విజయనగరం జిల్లాకు చెందిన శ్రీనివాస్ ప్రస్తుతం విశాఖపట్నంలో చిరుద్యోగిగా జీవనం సాగిస్తున్నాడు. ఆయన గతేడాది కిలో బియ్యాన్ని రూ.42కు కొన్నాడు, ఇప్పుడు అదే రకం బియ్యాన్ని రూ.50కి కొనాల్సి వచ్చింది. అంటే ఏడాదిలో ధర కిలోకు రూ.8 పెరిగింది. ఇదే సమయంలో రైతుల నుంచి క్వింటాల్ ధాన్యాన్ని(వడ్లు) కేవలం రూ.1,100కు దళారులు కొనుగోలు చేశారు. క్వింటాల్ ధాన్యాన్ని మరాడిస్తే 70 కిలోల బియ్యం వస్తాయి. కిలోకు రూ.50 లెక్కన 70 కిలోల బియ్యం ధర రూ.3,500. మర ఆడించినందుకు, రవాణాకు రూ.1,500 పోగా దళారికి నికరంగా రూ.2,000 లాభమన్నమాట! అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి, రెక్కలు ముక్కలు చేసుకుని ఆరుగాలం శ్రమించి ధాన్యాన్ని పండించిన రైతుకు దక్కింది కేవలం రూ1,100. ఇందులో అన్ని ఖర్చులూ పోను అతడికి మిగిలేది ఉత్త చిల్లరే. కొన్నిసార్లు పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి తిరిగిరాని పరిస్థితి. రైతు నష్టపోయినా వినియోగదారుడికైనా మేలు జరుగుతోందా? అంటే లేదనే చెప్పాలి. చివరకు లాభపడేది మధ్యలో ఉన్న దళారే. బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధర ఏటా పెరిగిపోతూనే ఉంది. వ్యాపారులు, దళారుల మాయాజాలం వల్ల అన్నదాతలకు మాత్రం ఆ స్థాయిలో ధర రావడం లేదు.
సాక్షి, అమరావతి: కష్టపడి పండించిన పంటలకు మద్దతు ధర లేక రైతులు కుంగిపోతుండగా, మరోవైపు వినియోగదారులు అవే పంటలను అధిక ధరలు పెట్టి కొనలేక విలవిల్లాడుతున్నారు. వ్యాపారులు రైతుల నుంచి పంటలను తక్కువ ధరకు కొంటూ, బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. క్వింటాల్ కందులను గరిష్టంగా రూ.4,000కు రైతుల నుంచి కొనుగోలు చేస్తుండగా, బయటి మార్కెట్లలో, సూపర్ బజార్లలో కంది పప్పు ధర రూ.100కు తగ్గడం లేదు. మార్కెట్లలో కిలో మినప పప్పు ప్రస్తుతం రూ.110 పలుకుతుండగా, క్వింటాల్ మినుముల ధర రూ.4,500కు మించడం లేదు. ముడి సరుక్కి వ్యాపారులు అదనపు విలువ జోడించారనుకున్నా ప్రస్తుతం ఉన్న ధరలో సగానికే వినియోగదారునికి దక్కాలి. కానీ, అపరాల మార్కెట్‌పై వ్యాపారులు, దళారుల గుత్తాధిపత్యం రైతులను, వినియోగదారులను నట్టేట ముంచుతోంది. డిమాండ్–సప్లై మధ్య వ్యత్యాసాల వల్ల ధరలు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నా అందులో ఏమాత్రం పస లేదని ప్రస్తుత ధరలు తెలియజేస్తున్నాయి. బహిరంగ మార్కెట్‌లో ధరలను నియంత్రించి, వినియోగదారులకు ఊరట కల్పించాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోంది. అది తనకు సంబంధం లేని విషయమన్నట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అన్నదాతలకు గిట్టుబాటు ధరలేవీ?
చింతపండు సేకరణ ధరకు, రిటైల్ ధరకు మధ్య అసలు పొంతనే ఉండడం లేదు. సేకరణ ధర కిలోకి గరిష్టంగా రూ.20 మించడం లేదు. కానీ, మార్కెట్‌లో మాత్రం వినియోగదారుడు కిలోకు రూ.150 ఖర్చు పెట్టాల్సి వస్తోంది. పసుపు పరిస్థితి మరింత దారుణం. కొన్నేళ్ల క్రితం క్వింటాల్‌కు రూ.10,000 దాకా పలికిన పసుపు కొమ్ములను వ్యాపారులు ఇప్పుడు రైతులకు కేవలం రూ.4,000 ఇచ్చి కొంటున్నారు. మార్కెట్‌లో పసుపు ధర మాత్రం తగ్గకపోవడం గమనార్హం. రాష్ట్రంలో నీటి కొరత నేపథ్యంలో జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుము తదితర ఆరుతడి పంటలను సాగు చేయాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వం మాటలు నమ్మి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. తెల్ల జొన్నలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర క్వింటాల్ రూ.1,725గా ప్రకటించింది. ప్రస్తుతం వ్యాపారులు తెల్ల జొన్నలకు క్వింటాల్‌కు రూ.1,100 మాత్రమే ఇస్తున్నారు.
మామిడి రైతుల దిగాలు
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ధర స్వల్పంగా పెరిగినా మామిడి రైతులు నష్టాలే చవిచూడాల్సి వస్తోంది. ఈసారి దిగుబడి 20 శాతం వరకు తగ్గిపోయింది. మార్చి నెలలో అకాల వర్షాల వల్ల పూత, పిందె రాలిపోయాయి. ఈ నేపథ్యంలో టన్ను మామిడి కనీసం రూ.40 వేల నుంచి రూ.50 వేల దాకా ఉంటుందని రైతులు భావించారు. కానీ, దళారులు ఏకమై ఆ ధరను రూ.18 వేలకు తగ్గించారు. వినియోగదారులు కిలో మామిడిపండ్లు కొనాలంటే రూ.90 నుంచి రూ.110 దాకా వెచ్చించాల్సి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment