యూరియా ధరలకు రెక్కలు
- అసలు ధర రూ.283.. రూ.400కు విక్రయాలు
- కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు
- జిల్లాలో రైతులపై రూ.4 కోట్ల భారం
- చోద్యం చూస్తున్న అధికారులు
మచిలీపట్నం/ చల్లపల్లి : హుదూద్ తుపాను దెబ్బకు యూరియా ధరలకు రెక్కలొచ్చాయి. యూరియాకు డిమాండ్ పెరగడంతో వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఎరువుల దుకాణాల్లో బహిరంగంగానే అధిక ధరలు వసూలు చేస్తున్నారు. దీంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై వ్యవసాయాధికారులు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
బస్తాకు రూ.100 అదనం
ఈ ఏడాది జిల్లాలో 6.25 లక్షల ఎకరాల్లో వరి, 1.30 లక్షల ఎకరాల్లో పత్తి, 40 వేల ఎకరాల్లో చెరుకు, 20 వేల ఎకరాల్లో మొక్కజొన్న, ఆరువేల ఎకరాల్లో పసుపు సాగును రైతులు చేపట్టారు. ఈ పంటలకు ఎరువుగా వాడేందుకు 1.20 లక్షల టన్నుల యూరియా అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. అధికారుల లెక్కల ప్రకారం వరికి ఎకరాకు 75 కిలోలు మాత్రమే వాడాల్సి ఉండగా, రైతులు 150 కిలోల వరకు వాడుతున్నారు.
ఈ లెక్కన జిల్లాలో వరి పంటకు 1.85 లక్షల టన్నుల యూరియా అవసరం అవుతుంది. ప్రస్తుతం మూడో కోటా, చిగురు కోటా వేసే పనిలో ఉన్నారు. ఈ రెండుసార్లు యూరియా చల్లేందుకు జిల్లా వ్యాప్తంగా 65 వేల టన్నుల యూరియా కావాల్సి ఉండగా ప్రస్తుతం కొరత ఏర్పడటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మార్పీ ధర ప్రకారం యూరియా రూ.283కు, వేపనూనె కలిపిన యూరియా రూ.298కి అమ్మాల్సి ఉంది.
హుదూద్ తుపాను వల్ల విశాఖపట్నంలో నిల్వ ఉంచిన సుమారు రెండు లక్షల టన్నుల యూరియా నీటిపాలవడంతో యూరియా కొరత ఏర్పడింది. దీనికితోడు అధికారులు సూచించిన దానికంటే రెంటింపు స్థాయిలో యూరియా వాడటం వల్ల డిమాండ్ పెరిగింది. ఈ కారణాల వల్ల దివిసీమతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రూ.283కు అమ్మాల్సిన 50 కిలోల యూరియా బస్తాను రూ.400 వరకు వ్యాపారులు అమ్ముతూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు.
యూరియాకు డిమాండ్ పెరగడం, కొరత ఏర్పడటంతో హోల్‌సేల్ వర్తకుల నుంచి రూ.283 విలువ గల 50 కిలోల యూరియా బస్తాను రూ.360కి కొనుగోలు చేసి తీసుకొస్తున్నట్టు కొంతమంది వ్యాపారులు చెబుతున్నారు. రవాణా చార్జీలు, ఎత్తుడు, దింపుడు కూలి, లాభాలు కలుపుకొని అంత రేటుకు అమ్మాల్సి వస్తోందని వారు పేర్కొంటున్నారు. ఏదేమైనా బస్తాకు రూ.100 అదనంగా చెల్లించాల్సి రావడం రైతులకు పెనుభారంగా మారింది. దీనివల్ల జిల్లా వ్యాప్తంగా రైతులపై రూ.4 కోట్ల అదనపు భారం పడనుంది.
బ్లాక్ మార్కెట్‌కు పీఏసీఎస్ ఎరువులు
జిల్లాలో 425 పీఏసీఎస్‌లు ఉండగా వీటిలో 280 చోట్ల మాత్రమే ఎరువుల అమ్మకాలు సాగుతున్నాయి. వీటిలో చాలా పీఏసీఎస్‌లు రెండుసార్లకు సరిపడా మాత్రమే ఎరువులను నిల్వ ఉంచుకున్నాయి. మిగిలిన రెండు కోటాల ఎరువులను కొద్దిరోజుల నుంచి పీఏసీఎస్‌లకు రప్పించుకుంటున్నారు. దివిసీమలోని ఓ మండలంలో రెండురోజుల క్రితం రెండు సొసైటీలకు రెండేసి చొప్పున యూరియా లోళ్లు రాగా, యూరియాకు ఉన్న డిమాండ్‌తో వాటిని బస్తా రూ.320 చొప్పున రహస్యంగా బయట ఎరువుల షాపులకు అమ్ముకున్నారనే విమర్శలున్నాయి. ప్రస్తుతం యూరియాకు బాగా డిమాండ్ పెరగడం, కొరత ఉండటంతో చాలాచోట్ల పీఏసీఎస్‌లలో ఇదే తరహా వ్యాపారం చేస్తున్నట్టు తెలిసింది. ఉన్నతాధికారులు స్పందించి యూరియాను ఎమ్మార్పీ ధరలకే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
కొరత లేదు
జిల్లాలో ఇటీవలే 3,400 టన్నుల యూరి యాను సరఫరా చే శాం. మరికొద్ది రోజుల్లో యూరియా ర్యాక్‌లు జిల్లాకు రానున్నాయి. ఎవరైనా యూరియాకు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. ఆయా మండలాల ఏవోలతో ఎప్పటికప్పుడు ఎరువుల విక్రయాలపై సమీక్ష నిర్వహిస్తూనే ఉన్నాం.
- నరసింహులు, వ్యవసాయ శాఖ జేడీ