచుకోవాలి. ఫేస్‌బుక్‌లను, వాట్సాప్‌లను ఉపయోగించుకుని అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. శ్రీకాంత్: మిగతా విషయాల సంగతి ఎలా ఉన్నా.. చెట్ల వరకూ బాధ్యత తీసుకుంటే భవిష్యత్తులో కొత్త కష్టాలు రాకుండా ఉంటాయి. నరేష్: చెట్లు లేని వాతావరణం చాలా భయంకరంగా ఉంటుంది. వేడి పెరిగిపోతుంది. వడదెబ్బకు జరిగే నష్టాలు చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. భాగ్యశ్రీ: వైజాగ్ పున ర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఇండియాలో ప్రతి ఒక్కరికీ ఉంది. కాలేజీ యాజమాన్యాలు ప్రోత్సహిస్తే విద్యార్థులు అక్కడికి వెళ్లి చేతనైనంత సాయం చేసి వస్తే బాగుంటుంది. అలేఖ్య: కాలేజీల తరఫునే అవసరం లేదు. ఇండివిడ్యువల్‌గా కూడా వెళ్లొచ్చు. అరకులోయ.. వైజాగ్ బీచ్ అంటూ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడానికి వెళ్తుంటారు కదా! ఇప్పుడు కూడా అలాగనుకునే వెళ్లి అక్కడ మనిషికి పది మొక్కలు చొప్పున నాటి వస్తే అదే చాలు. ప్రిస్క్యూ: ఇతర ప్రాంతాల నుంచి విద్యార్థులు వెళ్లడం ఇప్పుడు చాలా అవసరం. దాంతోపాటు వైజాగ్‌లోని విద్యార్థులు కూడా అక్కడి గ్రామాలకు వెళ్లి ఒక్కో ఊరిలో వెయ్యి మొక్కలు నాటాలి. భాగ్యశ్రీ: ఈ సందర్భంగా నాతోటి వారికి నేనొకటి చెప్పగలను.. వచ్చేది దీపావళి పండుగ. అబ్బాయిలు బోలెడంత డబ్బు ఖర్చు పెడతారు. ఈ ఏడాదికి క్రాకర్స్ ఖర్చు తగ్గించుకుని సగం డబ్బుని విశాఖ రీబిల్డింగ్‌కు పంపిస్తే మంచిదనుకుంటున్నాను. అలేఖ్య: యస్.. ఇప్పుడుకాకపోతే స్టూడెంట్స్ పవర్ ఇంకెప్పుడు చూపించుకుంటాం. - భువనేశ్వరి -
నష్టం రూ.700 కోట్ల పై మాటే..!
హుదూద్ తుపాను జిల్లాను అతలాకుతలం చేసింది. కోలుకోలేని దెబ్బతీసింది. అధికారులు సర్వే చేస్తున్న కొద్దీ పెరుగుతున్న నష్టాల చిట్టాయే దీనికి నిదర్శనం. ప్రాథమిక సర్వేలోనే రూ.700 కోట్ల మేర నష్టం జరిగినట్టు గుర్తించారు. సర్వే పూర్తయితే 1000 కోట్లు దాటుతుందని... కేంద్రం ప్రకటించిన తాత్కాలిక తుపాను సహాయం రూ.వెయ్యి కోట్లు ఒక్క శ్రీకాకుళం జిల్లాలోని నష్టాలు పూడ్చేందుకే సరిపడవన్న వాదన వినిపిస్తోంది. సాక్షిప్రతినిధి/శ్రీకాకుళం పాతబస్టాండ్ : తుపాను జిల్లాపై ఎంత ప్రభావం చూపిందో అధికారుల సర్వేలో నిర్ధారణ అవుతోంది. క్షేత్ర స్థారుులో సర్వేచేసిన అధికారులకు తుపాను నష్టం చెమట్లు పుట్టిస్తోంది. ముందస్తు చర్యలు, టెక్నాలజీతో తుపానును ఎదుర్కొన్నామని ప్రభుత్వం చెబుతున్నా నష్టాలు తగ్గలేదని పలువురు అధికారులే చెబుతున్నారు. విద్యుత్, వ్యవసాయ రంగం, రోడ్లుకు అపార నష్టం జరిగింది. అన్నదాత కుదేలయ్యూడు. మత్స్యకార బతుకులు ఛిద్రమయ్యూయి. పేదవారి గుడిసెలు నేలమట్టమయ్యూరుు. సీఎం, మంత్రులు పర్యటించినా, అధికారులు హడావుడి చేస్తున్నా ప్రజలకు తాగునీరు, విద్యుత్ సదుపాయూలు, నిత్యావసర వస్తువులు పూర్తి స్థారుులో అందని పరిస్థితి. చాలా ప్రాంతాలు అంధకారంలోనే మగ్గుతున్నాయి. కొన్ని చోట్ల సహాయచర్యలు కూడా చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పంట నష్టాలపై సర్వే జరుగుతోంది. గృహనిర్మాణ, ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ తదితర శాఖలు మాత్రం నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేశారుు. మిగిలిన శాఖలు ఇంకా వెనుకబాటులోనే ఉన్నాయి. పలుశాఖల నష్టాలు ప్రాథమిక అంచనాల్లో అధికారికంగా 700 కోట్లు దాటాయి. వీటిని క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించి పూర్తి అంచనాలు తెలిస్తే ఈ నష్టం రూ. 1000 కోట్లు పైబడుతుందని అధికారుల సమాచారం. 491 గ్రామాలపై ప్రభావం తుపాను వర్షాలు, నాగావళి, వంశధార నదుల వరద ఉద్ధృతి జిల్లాలోని 34 మండలాల్లో 491 గ్రామాలపై ప్రభావం చూపింది. ఇందులో 206 గ్రామాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. పంట నష్టం లెక్కకట్టలేనిది. వరదల్లో ఇద్దరు చనిపోగా, మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే. పంట నష్టాలు... వరి పంట 74,351 హెక్టార్లు, జొన్న 2,680, పత్తి 6,090, చెరకు 3,818, అపరాలు, ఇతర పంటలు 122 హెక్టార్లు.. మొత్తం 87,151 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లింది. ఉద్యానవన విభాగంలో కొబ్బరి 1,082 హెక్టార్లు, జీడిమామిడి 660, కూరగాయలు 376, అరటి 1578, బొప్పాయి 38, మామిడి 24 హెక్టార్లు కలిపి మొత్తం 3,758 హెక్టార్లలో నష్టం జరిగినట్లు అంచనా వేశారు. రోడ్లు, భవనాలు పంచాయతీరాజ్ విభాగానికి చెందిన 300 కిలోమీటర్లు రోడ్డు పాడైందని... తాత్కాలిక మరమ్మతులకు రూ.3 కోట్లు, శాశ్వత పరిహారం కోసం రూ.30 కోట్లు అవసరమని ఆ శాఖ అధికారులు ప్రతిపాదించారు. రోడ్లు, భవనాల శాఖ విభాగంలోని 820 కిలోమీటర్ల రోడ్లు పాడయ్యాయని, వీటికి తక్షణ సహాయంగా రూ.7 కోట్లు, శాశ్వత పరిష్కారానికి రూ.122 కోట్లు అవసరం ఉందని వివరించారు. మొత్తం జిల్లాలో రోడ్లకు గాను తాత్కాలికంగా రూ.10 కోట్లు, శాశ్వత పరిష్కారానికి రూ.152 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపించారు. విద్యుత్ శాఖ జిల్లాలో ఆరు పురపాలక సంఘాలు, 38 మండలాల్లో విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లింది. 33 కేవీ సబ్స్టేషన్లు, 33 కేవీ ఫీడర్లు 32, 11 కేవీ ఫీడర్లు 120, డిస్ట్రిబ్యూటర్ స్టక్చర్స్ 181, 33 కేవీ స్తంభాలు 119, పదకొండు కేవీ స్తంభాలు 860, ఎల్టీ పోల్స్ 1500, 11 కేవీ లైన్స్ 425 కిలోమీటర్లు, ఎల్టీ లైన్లు 425 కిలోమీటర్లకు నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో 7.30 లక్షల సర్వీసుల సేవలు నిలిచిపోయూయని, ఈ పునరావాస చర్చల్లో 79 బృందాలు, 1300 సిబ్బంది పనిచేస్తున్నారని పేర్కొన్నారు. గృహ నష్టాలు పక్కా ఇళ్లు పూర్తిగా 58, తీవ్రంగా 15, పాక్షికంగా 73 మొత్తం 146 ఇళ్లకు నష్టం జరిగింది. పూరిళ్లు పూర్తిగా 253, తీవ్రంగా 1461, పాక్షికంగా 3,702 కలిపి మొత్తం 5,416 ఇళ్లకు నష్టం వాటిల్లింది. మొత్తం జిల్లాలో పక్కా, పూరిళ్లు కలిపి 6,877 ఇళ్లు పాడయ్యాయి. పశుసంవర్ధకశాఖ పెద్దపశువులు 27, చిన్న పశువులు 211, పౌల్ట్రీ సంబంధిత జీవులు 17,500, ఎనిమిది పాడిపరిశ్రమలకు నష్టం వాటిల్లింది. సుమారు 70 లక్షల మేర నష్టం కలిగింది. మత్స్యశాఖ తీరగ్రామాల్లో వెయ్యి బోట్లకు నష్టం జరిగింది. 300 వలలను నష్టపోయారు. ఈ నష్టం సుమారుగా రూ.1.50 కోట్లు ఉంటుందని అంచనా. నీటిపారుదల.. వంశధార, నీటిపారుదల శాఖల్లో 173 పనులకు ఇబ్బందులు వచ్చాయి. వీటిని పూరించేందుకు తాత్కాలికంగా రూ.1.77 కోట్లు, శాశ్వత పరిష్కారానికి 39.105 కోట్లు అవసరమని అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. -
సహాయంలో రాజకీయమా?
సాక్షి ప్రతినిధి, విజయనగరం/భోగాపురం: హుదూద్ తుపాను వల్ల నష్టపోయిన బాధితులకు సహాయం చేసే విషయంలో రాజకీయాలు చేయరాదని, నష్టపోయిన రైతులందరికీ సహాయం చేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హితవు పలికారు. తుపాను నష్టాన్ని చూసిన రాహుల్ గాంధీ చలించిపోయారు. తుపాను ధాటికి మృతి చెందిన వారి కుటుంబీకుల బాధలు విని జాలి పడ్డారు. వారు పడుతున్న అవస్థల్ని విని, అండగా నిలుస్తామని, కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి చేసి పూర్తిస్థాయి సాయం అందేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. హుదూద్ తుపాను బీభత్సానికి కకావికలమైన భోగాపురం మండలం తూడెం, కవులవాడ గ్రామాల్లో రాహుల్‌గాంధీ సోమవారం పర్యటించారు. తొలుత తూడెంలో నేలపాలైన కొబ్బరి చెట్లను పరిశీలించారు. అనంతరం బాధిత రైతులతో మాట్లాడారు. ఒక్కొక్క చెట్టు ఇచ్చే ఫలసాయమెంత, చేతికొచ్చే ఆదాయమెంత తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ప్రభుత్వ వివక్షను వివరించారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయలేదని పంట నష్టం జాబితాలో తమ పేర్లు చేర్చడం లేదని, వివక్ష చూపిస్తున్నారని మొర పెట్టుకున్నారు. రైతుల నష్టాన్ని నయా పైసా సైతం ప్రభుత్వం చెల్లించేలా పోరాడతామని భరోసా ఇచ్చారు. గ్రామంలోని రాజమ్మ అనే మహిళ మాట్లాడూతూ నిన్ను చూస్తే మీ నాన్న రాజీవ్ గాంధీని చూసినట్టు ఉంది. మా కష్ట, నష్టాలను చూసేందుకొచ్చావు. ఇలాగైనా చూడగలిగామంటూ బాధలోనే సంతోషాన్ని వ్యక్తం చేసింది. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి రాహుల్ గాంధీ మట్లాడారు. అక్కడి నుంచి కవులవాడ గ్రామానికి చేరుకున్నారు. నష్టపోయిన కొబ్బరి రైతులతో ముందు మాట్లాడారు. లక్ష్మి అనే మహిళ మాట్లాడుతూ తన ఎకరా భూమిలో 80చెట్లు పడిపోయాయని, ఇల్లు కూడా పోయిందని మొర పెట్టుకుంది. మరో వృద్ధ మహిళ మాట్లాడుతూ కూలీ చేసుకునే వాళ్లం,కొబ్బరి, జీడి తోటలు పోనాయి. ఎకరాభూమిలో 60చెట్లు పడిపోయాయని చెప్పుకుంది. పంట నష్టపోయిన మహిళల గోడు విన్నాక తుఫాన్ ధాటికి మృతి చెందిన వారి కుటుంబీకులను పరామర్శించారు. వారిని ఓదార్చి, ఎనిమిది కుటుంబాలకు ఏఐసీసీ తరఫున ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున సాయం చేశారు. అనంతరం బాధితుల నుద్దేశించి మాట్లాడారు. భరోసా ఇచ్చే చెట్లు నాశనమైతే మా భవిష్యత్ ఏమని బాధితులంతా ప్రశ్నించుకుంటున్నారు. అంతకంటే సంపాదించే వ్యక్తులు,ధైర్యాన్ని ఇచ్చే యజమానులు చనిపోతే ఆ కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరమన్నారు.తుపానుకు బీద, మధ్య తరగతి వారే నష్టపోయారు. ఇళ్లు పోయి, పశువులు చనిపోయి, పంటలు పోయి నష్టపోయిన వారందరికీ ప్రభుత్వం నుంచి సహాయం అందించడానికి కాంగ్రెస్ కృషి చేస్తుందని తెలిపారు. బాధితులంతా గుండె నిబ్బరం చేసుకుని సమష్టిగా పోరాడి, పూర్వస్థితికి రావాలని ఆకాంక్షించారు. తుపాను నష్టం గురించి తెలిసి కళ్లారా చూడాలని, బాధలు తెలుసుకోవాలని తానిక్కడికి వచ్చానని చెప్పారు. అంతకుముందు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మండలంలో, గ్రామంలో జరిగిన నష్టాలను వివరించారు. రాహుల్ గాంధీ పర్యటనలో ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, తమిళనాడు కాంగ్రెస్ నేత తిరువక్కరసు, పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, రాజ్యసభ సభ్యులు సుబ్బరామిరెడ్డి, వి.హనుమంతరావు, కేంద్ర మాజీ మంత్రులు జేడీ శీలం, పల్లంరాజు, కిల్లి కృపారాణి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, మాజీ మంత్రులు బాలరాజు, కోండ్రు మురళీమోహన్, శాసన మండలి సభ్యుడు రామచంద్రయ్య, డీసీసీబీ చైర్మన్ మరిచర్ల తులసి,మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, కాంగ్రెస్ నాయకులు మజ్జి శ్రీను, యడ్ల రమణమూర్తి, శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, ఉప్పాడ సూర్యనారాయణ, యడ్ల ఆదిరాజు, పిళ్లా విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ స్థాయికి తగ్గ జనాలు రాకపోవడం నిర్వాహకులను అసంతృప్తికి గురిచేసింది. -
రుణం భూతమై..మరణమే శరణమై..
గొల్లప్రోలు :తన బడుగు కుటుంబం ఆర్థికంగా ఒక అడుగు ముందుకు వేయాలని ఆశించాడా రైతు. కొడిగట్టిన బతుకులో కాస్త వెలుగు నింపగలది ‘తెల్ల బంగారమే’ (పత్తి)నని నమ్మాడు. తన ఆకాంక్షను సాకారం చేసుకోవడానికి అప్పు చేసి తెచ్చిన సొమ్మును, చెమటను రంగరించి రెండెకరాల్లో సాగు చేశాడు. తీరా పత్తి కాపుదశకు వచ్చేసరికి ప్రకృతి పగబట్టింది. హుదూద్ తుపాను రూపంలో విరుచుకుపడి, పంట నేలనంటేలా చేసింది. కలలను గాలి కబళించి, చేసిన అప్పు భూతంలా భయపెట్టగా.. దిక్కుతోచని ఆ రైతు మరణ మే శరణ్యమనుకున్నాడు. మండలంలోని చేబ్రోలుకు చెందిన కౌలురైతు పెద్దింటి వీరరాఘవ (40) పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కూలీ నాలీ చేసుకునే వీరరాఘవ గ్రామానికి చెందిన దిబ్బిడి అప్పన్నదొరకు చెందిన రెండెకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేశాడు. చేతిలో డబ్బులు లేకపోయినా రూ.50 వేలు అప్పు చేసి పెట్టుబడి పెట్టాడు. కాపు దశలో ఉన్న పంట మొత్తం హుదూద్ తుపానుతో నేలనంటింది. కుక్కలు చింపిన విస్తరిలా మిగిలిన చేనును చూసి వీరరాఘవ గుండె చెదిరింది. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ధైర్యం దిగజారింది. చీడపీడల నివారణకు వాడే పురుగుమందే తన దుర్దశకు విరుగుడని నిశ్చయించుకున్నాడు. బుధవారం సాయంత్రం పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తూ పురుగుమందు తాగాడు. ఇంటికి చేరగానే కుప్పకూలిన ఆయన తాను పురుగు మందు తాగానని భార్యకు తెలిపాడు. ఆయనను 108లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందాడు. రెక్కల కష్టాన్నే నమ్ముకున్న వీరరాఘవ కుటుంబం చిన్న పూరింట్లో ఉంటోంది. ఆమెకు నిరుడు కడుపుకోత.. ఇప్పుడు గుండెకోత తుపానుకు పంట దెబ్బ తిన్న తరువాత భర్త తరచూ అప్పుల గురించే ప్రస్తావించేవాడని వీరరాఘవ భార్య సత్యవతి గొల్లుమంది. ఎదిగొచ్చిన వారి ఒక్కగానొక్క కొడుకూ ఏడాది కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. ఇప్పుడు భర్తనూ పోగొట్టుకుని ఏకాకిగా మిగిలిన సత్యవతి ‘నాకు దిక్కెవర’ంటూ విలపిస్తుంటే చూసినవారి హృదయాలు ద్రవించాయి. వీరరాఘవ ఆత్మహత్యతో గ్రామంలో విషాదం అలముకుంది. ఏఎస్సై కృష్ణబాబు చేబ్రోలు వచ్చి వీరరాఘవ బంధువులు, స్థానికులతో మాట్లాడారు. వీరరాఘవ సాగు చేసిన పొలం, అప్పుల వివరాలను తెలుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చక్కెర కర్మాగారాల ప్రైవేటీకరణకు కుట్ర
ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి నెట్టేస్తోంది తమవారికి కట్టబెట్టే కుట్రలు చేస్తోంది ధ్వజమెత్తిన వైఎస్ జగన్ విశాఖపట్నం: సహకార రంగంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి నెట్టేసి తమవారికి కట్టబెట్టాలని కుట్రలు పన్నుతోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. చక్కెర రైతుల తరఫున పోరాడతామని, ఫ్యాక్టరీల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని స్పష్టంచేశారు. హుదూద్ తుపాను బాధిత విశాఖపట్నం జిల్లాలో ఐదో రోజు పర్యటనలో భాగంగా జగన్ శనివారం అనకాపల్లి, చోడవరంలతోపాటు విశాఖ ఏజెన్సీలోని పాడేరు, హుకుంపేట, అరకు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. తమ వద్దకు వచ్చిన జగన్‌ను చూసి చెరకు రైతులు, గిరిజనులు ప్రభుత్వం తమను ఆదుకోవడంలేదని వాపోయారు. తమకు సాయం చేయాలని, తమ కోసం పోరాడాలని కోరారు. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు విశాఖపట్నంలో బయలుదేరిన ఆయన అనకాపల్లిలోని ఆవఖం డం వద్ద ఆగి వరద ముంపులో మునిగిన చెరకు తోటలను పరిశీలించారు. కూలిన గుడిసెలను చూశారు. అక్కడినుంచి అనకాపల్లిలోని చవితి నివీధి, విజయరామరాజుపేట జంక్షన్, తుమ్మపాల, వెంకుపాలెం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. కూలిన ఇళ్లు, గుడిసెలను పరిశీలించారు. చెరకు రైతులు, మహిళలతో మాట్లాడారు. ఏజెన్సీలోని పాడేరులోని గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. మోదుపల్లిలో తుపానుకు దెబ్బతిన్న కాఫీ తోటలను పరిశీలించారు. యరడపల్లిలో బురదలో నడుస్తూ కూలిన ఇళ్లను పరిశీలించారు. గిరిజనులతో మాట్లాడారు. అరకులోయ రూరల్ మండలంలో కొండచరియ విరిగిపడి దుర్మరణం పాలైన మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. అరకులో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. శనివారం అర్ధరాత్రి వరకు అలుపు లేకుండా ఆయన పర్యటన సాగింది. ఈ సందర్భంగా తమ్ముపాల, మోదుపల్లి వద్ద ఆయన చెరకు, కాఫీ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఏమన్నారంటే.... ► సహకార రంగంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి నెట్టేస్తోంది. అనకాపల్లి షుగర్స్ రైతులకు రూ.6కోట్లు ఇవ్వాల్సి ఉండగా... కేవలం రూ.2కోట్లే ఇచ్చింది. మిగిలిన రూ.4కోట్లు ఇవ్వకపోగా... ఫ్యాక్టరీ రూ.23కోట్లు నష్టాల్లో ఉన్నట్లు చూపిస్తోంది. ఆ సాకుతో ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయాలన్నది ప్రభుత్వ దురుద్దేశం. గతంలో కూడా ఇలాగే సహకారరంగంలోని సుగర్ ఫ్యాక్టరీలను తమవారికి తక్కువ ధరకు కట్టబెట్టేశారు. ఈసారి అదే చేద్దామనుకుంటున్నారు. ► రైతులతో ప్రభుత్వం చెలగాటమాడాలని చూస్తోంది. సర్కారు ఆటలు సాగనివ్వం. సుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతాం. చెరకు రైతులకు హెక్టారుకు రూ.10వేలు పరిహారం ఇస్తామమని ప్రభుత్వం చెబుతోంది. అది ఏమూలకు సరిపోతుంది? ఎకరాకు రూ.15వేలు ఇవ్వాలి. కొబ్బరి చెట్టుకు రూ.5వేలు ఇవ్వాలి. ► కాఫీ రైతులకు పరిహారం విషయంలో ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించాలి. కాఫీ తోటల్లో కూలిపోయిన సిల్వర్‌వోక్ చెట్లు మరో 15ఏళ్లకుగానీ పెరగవు. ఆ చెట్ల నీడలోనే కాఫీ తోటలు పెరుగుతాయి. అవి లేకపోతే కాఫీ తోటలు పెరగవని ప్రభుత్వానికి తెలీదా? ప్రభుత్వం హెక్టారుకు రూ.15వేలు ఇస్తామని చెబుతోంది. ఇంతకంటే అన్యాయం మరొకటి ఉండదు. గిరిజనులు ఏజెన్సీలో తప్ప బయటకు వెళ్లలేరు. వారికి మరో బతుకుదెరువు లేదు. కాబట్టి నష్టపోయిన కాఫీ తోటలకు హెక్టారుకు రూ.లక్ష పరిహారాన్ని ప్రకటించాలి. అందరికీ భరోసానిస్తూ... విశాఖపట్నంలో శనివారం ఉదయం మొదలైన జగన్ ఐదోరోజు పర్యటన అర్ధరాత్రి వరకూ సాగింది. తుపానువల్ల తమకు కలిగిన నష్టాన్ని రైతులు, గిరిజనులు ఆయనకు చెప్పుకున్నారు. అందరికీ న్యాయం జరిగేవరకూ పోరాడతానని భరోసానిస్తూ జగన్ ముందుకు సాగారు. జగన్ పర్యటన లో ముఖ్యాంశాలు ఇలా... ► గత పైలీన్ తుపానుతో మొత్తం పంట పోయింది. కానీ పరిహారం ఇవ్వలేదు. ఈసారైనా పంట చేతికొస్తుందనుకుంటే మళ్లా తుపాను ముంచెత్తింది. ఇంతవరకు ఎవ్వరూ రాలేదు. మా గతేం కాను. దిక్కుతోచడం లేదని కర్రిరాము, పిల్లా కొండయ్య, అప్పలనాయుడులు జగన్‌తో చెప్పుకుని వాపోయారు. ► గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే తుమ్మపాల ఫ్యాక్టరీని అమ్మేద్దామనుకున్నారు. అప్పట్లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి అడ్డుకున్నారు. మళ్లీ ఇప్పుడు సీఎం ఆ ఫ్యాక్టరీని అమ్మేస్తారనిపిస్తోంది. ఫ్యాక్టరీ మూసేశారు. ఏడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. చెరకు క్రషింగ్ డబ్బులు ఇవ్వడం లేదు.రైతులం రోడ్డున పడతామని ఆందోళన వ్యక్తంచేశారు. తుపాను వచ్చినప్పుడు భారీ వర్షాలకు ఏలేరు, పులికాల్వ పొంగడంతో 3,500 ఎకరాల్లో చెరకు పంట మునిగిపోతున్నా సర్కారు పట్టించుకోవడం లేదని జగన్ దృష్టికి తీసుకువచ్చారు. -
డంపింగ్ యార్డుల ఏర్పాటుకు సత్వర చర్యలు
చిత్తూరు (సెంట్రల్): గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డుల ఏర్పాటుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఎంపీడీవోలను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన జిల్లాలోని ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జన్మభూమి కార్యక్రమంలో పెద్ద ఎత్తున డంపింగ్ యార్డుల ఏర్పాటుకు పూనుకోవాలన్నారు. ఎస్‌ఆర్‌హెచ్‌ఎం కింద ప్రతి గ్రామపంచాయతీకి పారిశుద్ధ్య పనుల నిమిత్తం రూ.50 వేలు విడుదల చేశారని, ఈ నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. మండలాలకు వివిధ అభివృద్ధి పనులు మంజూరవుతు న్నా, అవి పూర్తికావడం లేదన్నారు. ఇకపై పనులు మంజూరైన 90 రోజుల్లో పూర్తికాకపోతే వాటికి సంబంధించిన నిధులను వేరే మండలాలకు ఇస్తారని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌లో జెడ్పీ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ రవిప్రకాష్‌రెడ్డి, డీపీవో ప్రభాకర్, డ్వామా పీడీ గోపిచంద్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. బాధితులకు విరాళం హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం రేణిగుంట మండలానికి చెందిన సర్పంచ్‌లు భాస్కరయాదవ్ (తూకివాకం), మునిశేఖర్‌రెడ్డి (ఆర్.మల్లవరం), శ్రీరాజ్ (గాజులమండ్యం), హరినాథ్‌యాదవ్ (అత్తూరు), ఎం.పురుషోత్తం (విప్పమానుపట్టెడ) కలిసి మొత్తం రూ.57,635 విరాళాన్ని కలెక్టర్‌కు అందజేశారు. అలాగే తిరుపతి మండల సర్పంచ్‌లు లక్ష రూపాయలు ఇచ్చారు. -
చెప్పలేని కష్టం!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా ప్రజలకు చెప్పుకోలేని కష్టం వచ్చిపడింది. ఏటా సంభవిస్తున్న తుపాన్లతో జనం అల్లాడిపోతున్నారు. వరుస తుపాన్ల కారణంగా ఓ వైపు పంట నష్టం, మరోవైపు ఆర్థిక కష్టాలు జనాన్ని చుట్టుముడుతున్నాయి. గతేడాది సంభవిం చిన పై-లీన్ తుపాను జిల్లాను అతలాకుతలం చేసి వెళ్లిపోగా సుమారు రూ.1000 కోట్ల నష్టం వాటిల్లినట్టు అప్పట్లోనే ప్రాథమిక అంచనా వేశారు. ఇప్పటికీ ఆ నష్టాన్ని బాధితులకు అందించలేకపోయారు. రీ సర్వే పేరిట కాలయాపన చేస్తున్నారు. రూ.40 కోట్లు వస్తుందని ఎప్పటినుంచో చెబుతున్నా ఇప్పటికీ అధికారికంగా మంజూరు కాలేదని అధికారులే చెబుతున్నారు. ఇప్పుడు మళ్లీ హుదూద్ తుపాను జిల్లాను ఊడ్చేసింది. ఓ వైపు భీకరగాలులు, మరోవైపు భోరున వర్షం వల్ల జిల్లా చిగురుటాకులా వణికిపోయింది. ఐదు రోజులవుతున్నా జనం సాధారణ పరిస్థితులకు రాలేకపోయారు. నిత్యావసరాలకు ఇబ్బందే తుపాను తాకిడికి జనం ఇక్కట్లు పడుతున్నారు. పాలు, నీళ్లతో పాటు కిరాణసరుకులకూ దూరమయ్యారు. వ్యాపారులూ దోపిడీ చేస్తున్నారు. జనరేటర్, చార్జింగ్, గ్యాస్, పెట్రోల్ ఇలా అన్నింటిలోనూ అందినకాడికి దోచుకుంటున్నారు. రైతుబజార్లలో తక్కువ ధరకే కూరగాయలని ప్రభుత్వం చెబుతున్నా అవి తీసుకుంటే ముక్కుమూసుకోకతప్పదని జనం విమర్శిస్తున్నారు. గురువారం తప్పకుండా విద్యుత్ సరఫరా ఇస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించినా ఆ పరిస్థితి పూర్తిస్థాయిలో కనిపించకపోవడంతో జనం ఉసూరుమంటున్నారు. మునిసిపాలిటీ ఇస్తున్న నీరు బురదమయంగా మారింది. అంధకారంలో జిల్లా వాసులు మగ్గిపోతున్నారు. సమన్వయ లోపం మరో శాపం జిల్లాలోని 11 మండలాల్లో 237 గ్రామాల్లో తుపాను భీకరం సృష్టిం చింది. 19మండలాల్ని వరద ముంచెత్తింది. 237 గ్రామాల్లో ఇంకా వరద నీరు తగ్గలేదని జనం చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా పునరావాస కేంద్రాల్లో పరిస్థితి దారుణ ంగా ఉంది. తామున్నామని భరోసా ఇచ్చే నాథుడే కరువయ్యాడు. ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లోని తీర ప్రాంత వాసులు గుక్కెడు నీళ్లకూ ఇబ్బందిపడుతున్నా నాయకులు, అధికారుల్లో మార్పు కనిపించడం లేదు. ప్రత్యేక బృం దాల పేరిట జిల్లాకు 11 మంది ఐఎఎస్‌లు, జిల్లాకు చెందిన ముగ్గురు మొత్తం 14 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, వైద్య బృందాలు, పోలీసులు ఎవరికి తోచిన విధంగా వారు సాయం చేస్తున్నా తుపాను ధాటికి జనం ఇంకా తేరుకోలేదు. ఈ తరుణంలో నాయకులు, అధికారుల ప్రోటోకాల్ కోసమే జిల్లా అధికారులు తరించిపోవాల్సివస్తోంది. సమీక్షల పేరిట కాలయాపన చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సమన్వయ లోపంతో కొట్టుమిట్టాడుతున్నారు. సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చినా ఆశించిన స్థాయిలో బాధితులకు భరోసా అందలేకపోయూరనే విమర్శలున్నాయి. గతంలో పరిస్థితి.. గతేడాది అక్టోబర్ 12న ఏర్పడిన పై-లీన్ తుపాను జిల్లాలోని సుమారు నాలుగు లక్షల మందిపై ప్రభావం చూపింది. 350 గ్రా మాల్లో 85 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 382 ఇళ్లు పూర్తిగా, 800 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 1200 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 442 గ్రామాలు తుపాను ధాటికి గురయ్యాయి. వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్రతనయ నదుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరింది. తొమ్మిది వేల హెక్టార్లలో పంట పొలాలు, ఎనిమిది వేల హెక్టార్లలో ఉద్యాన వనాలు దెబ్బతిన్నట్టు అంచనా వేశారు. 84 అడుగుల సామర్ధ్యం ఉన్న వంశధారకు 83.4 అడుగుల మేర నీరు చేరగా, 54 వేల క్యూసెక్కుల కెపాసిటీ ఉన్న గొట్టా బ్యారేజీకి 52 వేల క్యూసెక్కుల నీరు చేరింది. నాగావళిలో సాధారణ స్థాయికి మించి వరద నీరు చేరింది. 40 చిన్నా, పెద్ద చెరువులు నీటితో నిండిపోగా, 300 లోతట్టు ప్రాంతాల్ని జిల్లా యం త్రాంగం గుర్తించింది. లక్షన్నర ఎకరాల్లో వరిపంట నీటమునిగింది. తీరం, సరిహద్దుల్లో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సమాచార వ్యవస్థ కుప్పకూలింది. ఇప్పుడూ అదే పరిస్థితి 11 మండలాల్లో 62 పునరావాస కేంద్రాల్లో 1.32 లక్షల మందిని తరలించారు. 42 పశువులు మృతిచెందగా, చెట్టు పడి ఒకరు మృతి చెం దారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆహారాన్ని సుమారు 33,293 మంది బాధితులకు అందించాల్సి వచ్చింది. ఒడిశాతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీకి చెందిన బృందాలు సహాయక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాయి. గజ ఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు, బోట్లు ఇప్పటికీ సేవలందిస్తున్నాయి. వెద్య బృందాలు వైద్యం అందిస్తున్నాయి. లక్షలఎకరాల్లో వరి, ఉద్యానపంటలు దెబ్బతిన్నాయి. వేలా ది ఇళ్లు నేలమట్టమయ్యాయి. మత్స్యకారులు బాగా నష్టపోయారు. -
డిస్కం పరిధిలో రూ.700 కోట్ల నష్టం
విజయనగరం మున్సిపాలిటీ:హుదూద్ తుఫాన్ ధాటికి డిస్కం పరిధిలో రూ.700 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఎం.వి.శేషగిరిబాబు తెలిపారు. 30 ఏళ్లుగా అభివృద్ధి చేసిన విద్యుత్ వ్యవస్థ ఈదురు గాలుల ధాటికి పూర్తిగా నేలమట్టమైందని, దీంతో ఉన్న వనరు ల కన్నా పది శాతం అదనపు నష్టం జరిగి ఉంటుందన్నారు. మరల వ్యవస్థను పూర్తి స్థాయిలో పునరుద్ధరిం చేందుకు సమయం పడుతుందన్నారు. దాసన్నపేట విద్యుత్ భవనంలో విజయనగరం జిల్లాలో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థపై గురువారం సమీక్షించారు. ఈ సం దర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తుఫాన్ ధాటికి విశాఖలో నాశనమైన వ్యవస్థను 60 శాతం మేర పునరుద్ధరించామన్నారు. ఆనందపురం, మధురవాడ, సాగర్‌నగర్, గాజువాక తదితర ప్రాంతాల్లో గురువారం నాటికి సరఫరా పునరుద్ధరించామని చెప్పారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా 40 శాతం పనులు పూర్తి చేశామని, ట్రాన్స్‌కో అధికారులు పెందుర్తి-గరి విడి 220 కేవీ లైన్ సరి చేస్తే 132 కేవీ లైన్ల ద్వారా సరఫరా చేస్తామన్నారు. సింహాచలం నుంచి విజయనగరం వంటితాడిఅగ్రహారం వరకు ఉన్న 132 కేవీ లైన్ వినియోగంలోకి వస్తే విజయనగరం పట్టణంలోని 50 శాతం ప్రాంతాలకు విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకంలో పని చేసే 500 మంది వేతనదారులను పునరుద్ధరణ పనులకు వినియోగిస్తున్నట్లు చెప్పారు. విజయనగరం జిల్లాలో ఎస్పీడిఎల్, ఈపీడీసీఎల్, సీపీడీసీఎల్‌కు చెందిన 1300 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని చెప్పారు. ఒడిశా రాష్ట్రం నుంచి అదనంగా మరో 100 మంది సిబ్బందిని రప్పిస్తున్నామని తెలిపారు. భారీ స్థాయిలో కూలిపోయిన విద్యుత్ స్తంభాలను సరి చేసేందుకు ఒడిశా రాష్ట్రం నుంచి 100 క్రేన్లను తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. సాధ్యమైనంత త్వరలో విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. -
చిన్నారిని చిదిమేసిన ‘హుదూద్’
చీపురుపల్లి:ఒక్కగానొక్క కొడుకు పెరిగి పెద్దవాడై తమను ఆదుకుంటాడనుకున్న తల్లిదండ్రుల ఆశలను హుదూద్ తుపాను చిదిమేసింది. కన్నకొడుకు తుపాను వర్ష బీభత్సానికి మృత్యువాత పడడంతో ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముక్కుపచ్చలారని విద్యా ర్థి గెడ్డలో కొట్టుకుపోయిన విషయం ఆలస్యంగా వెలు గులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. చీపురుపల్లి మండలంలోని పేరిపి గ్రామానికిచెందిన మోపాడ గొల్ల, రామలక్ష్మిల ఒక్కగానొక్క కొడుకు దుర్గాప్రసాద్(10) ఈ నెల 12న ఆవులను మేపేందుకు పొలంలోకి తీసుకెళ్లాడు. అప్పటినుంచి తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు గాలిస్తున్నారు. అయితే బుధవారం సాయంత్రం ఇటకర్లపల్లి సమీపంలో గల పెద్దగెడ్డలో దుర్గాప్రసాద్ శవమై తేలాడు. సమాచారం అందుకున్న బాలుడి తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి పరుగుపరుగున చేరుకుని భోరున విలపించారు. జెడ్పీటీసీ మీసాల వరహాల నాయుడు చిన్నారి మృతదేహాన్ని చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చి శవపంచనామా నిర్వహించి తిరిగి గ్రామానికి పంపిం చారు. ఇదిలా ఉండగా తుపాను కారణంగా నష్టపోయిన పంటలు పరిశీలించేందుకు, బాధితులను పరామర్శించేందుకు చీపురుపల్లి నియోజకవర్గానికి వచ్చిన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఐటీ శాఖా మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎక్సైజ్‌శాఖా మంత్రి కొల్లు రవీంద్ర, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళిని చిన్నారి కుటుంబాన్ని పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రజలతో కలసి రోడ్లపైకొస్తాం
తుపాను బాధితులందరికీ న్యాయం జరిగేవరకు పోరాడతాం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తక్షణ సహాయం కింద ప్రతి కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వాలి తుపాను వచ్చి నాలుగు రోజులైనా ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు సమీక్షలతో కాలయాపన తప్ప సహాయ చర్యలు చేపట్టనే లేదు చిత్రాన్నం పెట్టి పేదలను గాలికి వదిలేశారు.. ఈ ప్రభుత్వానికి అసలు మానవత్వం ఉందా? విశాఖపట్నంలో తుపాను బాధితులకు జగన్ పరామర్శ మత్య్యకారులతో మమేకం.. కొండలు ఎక్కిమరీ బాధితులకు భరోసా విశాఖపట్నం : తుపాను బాధితులకు ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని, లేదంటే ప్రజలతో కలిసి రోడ్ల పైకొచ్చి పోరాటం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. ‘‘తుపానుతో ఛిన్నాభిన్నమైన మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలి. లక్షలాదిమంది మత్స్యకారులకు బతుకుదెరువైన ఈ వృత్తిని కాపాడాలి. తక్షణ సహాయం కింద ప్రతి కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వాలి. సోనా బోటుకు రూ.25 లక్షలు, ఫైబర్ బోట్‌కు రూ. 2.50 లక్షలు పరిహారం ఇవ్వాలి. దెబ్బతిన్న బోట్ల మరమ్మతులకు రూ.50 వేలు, వలలకు రూ.25 వేలు ఇవ్వాలి’’ అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హుదూద్ తుపానుతో అల్లకల్లోలమైన విశాఖపట్నంలో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బుధవారం పర్యటించారు. తుపానుతో తీవ్రంగా నష్టపోయిన ఫిషింగ్ హార్బర్, జాలరిపేట, చినగదిలి, పెదగదిలిలో పర్యటించి, బాధితులను పరామర్శించారు. సర్వం కోల్పోయిన మత్స్యకారులు, పేదల బాధలను చూసి చలించిపోయారు. ప్రభుత్వ సహాయ చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. సహాయ, పునరావాస చర్యల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని బాధితులు వివరించారు. జగన్‌ను పట్టుకొని కన్నీటిపర్యంతమయ్యారు. దాంతో జగన్ తీవ్ర ఆవేదన చెందారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ధ్వజమెత్తారు. ‘తుపాను వచ్చి నాలుగు రోజులైంది. కానీ క్షేత్రస్థాయిలో ఏం జరిగిందన్నది ప్రభుత్వం ఇంతవరకు తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు. సమీక్షలతో కాలయాపన తప్ప సహాయ చర్యలు చేపట్టనే లేదు. అసలు ఎంత నష్టం వచ్చింది? ఎన్ని బోట్లు మునిగిపోయాయి? ఎన్ని దెబ్బతిన్నాయి? ఎన్ని ఇళ్లు కూలిపోయాయి? ఎంతమంది రోడ్డున పడ్డారు అని తెలుసుకోవడానికి ప్రభుత్వం తరపున ఒక్కరు కూడా రాలేదు. ఏదో చిత్రాన్నం పెట్టి పేదలను గాలికి వదిలేశారు. ఈ ప్రభుత్వానికి అసలు మానవత్వం ఉందా’’ అని జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ప్రశ్నించారు. ‘‘కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ ఆ బాధ్యతను ప్రభుత్వం నెరవేర్చడంలేదు. బాధ్యతల నుంచి తప్పించుకుంటోంది. ప్రభుత్వం పనిచేయకపోతే నిలదీసే హక్కు ప్రజలకు ఉంది. ప్రజలతోపాటు ప్రభుత్వాన్ని మేమూ నిలదీస్తాం. అవసరమైతే ప్రజలతో కలసి రోడ్లపైకి వస్తాం. ధర్నాలు చేస్తాం. ప్రతి బాధితుడికీ న్యాయం జరిగేవరకు గట్టిగా పోరాడతాం’’ అని చెప్పారు. కాలి నడకన.. కొండలు ఎక్కి.. జగన్ బాధిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. మత్స్యకార గ్రామాల్లో కాలినడకన బాధితుల వద్దకు వెళ్లారు. పెద జాలరిపేటలో ఇసుకలో నడిచి వెళ్లారు. చిన గదిలి, పెద గదిలిలో కొండలెక్కి మరీ బాధితుల చెంతకు వెళ్లారు. హుదూద్ తుపానుకు దెబ్బతిన్న బోట్లు, పడవలు, వలలు, ఇళ్లు, చెల్లాచెదురైన సామాన్యుల జీవితాన్ని దగ్గరకు వెళ్లి మరీ చూశారు. దాదాపు 40 వేల మంది మత్స్యకారులకు జీవనాధారమైన విశాఖ ఫిషింగ్ హార్బర్ మొత్తం కలియదిరిగారు. అక్కడ ఎండుచేపలు విక్రయించే అప్పాయమ్మ, సత్యవతి, కుశలమ్మలను పలకరించి వారి బాధను తెలుసుకున్నారు. ఫిషింగ్ హార్బర్ జంక్షన్ వద్ద భారీగా చేరిన మత్స్యకారులతో మాట్లాడారు. అక్కడి నుంచి నేరుగా పెద్ద జాలరిపేటకు చేరుకున్నారు. జాలరిపేట ముఖద్వారం వద్దకు భారీ సంఖ్యలో వచ్చిన మహిళల వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. కూలిన ప్రతి ఇంటిని చూశారు. ప్రతి బాధిత కుటుంబాన్ని పలకరించి నష్టం వివరాలు తెలుసుకున్నారు. జగన్ అక్కడి నుంచి సముద్రతీరం వరకు దాదాపు 2 కిలోమీటర్లు నడిచి వెళ్లారు. అక్కడ కుప్పకూలిన ఇళ్లు, పాడైపోయిన బోట్లు, వలలు, మోటారు ఇంజన్లు వరుసగా పడి ఉండటం ఆయన మనసును కలచివేసింది. ఇసుకలో నడుచుకుంటూ వెళ్లి దాదాపు 3 వేల మంది బాధితులతో మాట్లాడారు. వారి బాధలను తెలుసుకున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు జగన్ జాలరిపేటలోనే గడిపి బాధితులకు సాంత్వన చేకూర్చారు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సాయంత్రం ఆయన పెదగదిలి, చినగదిలిలోని కొండ ప్రాంతాల్లో పర్యటించారు. కాలినడకన కొండలను ఎక్కి మరీ బాధితుల చెంతకు వెళ్లారు. ఏటవాలు ప్రాంతాల్లో, కొండ చరియల్లో ఉన్న ఇళ్లకు కూడా వెళ్లి తుపాను మిగిల్చిన నష్టాన్ని కళ్లారా చూశారు. తుపాను వచ్చి నాలుగు రోజులైనా తమ వద్దకు ఏ ఒక్క ప్రజాప్రతినిధిగానీ అధికారిగానీ రాలేదని అక్కడివారు చెప్పారు. వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని తెలుసుకుని జగన్ ఆవేదనకు గురయ్యారు. వారి తరపున పోరాడతానని చెప్పారు. బధిరులైన కర్రి భవాని, కందెల లక్ష్మిలను పార్టీ తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి వెంట పార్టీ ప్రధాన కార్యదర్శులు ధర్మాన ప్రసాదరావు, గొల్ల బాబూరావు, తలశిల రఘురాం, విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, పార్టీ నేతలు కోలా గురువులు, వంశీకృష్ణ, చొక్కాకుల వెంకటరావు, కర్రి సీతారాం, ఉమాశంకర్ గణేష్, తైనాల విజయ్‌కుమార్, మళ్ల విజ య్‌ప్రసాద్, పిరియా సాయిరాజ్, సత్తి రామకృష్ణారెడ్డి, కొయ్య ప్రసాదరెడ్డి ఉన్నారు. ఇప్పుడు మాకేం మిగల్లేదు ‘ఈ సోనా బోట్లే మా బోటోల్లకి బతుకుదెరువు. ఇలాంటివి 58 బోట్లు మునిగిపోనాయి. మరో 400 బోట్లు దెబ్బతిన్నాయి. మొత్తం నష్టపోనాం. ఒక్కో బోటు పాతిక లక్షలు చేస్తాది. ఒక్కో బోటు మీద పది కుటుంబాలు ఆధారపడ్డాయి. ఇప్పుడు మాకేం మిగల్లేదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు’ అని మత్స్యకారుడు, సోనా బోట్ యజమానుల అసోషియేషన్ అధ్యక్షుడు పీసు అప్పారావు వై.ఎస్.జగన్మోహన్రెడ్డితో తన గోడు వెళ్లబోసుకున్నారు. ‘‘మీ కు అండగా నేనుంటాను. మీ తరపున పోరాడతాను. న్యాయం జరిగే వరకు తోడుంటా ను’ అని జగన్ వారికి భరోసా ఇచ్చారు. మమ్మల్ని గాలికొదిలేశారు ‘ చూడు బాబు నా ఇల్లు ఎలా కూలిపోనాదో. మాయదారి గాలివానతో నాలుగు రోజులుగా బయటే పడున్నా. ఎవ్వరూ రాలేదు. ఓట్లు అడకగానికి ఆరోజు అంతా వచ్చారు. ఈరోజు అధికారం వచ్చాక మమ్మల్ని గాలికొదిలేశారు’ అని జాలరిపేటలోని తెడ్డమ్మ అనే మత్స్యకార మహిళ జగన్‌తో తన బాధను చెప్పుకుని గొల్లుమం ది. ఆమె ఆవేదన విన్న జగన్.. ‘అమ్మా! అధికారంలో ఉన్నవాళ్లు వారి బాధ్యత నెరవేర్చడంలేదు. వాళ్లను అడిగే హక్కు మీకుంది. మీతో కలిసి నేనూ ప్రభుత్వాన్ని నిలదీస్తాను. మీకు కొత్త ఇళ్లు వచ్చేవరకు పోరాడతాను’ అంటూ ధైర్యం చెప్పారు. -
విశాఖలో సీఎం పర్యటన
విశాఖ రూరల్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖ నగరంలో సుడిగాలి పర్యటన చేసి బాధితులను పరామర్శించారు. హుదూద్ తుపాను కారణంగా నగరం అతలాకుతలమైన నేపథ్యంలో సోమవారం విశాఖ వచ్చిన సీఎం నగరంలో వివిధ ప్రాంతాలను సందర్శించి బాధితులను భరోసా ఇచ్చారు. మధ్యాహ్నం అధికారులతో సమీక్ష అనంతరం ఫిషింగ్ హార్బర్‌కు వెళ్లారు. ముందు అక్కడ ఉన్న పెట్రల్ బంక్ వద్ద ఆగి పెట్రోల్ సరఫరాపై ఆరా తీశారు. అక్కడ నుంచి హార్బర్లోకి వెళ్లి మత్స్యకారులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొంత మంది మహిళలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు సాయం చేయడం లేదంటూ నిలదీశారు. అధికారులు వారికి సర్ది చెప్పి అక్కడ నుంచి బయల్దేరారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు విజ్ఞప్తి మేరకు అప్పుఘర్ వద్ద ఉన్న వాసవానిపాలెం వెళ్లి అక్కడ దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. అక్కడ నుంచి ఎంవీపీ కాలనీ డబుల్ రోడ్డు వెళుతూ ఇసుకతోట, స్వర్ణభారతి పెట్రోల్ బంక్ ల వద్ద బారులు తీరిన ప్రజలను పరామర్శిస్తూ కృత్రిమ కొరతను సృష్టించకుండా వినియోగదరారులకు కావాలసినంత పెట్రోల్, డీజిల్ సరఫరా చేయాలని బంకు యాజమాన్యాన్ని ఆదేశించారు. అక్కడ నుంచి గాజువాక, అనంతరం సింథియా వెళ్లారు. సింథియాలో భారీగా చెట్లు పడి ఉండడాన్ని గమనించి వెంటనే వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. డాక్‌యార్డు వద్ద ప్రధాన రహదరిపై పడిపోయిన చెట్లను పూర్తి స్థాయిలో తొలగించకపోవడంపై గాజువాక సీఐపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వెంటనే తొలగించాలని చెప్పారు. రైల్వే స్టేషన్ రోడ్డుకు వచ్చి అక్కడ చెట్లు తొలగిస్తున్న సిబ్బందితో ఇంకా సమయం పడుతుందని ఆరా తీశారు. తిరిగి జిల్లా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. -
హుదూద్ అలజడి
పునరావాసాలకు మత్స్యకార్ల ససేమిరా ప్రత్యేక బలగాలు మోహరింపు యలమంచిలి : తీర ప్రాంత గ్రామాల్లో హుదూద్ కల్లోలం రేపుతోంది. ఈ పెను తుపాను పెద్ద ఎత్తున విరుచుకుపడుతుందన్న హెచ్చరికలతో అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో తీరం చిగురుటాకులా వణికిపోతోంది. మరోవైపు తుపానును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం ముందస్తు చర్యలకుపక్రమించింది. తీరానికి అనుకుని ఉన్న కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. తమకు జీవనాధారమైన బోట్లు, వలలు వదిలి రావడానికి మత్స్యకారులు ససేమిరా అంటున్నారు. దీంతో వారికి నచ్చజెప్పేందుకు పోలీసులు, అధికారులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. పూడిమడక పంచాయతీలో కడపాలెం, జాలారిపాలెం, కొండపాలెం, పూడిమడక ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తీరం దాటే సమయంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు సముద్రతీరంలో ఉండొద్దన్న హెచ్చరికలు అధికారులు చేస్తున్నారు. పూడిమడక మేజర్ పంచాయతీలో పూరిగుడిసెల్లో ఉంటున్న 3,500 మందిని జెడ్పీ హైస్కూలకు తరలిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం వారికి భోజనం పెట్టారు. నర్సీపట్నం ఏఎస్పీ బి.సత్యఏసుబాబు, యలమంచిలి సీఐ హెచ్.మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో 50 మంది సభ్యుల జాతీయ విపత్తు నివారణ సంస్థ బృందం, 30 మంది సభ్యుల రాష్ట్ర విపత్తు నివారణ సంస్థ బృందాలతో పాటు ప్రత్యేక పోలీసు బలగాలు, నలుగురు సీఐలు, ముగ్గురు ఎస్ఐలు, సర్కిల్ పరిధిలో పోలీసు సిబ్బంది పునరావాస ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఉపాధి హామీ పథకం పీడీ శ్రీరాములనాయుడు, ఏపీడీ గోవిందరావు, అచ్యుతాపురం తహశీల్దార్ కె.వి.వి.శివ, ప్రభుత్వ శాఖల సిబ్బంది పూడిమడక చేరుకున్నారు. తుపానును ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని ముందస్తు చర్యలు తీసుకుని నష్టతీవ్రతను తగ్గించగలమన్న ఆశాభావాన్ని ఉపాధి హామీ పీడీ శ్రీరాములనాయుడు విలేకరులకు చెప్పారు. అచ్యుతాపురంలో.. అచ్యుతాపురం మండలంలోనూ అలలు ఐదు అడుగుల ఎత్తుకు ఎగసి పడుతున్నాయి. అధికారుల హెచ్చరికలతో మత్స్యకారులు తమ పడవల్ని, వలలను భద్రపర్చుకున్నారు. పూడిమడకలో జట్టీ లేకపోవడంతో చెట్లకు తాళ్లతో కట్టి పడవలను తీరం వద్ద ఉంచారు. ఇంజన్లు, వలలను ఇళ్లకు తరలించారు. ఏఎస్పీ సత్యఏసుబాబు పరిస్థితిని సమీక్షించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించారు. తీరం వెంబడి 100 ఇళ్లను ఖాళీచేయించారు. అత్యవసర సేవలకోసం ప్రత్యేక బలగాలు ప్రశాంతి పాలిటెక్నిక్ కాలేజీలో బస చేశారు. 15 బస్సులను తీరం వద్ద ఉంచారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు తదితరులు పరిస్థితిని సమీక్షించారు. పాయకరావుపేట మండలంలో.. పాయకరావుపేట : హూదూద్ తుపాను ప్రభావంతో పాయకరావుపేట మండలంలో సముద్రంలో అలల తాకిడి, ఈదురుగాలులు ఎక్కువయ్యాయి. కోఆర్డినేటింగ్ ఆఫీసర్ పి.చిన్నయ్య, ఎంపీడీవో సంతోసం, తహశీల్దార్ సుమతీబాయి, రెవెన్యూ, పోలీస్, మెరైన్ శాఖల అధికారులు తీర ప్రాంతగ్రామాల్లో పరిస్థితి సమీక్షించారు. పెంటకోట, వెంకటనగరం. గజపతినగరం, పాల్మన్‌పేట, రాజయ్యపేట, గజపతినగరం, రాజవరం కొర్లయ్యపేట, కుమారపురం, తీర ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. మత్స్యకారులు బోట్లను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. పెంటకోట, వెంకటనగరం ప్రాంతం నుంచి అద్దరిపేట వరకూ తీర ప్రాంతంలో ఒడ్డు మీటరు ఎత్తున కోతకు గురయింది. గజపతినగరం పునరావాస కేంద్రాన్ని ఐజీ అతుల్‌సింగ్, ఎస్పీ కె.ప్రవీణ్ పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత గజపతినగరం, వెంకటనగరం, పాల్మన్‌పేట తీరప్రాంత గ్రామలను సందర్శించారు. రేవుపోలవరంలో... ఎస్.రాయవరం : హుదూద్ తీవ్రతతో రేవుపోలవరం తీరంలో శనివారం సుమారు 150 మీటర్ల ముందుకు వచ్చింది. సాధారణ స్థాయి కంటే సముద్రం ముందుకురావడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. తుఫాన్ తీరాన్ని తాకకముందే అలల తీవ్రత ఇలా ఉంటే తాకాక మరెంత ప్రమాదస్థాయిలో ఉంటుందోనని భయపడుతున్నారు. పోలీస్ ప్రత్యేక బలగాలు, ఎస్ఐ కె.శ్రీనివాసరావు తీరం పరిసరాలను సమీక్షిస్తూ ఉన్నతాధికారులకు సమాచారాన్ని చేరవేశారు. అలాగే బంగారమ్మపాలెం లో గ్రామస్తులకు ఉదయం అల్పాహారం, భోజన సదుపాయం కల్పించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు, ఎంపీపీ యేజర్ల పెరుమాళ్లరాజు తుఫాన్ సహకచర్యలు సమీక్షించారు. తీరంలో హదూద్ వణుకు.. రాంబిల్లి : హుదూద్ పెనుతుపాన్ తరుముకొస్తుండటంతో తీర ప్రాంత ప్రజలు భయంతో వణికిపోతున్నారు. సముద్రం సుమారు 60 అడుగులు ముందుకు చొచ్చుకొని రావడంతో రాంబిల్లి, కొత్తపట్నం తీరం కోతకు గురైంది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. జిల్లాలో అధికంగా తీర ప్రాంత గ్రామాలు రాంబిల్లి మండలంలో ఉన్నాయి. వీటిలో కొత్తపట్నం, వాడనర్సాపురం, లోవపాలెం, రాంబిల్లి శివారు వాడపాలెం, గజిరెడ్డిపాలెం, లోవపాలెం, వెంకయ్యపాలెం, సీతపాలెం తీర ప్రాంతలున్నాయి. ఈ గ్రామాల్లో ఎవరూ ఉండరాదని అధికారులు హెచ్చరించారు. శనివారం ఈ గ్రామాలకు చెందిన సుమారు 900 మందిని రాంబిల్లి ఉన్నత పాఠశాల, క స్తూర్బా పాఠశాల, వెంక య్యపాలెం తుపాన్ షెల్టర్‌లోని పునరావాస కేంద్రాలకు తరలించిన ట్టు ప్రత్యేకాధికారి పి. కోటేశ్వరరావు తెలిపారు. మండలంలో 40 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, ఆర్డీవో వసంతరాయుడు కొత్తపట్నం తీర ప్రాంతాన్ని పరిశీలించారు. మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. గంగపుత్రుల బిక్కుబిక్కు నక్కపల్లి : హదూద్ తుపాను హెచ్చరికలతో గంగపుత్రులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని తీర గ్రామాల్లో పలుచోట్ల సముద్రం 100 మీటర్లకు పైగా ముందుకు చొచ్చుకువచ్చింది. అలలు 20-30 అడుగుల వరకు ఎగసిపడుతున్నాయి. గ్రామాలకు సమీపం వరకూ తెప్పలను తెచ్చుకోవడానికి తిప్పలు పడుతున్నారు. నియోజక వర్గంలో దాదాపు 14 మత్య్సకార గ్రామాల్లో 20వేల మంది మత్య్సకారులు సముద్రతీరం వెంబడి ఉన్న గ్రామాల్లో నివసిస్తున్నట్టు గుర్తించారు. వీరిలో ఐదు వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించాలని నిర్ణయించారు. 14 చోట్ల ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసారు. నక్కపల్లి మండలంలో 2017 మందికి గాను వెయ్యి మందిని తరలించి తర లించి వారికి ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్నారు. మండలప్రత్యేకాధికారి శివప్రసాద్ పర్యవేక్షణలోతహశీల్దార్, ఎంపిడీవో, సీఐ గఫూర్, ఇతర అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నక్కపల్లి తహశీల్దార్ కార్యాలయంలోకంట్రోలురూం ఏర్పాటు చేసారు. మన్యంలోనూ హుదూద్ భయం! పాడేరు : హుదూద్ తుపాను టెన్షన్ మన్యంలోనూ నెలకొంది. శనివారం వేకువజాము నుంచే వాతావరణం ఒక్కసారిగా మారింది. తేలికపాటి జల్లులతోపాటు ఈదురుగాలులు కూడా వీయడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. సముద్ర మట్టానికి సుమారు 3 వేల అడుగుల ఎత్తులో ఉన్న పాడేరు ఘాట్, వనుగుపల్లి, డల్లాపల్లి, మోదాపల్లి ప్రాంతాల్లో ఈదురుగాలులు ఉధృతంగా వీచాయి. దీంతో గిరిజనులు చలిగాలులతో ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ఖరీఫ్ వరిపంట గింజదశలో ఉండగా తుపానుతో తీవ్రంగా పంటను నష్టపోతామనే భయం గిరి రైతులను వెంటాడుతోంది. అలాగే రాజ్మా, ఇతర కాయగూరల సాగుదారులు కూడా తుపాను సమాచారంతో బెంగగా ఉన్నారు. రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని సబ్‌కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. అన్ని మండల తహశీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. తుపానుతో ఎలాంటి నష్టం వాటిల్లినా సకాలంలో కంట్రోల్ రూంకు సమాచారం ఇవ్వాలని మన్యం వాసులను కోరారు. -
రావద్దు.. హుదూద్
5 మండలాలపై తుపాను ప్రభావం ! * ఆ మండలాల్లో ‘జన్మభూమి-మాఊరు’ రద్దు * పాఠశాలలకు మూడు రోజులు సెలవు * 29 చోట్ల సహాయ, పునరావాస కేంద్రాలు * ఈపీడీసీఎల్ పరీక్షలు వాయిదా సాక్షి, ఏలూరు : పెను ముప్పును వెంటబెట్టుకుని విశాఖపట్నం వైపు దూసుకొస్తున్న హుదూద్ తుపాను జిల్లా ప్రజలనూ కలవరపెడుతోంది. జిల్లాలోని ఐదు మండలాలపై తుపాను తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అధికార యంత్రాంగం భావిస్తోంది. ఈ దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు శనివారం నుంచి 13వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవులు ఇస్తున్నట్టు జిల్లా కలెక్టర్ కె.భాస్కర్ ప్రకటించారు. హుదూద్ తుపాను తాజా పరిస్థితిపై శుక్రవారం రాత్రి వివరాలు సేకరించిన కలెక్టర్ అధికారులతో చర్చిం చారు. నష్ట నివారణకు తీసుకుంటున్న ముందస్తు చర్యలపై సమీక్షించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమాలు నిర్వహించడం కష్టసాధ్యమని భావించిన ఆయన నరసాపురం, మొగల్తూరు, యలమంచిలి, భీమవరం, కాళ్ల మండలాల్లో శని వారం గ్రామ సభలను రద్దు చేశారు. తుపాను ఈ నెల 12న ఉదయం విశాఖపట్నం వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉన్నందున.. దాని ప్రభావంతో జిల్లాలోనూ భారీ వర్షాలతోపాటు పెనుగాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ దృష్ట్యా పిల్లలను బయటకు వెళ్లనివ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని కలెక్టర్ సూచించారు. హుదూద్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలున్న ఐదు మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఇప్పటికే ఆయూ మండలాలకు వెళ్లిన అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. 31 గ్రామాలకు తుపాను తాకిడి ఉండొచ్చు జిల్లాలో 31 గ్రామాలు తుపాను తాకిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ భాస్కర్ తెలిపారు. ఆయూ గ్రామాల్లో ముందుజాగ్రత్త చర్యగా 29 సహాయ, పునరావాస కేంద్రాలను గుర్తించామన్నారు. మొగల్తూరు మండలంలో 9, యలమంచిలి మండలంలో 8, కాళ్ల మండలంలో 6, నరసాపురం మండలంలో 5, భీమవరంలో ఒకటి చొప్పున పునరావాస కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. ఎటువంటి పరిస్థితులు తలెత్తినా యుద్ధప్రాతిపదికన లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. తుపాను షెల్టర్లను తనిఖీ చేసి, అవసరమైన సామగ్రిని సిద్ధం చేశామన్నారు. అన్ని ప్రాంతాల్లో సామూహిక వంట శాలలు (కమ్యూనిటీ కిచెన్స్) ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నామని, వంటలకు అవసరమైన అన్ని సరుకులను సిద్ధంగా ఉంచామని వివరించారు. పెనుగాలుల వల్ల చెట్లు నేలకొరిగి రాకపోకలకు అంతరాయం కలిగితే, యుద్ధప్రాతిపదికన వాటిని తొలగించడానికి 18 జేసీబీలను, ఆధునిక రంపాలను సిద్ధం చేశారు. విశాఖ పట్నానికి 478 కిలోమీటర్ల దూరంలో హుదూద్ తుపాను కేంద్రీకృతమై ఉందని, ఇది సోమవారం ఉదయం తీరాన్ని దాటే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిందని కలెక్టర్ తెలిపారు. ఈ దృష్ట్యా పూరి గుడిసెల్లో ఉంటున్నవారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు. డీజిల్, పెట్రోల్ నిల్వ పెట్టండి ప్రతి పెట్రోల్ బంకులో 2వేల లీటర్ల డీజిల్, 500 లీటర్ల పెట్రోల్ నిల్వలను అదనంగా ఉంచాల్సిందిగా జిల్లాలోని 350 బంకులకు జిల్లా పౌర సరఫరాల అధికారి డి.శివశంకర్‌రెడ్డి ఆదేశాలి చ్చారు. 2 లక్షల కిరోసిన్‌ను అందుబాటులో ఉంచారు. దీనిని తుపాను ప్రభావిత ప్రాంతాలకు శనివారం సాయంత్రం తరలించనున్నారు. మత్స్యకారులూ.. వేటకెళ్లొద్దు నరసాపురం రూరల్ : తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన హుదూద్ తుపాను పెను తుపానుగా మారిందని, తుపాను తీరం దాటే సమయంలో గంటకు 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఆర్డీవో డి.పుష్పమణి చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మత్స్యకారులెవరూ సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని కోరారు. శుక్రవారం బియ్యపుతిప్ప, వేములదీవి, పెదమైనవానిలంక గ్రామాల్లో ఆమె పర్యటించారు. సముద్ర తీరాన్ని, అలల పరిస్థితిని పరిశీలించారు. వేటకు వెళ్లిన మత్స్యకారులెవరైనా ఉంటే వారికి సమాచారం అందించి తక్షణమే వెనుకకు రప్పించాలని మత్స్యకార పెద్దలకు సూచించారు. తుపాను తీరం దాటే సమయంలో సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసి పడతాయని, అందువల్ల బీచ్‌లకు పర్యాటకులు రాకుండా నిరోధించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. మరోపక్క బీచ్‌లలో స్నానాలు చేయడం ప్రమాదకరమంటూ మండల పరిషత్ అధికారులు తీర ప్రాంత గ్రామాల్లో మైక్ ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. ఆర్డీవో వెంట తహసిల్దార్ శ్రీపాద హరనాథ్, ఆర్ఐ ఐతం సత్యనారాయణ, వీఆర్వో శ్రీను, సర్పంచ్ నక్కా బాబూరావు, సీతామహలక్ష్మి , కార్యదర్శి పాలా శ్రీను ఉన్నారు.