దోపిడీ రాజ్యం
భైంసా :ఎలాంటి పరిస్థితులైనా వ్యాపారులకే కలిసి వస్తున్నాయి. అవకాశాలను తమవైపు తిప్పుకుని డబ్బులను సంపాదించడంలో ఆరితేరిన వారు భైంసా మార్కెట్‌లో తమదైన శైలిలో వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పాత నోట్ల రద్దు చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఏ రోజు బ్యాంకు గడప తొక్కని వారికి అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. రైతులు ఆరుగాలం శ్రమించి పంట చేతికి వచ్చిన సమయంలోనే ఈ పరిస్థితి వచ్చింది. దీంతో అమాయక రైతులు ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదనుగా భావించి పలువురు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.
రైతులకు అవసరం ఉన్న నగదును ఇవ్వాలంటే దానికి వ్యాపారులు అడత్(కమీషన్ ) ధరను మరింతగా పెంచేశారు. కూలీలకు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో రైతులు చేసేది లేక వ్యాపారులు ఎలాచెబితే అలా ఒప్పుకుంటున్నారు. పలువురు వ్యాపారులు ఎంచక్కా చేతి నిండా నగదు ఉంచుకుని ప్రతీ రోజు మార్కెట్‌కు వెళ్లి డబ్బు అవసరం ఉన్న రైతులతో బేరం కుదుర్చుకుని తమ వ్యాపారం కానిచ్చేస్తున్నారు.
సీజన్ ప్రారంభం నుంచే...
రైతులకు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నా ఇప్పటి వరకు అందులో లావాదేవీలు జరుపలేదు. ఖాతాలకు సంబంధించి ఏటీఎం కార్డులు లేవు. నిరక్ష్యరాస్యులైన రైతులకు బ్యాంకు అధికారులు చెక్కులు కూడా ఇవ్వలేదు. సగానికి పైగా రైతులకు బ్యాంకు ఖాతాలే లేవు. నగదు లావాదేవీలకు అలవాటు పడ్డ రైతులకు ఇప్పటి వరకు ఏ పంట అమ్మినా చెక్కు తీసుకున్న పరిస్థితులు కూడా తలెత్తలేదు. అలాంటి ఈ ఏడాది సీజన్ ప్రారంభంతోనే నగదు కష్టాలు ఆరంభమయ్యాయి. భైంసా మార్కెట్‌లో సోయా, కందులు, మినుము, పెసర, పత్తి పంటలు విక్రయానికి తీసుకువెళ్తున్నారు. సీజను ప్రారంభం నుంచే నగదు ఇవ్వమని వ్యాపారులు చెప్పేస్తున్నారు. అమ్మిన పంటకు చెక్కులు ఇచ్చేస్తామని చెప్పడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బ్యాంకు ఖాతాలు లేక...
పంట పొలంలో కూలీలతో పని చేయించి వారికి ఇచ్చేందుకు కూడా రైతుల చేతిలో చిల్లిగవ్వ ఉండడంలేదు. ఏడాదిలో ఒక్కసారే పంట అమ్మకంతో డబ్బులురైతుల చేతుల్లోకి వస్తాయి. ఇలాంటి తరుణంలో వచ్చే డబ్బులు కూడా చెక్కుల రూపంలో అందుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఖాతాలు ఉన్న అధికారులు చెక్కు ట్రాన్స్ ఫర్ చేసేందుకు పక్షం రోజులు చేస్తున్నారు. రైతులు చెక్కులను పట్టుకుని బ్యాంకుల్లో నిరీక్షిస్తున్నారు. బ్యాంకు ఖాతాలు లేని రైతులైతే ప్రతీ రోజు దరఖాస్తులు పట్టుకుని తిరుగుతున్నారు. కొత్తగా ఖాతాలు ఇవ్వక చెక్కులు వేసుకోలేక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
సొమ్ము చేసుకుంటూ...
బ్యాంకుల చుట్టూ తిరిగి విసిగిపోయిన రైతులు నగదు కావాలని వ్యాపారుల వద్ద ప్రాధేయ పడుతున్నారు. ఈ పరిస్థితిని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఎలాగైనా రైతులకు డబ్బు అవసరం రావడంతో పంట అమ్మితే వచ్చే డబ్బులపై ఒక్కసారిగా అడత్(కమీషన్ ) పెంచేశారు. కొంతమంది ఇదే వ్యాపారాన్ని చేస్తున్నారు. నూటికి ఆరు నుంచి ఏడు రూపాయల వరకు అడత్ రూపంలో కట్ చేసుకుని రైతులకు డబ్బులు ఇస్తున్నారు. క్వింటాలు పత్తి అమ్మితే రైతు చేతికి రూ.5 వేలు అందుతాయి. నగదు కావాలంటే రైతు వ్యాపారుల వద్ద రూ.300 నుంచి రూ.350 వరకు అడత్ రూపంలో ఇవ్వాల్సి వస్తుంది. ఇలా అడత్ రూపంలో డబ్బులు ఇచ్చిన వ్యాపారులు రైతులు తీసుకువచ్చిన పంటను తమ పేరిట విక్రయించి చెక్కులు తీసుకుంటున్నారు.
బ్యాంకుల్లో తిరగలేక చెక్కులు ఇచ్చిన డబ్బులు సమయానికి అందక రైతులు వచ్చినకాడికి సరేనని వ్యాపారులకే ఎక్కువ మొత్తం అడత్‌కు పంటను విక్రయించి నగదు పట్టుకువెళ్తున్నారు. ఈ వ్యాపారం అధికారుల కళ్లముందే జరుగుతున్నా ఏ ఒక్కరూ చర్యలు తీసుకోవడంలేదు. రైతులు వెళ్తే కసురుకునే బ్యాంకు సిబ్బంది వ్యాపారులకైతే అడిగినంత డబ్బులు ఇస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
దృష్టి సారిస్తే...
ఇప్పటికైనా అధికారులు దృష్టిసారించి రైతులు పడుతున్న నగదు ఇక్కట్లను తీర్చాలి. ఆరుగాలం శ్రమించి వచ్చిన పంటను అమ్ముకునే సమయంలో తలెత్తుతున్న పరిణామాలతో రైతన్నకు అండగా నిలబడాలి. రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి. ఈ ఏడాది రైతులకు పంట అమ్మే సమయంలో తలెత్తుతున్న పరిస్థితులను చక్కదిద్దాలి. బ్యాంకుల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి. పట్టాపాసు పుస్తకాలతో వెళ్తున్న బ్యాంకు ఖాతాలు లేని రైతులకు తక్షణమే ఖాతాలు ఇచ్చేయాలి. పంట అమ్మిన రోజునే చెక్కు ఇస్తే అలాంటి రైతులకు కొంతమేర నగదు అదే రోజున ఇప్పించాలి.
ఇలా చేస్తే రైతులు ఇంటికి వెళ్లి పంట కోసం కూలీలకు కొంత మేర నగదును ఇవ్వగలుగుతారు. అధికారులు రైతుల పక్షాన నిలబడి వారి ఇబ్బందులను తెలుసుకుని పరిష్కరించాలి. ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాల్లో రైతుల పేరిట అధిక మొత్తంలో జరిగిన పంట లావాదేవీలపైన దృష్టి సారించాలి. అలాంటి ఖాతాలపైన దృష్టిపెట్టి పెద్ద మొత్తంలోనే నగదు కోసం అడత్ రూపంలో రైతులు నష్టపోయిన డబ్బులను ఇప్పించాలి. లేనిపక్షంలో ఈ ఏడాది కూడా రైతులు నగదు లావాదేవీలు లేక పంట అమ్మిన పూర్తిస్థాయిలో నష్టపోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి.