రావద్దు.. హుదూద్ | set up 12 rehabilitation centers | Sakshi
Sakshi News home page

రావద్దు.. హుదూద్

Published Sat, Oct 11 2014 4:11 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 PM

రావద్దు.. హుదూద్

రావద్దు.. హుదూద్

5 మండలాలపై తుపాను ప్రభావం !
* ఆ మండలాల్లో ‘జన్మభూమి-మాఊరు’ రద్దు
* పాఠశాలలకు మూడు రోజులు సెలవు
* 29 చోట్ల సహాయ, పునరావాస కేంద్రాలు
* ఈపీడీసీఎల్ పరీక్షలు వాయిదా
సాక్షి, ఏలూరు : పెను ముప్పును వెంటబెట్టుకుని విశాఖపట్నం వైపు దూసుకొస్తున్న హుదూద్ తుపాను జిల్లా ప్రజలనూ కలవరపెడుతోంది. జిల్లాలోని ఐదు మండలాలపై తుపాను తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అధికార యంత్రాంగం భావిస్తోంది. ఈ దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు శనివారం నుంచి 13వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవులు ఇస్తున్నట్టు జిల్లా కలెక్టర్ కె.భాస్కర్ ప్రకటించారు.

హుదూద్ తుపాను తాజా పరిస్థితిపై శుక్రవారం రాత్రి వివరాలు సేకరించిన కలెక్టర్ అధికారులతో చర్చిం చారు. నష్ట నివారణకు తీసుకుంటున్న ముందస్తు చర్యలపై సమీక్షించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమాలు నిర్వహించడం కష్టసాధ్యమని భావించిన ఆయన నరసాపురం, మొగల్తూరు, యలమంచిలి, భీమవరం, కాళ్ల మండలాల్లో శని వారం గ్రామ సభలను రద్దు చేశారు. తుపాను ఈ నెల 12న ఉదయం విశాఖపట్నం వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉన్నందున.. దాని ప్రభావంతో జిల్లాలోనూ భారీ వర్షాలతోపాటు పెనుగాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

ఈ దృష్ట్యా పిల్లలను బయటకు వెళ్లనివ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని కలెక్టర్ సూచించారు. హుదూద్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలున్న ఐదు మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఇప్పటికే ఆయూ మండలాలకు వెళ్లిన అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు.
 
31 గ్రామాలకు తుపాను తాకిడి ఉండొచ్చు
జిల్లాలో 31 గ్రామాలు తుపాను తాకిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ భాస్కర్ తెలిపారు. ఆయూ గ్రామాల్లో ముందుజాగ్రత్త చర్యగా 29 సహాయ, పునరావాస కేంద్రాలను గుర్తించామన్నారు. మొగల్తూరు మండలంలో 9, యలమంచిలి మండలంలో 8, కాళ్ల మండలంలో 6, నరసాపురం మండలంలో 5, భీమవరంలో ఒకటి చొప్పున పునరావాస కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. ఎటువంటి పరిస్థితులు తలెత్తినా యుద్ధప్రాతిపదికన లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు.

తుపాను షెల్టర్లను తనిఖీ చేసి, అవసరమైన సామగ్రిని సిద్ధం చేశామన్నారు. అన్ని ప్రాంతాల్లో సామూహిక వంట శాలలు (కమ్యూనిటీ కిచెన్స్) ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నామని, వంటలకు అవసరమైన అన్ని సరుకులను సిద్ధంగా ఉంచామని వివరించారు. పెనుగాలుల వల్ల చెట్లు నేలకొరిగి రాకపోకలకు అంతరాయం కలిగితే, యుద్ధప్రాతిపదికన వాటిని తొలగించడానికి 18 జేసీబీలను, ఆధునిక రంపాలను సిద్ధం చేశారు. విశాఖ పట్నానికి 478 కిలోమీటర్ల దూరంలో హుదూద్ తుపాను కేంద్రీకృతమై ఉందని, ఇది సోమవారం ఉదయం తీరాన్ని దాటే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిందని కలెక్టర్ తెలిపారు. ఈ దృష్ట్యా పూరి గుడిసెల్లో ఉంటున్నవారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
 
డీజిల్, పెట్రోల్ నిల్వ పెట్టండి
ప్రతి పెట్రోల్ బంకులో 2వేల లీటర్ల డీజిల్, 500 లీటర్ల పెట్రోల్ నిల్వలను అదనంగా ఉంచాల్సిందిగా జిల్లాలోని 350 బంకులకు జిల్లా పౌర సరఫరాల అధికారి డి.శివశంకర్‌రెడ్డి ఆదేశాలి చ్చారు. 2 లక్షల కిరోసిన్‌ను అందుబాటులో ఉంచారు. దీనిని తుపాను ప్రభావిత ప్రాంతాలకు శనివారం సాయంత్రం తరలించనున్నారు.
 
మత్స్యకారులూ.. వేటకెళ్లొద్దు
నరసాపురం రూరల్ : తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన హుదూద్ తుపాను పెను తుపానుగా మారిందని, తుపాను తీరం దాటే సమయంలో గంటకు 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఆర్డీవో డి.పుష్పమణి చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మత్స్యకారులెవరూ సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని కోరారు. శుక్రవారం బియ్యపుతిప్ప, వేములదీవి, పెదమైనవానిలంక గ్రామాల్లో ఆమె పర్యటించారు. సముద్ర తీరాన్ని, అలల పరిస్థితిని పరిశీలించారు. వేటకు వెళ్లిన మత్స్యకారులెవరైనా ఉంటే వారికి సమాచారం అందించి తక్షణమే వెనుకకు రప్పించాలని మత్స్యకార పెద్దలకు సూచించారు.

తుపాను తీరం దాటే సమయంలో సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసి పడతాయని, అందువల్ల బీచ్‌లకు పర్యాటకులు రాకుండా నిరోధించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. మరోపక్క బీచ్‌లలో స్నానాలు చేయడం ప్రమాదకరమంటూ మండల పరిషత్ అధికారులు తీర ప్రాంత గ్రామాల్లో మైక్ ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. ఆర్డీవో వెంట తహసిల్దార్ శ్రీపాద హరనాథ్, ఆర్‌ఐ ఐతం సత్యనారాయణ, వీఆర్‌వో శ్రీను, సర్పంచ్ నక్కా బాబూరావు, సీతామహలక్ష్మి , కార్యదర్శి పాలా శ్రీను ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement