గోదావరి జిల్లాల్లో పంటనష్టంపై ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం చంద్రబాబు
సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరికి వరదల వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లో పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకుంటామని, ఆయా పంటలను తిరిగి వేసుకునేందుకు హెక్టారుకు రూ.25 వేల చొప్పున (ఎకరాకు సుమారు రూ.10 వేలు) సాయం అందజేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వరదల కారణంగా పశ్చిమగోదావరి జిల్లాలో 19 వేల ఎకరాల్లో, తూర్పుగోదావరి జిల్లాలో 6,468 హెక్టార్లలో వరి, పత్తి, ఉద్యానవన పంటలు, కూరగాయలు దెబ్బతిన్నాయని తెలిపారు. మొత్తంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పంటలు, రోడ్లు, ఇళ్లు దెబ్బతినడంతో రూ.600 కోట్ల నష్టం వాటిల్లిందని వివరించారు. పశ్చిమగోదావరిలో రూ.350 కోట్లు, తూర్పుగోదావరిలో రూ.250 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి వరదలపై సీఎం బుధవారం ఏరియల్ సర్వే చేశారు. అనంతరం రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడి విమానాశ్రయంలో రెండుజిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జలనవరులశాఖ, ఆర్‌అండ్‌బీ తదితర విభాగాల ముఖ్యఅధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష జరిపారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల కలెక్టర్లు కార్తికేయ మిశ్రా, కాటమనేని భాస్కర్లు తమ జిల్లాల్లో వరద ప్రభావం, నష్టం, పునరావాస చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం సీఎం విలేకరులతో మాట్లాడుతూ.. పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరి వరదలకంటే ఎర్రకాలువ పొంగడంతో ఎక్కువ నష్టం జరిగిందన్నారు.
ఎర్రకాలువ వరదను పోలవరం కుడికాలువ, సముద్రంలోకి మళ్లించి మరోసారి నష్టం జరగకుండా చర్యలు చేపడతామని చెప్పారు. వరదలకు ప్రభావితమైన తూర్పుగోదావరి జిల్లాలోని 19 మండలాల్లోని 149 గ్రామాలు, పశ్చిమలో 25 మండలాల్లోని 195 గ్రామాల్లో చేపట్టిన పునరావాస చర్యలపై అధికారులను అభినందించారు. వరదలు తగ్గగానే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ రోడ్ల మరమ్మతులకు రూ.35 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. 110 కిలోమీటర్ల మేరకు దెబ్బతిన్న రాష్ట్ర రహదారుల మరమ్మతులకు రూ.22 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. పశ్చిమలో కొత్తగా ఐదు బ్రిడ్జిల నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మైదాన ప్రాంతాల్లో దెబ్బతిన్న ఇళ్లనిర్మాణానికి గృహ నిర్మాణ పథకం కింద రూ.1.5 లక్షలు, గిరిజన ప్రాంతాల్లో రూ.2.25 లక్షలు చొప్పున అందజేస్తామని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు నెలరోజులకు సరిపడా బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేయాలని ఆదేశించారు. కోనసీమలో లంకల్లోకి వెళ్లేందుకు నదిని దాటే 8 ప్రాంతాల్లో 15 రోజుల్లో స్పీడు బోట్లు ఏర్పాటు చేస్తామన్నారు.
కరువు, వరద వారసత్వంగా వస్తున్నాయి...
రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కరువు, కోస్తాలో వరదలు కవలపిల్లల్లా వారసత్వంగా వస్తున్నాయని సీఎం వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ధవళేశ్వరం నుంచి రోజుకు రూ.150 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళుతోందన్నారు. ఆ నీటిని కొంతమేరకైనా కరువు జిల్లాలకు మళ్లిస్తే బాగుండేదన్నారు. పోలవరం ప్రాజెక్టును 2019లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు. ఆలోపు పూర్తి చేస్తామంటే ఎవరికైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ప్రాజెక్టు రీడిజైన్లను కేంద్రం ఆమోదించాల్సి ఉందని, ఇప్పటివరకు చేసిన పనులకు ఇవ్వాల్సిన రూ.2,600 కోట్లను మంజూరు చేయకపోవడమే అడ్డంకిగా మారిందని చెప్పారు. రాష్ట్రంలో 57 ప్రాజెక్టులు చేపట్టామని, నదుల అనుసంధానం చేసి కరువును తరమికొడతామన్నారు. త్వరలో ప్రతిఇంటికీ కుళాయి ద్వారా నీళ్లు ఇస్తామన్నారు. దుబారా ఖర్చులను అరికడితే ప్రాజెక్టులు పూర్తి చేయవచ్చని ఓ నాయకుడంటున్నారని, అలాంటప్పుడు మీరెందుకు చేయలేదని ప్రశ్నించారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డిసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment