యూరియా కొరత
- ఇబ్బందుల్లో రైతులు
- కృత్రిమ కొరతను సృష్టిస్తున్న వ్యాపారులు
- బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు విక్రయాలు
సాక్షి, బళ్లారి : జిల్లాలో యూరియా కొరత తీవ్రమైంది. దీంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో విస్తారంగా పంటలు సాగు చేయడంతో వ్యాపారులే ఎరువుల కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా యూరియా కొరత అధికంగా ఉందని చూపుతూ పలువురు ఫర్టిలైజర్ షాపు యజమానులు రైతులకు బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు విక్రయిస్తున్నారు.
తుంగభద్ర డ్యాం సకాలంలో నిండటంతో పాటు వర్షాలు బాగా కురవడంతో జిల్లా వ్యాప్తంగా సిరుగుప్ప, కంప్లి, హొస్పేట, హడగలి, హగరిబొమ్మనహళ్లి, సండూరు, బళ్లారి, కూడ్లిగి నియోజకవర్గాల పరిధిలో దాదాపు 10 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేశారు. ముఖ్యంగా తుంగభద్ర ఆయకట్టు కింద వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి, సూర్యకాంతి తదితర పంటలు సాగు చేశారు.
వరినాట్లు దాదాపు పూర్తి అయ్యాయి. వరి నాట్లు వేసే ముందు, వేసిన తర్వాత 15 రోజుల లోపు యూరియా చల్లితే వరిపైరు బాగా ఏపుగా పెరుగుతుందనేది అధికారులు సూచన.. దీంతో యూరియాను కొనడానికి రైతులు ఎగబడుతున్నారు. అయితే యూరియా కొరత ఉందంటూ కొందరు ఫర్టిలైజర్ షాపు యజమానులు చెబుతూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. తమ వద్ద యూరియాను బ్లాక్ మార్కెట్లో రైతులకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో పేద రైతులు యూరియా దొరక్క అష్టకష్టాలు పడుతున్నారు.
యూరియా ఎంఆర్‌పీ ధర బస్తాకు రూ.275 నుంచి రూ.285లుగా ఉంది. డిమాండ్‌ను సొమ్ముచేసుకోడానికి ఫర్టిలైజర్ షాపు యజమానులు కొందరు సిండికేట్ అయి రూ.375లకు బస్తాను విక్రయిస్తున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొందరు వ్యాపారులు ముందస్తు ప్లాన్ చేసి యూరియాను పలు ప్రాంతాల్లో నిల్వ చేసుకుని అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
దీనిపై వ్యవసాయశాఖ అధికారి రామణ్ణను వివరణ కోరగా యూరియా తీసుకునే రైతులు బిల్లులు వేసుకుని తీసుకోవాలన్నారు. ఎంఆర్‌పీ ధరల కన్నా అధికంగా అమ్మితే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బిల్లులు వేయించుకోకుండా ఎరువులు తీసుకుంటే తామేమి చేయలేమన్నారు. యూరియా కొరత ఉన్నట్లు వ్యాపారులు సృష్టిస్తే తమకు ఫిర్యాదు చేయాలన్నారు. ఎక్కడైనా కొరత ఉంటే తాము వెంటనే ఆయా రైతులకు యూరియా అందించేందుకు కృషి చేస్తామన్నారు. రైతులకు ఎరువులు కొరత ఉంటే వెంటనే వ్యవసాయాధికారి కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.